రావమ్మ మహాతల్లి.. క్రిష్ణార్పణ మస్తు
- Dr. Kanupuru Srinivasulu Reddy
- Feb 11
- 8 min read
#DrKanupuruSrinivasuluReddy, #కనుపూరుశ్రీనివాసులురెడ్డి, #రావమ్మమహాతల్లిక్రిష్ణార్పణమస్తు, #RavammaMahathalliKrishnarpanaMasthu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #సామజికసమస్యలకథలు

Ravamma Mahathalli Krishnarpana Masthu- New Telugu Story Written By Dr. Kanupuru Srinivasulu Reddy Published In manatelugukathalu.com On 11/02/2025
రావమ్మ మహాతల్లి.. క్రిష్ణార్పణ మస్తు - తెలుగు కథ
రచన : డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
మా నాన్నతో బస్సు దిగి మా అత్తగారి ఊరి దారిపట్టాము. ఆ ఊళ్ళో మా మావ పెద్ద ఆస్తి పరుడు. ఒక విధంగా జమిందారు. మా నాన్న చెల్లిల్ని ఇచ్చారు. అందుకే సెలవలకు మా మావ.. కాదు మా అత్త ఊరే అని వస్తుంది. పెత్తనం అంతా ఆమెదే!
అలాగని ఆమె గంప గయ్యాళి కాదు. మాట కూడా వినపడదు. చీటికి మాటికి అరుస్తుండే మా మావను, అంత ఆస్తిని, ఊరిని శాసిస్తుంది. అలాగని ఊళ్ళో వాళ్ళను భయపెట్టదు, వేధించదు. ఆమె ముఖం చూస్తేనే ఎదురు చెప్పను బుద్ధి వెయ్యదు. మా నాన్న.. ఆమె ఒకర్నొకరు చూస్తే ఈయన కళ్ళల్లో మతాబులు, ఆమె కళ్ళల్లో ఆనందపు కన్నీరు త్వరపడి కురుస్తాయి. ఎందుకో అర్ధంగాక ఆశ్చర్య పోయేవాడిని.
వాళ్లకు ఒక్కడే కొడుకు. వాడి పేరు ఉమ. నేనంటే ప్రాణం. నాతో అయితేనే తిరగడానికి పంపుతారు. ఎక్కువ మందితో కలవనివ్వరు. నాకంటే ఒక సంవత్సరం చిన్న. ఊరు చిన్నదే. ఐదొక్లాసు బడి. ఒక రాముల వారి గుడి! చాలా కాలం పిల్లలు పుట్టకపోతే మా అత్త అడివిలో కట్టించిన ఈశ్వరుని గుడి. శివాలయం కట్టిన తరువాత కొడుకు పుట్టాడట. అందుకే ఉమా మహేశ్వర్ అని పేరు పెట్టారంట.
బస్సు దిగి నడుస్తుంటే పరుచుకోనున్న పచ్చిక, అందులోనుంచి రంగుల పూలు! మధ్య దారిలోకి వచ్చాము. దూరంలో మాకు ఎదురుగా ఉమ పరుగెత్తుకు వచ్చి నిలిచి ఆయాసపడిపోతూ, “మావా! మన తెల్లావుకు మగ బిడ్డ పుడుతుందట.. రాముడు చెప్పాడు. ఇది తెలుసా నీకు, బట్ల గొర్రె, చుక్కల పొట్టేలు పెళ్లి చేసున్నాయంట. యేసు చెప్పాడు. మన చాకలమ్మి రంగి గుమ్మడి పూలు తెచ్చి ఇస్తానంది. వాళ్ళింటిలో జామకాయలుండాయంట, నువోస్తే తెస్తానన్నది.
నల్లకోడి పెట్ట, బెరస పుంజు జత. ఎర్ర పుంజు, తెల్లపెట్ట రమ్మంటే రాలేదని దాన్ని తరిమి తరిమి తొక్కింది. అది పది గుడ్లు పెట్టింది. పిగలేసిన గుడ్లు తొందరలో పిల్లలు అవుతాయని వాడు చెపుతుంటే అప్పుడే పరుగెత్తుకు వెళ్లి వాటిని చూడాలనే ఒకటే తొందర. నీ కోసం చూస్తున్నా.. చెప్పుకు పోతూనే ఉన్నాడు. నిలవ బుద్ది వెయ్యలేదు. అంతే నాన్న పిలుస్తున్నా పరుగో పరుగు.. దౌడో దౌడు!!
ఉదయం చీకటి ఉండగానే లేచేసి వాళ్ళం. కళ్ళాపు జల్లి రంగుల ముగ్గులు వేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండే వాళ్ళం. ఆవులకు, గేదెలకు పాలు పితుకుతుంటే, వాటి బిడ్డలు తాగాలని లాక్కుంటూ ఉంటే బాధ అనిపించేది అయినా అదొక ఆట. ఒక్కోసారి పాలు పితుకుతుండగానే బిడ్డల్ని వదిలేసే వాళ్ళం. దాంతో మా మామ, పితుకుతుండే రంగయ్య ఒక్క అరుపు అరిచి దూడలను దూరంగా తీసే వాళ్ళు. సాయంకాలం మందలు వస్తుంటే లేచే దుమ్మువాసన, బిడ్డలకోసం అరుస్తూ పరుగులెత్తే ఆవులు, తల్లలుకోసం అప్పటి వరకు పడుకోనుండే బిడ్డలు ఆత్రుతతో లేచి పోవాలని పడే తపన చూడటం ఎక్కడో ఉన్నట్లు అనిపించేది.
భోగికి కంప తెస్తానన్నాడు సుబ్బన్న. మేము వస్తామన్నాము. వొప్పుకోలే! సుబ్బన్నను జాగర్తగా చూసుకో, పోకిరి చేష్టలు చెయ్యనివ్వకు అని అత్తా మామా బెదిరించి కూడా పంపారు. వయసు జాస్తి అయినా మాతో పరుగులు తీసేవాడు. మమ్మల్ని అదుపు చెయ్యలేక అలిసి పోయేవాడు. మేము ఎం చెప్పినా చేసేవాడు.
ఈ పండుగ రోజుల్లో అడివిలో దొరకని పడ్లు అంటూ ఉండవు. రేగి, కలే ఈత పండ్లు కుప్పలు కుప్పలుగా కాసుంటాయి. ఇవి పట్నపోల్లకు చాలామందికి పేర్లు కూడా తెలియవు. వినే ఉండరు. కలే పండ్లు నల్లగా మాగి చెట్లనిండా ఉన్నాయి. ఇద్దరం వాటికోసం కోసం పొద పొద తిరిగి కోయడం మొదలుపెట్టాము. సుబ్బన్న అరుస్తూనే ఉన్నాడు ముళ్ళు ఉంటాయి.. పాములుంటాయి!! లెక్క చెయ్యాలే!
గుచ్చుకుంటున్నా దూరి దూరి కోసుకుంటున్నాము. ఎంత పెద్ద పాము కనిపించినా తరిమి తరిమి రాళ్ళతో కొట్టి చంపేసే వాళ్ళం. సుబ్బన్న నెత్తి నోరు బాదుకునేవాడు. భయం అంటే తెలిసేది కాదు. మాట్లాడుతూనే ఉన్నాము. “తాటి తేగలు తొవ్వించాలని వెలగకాయలు తెచ్చుకుని బెల్ల వేసుకుని తినాలని ఉంది మావా! తిందామంటే అమ్మోల్లు దగ్గోస్తుంది, జలుబు చేస్తుంది తిన నివ్వడం లేదు మావా ! నీ కోసం కాచుకోనున్నా!”
పాపం అనిపించింది. నేనొస్తే దేవుడొచ్చి నట్టు జైల్లోనుంచి ఎగిరి దూకి వచ్చినట్లే సంబరపడి పోయే వాడు. !
“మావో నీకు తెలుసా! పెద్ద ఈతకాయలు పండు దారి కొచ్చాయంట. ఎక్కడ పోదామంటే పాములు, ఈత ముళ్ళు గుచ్చుకుంటే విషం అని నన్ను తిట్టారు మావా!”
“మనంబోయి కోసుకోస్తాములే ! పక్కనే ప్రభాకరుగాడి ఇల్లుంది కదా! పోదాం” అన్నాను పండ్లు కోస్తూనే,
“వాడేం రా! రాలేదు. అందరికంటే ముందుండే వాడు. జిడ్డులాగా అతుక్కుని మనతోనే పడుకోనేవాడు. చదువు నిలిపేసాడా? “
ఏం మాట్లాడలేదు. చూస్తే ముఖం అదోలా ఉంది. మాట్లాడలేదు.
“వాడి సంగతి చెప్పలేదేమిరా?”
ఎందుకో వెనకాడుతున్నట్లు అనిపించింది. పండ్లు కోస్తూ తిరిగి చూసాను. నన్ను చూడలేక పక్కకు తిరిగాడు. ఈ పిల్లగాడికి రహస్యాలు కూడా ఉన్నాయా?” ఏందిరా అడుగుతుంటే చెప్పవు“ అని కసిరాను.
“ఏం లేదుమావా! వాడు ఎక్కడికి రావడం లేదు. బడికూడా మొగించేసాడంట “
“ఎందుకు ?”
దగ్గరగా వచ్చి, “వాళ్ళక్క ఎవడితోనో లేచి పోయిందంట. దాంతో వాళ్ళ నాయన ఉరేసుకుని చచ్చి పోయాడు. అంతే కనిపించడం లే!” అన్నాడు.
గుండె గుబెల్మంది. లేచిపోయిన దానికి కాదు. వాళ్ళ నాయన చచ్చి పోయినందుకు.
ఉండలేక, “వెంటనే పోదాం పదరా !” అన్నాను.
“వొద్దు మావా ! వాడూ పిలిచినా రావడంలే ! అమ్మోళ్ళు కూడా పిలవద్దన్నారు. చాలా దిగులుగా ఉంది మావా!”
నేను అట్లాగే కూర్చుండి పోయాను. పాపం.. పాపం అనే మాట పదే పదే తెలియకుండానే అంటున్నాను. కళ్ళల్లో నీరుగారి పోతున్నాయి. పోవాలి చూడాలి అని ఆ రోజంతా దిగులుగానే ఉండిపోయింది. రాత్రి ఉమా నేను ఎవ్వరికీ తెలియకుండా చీకటితో పోవాలనుకున్నాము.
అట్లాగే ఉదయాన్నే లేచి పోదామనుకునే లోపల అందరూ లేచేసారు. ఆడోల్లు వాకిట చిమ్మి ముగ్గులు వేయబోతున్నారు. అందుకని పోవడానికి కుదరలే! సందు దొరికితే చాలు పోయి వాడ్ని చూడాలని ఉంది.
ధనుర్మాసం డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు పండుగ నెల. ఉదయాన్నే లేచి స్నానం చేసి శ్రీమన్నారయణుని పూజ చేస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అప్పుడు భూలోకంలో కనిపిస్తానని భగవద్గీతలో చెప్పాడట. అత్తకు బలే భక్తి. మావకు కాఫీ కూడా పూజ అయింతరువాతే ఇస్తుంది. మావ అరుగు మీద కూర్చుని సేద్యకాపులు వస్తే ఆ రోజు ఏం చెయ్యాలో చెప్పిన తరువాత పశువులు దగ్గర పేడ చెత్త ఊడ్చేసి, పాలుపితికేసి, సద్ది పోస్తే తాగేసి, పొలం పనులకు ఎల్లిపోతారు.
దక్షిణాయనం అంటే జూన్ ఇరవై ఒకటి నుంచి డిసెంబరు ఇరవయ రెండు వరకు. అప్పుడు సూర్య భగవానుడు కర్కాటక రాశి మఖరరాశిలో ఉంటాడు. ఇందులో ఎండాకాలం వానాకాలం శీతాకాలం ఉంటాయి. పండ్లు పండేది తిరిగి వ్యవసాయానికి తయారు గావడం ఉంటాయి. సూర్యుడు కొద్ది కొద్దిగా భూమికి దూరం అవడంతో చలి ఎక్కువ ఉంటుంది. ఉత్హరాయణం వచ్చేముందు ముందు చలి తగ్గి పోతూ వస్తుంది.. మహా శివరాత్రితో శివశివ అంటూ పారి పోతుంది. ఆ రోజే శివపార్వతుల పెండ్లి జరిగిందంట ఎండలు ముదురుతూ వస్తాయి. ఉత్తరాయణం జనవరి పద్నాలుగు నుంచి జూన్ పదిహేను వరకు!!
ఇంద్రునికి కృతజ్ఞతతో భోగి పండుగ చేస్తారు. ఎందుకంటే వానలు కురిపించడానికి పంటలు పండటానికి ఆయనే కారణమని నమ్మకం!! ఆ రోజే గోదాదేవి రంగనాధ స్వామితో కలుసుకుందని అందుకే భోగం, భోగి పండుగ అయ్యిందని చెపుతారు. విష్ణు పూజలు ఎక్కువ చేస్తారు. ఇంకో కధ వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళ లోకాలోకి తోక్కేసి, సంక్రాంతికి ముందురోజు భూలోకం వచ్చి ప్రజలను ఆశీర్వదించమని చెప్పాడట వామనుడు. బలి చక్రవర్తి వస్తాడని సంతోషంతో భోగి మంటలు వేస్తారట.
కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తింది ఈ రోజే నట. నందీశ్వరుడు శాపవశాన భూలోకానికి రైతులకు సహయపపడటానికి వచ్చిన రోజు కూడా ఇదేనట.
భోగిలో కంప చెత్త చెదారం వెయ్యకూడదు. ధనుర్మాసంలో- పండుగ నెల ప్రతి ఇంట ఆవు పేడ శ్రేష్ఠం లేదా గేదె పేడ తో ముద్దలు చేసి గుమ్మడిపూలు తంగేడి పూలు పలురకాయైన వాటితో సుందరమైన ముగ్గులతో పెట్టి గౌరీదేవికి పూజ చేస్తారు, సాయకాలం అవన్నీ ఎత్తి పెరటి గోడలకో చెట్ల మీదనో తట్టి ఎండ పెడతారు.. వాటితోనే నెయ్యి పోసి మామిడి, వేప, తంగిరేణి ఎందు పుల్లలు వేసి భోగి మంట వేస్తారు. అందులో ఉండే ఔషద గుణాలు శ్వాసకోస జబ్బులు రాకుండా వాతావరణ కాలుష్యాన్ని తోలిగిస్తాయట.
ఉదయాన్నీ రంగు రంగు ముగ్గులు అందులో గొబ్బెమ్మలు అంటే గౌరీ దేవిని ఆరోగ్యాన్ని ఆపదలు రాకుండా రక్షణ కోసం పెడతారు. రధం ముగ్గు చాలా ముఖ్యం. భోగి పండ్లు పిల్లకు ఆశీర్వాదిస్తూ పోస్తారు. బొమ్మల కొలువు, గంగిరెద్దులు, హరిదాసులు సందడి చేస్తారు., ఊళ్ళో ఆడపిల్లలు గొబ్బమ్మను తెచ్చి చుట్టూ చప్పట్లు తట్టుతూ, పాటలు పాడుతూ, తినుబండారాల కంటే డబ్బులు ఇస్తే సంతోష పడుతారు.
రక రకాల పిండివంటలు గంపలు గంపలకు చేయిస్తుంది అత్త. పనివాళ్లకు పెడుతుంది. అందరూ బోగి రోజు, కనుమ రోజు కోడి పందాలు వేస్తారు. అందరికి అదొక ఆనందం, సంబరం! వాటికి యమ గండం !! ఎద్దుల పోటీలు, బరువు పోటీలు, కుస్తీపోటీలు కంటే కోడి పందాలు ఇష్టం!!
మరుసటి రోజు సంక్రాంతి. పవిత్రమైన ఉత్తరాయణం వస్తుంది. కురుక్షేత్ర యుద్దంలో భీష్మ పితామహుడు గాయ పడినా బ్రతికుండి ఆ దినాలలో ప్రాణం వదిలాడంట అప్పుడు చని పోతే. నేరుగా స్వర్గానికి వెళ్లాలని !! అంత మంచి కాలం !! కొత్త దంపతులు బంధు మిత్రులు అందరూ ఒక్కచోట చేరి పిండి వంటలతో, గొబ్బెమ్మల పూజలతో, గంగిరెద్దుల ఆటలతో, హరిదాసు కీర్తనలతో నిండి పోతుంది.
చనిపోయిన పెద్దలకు పప్పు, పాయసం, తినుబండారాలు పెట్టి, పిండ ప్రదానాలు సమర్పించి, తర్పణాలు వదిలి జ్ఞాపకం చేసుకుంటారు. నవ్వులతో చతురలతో ఆడుతూ పాడుతూ కొత్త అల్లుళ్ళు కొత్త బట్టలతో సందడి చేస్తారు.
కనుమ పండుగ రోజున మనకు పాడి పంటలకు కారణమైన ఆవులు గేదెలు ఎద్దులులను శుబ్రంగా కడిగి బొట్లు పెట్టి గజ్జలుకట్టి అలంకరించి పొంగళ్ళు పెట్టి బెల్లం చెరుకు ఆహారాన్ని ఇచ్చి పూజిస్తారు.
కానీ కొంత మంది ఆ మరుసటి రోజు యాడాది పండుగ అని చేస్తారు. ఆ రోజు ఎంత సంతోషంగా, సుఖంగా ఉంటే సంవత్సరం పొడుగునా ఉంటామని అభిప్రాయం. పని వాళ్లకు బోజనాలు పెట్టి గుడ్డలు ఇస్తారు.
ఇవన్నీ మా అత్త పెద్దపండుగ, సంక్రాంతి రోజున పిండి వంటలు, పప్పు, బెల్లం నిప్పట్లు, నెయ్యి దండిగా పోసి కలిపి అన్న తింటున్నప్పుడు చెప్పింది ఆశ్చర్యంగా వింటుండి పోయాము.
మనసంతా ప్రభాకర్ మీద ఉంది. సందు చూసుకుని లగెత్తాము, వాళ్ళ ఇండ్లు ఊరికి దూరంగా ఉంటుంది. వెళ్లేసరికి తలుపు ఓరగా వేసుంది. వాళ్ళింటిలోకి పోడానికి అడ్డామే లేదు. ఈ సారి ఎదో బెరుకు !!
అయినా తొంగి చూసాము. అమ్మా కొడుకు పడుకోనుండారు.
వాళ్ళమ్మ లేస్తుందేమో నని కర్ర పుల్లతో మెల్లగా వాడికాలు గీసాము. చటుక్కున బిత్తరపోతూ లేచి మమ్మల్ని చూసి అదాట్టుగా వచ్చి, ” అబ్బాయ్యా ” అని వాటేసుకుని ఏడవడం మొదలు పెట్టాడు.
ఇంతలో వాళ్ళమ్మ లేచి, ” అబ్బయ్యా ! శీనయ్యా! ఎప్పుదోచ్చినావో! అందరూ బాగుండారా ! “ అని నవ్వుతూ అడిగింది. ఆశ్చర్య పోయాను. వీడు నిలప కుండా ఎడుస్తుంటే అన్నీ పోగొట్టుకున్న ఆమె ధైర్యంగా మామూలుగా ఉంది.
“రేయ్ ! ప్రభా! లేరా ! ఏందీ ! ఆ అబ్బయ్యను పట్టుకుని అతుక్కుపోతావో! లే! ఎదవా ! ఇదాబ్బయ్యా వీడి దరువు. బడికి పోరా అంటే పోనంటాడు. ఆడుకో పోరా అంటే పోడు. తిండి తినరా అంటే తినడు. ఏగలేక చస్తున్నా!! నువ్వయినా చెప్పబ్బయ్యా అట్లుండకూడదని. తీసుకుపో బయట ! నీ మాట ఇంటాడు. పోరా అబ్బయ్యతో కూడా! ఏడ్చింది చాలుగానీ. పో!” గట్టిగా చెప్పింది వాళ్ళమ్మ.
నమ్మలేక పోయాను. వాళ్ళమ్మ పంపించడం లేదుగావాలా అనుకుంటుంటే ఇదేవిటి?
నేను ఉమా వాడ్ని వదల్లే ! ఎంత సేపు ఏడుస్తూ రానని మొండికేసాడు. నీతో ఇంక పలకం నువ్వు మాజట్టులో వద్దు అని బెదిరించాము. ” ఇంకా ఉండా వేన్దిరా ! పో “ అని కొడుకుని కసిరింది.
చివరకు కష్టంగానే కదిలాడు. దారిలో నేను ఉమా వాడ్ని మామూలు చెయ్యాలని ఎన్నో చెప్పాము. కదల్లేదు. రేపు దామర గుంటకు పోయి పెద్ద తామర పూలు కోసుకొచ్చి పశువుల పండుగ రోజు మెడలో కొమ్మలకు కట్టుదాము అక్కడనుంచి తోటకు పోయి తేగలు, ఎలాక్కాయలు, పెద్ద ఈతకాయలు తెస్తాము అంటే కొంచెం కదిలాడు.
అంత ఇష్టం నేనంటే ! ఇంకా మాటల్లో మునిగి పోయాం. నడుస్తున్నాము. దారిలో ఊరి అరుగు !! పని లేక తీరిక ఉన్న వాళ్ళు అక్కడ చేరి పేపర్లో వచ్చిన వార్తలు రాజకీయాలు ఆ ఇంటి భాగోతం ఈ ఇంటిది చెవులు కోసుకుంటారు. పెద్దగా మాట్లాడుతూ నవ్వుకుంటున్నారు. వాళ్ళను చూడంగానే ప్రభాకర్ అడుగు వెనక్కు వేసాడు. ఏందిరా అంటే చూపించాడు. “చా.. వాళ్ళేం చెయ్యరు. రా!” అని లాగాను.
భయంగానే తలొంచుకుని నడుస్తున్నాడు. వాళ్ళు అందరూ మాటలు నిలిపి మమ్మల్నే చూస్తున్నారు. నేనెవరో వాళ్లకు తెలుసు.
ఇంతలో ఒకతను. ‘వాడితో ఎందుకబ్బాయ్యా ! చెడి..’ ఇంకా మాట పూర్తికాలేదు. “నీది నువ్వు చూసుకో ! నాకు తెలుసు. ” అన్నాను వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ
“అది కాదబ్బయ్యా !.. చెడిపోయినోళ్ళు.. వాళ్ళ అక్క.. ఇక వాళ్ళమ్మ.. ”
అంతే రాయి జవురుకున్నాడు ప్రభాకర్, “పోయ్యా ! మాకు తెలవదా! నీ సంగతి చూసుకో పో !”
అంతే వాడి మీదకు దూకారు అందరూ వాళ్ళ అమ్మను, అక్కను బండ బూతులు మాట్లాడుతూ!
అంతే వాడి చేతిలోని రాయి పెరుక్కుని గట్టిగా విసిరికొట్టా ! ఒకతనికి తల్లోనుంచి రక్తం కార సాగింది. ఇంకేముంది అందరూ కొట్టడానికి వచ్చారు. కానీ నా మీదకు వచ్చే ధైర్యం లేక వాడి మీద పడ్డారు.
వాడికి అడ్డు నిలబడి దెబ్బలు తింటూ ఇంటికి పరుగెత్తాము. వాళ్ళూ తరుముకుంటూ వచ్చారు. ఈ గలబాకు మా మావ వాకిటికి వచ్చాడు. వాళ్ళు చూసి తగ్గి, “చూడయ్యా! వీళ్ళు నెత్తురు.. రాయితో.. !వాడ్ని వదిలి పెట్టకూడదు” కోపంతో రగిలి పోతున్నారు.
“కొట్టింది నేనుకదా వాడ్ని అంటావెందుకు ?” అని తిరుకున్నాను నేను.
“రాయి ఇచ్చింది వాడు కదా ! తిట్టింది వాడు కదా!” అందరూ అరిచారు.
మేం ఎదో చెప్ప బోతే మమ్మల్ని కసురుకుని ఇంట్లోకి పొమ్మని తోసాడు మావ. మా అత్త ఎదురుగా వచ్చి మాట్లాడకుండా వాళ్ళ దగ్గరకు పోయింది. ఏం చెప్పారో ఏమో వెళ్ళిపోయారు.
లోపలి వచ్చి, ’ పోకిరి పనులు చేసారంటే ఉప్పుపాతర వేస్తాను. ” అని గట్టిగా అరిచాడు మావ.
“వాళ్ళు మాత్రం తప్పుడు మాటలు అమ్మను, అక్కను అనొచ్చా” తిరుకున్నాడు ఉమా!
ఆశ్చర్య పోయాను. వాడెప్పుడు మావకు ఎదురుచెప్పింది నేను వినలేదు. ముదిగారమంతా అమ్మ దగ్గరే!
“అవును కదయ్యా ! అసలే వాళ్ళ నాయన చచ్చి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. ఆ గాడిదలకు బుద్దిలే ! చిన్న పిల్లాడిని అంతంత మాటలంటే ఎట్టా? మీరు నాలుగు తగిలించి పంపించి ఉండాల్సింది. ” అంది అత్త.
దానికి ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు మావ
సాయంకాలం వరకు పొద్దే తెలియాలా ! ఉన్నట్టుండి ప్రభాకర్ ఏడుస్తూ కూర్చున్నాడు. ఏవిటో తెలియక చెప్పమని వందసార్లు అడిగాము. నోరు మెదపలేదు ఏడుపు నిలపలేదు. అత్త అడిగింది. మావా అడిగాడు. నోరు ఇప్పకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు.
కోపం వచ్చి మావ గట్టిగా కసురుకున్నాడు.
అంతే బోరున ఏడుస్తూ, “ మీరెళ్ళి పోతే నన్ను పట్టుకుని కొడ్తారు. మా అమ్మను చంపేస్తారు “ అంటూ మళ్ళీ ఎత్తుకున్నాడు. నిజమే! వాళ్ళకు దొరికితే అంతే !! ఉమా వైపు చూసాను. భయంగా నావైపు చూస్తున్నాడు. ఇద్దరంగలిసి అత్తా మామ వైపు చూసాము.
“మేమూ వస్తాము పద ఎవరడ్డ మోస్తారో!” అన్నాను మొండిగా నేను.
చిరాకనిపించినట్లుంది అత్తకు. కానీ వాడు చేసింది తప్పు అనిపించలేదు. “వాళ్ళు అనుండకూడదు. చిన్న బిడ్డ!’ అంది మావను చూస్తూ అత్త. ఎం చెయ్యాలో అర్ధంగాక విసుగ్గా ఉన్నాడు
“ఎందుకురా వాడ్ని తీసుకొచ్చారు “ అని నా మీద అరిచాడు మావ.
“బలే ఉందయ్యా! వాడు ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే వదిలెయ్యమంటా ? ఇక బయట ముఖం కూడా చూపించకూడదా? అక్కడే మగ్గి చావాలా? ఏం తప్పుచేసారు.. నోళ్ళు ఉండాయికదా అని వాగితే, వీళ్ళ భాగోతాలు ఇప్పితే తెలుస్తాది. ఎదవలు !! పద్దతిగా బతికినోళ్ళయితేకదా !” విసురుకుంది అత్త.
అంతే బుజాన తువ్వాల యేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు మావ. అలిగి పోయాడా అని భయంగా అత్తా వైపు చూసాను. ఆమె నెమ్మదిగా ఉంది. చాలా సేపటికి మావ, మేము కొట్టిన మనిషిని తీసుకొచ్చాడు. ఈ సారి నేనూ బయపడ్డాను. ప్రభాకరెల్లి మూల దాక్కున్నాడు.
“ ఏం అనడు రా!” గట్టిగా అరిచాడు మావ.
వాడు వణుకుతూ చేతులు కట్టుకుని మెల్లగా వస్తూ, “అమ్మనంటే బాదేసిందయ్యా! కొట్టాలని కొట్టలేదు.” అన్నాడు నా వెనుక దాక్కుంటూ.
“ఏం రంగయ్యా పిల్లోడి దగ్గర ఏం మాటలు? యాడ నేర్చుకున్నావు. పాతరెయ్యిస్తా! వొళ్ళు దగ్గర పెట్టుకో ! ఆడోళ్ళ గురించి మాట్లాడటం తప్పు. ఎంత బాధ పడ్డాడు. బతినంత కాలం గుర్తుంటాయి. తీసుకు పోయి ఇంటికాడ దింపేసి రా!! ఇదిగో ఇవి ఆ పిల్లకు ఇవ్వు. ” అంటూ అత్త సంచి తిను బండారాలు ఇచ్చింది.
“తప్పయి పోయిందమ్మా! ఎదో వాగేసా.. రా ! అబ్బయ్యా పోదాం “ అంటూ ప్రభాకరుడ్ని పిలిచాడు అతను. ఉమా వైపు నా వైపు చూసి అత్తమామల్ని చూసాడు.
“భయం లేదు అబ్బయ్యా! ఏం అనుకోబోక. మీ అమ్మతో చెప్పమాక. “ అంటూ దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడిచాడు.
ముఖాన్ని తుడుచుకుంటూ, “రేపోస్తానబ్బయ్యా! రా! మావా పోదాం!” అని రంగయ్య చేయి పట్టుకుని ముందుకు నడిచాడు. నేను ఉమా గట్టిగా గాలి పీల్చి వదిలి అత్త వైపు మావ వైపు సంతోషంగా చూసాము.
మరుసటి రోజు ఉదయ్యాన్నే ఎగురుతూ వచ్చాడు ప్రబాకర్. నాకు చాలా సంతోషం వేసింది.
హరి దాసు, తలమీద రాగి చెంబు నుదుటన మూడునామాలు ఒక చేతిలో చిడుతలు మరో చేతిలో తంబురా !
‘రావమ్మా మహాలక్ష్మి’ అని స్తుతిస్తూ రామదాసు కీర్తనలు పాడుతూ వచ్చాడు. ఎంతగా ఎగిరామో ఆ పాటకు.. తంబుర చిడతల శబ్దానికి !! మా అత్త రెండు చేటలనిండా బియ్యం, తినుబండారాలు, వంట దినుసులు అన్నీ ప్రభాకర్ చేతికిచ్చి ఇవ్వమంది. హరిదాసులు ఇస్తే తీసుకుంటారట. అడగరట.. వెళుతూ వెనక్కి చూడరు. మన ఇచ్చింది వాళ్ళు తినరు. భద్రాచలం వెళ్లి అన్నదానం చేస్తారని అత్త చెప్పింది..
హరిలో రంగ హరి !! క్రిష్ట్నార్పణ మస్తు అంటూ శుభం శుభం. చిరంజీవ చిరంజీవ అంటూ అందరిని ఎంతగా ఆశీర్వదించాడో! వాడు సంతోషంతో ఏడవటం ఒక్కటే తక్కువ. పడి పడి మొక్కాడు. అందరి కళ్ళల్లో భోగి సంక్రాంతుల వెలుగు కనిపించింది. రావమ్మా మహలక్షి రావమ్మా అంటూ హరిదాసు వెళ్ళిపోయాడు.
సమాప్తం
డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి..
నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.
30/10/2022 న మనతెలుగుకథలు.కామ్ వారిచేత సన్మానింపబడి ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

Comments