top of page
Writer's pictureSiripurapu Hanumath Prasad

సాధన

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






'sadhana' written by Siriprasad

రచన : శిరిప్రసాద్

భాను మూర్తి మంచి దైవ భక్తుడు.

ప్రవచనాలు కూడా చెబుతుంటాడు.

కాన్సర్ బారిన పడి స్థిత ప్రజ్ఞత కోల్పోతాడు.

సమయానికి స్నేహితుడు రంగనాథ్ హితబోధ చేస్తాడు.

మార్గ నిర్దేశం చేస్తాడు


భాను మూర్తి పక్కలో అసౌకర్యంగా కదులుతున్నాడు. రెండు నెలలుగా తెలియని వ్యాధితో బాధపడ్డాడు. ఆ వ్యాధి యేదో తెలిస్తే సగం తగ్గిపోయినట్టే అనుకున్నాడు. కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి తిరిగి వేల రూపాయలు ఖర్చుపెట్టాడు. చివరికి డాక్టర్లు నిన్ననే తేల్చారు. కడుపులో కాన్సర్. రెండో స్టేజి లో వుందిట. డాక్టర్లు ఆయనకేమీ చెప్పలేదు కానీ, కొడుకు వేదవ్యాస్ కి చెప్పారు. డాక్టర్ తన కొడుకుతో చెబుతున్నప్పుడు వినపడ్డ రెండుముక్కలు , కాన్సర్ వ్యాధి గా నిర్ధారణ, దానికి కేమో థెరపీ చేయాలన్న విషయాలు.

భానుమూర్తికి కళ్ళ వెంబడి కన్నీరు ధారలు కట్టాయి.

'పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం' క్రిందటి జన్మలో తను యెంతటి మహాపాపం చేసాడో, ఈ జన్మలో యింతటి క్రూరమైన వ్యాధి తగులుకొంది ! కాన్సర్ వ్యాధికి మందు లేదని కదా అనేది. మరి కేమో థెరపీ చేయించడ మెందుకు? దానికి ఎన్ని లక్షలు ఖర్చుపెట్టాలో కదా! అంత ఖర్చు పెట్టినా వ్యాధి తగ్గిన దాఖలాలు లేవు. తన బంధువులిద్దరు ఆ వ్యాధికి బలయ్యారు. లక్షలు ఖర్చు పెట్టి అప్పుల్లో మునిగారే తప్ప రోగులు బతకలేదు.

'టీచర్ గా ఐదేళ్లు పనిచేసి , రాజీనామా చేసి తర్వాత తను ప్రవచనకర్తగా కొద్దిగా సంపాదించుకుంటూ, పిల్లల్ని పెంచి పెద్దచేసుకున్నాడు. చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసినా, యిప్పుడీ ఖర్చు పెట్టుకోగలరా? అప్పులపాలై, తనను తిట్టుకోరుకదా?... తగ్గదని తెలిసిన వ్యాధికి డబ్బు తగలేయడం తెలివితక్కువ కాదా? అది తెలిసీ యిద్దరు కొడుకుల చేతా లక్షలు ఖర్చు పెట్టించడం, వాళ్ళు ఎన్నేళ్లో కష్టపడితే కానీ తీర్చుకోలేని అప్పు చేయించడం పాపం కాదా? ……

తను ప్రారబ్ధ కర్మని జయించలేడా ?

'నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి, అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ ||' అనుభవించకుండా కర్మ నశించదు కదా! కోటి జన్మలు తప్పించుకున్నా , దానిని అనుభవించాకే అది పోతుంది. ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాప కర్మ పోతుందంటారు కదా! ఎందరో గురువులు పాపాల్ని భస్మం చేసి, శిష్యులని కాపాడ లేదా? 'ప్రాయశ్చిత్తై రపైత్యేనః'. ప్రాయశ్చిత్తంతో పాపాలు పోతాయంటారు. కానీ ఈ పరిస్థితుల్లో అది సాధ్యమౌతుందా? ఈ డాక్టర్లు, భార్యా బిడ్డలూ తనని కదలనిస్తారా? ఈ రెండునెలలు వృధా చేసాడే తను . గాయత్రి లక్షసార్లు చేసికొని వుంటే , తన అనారోగ్యం యీ వ్యాధి కింద మారేది కాదేమో?'

పక్క మీద అటూ,యిటూ కదులుతూ, ఆలోచన కొనసాగిస్తున్నాడు భానుమూర్తి.

“అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి నుద్దేశించి కన్నీటి పర్యంతమైన ఆ తల్లి, అమ్మగా నా ముచ్చట తీర్చకుండా యింత చిన్న వయసులో సన్యసిస్తే నేనెట్లా బ్రతికేది నాయనా? పెళ్ళి చేసుకుని గృహస్తుడవై పిల్లల్ని కన్నాక సన్యసించాలి కానీ, యిలా చిన్న వయసులో కోరికలు తీరకుండా సన్యసిస్తే అది ధర్మ విరుద్ధం కాదా నాయనా, అని ప్రాధేయ పడింది. తల్లిని వోదార్చి గురుదేవుడు తల్లికిలా బోధించాడు.

" అమ్మా, భౌతిక మైన శరీరము, భోగభాగ్యాలు అశాశ్వతమైనవి. మరణం లేని జీవి లేదు. మృత్యువు ప్రతిజీవి యొక్క ఆయుష్షు ని లెక్కపెడుతూనే వుంటుంది. గడిచే ప్రతి పగలూ, రాత్రీ మనిషి ఆయుర్దాయాన్ని యెగరేసుకు పోతుంటాయి. ఈ శరీరమూ, భార్యాబిడ్డలూ, గృహము, ధనమూ, జీవితమూ అశాశ్వతమని మర్చిపోయి అవే ముఖ్యమని భావించేవారు పశువులతో సమానం. ధర్మాన్ని ఆచరించటమే మనిషి కర్తవ్యమ్. ప్రాపంచిక విషయాలపై మమకారం పెట్టుకోడం అనేది ఆత్మవంచనే అవుతుంది. రక్తమాంసాలతో నిండిన ఈ శరీరం అశాశ్వతం. ఆత్మ శాశ్వతం. దానికి సుఖదుఃఖాలు లేవు. ఉత్తమ మైన మానవ జన్మ యెత్తి కూడా ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ శ్రేయస్సుని కోరుకొనే వాడు ఆత్మవంచకుడూ, వృధా ప్రయాసకుడూ!ఆత్మజ్ఞానంతో మోక్షాన్ని కాంక్షిస్తూ ధర్మ మార్గంలో ప్రయాణించేవాడు ఉత్తమ గతులు పొందుతాడు. ఈ ప్రకారంగా నృసింహ సరస్వతి తల్లికి జ్ఞానోపదేశం చేసి సన్యాసం స్వీకరించాడు."

ఒక శ్రోత లేచి భానుమూర్తిని ప్రశ్నించాడు, 'గురూజీ, యమలోకం లో మన పాపాలకి ఎన్నో శిక్షలు అనుభవించాక కూడా, మళ్ళీ మరు జన్మలో కష్టాలు వస్తాయెందుకు?" చిన్నగా నవ్వి భానుమూర్తి అన్నాడు, " యీ ప్రశ్ననే శ్రీ గురుని శిష్యుణ్ణి అడిగారు. ఆయన యీ విధంగా చెప్పారు -మన దేహం కొన్ని రకాలైన శిక్షల్ని మాత్రమే అనుభవించగలదు. దేహంతో అనుభవించలేని శిక్షల్ని సూష్మ శరీరంతో నరకంలో అనుభవించాలి. యమలోకంలో అలాంటి శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వుంటాయి. మరి యీ పాపాలకి పరిహారమే లేదా, అని మీరు అడగవచ్చు. దానికి జవాబుగా శ్రీ నృసింహ సరస్వతి చెప్పింది వినండి. “నిజమైన పస్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. తప్పులు మళ్ళీ చేయకుండా గురువు ని సేవించడం వల్ల, ఆయన ఆదేశంచిన విధంగా యజ్ఞయాగాదులు, దానధర్మాదులు చేయడం వల్ల ఆ పాపాల్ని తుడిచి వేయ వచ్చు.”

తన ప్రవచనాలు గుర్తుకు వస్తున్నాయి భానుమూర్తికి. అశక్తుడైనట్టు, వొళ్ళు పుచ్చి పోయినట్టు, అసమర్థుడైపోయినట్టు, ఆసుపత్రి బెడ్ మీది నించి లేవలేని పరిస్థితిలో వున్నట్టు చింతిస్తున్నాడు. ఇంతలో డాక్టర్, కూడా కొడుకు వేదవ్యాస్ వచ్చారు.

" భానుమూర్తి గారూ!" డాక్టర్ పిలుపుకి నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ఏమిటో చెప్పండి, అన్నట్టు డాక్టర్ కళ్ళల్లోకి చూసాడు భానుమూర్తి. మీరు చెప్పబోయేదేమిటో నాకు తెలుసులే, అన్నట్టు కూడా వుంది ఆ చూపు. ఎందుకంటే ఆ చూపులో డాక్టర్ ఏం చెప్తాడో అనే భయం లేదు. బాధ మాత్రమే వుంది.

" మీకు ఒక గుడ్ న్యూస్, ఒక బాడ్ న్యూస్ చెప్పాలి. మీ లాంటి స్థిత ప్రజ్ఞులకి బాడ్ న్యూస్ అంటూ వుండదని నాకు తెలుసు. ఇంటినించి హాస్పిటల్ కి వచ్చే ప్రతిరోజూ కారులో రికార్డు ప్లేయర్ లో ప్రవచనాలు వింటూ వుంటాను. టెక్నాలజీ మన జీవితాల్లో తెచ్చిన మంచి మార్పుల్లో అదొకటి. ఒక్కో సారి మీ ప్రవచనాలు కూడా వింటూ వుంటాను. మీకు ట్రీట్మెంట్ యివ్వాల్సి రావడం దురదృష్టకరం. కానీ ఆ అవకాశం నాకు రావడం నా అదృష్టం. మీరు నమ్మే భగవంతుడు మిమ్మల్ని తప్పక స్వస్థుడ్ని చేసి మాలాంటి వారికి ధర్మ మార్గం వుపదేశిస్తూ వుండమని మీకు లాంగ్ లైఫ్ యిస్తాడు తప్పకుండా...' వొక క్షణం ఆగాడు. భానుమూర్తి ముఖం మీదికి చిరునవ్వు తెచ్చుకుని,

" చెప్పండి డాక్టర్ గారూ!... దేవుడి లీలలు మనకర్ధం కావు. ఆయన యేది చేసినా అది మన మంచికే అనుకోవాలి" అన్నాడు, గద్గదంగా.

"ఎంత బాగా చెప్పారు!...... మీకు కాన్సర్ వచ్చినట్టు పరీక్షలలో తేలింది. గుడ్ న్యూస్ యేమిటంటే అది మొదట్లో వున్నప్పుడే మనం తెలుసుకోగలగటం. ఇప్పుడు కాన్సర్ అంటే మరణ శాసనం కాదు. కొత్త ట్రీట్మెంట్ విధానాలు వచ్చాయి. ఈ స్టేజి లో కేమో థెరపీ తో తగ్గించవచ్చని మా దృఢమైన అభిప్రాయం. మేము ట్రీట్మెంట్ మాత్రమే యివ్వగలం . వ్యాధిని పూర్తిగా తగ్గించాల్సింది భగవంతుడే! అంటే నా అభిప్రాయం, ‘వియ్ ట్రీట్ హి హీల్స్,’ అని. మీ ఆత్మస్థైర్యం, గెలుస్తాననే విస్వాసం మా ట్రీట్మెంట్ కి బలాన్నిస్తాయి,' అని వివరించాడు డాక్టర్. వేదవ్యాస్ భయంగా తండ్రి వైపు చూస్తున్నాడు.

భానుమూర్తి బాధగా నవ్వి, తల వూపాడు. ఒకటి, రెండు రోజుల్లో ట్రీట్మెంట్ మొదలు పెట్టాలని డాక్టర్ చెప్పారు. భానుమూర్తి, వేదవ్యాస్ యింటికి బయల్దేరారు.

ఇంటికి చేరగానే కూతురు సంధ్య తలుపు తీసింది. కూతుర్ని చూడగానే ఆయన గుండె బరువెక్కింది.

విషయం ఏమిటన్నట్టు సంధ్య వేదవ్యాస్ వైపు చూసింది. అతను కొంచం ఆగమన్నట్టు సంజ్ఞ చేసాడు. లోపలికి వెళ్లిన భానుమూర్తి తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. భార్య వఛ్చి భానుమూర్తి వైపు అనునయంగా చూసింది. ఆమె ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే. అయినా యింటి పని మొత్తం చేస్తుంది. ఉదయమే అర్ధ గంట పూజ తో ప్రారంభించి, రాత్రి పది వరకు పనిలో నిమగ్నమై వుంటుంది. భర్త అవసరాలను కంటికి రెప్పలా చూసుకుంటుంది. పొదుపుగా సంసారాన్ని నెట్టుకొస్తోంది. భర్త అనారోగ్యం ఆమెని కలచివేసింది. ప్రస్తుతం పూజలో ఆమె దేవుళ్ళని ప్రధానంగా కోరుకుంటున్నది భర్త కి ఆరోగ్యం ప్రసాదించామనే ! కొడుకు, కూతురు పక్క గదిలో గుస గుస లాడుతున్నారు. తండ్రికి కాన్సర్ అన్న విషయం తెలిసి సంధ్య మ్రాన్పడి పోయింది. భర్తని వదిలి పుట్టింటికి వఛ్చిన తనను, లోపల ఎంత మధన పడుతున్నాడో తెలియదు కానీ, ప్రేమగా చూకుంటున్నాడు తండ్రి. ఇప్పుడీ వ్యాధి వఛ్చి తండ్రి తనకు దూరం అయితే తన పరిస్థితి ఏమిటి? సంధ్య అన్నయ్య వంక బాధగా చూసింది. సంధ్య భర్తని వదిలి పుట్టింటికి రావడంలో వేదవ్యాస్ పాత్ర కూడా వుంది. ఆవేశం అతణ్ణి ఆలోచించనీయ లేదు. అతనికి మంచి కంపెనీ లో మంచి వుద్యోగం రావడమే అతని ఆవేశానికి కారణం అయింది. మరో తమ్ముడు చిన్న వుద్యోగంలో చెన్నైలో వుంటున్నాడు. అంతంత మాత్రమైన అతని ఆర్ధిక పరిస్థితి అతణ్ణి ఆలోచింప చేసింది. తొందరపడొద్దని సంధ్యకి చెప్పాడు.

కానీ "అహం" అడ్డొఛ్చి సంధ్య భర్తతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వచ్చేసింది. సాంప్రదాయ కుటుంబాల్లో కుమార్తెని పుట్టింటికి వచ్చేయడానికి అనుమతించరు. భానుమూర్తి అటు సంప్రదాయాలకు కట్టుబడి వుండే ప్రవచనకర్త, యిటు బిడ్డ పట్ల అనురక్తి అధికంగా ప్రదర్శించే బలహీనుడు. కూతుర్ని ఏమీ అనలేక పోయాడు. కొడుకు మద్దతు వుండడంతో కూతురు అంత పెద్ద నిర్ణయం తీసుకుందని తెలుసుకున్నాడు.

వేదవ్యాస్ తల్లిని తన గదికి పిలిచి జరిగినదంతా వివరించాడు. తండ్రికి యివ్వబోయే చికిత్స గురించి చెప్పాడు. ఆయనకి ధైర్యం చెబుతుండాలనీ, యెలాంటి పరిస్థితుల్లోనూ బాధ పడే విషయాలు మాట్లాడకూడదనీ, బంధువులెవ్వరికీ అప్పుడే చెప్పద్దనీ తల్లికి చెప్పాడు. కళ్ళనీళ్ళు పెట్టుకుని తల వూపింది.

ఆ సాయంత్రం భానుమూర్తి చిరకాల మిత్రుడు రంగనాథ్ వచ్చాడు. భానుమూర్తి అన్నీ విషయాలు ఆయనతో పంచుకున్నాడు. రంగనాథ్ నిస్చేష్టుడయ్యాడు.

" భానూ, కష్టాలు కలిసి వస్తాయంటారు. అధైర్య పడకు. నీకు చెప్పేంతవాణ్ణి కాను కానీ, యీ సమయంలో ధైర్యం వహించాలి. నువ్వు నమ్ముకున్న భగవంతుడు నిన్ను తప్పక కాపాడతాడు. నీ బిడ్డ సమస్యకి కూడా ఆయనే పరిష్కారం చూపుతాడు. బాబా అమ్మాయి పెళ్ళి యెలా జరిపించాడో గుర్తుతెచ్చుకో!"

అవును. భానుమూర్తి కుమార్తెకి పెళ్ళి సంబంధం కుదరగానే జరిగిన అద్భుతం నమ్మశక్యం కానిదే.

సంధ్యని చూసి పెళ్ళికి అంగీకారం తెలిపిన పెళ్ళివాళ్ళు కట్నం వద్దు కానీ, పెళ్ళి ఘనంగా చేయాలన్నారు. చేతిలో రెండు లక్షలు వున్నాయి. ఎప్పటినించో పిల్ల పెళ్ళి కోసం దాచినవి. ఖర్చు పది లక్షలకు తేలింది. కొడుకు లోన్ తీసుకుని మూడు లక్షలు సర్దుతానన్నాడు. ఇంకా ఐదారు లక్షలు కావాలి. ఒక రోజు శివాలయం మెట్ల మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు భానుమూర్తి, 'ఐదు లక్షలు ఎవర్ని అడగాలి, యిల్లు కుదువ బెడితే యిచ్చేవాళ్ళున్నారు కానీ, వడ్డీ చాలా అడుగుతారు. ఆ అప్పు తీర్చడం అసాధ్యం కూడా. బాంకు లో వృధులకిచ్చే లోన్ వుందికానీ, తను యింకా లోకం దృష్టిలో వృద్దుడు కాలేదు. మార్ట్ గేజ్ లోన్ యిస్తారేమో కనుక్కోవాలి...'

ఇంతలో ఒక పిల్లాడు పరిగెత్తుకుంటూ తన వైపు వస్తున్నాడు. నేలమీద కొంచం దూరంలో ఒక ఫోటో కనపడింది. బహుశా యేదో సరుకు ప్యాకెట్ మీద వుండే బొమ్మ కావచ్చు. సాయిబాబా బొమ్మలాగా కనిపించింది. ఆ పిల్లాడి కాలు ఆ బొమ్మ మీద పడుతుండగా గట్టిగా అరిచాడు భానుమూర్తి. ఆ ఫోటో మీద పెట్టబోతున్న కాలిని గాలిలోనే వుంచి, ఆ పిల్లాడు భానుమూర్తి వైపు చూసాడు. ఆ ఫోటో తీసి తనకిమ్మన్నాడు. ఆ పిల్లాడు ఆ ఫోటో తీసి కళ్ళకద్దుకుని భానుమూర్తికిచ్చాడు. అది షిర్డీ సాయి బొమ్మే. భానుమూర్తి సాయిబాబాని యెప్పుడూ పూజించి యెరుగడు. అయినా ఆ ఫోటోని తీసుకొని కళ్ళకద్దుకుని జేబులో పెట్టుకున్నాడు. నెమ్మదిగా లేచి గుడి బయటికి వచ్చాడు. సన్యాసి దుస్తుల్లో వున్న ఓ బిక్షకుడు ఆయన దగ్గిరకొచ్చి చెయ్యి చాచాడు. ఒక క్షణం ఆలోచించి భానుమూర్తి తన జేబులో వున్న చిల్లరంతా తీసి యిచ్చాడు . ఆ బిచ్చగాడు రెండు రూపాయల నాణెం తీసుకుని మిగిలిన చిల్లరంతా భానుమూర్తికి తిరిగి యిచ్చేసాడు. ఆశ్చర్యంగా ఆ చిల్లర తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఆ బిచ్చగాడు వేగంగా వెళ్ళిపోయాడు.

భానుమూర్తి తెలివి తెచ్చుకుని చుట్టూ చూసాడు. ఆ బిచ్చగాడు కనపడలేదు. ఇంటికి వెళ్ళి ఆలోచించాడు. జేబులో సాయిబాబా బొమ్మ, మనసులో ఆ బిచ్చగాడి రూపం. అది శుభసూచకం గా అనిపించింది. భార్యకి చెప్తే, ఆవిడ సాయి లీలలు కొన్ని తనకు యితరులు చెప్పినవి వల్లె వేసింది. మనసులో శివార్పణం అనుకున్నాడు. మర్నాడు సాయంత్రం వారింటికి అనుకోని అతిధి వచ్చాడు. మూర్తి రాజు గారు. ఆయన తాత పెద్ద జమీందారు. తండ్రి ప్రభుత్వం లో పెద్ద వుద్యోగి. సంపద కి కొదవ లేదు. ఆ కుటుంబం దగ్గిర టన్నుల కొద్దీ బంగారం వుందని ప్రజల నమ్మకం. ఎంతో మంది పేదవారి కి కుమార్తెల వివాహానికి మంగళసూత్రం బహూకరిస్తుంటాడు. మూర్తి రాజు గారికి ఆడ పిల్లలు లేరు. ఆయన భానుమూర్తి గారి ప్రవచనాలకి హాజరౌతుంటాడు. భానుమూర్తి గారి యింటికి అప్పుడప్పుడు బస్తా బియ్యం, కిలో నెయ్యి, పప్పులూ, కూరగాయలూ పంపిస్తూ తన భక్తి చాటుకుంటాడు.

" అయ్యా కూర్చోండి. ఊరకే రారు మహానుభావులు!" అంటూ భానుమూర్తి ఆయనని కూర్చోబెట్టి, మజ్జిగ తెమ్మని భార్యని పురమాయించాడు.

"మూర్తి గారూ, మీ అమ్మాయికి పెళ్ళి దాదాపు కుదిరిందని గుడి అయ్యగారు చెప్పారు....."

"అవును రాజు గారూ!... భగవంతుడి దయ!"

"ఇప్పుడు ఆయనే నన్ను మీ యింటికి పంపించాడనుకోండి. పెళ్ళి యెప్పుడు , యెక్కడ , యెలా చేద్దామనుకుంటున్నారు?."

భానుమూర్తి గారు మొత్తం వివరాలు చెప్పారు.

" శర్మ గారూ! ఆ ఐదు లక్షల లోటు నేను పూడ్చుతాను. మీ అమ్మాయి పెళ్ళి కోసం యెదురు చూస్తున్నాను. ఇది భగవంతుడు నాకిచ్చిన అవకాశం. నాకు ఆడ పిల్లలు లేకపోవడం వల్ల కావచ్చు, మీ పట్ల నాకున్న అపారమైన గౌరవం వల్ల కావచ్చు, నేను యీ నిర్ణయం తీసుకున్నాను. ఇది భగవదేచ్ఛ. కాదనకండి...'

చాలా సేపు ఆలోచించి, " నేను రుణగ్రస్తుణ్ణయిపోతాను ...' అన్నాడు గొంతు పెగల్చుకుని.

"ఋణానుబంధాలు వుంటూనే వుంటాయి. నేనే మీకు ఏ జన్మలోనో రుణ గ్రస్తుణ్ణయివుండవచ్చుకదా! ..."

చాలాసేపు వాదం నడిచింది. చివరకి ఆ సహాయం భగవత్ప్రసాదం గా భావించి భానుమూర్తి అంగీకరించాడు.

నిజానికి కుమార్తె పెండ్లికి యింకా యెక్కువే ఖర్చు అయింది. పెళ్ళి బట్టలు, మంగళ సూత్రం, వొక బంగారు గొలుసు కూడా మూర్తి రాజు గారే కొన్నారు. భానుమూర్తి ఆశ్చర్యపడుతూ మనస్సులో పరమేశ్వరుడికీ, సాయి బాబాకి దణ్ణం పెట్టుకుంటూనే వున్నాడు. అలా సునాయాసంగా జరిగిపోయింది సంధ్య వివాహం.

మరి కాసేపు మాట్లాడుకున్నాక ధైర్యంగా వుండమని పదే పదే చెప్పి వెళ్ళిపోయాడు రంగనాథ్.

మర్నాడు భానుమూర్తి కేమో థెరపీ లో భాగంగా మొదటి విడత ఇంజక్షన్ యిచ్చారు. అది కొన్ని గంటల సమయం పట్టింది. పక్కన కొడుకు, కూతురు కూర్చున్నారు. డాక్టర్ అప్పుడప్పుడు వచ్చి చూసి పోతున్నాడు. భానుమూర్తి కళ్ళు మూసుకుని ఆలోచనల్లోకి జారి పోతున్నాడు. కొంచం మత్తుగా అనిపించింది కూడా. పెళ్ళై యింటికొచ్చిన కూతురు, పెళ్ళికాని కొడుకుని చూసి విచారంగా దేవుడ్ని ప్రార్ధిస్తున్నాడు. ఆయన చెప్పే ప్రవచనాలు కొన్ని గుర్తుకొస్తున్నాయి.

"ఎనభయ్ నాలుగు లక్షల రకాల జీవుల్ని సృష్టించిన భగవంతునికి మనిషిని పుట్టించాలని ఎందుకనిపించింది? మనిషి ని సృష్టించి జ్ఞానం యిచ్చాడు. జ్ఞానం ఎందుకిచ్చాడంటే తనని తెలుసుకుంటాడని. తనని తెలుసుకుని యేమి చేస్తాడు? ఆయన వుద్దేశం ప్రతి మనిషీ తనని తెలుసుకుని తనని చేరుకోవాలనే. మానవ జన్మ యెంత కలుషితమైనా, తనని ధ్యానించడంతో అది పునీతమౌతుందని చెప్పకనే చెప్పాడు. జననమరణాలనే చక్రంలో పడి కొట్టుకుంటుండే మనిషి ముముక్షువై మోక్షాన్ని కోరి మళ్ళీ తనలోనే కలవాలనేది ఆయన అభిలాష. తనని పొందేందుకు, తనలో లీనమయ్యేందుకు భగవత్గీతలో యెన్నో మార్గాలు సరళంగా చెప్పాడు.

"నిజానికి పరమాత్ముడు వొక సేల్స్ మాన్ లా మోక్షాన్ని అమ్మ జూపుతాడు. దాని ధర ధనవంతుడికైనా, పేదవాడికైనా అందుబాటులోనే వుంటుంది . ఉపనిషత్తులలో చెప్పిన యజ్ఞ యాగాది క్రతువులు చేయచ్చు. దానధర్మాలు చేయచ్చు. ధార్మిక జీవితం గడుపుతూ, తన కర్మని ఫలాపేక్ష లేకుండా నిర్వర్తిస్తూ కైవల్య సాధన చేయొచ్చు. ఈ యజ్ఞాది కార్యాలు కష్టమైన వారికి పరమాత్ముడు వొక సులభ మార్గం కూడా వుపదేశించాడు .

"అంత కాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం

యః ప్రయాతిస మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః

అంత్యకాలం లో నన్నే స్మరించుచూ మరణించేవాడు నన్నే పొందుతాడు. ఇందే మాత్రమూ సందేహం లేదు.

'యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం

తం తమే వైతి కౌంతేయా సదా తద్భావ భావితః

కౌంతేయా, మనుష్యుడు అవసానదశ యందు యే యే భావములను స్మరించుచూ మరణించునో, మరు జన్మలో ఆయా స్వరూపములనే పొందును.

కనుక భక్తులారా, శ్రీ కృష్ణ పరమాత్ముడు చెప్పిన యీ విషయాలు సర్వదా జ్ఞప్తి యందుంచుకుని ఆయనను సర్వదా ధ్యానం చేసుకుంటుండాలి. చివరి క్షణాలలో వేరే యే విషయమైనా స్మరిస్తూ వుంటే దాన్నే పొందుతాము కానీ, భగవంతుణ్ణి చేరలేము. ఈ విషయంలో వొక చిన్న కథ చెప్పుకోవాలి.

జడ భరతుడు ఋషభుడనే రాజుకు పుట్టిన వాడు. ఎన్నో జన్మల ధార్మిక జీవన వాసనలు వుండడంతో భరతుడు నిర్వికారంగా వుండేవాడు . దేనినీ కోరుకునే వాడు కాదు. దేనినీ లక్ష్య పెట్టేవాడు కాదు. అందువల్ల యెన్నో అవమానాల్నీ భరించాడు. నిజానికి అతనికి అది ఆఖరి జన్మ. అంటే మోక్షానికి చివరి మెట్టు. వృద్దాప్యం సమీపించినప్పుడు రాజ్యాన్ని పుత్రులకి అప్పగించి, అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుంటుండే వాడు. ఒక రోజు వొక లేడి వర్షానికి తడుస్తూ ఆయన ఆశ్రమం ముందు ప్రసవించింది. వర్షకారణం గా తల్లి ప్రసవానంతరం నీళ్ళలో కొట్టుకుపోయింది. అప్పుడే పుట్టిన ఆ లేడిపిల్లని చూసి జాలిపడిన భరతుడు దాన్ని కొద్ధి రోజులు చూసుకుని, అడవిలో వదిలేద్దామనుకున్నాడు. కానీ ఆ లేడిపిల్ల పట్ల అనురాగం పెంచుకుని, దాని సంరక్షణే చూసుకునే వాడు. అది వొక రోజు కనిపించకపోయినా బెంబేలెత్తి పోయేవాడు. ఆ అనుబంధం తీవ్రమై, అతను అంత్య సమయంలో ఆ లేడి పిల్ల భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ మరణించాడు. ఆ కారణంగా మోక్షం పొందవలసిన వాడు మరు జన్మలో లేడి గా పుట్టి, మోక్షానికి మరో జన్మ యెత్తవలసి వచ్చింది. అందుకే పరమాత్ముడు అంత్య సమయంలో తననే ధ్యానించమని చెప్పాడు. అది వినడానికి సులువైనదనిపించినా, ఆచరణలో కొంచం కష్టమే. జడ భరతుడి వుదంతమే అందుకు సాక్ష్యం. తర్వాతి శ్లోకంలో పరమాత్మ అందుకు మార్గంగా నిరంతర సాధన ద్వారా ధ్యానం చేస్తూ వుండమన్నాడు. ఆ సాధనే అంత్య సమయంలో మరే విషయం పైకి మనస్సుని పోనీయకుండా, భగవంతుడి పైనే నిలిచేలా చేస్తుంది."

తన జ్ఞాపకాల దొంతరల నించి బయటికొచ్చాడు భానుమూర్తి. కేమో థెరపీ మొదటి డోస్ పూర్తయింది. అయితే రెండు, మూడు గంటలు అక్కడే వుండమన్నాడు డాక్టర్.

"ఎలా వుంది నాన్నా ?" అడిగింది సంధ్య. నిట్టూర్చాడు భానుమూర్తి.

"ఎలా వుంటుందమ్మా ? ఈ రాక్షస వ్యాధి యెందుకొచ్చిందో , యెలా వొచ్చిందో తెలియడం లేదు. ఈ జన్మలో అంత పెద్ద పాపాలేవీ చేయలేదు. ఏ జన్మ కర్మ ఫలమో తెలియదు. "

"దాని గురించి ఆలోచించకు నాన్నా!..."

"ఏమి ఆలోచించమంటావు తల్లీ? పెళ్ళి అయి ఆర్నెల్లలోనే తిరిగి వచ్చేసావు ... .. వీడికి యింకా వివాహం చేయలేదు. చిన్నవాడు యింకా స్థిర పడలేదు....అంటా అగమ్యగోచరంగా వుంది ....."

వేదవ్యాస్ తండ్రిని మందలించాడు. ఆ సమస్యలేవీ సమస్యలే కావు, అన్నీ త్వరలోనే సర్దుకుంటాయి అని గట్టిగా చెప్పి తండ్రి నోరు మూయించాడు.

ఒక గంట గడిచింది. భానుమూర్తి శ్వాస తీసుకోడానికి యిబ్బంది పడుతున్నట్టు వేదవ్యాస్ గమనించాడు. తండ్రి కి దగ్గిరగా వెళ్ళి, " ఏమైంది నాన్నా?" అని అడిగాడు. ఆయన సమాధానం చెప్పలేక పోయాడు. ఛాతీ మీద చెయ్యి పెట్టి నొప్పి పుడుతున్నట్టు కళ్ళతోనే చెప్పాడు. వేదవ్యాస్ పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ ని పిలుచుకొచ్చాడు. భానుమూర్తి నొప్పితో గిల గిలా కొట్టుకుంటున్నాడు. అది హార్ట్ ఎటాక్ అని డాక్టర్ కి అర్ధమైంది. వెంటనే ఐ సి సి యూ కి తరలించారు. ప్రాణ రక్షక చికిత్స మొదలెట్టారు.

భానుమూర్తి నొప్పితో మెలికలు తిరిగిపోతున్నాడు. తనకు యేదో అయిపోతోందని అనుకున్నాడు. "డాక్టర్!... డాక్టర్ ... నన్ను కాపాడండి ... నాకు యింకా కొన్ని బాధ్యతలున్నాయి ...." అంటున్నాడు. డాక్టర్ ధైర్యం చెపుతున్నాడు. గట్టిగా మందలించాడు. కొద్ది క్షణాలకి భానుమూర్తి స్పృహ కోల్పోయాడు. ఆ క్షణాల్లో సంధ్య, తన భార్య, కొడుకు కళ్ళ ముందు కదలాడుతున్నారు.

నెల రోజుల తర్వాత:

భానుమూర్తి, ఆయన మిత్రుడు రంగనాథ్ వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

"మొత్తానికి మృత్యువుని జయించావు భానూ!... గుండె పోటు నించి బయటపడ్డావు. క్యాన్సర్ ని కూడా జయిస్తున్నావు!... నీ పూజలు, నీ ప్రవచనాలూ నిన్ను కాపాడాయి!"

రెండు నిముషాల మౌనం తర్వాత అన్నాడు భానుమూర్తి, "ప్రవచనాలు మానేయాలనుకుంటున్నాను రంగనాథ్! ... ఏవైనా నాలుగైదు దుకాణాలు చూపించు, పద్దులు రాసుకుంటూ కాలక్షేపం చేస్తా!... "

ఆశ్చర్యంగా చూసాడు రంగనాథ్.

"కాన్సర్ మందులకి బుద్ధి కానీ పోయిందా?" అన్నాడు.

" నాకా అర్హత లేదు. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు నేను చచ్చిపోతున్నాననిపించింది. హాస్పిటల్ లో కాకుండా యింకెక్కడున్నా పోయేవాడినే!... ఆ క్షణాల్లో భగవత్ ధ్యానం చేసుకోవాల్సిన నేను యింటి బాధ్యతల గురించి బాధ పడ్డాను. ఈ బంధాలన్నీ శాశ్వతం కాదని, మన విధి నిర్వర్తించాక, యీ బంధాలనే సంకెళ్ళని ఛేదించి, భగవంతుణ్ణి చేరే ప్రయత్నం చేసుకోవాలనీ అందరికీ చెప్పే నేను, బంధాల వలలోనే వలకి చిక్కిన చేపలా కొట్టుమిట్టాడాను ..."

"నువ్వు అందరికీ చెప్పినట్టే, నేను నీకు చెబుతున్నాను. సాధన చెయ్యి. ఆలోచనల్ని మార్చుకో. మీ అల్లుడ్ని పిలిచి పిల్లలిద్దరికీ రాజీ కుదుర్చు. పని అయ్యిందా ఓకే. కాకపొతే వాళ్ళ ఖర్మ, అనుకో. పెళ్ళి చేసిన బాబా యిద్దర్నీ దగ్గిరకి చేర్చడా?... నమ్ము. ఇక నీ కొడుకు పెళ్ళి రాసిపెట్టినప్పుడు అవుతుంది. ప్రయత్నం చేస్తూ వుండు. నువ్వు అందరికీ చెప్పేవన్నీ అందరూ చేస్తారనుకోకు, నువ్వు కూడా అన్నీ చేయగలనని అనుకోకు. ధర్మం చెప్పడం కూడా ధర్మ కార్యమే. మళ్ళీ చెప్తున్నా, మనసు నిర్మలంగా వుంచుకో , ధ్యానాన్ని సాధన చేస్తూ వుండు!... "

మిత్రుడికి రెండు చేతులెత్తి నమస్కరించాడు భానుమూర్తి. భాను మూర్తి కి తన మిత్రుడిలో భగవంతుడు కనపడ్డాడు.

[సమాప్తం]


రచయిత పరిచయం :

అందరికీవందనాలు.

చిన్నతనంనించి కథలురాయడం నాహాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.

'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.

ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.


338 views0 comments

Comments


bottom of page