top of page

రామాయణం.. మహాభారతం


'Ramayanam Mahabharatham' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao

'రామాయణం.. మహాభారతం' తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

తస్సాదియ్యరావుకి సడన్ గా ఒక మెరుపు ఆలోచన పుట్టింది. తణుక్కున మెరిసి కనపడ కుండా పోయిన మెరుపులా ఆ ఆలోచన మాయం అయిపోలేదు. అతని గుండెలో తిష్టవేసుకు కూర్చుంది. అదేమిటంటే..


అర్జెంటుగా అతడికి ఒక రచయిత అయిపోవాలి అన్న ఆలోచన వచ్చింది. అందుకు రీజనింగ్ లాంటి బ్రహ్మాండ మైన కారణం కూడా ఉంది. అతను పెళ్లి చేసు కోబోయే అతని మేనకోడలు ప్రస్తుతం ఒక పెద్ద రచయిత్రిగా చలామణి అవుతుంది. ఆ అమ్మాయి పేరు బంగారు భరిణ. ఇదేదో ఆషామషి సరదా పేరు కాదు. ఆ పిల్ల పుట్టినప్పుడు దారిలో బంగారపుభరిణ దొరికింది ఆ పిల్లతండ్రికి. అంతే.. వెరైటీగా ఉంటుందని బంగారపు భరిణ అన్న పేరు ఫిక్స్ చేసేసాడు.


సరే ప్రస్తుతం తసాదియ్య రావుకి ఒక సమస్య వచ్చి పడింది. బంగారుభరిణతో తన పెళ్లి కావాలంటే ముందు బంగారభరిణ అక్కకి పెళ్లి కావాలి. సదరు కండిషన్ వల్ల ఓ రెండూమూడేళ్లు పట్టవచ్చు తస్సా దియ్యరావు పెళ్లి జరగడానికి.


పెళ్లి అవడానికి చాలా టైం పడుతుంది కనుక ఈలోపులో తను కూడా ఒక కథా రచయిత అయి పోతే భవిష్యత్తులో భార్య దగ్గర తలదించుకుని ఉండవలసిన అవసరం ఉండదు అన్న ఆలోచనతో టెంకాయల తస్సాదియ్యరావు రచయిత కావడం ఎలాగా అని ఆలోచించడం మొదలు పెట్టాడు.


'ఏముంది.. ఏదో ఒకటి రాసి పడేస్తే వాళ్లు ప్రచురించి పడేస్తారు' అనుకొని ప్రయత్నించాడు. కానీ అతను పంపినవి అన్నీ తిరుగుటపాలో చక్కగా రావడం మొదలుపెట్టాయి. తస్సాదియ్యరావు ఒక బ్రహ్మాం డమైన ఆలోచన చేశాడు. తన ఊర్లోనే తనకు బాబాయ్ వరుస అయిన ఒక వ్యక్తి పేరు పురుషోత్తమ రావు రెండు మూడు పుస్తకాలు ప్రింటింగ్ చేసి కొన్ని సన్మానాలు కూడా పొంది రచయితగా వెలుగొందు తున్నాడు. అతని దగ్గరకు వెళ్ళాడు తస్సాదియ్య రావు.


విషయం పూర్తిగా ఏ టు జెడ్ చెప్పేసి తనని ఎలాగైనా ఒక బ్రహ్మాండమైన రచయితగా తీర్చిదిద్దే బాధ్యత నెత్తి మీద పెట్టుకోమని ప్రార్థించాడు.


"ఒరే ఇదేమన్నా దప్పలం కూర వండడం అనుకు న్నావా.. లేదంటే మాసిన బట్టలు ఉతకడం అనుకు న్నావా.. రచయిత అవ్వాలంటే ముందు నీలో ఆ దమ్ము, తెలివి ఉండాలి" వివరంగా

వివరించాడు పురుషోత్తమరావు.


తస్సాదియ్యరావు గురువుగారి కాళ్లు చేతులె కాకుండా మిగిలిన అవయవవాలన్నీ పట్టుకు తెగ బతిమాలాడే సాడు.. ఏడ్చేసాడు కూడా.


ఇక తప్పదు అనుకుని సరే అన్నాడు.. బాబాయ్ పురుషోత్తమరావు.


సరే.. గురువు ఆజ్ఞ మేరకు ఆ మర్నాడు రెండు పేజీల కథ రాసుకొని వచ్చాడు తస్సాదియ్య రావు. కథ పూర్తిగా చదివి గుక్కెడు కాదు గ్లాసుడు మంచినీళ్లు తాగాడు పురుషోత్తమరావు.


''ఒరేయ్ దీనిని కథ అనరురా వ్యాసము అంటారు. సరే ఒక పని చెయ్ ముందు అర్జెంటుగా కొంతమంది రచయితల పుస్తకాలు చదువు. అంతకన్నా ముందు రామాయణం, భారతం, భాగవతం, కాశీ మజిలీ కథలు ఒకటి రెండుసార్లు చదివేవూ అనుకో కాస్తంత ప్రపంచ జ్ఞానం అర్థం అవుతుంది'' అంటూ సలహా ఇచ్చాడు పురుషోత్తమరావు.


''అమ్మో అంత టైం లేదు బాబాయ్. విషయం చెప్పాను కదా నువ్వు ఎలాగైనా నన్ను రుబ్బురోలు లో పెట్టి కానీ మిక్సీలో పెట్టి కానీ మెత్తగా రుబ్బు. లేదంటే రాతి కలంలో వేసి చితక్కొట్టు. భరిస్తాను. అంతేగాని ఇలాంటి కండిషన్లు పెట్టావు అనుకో ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతాను. సో అట్టా కాదు కానీ ఇంకా ఏదైనా చెప్పు బాబాయ్" అంటూ బ్రతిమలాడాడు.


''సరే ఏం చేస్తాం కొడుకు వరసవాడు అయిపోయావు'' అంటూ పురుషోత్తమరావు దగ్గరగా కూర్చోపెట్టుకొని కొన్ని సలహాలు సూచనలు ఓ గంట పాటు చెప్పాడు. సరే అని తస్సాదియ్య రావు ఇంటికి వెళ్లిపోయి మర్నాడు 4 పేజీల కథ రాసుకొని వచ్చాడు.


అది చదివిన పురుషోత్తమరావు.. ''ఒరేయ్ బడవ.. తిరుపతి కొండమీద సముద్ర స్నానం చేశాడు హీరో అని రాశావేమిటి.. నీకు కొంచెం అయినా ప్రపంచజ్ఞానం ఉందా? పెళ్లయిన ఆరు నెలలకే కుర్రాడు పుట్టాడు అని రాశావు, ఈ పేరాలో చూడు సంక్రాంతి వెళ్లిన రెండు నెలలకు దీపావళి వచ్చిందని రాశావ్, ఈ చివరి పేరాలో చూడు తండ్రికి 35 ఏళ్లు కొడుక్కి 25 ఏళ్లు అని రాశావు ఇవన్నీ ఎలా కుదురుతాయిరా అందుకనే నేను చెప్పేది ఏమిటి అంటే నువ్వు రచయితగా కాదు కనీసం కార్డు ముక్క రాయడానికి కూడా పనికిరావు.. నువ్వు ఏం చేస్తావు అంటే నీ తప్పులు నీకే అర్థం కావడానికి రాసిన కథను నాలుగైదు సార్లు చదువు'' అన్నాడు.


తస్సాదియ్యరావు సిగ్గు పడిపోయి అక్కడే కూర్చుని కథను నాలుగు సార్లు చదివాడు. 8 తప్పులు దొరి కాయి.. సవరించాడు. మళ్లీ ఇంకో నాలుగు సార్లు చదవమన్నాడు గురువు. అప్పుడు ఇంకొక నాలుగు తప్పులు దొరికాయి అవి కూడా సవరించాడు. చివరగా రెండుసార్లు చదవమన్నాడు గురువు పురుషోత్తమ రావు.. అప్పుడు కూడా మూడు తప్పులు దొరికాయి.


''అర్థం అయింది కదా నీ కథలో తప్పులు ఎక్కువ కథ తక్కువ. అదే కథను ఇప్పుడు మళ్లీ చదివావనుకో ఇంకో నాలుగు తప్పులు దొరుకుతాయి. సరే కొంచెం సీనియర్గా నేను చదివాను అనుకో 20 తప్పులు దొరుకుతాయి. ఇదిగో ఇలాగే నీలాంటి చాలా మంది పరమచండాలంగా కథను రాసేసి పోటీలకు పంపించి నా కథకు ప్రైస్ రాలేదు బాబోయ్ ఎప్పుడు సీనియర్లకే ఇస్తున్నారు ఒరేనాయనోయ్ అని పత్రిక వాళ్ళ మీద అభండాలు వేస్తున్నారు" అని నాలుగు చివాట్లు పెట్టేడు.


తస్సాదియ్యరావు అవమానం భరించలేక ఇంటికి వెళ్లి అలా ఒక 50 సార్లు చదివి తప్పులన్నీ సరి చేశాడు. వెంటనే పత్రిక వారికి పంపించేశాడు. ఎంత త్వరగా పంపించాడో అంత త్వరగా పత్రిక వారి నుండి తిరుగుటపాలో ఆ కథ వచ్చేసింది. అర్జెంటుగా ఉసూ రుమని మళ్లీ గురువు పురుషోత్తమరావు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు.


''ఒరేయ్! వాళ్ళు రెండు పేజీలు రాయమన్నారు నువ్వు ఎనిమిది పేజీలు రాశావు. కథ రాయ డమే కాదురా ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి".. అంటూ ఎందుకయినా మంచిదని ఆ కథ పైకి తీసి చదివి.. ఈ కథలో హీరో రుద్రబాబు అంటూ కొనసా గించావు.. చివరలో రుద్రబాబు కాస్త విజయబాబు అంటూ మార్చి పడేసావ్ కంగారులో. ఇది తప్పు కాదా. సరే మళ్లీ ఇంకో ప్రయత్నం చేయి'' అంటూ చిరాకు పడ్డాడు పురుషోత్తమరావు.


"ఒక చిన్న తప్పే కదా ఈ తప్పుని పత్రిక వాళ్ళు సరి చేసుకోలేరా అంత బద్దకమా వాళ్ళకి.. ?" ఎంతో లాజిక్కుగా ప్రశ్నించాడు తస్సాదియ్యరావు.


''నోరుమూసుకో బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడకు. ఆ.. మరి నువ్వు కథ రాయడం వాళ్లకు పనీపాట లేక నీ కథలో తప్పులు అన్ని సరి చేసుకొని పత్రికలో వేసు కొని, నీకు అవార్డు ఇచ్చి, డబ్బులమూట కూడా చేతికి అందించి నిన్ను వూరంతా ఊరేగించటం.. బాగుందిరా ఇంటికి చుట్టాలు వస్తే భోజనంలో పప్పు బదులు ఉప్పు వేసి ఎలాగో సదురుకోండి అంటావా?'' అంటూ నాలు గు రంకె లేసి పంపించేసాడు.. గురువు పురుషోత్తమ రావు.. మహాకోపంగా.


కోపంతో ఇంటికి వెళ్లి పౌరుషంగా మరొక కథ రాసి మరొక పత్రికకు పంపించాడు.. తస్సాదియ్య రావు. అది కూడా తిరుగుటపాలో పరుగెత్తుకొని వచ్చేయ డంతో సిగ్గు ఎగ్గూ పక్కనపెట్టి గురువును ఆశ్రయిం చాడు తస్సాదియ్యరావు.. మళ్ళీ.


''నీకు అసలు బుర్ర లేదురా. ఈ ప్రకటన 2023వ సంవత్సరానిది కాదు. గతించి పోయిన 2022వ సంవత్సరం ప్రకటనలు చూశావు. ప్రస్తుతం ఆ పత్రిక ఎత్తేశారు కనుక నీకు తిరుగు టాపాలో కథ వచ్చేసింది. విషయ సేకరణ సరిగ్గా చేసుకోలేని వాడివి నువ్వు రచయిత ఎలాగ అవుతావురా. సరే ఆ కథ ఇలా చూస్తాను అంటూ కవర్ చింపి కథ చదివాడు. ''ఇదిగో ఇందులో హీరో పేరు రావణాసుర అని పెట్టావు సరే విలన్ పేరు పోనీ బాగా పెట్టావా అంటే రామం అని పెట్టావు. నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నాను అనుకోకు నీ కథ చదువుతుంటే నా బుర్ర వెనక్కు తిరిగి పోతుంది.


అసలు కథలు రాయాలంటే ముందు మనిషి మనసు ప్రశాంతంగా ఉండాలి రా. ఏదో స్వార్థపు కోరిక లోపల పెట్టుకుని కథ రాయడానికి ప్రయత్నిస్తే దరిద్రంగా తయారవుతుంది. నీకు తెలిసిన వాళ్ళు కథలు విర విగా పత్రికలలో వచ్చేస్తున్నాయి నీ కథలు రావడం లేదు అన్న ఈర్ష్య పెట్టుకో కూడదు. ఎవరి దారి వాళ్ళదే ఎవరి గోలు వారిదే.


ఇదిగో పెళ్లి చేసుకోవడం విషయమైనా పోస్ట్ ఫోన్ చేసుకో లేదా కథారచయిత అవడం విషయ మైనా విరమించుకో. రెండు కావాలి.. నాకు అట్టు కావాలి ముక్క కావాలి అంటే నీయంత తింగ రోడు ఈ ప్రపంచంలో ఇంకెవడు ఉండడు. అసలు నువ్వు కథా రచయితలు, కవులు అంటే ఏదో మామూలు వ్యక్తులు అనుకుంటున్నావా. భగవంతుడు అత్యధిక మేధస్సు ఇచ్చిన వాళ్లే ఆ కోవలో చేరతారు.ఈ వర్గం వాళ్లకు వంశపారంపర్యంగా అయినా తెలివితేటలు ఆబ్బి ఉంటాయి.. లేదా సుదీర్ఘ కాలం పాటు అభ్యాసం చేసినవాళ్ళైనా ఆ కోవలోకి చేరు తారు. అంతేకానీ నీలా అనాలోచితంగా అడ్డుగోలుగా అర్ధరాత్రి రచయిత, , కవి అయిపోవాలనుకుంటే అది చాలా పెద్ద అవివేకం కింద వస్తుంది. అందుచేత నీకు నేను చివరిగా చెప్పేది వార్నింగ్ ఇచ్చేది ఏమిటంటే నేను మొట్టమొదట నీకు చెప్పినట్లుగా బహు గ్రంథాలు చదివి ఆ తెలివితేటలూ వంట పట్టించుకో.. నీకు నచ్చిన ఒక గురువుని నమ్మి ఆయన చెప్పినట్లు అడుగులు వెయ్యి.. అలా చేస్తే కొన్నాళ్ళకు నువ్వు ఒక రచయితవో కవివో అవుతావు. అర్థం అయింది కదా నీ బుర్రకు.


నేనూ రచయిత కావడానికి 12 సంవత్సరాలు పట్టింది.నేను చెప్పింది ఏమాత్రం అర్థం అయినా బాగా ఆలో చించుకుని రా మంచి మంచి పుస్తకాలు నా దగ్గరే ఉన్నాయి.. ఇస్తాను. కాదు నా వాదన నాదే అనుకుంటే నీ మొఖం నాకు చూపించకురా ఇక'' అంటూ గట్టిగా కేకలు వేసి లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసేసుకు న్నాడు పురుషోత్తమ రావు.


తస్సాదియ్యరావు.. గురువుగారు ఇంటి అరుగు మీదే కూర్చొని ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తలుపు తట్టాడు.. గురువుగారు నా బుద్ధి గడ్డి తిని వక్రంగా ఆలోచించాను. నాకు పూర్తిగా బుద్ధి వచ్చింది. నేను పెళ్లిని కొన్నాళ్లు వాయిదా వేసుకుని రచయితగా ముందు అభివృద్ధి చెందడానికి నిర్ణయించుకున్నాను. పెద్ద మనసుతో నన్ను క్షమించండి" అంటూ కాళ్ళ మీద పడ్డాడు.


పురుషోత్తమరావు కరిగిపోయి, ఆనందించి అతన్ని పైకి లేవదీసి గుండెలకు హత్తుకొనిఇలా అన్నాడు..


"తస్సాదియ్యరావు.. ఒకందుకు నిన్ను చూసి సంతోషిస్తున్నాను.. ఆనందిస్తున్నాను కూడా.


అదేమిటంటే ప్రస్తుతం మన తెలుగుభాషలో రచ యితలు కవులు చాలా తగ్గిపోయారు. ఎందు కంటే ఇది అడ్డంగా ఆదాయం తీసుకోచ్చే వృత్తి ప్రవృత్తి వ్యాపకం కాదు. దాంతో ఈ మార్గంలో ప్రయాణించే వాళ్ళు చాలా చాలా తగ్గిపోయారు. ఇప్పటికే మన తెలుగుభాష బ్రతుకు అష్ట వంకరలు తిరిగినట్టయి పోయింది. దీనిని ఉద్ధరించడానికి ఎవరూ పూనుకోవడం లేదు.


ఇలాగయితే అతితొందరలోనే మాన భాష పూర్తిగా కనుమరుగైపోయేలాగుంది ప్రస్తుత వాతా వరణం.


తెలుగు భాష ఎంత అధోగతి పాలైపోయిందో ఒక్క నిమిషం చెబుతాను విను. తెలుగు అక్షరాలు సరిగ్గా రాయలేని అక్షర దోషంతో బ్రతుకుతున్నాం ప్రస్తుతం మనం. రామాయణం అని రాయ మంటే రామాఅమ్మాయి అని రాస్తున్నాడు.. భారతం అని రాయమంటే భారతీరమ అని రాస్తున్నాడు.. చి చి టీవీ స్క్రోలింగ్ లో వచ్చే అక్షరాలన్ని దోషంగా ఉంటు న్నాయి. మెయిన్ రోడ్ లో నడుచుకుంటూ వెళితే ఫ్లెక్సీ బోర్డులు అన్ని తప్పులు తడకగా ఉంటున్నాయి.. ఎక్కడ ఒత్తు పెట్టాలో ఎక్కడ కామా పెట్టాలో ఎక్కడ చుక్క పెట్టాలో తెలియని.. దారుణ పరిస్థితితో తెలుగు భాష అడుగులు వేస్తుంది. సరే.. అమ్మా నాన్న అనే అక్షరాలు ఎప్పుడో అటకెక్కాసాయి. ఒకా యన నేను రాసిన పుస్తకం చదవమని ఇస్తే చెదవట్టే వరకు చదవలేదు.. మరొకాయన నేను పుస్తకం ఇచ్చాక మూడు సంవత్సరాలకు అతను కనబడినప్పుడు చదివే రా ఎలా ఉంది నా పుస్తకం అంటే.. మీరు ఎప్పుడు ఇచ్చారు నాకు పుస్తకం అన్నాడు. ఏడుపు వచ్చేస్తుంది రా గుండెలో బాధగా ఉంది.


మీలాంటి యువకులు ఈ నికృష్ట పరిస్థితిని, రోజులను మార్చాలి రా. రెండు తెలుగు రాష్ట్రాల లో ఇన్ని కోట్ల మంది జనాభాలో కేవలం 5000 మంది కూడా కవులు రచయితలు లేరంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందో సాహిత్యం అర్థం చేసుకోరా. వీళ్ల శాతం బాగాతక్కువ కనుక కవులు రచయితలను చులకనగా చూస్తున్నారు. ఒక కవి రాసిన కవిత్వం ఒక రచయిత రాసిన కథ చదివి మానసికంగా మారి అతను మారో పదిమందిని అతను ఇంకో పదిమందిని మారుస్తూ ఉంటే జాతి అభివృద్ధి వైపు దూసుకుపోతుంది. సస్యాశ్యామలంగా ఉంటుంది. ఆలా జర గటంలేదు. అదే బెంగతో రోజు నేను బ్రతుకుతున్నాను. అలా నాకు ఇష్టం లేదు.. నా భాష సర్వతోముఖాభివృద్ధి పొందాలి. ఈ విషయంలో ఇప్పుడు మీలాంటి యువతే ముందడుగు వేయాలి.


ఒక్కటి మాత్రం కచ్చితoగా చెప్పగలనురా.. అదేమిటకంటే ఎప్పటికైనా మనదేశాన్ని సక్రమంగా నడిపించగలిగేది మేధావి వర్గానికికి సంబంధించిన కవులూరచయితలు మాత్రమే.


ఇకపోతే నీ విషయం.. నేనూ ముందు రచయితన వుతాను.. అన్నావుచూడు దానివల్లే నిన్ను నేను అభినందిస్తున్నాను. మనం డబ్బుపెంచుకోవడమే కాదు దానితో పాటు మన అమ్మ లాంటి తెలుగు చరిత్రను, భాషనూ బ్రతికించుకోవాలికదా.


సెభాష్.. నీలో ఓ భావిభరత యువవిజ్ఞానం కనిపిస్తుoది నాకు. నాకు నచ్చింది నీ నిర్ణయం.


సరే.. ముందుగా నా దగ్గరవున్న రామాయణ గ్రంథం నీకిస్తాను ఇంటికి పట్టుకెళ్ళి ఒక నెల రోజులు పాటు చదివి తర్వాత వచ్చికనపడు. ఇప్పటి పరిస్థితిలలో రామాయణ, భారత పఠనం మాత్రమే


కొత్త కవులనూ రచయితలనూ తయారుచేయగలవు. అర్ధం అయిందికదా. సరే ఈ గ్రంధం నీ బ్రతుకుకు దిశా నిర్దేశం చూపెడుతుంది. పట్టుకెళ్ళు" అంటూ పురు షోత్తమరావు ఆ గ్రంథo తస్సాదియ్యరావు కు అందించాడు.


తస్సాదియ్యరావు ఆ పుస్తకాన్ని కళ్ళకు హత్తుకొని గురువుగారికి మరొకసారి నమస్కరించి అక్కడ నుండి తన ఇంటికి బయలుదేరాడు ప్రశాంతమైన మనసుతో.


సమాప్తం


(కవులూ.. రచయితలూ మరోపదిమంది కవులనూ రచయితలనూ తయారు చేయండి. మన అమ్మ తెలుగుభాషను తల ఎత్తుకొనేలా చేయండి.. నమస్కారం మీ తోటివాడు..


నల్లబాటి రాఘవేంద్ర రావు


@@@@@@@

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు
43 views0 comments

Comentários


bottom of page