top of page

రుణం


'Runam' written by Kopalle Vijaya Prasad ( Viyogi )

రచన : కోపల్లె విజయప్రసాద్ (వియోగి)

ఇంటికి వచ్చిన ముకుందంకు భాస్కర్‌ చెప్పాడు, “చూడండి సార్‌! మా వాడు భలే దుబారా చేస్తూంటాడు. పాలపాకెట్లు ఎక్సట్రాగా కొని, పిల్లికి పోస్తూ ఉంటాడు. బన్నులు, బ్రెడ్డులు, బిస్కట్టులూ కొని రోడ్డుమీద తిరిగే ఒక ఊరకుక్కకు వేస్తూ వుంటాడు.”


ముకుందం ఆశ్చర్యపోయాడు “రోజూ చేస్తూ ఉంటాడా?” అడిగాడు.


“ఆ ! రోజూ ! మేము తిన్నా తినకపోయినా ఫర్వాలేదు కానీ, వాడు మటుకు అటు పిల్లిని, యిటు కుక్కను పోషిస్తూ ఉంటాడు.” అదే సమయానికి లోనుండి వరండాలోకి వచ్చాడు సుందరం.


“చూడండి అంకుల్‌ ! వాటిని మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? మనం మనుషులం కాబట్టి పంటలు పండించుకుని, వంట చేసుకుని తింటాం! పాపం! అవి అలా చెయ్యలేవు గదా?” సుందరం తనను సమర్ధించుకుంటూ అడిగాడు.


“నిజమే ! పాపం వాటికి ఎవరు పెడతారు?” వంత పాడాడు ముకుందం. “అయ్యో ముకుందంజీ! మీరు కూడా వాడిని వెనకేసుకు వస్తే ఎలా? వాడు చేస్తున్న పనులు మూలంగా, నేను అనుకోవడం, అథమపక్షం రోజుకు వందరూపాయలు వేస్టు అయిపోతున్నాయి.” భాస్కర్‌ అన్నాడు.


“అమ్మో వందరూపాయలే! అవునా సుందరం?!” ఆశ్చర్యంగా అడిగాడు ముకుందం.


“అవునంకుల్! ధరలు మండిపోతున్నాయి. ఆ మాత్రం పెట్టంది, వాటికి కొంచెమన్నా కడుపులు నిండవు.” సుందరం చెప్పాడు.


“అంటే, రోజుకు వందంటే, నెలకు మూడు వేలు. సంవత్సరానికి ముప్పది ఆరు వేలు. యిలా లెక్కేస్తూ పోతే నీ జీవితంలో...” ముకుందం ఆగాడు.


“ఆ డబ్బులు బ్యాంకులో వేసుకుంటే, వీడికి అవసరానికి ఉపయోగపడతాయి కదా! లేనప్పుడు ఎవరిస్తారు?” భాస్కర్‌ ఆవేదనతో అన్నాడు.


“అంకుల్‌ ! మనం తిండి మానేస్తే ఎంత మిగులుతుందో కూడా లెక్క వెయ్యండి. ఆ డబ్బులను బ్యాంకులో దాచుకుంటే ఎంత వడ్డీ వస్తుందో లెక్క వేయండి!” వ్యంగ్యంగా అన్నాడు సుందరం.


“ఇదండీ వీడి వరుస. మనల్ని మాట్లాడనివ్వడు.” భాస్కర్‌.


“నాన్నగారూ! నేను ఖర్చు చేస్తున్నది నేను సంపాదిస్తున్న డబ్బులలోంచే కదా? మీకెందుకు బాధ?” కోపంగా అడిగాడు సుందరం.


“డబ్బుల విషయానికి వస్తే, నీ, నా అనకూడదు. లక్ష్మీదేవి! మనం ఎంత పొదుపుగా వాడుకుంటే ఆ తల్లి అనుగ్రహం అంత ఎక్కువగా ఉంటుంది.” చెప్పాడు భాస్కర్‌.


“భాస్కర్‌! మీ వాడు చేస్తున్న పని వలన పుణ్యం వస్తుందిలే!” అన్నాడు ముకుందం. “శాస్త్రాలు చాలా చెబుతూంటాయి. అవన్నీ ఆచరించగలమా? అవన్నీ డబ్బులకు యింత విలువ లేనప్పుడు రాసినవి. ఇప్పుడు డబ్బు సంపాదించడం ఎంత కష్టమైపోయింది?” వాపోయాడు భాస్కర్‌.

“చూడండి, మీరు ఎంత చెప్పినా నేను మటుకు ఈ పనులు మానను. నన్ను పదే పదే అని, మీ మనసు పాడుచేసుకోవద్దు.” ఖరా కండితంగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు సుందరం.


“వీడికి బుద్ధి ఎప్పుడొస్తుందో ముకుందం!” బాధగా అన్నాడు భాస్కర్‌. “ఇంకేం వస్తుంది? వచ్చేది వుంటే చిన్నప్పుడే వచ్చేది!” అన్నాడు ముకుందం.


ఆ రోజు సుందరం కంచం నిండా అన్నం వదిలేశాడు సయించలేదంటూ. “ఏమైందిరా ఒంట్లోబాగో లేదా?” తల్లి అన్నపూర్ణ కంగారుగా అడిగింది.


“లేదమ్మా! సాయంత్రం ఫ్రండుతో కలిసి, మిర్చీ బజ్జీలు తిన్నాను. దానికి తోడు మా ఆనందుగాడు, నాకు వంకాయ బజ్జీలు కూడా తినిపించాడు. కడుపు నిండిపోయింది. మీరు బాధపడతారని అన్నం తిందామనుకున్నాను. కానీ పొట్ట నిండుగా వుంది” చేతులు కడుక్కుంటూ చెప్పాడు సుందరం.


“చూశావా! వీడికి డబ్బు విలువ తెలియడం లేదు. ఎంత పెట్టి కొంటే ఆ బియ్యం వస్తాయి? ఎంత పెట్టి తెస్తే ఆ కూరలు వస్తాయి? కంచం నిండా అన్నం వదిలేశాడు. అంతా వేస్టే కదా!” భాస్కర్‌ మళ్లీ బాధపడ్డాడు.


“మీరు విచారించకండి నాన్నా బయట వరాహమూర్తులు చాలా తిరుగుతున్నాయి. ఆ కంచం తీసుకుపోయి వాటి ముందు గుమ్మరించి వస్తాను.” అంటూ ఆ ఎంగిలి కంచం తీసుకుపోయి, కాంపౌండు దాటి వీధిలో తిరుగాడుతున్న పందుల ముందు ఆ ఎంగిలి అన్నం విదిలించి వచ్చాడు.


కోపంగా చూస్తున్న తండ్రి వంక చూస్తూ సుందరం అన్నాడు “పాపం! అవి కూడా బ్రతకాలి కదా!”


“అవునురా! ఈ లోకంలోని జీవులన్నింటిని నువ్వే బతికిస్తావు. ఇలా కనిపించిన ప్రతి జీవికి అన్నం పెట్టుకుంటూ పోతే, అతి త్వరలో మనం నెత్తిన చెంగు వేసుకుని వీధిన పడాల్సి వస్తుంది” భాస్కర్‌ అన్నాడు.


“ఛఛ! అలా అశుభాలు పలకకండి. పైన తథాస్తు దేవతలుంటారు.” వారించింది అన్నపూర్ణమ్మ.


ఒక రాత్రి కుక్కలు బాగా అరుస్తూ ఉంటే నిద్రలేచాడు భాస్కర్‌. అతనికి బయట శబ్దాలకు తొందరగా మెలకువ వస్తుంది. బయట లైటు వేసి కిటికీలో నుండి తొంగి చూశాడు. తమ వాకిలి గేటు దగ్గర కొందరు అపరిచిత వ్యక్తులు తచ్చాడుతున్నారు. వాళ్ళని చూసి కుక్కలు అరుస్తున్నాయి.


ఒక వ్యక్తి గేటు దూకి లోపలికి రాబోతూ ఇంట్లో లైటు వెలగడంతో, ఆ ప్రయత్నం మానుకుని పక్కకు వెళ్ళిపోయాడు. కానీ అతని వెంట టైగరు, (సుందరం అన్నం తినిపించే కుక్కను అతను అలా పిలుస్తూంటాడు) పడినట్లుంది. అతను ఉష్‌, ఉష్‌ అని అరుస్తున్నాడు. కొందరు మనుషులు పరుగెడుతున్న శబ్దాలు వినిపించాయి. కానీ టైగర్ అరుపు గట్టిగా వినిపించింది.

ఎవరో “అబ్బా! అని గట్టిగా అరిచాడు. ఆ తర్వాత రాయి తీసుకుని టైగర్‌ను గట్టిగా కొట్టినట్లున్నారు. “కుయ్‌ అని అరవసాగింది. అయినా అతన్ని తరిమినట్లు శబ్దాలు దూరంగా వినిపించాయి. భాస్కర్‌‌ తలుపులు తీసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చెయ్యలేదు, మంచిది కాదని.

తెల్లారిన తరువాత బయటకొచ్చిన సుందరంను చూసి టైగర్‌ కుయ్యో కుయ్యో అని మొరుగుతున్నది. భాస్కర్‌ సుందరంకు రాత్రి జరిగిన సంగతి చెప్పాడు. సుందరం బయటకొచ్చి టైగరును చూశాడు. అది గాయాలతో బాధపడుతున్నది. మొరుగుతూ సుందరం వంక దీనంగా చూస్తున్నది.


పశువుల డాక్టరు దగ్గరకు తీసుకు పోదామంటే దొరకకుండా ఉంది. చివరికి ఆ డాక్టరుకు ఫోను చేసి అతను చెప్పిన మందులను తెచ్చి పెరుగన్నంలో కలిపి టైగరుకు పెట్టాడు. ఇరుగు పొరుగు చెప్పుకుంటున్నారు, ఆ వీధి చివర రెండు ఇళ్ళు దొంగతనానికి గురయ్యాయని. ఎవరిదో బైకు కూడా దొంగిలించబడిందట. సుందరంకు, భాస్కర్‌‌కు అర్ధం అయింది టైగర్ తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన పోరాటం వలన తమ ఇళ్ళ జోలికి దొంగలు రాలేక పోయారని.


ఆ మరునాడు పిల్లికి పాలు పోద్దామని ఎన్నిసార్లు పిల్చినా అది పలుకలేదు. సుందరం ఆఫీసుకు వెళ్ళిపోయి, సాయంత్రం వచ్చి, మళ్ళీ తన పెంపుడు పిల్లికోసం చూశాడు, పాలగ్లాసు పట్టుకుని, కనపడలేదు. వాళ్ళది పెద్ద యిల్లు.ఇంటి వెనుక చిన్నతోటలాగా చెట్లు మొలిచి ఉన్నాయి. సుందరం ఇంటినాలుగు వైపులా కలదిరిగాడు పిల్లికోసం.


ఒక చోట తోట దగ్గర పిల్లి అచేతనంగా పడి వుంది. సుందరం గుండెలు భోరుమన్నాయి. ఇంకా పరిశీలనగా చూస్తే కొంచెం దూరంలో ఒక తాచుపాము చచ్చిపడి వుంది. పిల్లికి, పాముకు కొట్లాట జరిగినట్లుంది. ఆ తాచుపామును ఇంట్లోకి రానివ్వకుండా అడ్డగించినట్లుంది. ఆ పామును చంపి, దాని కాటుతో తను కూడా చనిపోయింది. సుందరంకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయి.రెండు రోజుల తరువాత కుక్కకు అన్నం పెడదామని చూస్తే, కనపడలేదు. వీధిలో గాలిస్తే ఒక కాలువ పక్కన చనిపోయి ఉంది టైగరు. దానిగాయాలపైన ఈగలు వాలుతున్నాయి. సుందరంకు అనిపించింది ఏమి యిచ్చి ఈ రెండు జీవుల రుణం తీర్చుకోవాలని! ప్రతి జీవిలో నారాయణుడు ఉన్నప్పుడు, వాటిని పోషించడం వ్యర్థం ఎలా అవుతుంది?” బాధగా అనుకున్నాడు సుందరం. డబ్బులు వేస్టు చేస్తున్నావని తండ్రి తనను నిందించడం గుర్తుకువచ్చి, అవి తన రుణం

తీర్చుకున్నాయో, తనే వాటికి రుణపద్దాడో అని ఆలోచిస్తున్నాడు సుందరం.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


28 views0 comments

Commentaires


bottom of page