top of page

శచీంద్రం


Sacheendram Written By Koteswara Rao Vegulla

రచన : వేగుళ్ల కోటేశ్వర రావు


(గమనిక: ఈ కథలోని సంఘటలన్నీ ఒకే కాలంలో జరిగినవి కావు. కేవలం రచయిత కల్పన.)

ఆహ్లాదకరమైన రేయి. స్వర్గంలో దేవేంద్రుడు కొంచెం పెందరాళే అమృతం సేవించి ఇంద్రభవనంలోని శయ్యాగారం చేరి హంసతూలికా తల్పంపై దర్పంగా మేను వాల్చాడు. పైన చల్లటి ఆకాశం. కింద చల్లటి మబ్బులు. వాతావరణం ఉత్తేజంగా, కోర్కెలు రెచ్చగొట్టేలా ఉంది. ఇంద్రుడు ఈ రోజు పెందరాళే శయనాగారం చేరడం గమనించిన శచీదేవి తానుకూడా తొందర తొందరగా అమృతసేవనం గావించి ఇంద్రుడి పక్కన చేరింది. నందనవనం నుంచి పరిచారికలు కోసి తెచ్చిన మల్లెపూలు శచీదేవి సిగలోనుంచి మత్తైన సువాసనలు వెదజల్లుతున్నాయి. అదే నందనవనంనుంచి తెచ్చిన లేత తమలపాకులు శచీదేవి మృదువైన వేళ్ళకు చిలకల్లా చుట్టబడి ఉన్నాయి. శయనాగారానికి పైన ఏమీ ఆచ్చాదన లేకపోవడంతో పున్నమి చంద్రుడు పరిచే వెన్నెల పాలమీగడలా పక్కంతా అలుముకునుంది.

ఇంద్రునిమీదకు వయ్యారంగా వంగి తమలపాకుల చిలకలు నోటికందిస్తూ శచీదేవి, "ఎందుకో స్వామివారు ఇవాళ మహదానందంతో ఉన్నారు" అని మార్దవంగా అడిగింది.

"ఈ ఆనందానికంతా కారణం నీతో ఇలాంటి మధురమైన రాత్రి గడపటమే" అన్నాడు ఇంద్రుడు శచీదేవి కళ్ళలోకి చిలిపిగా చూస్తూ.

"అవును ప్రభూ భూలోకంలోని రాజులు, చక్రవర్తులు వారి దేవేరులతో 'మీరు' అని బహువచన సంబోధన ఉపయోగిస్తారు కదా, మరి మీరెందుకు ఏకవచన సంబోధన చేస్తారు?"

"దేవీ, బహువచన సంబోధనలో ఆత్మీయత లోపిస్తుంది. ఏకవచన సంబోధనలో ప్రేమాతిశయం మిళితమై ఉంటుంది. ఏమంటావు"?

"ముమ్మాటికీ మీతో ఏకీభవిస్తాను" అని శచీదేవి పెల్లుబికిన ప్రేమతో ఇంద్రుడి అధరాలను సున్నితంగా చుంబించింది.

"ఆహా ఏమి ఈ మాధుర్యం దేవీ"

"ఇద్దరం అమృతం సేవించాం కదా. అదే ఈ మాధుర్యానికి కారణం" మేలమాడింది శచీదేవి. "దేవీ, చాలా రోజులైంది నందనవనంలో విహరించి, కాస్సేపలా తిరిగి వద్దామా"?

"తప్పకుండా ప్రభూ, నా మనసులోని కోరికకూడా అదే."

ఇద్దరూ వనవిహారానికి నడచి బయలుదేరారు. ఒకరినంటుకొని మరొకరు. శచీదేవి ఎడమ చేయి ఇంద్రుడి భుజాలమీద, ఇంద్రుడి కుడిచేయి శచీదేవి కుడివైపు నడుం వంపుమీద. శచీదేవి నాభి ఇంద్రుడి కుడిచేతి మధ్య వేలిని అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. ఇలా కొంతదూరం నడచిన తరువాత శచీదేవి తర్జనితో ఒక ప్రదేశాన్ని చూపిస్తూ, "నాథా, ఈ చోటు పారిజాతవృక్షం లేక వెలవెలబోతోంది కదూ. మీకు జ్ఞాపకముండే ఉంటాయి మనం ఆ చెట్టుక్రింద గడపిన లెక్కలేనన్ని మధుర ఘడియలు" అంది.

"లేకేం దేవీ, ఆ ఘడియలు మరపురాని మధుర స్మృతులు కావా. ఏమి అందం ఆ వృక్షానిది. ఏమి పరిమళం ఆ పుష్పాలది. అద్వితీయం. అది లేని లోటు తీర్చలేనిది." అని ఒక క్షణం ఆగి, "అయినా శ్రీకృష్ణుడు ఆ వృక్షాన్ని దొంగిలించి తీసుకుపోయి ఒక విధంగా మంచిపనే చేసాడు" అన్నాడు.

"దీని భావమేమిటి ప్రభూ, కొంచెం వివరంగా చెప్పండి"

"ఏమీలేదు, శ్రీకృష్ణుడుగనుక ఎడమకాలి తన్నులు ఓర్చుకోగలిగాడు కానీ నేనైతే ఓర్చుకోగలనా!" ఇద్దరూ హాయిగా పకపకా నవ్వుకున్నారు. ఇలా తీయటి కబుర్లు చెప్పుకుంటూ కొంతదూరం నడచి ఇద్దరు ఒకచోట సుఖాసీనులయ్యారు. ఇంద్రుడు కూర్చుని ఉంటే శచీదేవి అతని వడిలో తలపెట్టి పడుకుంది. ఒకరి మొహం మరొకరి మొహానికి చాలా చేరువగా ఉన్నాయి. ఇంద్రుడు శచీదేవిని తమకంతో చుంబిస్తూ చిన్నగా శృంగార చేష్టలు ప్రారంభించాడు. శచీదేవి తన్మయంతో పరవశించిపోతూ, "ప్రభువులవారికి నలుగురు బిడ్డలున్నా యౌవనమేమీ మందగించలేదు" అని కవ్వించింది.

"అదేమిటి దేవీ, దేవతలు అమరులన్న విషయం నీకు తెలియనిది కాదుగదా. అమరత్వంతో పాటు వార్ధక్యలేమి కూడా వారి స్వంతమేకదా. నా విషయం అలావుంచు, అప్సరసల తలదన్నే నీ అందంలోనూ, యౌవనపు మెరుపులోనూ ఇసుమంతైనా మార్పు లేదుగదా." ఇంద్రుడు దీటుగా కవ్వించాడు.

"దేవేంద్రులవారు దేవ సభా కార్యక్రమాలన్నీ సంధ్యాసమయానికి ముగించుకొని, అటుపిమ్మట దేవప్రముఖులతో కలసి అప్సరసల నాట్యాల్ని తిలకించడం పరిపాటికదా? ఈ రోజేమిటి.." ఇంద్రుడు తొందరగా వచ్చిన కారణం తెలుసుకోవాలని అడిగింది శచీదేవి.

"నీవన్నది నిజమే ఇంద్రాణీ, కానీ దేవలోకంలో ముఖ్య అప్సరసలెవ్వరూ లేకపోవడంతో నాట్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది".

"అదేమిటి ప్రభూ? అసలేంజరిగింది?" ఆశ్చర్యంతో అడిగింది శచీదేవి.

" విక్రమాదిత్య మహారాజు దేవేంద్ర సభలో ఊర్వశి ఉత్తమ నాట్యకత్తె అని తీర్పునిచ్చిన తరువాత రంభకు నాట్యంమీద ఆసక్తి సన్నగిల్లింది. రంభ అందగత్తెమాత్రమే కాదు. చాలా తెలివైందికూడా. అందుకే తనతో అందంలో పోటీపడగల నలకూబరుడిని ప్రేమించింది. నీకు తెలుసు కదా నలకూబరుడి తండ్రి కుబేరుడు అతి ధనవంతుడు. ఈ ఘాటు ప్రేమలో రంభ, నలకూబరుడు ఒకరిని విడిచి మరొకరు ఉండలేక సదా కలిసే ఉంటున్నారు. రంభ దేవసభకు రావడమే మానేసింది. "

"ఐతే ఇక రంభ సభానాట్యానికి రాదా?"

"ఏమో వేచి చూడాలి. ఈలోపు ఇంకో సంఘటన జరిగింది. రావణాసురుడు రంభ అందాన్ని చూసి విచక్షణారహితంగా ప్రవర్తించడంతో నలకూబరుడు కోపించి రావణాసురుణ్ణి శపించాడు." "ఏమని"?

"రావణాసురుడు ఏ స్త్రీనైనా అనుమతిలేకుండా కామంతో తాకితే అతని తల వేయి వ్రక్కలవుతుందని."

"రావణాసురుడికి పది తలలు కదా. ఒక్కొక్క తలా వేయి వ్రక్కలవుతుందా, పదితలలూ కలిసి వేయి వ్రక్కలవుతాయ?" పొంగి వచ్చే నవ్వునాపుకోలేకపోయింది శచీదేవి.

"ఒక విధంగా ఈ శాపం దేవలోకానికి వరమే."

"ఎలా"?

"రావణుడు సీతాదేవినపహరించి శాపభయంతో ఆమెను తాకలేక శతవిధాలా ప్రయత్నించినా ఆమె అనుమతిని పొందలేక సతమతమౌతున్న విషయం నీకు తెలుసుగదా"?

"అవును తెలుసు. దానివలన దేవలోకానికి కలిగే లాభమేమిటి?"

"రావణుడు మహా వీరుడు. ఈ విషయంలో తలమునకలై ఉండకపోతే ఈపాటికి అమరావతిపై దండెత్తి నా సింహాసనాన్ని అధిష్టించేవాడు".

“సరే, రంభ విషయం అలా ఉంచండి. మరి ఉర్వశికేమైంది?"

"ఏమని చెప్పను శచీ. ఊర్వశిది మరో ప్రేమ కథ. కాకపోతే భగ్న ప్రేమ".

"ఏం జరిగింది ప్రభూ, కొంచెం వివరంగా చెప్పండి".

"నా పుత్రుడు అర్జునుడు దేవలోకానికి వచ్చి విశేష అస్త్రాల్ని పొందడం, గాంధర్వుడైన చిత్రసేనుని వద్ద నాట్యాభ్యాసం చెయ్యడం, దీనికి ప్రతిఫలంగా సర్వ దేవతల కోరిక మేరకు నివత కవచ రాక్షసులను సంహరించడం నీకు తెలిసిందే కదా"?

"తెలుసు, అయితే దీనికి ఊర్వశికి ఏమిటి సంబంధం"?

"అక్కడికే వస్తున్నాను. అర్జునుడు మహా పరాక్రమవంతుడు మాత్రమే కాదు, అత్యంత శృంగార పురుషుడు కూడా. నాగలోకానికి వెళ్లి రాచకన్య ఉలూపితోపాటు నాగకన్యలందరిని శృంగారంలో ఓలలాడించిన విషయం జగత్ప్రసిద్ధం కదా. అటువంటి అర్జునిడి పరాక్రమాన్ని, శృంగారాన్ని విని ఊర్వశి అతనిపై ప్రేమను, మోజును పెంచుకుంది".

"అపుడేమైంది"?

"ఊర్వశి ఈ విషయం నాకు మన్నవించుకుంది".

"మీరేం సలహా ఇచ్చారు"?

"అర్జునుడు దేవలోకానికి చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఊర్వశిని సమర్పిస్తే ఉచితంగా ఉంటుందని భావించి ఆమెను అర్జునుడిని చెంతకు వెళ్ళమని ప్రోత్సహించాను".

"వెళ్లిందా, అర్జునుడేమన్నాడు"? ఉత్సాహం ఆపుకోలేక అడిగింది శచీదేవి.

"సంధ్యానంతర సమయంలో ఊర్వశి అర్జునుని చెంతకు చేరి తన మనసులోని కోరికను తెలియపరచింది. అర్జునుడు ఆమెను రెండు నిమిషాలపాటు తేరిపార చూసి కనులు మూసుకుని చేతులు జోడించి నమస్కరించి, 'నీవు నాకు మాతృసమానురాలవు, కనుక నీ కోర్కెను తీర్చజాలను' అన్నాడు”.

"ఊర్వశి అర్జునునికి మాతృసమానురాలా"?

"ఊర్వశి నిత్య యౌవని. ఆమెకు వార్ధక్యం లేదు. పూర్వాశ్రమంలో ఆమె కురువంశ పూర్వీకుడైన పురూరవుడి పట్టపురాణి. ఇలా భంగపడిన ఊర్వశి అర్జునిడిని నపుంసకుడిగా మారిపొమ్మని శపించింది".

"అయ్యో, అంతటి శాపమా"!

"ఈ శాపం గురించి తెలుసుకున్న నేను, మిగిలిన దేవప్రముఖులు శాపాన్ని సడలించమని కోరగా, ఊర్వశి ఆ శాపాన్ని ఒక సంవత్సర కాలానికి కుదించింది. ఇలా ప్రేమ వైఫల్యంతోనూ, అర్జునునివంటి ఉత్తమ పురుషుణ్ణి శపించానన్న పశ్చాత్తాపంతోను కృంగిపోతున్న ఊర్వశి దేవసభలో నాట్యానికి రాకపోవడం సహజమే కదా"?

"ఎంతపని జరిగింది! దేవసభలో నిత్యం జరిగే నాట్య కార్యక్రమంలో రంభా, ఊర్వశులు పాల్గొనలేకపోవడం తీరని లోటు. మరిక మిగిలిన ఉత్తమ నాట్యకత్తెలు తిలోత్తమ, మేనక...". "వాళ్ళిద్దరూకూడా భూలోకంలో ఉన్నారు. సుందోపసుందుల గురించి నీవు వినే ఉంటావుకదా. వారిద్దరూ కవలలు. ఇద్దరిదీ ఒకేమాట, ఒకేబాట. మహాబలశాలులు. వారిద్దరూ ఒకరిచేతిలో మరొకరు తప్ప మరేవిధంగాను చావకుండా వరం పొందారు. వారిద్దరూ ఒకరితో ఒకరు తలపడి పోరాడడం అసాధ్యం. తిలోత్తమ కారణజన్మురాలు. విశ్వకర్మచే సృష్టించబడిన అత్యంత సౌందర్యవతి. చాకచక్యం ఆమె స్వంతం. సుందోపసుందుల మధ్య విభేదం కలిగించడం ఆమెకు మాత్రమే సాధ్యం. ఈ మహత్తర కార్య నిర్వహణ నిమిత్తం తిలోత్తమ భూలోకానికెళ్ళింది" వివరించాడు దేవేంద్రుడు.

"అయితే మేనకకూడా ఏదో ముఖ్య కార్యాచరణ నిమిత్తమే భూలోకానికి వెళ్ళి ఉంటుంది".

"నీ ఊహ నిజమే. మేనక తన సౌందర్యంతోను, నాట్యంతోను, శక్తియుక్తులతోను విశ్వామిత్ర మహర్షులవారి తపస్సు భంగం చేయడానికి భూలోకానికి వెళ్ళింది. ఈ పని అంత సులభతరంకాదు. చాలా శ్రమించాలి".

"అయితే మేనక తిరిగి రావడానికి చాలాకాలం పడుతుందన్నమాట".

"అవును. తిరిగొచ్చిన తరువాతకూడా చాలాకాలం మేనక నాట్య ప్రదర్శనకు రాకపోవచ్చు".

"ఏం ప్రభూ?" శంకా నివృత్తికోసం ప్రశ్నించింది శచీదేవి.

"దేవీ, నేను నీకిప్పుడు ఒక దేవరహస్యం చెప్పాలి. ఈ రహస్యం నీతోనే ఉండాలి. విశ్వామిత్రులవారికి, మేనకకు ఒక బిడ్డ జన్మిస్తుంది. మేనక ఆ బిడ్డను భూలోకంలో వదలి తాను దేవలోకానికి మరలి వస్తుంది. తనయ వియోగ దుఃఖంనుంచి తేరుకోవడానికి మేనకకు చాలాకాలం పట్టవచ్చు".

"నాట్యసభలో మిగిలిన అప్సరసలు నాట్యం చేయవచ్చు కదా?"

"ప్రముఖ అప్సరసలు లేని నాట్యప్రదర్శన వెలవెలబోతోంది. దేవ ప్రముఖులెవ్వరూ రావడంలేదు. అందుచేత నిత్యసభలను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది" అని వివరించి దేవేంద్రుడు తన శృంగారపూరిత మాటలను, చేష్టలను కొనసాగిస్తూ, "నీకో విషయం చెప్పనా. దేవ సభాధ్యక్షుడుగా కర్తవ్య నిమిత్తం నేను నాట్యసభకు కూడా తప్పనిసరిగా అధ్యక్షత వహించాలి. కానీ ఆ సభలో ఉన్నంతసేపు నా కళ్ళకు కనిపించేది శచీదేవి ముఖారవిందామే. ఆ సమయంలో ఇంతటి మహా సౌందర్యవతి, శృంగార ఖని అయిన దేవేరితోకూడి ఉండలేనందుకు చాలాసార్లు అంతులేని ఖేదం కలుగుతుంది" అన్నాడు.

"అయితే అప్సరసలు తిరిగి వచ్చేంతవరకు నాకు ప్రభువుల సేవచేసుకోడానికి మరింత సమయం చిక్కుతుందన్నమాట" అన్నది శచీదేవి, మురిపెంతోను, ఆనందంతోను నిండిన మనసుతో.

"సఖీ, ఈరోజు నాకు మహదానందంగా ఉంది" అన్నాడు ఇంద్రుడు, కోర్కెను ప్రకటించే కళ్ళతో శచీదేవి కళ్ళలోకి చూస్తూ. అప్పటికే ఉద్రేకంతో ఉన్న శచీదేవికి మరింత ఉద్వేగం కలగడంతో గులాబి వర్ణానికి మారిన చెక్కిళ్ళ పైబడిన వెన్నెల కిరణాలు పరావర్తనం చెంది వింత రంగులతో మెరిసిపోతున్నాయి. ఆ మించిన శచీదేవి అందాన్ని చూడడానికి ఇంద్రుడికి వేయికళ్లు సరిపోవడంలేదు. శచీదేవికి కొండమీదకు దిగి పిండి కొట్టినంత ఆనందం కలుగుతోంది. ఆనందాతిశయంతో తన తనూలతను ఇంద్రుడి చుట్టూ చుట్టేసింది. ఇంద్రుడు కంచుకం ముడి విప్పాడు. కంచుకం క్రిందకు జారింది. ఇంద్రుడు మోహోద్రేకంతో ఆమెను తనలో ఐక్యం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. చల్లగాలి వారిద్దరి మధ్యకు ప్రవేశించడానికి తహతహలాడుతూ ఖాళీప్రదేశం దొరక్క తపించిపోతోంది. ఇంతటి మనోహర దృశ్యాన్ని పైనుంచి చూస్తున్న చంద్రుడు సిగ్గుపడి దాగడానికి మబ్బుల్లేక, తెల్లబోయి, తెల్లటి వెన్నెలను ప్రసరిస్తూ ఆకాశంలో కదలనా మాననా అన్నట్లు కదులుతున్నాడు.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి
రచయిత పరిచయం :


పేరు: డా. వేగుళ్ళ కోటేశ్వరరావు

ఊరు: బెంగళూరు

వయసు: 68

వృత్తి: అంతరిక్ష పరిశోధన

నేను ఆరు నెలల క్రితం కథలు వ్రాయడం మొదలు పెట్టాను. నా మొదటి కథ 'బకుడు' కౌముది మాసపత్రిక, సెప్టెంబరు 2020 సంచికలో ప్రచురించబడింది. 'శచీంద్రం' అచ్చయిన నా రెండవ కథ.

888 views7 comments
bottom of page