top of page

ఋణం

Runam Written By Mohana Murali Kumar Annavarapu

రచన : అన్నవరపు మోహనమురళి కుమార్


రామారావు ఒక ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తా. అతని భార్య కమల. రామారావుకు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి.అబ్బాయి పేరు రమణ, అమ్మాయి పేరు సునీత .రమణ ఇంటర్ రెండో సంవత్సరం సునీత తొమ్మిదో తరగతి చదువు తున్నారు. రామారావు తన జీతం రాగానే ఖర్చులకు కొంత అట్టేపెట్టుకొని మిగతా జీతం భార్య కమలకి ఇస్తాడు. కమల తనకు ఇచ్చిన డబ్బులను పొదుపుగా ఖర్చుపెడుతూ నెలంతా గడిపేస్తుంది. అందుకని రామారావు ఇంటి విషయంలో నిశ్చింతగా ఉంటాడు. రమణకి ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. రమణ బాగా చదువుతాడు కాబట్టి ఇంటర్ ప్యాసవుతాడన్న నమ్మకం రామారావుకుంది.ఎంసెట్ రాయించి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి కంప్యూటర్ సైన్స్ చేయించాలని రామారావు అభిప్రాయం. సునీత తొమ్మిదో క్లాస్ కాబట్టి సునీత విషయంలో తొందర లేదనుకున్నాడు. రామారావు రోజూ రమణని స్కూటర్ మీద తీసుకు వెళ్లి పరీక్షా కేంద్రం వద్ద దించితే రోడ్డు దాటి వెళుతుంటాడు. అక్కడ ఒక ముష్టిది వచ్చే పోయే వాళ్ళని డబ్బులు అడుక్కుని వచ్చిన డబ్బులతో జీవనం గడుపుతూ ఉంటుంది.

రోజూ లాగానే రామారావు స్కూటర్ మీద రమణని కాలేజీ దగ్గర దించి రమణ రోడ్డు దాటుతుంటే చూస్తూ నిలబడ్డాడు. రమణ రోడ్డు దాటి పరీక్షా కేంద్రంలోకి వెళ్ళేదాకా చూసి వెళ్ళటం రామారావుకి అలవాటు. ఆ రోజు కూడా అలాగే చూస్తూ నిలబడ్డాడు.ఇంతలో ఒక లారీ వేగంగా వస్తోంది. రమణ ఆ లారీని చూసుకోకుండా రోడ్డుని దాటుతున్నాడు. కొద్దిగా ఉంటే రమణ లారీ కింద పడేవాడే. ఇంతలో అక్కడే వున్నా ముష్టిది రమణని పక్కకు లాగేసింది.రమణనే చూస్తూ వున్న రామారావు స్కూటర్ని వదిలేసి రమణ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. రమణని దగ్గరకు తీసుకొని ఎంత గండం గడిచింది అనుకొంటూ దెబ్బలు ఏమైనా తగిలాయేమోనని ఆత్రంగా చూసాడు. రమణకేమి దెబ్బలు తగలలేదు కానీ ఆ ముష్టిది గాయ పడ్డది. రామారావు వెంటనే ఆటోలో ఆ ముష్టిదాన్నిహాస్పిటల్ కు తీసుకెళ్లాడు. డాక్టర్ చూసి ప్రమాదమేమీ లేదని గాయాలకు కట్లు కట్టి, ఇంజక్షన్ ఇచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. రామారావు బెడ్ పక్కన కూర్చొని "అమ్మా, నీ పేరేమిటి? నువ్వెక్కడుంటావు, నీవాళ్లెవరన్నా వుంటే చెప్పు పిలిపిస్తాన"న్నాడు.

అప్పుడామె," నా పేరు నరసమ్మ.నాది పక్కనున్న గ్రామం.నేను బాగా బతికిన దాన్నే.మాకు ఐదెకరాల పొలం ఉండేది.నేను నా భర్త ఇద్దరు పిల్లలతో ఆనందంగా వుండే వాళ్ళం. ఫ్యాక్టరీలు పెడతాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, నష్ట పరిహారం ఇస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రభుత్వం మాతో పాటు మాగ్రామంలో రైతుల మాగాణి పొలాలు తీసుకొని నష్ట పరిహారం, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారు. అప్పటినుంచి రోజు గడవటమే కష్టమైంది. కూలి పనులు చేసుకుంటూ రోజులు గడిపే వాళ్ళం. రోజులు గడవక, పిల్లలకు సరిగా తిండి పెట్ట లేక పొయ్యేవాళ్ళం.ఆ దిగులుతోనే నా పెనిమిటి చనిపోయాడు. మందులు ఇప్పించటానికి డబ్బులులేక మాయదారి రోగాలతో నా ఇద్దరు పిల్లలు చనిపోయారు. పువ్వులమ్మిన వూళ్ళో కట్టెలమ్మలేక జీవానోపాధి వెతుక్కుంటూ ఈ వూరొచ్చాను. వయసైపోయిందని నాకు ఎవరూ పని ఇవ్వలేదు. అభిమానం చంపుకొని అడుక్కొని జీవిస్తున్నాను. రాత్రిపూట ఆ పక్కనున్న పాడుపడిన వసారాలో తలా దాచుకుంటాను" అని చెప్పింది.

"ఈ రోజు నువ్వు మా వంశాంకురాన్ని మృత్యువు నుంచి కాపాడావు. ఎన్ని జన్మలెత్తినా నీ ఋణం తీర్చుకోలేము. నీకు ఎంతచేసిన తక్కువే. నువ్వు అక్కడ ఇక్కడ ఎక్కడా ఉండొద్దు. నువ్వు ఈ రోజునుంచి మాఇంట్లొనే ఉండాలి."

"ఎందుకులెండి నా మానాన నన్ను బ్రతకానియ్యండి.నేను ఎక్కడికి రానం"ది నరసమ్మ. "అట్లాగంటే నేనొప్పుకోను. నీ ప్రాణాలను కూడా లెక్క చెయ్యకుండా నా కొడుకుని, వంశాంకురాన్ని ప్రమాదంనుంచి కాపాడావు. మా వంశాన్ని నిలబెట్టావు. నీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? నువ్వు కాదనకుండా మా ఇంటికి రావాల్సిందే" అంటూ పట్టుబట్టాడు రామారావు. 'సరేన'నక తప్పలేదు నరసమ్మకి. డాక్టరుతో మాట్లాడి నరసమ్మని ఇంటికి తీసుకు వచ్చాడు రామారావు. వచ్చిన కొత్తల్లో నరసమ్మకి మొహమాటంగా ఉన్నారామారావు భార్య కమల 'అత్తయ్యా!' అంటూ కలుపుగోలుగా పిలవటం, పిల్లలు కూడా 'నానమ్మ' అంటూ పిలవటం వాళ్ళు చూపించిన ఆప్యాయతకు, గౌరవానికి నరసమ్మ మురిసిపోయి అనతికాలంలోనే వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా అయింది. కమల, రామారావులు అప్పుడప్పుడు నరసమ్మ సలహాలు పాటిస్తుండేవాళ్లు. అనుకున్నట్లుగానే రమణ ఇంటర్ మంచిమార్కులతో ప్యాస్ అయి, ఎంసెట్లో కూడా మంచి రాంక్ వచ్చింది.

కౌన్సిలింగ్ వెళ్లి వచ్చిన తరువాత రామారావు భార్యను పిలిచి "రమణకి మన వూళ్ళో కాలేజీలో సీట్ రాలేదు. వేరే వూళ్ళో వచ్చింది. అక్కడ హాస్టల్లో ఉంచి చదివిద్దామంటే చాలా ఖర్చు అవుతుంది. పైగా రమణ దూరంగా వుంటే స్నేహితుల ప్రభావంతో ఏ దురలవాట్లకు లోనవుతాడేమోనని భయం. పోనీ ఇక్కడే చదివిద్దామంటే ప్రైవేట్ కాలేజీలలో చేర్చాలి. ఫీజు లక్షల్లో కట్టాలి. అంట డబ్బు నా దగ్గర లేదు. అప్పు ఇచ్చే వాళ్లెవరూ లేరు. ఏమి చేయాలో పాలుపోకుండా వుంది కమలా" అన్నాడు.

" మీరు ఇస్తున్న డబ్బుని పొదుపుగా వాడుతూ నెలంతా గడుపుతున్నాను. నా దగ్గర కూడా ఏమీ లేదండి. నా నగలేమన్నా అమ్మి కడదామంటే మెళ్ళో ఇది తప్ప ఏమిలేదుకదా" అంటూ మంగళసూత్రాలను చూపించింది.

అప్పుడే అక్కడకు వచ్చిన నరసమ్మ "ఏమిటి బాబూ ఫీజులంటున్నారు, డబ్బులంటున్నారు" అంటూ అడిగింది.

" ఏమిలేదమ్మా, బాబు చదువుగురించి మాట్లాడుకుంటున్నాము అయినా ఇవన్నీ ఎప్పుడూ వుండే ఇబ్బందులే" అన్నాడు. నరసమ్మ గ్రహించింది.కానీ తాను మాత్రం ఏమిచేయగలదు. లోలోపల మధన పడుతూనే వుంది బయటెక్కడో వుండే ముష్టిదాన్ని, ఇంట్లో పెట్టుకొని ఆదరిస్తున్నవారికి ఎలా సాయం చేయాలా అని.

ఒక రోజు నరసమ్మ రామారావు తో "ఒకసారి మావూరెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళింది. నాలుగు రోజుల తరువాత సంతోషంగా తిరిగి వచ్చింది. రామారావు చేతికి నాలుగు లక్షల రూపాయల చెక్కు ఇచ్చి, "ఇది రమణ చదువుకు, ఇతర అవసరాలకు వాడమని చెప్పింది. రామారావు ఆశ్యర్యంతో "అమ్మా ఇంత డబ్బు నీకెక్కడిది , అయినా నువ్వు డబ్బు నాకివ్వడ మేమిటి, నేనేమీ ప్రతిఫలం ఆశించి నిన్ను నాదగ్గర ఉండమనలేదు. నీలో మా అమ్మను చూసుకుంటున్నాను .నేను తీసుకోన"న్నాడు రామారావు.

"నిన్న బజారులో మావూరాయన కనిపించి కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఫ్యాక్టరీస్ కొరకు భూములు తీసుకున్న వారికి నష్ట పరిహారం ఇవ్వటానికి రెండు రోజుల్లో ఆఫీసర్లు వస్తున్నారు. నువ్వు ఎక్కడుంటావో తెలియక పోయినా ఎక్కడన్నా కనపడక పోతావా అని వచ్చాను. అనుకోకుండా నువ్వే కలిసావని చెప్పాడు. అందుకే మాఊరెళ్ళాను. నా వాటా క్రింద ఈ డబ్బు ఇచ్చారు." నాకు మాత్రం ఎవరున్నారు, నాకు కావలసినవన్నీ నువ్వు సమకూరుస్తున్నావు కదా. నాకు డబ్బుతో పనేముంది. తల్లి కొడుకుకు సాయం చేయ కూడదా. అవసరమైతే అడుగుతానులే అంతవరకు ఈ డబ్బు నీదగ్గరుంచి అవసరాలకు వాడమని" చెప్పింది. రామారావు ఇక ఏమి అనలేక తీసుకున్నాడు.

***** ***** *****

రామారావు ఇంటి పక్కనే ఒక ఖాళీ స్థలమున్నది. పిచ్చి మొక్కలతో, తుప్పలతో గుబుర్లుగా ఉంటుంది. చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరూ ఆ ఖాళీ స్థలంలో చెత్త చెదారం, పనికిరాని వస్తువులు పడేస్తుంటారు.అక్కడ ఒక త్రాచు పాముందని, ఆరడుగుల పైనే ఉంటుందని, ఒకరిద్దరు చూశామని కూడా చెప్పారు. ఎలుకలు, పందికొక్కులు సరేసరి. ఒక సాయం సంధ్య వేళ రామారావు కూతురు సునీత స్కూల్నుంచి వస్తుంటే ఇంటి దగ్గర రోడ్డుకి అడ్డంగా త్రాచు పాము వెళుతూ కనపడ్డది. సునీత భయపడి పెద్ద కేక పెట్టింది. ఆ అరుపుకి ఆటుపోయే పాము సునీతవైపుకు తిరిగి పడగ ఎత్తి నిలబడ్డది. బుసలు కొడుతూ కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. సునీతి భయంతో బిర్ర బిగుసుకు పోయి కాళ్ళు చేతులు ఆడక చేష్టలుడిగిన దానిలా కదలకుండా ఉన్నచోటే నిలబడ్డది. పారిపోదామంటే పాము వెంటబడుతుందేమోనని భయం.

అప్పుడే అటునుంచి వస్తున్ననరసమ్మ ఈ దృశ్యాన్ని చూసింది. భయంతో వణుకుతూ నిలబడ్డ సునీతని చూసింది. ఒక్క క్షణం ఆలోచించింది. బిడ్డ ఆపదలో వుంది. తెలియని ఆవేశం, తెగువతో తను ఏమైపోతుందో అన్న ఆలోచన కూడా లేకుండా ఆ పాము వెనుకగా వెళ్లి పడగ క్రింద పట్టుకుని విసిరేసింది. నన్నే పట్టుకుంటావా అన్నట్లుగా కోపం, రోషంతో ఉన్న పాము నరసమ్మని రెప్పపాటు కాలంలో చేతి మీద కాటు వేసింది. నరసమ్మ అమ్మా అంటూ చెయ్యి పట్టుకుని కూలబడి పోయింది. అప్పుడే కమల బయటకువచ్చింది. రామారావు కూడా ఆఫీసునుంచి అప్పుడే వచ్చాడు. ఎవరో అరిచారు నరసమ్మని పాము కాటేసిందని. జనం పోగయినారు. రామారావు వెంటనే ఆంబులెన్సుకి ఫోన్ చేసాడు. ఈ లోపల నరసమ్మకి చేయవలసిన ప్రధమ చికిత్సలు చేస్తున్నారు. నరసమ్మనోట్లోనుంచి నురగలు వస్తున్నాయి. ఆంబులెన్సు వచ్చింది. హడావుడిగా అందులోకి ఎక్కించి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేక పోయింది. నరసమ్మ కన్నుమూసింది. రామారావు శవాన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు. సొంత కొడుకులాగా రామారావు నరసమ్మ శవంతో పాటు మరుభూమికి వెళ్లి చితికి నిప్పు పెట్టాడు. అంత్య క్రియలు ఘనంగా జరిపించాడు. నరసమ్మ ఊరు వెళ్లి ఆ గ్రామస్తులని, తనకు తెలిసిన స్నేహితులను, చుట్టాలను చుట్టు పక్కల వాళ్ళని పదకొండో రోజున పిలిచి అన్న సంతర్పణ చేశాడు. తొమ్మిది, పది పదకొండు రోజుల కార్యక్రమాలను పూర్తి చేశాడు. రెండు సార్లు నరసమ్మ తన ప్రాణాలను లెక్క చేయకుండా తన పిల్లల ప్రాణాలను కాపాడిందని పదేపదే తలచుకుంటూ బాధ పడుతుంటారు రామారావు కుటుంబం. ఇంట్లో నరసమ్మ ఫోటో పెట్టుకుని నరసమ్మని ఒక దేవతలాగా కొలుస్తుంటారు. ప్రతి సంవత్సరం నరసమ్మ చని పొయిన రోజున శ్రాద్ధ కర్మ జరుపుతుంటాడు రామారావు కృతజ్ఞతా పూర్వకంగా.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


57 views0 comments
bottom of page