top of page

రాముడిచ్చిన వరం


'Ramudicchina Varam' written by Pudipeddi Suryanarayana

రచన : పూడిపెద్ది సూర్యనారాయణ

కిష్కిందా నగరం ఉల్లాసభరితంగా సుగ్రీవ పట్టభిషేకం జరుపుకుంది.. వానర సేన జేజేలు పలికింది.. రాత్రంతా కోతుల భాగోతాలూ, కోతుల నాట్యాలూ, కోతుల నాటకాలు, పాటలుతో కిష్కింద మార్మోగి పోయింది.. ఆ కోతి చేష్టలు రామ లక్ష్మణులుని ఆనంద పరచ లేకపోయాయి.. సీతమ్మ జాడకై, వారి మనసులు కిష్కిందీయుల ఆనంద నాట్యాలపై లగ్నం చేయలేక పోయేయి. రాముడి మెప్పు పొందలేక పోయామని, కిష్కింద కళాకారులు కించిత్ చింతించినా, పరిస్థితిని అర్ధం చేసుకుని మౌనంగా ఉండిపోయారు..

విభీషణుడి పట్టాభిషేకం తర్వాత కోతులు మళ్ళీ ఆనంద తాండవమాడాయి.. లంకలో రక రకాల

ఫలాల్ని తిని, తృప్తిగా లంకంతా తిరిగాయి.. ఆనంద పరవశంతో గంతులేసాయి..నాటకాలు,

నాట్యాలూ చేసి రాముడి మెప్పు పొందాలని వానరులు వేసిన కుప్పి గెంతులకి రాముడు,లక్ష్మణుడు చలించలేదు.. కారణం వారి మనసు అయోధ్య మీదికి మళ్ళిపోయింది.. తాము చేయదగిన కార్యాలన్నీ పూర్తయ్యాయి.. పుష్పక విమానం వాకిట్లో నిలబడి ఉంది.. విభీషణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, జాబాలి, అంగదుడు, హనుమంతుడు మొదలైన వారితో, సీతా సమేత రామ లక్ష్మణులు, వారి వెంట వానర రాక్షస ప్రముఖులు అయోధ్య చేరుకున్నారు.. పుర ప్రజలు, సామంత దండనాయకులు, పురోహితులు, మునిజన గణాలు స్వాగతాలు పలుకుతుండగా, జేజే నాదాలు మిన్నుముట్టగా రాముడు అయోధ్యలో ప్రవేశించాడు.. ఎక్కడ చూసినా కోలాహలమే...

వానరజనాన్ని నాగరిక అయోధ్య వాసులు వింతగా చూసారు..

మొదటిసారిగా నాగరికుల్ని చూసి, వానరులు వింత, వింత చేష్టలు చేస్తూ, పిచ్చి,పిచ్చి గెంతులు,

గెంతుతూ నాట్యం చేయసాగారు..

రెండు మూడు రోజులు వరుసగా చూసిన అయోధ్య వాసులు కోతిచేష్టలుతో విసిగిపోయి వానరుల్ని లక్ష్యపెట్టటం మానేసేరు..

శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. భరత, శత్రుఘ్న, లక్ష్మణ దంపతులు, కౌసల్య, సుమిత్ర, కైకేయిలూ, వందిమాగధ, గురు, పురోహిత, సామంత దండనాయక, ప్రజా ప్రతినిధులు, మంత్రి గణాలు, దేవతలు అభినందిస్తుండగా, వజ్ర, వైఢూర్య గోమేధిక, పుష్యరాగాది నానా మణిగణ విలాసిత కనకపు సింహాసనం పై కొలువుతీరిన శ్రీరామచంద్రున్ని అభినందించారు.. ఒకొక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపాడు శ్రీరామచంద్రుడు..

తనకి యుద్దంలో సహకరించిన వానర వీరులందరికీ కానుకలిచ్చాడు.. వానర వీరులంతా ముక్త కంఠంతో రామున్ని కీర్తించి, ఒకే ఒక్క కోరిక కోరాయి..

"రామచంద్రప్రభూ, ఈ శుభ సమయంలో మాకొచ్చిన నాట్యాల్ని, గానాల్ని మీ ముందు ప్రదర్శించి మిమ్ములను మరియు అయోధ్య వాసుల్ని అలరించించాలని మా కోరిక" అన్నాయి. సరే అని కోతుల కళా ప్రదర్శనకి అనుమతినిచ్చి ఆరంభింపజేసాడు.. వనవాసం చేసి, అలసిపోయిన రాముడు, సీత లక్ష్మణులు

వానరుల ప్రదర్శన ప్రారంభం కాగానే నిద్రాదేవి వడిలో వాలిపోయారు.. కొద్దిసేపటికే అయోధ్యావాసులకీ నిద్ర ముంచుకొచ్చేసింది.. కోతులు గొప్ప ఆశాభంగానికి గురయ్యాయి.. ప్రదర్శన మధ్యలోనే విరమించి, మంగళ హారతి పాడేశాయి. మర్నాటి అభినందన సభలో కోతులు విచార వదనంతో కనిపించాయి.. అలసిపోయిన సీతా రామ లక్ష్మణులు నిద్రపోయారంటే అర్ధముంది కాని, ఇంత గొప్ప కళాకారుల్ని అవమానించిన అయోధ్యవాసుల్ని, కోతులు క్షమించదలచుకోలేదు... వినమ్రతతో కోతులన్నీ తమకు జరిగిన అవమానాన్ని రాముడితో విన్నవించుకున్నాయి.. రాముడు కొద్దిగా సిగ్గుపడ్డాడు... సరే జరిగిందానికి క్షమిచంచండి.. మీరు అయోధ్యకి అతిధులు... మీరు ఏం కోరుకున్నా ఇచ్చి తీరుతాను.. ఏదైనా వరం కోరుకోండి.. అన్నాడు రామచంద్రుడు అభయహస్తమిస్తూ.. కోతుల్ని సంతోషపెట్టాలనే వుద్దేశ్యంతో.. కోతులు పరమానందభరితమయిపొయాయి..

ప్రభూ ! అయోధ్యవాసులు బతికున్నంత కాలం మా కోతిచేష్టలూ, కుప్పిగెంతులూ చూస్తూ గడపాలని, గడిపి తీరాలని వరం కోరుకున్నాయి... వాటికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో,, శ్రీరామచంద్రుడికి ఆ వరం ఎలా ఇవ్వాలో అర్ధం కాలేదు.. తన ప్రజల్ని పని పాటలు మానేసి, కోతి ప్రదర్శనల్ని తిలకించమని ఎలా ఆదేశించగలడు ? కొన్ని క్షణాలు కనులు మూసుకుని ఆలోచించాడు...

నెమ్మదిగా కనులు తెరచి, కోతులందరికీ ఈ రకంగా చెప్పసాగాడు.. 'ఓ వానరులారా ! రాబోయే

కలికాలంలో కొంతకాలం భూమ్మీద తెలుగు సినిమాలు, టీవీల ప్రాబల్యమూ ఎక్కువవుతుంది..

ఆ సమయంలో మా అయోధ్య వాసులు, టీవీ ప్రేక్షకులుగా జన్మించి, మీరు హాస్యం పేరుతో, అర్ధం

పర్ధం లేని కధలతో, అంతంలేని సీరియల్సు తో, పిచ్చి పిచ్చి చేష్టలు, కుప్పిగెంతులతో మీరు చేసే ఎలాంటి ప్రదర్శననైనా కిమ్మనకుండా విసుగు, విరామం లేకుండా చూస్తారు" అని వరాన్ని ఇచ్చాడు..

శ్రీరామచంద్ర ప్రభువుకీ జై అంటూ జయ జయధ్వానాలు చేస్తూ కాబోయే టీవీ సీరియల్సు యొక్క రచయితలు, ప్రొడ్యూసర్లూ, నటులూ,హాస్యనటులూ, యాంకర్లూ ఆనందంగా అయోధ్య వీడి కిష్కింధకి పయనమైపోయారు.

ఈ కథ కేవలం సరదా కోసం వ్రాయబడింది.ఎవరినీ కించపరచడం రచయిత ఉద్దేశం కాదు

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.రచయిత పరిచయం :

పుట్టిందీ పెరిగిందీ విజయనగరం జిల్లా కల్లేపల్లి గ్రామంలో. మొదటి కథ సలహా ఆంధ్ర పత్రికలో.. వుద్యోగం టాటా ప్రోజక్ట్స్ అనే కంపెనీ లో.. స్వాతి పత్రిక లో బాపు బొమ్మకి కథ శీర్షికలొ ఎక్కువ కథలు ప్రచురించ బడ్డాయి..1997 నుండి 2003 వరకు రచనలు . రిటైరయి మా వూరి దగ్గర కొత్తవలస గ్రామం లో నా ప్రస్తుత నివాసం. ఇద్దరు మగ పిల్లలు పెద్దబ్బాయి రమాకాంత్ కోడలు సోనియా మనుమరాలు శరణ్య చెన్నై లో వుంటారు.. చిన్నబ్బాయి సుజన్ చిన్న కోడలు విధూషి అరునాచల్ ప్రదేష్ లొ వుంటారు.. 2017 లో భార్యా వియోగం వలన ఓంటరి జీవితం సాగిస్తునాను..


284 views0 comments

Comments


bottom of page