top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

ఋణానుబంధం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






'Runanubandham' written by Ayyala Somayajula Subrahmanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

యజమాని కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు రంగడు.

కానీ ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఆయన పరువును కాపాడింది రంగడి భార్య వరాలు.

నిజం తెలుసుకున్న యజమాని భార్య శాంతమ్మ, వరాలుకు నమస్కరించింది.

ఈ కథను ప్రముఖ రచయిత అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించారు.


ఊపిరితిత్తుల కాన్సర్‌ తో బాధపడుతున్న మాజీమంత్రి బలరామయ్యని పరీక్షించిన వైద్యుడు పెదవి విరుస్తూ, అక్కడే దిగాలుగా వున్న బలరామయ్య భార్య కేదో చెప్పి,

అప్పటికి ఉపశమనార్థమై ఓ ఇంజక్షన్‌ ఇచ్చి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. వైద్యుడి మాటలకు భయమావరించిన శాంతమ్మ, ఆయనలా వెళ్ళిపోగానే గబగబా బయటి

కొచ్చి అటు చివర గొడ్లపాకలో వూడుస్తున్న వరాలును పిలిచి విషయం చెప్పి బావురుమంది.

"బాధపడకండమ్మా! నా కొకప్పుడు కొండంత ధైర్నము సెప్పిన మీరే ఇలా డీలా పడిపోతే ఎలాగమ్మా? అయినా మన తలరాత ఎలా రాసుంటే అలా జరుగుద్దే తప్ప మనం సేయగలిగిందేముంది సెప్పండి? "ఓదార్పు మాట చెప్పింది పని మనిషి వరాలు.

"రంగడు పారిపోయిన రోజున నీకు ధైర్యం చెప్పగలిగేనేమో గాని, నాకిప్పుడు కాళ్ళు చేతులాడటం లేదే! " జీరపోయిన గొంతుతో చెప్పి, మళ్ళీ బోరుమంది.

"మనసు దిటవు చేసుకోండమ్మగారూ! మంచిసెడులన్నింటికీ ఆ దేముడే దిక్కన్నఇసయం మీకు తెలియందేం కాదు" వేదాంత దోరణిలో చెప్పి అక్కణ్ణుంచి దిగాలుగా తలవంచుకుని మళ్ళీ గొడ్లపాకలోకి వెళుతున్న వరాలును చూస్తున్న శాంతమ్మ మనస్సు రివ్వున పదహారేళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది.

***

ఆ రోజు సంక్రాంతి పర్వదినం. చీకటి వీడకనే ఇంటిముందు తనే కల్లాపు జల్లి రథం ముగ్గు వేస్తోంది. ఆ సమయంలో తన కూతుళ్ళిద్దరినీ వెంట పెట్టుకుని లబోదిబో మంటూ అక్కడికొచ్చింది వరాలు.

"పొద్దుటే ఆ శోకాలేమిటే? ఏమయింది నీకు?" ముగ్గు వేస్తున్నదల్లా గబుక్కున లేచి, చేతిలోని ముగ్గుగిన్నె పక్కన పెడుతూ, ఏడుస్తున్న వరాలు నడిగింది.

"సందెకాడే బోంసేసి ఇప్పుడే అయ్యగారింటి కెళ్ళొస్తానని చెప్పి బయటికెల్లిన నా పెనిమిటి ఇప్పటిదాకా తిరిగి రాలేదమ్మ గారూ!... ఏడకెళ్ళాడో ఏంటో కూడా తెలీటం

లేదమ్మా? "అంటూ గుండె బాదుకుంటూ మళ్ళీ బావురుమంది.

"అబ్బబ్బ.. శోకాలిక ఆపవే తల్లీ! వాడేదో పనిమీద బయటికెళ్ళుంటాడు. తిరిగొచ్చేస్తాడు.

గమ్మున వెళ్ళి పని చేసుకో ఫో! "చెప్పింది. కానీ ఫలితం లేకపోయింది. శాంతమ్మకిక పాలుపోక గబగబా పడకగదిలో కెళ్ళి ఇంకా అప్పుడప్పుడే ఇంటికొచ్చి పడుకున్న భర్తను మేల్కొలిపి, రంగడి విషయం చెప్పింది.

"ఏంటీ!... రంగడింటికెళ్ళలేదటనా? రాత్రి మనింటి నుంచి నాకూడా బయటికొచ్చి, వెంటనే వెళ్ళిపోయినోడు ఇంటికెళ్ళకుండా ఎక్కడికెళ్ళుంటాడబ్బా?" బద్దకంగా

ఆవలిస్తూనే పక్కనే వున్న చుట్ట తీసుకు వెలిగించి అగ్గిపుల్లనలా పక్కకి విసిరి పడేస్తూ, తలవని తలంపుగా బీరువా కేసి చూసి "అరే! బీరువా తెరిచుందేమిటి? " అనుకుంటూ గబగబా వెళ్ళి అందులో దాచుంచిన నోట్లకట్టలని బయటికి తీసి ఒకటటికి రెండు సార్లు లెక్కెట్టి "ఇందులో డబ్బుగానీ వాడుకున్నావా? "కంగారు పడిపోతూ భార్య నడిగాడు బలరామయ్య.

"లేదండీ! ఇంతకీ బీరువా తలుపెవరు తీశారు? "శాంతమ్మ ప్రశ్న.

"అదే నాకు అర్థం కావడం లేదు. ఇందులో లక్షరూపాయలు గల్లంతయింది".

"ఆ ! లక్షరూపాయిలే!”... ఒక్కసారిగా నోరు తెరచేసి "మీరెవరికైనా ఇచ్చారేమో - బాగా గుర్తుచేసుకోండి "భర్తతో అంది.

"పైసా కూడా వాడుకోలేదు… ఓ ముఖ్యమైన పని గురించి జాగ్రత్తగా ఇందులో దాచుంచాను.... ఆ! అన్నట్లు రాత్రి రంగడిక్కడ కొచ్చినప్పుడు మాట మాటల్లో ఓ ముఖ్యమైన కాగితం గురించి, నేను పక్క గదిలో కెళ్ళాను. అది గమనించి వాడే ఈ పని చేసి ఉంటాడనుకుంటాను" రంగడిని అనుమానిస్తూ అన్నాడు బలరామయ్య.

"ఛీ! ఛీ! ఏం మాటలండీ అవి. శ్రీరామచంద్రునికి ఆంజనేయుడెంతటి నమ్మినబంటో మీకు రంగడు కూడా అంతే నమ్మినబంటు" భర్త మాటలని ఖండిస్తూ అందావిడ.

"ఆ యుగం వేరు. ఈ యుగం వేరే పిచ్చిదానా! ఎందుకైనా మంచిది ముందా వరాలును లోనికి పిలువు" అని చెప్పగానే, వరాలను లోనికి పిలిచింది శాంతమ్మ.

"రాత్రి నీ మొగుడు నాతో మాట్లాడటానికి వచ్చినప్పుడు మాటల్లో నేనో ముఖ్యమైన కాగితం తీసుకురావడానికి పక్కగదిలో కెళ్ళాను. ఈ బీరువాలో డబ్బున్న సంగతి తెలుసుకున్న నీ మొగుడు లక్షరూపాయిలు కొట్టేశాడు. ఇది వాడి పని తప్ప మరెవ్వరిదీ కాదు. ముందు పోలీసుస్టేషన్‌ కు వెళ్ళి కంప్లంయింట్‌ చేసొచ్చేనంటే, వాడి ఆచూకీతో పాటు పోయిన నా డబ్బు కూడా దొరికిపోతుంది" నిర్మొహమాటంగా పలికి ఆరిపోయిన చుట్టను మళ్ళీ వెలిగించి గుప్పు గుప్పున పొగలొదులుతూ లేచాడు బలరామయ్య.

అయ్యగారి మాటలకు అదిరిపడి- "రిపోర్టియ్యమాకండయ్యా! నా పెనిమిటీ పని సేశాడని జనానికి తెలిస్తే రంగడు దొంగనాయాలన్న మచ్చ పడిపోద్ది. అప్పుడిక ఊళ్ళో తిరగలేం బాబయ్యా! మీరు అనుమానించినట్టే పాడుపని నా పెనిమిటి సేసుంటే ఆడు తిరిగొచ్చేక మీ ఇంట జీతానికుంచి బాకీ తీర్చుకుంటానుగానీ దయచేసి టేసనుకి మాత్రం పోమాకండయ్యా! ! " కాళ్ళు పట్టుకు బతిమలాడింది వరాలు.

". . . . . . . . . . . " మళ్ళీ బతిమలాడింది.

"సరే। నీ మాటమీద నమ్మకముంచి స్టేషన్‌కు వెళ్ళను గానీ ఓ విషయం మాత్రం గుర్తుంచుకో" అనగానే ఏమిటన్నట్టు బలరామయ్య ముఖంలోకి చూసింది వరాలు.

"నీ మొగుడేడకెళ్ళాడని అడిగిన జనానికి పీకలదాకా తాగొచ్చి ఇంట్లో నానా గొడవ చేసి, ఎటో వెళ్ళిపోయాడని గట్టిగా చెప్పేయి. మిగతా విషయాలేమైనా వుంటే నే చూసుకుంటాను" వరాలుకి చెప్పేడు.

సరేనన్నట్టు తలూపింది వరాలు. అనంతరం ఓ ఐదొందలు బీరువాలోంచి తీసి "ఇదిగో ఖర్చులకిది వాడుకుంటూండు. ఇంకా ఏమైనా కావాల్సొస్తే మీ అమ్మగారిని అడిగి పట్టుకెళ్ళు" చెప్పేడు.

గత్యంతరం లేక చేయిసాచి ఆ డబ్బందుకుని దిగాలుగా ఇంటిదారి పట్టింది. మరునాడు సాయంత్రం కల్లా రంగడు పారిపోయిన సంగతి ఊరంతా పాకిపోయి రకరకాలుగా కథలల్లేసారు జనం. పొట్ట తిప్పలకై బలామయ్య గారింట ఊడిగం చేసుకుంటూ తన ఇద్దరు బిడ్డలనీ పోషించుకుంటూ బతుకుబండి నడుపుకుంటోంది వరాలు.

రోజులు నెలలై అవి సంవత్సరాలుగా మారి కేలండర్లు గోడ దిగిపోయాయి గానీ రంగడి జాడ తెలీకపోయింది. రంగడు మాత్రం రాలేదు. ఆడపిల్లలిద్దరికీ తగు సంబంధాల్లో పెళ్ళిళ్ళు కూడా జరిపించేశాడు బలరామయ్య. ఎప్పుడైనా మాటమాటల్లో రంగడి ప్రస్తావన వస్తే "ఊగిఊగి ఉయ్యాల, వున్న చోటికే వచ్చి ఆగిపోతుందే వెర్రి మొహమా ! ఆ తాగుబోతు వెదవ ఎటెళ్ళినా చివరికి నీ దగ్గరికి రావాల్సిందే తప్ప గత్యంతరం లేదు" అని శాంతమ్మ చెబితే "మీ పిచ్చిగానీ ఇంకేమొస్తాడమ్మా! మమ్ముల్నందర్నీ నట్టేట ముంచేసి తానెళ్ళిపోయేడు" అమ్మగారి మాటలకు వేదాంత ధోరణి లో బదులు చెప్పింది వరాలు.

ఇలా ఒకదానివెంట మరొకటి గుర్తొస్తుండగా, ఈ లోపు మంచాన వున్న బలరామయ్య కెవ్వున కేక పెట్టి అరిచేసరికి శాంతమ్మ ఆలోచనలకి అంతరాయం కలిగి, ఇహం లోకి జారుకుంది. మరోసారి మళ్ళీ భయానకంగా అరిచాడు. ఏమయిందోనని

కంగారుగా గదిలోకి పరుగు తీసింది శాంతమ్మ.

ఆమె కేసి దీనంగా చూసిన బలరామయ్య దగ్గర కెళ్ళి "ఏంటండీ! కడుపులో బాధగానీ వుందా?" అని అడిగితే బదులివ్వకుండా కన్నీరు కార్చాడు.

"ఏమయ్యిందీ? ఎందుకా కన్నీరు? "

"మోయలేని పాపాన్ని మూట కట్టుకుపోతున్నాను. నన్నా దేవుడు క్షమించడు. " మాటలు ముద్ద ముద్దగా హీనస్వరంతో పలికేడు.

"ఏమిటి మీరంటున్నది? " అయోమయంగా శాంతమ్మ ప్రశ్న.

"మన వరాలుకి చేయరాని ద్రోహం చేసి పోతున్నాను. అది సమయానికి పెద్దమనసుతో క్షమిస్తే తప్ప నాకు మోక్ష గతులుండవ్‌. అతి కష్టంగా పలికి ఇంకా ఏదో చెప్పబోయి

టప్పున మెడ వాల్చేశాడు. చుట్టూ చిమ్మ చీకటులావరించినట్టయి కెవ్వుమంది శాంతమ్మ. అమ్మగారి కేక విని గొడ్లపాకలో పని చేసుకుంటున్న వరాలు పరుగు పరుగున వచ్చి, తలవాల్చిన అయ్యగారిని చూసి దిక్కుతోచని స్థితిలో తనూ ఘొల్లుమంది.

అనంతరం కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. తదుపరి రెండు నెలలకి ఇల్లు, వరిపొలం, మామిడితోట అన్నీ అమ్మేసి కుమారుడి దగ్గరికి వెళ్ళిపోయే ఏర్పాట్లన్నీ చేసుకుని, ఆ రోజు సాయంత్రం వరాలుని పిలిపించి, ఎంతోకాలంగా అదిచేసిన సేవలకి గుర్తుగా పశువుల పాకలో కట్టేసి వున్న రెండు పాడిగేదెలనూ ఇంటికి తోలుకు పొమ్మంది శాంతమ్మ.

"వద్దమ్మగారూ! వద్దు. మడిసి మీద అభిమానముండాలేగాని అయన్నీ ఎందుకు సెప్పండి" కనుకొలకుల్లో నీళ్ళు కదలాడుతుండగా సున్నితంగా తిరస్కరించింది.

"గమ్మున మీ ఇంటికి వాటిని తోలుకు పొమ్మని చెబుతున్నానంతే! ! "

వద్దని చెప్పి, కుముల్తూ వెనక్కి తిరిగింది.

"ఏంటే నీ మొండితనం. ధిక్కారమూనూ? బదులు చెప్పకుండా వాటిని తోళుకెళ్ళు" ... హుకుం.

'వద్దంటే వద్దం'టూ ముందుకు కదిలింది.

ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ వద్దంటున్నందుకు శాంతమ్మ ముందుకు వచ్చి "నీకు నువ్వు ఏమనుకుంటుంన్నావే? మా ఎంగిలి మెతుకులు తింటూ నమ్మకంగా ఇంట పని చేసుకుపోతున్నావన్న విశ్వాసంతో తోలుకు పొమ్మంటే వద్దు… వద్దంటూ తెగనీలుగుతున్నావేంటీ? సరే! ఎలాగూ నా మాట కాదనే దాకా వచ్చావు గనుక గత రెండు నెలలుగా నా మనసు తొలచి పడేస్తున్నఅతి ముఖ్యమైన విషయాన్ని గురించి ఇక నిన్నడగ దలచుకున్నాను. అందుకు నీ సమాధానమేమిటో చెప్పి బయటికి నడు" అంది.

"అడగండమ్మగారూ! అడగండి".

"మీ అయ్యగారు చనిపోయేముందు వరాలుకు చేయరాని ద్రోహం చేశాను. పెద్దమనసుతో అది క్షమిస్తే తప్ప నాకు మోక్షగతులుండవంటూ కన్నీరు కారుస్తూ చెప్పారు.

ఆయన నీకు చేసిన ఆ ద్రోహమేమిటో, అందుకు నీవాయనగారితో సహకరించిన ఆ ఇది ఏమిటో ముందు నాకు చెప్పేసెళ్ళు" కోపాన్ని ఆపుకోలేక కఠినంగా అడిగేసింది

శాంతమ్మ...

"నాకు తెలుసు. అలగా జనానికి అలగా బుద్దులు తప్ప మంచి బుద్దులెలా వస్తాయి? ఆయన గారీ మాట చెప్పగానే ఇది దేనికో పాల్పడి వుంటుందని నేనూహించుకుంది,

నిజమేనని తేలిపోయింది".

"ఆనాడు అయ్యగారికిచ్చిన మాటకి కట్టుబడి సెప్పకూడదనుకున్నాను. మీరు నన్ననుమానిత్తోన్నారు కనక ఇసయం సెప్పేయటం మంచిది . దయచేసి అలా గొడ్లపాక దాకా వచ్చేరంటే ఆ కతంతా సెబుతాను" కనుకొలకుల్లో నిండిన నీటిని చిరిగిన చీరకొంగుతో తుడుచుకుంటూ పాక దగ్గరి కెళ్ళిపోయింది వరాలు.

దాని వెనకాలే వెళ్ళిన శాంతమ్మ నోచోట కూచుండబెట్టి ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని

"అమ్మగారూ! మీరనుకుంటున్నట్టు నా మొగుడు ఏడకో పోలేదమ్మా"! కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా తన కథ మొదలెట్టింది.

"ఏంటీ । రంగడు పారిపోలేదా? '

"లేదమ్మగారూ! పుట్టెడు దుఃఖాన్ని కడుపున దాసుకుని అయ్యగారు సెప్పినట్టు నాటకం ఆడేను" కట్టలు తెంచుకు వస్తున్న కన్నీటిని ఆపలేక కొంగుతో తుడుచుకుందీసారి.

"మరి వాడు పారిపోయాడన్న పుకారు ఎందుకు పుట్టించాల్సొచ్చింది. ఒకవేళ నీకూ... మీ అయ్యగారికీ మధ్య ఏదేనా...?” అనుమానం వ్యక్తంచేస్తూ అంది.

"నేను కూటికి పేద దానను. గుణానికి పేదదానను కాను. నీతి తప్పిన దానను మాత్రం కానే కాను. అమ్మగోరూ!”

"మరయితే ఆ పాపపు మూటేమిటో విప్పి చెప్పు"

"ఆ రోజు పొద్దు గూకగనే గబగబా బువ్వతిని బీడి కాల్చుకుంటూ, 'అయ్యగారు నన్ను రమ్మన్నారు. అటెళ్ళొస్తా'నని సెప్పి పోయినోడు ఎంతకీ తిరిగి రాలేదు. కంటికి రెప్పెయ్యకుండా ఆడి రాకకోసం ఎదురు చూస్తూ జాగారం చేశాను గానీ, ఆడు రాకపోయే సరికి ఆ సీకట్లోనే తిన్నగా మన తోటకాడి కెళ్ళిపోయి గేటుకాడ నుంచుని నా పెనిమిటిని పిలిచాను. అప్పుడయ్యగారే గబగబా గేటుకాడి కొచ్చి, నా సేయి పట్టుకు తోటలో అటేపున్న కొట్టడీకేసి నన్ను లాక్కుపోయారు. అటెలుతున్న కొద్దీ, ఇపరీతమైన సారా కంపుకొట్టింది.

'ఏంటండీ ఈ కంపు? నన్నేడకు తీసుకెళుతున్నారు?' అనడిగాను.

మాటాడకుండా నన్నా గదిలోకి తీసుకెళ్ళి తలుపేశారు" చెప్పి అమ్మగారి ముఖంలోకి చూసింది వరాలు.

"ఆ గదినిండా సారా పీపాలున్నాయి. వాటి పక్కనే నా మొగుడు పడున్నాడు.నీ తాగుడు పాడుగానూ! తప్పతాగి అట్టా పడిపోయావేందిరా ఎదవసచ్చినోడా!” అంటూ దగ్గరకెళ్ళి లేపబోయాను. అప్పటికే వొళ్ళు సల్లబడి బిగుసుకుపోయింది. నెత్తిన సలి పిడుగు పడ్డట్టయి 'ఇగ నా గతేంట్రా దేవుడోయ్‌ !' అంటూ శవం మీదపడి లబోదిబో ఏడ్సేను. అయ్యగారు నన్నెంతగానో సముదాయించేరు. కానీ నేనా బాదనాపుకోలేక ఏడుస్తూ అయ్యగారిని తెగ తిట్టేశాను.

'రాబోయే ఎలచ్ఛన్లలో జనాలకు సారా తాపి, ఓట్ల మనవేపు తిప్పుకోవలనే పెయత్నంతో నాటుసారా కాయడంలో దిట్టయిన రంగడితో బట్టీ పెట్టించాను. ఈడేమో పీకలదాకా తాగి ఇపరీతంగా వాంతులు సేసుకుని కుప్పకూలిపోయా'డంటూ అయ్యగారు కూడా నాతోపాటు ఏడ్చేశారు" చెప్పి అమ్మగారి ముఖంలోకి చూసింది మళ్ళీ.

"ఆ తర్వాత ఏమయింది?" తదుపరి విషయం తెలుసుకోగోరి బొంగురుపోయిన స్వరంతో శాంతమ్మ ప్రశ్న.

"అప్పుడయ్యగారు నన్ను సముదాయించి, 'బాదపడకమ్మా! ఇకపై నీకు తండ్రిలా, నిన్నూ, నీ పిల్లల్నీ సూసుకునే బాద్దెత నాదే. దయసేసి ఈ ఇసయం మాత్రం ఎవరికీ తెలీనీకు. ఈ కారణంగా రంగడు సచ్చేడని తెలిస్తే నేనంటే సరిపడనోళ్ళు నన్నిక బొక్కలోకి తోయించేస్తారు. ఆనక నేను ఉరేసుకోవాల్సిందే తప్ప బతకలేను' అంటూ అయ్యగారు నా కాల్లు పట్టుకోబోయారు.

అందుకు నా మనసు మెత్తబడింది. ‘మీ మాట మీదుగా నడుసుకుంటాను గానీ నా గతేంట’ని అడిగేను ఆయన్ని.

‘మల్లీ సెబుతాను. ముందీ శవాన్ని పూడ్చే ఏర్పాటు సేద్దా'మన్నారు. నేను, అయ్యగారు కలిసి తోటలోనే ఓ మూల గబగబ గోయితీసి శవాన్నందులో పూడ్చేసి సీకటి ఇడిపోకనే ఇల్లు సేరుకున్నాం.

ఆ పై అయ్యగారు సెప్పినట్టే మీ ఇంటి కాడొచ్చి నా మొగుడేడకో పోయాడని బొంకేను.

ఇదంతా జరిగిపోయిన రెండునెలలకే ఎలచ్ఛన్లు జరిగేయి. ఆ సారా వాడుకుని అయ్యగారు గెలిసి మంతిరయ్యేరు. ఇదమ్మగారూ! ఆయాల ఇంటినుంచి బయటికెళ్ళి

పోయిన నా పెనిమిటి కత" విషాధ భరితమైన రంగడి కథంతా చెప్పి దుఃఖన్నాపుకోలేక వలవలా ఏడ్చింది వరాలు.

శాంతమ్మ మనసు కరిగిపోయింది.

"బాధపడకమ్మా! అయ్యగారికిచ్చిన మాటకు కట్టుబడి మా పరువు కాపాడటం కోసం పుట్టెడు దుఃఖాన్ని కడుపున దాచుకుని ఎన్నియాతనలు పడ్డావో ఏమో చెప్పలేము. వితంతువయ్యుండి ముత్తయిదువులా రోజూ ముఖాన కుంకుమబొట్టు పెట్టుకున్నప్పుడల్లా పెనిమిటి గుర్తొచ్చి ఎంత కుమిలిపోతున్నావో ఏమో.. ఆ భగవంతునికే తెలియాలి. ప్రపంచంలో విశ్వాసానికి మారుపేరు కుక్క ఒకటే అంటారు. మనుషుల్లో కూడా అత్యంత విశ్వాస పాత్రులుంటారన్న నిజాన్ని నీ ద్వారానే తెలుసుకోగలిగాను. ఏదేమైన నీ త్యాగానికి, దొడ్డబుద్దికి నేను కూడా చేతులు జోడిస్తున్నానమ్మా! " చేతులు జోడించింది.

"వద్దమ్మా! వద్దు" చేతులు జోడించిన అమ్మగారిని వారించింది.

"పై వచ్చే ఆదివారమే అబ్బాయి దగ్గరకెళ్ళిపోతున్నాను. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రం గానే వుంది. కనుక మళ్ళీ వచ్చి మిమ్మలనందరినీ చూస్తానన్న నమ్మకమైతే నాకు లేదు. కనుక ఈ అమ్మ మాట కాదనక తీపి గురుతుగా ఆ రెండు పాడిగేదెలతో పాటు ఈ గొలుసు కూడా వుంచుకో" తన మెడలోని నాలుగు పేటల బంగారుగొలుసు తీసి వరాలు మెడలో వేసి "నీ ఋణం జన్మజన్మలకీ తీరనిది. " అంటూ ఒక్కసారిగా కౌగలించుకుని దాని నుదుట ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది శాంతమ్మ.

కన్నతల్లివంటి శాంతమ్మ గారి మనసెరిగినదై కృతజ్ఞతా పూర్వకంగా ఆమె కాళ్ళకు దండం పెట్టుకోటానికి తలవంచిన వరాలు కళ్ళలోంచి అప్రయత్నంగా కన్నీటి బిందువులు శాంతమ్మగారి పాదాలపై పడ్డాయి.

ఆ వెంటనే నులివెచ్చని కన్నీటి చుక్కలు వరాలు వీపుమీద కూడా సర్రున జారాయ్‌.

------------శుభం భూయాత్‌-------------------------------------

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.





379 views0 comments

Comments


bottom of page