'Rakhi' written by G. Ashok Kumar
రచన : జి. అశోక్ కుమార్
నా పేరు సుధ. నేను ఒకబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అని ఆ వూరు వదిలి వేరే వూరు వచ్చాం. నాకు ఒక అన్నయ్య. తను అంటే నాకు ప్రాణం. ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. కానీ పెళ్లి తరువాత దూరం అయ్యాడు.
మేము వేరే ఊరు వచ్చి 4 సంవత్సరాలు అయింది. నా భర్త చాలా మంచి వారు. నన్ను బాగా చూసుకుంటున్నారు. ఎప్పుడూ నన్ను బాధ పెట్టలేదు. మా ఆయన చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ నాకు ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నాడు.
ఇలా వుండగా అనుకోకుండా ఒక రోజు తనకు జ్వరం వచ్చింది. నాకు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. మా ఆయన కంపెనీ వాళ్ళ డాక్టర్ వచ్చి చూసి కొన్ని మందులు ఇచ్చి, కొన్ని రాసి ఇచ్చి వెళ్లిపోయాడు. ‘అవి ఫలానా మెడికల్ స్టోర్ లో దొరుకుతాయి. అక్కడికి వెళ్లి తెచ్చుకో’ అని చెప్పాడు. ఇక్కడ నాకు ఎవరూ తెలియదు. అందుకే నేనే సాయంత్రం వెళ్ళాను. అడ్రస్ తెలియక కొద్దిగా రాత్రి అయింది. అక్కడ అంతా నిర్మానుష్యంగా వుంటుంది. కొంచెం ధైర్యంతో మందులు తీసుకొని తిరిగి వస్తుండగా ముగ్గురు యువకులు ఫుల్లుగా తాగి ఒక అమ్మాయిని అల్లరి చేస్తున్నారు. ఆ అమ్మాయిని పక్కన ఉన్న పొదల్లోకి లాక్కెళ్లుతున్నారు. ఆ అమ్మాయి ‘కాపాడండి’ అని అరుస్తోంది. నాకు అక్కడ జరగబోయేది అర్థమైంది. ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఒక పక్క భయం.. ఇంకోపక్క అమ్మాయి బ్రతుకు నాశనం అయిపోతుంది అని బాధ..
అందుకే 'ఏదైనా కానీలే' అని వాళ్ళతో పోరాటానికి సిద్ధం అయ్యాను. వాళ్ళు 'చంపేస్తాం' అని చెప్పినా ఆ ఆదిశక్తిని తలుచుకొని ప్రాణాలకు తెగించి పోరాటం చేశాను. ఆ అమ్మాయిని రక్షించాను. తనను తన ఇంటికి పంపించి నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. మా అయనకి ఏమీ చెప్పలేదు. నాలుగు రోజుల తరువాత ఆ అమ్మాయి, వాళ్ళ అమ్మ, నాన్న మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అప్పటికి మా ఆయన కొద్దిగా కోలుకున్నాడు.
మా ఆయన దగ్గరకు ఆ అమ్మాయి వచ్చి “ఇక్కడ ఒక అక్క వుండాలి. ఎక్కడ?” అని అడిగింది.
మా ఆయన నన్ను చూపించాడు. వెంటనే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంది. ఇద్దరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మా ఆయనకు ఏమీ అర్ధం కాలేదు.
ఆ అమ్మాయి తల్లిదండ్రులు నాకు చేతులెత్తి మొక్కారు. ఆ అమ్మాయి చేతిలో నుంచి ఒక రాఖీ తీసి నా చేతికి కట్టింది. నాకు అర్థం కాలేదు. ఇంతలో మా అన్నయ్య కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చి అంతా చూస్తున్నాడు.
ఇంతలో ఆ అమ్మాయి “అక్కా! రాఖీ అంటే రక్ష. అన్న, చెల్లెళ్లని కంటికి రెప్పలా కాపాడుతాడు అని ఈ రాఖీని కడతారు. ప్రస్తుత సమాజంలో ఎవరి చెల్లెళ్లను వాళ్ళ అన్నలు కాపాడుతున్నారు. వేరే వాళ్ళ చెల్లెళ్ళను ‘మనకెందుకులే’ అని వదిలేస్తున్నారు. అందుకే మన సమాజంలో ఆడపిల్లలకు ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి. రాఖీ పండుగ రోజు వస్తూనే ‘అన్నలు రక్షిస్తారు’ అని రాఖీలు కట్టి సంవత్సరం అంతా ఎదురుచూస్తూనే బతుకుతున్నాం. కానీ రోజూ ఎక్కడో ఒక చోట ఆడపిల్లకు అన్యాయం జరిగిందని వింటూనే ఉన్నాం. అందుకే నేటి నుంచి అన్నయతో సమానంగా అక్కయ్య కూడా కాపాడగలదు అని మీ నుంచి నేర్చుకున్నాను. మీ ధైర్యం నాతో పాటు ప్రతి ఆడపిల్లకు రావాలి అని నన్ను దీవించు అక్కా!
‘ఆ రోజు రాఖీ కట్టాను కదా! ఎవరో ఒక అన్న వచ్చి రక్షిస్తారు’ అనే ఆశ పోయి ‘ఏదో ఒక స్త్రీ రూపంలో ఆ ఆదిశక్తి వచ్చి కాపాడుతుంది’ అనే ధైర్యం రావాలి” అని ఏడ్చింది.
తన కన్నీళ్లు తుడుస్తూ “ప్రతి స్త్రీలో ఒక శక్తి వుంటుంది, ఆ శక్తితో ప్రపంచాన్ని కాపాడవచ్చు, అలాంటిది మనల్ని మనం కాపాడుకోలేమా! నిన్ను నీవే కాపాడుకో! ఈ రాఖీని పక్కన పెట్టు” అన్నాను నేను.
గుమ్మంలో ఉన్న అన్నయ్య ఒక్కసారిగా ముందుకు వచ్చాడు. నేను వెంటనే అన్నయ్యను కౌగిలించుకున్నాను. “అన్నయ్యా! మీ ప్రేమకు మేము ఎప్పుడూ బానిసలమే” అని ఏడ్చాను. ఇది చూసిన మా ఆయన, ఆ అమ్మాయి తండ్రి చేతులెత్తి నమస్కరించారు.
***శుభం***
Comments