top of page

రంగుల కలలు


Rangula Kala written by P.L.N.Mangaratnam

రచన : P.L.N. మంగారత్నం

ఈ మధ్య ఆదివారం వచ్చిందంటే చాలు.

అద్దె ఇంటి వెతుకులాటలో ఉంటున్నాడు భామిరెడ్డి. ఊరిలో ఎక్కడైనా ఫర్వాలేదు .. అనుకుంటే ఈ టైముకి దొరికి ఉండేదేమో! అయితే, తను పని చేసే తాళ్ళరేవు మండలానికి వెళ్లి, రావడానికి వీలుగా సిటీకి చివరిగా ఉన్న జగన్నాధపురం అయితేనే .. బాగుంటుందని భావించాడు. జగన్నాధపురం వంతెన దిగువన, అటుగా వచ్చే ‘అమలాపురం’ .. బస్ ఎక్కితే సరిపోతుంది. అదే మరెక్కడైనా అయితే .. అక్కడ నుంచి .. వంతెనకు పది రూపాయల ఆటో చార్జి ఇచ్చి, మళ్ళీ మండలానికి వెళ్ళే బస్సు ఎక్కాలి. అలా అయితే, రానుపోనూ ఖర్చులు అదన౦ అవుతాయి.

ఇంటి అద్దెకే కటకట అనుకుంటే, ఇక అదనపు ఖర్చుల గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. పైగా శ్రమ, దూరం కూడాను. అందుకే పరిధి గీసుకుని జగన్నాధపురం లోనే ‘అద్దెఇల్లు’ వెతుక్కుంటున్నాడు. ఇల్లు మారడంలో కష్టాలు వివరించి చెప్పినా ..

భార్య శోభిత మాత్రం తన పట్టు మీదే ఉంది “ మీకేం మీరు హాయిగా ప్రొద్దుట వెళ్లి, సాయంత్రం వస్తున్నారు. నేనే చంటిదాన్ని పట్టుకోలేకపోతున్నాను. ఎందుకైనా వీధి తలుపు తీస్తుంటే చాలు అమాంతం బయటకు పరిగెత్తేస్తుంది. ఎక్కడ మెట్ల మీద నుంచి జారి పడిపోతుందోనని హడలి చస్తున్నాను. మీరు వెళ్ళింది మొదలు, దాని కోసం అటు తలుపూ, ఇటు తలుపూ వేసుకుని .. వెలుతురు అనేది తెలీకుండా జైలు జీవితం గడుపుతున్నాను. అది పడుకుంటేనే తలుపులు తీసుకోవడం” అంటూ సతాయి౦చడం మొదలుపెట్టింది రోజులు గడుస్తున్న కొద్దీ. నడకలోచ్చిన .. ఏడాదిన్నర చంటిపిల్ల ‘సుధాత్రి’ ని పట్టుకోవడం సాధ్యం కావడం లేదు.

తనుంటే పర్వాలేదు. ఎత్తుకుని ఆడిస్తాడు. బాల్కనీ లో నిలబడి ఎగిరే కాకుల్నీ, కొంగల్నీ చూపిస్తూ. తను లేకపోతే .. శోభిత ఒక్కతీ పాపాయిని పట్టుకోలేకపోతుంది. ‘అమ్మా, అత్త లాంటి చిన్న చిన్న పదాలు కూడా పలుకుతుంది. తలుపులకు గ్రిల్స్ పెట్టించమంటే ..

“వచ్చే ఇంటి అద్దెకు .. మళ్ళీ అదో ఖర్చా” అన్నారు ఇల్లు గలవాళ్ళు. అది కొద్ది స్థలంలో కట్టిన రెండు బెడ్రూముల ఇల్లు. క్రింద ఒక పోర్షను, పైన ఒక పోర్షనూ. క్రింద ఇంటి వాళ్ళు ఉంటే .. పైన భామిరెడ్డి వాళ్ళు ఉంటున్నారు.

పెళ్ళయిన కొత్తలో .. అంటే నాలుగేళ్ళ క్రిందట .. అలా ఆ మేడ మీదకు దిగిన చిలుకా గోరింకల్లాంటి కొత్తజంటకు ఏకాంతంగా బాగానే ఉండేది. అలా అని శోభిత ఒంటరి మేడలో.. ఒక్కతీ బిక్కుబిక్కుమంటూ ఉంటుందనుకుంటే పొరపాటు. అది దగ్గర దగ్గరగా ఇళ్ళున్న వీధి. ప్రక్క కాంపౌండ్లో ఉన్న మేడ మీద పోర్షన్కు .. కాఫీ కప్పు అందించేత దగ్గరగా ఉండడంతో .. ఒంటరితనం అనేది లేకుండా వాళ్లతో కలిసిపోయింది. అయితే, ప్రస్తుతం చంటిపిల్లతో ఇబ్బంది అయి .. నేల మీద ఇల్లు చూసుకోవాలనుకోవడం.

అలా తిరుగుతున్న భామిరెడ్డికి ఎక్కడా కాంపౌండ్ వాల్ ఉన్న ఇల్లు కనిపించలేదు. కనిపించినా వాటికీ ‘టు-లెట్’ బోర్డులు లేవు. తాళం వేసి ఉంటే మాత్రం ఇల్లు ఖాళీగా ఉండాలని ఏముంది? వాళ్ళుండే జగన్నాధపురం ఏరియా టౌనూ కాదు .. స్లమ్మూ కాదు. ఎనభైశాతం ఇళ్ళు డైరెక్టుగా రోడ్డు మీదకే .. అంటే ఇంటి ముందు ఉన్న డ్రైనేజీ కాలవ మీదకే తెరుచుకుంటాయి. గది లోపల మనుషులు .. గది బయట మురుగు కాలువ అనే జీవనది. అది నచ్చకే తిరుగుతున్నాడు.

ఆ వారంలో ఏమైనా ఇళ్ళు ఖాళీ అయ్యాయా! అని ప్రతి ఆదివారం. ఎకడమిక్ ఇయర్ పూర్తి కాకుండా ఏ ఇల్లూ ఖాళీ అవదని తెలిసి కూడా. ఓ రోజు ఉదయాన్న వాకింగుకు .. రోజూ నడిచే దారి కాక .. మరో రోడ్డు గుండా వెళ్ళినప్పుడు .. ఓ మూడు పోర్షన్లు ఉన్న ఇంటి గేటుకి ‘టు-లెట్’ బోర్డు వ్రేల్లాడుతూ కనిపించింది.

ఒక్క నిముషం ప్రాణం లేచి వచ్చినట్లయి ఇంటిని పరిశీలనగా చూసాడు. కాంపౌండ్లోకే ఉంది. ఏ పోర్షన్కీ తాళం కనిపించక పోయినా .. ఒక పోర్షన్ అయితే ‘ఖాళీ’ అన్న నమ్మకానికి వచ్చాడు. అడగడానికైనా .. అంత ప్రొద్దుటే నిద్రలేచిన వాళ్ళు లేరు. ఇంకా నిద్ర మబ్బు వీడలేదు ఊరు. వాకింగుకు వెళ్ళే తనకు తెల్లవారిందని అందరికీ అప్పుడే తెల్లవారిపోతుందా? అనుకుంటూ, ఆశ చావక అక్కడే తచ్చాడుతుంటే తెలిసింది. బయటకి చూడడానికి స్లాబ్ వేసిన ఇల్లులా ఉన్నా, అది పెంకుటిల్లని. అలాంటి పాతకాలం నాటి .. ఇల్లు గనుక చూపిస్తే శోభిత అగ్గి మీద గుగ్గిలం అవుతుందని ఆ ప్రయత్నం మానుకున్నాడు.

***

ఆఖరికి .. మరో వీధిలో .. తను కోరుకున్నట్లు ఓ అందమైన ఇంటికి ‘టు –లెట్’ బోర్డు కనిపించింది. గేటు లోపల .. అరటి, బొప్పాయి, మునగ చెట్లతో పాటు అనేక పూల మొక్కలతో ఆహ్లాదకరంగా ఉంది. మొక్కలు లేని చోట టైల్స్ పరిచి చూడ ముచ్చటగా ఉంది. ఉంటే ఇలాంటి ఇంట్లోనే ఉండాలనిపించేలా. అలాంటి ఇంట్లో అయితే, సుధాత్రి చక్కగా ఆడుకుంటుంది. పడిపోతుందన్న భయం లేకుండా.

‘నందనవనం’ అన్న పేరు బంగారం రంగు అక్షరాల్లో మెరిసిపోతుంది. ఉన్న స్థలంలో వాళ్ళ కోరిక తగ్గట్లు చక్కగా కట్టించుకున్నారు. చాలా సంతోషం వేసింది.

‘ తనకీ! ఇలాంటి ఇల్లు ఎప్పటికి అమరుతుందో?’ అని అనుకోకుండా ఉండలేకపోయాడు.

“ ఏం చేస్తుంటారు? ఎంతమంది ఉంటారు?” లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్న తరువాత తాపీగా చెప్పింది ఇంటి ఓనరమ్మ.

“మా ఇంటి అద్దె ఇరవై ఆరువందలు . రెండునెలల అద్దె ఎడ్వాన్సు” అని పోర్షన్ చూపించకుండానే. అంత ఇచ్చుకోగాలరని అనుకుంటేనే ఇల్లు చూపిస్తానన్నట్లు.

కరెంటు బిల్లూ, నీళ్ళ బిల్లుతో .. ఇంటిఅద్దె రెండువేలకు మి౦చకుండా నెట్టుకొస్తున్న భామిరెడ్డికి నషాళానికి అంటింది.

భార్యతో చెప్పాడు “అందమైన ఇల్లే చూసాను .. బయటనుంచి” అని.

***

ఉదయం .. చూసిన నందనవనమే కళ్ళముందు మెదులుతుంది భామిరెడ్డికి. తనకో ఇల్లు లేకపోయినా .. కనీసం ఓ అందమైన ఇంటిలో అద్దెకు ‘ఉండే’ వీలైనా లేకపోవడం అతన్ని బాధించింది. అలవాటుగా రోజూలాగే .. స్నానాదికాలు ముగించి .. ఓ అగరవత్తు వెలిగించి దేవుడికి దండం పెట్టుకుంటున్నా.. మది నిండా అవే ఆలోచనలు. చేతులు జోడించి ..కళ్ళు మూసుకుని, దేవుని స్తోత్రం చేస్తున్నా .. ఆ ఇంటి ఓనరమ్మ మాటలే మనసులో మెదులుతున్నాయి “మా ఇంటి అద్దె ఇరవై ఆరువందలు. రెండునెలల అద్దె ఎడ్వాన్సు” అంటూ. ఆశాంతిగా .. ఏదో విధంగా పూర్తి అయ్యిందనిపించాడు. దేవుడి ప్రార్ధన కన్నా మనసు గోలే ఎక్కువై౦ది ఆరోజు.

రోజూ ప్రార్ధనలు ఆలకించే, దేవుడికీ అలానే అనిపించి౦ది. స్దానబలిమి మనిషికి దైర్యాన్ని ఇస్తుంది. ఆ దైర్యమే ఆ ఇంటి ఓనరమ్మకు వచ్చింది. తనకూ అదృష్టం కలిసివచ్చి ఓ ఇల్లు అమిరితేనా .. అలాగే .. హాయిగా, నిశ్చింతగా ఉంటాడు. అన్నీ సమకూరిన అవసరాలతో మనిషి ధీమాగా బ్రతకోచ్చేమో! అన్యమనస్కంగా ఉన్న భర్తను చూసి “ పోనీలెండి. ఎగరలేనంత ఎత్తుకి ఎగరాల్సిన పని లేదు. ప్రయత్నిస్తే ఇంకోటి దొరక్కపోదు” సలహా ఇచ్చింది. ఆ రాత్రి కలత నిద్రే పోయాడు భామిరెడ్డి.

***

అతని అవస్ద గమనించి ..తన భక్తుడైన భామిరెడ్డికి వాస్తవం తెలియచెప్పాలని అనుకున్నాడు దేవుడు. కళ్ళ ముందు పెద్దవెలుగుతో ప్రత్యక్షం అయి “ భక్తా! నేను శ్రీమన్నారాయణుడను .. అంతర్యామిని. నీవు కలత మనసుతో చేసిన పూజ నన్ను కదిలించింది. భక్తుల కష్టాలు .. భగవంతునివే అయినా, నీకో విషయం తెలియచెప్పాలని వచ్చాను. అందరి జీవితంలోనూ .. అన్నీ వస్తాయి. కొద్దిగా ముందూ, వెనుకా. అంతే. దేనికైనా కాస్త సంయమనం పాటించాలి. ఎప్పటికి ఏది ప్రాప్తమో అప్పటికి అది అన్నట్లు” అంటూ పరిస్థితిని విశదీకరించే దిశగా. అది మెలకువో! ఏమో! తెలియని భామిరెడ్డి .. తనతో మాట్లాడుతున్నది దేవుడు అని గ్రహించి వెంటనే చేతులు జోడించాడు. తను ఎప్పుడూ చేసే స్తోత్రం మొదలుపెట్టాడు. భక్తిగా పాదాలు కళ్ళకు అద్దుకుని .. ఆనందభాష్పాలతో .. తడబడే గొంతుతో ..

“ సంయమనం ఏమిటి స్వామీ? సంయమనం అంటే అవకాశం కోసం ఎదురు చూడడమేనా? ఆ విషయం ఎవరికీ తెలియనిదీ? దేవుడు ఏ పనైనా చెయ్యగలడనీ, ఎన్ని మహిమలైనాచూపగలడని అంటారు కదా? మీరు తలచుకుంటే ఏ పనైనా .. ఎందుకు కాదు?" ఎదురు ప్రశ్న వేసాడు.

“ దేనికైనా సమయం రావాలి నాయనా! నీ సర్వీసు ఎంత? అప్పుడే స్వంత ఇంటిని గురించి కలలు కంటున్నావు. నువ్వు చేసే జూనియర్ అసిస్టెంటు ఉద్యోగానికి అప్పుడే గాలిలో మేడలా? నీకా వెనకేం ఆస్తిపాస్తులు లేవు కదా! కోరికలకు కళ్ళెం కాస్త వెయ్యి ” చిన్నగా హెచ్చరించాడు.

“ కలలు కనడం తప్పెలా అవుతుంది స్వామీ? గొప్పగొప్ప వాళ్లందరూ కలలు కనండీ, ఆ కలల్ని సాకారం చేసుకోండి అనేకదా! చెబుతున్నారు. అయినా గృహమే కదా! స్వర్గసీమ .. అలాంటి దాని కోసం ఆశపడడం, కలలు కనడం తప్పెలా అవుతుంది? ఓ అందమైన ఇంటికి ‘అద్దె’ కట్టలేని పరిస్థితి నన్నెంత ఇబ్బంది పెడుతుందో, నీకు తెలీదు. దేనికైనా పెట్టి పుట్టాలి ”అన్నాడు ఆవేశంగా.

“ అయితే, ఏమంటావు?"

“నా కోరిక తెలుసు కదా! స్వామీ. నాకంటూ ఓ ఇల్లు ప్రసాదిస్తే, జీవితాంతం నీకు ఋణపడి ఉంటాను. ఆ ఇంటికి నీ పేరే పెట్టుకుంటాను కూడా. వరాలు ఏమీ ఇవ్వాలని అనుకోనపుడు .. పనిగట్టుకుని ఎందుకు కనిపించినట్లు?” అలకతో కూడిన కినుక. అప్పటికి భామిరెడ్డి చాలా ధైర్యం వచ్చేసింది. ఓ స్నేహితుడితో మాట్లాడినట్లు మాట్లాడేస్తున్నాడు చలాకీగా. అవును. ఎందుకు కనిపించినట్లు? వదిలేస్తే, అతని ఏడుపు అతను ఏడ్చేవాడు కదా! కుడితి కుండలో ఎలుకలా ఎప్పుడో! లేచేవాడు. అనవసరంగా ఇలా .. లేపి వాయించుకోవడం ఎందుకు? అని అనిపించి౦ది శ్రీమన్నారాయణుడికి కూడా. అలా అని బయట పడకుండా “ అయితే, నీకో ఇల్లు కావాలంటావు” అడిగాడు సాలోచనంగా.

దేవుడిని ప్రసన్నం చేసుకున్నందుకు సంతోషంగా “ అవును. స్వామీ. అవును. ఉదయం చూసిన లాంటి అందమైన ఇల్లే కావాలి “ అంటూ మళ్ళీ చేతులు జోడించాడు. నవ్వాడు దేవుడు. అంతే .. నిముషాల మీద దేవుడి చేతిలో ఓ అందమైన ఇల్లు ప్రత్యక్షం అయ్యింది. బంగారు వన్నెలతో కాంతులీనుతూ. ప్రక్కనే చెట్లూ, చేమలు. మనిషి ప్రకృతి మమేకం అవుతాడన్నందుకు ఉదాహరణగా. అయితే .. అక్కడే మొదలయ్యింది ‘ట్విస్టూ’.

“ సరే! చెప్పు ఎక్కడ పెట్టమంటావు. నీ ఇంటిని” అడిగాడు దేవుడు.

“ అదేమిటి స్వామీ, ఎక్కడో, ఓ ఖాళీ స్థలంలో పెట్టండి” ఆశ్చర్యంగా చూసాడు భామిరెడ్డి.

“ అదే ఎక్కడ?” అయోమయంలో పడ్డాడు భామిరెడ్డి.

ఆలోచించాడు ..

తను ఉన్న ఇంటి ప్రక్కన పెట్టించుకోడానికా చోటు లేదు. అలా ఆ ఇంటి ప్రక్కనే కాదు. ఆ వీధి చివరి వరకూ చూసినా .. ఎక్కడ జాగా కనిపించలేదు. ఇళ్ళూ, షాపింగు కాంపెక్సులూ, మార్కెట్టూ .. అన్నీ రోడ్డు వెంబడి ఒకదాని ప్రక్కన ఒకటి పరచుకుని .. ముందే అమర్చిన లక్కపిడతల్లా క్రమపద్దతిలో అమరిపోయినాయి. చివరకు .. జగన్నాధపురంలో వీసమెత్తు జాగా ఖాళీగా కనిపించేలేదు.

పోనీ .. తను పని చేసే మండలం తాళ్ళరేవులో .. ఆఫీసుకు దగ్గరలో పెట్టించుకుంటేనో! అనుకుంటే .. అదో పల్లెటూరి లాంటి ప్రదేశం. ఎలాగో సర్దుకుందాం అనుకున్నా .. మళ్ళీ. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ఐతేనో? జిల్లా చాలా పెద్దది. అరవై నాలుగు మండలాలు. ఎక్కడికి విసిరేస్తే అక్కడకు వెళ్ళాలి. అప్పుడు చాలా కష్టపడాలి. అప్పటి వరకూ అద్దె ఇంటిని గురించి ఆలోచించిన భామిరెడ్డి .. ఇప్పుడు స్వంత ఇల్లు ఎక్కడ ‘పెట్టించు’కోవాలి? అని ఆలోచిస్తున్నాడు. భూమి అంతా పంటపొలాలూ, లే- అవుట్లూ, పోరంబోకులు. పంటపొలాలు తనేం చేసుకుంటాడు? అవి పంటలు పండించుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి.

లే- అవుట్లు బాగానే ఉన్నా తనలాంటి మధ్యతరగతి జీతగాడు .. అక్కడ రెండు వందల గజాలు స్తలం కొనడానికే లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలి. అంత డబ్బు తనకెక్కడిది? పోరంబోకులు అయితేనో? అవి ఎవ్వరికీ చెందని ప్రభుత్వభూములు. పలుకుబడి ఉన్న పెద్ద మనుషులు వాటినే ఎన్నుకుంటారు. అవి అన్యాక్రాంతం అయిన ఎన్నో ఏళ్ళకి గాని, బయట ప్రపంచానికి తెలీదు. ఈ లోపు అక్కడ పక్కా బిల్డింగులు లేపేస్తే .. కొనకుండానే ఆ భూమి వాళ్ళ పరం అయిపోతుంది. అందుకే ..

ఇల్లు అక్కడ ‘పెట్టించు’కుంటే .. ఎప్పుడో, ఏదో .. చూసీ చూడకుండా కట్టిన కట్టడం అనీ, ఎంతో అంత పెనాల్టీ వేసి ప్రభుత్వమే ఎప్పుడో! అప్పుడు అక్రమ కట్టడంగా భావించి క్రమబద్దీకరిచేస్తుందనీ అనిపించి౦ది.

“ స్వామీ. ఊరిలొ ప్రభుత్వ పోరంబోకులు చాలానే ఉన్నాయి. ఎక్కడో అనువైన చోట చూసి పెట్టేయ్యి” అన్నాడు లోపాయకారిగా.

“ వాటి సంగతి నాకూ తెలుసు. అవి ఏవీ మనుష్యులు నివసించడానికి ఆవాసయోగ్యంగా ఉండవు. ఊరికి దూరంగా ఉండి .. చెట్లూ, పుట్టలతో, మురికినీరు చేరి పందులకూ, దోమలకూ కేరాఫ్ ఎడ్రసులు. అలాంటి చోట వంటరిగా .. జనావాసాలకు దూరంగా ఉండాలని ఎవ్వరూ అనుకోరు. మనిషి సంఘజీవి. ప్రక్క మనిషి స్నేహాన్ని కోరుకుంటాడు ” చెప్పాడు దేవుడు.

ఒక్క నిముషం పాటు నిరాశ కలిగింది భామిరెడ్డికి.

“ నా ఇల్లు చూసి అక్కడ కాలనీ ఏర్పడ వచ్చు కదా స్వామీ” అడిగాడు ఎంతో ఆశగా.

“ ఈ లోపే అది దొంగలపాలౌతుంది”

“ అయితే, నన్నేం చెయ్యమంటారు స్వామీ?” బిక్కమొహం వేసాడు. వరం చెయ్యిజారి పోతుందేమో నన్నదిగులుతో.

“ దేనికైనా టైము రావాలి భక్తా! కాలక్రమంలో అన్నీ వస్తాయి. ఈ లోపు .. నెమ్మదిగా ఓ ఇంటి స్తలం ఏర్పరచుకో! భూమి మీద నీదీ అన్న ‘ఉనికి’ ని ఏర్పరచుకుంటే, ఇల్లు అదే వస్తుంది. అయాచితంగా వచ్చేది ఏదీ .. ఎవరి దగ్గరా నిలవదు. ఆ విషయం తెలియచెప్పడానికే నీకు కనిపించాను. విషయం నీకు అర్ధమయ్యింది. శుభం భయాత్”

అంటూ చిరునవ్వుతో వెనుదిరిగాడు శ్రీమన్నారాయణుడు. దేవుడితో పాటు ఇల్లూ మాయమైపోయింది.

“ అయ్యో! నా ఇల్లూ, నా ఇల్లు. అలా ఊరించడం భావ్యం కాదు స్వామీ! నా కోసం సృస్టించిన ఇల్లు నాకే ఇచ్చేయ్! నా కష్టాలు ఏవో నేనే పడతాను” అంటూ గట్టిగా అరుస్తున్నాడు భామిరెడ్డి.

ఆ అరుపులకు ప్రక్కనే మంచం మీద నిద్రపోతున్న శోభితకు .. మెలకువ వచ్చింది. చూస్తే భామిరెడ్డి ఇంకా కలవరిస్తూనే ఉన్నాడు “ అయ్యో! నా ఇల్లూ, నా ఇల్లు” అంటూ.

పూర్తిగా మెలకువ తెచ్చుకుని “ అయ్యో! ఏమిటిదీ? నిద్రలోనూ ఇంటిని గురించి కలవరింతలేనా? .. ఎప్పుడో అప్పుడు దొరుకుతుందిలే .. దాని కోసం దేవుడినే బ్రతిమాలేస్తున్నారల్లే ఉందే? లేవండి .. తెల్లవార వస్తుంది కూడాను” అంటూ భర్తను భుజం తట్టిలేపింది.

వారి మధ్యలో పడుకున్న సుధాత్రి కదలబోతే, లేవకుండా జోకొడుతూ. అలా వాస్తవంలోకి వచ్చిన భామిరెడ్డికి అప్పటికి గాని తెలియలేదు .. తనకి వచ్చింది కల అని.

పూర్తిగా తెల్లవారిన తరువాత .. “ ఆ ఇంటిని గురించి ఆలోచించి బాధ పడకపోతే, ఈ నెలలో మీకు ఇంక్రిమెంటు ఉంది కదా! పెరిగే జీతాన్ని అలా ఖర్చు పెట్టుకోగలిగితే ..ఆ అందమైన ఇంట్లో ఉండే అవకాశం .. మన కష్టం తీరే అవకాశం వస్తుంది కదా” కాఫీ కప్పు అందిస్తూ చెప్పింది శోభిత. అప్పటివరకూ తన మందబుద్ధికి ఆ ఆలోచన రానందుకు మనసులోనే నవ్వుకున్నాడు భామిరెడ్డి.

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

నా పేరు పి.ఎల్ ఎన్. మంగారత్నం, బి.ఎస్సీ చదివి 1984 లో రెవిన్యూ డిపార్టుమెంటులో జూనియర్ అసిస్టెంటుగా జాయిను అయి, డిప్యుటీ తహసీల్దారుగా డిసెంబర్ 2018లో రిటైరు అయ్యాను. చిన్నప్పుడు బొమ్మలు బాగా వేసేదాన్ని. ఇప్పుడు రచనలు జై సమైక్యాంద్ర సమయంలో వచ్చిన సెలవులలో రెండవ సారి మొదలు పెట్టి వ్రాయడం మొదలు పెట్టాను. ఇప్పటికి 100 పైగా కధలు వ్రాసాను. త్వరలో ఒక సంకలనం కూడా వేసుకునే ఆలోచనలో ఉన్నాను.



60 views0 comments
bottom of page