'Rekkalu Vacchina Pakshula Amma Nanna' written by Meegada Veerabhadra Swamy
రచన : మీగడ వీరభద్ర స్వామి
"చలిలో అంత హడావడిగా ఎందుకు! నీకు మంచుపడదని డాక్టర్లు చెప్పారుకదా!"
"డాక్టర్లు అలాగే చెబుతారు పండగ పనులు వాళ్ళు వచ్చి చేస్తారా ఏంటి!"
"పండగ పనులని ప్రత్యేకంగా ఏముంటాయి!"
"మీకు తెలీవులెండి మీరు ఎప్పుడైనా ఆ పనుల్లో సాయం చేశారా ఏంటి!"
"అయినా వేకువ నుండి రాత్రి బాగా పొద్దుపోయేవరకూ నీకు పనులేనా!"
"ఉంటాయి పండగా మజాకా!సరేగానీ వేగంగా తయారై ఆ కిరాణా సామానులు తీసుకురండి" "కిరాణా సామానుల లిస్టెంటే...ఇంత పెద్దగా ఉంది, ఏమి వండేస్తావు! పండగైనా పంక్షనైనా వున్నది ఇద్దరమే కదా! ఇంట్లో"
"ఈ రోజుకి ఇద్దరమే బోగీ ముందురోజుకి ఆరుగురం"
"అదెలా!"
"ఈసారి పండక్కి కొడుకు కోడలు మనవరాలు మనవడు వస్తున్నారు కదా!"
"అని ఎవరన్నారు!"
"అదేంటి ఆ మధ్య బాబుతో ఫోన్లో మాట్లాడి పండక్కి కోడలుపిల్లని మనవరాల్ని మనవడ్ని తీసుకొనిరా అని చెప్పారు కదా!"
"అవును చెప్పాను వాడు వస్తానన్నాడని నీకు చెప్పానా!"
"రాడని కూడా చెప్పలేదు కదా!"
"చెప్పలేదే...చెబితే నువ్వు బాధపడతావని!"
"మరి వాడురాడని పండగరోజు తెలిసిందనుకో అప్పుడు బాధపడనా!"
"పడతావ్ కానీ పండగ ముందు పదిరోజుల నుండీ బాధపడటం వేరు పండగ ఒక్కరోజు బాధపడటం వేరు,ఆరోజు పూజలు హడావడిలో బాధస్థాయి తక్కువగా వుంటుంది"
"మన ఒక్కగానొక్క కొడుక్కి పెళ్ళైన మూడేళ్ళ తరువాత నుండీ ఇది అలవాటే కదా!ఏదో నెపంపెట్టి పండక్కి రాకుండా ఎగ్గొట్టడం!"
"పెళ్ళైన మూడేళ్లు వరకూ ముక్కోమూలిగో పండక్కి వచ్చేవాడు,పిల్లలుపుట్టాక చిన్నపిల్లలతో రాలేం అనేవాడు,ఇప్పుడు సొంతంగా కారువుందికదా అందులో రమ్మంటే...కరోనా సెకెండ్ వేవ్ వస్తుంది పిల్లలతో రావడం మంచిదికాదు సారీ అనేశాడు"
"పండక్కీరాడు,మామ్మోలు రోజుల్లో అసలురాడు… కనీసం మనం చచ్చినప్పుడైనా వస్తాడోరాడో!" "పిచ్చిదానా మనం పోయాక వాడు వచ్చినా రాకున్నా ఇరుగుపొరుగువారు ఈడ్చి పూడ్చి పెట్టేస్తార్లే అప్పుడు వాడితో మనకేమిపని"
"సర్లెండి చావులు గురుంచి ఇప్పుడెందుకు గానీ వెళ్లి కిరాణాసరుకులు తెండి,పిండివంటలుచేసి పండగ తరువాతైనా మన మనవలకి మన అబ్బాయి ఆఫీస్ కొలీగ్ కి అదేనండీ మనఊరు కరణంగారి అబ్బాయి చేతికిచ్చి పంపిద్దాం,ఆ అబ్బాయి తప్పకుండా పండక్కి సొంతూరు వస్తాడుకదా! చెప్పడం మర్చిపోయాను కొడుక్కి, కోడలికి, పిల్లలకి పండగ బట్టలు తీసుకోమని డబ్బులు పంపేయండి మన తరుపున"
"అమ్మలను బాగు చెయ్యడం ఎవ్వరి తరమూ కాదు,పిల్లలు ఒక చెంపమీద కొడితే మరోచెంప చూపిస్తారు,అపర గాంధీమాతలు మీరు"
"తల్లికి పిల్లలు ఎక్కడున్నా హాయిగా ఆనందంగా ఉండాలన్నా కోరిక ఉంటుంది,తండ్రిగా మీకు మాత్రం కొడుకు మీద ప్రేమ లేదాఏంటి!"
"సర్లే ప్రేమలు గురుంచి ఇప్పుడెందుకుగానీ,ఆ లిస్ట్ తే కిరాణా సామానులు తెస్తాను, బ్యాంకుకి వెళ్లి వాడికి డబ్బులు కూడా పంపాలికదా!"
"యూ ఆర్ గుడ్ బోయ్"
"యూ టూ గుడ్ బేబీ"
…………………………
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
Comments