top of page

రెడ్డమ్మ కొండ!

#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #ReddemmaKonda, #రెడ్డమ్మకొండ, #తెలుగుపల్లెకథలు


Reddemma Konda - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah

Published In manatelugukathalu.com On 27/05/2025

రెడ్డమ్మ కొండ - తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



నేను మా మనుమరాలు పని మీద బెంగళూరు పోయి పని ముగించుకుని తిరుగు ప్రయాణమైనాం. మేమెక్కిన బస్సు హొస్కోట దాటి సిటీ వెలుపల మదనపల్లె రూటులో వేగంగా పరుగులు పెడుతున్నది. మా మనుమరాలు శాన్విక బ్యాగులోనుంచి బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ బయటకు తీసి నాకు కొన్ని బిస్కెట్లు ఇచ్చింది. ఇద్దరం బిస్కెట్లు తిని నీళ్ళు తాగాము. శాన్వి విరామంగా సీటుపై ఒరిగి కళ్ళు మూసుకుంటూ…


"తాతయ్యా! ఇంగిప్పుడు చెప్పు తాతయ్యా! మన ఊరు ప్రొద్దుటూరు గురించి చెప్పు తాతయ్యా!. మన ఊరికి చారిత్రకంగా గానీ, పౌరాణికంగా గానీ, సాంస్కృతికంగా గానీ, వ్యాపార పరంగా గానీ ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా తాతయ్యా!" అడిగింది శాన్వి తెలుసుకోవాలన్న కుతూహలంతో…


"ప్రొద్దుటూరుకు చాల ప్రత్యేకతలు ఉన్నాయి శాన్వీ. రాయలసీమలోనే ప్రాముఖ్యత కలిగిన పట్టణం ప్రొద్దుటూరు. వ్యాపారంలో సెకండ్ బాంబేగాను, సాంస్కృతికంగా రెండవ మైసూరుగాను పిలుస్తారు. బంగారు వ్యాపారం ఎక్కువగా ఉండడం వల్ల దీనిని పసిడిపురి అని కూడా అంటారు.బంగారం తరువాత స్థానం వస్త్ర వ్యాపారానిదే. పత్తి మిల్లులు, నూనె మిల్లులు, రైస్ మిల్లులు అధికంగా ఉన్నాయి.

' ప్రొద్దుటూరుకు వచ్చిన మనిషి, పోట్లదుర్తి వచ్చిన కుక్క ఎప్పటికీ పోవంట' అనేది ఇక్కడి నానుడి. దీని అర్థం ఏమిటంటే ప్రొద్దుటూరు వచ్చిన మనిషికి చేతినిండా పని దొరుకుతుంది. పోట్లదుర్తి వచ్చిన కుక్కకు కడుపునిండా తిండి దొరుకుతుంది కారణం పోట్లదుర్తి దగ్గర నాపరాళ్ళు గనుల్లో పనిచేసే కూలీలు అన్నం తినేటప్పుడు తలాయింత కుక్కలకు వేస్తారు కాబట్టి.


ప్రొద్దుటూరు సాహిత్య కేంద్రం కూడా. కొడవలూరు రామచంద్రరాజు, ధుర్భాక చంద్రశేఖరశర్మ, గడియారం వెంకటశేషశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు ఇంకా ఎందరో పద్యకవులు అవధానాలు నిర్వహించేవారు. రారా(రాచమల్లు రామచంద్రారెడ్డి) యంవి రమణారెడ్డి, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి మొదలైనవారు అభ్యుదయ సాహిత్య సభలు ఏర్పాటు చేసేవారు. 


వర్తమానంలో నరాల రామారెడ్డి, దాదా హయాత్, కొమ్మిశెట్టి మోహన్, ఏసి దస్తగిరి, చదువులబాబు, షేక్ఫీర్ల మహమూద్, పల్లా వెంకటరామారావు గార్లు సాహిత్య సమావేశాలు, పుస్తక ఆవిష్కరణలు జరిపేవారు. వీరికి నేను ఎదురు పడినప్పుడు "కాశీవరపు వెంకటసుబ్బయ్య గారు బాగున్నారా! మీ కథ, కవితా సాహిత్యం ఎలా ఉంది అనేవారు, నేనూ అంతే గౌరవంగా సమాధానం చెప్పేవాడిని.


ఈ ఊరికి ప్రొద్దుటూరు అని పేరు రావడానికి ఒక ఐతిహ్యం ఉంది. పవిత్ర పినాకిని (పెన్మా నదికి పౌరాణిక నామం) ఒడ్డున వెలసింది ప్రొద్దుటూరు. దీనిని అతి ప్రాచీన కాలంలో పొదలతో నిండి ఉండడం వలన పొదలకూరు అనే పేరుతో పిలిచేవారు.


త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ వధ అనంతరం పుష్పం విమానంలో అయోధ్యకు సీతా సమేత, సహచర బృందంతో పోతూ పొదలకూరుకు వచ్చేసరికి ప్రొద్దుపోయి సాయంసంధ్య అయ్యింది. పెన్నా నదీమతల్లి ఒడ్డున దిగి సంధ్యవార్చకొని శివార్చన చెయ్యాలనుకుంటే శివలింగం లేదు. శ్రీరామచంద్రుడు హనుమంతుడిని పిలిచి రామేశ్వరం పోయి శివలింగం తెమ్మన్నారు. 


హనుమంతుడు ఆగమేఘాల మీద రామేశ్వరం పోయి వచ్చేసరికి ఆలస్యం కొద్దిగా అయ్యింది. ప్రొద్దు క్రుంకుతున్నందున ఇతరుల సలహాపై పినాకిని ఇసుక తిన్నెపై సైకత లింగాన్ని రూపొందించుకొని పూజ చేశాడు శ్రీరామచంద్రుడు. అప్పడే శివలింగంతో వచ్చిన ఆంజనేయుడు ఆగ్రహించి తాను తెచ్చిన శివలింగాన్ని విసిరివేయగా అది ఇరవై పరుగుల దూరంలో పొదల్లో పడింది.


"ఆంజనేయ ఆగ్రహించకు!. ప్రొద్దు క్రుంకుతున్నందున, సూర్యాస్తమయానికి ముందే పూజ చేయాలి కాబట్టి ఇలా చేశాను. ఈ సైకతలింగాన్ని రామలింగేశ్వరుడుగా ప్రసిద్ధి అవుతుంది.ఈ ప్రాతాన్ని ముక్తి రామేశ్వరం అని పిలుస్తారు. నీవు తెచ్చిన శివలింగాన్ని రాబోయే కాలంలో అగస్త్య మహర్షిచే ప్రతిష్టింపబడి అగస్త్యేశ్వరుడు అనే పేరుతో పూజలు అందుకుంటుంది. మనం ఇక్కడికి రావడంతో ప్రొద్దు క్రుంకింది కనుక ఈ పొదలకూరును ఇప్పటి నుండి ప్రొద్దుటూరు అని వాసికెక్కుతుంది" అని సెలవిచ్చి తన పరివారంతో వెళ్లిపోయాడు శ్రీరామచద్రుడు. తరువాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు రామలింగేశ్వరుడికి అందమైన దేవాలయము నిర్మించాడు.


ప్రొద్దుటూరు అనేక పురాతన కట్టడాలతో, దేవాలయాలతో నిండి ఉంది కాబట్టి పర్యాటకంగా కూడ ప్రాచూర్యం పొందింది. పినాకిని నదికి దక్షిణ వైపు ఐదు కిలోమీటర్ల దూరాన కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ దేవాలయంలో రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన తొలి తెలుగు శాసనం, దానికి పది కిలోమీటర్ల దూరంలో యర్రగుడిపాడు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో రెండవ తెలుగు శాసనం ఉండడం వల్ల ప్రొద్దుటూరుకు వచ్చిన పర్యాటకులు వీటిని కూడా చూస్తుంటారు" అని చెప్పడం ఆపాను.


"సంక్షిప్తంగానైనా సమగ్రంగా చెప్పావు తాతయ్యా! ప్రొద్దుటూరు మీద ఒక పుస్తకం రాయకూడదా తాతయ్యా!" అని సలహా ఇచ్చింది శాన్వి.


"చూస్తాం శాన్వీ." అన్నాను.


"తాతయ్యా! పెన్నానది అని పిలువబడే ఈ పినాకిని గురించి షార్టుగా చెప్పు తాతయ్యా!" అడిగింది శాన్వీ.


"పెన్నానది రాయలసీమలో ప్రధానమైన నది. సీమ మధ్య భాగంలో ప్రవహిస్తుంది. నీటి ప్రవాహం తక్కువైనా ఈ పరివాహక ప్రాంతానికి ఇదే పెద్ద దిక్కు.


కర్నాటకలోని చెన్నకేశవ కొండల్లో నంది హిల్స్ దగ్గర ఈ నది జన్మస్థానం. శివుడు నందికొండపై ప్రళయ తాండవమాడి తన ఆయుధమైన పినాకితో భూమిపై గ్రుచ్చగా నీటి బుగ్గగా పుట్టి వంకై, వాగై, ఏరై, నదై ఉత్తరదిశగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తుంది. ఈ నదిని శివుని ఆయుధమైన పినాక వలన జన్మించినది కనుక దీనికి పినాకిని అని పేరు వచ్చింది. 


కర్నాటకలో ఈ నదిని హెన్నా అంటారు. ఆంధ్రప్రదేశ్ లో పెన్నా అని పిలుస్తారు. అనంతరం జిల్లాలో జయమంగళ ఉపనది వచ్చి పెన్నానది కలుస్తుంది. కడపజిల్లాలో అడుగు పెట్టాక చిత్రావతి, పాపాఘ్ని, కుందూ, సగిలేరు, చెయ్యేరు మొదలైన నదులు పెన్నానదిలో సంగమిస్తాయి. నెల్లూరు జిల్లాలో బొగ్గేరు, కండలేరు కలుపుకొని ప్రవహించి ఉరుటూరు దగ్గర బంగాళాఖాతం సంగమిస్తుంది.


పెన్నానదిపై అనంతరంజిల్లాలో పెనకచర్ల దగ్గర ఒక మధ్య తరహా ప్రాజెక్టు, కడపజిల్లాలో గండికోట ప్రాజెక్టు, మైలవరం ప్రాజెక్టు, నెల్లూరుజిల్లాలో సోమశిల ప్రాజెక్టు, సంగం బ్యారేజి నిర్మించారు, వీటి క్రింద లక్షలాది ఎకరాలు సాగుతున్నది.


అనంతపురంజిల్లాలో ఈ పినాకిని నది ఒడ్డున ప్రసిద్ధ దేవాలయాలైన పెన్నాహోబిళం, బుగ్గ రామలింగేశ్వర ఆలయం, కడపజిల్లాలో ముక్తి రామేశ్వరం దేవాలయాలు, పుష్పగిరి దేవాలయములు, నెల్లూరుజిల్లాలో రంగనాథస్వామి, జొన్నవాడ కామాక్షి దేవాలయాలు నిర్మాణమై ఉన్నాయి" అని చెప్పి శాన్వి వైపు చూశాను.


"తాతయ్యా! పెన్నా నదీమతల్లి గురించి సంపూర్ణంగా తెలియడం సంతోషంగా ఉంది తాతయ్యా!" ఆనందపడుతూ బస్సు కిటికీ గుండా పరిసరాలను గమనిస్తూ ఉండిపోయింది.

బస్సు హెచ్ క్రాస్, చింతామణి, రాయల్పాడు, బార్డర్ చెక్ పోస్టైన సిగిరిబయలు దాటి ఆంధ్రలోని మదనపల్లిలో ప్రవేశించింది.


"తాతయ్యా! మదనపల్లె కూల్ ఏరియా కదా! ఈ ఊరు గురించి చెపుతావా తాతయ్యా!" అని అడిగింది.


ఒకప్పుడు మదనపల్లె శీతల ప్రదేశం. టిబి జబ్బుకు మందులు అంతగా లేని కాలంలో ఇక్కడ చాల పెద్ద టిబి ఆసుపత్రి ఉండేది. దేశ విదేశాల టిబి రోగులు ఇక్కడికి వచ్చి బాగు చేయించుకొని పోయేవారు. మందులతో పాటు చల్లదనం కారణంగా జబ్బు నయమయేది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగిపోయి చల్లదనం తగ్గిపోయింది.

ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఈ ఊరి వాడే. ఈయన మదనపల్లెకు దగ్గర్లో ఉన్న సుందరమైన ప్రదేశం రిషి వ్యాలీలో ప్రపంచ ప్రామాణాలతో తగ్గకుండా ఒక గొప్ప స్కూలును నిర్మించారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన క్రీ.శే. కోట్ల విజయభాస్కరరెడ్డి ఈ స్కూల్లోనే చదివారు. ఆనాడు విజయభాస్కరరెడ్డి మదనపల్లెలో జరిగిన ఒక స్వాతంత్రోద్యమ ర్యాలీలో పాల్గొనగా పోలీసులు విపరీతంగా కొట్టారంట. చనిపోయాడనుకొని పోలీసులు వేళ్ళిపోయాక, కొన ఊపిరితో ఉన్న ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా బతికారంట.


మదనపల్లె టమోటాలకు పెద్ద మార్కెట్. ఇక్కడి నుంచి టమోటాలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ టమోటా ప్రాసెస్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నట్లు ఉన్నాయి.


మదనపల్లెకు సమీపంలో ఉన్న హార్సిలీ హిల్స్ పైన ఏకాలమలోనైనా చాల చల్లగా ఉంటుంది. ఇది ఆంధ్రా ఊటీగా, వేసవి విడిదిగా ప్రసిద్ధి చెందింది. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొండపైన రకాల గెస్ట్ హౌస్సులు, వినోదం ప్రదర్శనశాలు ఉన్నాయి. ఈ కొండను మునుపు ఏనుగు లక్షుమ్మ కొండ అనేవారు. ఆమెకు ఒక గుడి కూడా కొండపై ఉంది.


మదనపల్లె ముందటి కాలంలో కడపజిల్లాలో భాగంగా ఉండేది. బ్రిటిష్ కాలంలో కడప కలెక్టర్ హార్సిలీ ఈ కొండను వేసవి విడిదిగా చేసుకుని బంగ్లా కట్టుకున్నాడు. అప్పటినుండి హార్సిలీ దొర వేసవి కాలం ఇక్కడే గడపడం వల్ల ఈ కొండకు హార్సిలీ హిల్స్ అనే పేరు స్థిరపడింది.ఇది మదనపల్లె కథ." అంటూ చెప్పాను.


"ఇంట్రెస్ట్ గా ఉంది తాతయ్యా!" అంది శాన్వి.


బస్సు ముందుకెళ్ళి గుర్రంకొండ చేరుకుంది. గుర్రంకొండ రోడ్డు పక్కనే నిలువుగా చాల ఎత్తుగా ఉండడం చూసి శాన్వి "ఏంది తాతయ్యా! ఈ కొండ ఇంత నిలువుగా నిటారుగా ఉందీ?" అంది ఆశ్చర్యపోతూ.


ఇదే గుర్రంకొండ కోట. ఇంత నిటారుగా ఉన్న కొండను ఒక గుర్రం పైకి ఎక్కడం వల్ల దీనికి గుర్రంకొండ అని పేరొచ్చింది. కొండపైన, కొండకింద కోట రాజ భవనాలు, అంతఃపురాలు ఉన్నాయి. ఈ గుర్రంకొండ కోటను నవాబులు పాలించారు. అంతకు మునుపు ఈ కోటను నిర్మించి ఏలిన వారు హిందూరాజులు. ఈ కోటను చూడటానికి పర్యాటకులు బహుళ సంఖ్యలోనే వస్తుంటారు.


"అలాగా! తాతయ్యా! బాగుంది" మెరిసే కళ్ళతో శాన్వి అంది.


మరికొంత సమయానికి చర్లోపల్లికి చేరింది బస్సు. ఊరు పక్కన ఉన్న రాతి కొండను చూసి శాన్వి "ఎంత పెద్ద రాతికొండో! అంతా ఒకే రాయిలా ఉంది. కొండపై ఎక్కడేగానీ చెట్లు చేమలు లేవు. వాన పడితే కిందికి జారిన చారలు కూడా కనబడుతున్నాయి. ఇలాంటి రాతికొండ ఉండడం అరుదు కదా తాతయ్యా!" అంతులేని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ అడిగింది శాన్వీ.


"అవును! ఇలాంటి రాతికొండ ఉండడం అరుదే. ఈ రాతికొండను రెడ్డమ్మ కోన లేదా రెడ్డమ్మకొండ అంటారు”.


"ఔనా! అయితే ఆ రెడ్డమ్మ కథేంటి తాతయ్యా!”


“ఈ కొండ దేవత రెడ్డమ్మ. ఈమెకు సంతాన దేవత అని పేరు ఉంది. ఈ దేవతను సంతానం కోసం వచ్చి ప్రార్థిస్తే తప్పకుండా పిల్లలు పుడుతారు. ఇక్కడికి రావడానికి కులం మతం భేదం లేదు. అయితే పుట్టే పిల్లలకు మాత్రం పేరుకు ముందు రెడ్డి పదం పెట్టాలనేది నియమం. ఉదాహరణకు రెడ్డినాయుడు, రెడ్డిపరెడ్డి. రెడ్డి బాషా, రెడ్డి జోసెఫ్ ఇలాగన్న మాట.


రెడ్డమ్మది చెర్లోపల్లె దగ్గర ఉన్న యల్లంపల్లె. ఈ పల్లేలో యల్లంరెడ్లు ఎక్కువగా ఉంటారు. యల్లంపల్లె పాడిపంటలకు, పాడి ఆవులకు కొదువ ఉండదు.


ఈ యల్లంపల్లెలో రామిరాడ్డి అనే మోతుబరి రైతు, ఆయన భార్య నాగమ్మ పేదసాదలను ఆదరించి ఆదుకుంటూ ఉండేవారు. వారికి ఇద్దరు కుమారులు... ఒక అందాల భరిణె, అపరంజి బొమ్మ అయిన కూతురు ఉండేది. ఆమె పేరే రెడ్డెమ్మ. చిన్నప్పటినుంచీ ఆ గ్రామ ప్రజలంతా రెడ్డెమ్మను చాలా ప్రేమగా, గౌరవంగా చూసుకుంటూ ఉండేవాళ్లు. 


రెడ్డమ్మ మొదటి నుంచి దయ, కరుణామూర్తి, సత్ప్రవర్తన సద్బుద్ధి, పరోపకార దృష్టి, సేవాభావం కలిగినది. దైవభక్తి పాపభీతి ఉన్న ఆద్యాత్మిక భావనలతో నిండిన పరిపూర్ణ స్త్రీమూర్తి రెడ్డమ్మ. ఉత్తమ మార్గంలో పెరిగి పెద్దదైంది రెడ్డమ్మ.

తల్లిదండ్రులు పొలంపనుల్లో మునిగి ఉండగా రెడ్డెమ్మ ఊరిపక్కనే పండిన జొన్నచేను వద్దకెళ్లి, మంచమీదికెక్కి "వడిసెల" తిప్పుతూ పక్షులను పారద్రోలుతూ ఉండేది. అలా ఒకరోజు వడిసెల తిప్పుతూ పక్షులను పారద్రోలుతున్న రెడ్డెమ్మను గుర్రంకొండ పాలిస్తున్న నవాబు తన సైనికులతో ఆ దారిన పోతూ కుందనపు బొమ్మ, అందాల రాశి అయిన రెడ్డమ్మను చూశాడు.


కామాంధుడు, దురాంకారి, కండకావురం ఉన్న నవాబు అద్భుత సౌందర్యరాశి అయిన రెడ్డెమ్మను ఎలాగైనా సరే పొందాలనే దురుద్దేశ్యంతో సైనికులతో కలిసి నవాబు ఆమెను బలవంతంగా వశపరుచుకోవాలని ఆమెను సమీపించాడు.


అది గమనించిన రెడ్డెమ్మ మంచె పైనుండి దూకి కొండవైపు పరుగెడుతూ పారిపోయింది. పంటచేలలో పడుతూ, లేస్తూ పరుగు పెడుతున్న రెడ్డెమ్మకు ఏంచేయాలో బోధపడక... "పరమశివా, పార్వతి మాతా నన్ను కాపాడు తల్లీ..." అంటూ బిగ్గరగా వేడుకుంది.


నవాబు గుర్రం మీద ఆమె వెంట పడ్డాడు. రెడ్డమ్మ చిక్కకుండా వేగంగా పరిగెడుతూ కొండ దగ్గరి వచ్చింది.


"ఓ పర్వత రాజమా! నేను పవిత్రురాలునైతే, నేను భక్తిపరురానైతే, నేను పరోపకారం కలిగిన దానినైతే, నీ లోనికి దారిచ్చి నా పవిత్రతను కాపాడు కొండ దేవరా!" అని రాతికొండను వేడుకుంది రెడ్డమ్మ.

వెంటనే భూమి కంపించేలా భయంకరమైన శబ్దంతో రెడ్డెమ్మకు ఎదురుగా ఉండే కొండ నిట్టనిలువునా చీలిపోయింది. వెంటనే ఆ కొండ చీలికలోకి ఆమె దూరిపోయింది. ఇంతలోపల గుర్రంపై నవాబు విడివిడిగా వచ్చి ఆమె శిగను అందుకున్నాడు. సిగలో కొంత భాగం తెగి అతని చేతిలోకి వచ్చింది.


విస్తుపోయిన నవాబు విభ్రాంతి గురై "స్త్రీల శీలానికి ఇంతటి పవిత్రతనా, ప్రకృతినే శాసించే అంత శక్తి ఉంటుందా" అనుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడు దుర్మార్గుడైన నవాబు పాపం ఫలించి మరుసటి సంవత్సరం టిప్పుసుల్తాన్ గుర్రంకొండ కోటపై దండెత్తి నవాబును పారద్రోలి కోటను కైవసం చేసుకున్నాడు.


రెడ్డమ్మ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, ఊరి ప్రజలు భోరున విలపించారు. రెడ్డమ్మ ఆరాత్రి తల్లి నాగమ్మ కలలో కనిపించి "తన గురించి బాధపడవలదు! ప్రజలందరినీ కాపాడుతూ, కష్టాల నుంచి రక్షిస్తూ తరతరాలుగా ఈ కొండలోనే కొలువై ఉంటాను. కాబట్టి నాకై విలపించవలదు" అని పలికింది. 


అది విన్న ప్రజలంతా తెల్లవారగానే కొండవద్దకు వెళ్ళి "రెడ్డెమ్మతల్లీ మమ్మల్ని కాపాడు తల్లీ" అంటూ వేడుకున్నారు.


ఇక అప్పటినుంచి రెడ్డెమ్మ "దేవత"గా వెలిసింది. కోరిన కోర్కెలు తీరుస్తూ, ప్రజలను ఆదుకుంటూనే వస్తున్నది.

ఇది జరిగి ఇప్పటికి మూడు వందల సంవత్సరాలు దాటినా, రెడ్డెమ్మ తల్లి మాత్రం "సంతాన దేవత"గా ప్రజలచే నిత్యపూజలు అందుకుంటూనే ఉంది. 


ప్రతి ఆదివారం వేలసంఖ్యలో సంతానం లేని స్త్రీలు రెడ్డెమ్మకు సాగిలపడుతున్నారు. వారి కోర్కెలూ తీరుతున్నాయి.


ఇది ఏ సైన్సుకూ అందని సత్యం అని చెప్పడం మినహా... ఎవరూ ఇంకేమీ వ్యాఖ్యానించలేరంటే, అతిశయోక్తి మాత్రం కాదు. అందుకేనేమో... "ఎక్కడైతే సైన్స్ అంతమవుతుందో.. అక్కడే ఫిలాసఫీ ప్రారంభమవుతుందని" శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారేమో...!!" అంటూ చెప్పడం ముగించి శాన్వికను చూశాను ఏమంటుందో అని.


"తాతయ్యా! ఎంత గొప్ప స్థలపురాణం చెప్పావు తాతయ్యా! చరిత్రకు ఎక్కని ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్ని మరుగునపడి ఉన్నాయో!" అన్నది శాన్వి. శాన్వి ముఖంలో విషాద ఛాయలు కనిపించాయి.


"ఇక కొద్దిసేపు నిద్రపో శాన్వీ! ఇంకా మూడు గంటలు పడుతుంది బస్సు ప్రొద్దుటూరు చేరడానికి" అనగానే కళ్ళు మూసుకుంది శాన్వి.


నేనుకూడా సీటుమీదికి వాలి నిద్రపోయాను.


 -------


కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:


పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.

పుట్టింది  1960లో.

చదివింది డిగ్రీ.

నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.

అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.

భార్య - కళావతి.

సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .

కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక

మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ

రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,

'పినాకిని కథలు' కథల సంపుటి.

రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.

సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.

పెన్నోత్సవం 2004.

జార్జి క్లబ్ వారు,

ప్రొద్దుటూరు నాటక పరిషత్.

యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.

స్నేహం సేవా సమితి.

కళా స్రవంతి.

తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.

NTR అభిమాన సంఘం.

తెలుగు రక్షణ వేదిక 

వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.

గోదావరి పుష్కర పురస్కారం.

కృష్ణా పుష్కర పురస్కారం.

స్వామి క్రియేషన్స్.

కృష్ణదేవరాయ సాహితీ సమితి.

భానుమతి స్వరం మీడియా.

కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను 

Comments


bottom of page