top of page

సహధర్మచారిణి

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.

Sahadharmacharini Written By Poorna Kameswari vadapalli

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి


“మొగుణ్ని కొట్టి మొగసాల యెక్కినదిని ఊరికే అన్నారా?? మంచం మీద వున్న మొగుణ్ణి కొడుతుందిట, పైగా సిగ్గులేకుండా చెప్పుకుంటోది కూడానూ ఆ పక్కింటి అంకిత” నిష్టూరంగా మా అత్తగారు అన్న మాటలు నా మనసులో కలుక్కుమని గుచ్చు కుంటున్నాయి. నోటి దురుసుతనంతో ఎవరినైనా గబుక్కున అలా అనేయడం నాకు ఆట్టే నచ్చదు. ఆవిడకు చెప్ప తగ్గ స్ధానం కాదు కనక వినక తప్పలేదు. పసుపు-పారాణితో కొత్తగా కాపురానికి వచ్చిన నాకు ఇరుగు-పొరుగువారి గురించి ఇంకా పెద్దగా తెలియదు. ఐతే చూస్తున్న కొన్నాళ్లల్లోనే అంకితగార్ని చూస్తే మాత్రం, అత్తయ్యగారన్న మాటలకు ఏ మాత్రం పొంతన కుదిరినట్టు అనిపించలేదు. ఆ నేరాలలోని సూక్ష్మాన్ని తెలుసుకోవాలని మాత్రం అనిపించేది. నోరుంది కదా అని తూలనాడడం తప్పని నిరూపించాలనిపించింది. నా మనసుకు తప్పు అని అనిపించిన ఆ మాటలు తప్పేనని తప్పనిసరిగా తెలుసుకు తీరాలన్న పంతం నాకూ పెరిగింది. నాకు పెళ్ళై ఆ అపార్టుమెంటులోకి కాపురానికొచ్చి నెల్లాళ్లైంది. అంకిత ఆంటీ ఎప్పుడూ తమ పనుల్లో బిజీగా వుండడం గమనించినా, అంకుల్ ని మాత్రం అసలు ఎన్నడూ చూడనేలేదు. అలాంటిది అత్తయ్యగారు అంతలేసి మాటలు ఎలా అనేసారో అనిపించింది. ఆంటీతో మాట్లాడినదాన్ని బట్టి ఆయనకేదో అనారోగ్యమనీ, బయటకు రారనీ, ఆట్టే కదలిక లేదనీ అర్ధమైయ్యింది. ఆరాలు తీసి మనసును నొప్పించే ప్రశ్నలు వేసి బాధ పడేట్టు నేనూ వ్యవహరించలేదు. అత్తయ్యగారు మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా ఆంటీతో మాట్లాడతారు, ఆరాలు తీస్తారు, ఇవతలికి వచ్చి ఆడిపోసుకుంటారు. రెండు నెలల తరువాత, బాగా అలవాటైయ్యాకా ఒక రోజు ఆంటీతో మాట్లాడుతూ, “ఆంటీ నేను అంకుల్ ని ఒక సారి చూడచ్చా” ఎంతో మొహమాటపడుతూ సంకోచంగానే అన్నాను. “తప్పకుండా, చూద్దువుగాని రా శైలూ, పరిచయం చేస్తాను” అన్నారు అంకిత ఆంటీ. ఇదిగోండి, ఈ అమ్మాయి పేరు శైలూ. మన ఎదురు ఫ్లాటులో కాపురముంటున్న భానుమతిగారి కోడలు, మొన్ననే కాపురానికొచ్చింది. మిమ్మల్ని చూడడాలని వచ్చింది. " చేతులు జోడించి నమస్కారం తెలుపుతున్న నన్ను తదేకంగా చూశారు ఆయన. ఆరడుగుల పొడవాటి మనిషి. పచ్చని ఛాయ. ఎంతో శుభ్రంగా కడిగిన ముత్యంలా వున్నారు. గీసిన గడ్డం, తెల్లటి పంచి, జుబ్బా ధరించి, నుదుట విభూతి రేఖలు పెట్టుకుని ప్రశాంతంగా కనిపించారు. కొత్తగా కనిపిస్తున్న నన్ను చూసి ఆమెతో ఏదో చెప్పారు కాబోలు."నీకు ప్రతి నమస్కారం చెపుతున్నారు శైలూ" ఆసక్తిగా అన్నారు ఆంటీ. ఆయన్ని ఆ పరిస్థితిలో చూసి నా మనసు తరుక్కు పోయింది. భయం, బెరుకు, బాధ, జాలి కలపోసిన భావన కలిగింది. ఒళ్ళు జలదరించినట్టైయ్యింది. ప్రశ్నార్ధకంగా చూస్తున్న ఆయనది చూడగలిగే స్థితే తప్ప మాట్లాడే స్ధితి కాదని అర్ధమైయ్యింది. “ఎన్నాళ్ళనుంచి ఇలా వున్నారు అంకుల్?” వణుకుతున్న స్వరంతో అడిగాను. “పదిహేను సంవత్సరాలు అయ్యింది”, అంతే ప్రశాంతంగా అన్నారు ఆంటీ. “అన్ని పనులూ మీరే చేస్తారా?”, ఆశ్చర్యంగా అడుగుతున్న నాకు, చిరునవ్వే సమాధానంగా చెప్పారు ఆంటీ. ఇంకా ఆ షాక్ లోంచి నేను తేరుకోలేక కాసేపు అలా నిశ్శబ్దంగా నిలబడి పోయాను. బుడగ లాంటి బంతి సైజులోనున్న ఒక రబ్బరు పరికరాన్ని తీసారు, దానికి ఒక గొట్టం లాంటిది వుంది. ఆ గొట్టాన్ని ఆయన నోట్లోకి పెట్టి, ఆ బంతిలాంటి దాన్ని నొక్కగా, ఆ గొట్టం ద్వారా సక్షన్ తో నోట్లోనుంచి గొంతు వరకూ చేరుకున్న కఫం ఆ బంతి లాంటి దాంట్లోకి వచ్చింది. అలా పలు మార్లు తీశారు. ఆ తరువాత, మాత్రలను నూరి నోట్లో మరో గొట్టం ద్వారా వేసి, నీళ్ళు పోసారు. పొలబారినట్టై ఖల్లు-ఖల్లు మని దగ్గుతున్న ఆయన కంఠాన్ని రాస్తూ, “అయిపోయింది. కొద్దిగా జ్వరం తగిలిందని మరో మాత్ర ఎక్కువ వేసాను. అంతే. మీకు తెలిసిపోయిందేఁ. రోజూ కన్నా మరేదో కొత్తది వుందని చెపుతున్నారు. తగ్గిపోతుంది. ఇంక వేయను. సరేనా..”చంటిపిల్లాడికి చెప్పినట్టు చెప్పారు. ఆయనా, మరుక్షణం స్ధిమిత పడడం చూసి ఆశ్చర్యంగాఅనిపించింది నాకు. “ఇదిగో అన్నం కలిపి సిద్ధంగా వుంది. పెట్టేస్తాను. నోరు చేదు పోతుందిలెండి.” ఏ మాటా మంతీ లేని ఆయనతో మళ్లీ మాట్లాడుతున్నారు ఆంటీ, “బాగా పెరిగిపోయిన గోళ్ళతో రాత్రంతా రక్కేసుకున్నారు. చూడండి ఎలా గీర్లు పడిపోయాయో, దానికి క్రీమ్ రాసానులెండి. అందుకే ఇలా వదులుగా కడుతున్నాను సరేనా?" అంటూ మెత్తని గుడ్డతో రెండు చేతులని రెండు వైపులా మంచం ఫ్రేములకి కట్టారు. శ్రీకృష్ణుణ్ణి యశోదమ్మ రోలుకు కట్టినట్టు అనిపించింది నాకు. కొద్దిగా లావాటి మరో గొట్టం పైన గళ్ళాలా వెడల్పుగా అమర్చి వుంది, దాన్ని నోట్లోకి పెట్టి, మంచం తల వైపు ఎత్తుగా అయ్యేలా కింద బిగించి వున్న హాండిల్ తో తిప్పారు. వీపు పైభాగం వరకూ మంచం లేచి, ఇప్పుడు ఆయన జారగిలపడి కూర్చున్న స్ధితిలోకి వచ్చారు. కొంచం తలగడతో సదుపాయంగా ఎత్తు చేసి వీపుకి పెట్టి, కొంచం పాలు, మరి కొంచం మెత్తగా జారుగా చేసిన అన్నాన్ని నెమ్మదినెమ్మదిగా పోశారు. ఆయన మింగుతుండగా మళ్ళీ దగ్గు వచ్చింది, వెంటనే గుండెలకు రాసారు. “బాగుందా?” అంటూ అడిగారు. ఆయన కళ్ళతో చెప్పింది ఆవిడకు అర్ధమైందన్నట్టు, “సరే, జ్వరం మీద రుచి అలాగే వుంటుంది. మందేసానుగా రేపటికి తగ్గిపోతుంది. రేపు మాగాయి కలిపి పెడతాను లెండి”, అనునయంగా అన్నారు. భోజన కార్యక్రమమవ్వగానే శుభ్రంగా తడి గుడ్డతో తుడిచి, దుప్పటిని గుండెలవరకూ కప్పారు. “కాసేపున్నాకా పడుకుందురుగాని ఇప్పుడు ఇలాగే వుండండి”. సరేనా, అన్నారు ఆంటీ. ఎంతో సేపటిగా ఇంటికి రాకపోయేసరికి అక్కడికొచ్చేసారు మా అత్తగారు. “భానుమతమ్మగారు మీకు తెలుసుగా, దణ్ణం పెట్టండి” భర్తతో అంది అంకిత. అయన అంకిత కళ్ళలోకి చూసి ఆ తరువాత మళ్ళీ మా ఇద్దరినీ తదేకంగా చూసారు. అత్తాకోడళ్ళని చూసి ఆయనకేమనిపించిందో మరి. ఆయనతో మాట్లాడుతుతన్నట్టే మాట్లాడుతూ, ఒక పెద్ద సిరంజిలో ఇంజక్షను తీసి, పక్కకు తిప్పి, నడుముకు చేశారు. బాగా దూదితో దాన్ని అదిమి తుడిచి మళ్ళీ వెల్లకిలా పడుకో పెట్టారు. కిందున్న డస్ట్-బిన్ లో సిరంజిని పడేస్తూ “ప్రతి రోజూ డాక్టర్లు చెప్పిన ఇంజక్షన్ ఇలా చేస్తాను. ఇలా మాటల్లో పెట్టి చేస్తే నెప్పి తెలియదు, లేకపోతే ఊరుకోరు మారాం చేస్తారు”. కృష్ణుడిపై యశోదమ్మ నేరం చెప్పినట్టు చెప్పింది ఆంటీ. “ఆంటీ, అంకుల్ కి మీ మాటలు అన్నీ అర్ధమౌతాయా?” ఆశ్చర్యంగా అడిగాను. “ఆయనతో అన్ని కబుర్లూ చెపుతాను. అయన కళ్ళతోనే సమాధానాలు చెపుతారు. నేను ఆ కనుసైగలతోనే అయన్ని చదువుతాను. మల-మూత్రాలతో సహా అన్నీ మంచం మీదనే. నాకు ఆయనతో కబుర్లు చెప్పకపోతే తోచదు. ఎదో ఒకటి మాట్లాడుతూనే వుంటాను. రోహిత్ ఎలాగో అలా నాకు మరో బిడ్డ ఆయన. అంతే. పిల్లల్లాగానే అల్లరి చేస్తారు. మారాం చేస్తూ తినను అని ఒక్కోసారి ఉమ్మేస్తే, బుగ్గ మీద సున్నితంగా ఒక దెబ్బ వేసి తినిపిస్తాను”. చిరునవ్వుతో అతి తేలికగా అనేస్తూన్న ఆంటీని చూసి నాకు కళ్ళు చెమర్చాయి. కొడుతుందిట అంటూ కాఠిన్యంగా మా అత్తగారు చెప్పిన దెబ్బ ఇదేనని ఇప్పుడర్ధమైయ్యింది. స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో వున్న మావయ్యగార్ని చూడడానికి కూడా వెళ్ళకుండా, నాకు భయం బాబూ, నేను చూడలేను అంటూ కొడుకు మీద వదిలేసారు. రెండు రోజుల తరువాత ఆయన ఇంటికొచ్చేవరకూ వెళ్ళకుండానే తప్పించుకున్న ఈవిడా అంకిత ఆంటీ గురించి అలా మాట్లాడుతున్నారూ!! అంతే, అదే లోకం తీరు అనిపించింది. మనసంతా బరువుగా అయిపోయింది. ఇంటికి వచ్చిన నాకు అసలు మనసు మనసులో లేదు. ఆంటీ జీవితాన్ని చదవాలనుకున్నాను. అన్ని విషయాలూ విని తెలుసుకోవాలనుకున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆంటీతో మాట్లాడాను. ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితాల్లో సుమారు ఇరవై ఐదేళ్ళ నాడు జరిగిన విషాద గాధ అది. **** “డాక్టర్ గిరిధర్, మీ రీసెర్చ్ పేపర్స్ కి మంచి స్పందన వచ్చింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వారు మిమ్మల్ని వారి యూనివర్సిటీ బయోకెమ్ డిపార్ట్మెంటులో సీనియర్ ప్రొఫెసర్ స్థానానికి ఆహ్వానిస్తున్నారు. అంతేకాక మైక్రోబయాలజీలో మీరు చేస్తున్న రీసెర్చ్ కి ఫండ్స్ అల్లోట్ చేస్తారుట. ఇది మీకు ఒక సదవకాశము. మీ ఫార్ములా ఆమోదిచబడితే మెడికల్ రీసెర్చ్ ప్రపంచానికి ఒక మంచి మైలురాయిగా నిలిచే అవకాశం. ప్రపంచంలో సగానికి పైగా దేశాలను పట్టి పీడిస్తూ, మరిన్ని దేశాలకు వ్యాపిస్తూ భయపెడుతున్న విష జ్వరము మరింత చెలరేగ వచ్చునని అంచనాలు. అటువంటి నేపధ్యంలో, అది మహమ్మారిగా మారే ప్రమాదం వుంది. అట్టి స్థితిలో మీరు చేయబోయే కృషి యావత్ ప్రపంచానికీ ప్రయోజనకరంమౌతుంది. మనకున్న ఫండ్స్, ల్యాబ్ ఫెసిలిటీస్ అండ్ కొల్లాబొరేషన్స్ అంతటి పెద్ద టాస్కుకు సరిపోవు. ముఖ్యంగా పరీక్షలకు అక్కడ మరింత సదుపాయంగా ఉంటుంది. ఐ థింక్ యు షుడ్ గ్రాబ్ ది ఆపర్ట్యూనిటీ అండ్ గో. అఫ్కోర్సు వీ విల్ మిస్ ఏ గ్రేట్ సైంటిస్ట్ ఇన్ అవర్ ఐఐటీ హీయర్.” అభినందిస్తూ అన్నారు డా.చంద్రశేఖర్. "వెల్ సర్. ఇక్కడ మొదలెట్టింది ఇక్కడే ఐ విల్ కంటిన్యూ. నేను ఈ ఆఫర్ తీసుకోదలచుకోలేదు. నా రీసెర్చ్ మన దేశంలోని మైక్రోబయాలజీ మరియు ఇమ్మ్యూనోలోజీ విభాగాలకి ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ ధరలో వైద్య సదుపాయాలను అందిస్తున్న దేశం మనదే. మరిన్ని ప్రయోగాలతో వైద్య సదుపాయాలను మరింత మెరుగు పరచాలన్నదే నా ఆశ" అన్నాడు డా.గిరిధర్. ముప్పై రెండేళ్ల ప్రాయంలోనే ఎంతో ఘనత సాధించిన గిరిని తోటి అసోసియేట్ ప్రొఫెసర్లు అభినందించారు. డా.చంద్రశేఖర్ వద్ద శెలవు తీసుకుని ఎంతో హుషారుగా ఇంటికి బయలుదేరాడు. దారిలో, అంకిత కిష్టమైన మల్లెపువ్వులు, పూజకి కదంబ మాలలు, ఆమెకెంతో ఇష్టమైన అజ్మీర్-కలాకండ్ స్వీటు కొన్నాడు. ఐదేళ్ళ దాంపత్య జీవితాన్ని పండుగగా జరుపుకోవలసిన పెళ్లి రోజు అది. రెండున్నరేళ్ళ రాహుల్ కి మూడు చెక్రాల సైకిల్ ను బహుమతిగా కొని, తప్పటడుగులతో దాని మీదకెక్కి తొక్కుతూ ఆటలాడుతుండగా చూసి మురిసిపోవాలని ఊహలలోనే తేలిపోయాడు. కొనుగోళ్ళు ముగించుకుని బయలుదేరాడు. అతి నిదానం గా డ్రైవ్ చేస్తూ సిగ్నల్ వద్ద వేచి ఉండగా, క్రాస్ రోడ్డులో ఎడమ వైపు నుంచి అటుగా వెళ్ళ వలసిన కార్ అదుపు తప్పి అమాంతముగా గిరి కారు మీదకి దూసుకుని వచ్చింది. కుడి వైపున్న రోడ్-డివైడరుకు తగిలి, ఎగిరి తల్లకిందులుగా పడి ఆరు అడుగులు వెనక్కు తోసుకుపోతూ విసిరికొట్టినట్టు పడింది. పైకి ఎగిరి కిందకు బలంగా పడడంతో స్టీరింగ్ చక్రానికి తల గట్టిగా తగిలి, పక్కకు గిరావటేసినట్టుగా పడి, భుజాల ఎముకలు ముక్కలయ్యాయి. బలమైన దెబ్బలు తలకు తగిలి నిస్చేష్టుడై పడివున్నాడు గిరి. కారు తలుపులు తెరవడం కష్టమయ్యింది. ఆరడుగుల ఆజానుబాహుడు. ముట్టుకుంటే కందిపోయేంత పచ్చని ఛాయ, రక్తపు మడుగులో స్పృహలేక పడి వున్నాడు. సిగ్నల్ వద్దనే వున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే కంట్రోల్ రూమ్ కి కబురు పెట్టారు. ఆంబులెన్సు ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించారు. మల్లెలు, కదంబమాలలు చిందరవందరగా పడిపోయాయి. కలకండ స్వీట్ బాక్స్ నుజ్జునుజ్జైంది. వెనుక సీటులోని చిన్ని సైకిలు వంకర్లైయ్యింది. ******* సంధ్య-దీపం వెలిగించి, గిరికి ఇష్టమైన పెరుగు గార్లూ, చక్కెర-పొంగలి చేసి నైవేద్యం పెట్టి, పెందరాళ్లే రాహుల్ కి అన్నం పెట్టేసి, భర్త ఎంతో ఇష్టపడి కొన్న మంకెన-పువ్వు రంగు పట్టు-చీర కట్టుకుని, గిరి కోసం ఆశగా ఎదురు చూస్తోంది అంకిత. ఇరవై ఆరేళ్ళ ప్రాయం. బంగారపు-ఛాయ, చక్రాల్లాంటి కళ్ళ నిండుగా కాటుక, ఎర్రని కుంకుమతో, వదులుగా వేసుకున్న జెడతో అమ్మవారిలా వుంది. నాజూకైన సన్నని శరీరం. చూసేవారెవ్వరికీ బిడ్డ తల్లిగా కూడా అనిపించనంత లేతతనం. ఆజానుబాహుడైన గిరిధర్ భుజాల వరకే వచ్చేంత పొడవు. చిరునవ్వుతొణకని ముఖ వర్ఛస్సు. మోగుతున్న ఫోను తీయడానికి పరుగున వెళ్ళి, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అంకిత. కళ్ళు బయర్లు కమ్మాయి. ఏడుస్తున్న రాహుల్ ను గట్టిగా కరిచి పట్టుకుని, బలంగా శ్వాస పీల్చుకుని, తేరుకుంది. చీర మార్చుకుని వెంటనే ఆసుపత్రికి పరుగు తీసింది. తలుపుకున్న అద్దంలోంచి ICU లో నిస్చేష్టుడై పడివున్న అతనిని చూసి నిలువెల్లా వణికింది అంకిత. అదృష్టవశాత్తూ అప్పటికే ఆసుపత్రిలో అతని ఒంటినంతా శుభ్రంగా తుడిచేసినందున రక్తపు గాయాలు తెలియలేదు. ఇంటర్నల్ ఇంజురీస్ ఎక్కువ అయినందు వలన ఆమెకు గాయాలు పెద్దగా భయానకంగా కనపడలేదు. ఐతే, ఒళ్ళంతా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయని, తలకి బలమైన గాయాలు తగిలాయని చెప్పిన డాక్టర్ల మాటలు విని నోట మాట రాలేదు అంకితకి. బిడ్డను గట్టిగ కరిచి పట్టుకుని, వెయిటింగ్ రూమ్ లో కూలబడిపోయింది. ఎప్పుడు తెల్లారిందో కూడా తెలియలేదు. అక్కయ్యలు, అన్నయ్య, అమ్మా-నాన్నలు వచ్చారు. అణచిపెట్టుకున్న దుఖమంతా ఉప్పెనలా పొంగుకొచ్చింది. రాహుల్ ని తన చేతుల్లోకి తీసుకుంది తల్లి. తెల్లవార్లూ ఒంటరిగా కూర్చున్న అంకిత ముఖం పీక్కుపోయి లంఖణాలు చేసినదానిలా అనిపించింది. జీవితం ఇంతలా ఒక్కరోజులో తల్లకిందులయ్యిందేనని కుమిలిపోయాడు తండ్రి. రోజులు గడిచాయి. ముల్టిపుల్ ఫ్రాక్చర్స్ కి ఆరు ఆపరేషన్లు చేసారు. కారు ఎగిరి పడడంతో వెన్నెముకలో బలమైన దెబ్బ తగిలింది. లేచి మామూలు మనిషిగా తిరుగుతాడన్న ఆశ కనపరచలేదు డాక్టర్లు. ఈ నెలన్నర రోజుల ఆసుపత్రి అనుభవము జీవితానికి ఒక కొత్త మలుపే అయ్యింది. దైవం లాంటి డాక్టర్ గారు, అంకితకు అక్కడే ఉండడానికి ఒక చిన్న గదిలాంటిది ఏర్పాటు చేసారు. రెండున్నర సంవత్సరాల రాహుల్ తో సహా అక్కడే ఉంటూ భర్తకి సేవలు చేసింది. మూడు నెలలు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. మృత్యువు వడిచేసి వెనుతిరిగినంత పనయ్యింది. తన వద్దనున్న డబ్బుని కొంచం సద్దుబాటు చేసాడు తండ్రి. ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిలకూ తన సంపాదనంతా ఖర్చైపోయింది. పింఛను కొద్దికొద్దిగా వెనకేసి ఓ మూడు లక్షలవరకూ వారిద్దరి ఆరోగ్య నిమిత్తం చేరేసి వుంచుకుని, కొడుకు పంచన ఏదో గుట్టుగా బతుకుతున్నారు ఆ దంపతులు. రోజులు గడవగా అక్కల పుల్లవిరుపు మాటలు తన చెవిన పడినే పడ్డాయి. అడపా-దడపా చేస్తున్న తండ్రి సహాయం కూడా నిరాకరించింది. వైద్య ఖర్చులు డిపార్ట్మెంట్ వారు భరించినా, అనుమతించని ఖర్చులు తాము పెట్టుకోవలసిన పరిస్థితి. నాన్నా, మీరు అంకితకు చాలా చేసారు. దానికి ఇప్పట్లో తీరే ఇబ్బందులు కావు. ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాలి. అందరికీ సంబంధించిన డబ్బును మీరు ఇలా ఒక్కళ్లకే పెట్టడం అన్యాయమని నిలదీసింది పెద్ద కూతురు. మాకందరికీ రావలసినవి సరి-సమంగా పంచెయ్యండి, ఆ తరువాత దాని వంతుతో అది ఏం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాళ్ళెవరు అంది అనసూయ. “తల్లితండ్రులకు మాటైనా చెప్పకుండా అనామకుడితో వెళ్ళిపోయి వాళ్ళ మనసు కష్టపెట్టిన అనసూయక్కా ఇప్పుడు న్యాయం మాట్లాడుతోంది. తప్పులేదు, ప్రపంచ-నీతి అదే” బాధ పడింది అంకిత. “అన్నయ్య, ఎప్పటిలాగానే అంటీ-ముట్టని అగ్రహారంలా తనపని తప్ప మరేదీ పట్టించుకోలేదు. ముట్టుకుంటే అంటుకుంటుందన్నట్టు అన్నయ్య ఏనాడూ ఎవరి గురించి పట్టించుని ఎరుగడు. ఎవ్వరి బాధలతోగానీ సంతోషాలతోగానీ నిమిత్తం వుండదు. ఆదీ కొంతవరకూ పరవాలేదు. ఉపకారం చెయ్యకపోయినా ఉపద్రవం తీసుకు రాలేదు” అంతవరకూ సంతోషం అనుకుంది. “అమ్మా అంకితా, నేను నీ ధైర్యాన్ని చూశాను. అందువల్ల వాస్తవాన్ని నీకు వివరంగా చెపుతాను. నీ జీవితం ఇక మీద నుంచి కత్తిమీద సాను లాంటిది. డా.గిరిధర్ మళ్ళీ మామూలు మనిషవ్వడం అసాధ్యం. ఐతే, ఏళ్ళ కృషి, నిత్యమూ చేసే ఫీజియోథెరపీతో కొంచం-కొంచంగా మెరుగవ్వడానికి అవకాశం వుంది. ప్రమాదం జరిగిన ఆ నాటి పరిస్థితికి ప్రాణాలు దక్కి ఈ స్థితికి రావడమే అద్భుతమని చెప్పొచ్చు . ఇప్పటి వరకూ ఒక ఎత్తు, ఇక మీద ఒక ఎత్తు. రాబోవు కాలం నీకు ఎంతో పరీక్షా కాలంగా ఉంటుంది. నిన్ను చూసిన ఈ మూడు నెలల్లో నిన్ను నా తోబుట్టువుగానే భావించాను. ఈ ఆసుపత్రి సహకారం నీకు ఎన్నటికీ ఉంటుంది. నీ సహజ లక్షణమైన ధైర్యాన్ని వీడక, జీవితం నీకు పెడుతున్న ఈ పరీక్షను నెగ్గుకొస్తావనే నమ్మకం నాకుంది. శారీరికంగా తేరుకోవడానికి ఏళ్ళ తరబడి సమయం పట్టచ్చు. అనుకోని ఈ అవాంతర పరిస్థితి వల్ల గిరిగారు మానసికంగా చాలా దెబ్బతిని వున్నారు. ఆయనకి నీ ఆదరణ ఇప్పుడే చాలా అవసరం. ఇలా శారీరికంగా నీపై ఆధారపడడాన్ని మనసు ఒప్పుకోలేక, తన నిస్సహాయతను ఆక్రోశంగా చూపవచ్చు. అట్టి మానసికత విపరీత ప్రవర్తనకు కూడా దారి తీయవచ్చు. ఆత్మహత్యకు కూడా పాల్పడాలన్న ఆలోచనలు కలుగ వచ్చును. నీకు ఇది చాలా పరీక్షా సమయం. మానసిక సమతుల్యతను కోల్పోకుండా నువ్వు దృఢంగా వుండవలసిన సమయం. డాక్టర్లగా మేము చెయ్యవలసినది పూర్తి అయ్యింది. అర్ధాంగిగా నీవు చేయవలసినది ఇప్పుడు మొదలయ్యింది. ధైర్యాన్ని వీడకు. అన్నగా నీకు నేను తోడుగా వుంటాను” అన్నాడు డా. విరించి. డా.విరించి చెప్పిన మాటలు మనసులోతుల్లోకి వెళ్ళాయి. “భగవంతుడా, ఏమిటి నాకీ పరీక్ష”, అని ధారాపాతంగా కన్నీరు కార్చి, చివరి సారిగా కళ్ళు తుడుచుకుంది. ఆలోచనలను పటిష్టం చేసుకుని మనసును దృఢ పరుచుకుంది. ఇక మీద నా కళ్ళల్లోంచి నీరు రాదు. గట్టిగా తీర్మానించుకుంది. నేను నా లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించి అంకితభావంతో సాగిపోవాలి. మున్ముందు జీవితం ఎలా నడపాలో నాకు బోధ పడుతోంది అనుకుంది. ఫిసియో-థెరపిస్ట్ ఛాంబరుకు వెళ్లిన అంకిత, రమారమి ఒక గంట సేపు అతనితో మాట్లాడి అన్ని మెళకువలు తెలుసుకుంది. గిరిని మళ్ళీ మామూలు మనిషిగా నిలబెట్టాలి. అందుకు తనెంతో కృషి చేయాలి. వృత్తి ధర్మంగా నియమిత కాలంలో వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సహ-ధర్మచారిణిగా నేను తతిమా సమయమంతా అదే పనిలో ఉండాలి. రాహుల్ కి అన్నీ సమయానికి సమకూర్చి, మెల్లిగా గిరిని లేపి కూర్చోపెట్టి, తన వేళ్ళతో శరీరంలోని ఒక్కొక్క భాగాన్నీ మర్ధనా చేస్తూ, నరాలను స్టిములేట్ చేయడం ఒక దినచర్యగా పెట్టుకుంది. తన బలాన్నంతా కూడగట్టుకుని ఆతని బరువుని కాస్తూ లేపి కూర్చోపెడుతూ, నూనెతో మర్ధనా చేసి, ఎక్సర్సైజులు చేయిస్తూ మెరుగు పడడం కోసం రోజులూ, నెలలూ ప్రయత్నించింది. నెమ్మదిగా భుజాలను మసాజ్ చేసి క్లచులు పెట్టి నిలబెట్టడానికి ప్రయత్నించింది. తడబడుతున్న కాళ్ళతో నిలబడిన గిరిని చూసి ఎంతగానో ఆనందించారు డా.విరించి. ***** చూస్తూనే ఏళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి. అవిరామ కృషితో ప్రయత్నిస్తూనే వుంది అంకిత. పడిపోకుండా తన భుజాన్ని ఆసరాగా ఇస్తూ, అతని సగం బరువుని మోస్తూ, మరోవైపు క్లచు సహాయంతో అడుగులు వేయించింది. రెండు అడుగులు వేసిన గిరి అమితానందపడిపోయాడు. అసలు లేచి మళ్ళీ నడవలేడనుకున్న స్థితినుంచి ఇట్టి స్థితికి రావడం అందరినీ ఎంతో ఆనందపరిచింది. “ది క్రెడిట్ గోస్ టు అంకిత” కరతాళ ధ్వనులతో అభినందించాడు డా.విరించి. కొత్త అడుగులు నేర్చిన గిరి నెమ్మదిగా వాకర్ సహాయంతో స్వతంత్రంగా నడిచే స్ధితికి వచ్చాడు. లేచి వాకైర్ సహాయంతో తన పనులు తాను చేసుకునే వరకు మెరుగయ్యింది గిరి పరిస్థితి. మానసికంగా కుంగిపోకుండా తన భుజాల బలంతో అతడిని నిలబెట్టింది అంకిత. బాబుకు నాలుగున్నర సంవత్సరాలు దాటాయి. మళ్ళీ సరిగ్గా వారి పెళ్లి రోజు వచ్చింది. పునర్జన్మనెత్తి మళ్ళీ కొత్త జీవితంలో అడుగెడున్న ఆరోజుని ఎంతో ఆనందంగా గడపాలనుకున్నారు ఆ దంపతులు. రాహుల్ ఆ రోజు రాత్రి పెందరాళ్లే నిద్ర పోయాడు. వంటింటి పనులన్నీ ముగించుకుని, రోజూలానే గిరి కాళ్ళకి మర్దనా చెయ్యడానికి ఆయుర్వేద నూని తెచ్చింది అంకిత. ఆమె నుదిటిపైన చిరు చెమటను తుడిచి పెదవులతో ముద్దాడాడు గిరి. చెదిరిన ముంగురుల్లోకి అతడి వేళ్ళు సన్నగా వెళ్లాయి. పట్టులాంటి కురులలోంచి జారిన చేతులు ఆమె భుజాలను చుట్టాయి. పెదవుల మీదికి అతడి పెదవులు చేరాయి. “ఏవండీ, ఏంటి ఇది” అంది అంకిత.

“నీ అందం నన్ను ఇలా రాయిలా పడి ఉండనివ్వటంలేదు. నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసావు. నాలో మళ్ళీ ఉపిరి పోసావు, కోరికలూ రేగాయి. రా” అంటూ ఆమెను గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు. అలసి-సొలసి వున్న ఆమెకు అది ఎంతో సాంత్వనగా అనిపించింది. అతని గుండెలమీద ఆనందంగా వాలిపోయింది. ఆదమరచిపోయింది. బిగువైన అతని కౌగిట్లో పులకించిపోయింది. అంకిత ప్రేమ చల్లదనంలో మైమరచిపోయాడు. ఆమె శరీరపు వెచ్చతనంలో పరవశుడై మధురానుభూతిని పొందాడు. తన రీసెర్చ్ పనులు మళ్ళీ మొదలు పెట్టాడు. సగ-భాగమై అతని ప్రతి అడుగులోను తోడై నడిపించింది అంకిత. రాహుల్ ని స్కూల్ లో చేర్చారు. ఆఫీస్ వారు కూడా అన్నివిధాలా సహాయ సహకారాలందించారు. జీవితం మళ్ళీ గాడిలో పడింది. అంకితకి ఐదో నెల దాటింది. వద్దనుకున్న సమయంలో వచ్చిన గర్భాన్ని ధరించడం సహజమైన ఆనందాన్నివ్వలేక పోయింది. మరో బిడ్డ బాధ్యతను తీసుకోగలనా అని భయపడింది అంకిత. తేరుకుంటున్న గిరిని చూసి మనసుకు ధైర్యం కలిగింది. భగవత్ప్రసాదంగా భావించి మోసింది. నవమాసాలూ దాటి పనసపండులాంటి మగ బిడ్డ పుట్టాడు. రోహిత్ అని పేరు పెట్టుకున్నారు. ఇద్దరు పిల్లలూ రెండు కళ్ళుగా, ఆనందంగా సాగిపోతోంది ఆ సంసారం. రోహిత్ కు నాలుగేళ్ళు దాటాయి. ****** “డా.గిరిధర్, దిస్ ఇస్ డా.శ్యామ్, ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్. ఎన్నో క్లిష్టమైన కేసులను అవలీలగా సాల్వ్ చేసిన సమర్ధుడు. మీ కేసు గురించి వివరించాను. హి వాంట్స్ టు స్టడీ యూ అండ్ రిమూవ్ ది క్లచ్ సప్పోర్ట్” అన్నారు డా.చంద్రశేఖర్. డా. శ్యామ్ అతని నడకను పరిశీలించారు. “గ్లాడ్ టు మీట్ యు” అన్నాడు గిరిధర్. “లేదు డాక్టర్, ఈ కుంటి నడక నాకు లభించిన అదృష్టమే. ఈ స్థితికి కూడా నేను వస్తానని ఆనాడు ఎవ్వరూ అనుకోలేదు. బ్రతికి-బయటపడి, క్లచ్-సపోర్టు తో నడవ గలగడమే మిరాకిల్. నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నాను. నాకది చాలు” అన్నాడు డా.గిరిధర్. “నో నో డా.గిరి. మీరు మళ్ళీ నార్మల్ అవుతారు. ఐ విల్ టేక్ అప్ యువర్ కేసు. మీకు స్పైనల్-కార్డ్ సర్జరీ చేస్తాను. ఎలాంటి ఆసరా లేకుండా మీరు నడుస్తారు. నేను ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకుంటున్నాను. మీ కేస్-ఫైల్స్ మరియు రిపోర్ట్స్ తీసుకుని మీరు మా హాస్పిటల్ కు రావాలి” అన్నారు. " సరే డాక్టర్" అని సెలవు తీసుకున్నాడు గిరిధర్. “అంకితా, నేను మళ్ళి మాములుగా నడవగలనని డాక్టర్ గారు హామీ ఇస్తున్నారు. ఎంతో నమ్మకంగా చెపుతున్నారు. వెన్నెముక సర్జరీ చేయ వచ్చునుట. నన్ను అన్ని పరీక్షలకూ, స్కానింగుకూ రమ్మన్నారు. ఇక పై నీ మీద నా బరువంతా మోపి నడవకుండా, నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానోయ్” ఎంతో ఉత్సాహంగా చెప్పాడు గిరి. చాలా సంబర పడిపోతూ “అలాగా. అబ్బా, అంతకంటే మనకి కావలసిందేముందండీ. అలా జరిగితే ఆ భగవంతుడు మనని వెయ్యి కళ్ళకాచినట్టే. తప్పకుండా చేయించుకుందాము” అంది అంకిత. రెండు నెలల సుదీర్ఘ పరిశోధనల తరువాత, అనేక మంది నిపుణులతో చర్చలూ-సంప్రదింపుల తరువాత శస్త్ర చికిత్సకు ఏర్పాటు చేసారు. డా.శ్యామ్ తో మరో ఏడుగురు ప్రముఖ నిపుణుల టీమ్ ఆధ్వర్యంలో ఎనిమిది గంటల పాటు జరిగిన సుదీర్ఘ సర్జరీ. “ది ఆపరేషన్ ఇస్ సక్సెస్ఫుల్. హి విల్ వాక్ నార్మల్లీ విదౌట్ ఎనీ సపోర్ట్” అంటూ వైద్యనిపుణుల బృందం ఒకరినొకరు అభినందుంచుకున్నారు. అశృవులతోనే అంకిత వారికి కృతఙ్ఞతలు చెప్పింది. ఆరడుగుల అందగాడైన తన భర్త మళ్ళీ మాములుగా హుందాగా నడుస్తాడని సంబరపడిపోయింది. ***** అది ఆపరేషనైన ఇరవయ్యో రోజు. డా.గిరిధర్ ను నడిపించవలసిన రోజు. ఫిసియో-థెరపిస్ట్, డాక్టర్ల సమక్షంలో గిరిని లేపడానికి ప్రయత్నించారు. నెమ్మదిగా లేపుతూ కూర్చోపెట్టారు. స్వాధీనము తప్పి మంచం మీదకు ఒరిగిపోయాడు గిరి. వెన్నెముక స్వాధీనంలో వున్నట్టు అనిపించలేదు. మళ్ళీ వారందరూ లేవనెత్త సహాయపడగా, చాలా ప్రయత్నించాడు. తనవల్ల కాలేదు. విపరీతమైన నొప్పితో ఒక్కసారిగా మంచమ్మీదకి వెల్లకిలా కూల పడిపోయాడు. మరింక లేవలేదు. భుజం కాళ్ళూ చేతులూ, అన్నీ కదలిక కోల్పోయాయి. భయ-కంపితుడై అయోమయంగా చూడసాగాడు. అంకిత నిస్చేష్ఠురాలై వైద్యుల వంక బేలగా చూస్తూ ఉండిపోయింది. వాకరు మరియు క్లచుల సహాయంతో చక్కగా నడుస్తూ తన పనులు తాను చేసుకుంటున్న గిరి, మంచానికే పరిమితయ్యాడు. మానసికంగా కృంగిపోయాడు. ఆతనిని చూస్తూ ఆవేదనతో అంకిత తల్లడిల్లింది. గోరుచుట్టు మీద రోకలి పోటు అన్నట్టు, రోహిత్ కు మూర్ఛ రావడం, పరీక్షించగా, గుండెలో దోషం ఉండడంతో శస్త్ర చికిత్స చెయ్యాలని చెప్పారు డాక్టర్లు. అది క్రమేణా తగ్గచ్చు, కానీ అకస్మాత్తుగా ప్రాణం మీదకు రావచ్చు. వెన్ను ముదిరితేకాని ఆపరేషన్ చేయలేము అని తేల్చి చెప్పారు డాక్టర్లు. బిడ్డ కోసం భర్త కోసం ఆసుపత్రీ-ఇల్లూ మధ్య కాలం గడుపుతోంది. నెలకొక వారమైనా ఇంచుమించు ఆసుపత్రిలోనే కాపురమున్నట్టయ్యింది అంకితకు. ఇప్పుడు పెద్ద సమస్య డబ్బు. అసలు ఏమాత్రమూ చలనము లేని గిరి మంచాన పడడంతో, యూనివర్సిటీ ఉద్యోగాన్ని కోల్పోయాడు. 20 సంవత్సరాలు దాటని కారణంగా రిటైర్మెంటుగా కూడా పరిగణింప బడలేదు. పెన్షను లాంటివి ఏమీ లేవు. ప్రావిడెంట్ ఫండ్ లో వచ్చిన డబ్బును బ్రతుకు-తెరువుకు అట్టిపెట్టి, భుక్తి కోసం ఏదైనా చేయాలనుకుంది అంకిత. ఆర్తి ఆసుపత్రి చుట్టుపక్రల గ్రామాల్లోని ప్రజలకు ఉచితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే పధకం ఏర్పాటు చేసింది. అందుకు వారిని ప్రోత్సహించి వారిలో సామాజిక స్పృహను పెంపొందించి, దానిపై సదవగాహన కలిగించాలని సంకల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో నిరీక్షణ వ్యవధి ఎక్కువగా వున్న కారణంచేత గ్రామ ప్రజలు అక్కిడికి వెళ్ళుటకు వెనుకాడడంతో కుటుంబ నియంత్రణా కార్యక్రమం విఫలమవ్వడం చూసి డా.విరించి తన వంతు కృషిగా యీ కార్యక్రమాన్ని చేపట్టాడు. గ్రామాలలోకి వెళ్ళి వారికి దానిపట్ల గల అనుమానాలన్నీ తీర్చి, వారిని సంసిద్ధులను చేయడమే ఆ కార్యక్రమంలోని క్లిష్టమైన పని. ఆ పనిని చేపట్టింది అంకిత. మనసులో గట్టిగా తీర్మానించుకుంది. ఆసుపత్రిలో బస చేస్తూ వున్నన్నాళ్లూ, ఇంజక్షన్ చెయ్యడము, సెలైన్ పెట్టడము, బీపీ పరీక్షించడము, ఫస్ట్ ఎయిడ్ చెయ్యడమూ, డ్రెస్సింగూ మొదలైనవన్నీ నేర్చుకుంది. అవసరం మేరకు నర్సుగా మారింది అంకిత. అక్కడే అవసరమైన వారికి నర్సింగ్ సేవలలో కొంత డబ్బు సంపాదించగలిగేది. ఇంతలో రోహిత్ కు ఆపరేషను సమయం ఆసన్నమైంది. చేతిలో నిలవున్న డబ్బు ఒక్కసారి ఖర్చు పెట్టేస్తే నాలుగు జీవితాల రోజులు గడవాలి. చదువులు చదివించాలి. ఏం చేయాలో పాల్పోలేదు. వార్తా పత్రికలో ఒక ప్రకటనను చూసింది. వెంటనే తనకో ఉపాయం తట్టింది. డా.విరించి గారిని అర్ధించింది. ఆయన ద్వారా ప్రాంతీయ పత్రికలలో ప్రకటన ఇవ్వాలని నిర్ణయించారు. ఆసుపత్రి ద్వారా విన్నపం అన్ని పత్రికల్లో వేయించారు. అందులో ఆమె పరిస్ధితిని విపులంగా వివరించారు. బిడ్డ ఆపరేషన్ కోసం దాతలను అర్ధించింది. మంచి మనసున్న మనుషులు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నట్టు నీరూపణ అయ్యింది. ఒక రూపాయి పంపిన వారూ వున్నారు, వేలు పంపిన వారూ వున్నారు. దైవం కరుణించి ఆపరేషన్ జరిగి పిల్లవాడు కోలుకున్నాడు. అంకిత, నాలుగు వందల యాభై ఉత్తరాలు రాసింది. అవసరానికి ఆదుకుని సహాయపడి తన బిడ్డను కాపాడిన దాతలందరికీ పేరు-పేరునా లిఖిత పూర్వకంగా పాదాభి-వందనములు తెలుపుకుంది. ఒక రూపాయి దానం చేసిన దాతతో సహా అందరికీ మనఃపూర్వకంగా కృతజ్ఞతాభి వందనములు తెలుపుకుంది. బిడ్డలని స్కూల్లో చేర్పించింది. గిరికి తను భార్యేకాక తల్లీ, తండ్రీ, నర్సు, సేవకురాలూ అయ్యింది. వెన్నెముకలో ముఖ్యమైన నరాలను ఆ శస్త్ర చికిత్స దెబ్బ తీసింది. చేతులూ కాళ్ళలోను కదలిక నశించింది. మాట పోయింది. ఇంచు మించు పక్షవాతం వచ్చినట్టుగా అయ్యింది గిరి స్ధితి. జీవం వుండీ నిర్జీవంగా మిగిలాడు. వాకర్ సహాయంతో నడవడం తప్ప మరేమీ లోటులేని గిరిని మంచంపాలు చేసిన డాక్టర్లకు వెయ్యి నమస్కారాలు చేసి, ఇంటినే ఆసుపత్రిగా మార్చింది అంకిత. నర్సుగా అన్ని విషయాలు తెలిసినందున గిరిని చంటి-బిడ్డగా చూసుకోవడం అలవాటైపోయింది. పదిహేనేళ్ళు ఎలా గడిచి పోయాయో తెలియలేదు. పిల్లలు డిగ్రీలయ్యి ఉద్యోగాలకు వెళ్లిపోయారు, రెక్కలొచ్చిన పక్షుల్లా. అర్ధాంగిగా గిరిధర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కనిపెట్టుకుని వుంది. అన్ని సంవత్సరాలుగా ఆ తోబుట్టువు కి అన్నగా, అండగానే డా.విరించి వున్నాడు. అలా అంకిత గతాన్ని విన్న శైలూ అర్ధాంగికి సరైన నిర్వచనం ఆమేనేమో అనుకుంది. ***** శైలూ ఇద్దరి పిల్లల తల్లైయ్యింది. ఆరోజు ఎంతో ఆవేదనతో అంకిత దగ్గరకొచ్చింది. ఒళ్ళు గగుర్పాటుగా అనిపించిన శైలూ అంకితను ఒక ప్రశ్న అడిగింది. “ఆంటీ నా సందేహం తీరుస్తారా? నా ప్రశ్నకు సరైన సమాధానం చెపుతారా ఆంటీ? మీకు ఎప్పుడైనా ఒంటరి నని గానీ, ఇంక ఈయనతో ఇలా ఎన్నాళ్ళని కానీ అనిపించలేదా?” శైలూ ప్రశ్నలో ఏదో అడగాలన్నదానికంటే ఏదో చెప్పాలన్న భావాన్ని చదివింది అంకిత. నెమ్మదిగా ఆమె గుండెల్లోని బాధ ఏవిఁటో తెలుసుకుంది. ఆలూ మగల మధ్య చిన్న భేదాభిప్రాయాలు. అంతే. శైలూ, “పెళ్ళైన ఆ ఆరు సంవత్సరాలూ నేను ఆయనతో గడిపిన రోజులు జీవితాంతమూ వెలితి లేకుండా వుండే మధుర స్మృతులను నాకు మిగిల్చాయి. నన్ను ఎలాంటి ప్రలోభాలకూ లోనవ్వనివ్వలేదు. ఆయన నన్ను అంతగా ప్రేమించారు. ఆయనతో వున్నన్నాళ్ళూ అమ్మ వడిలోనున్న ఒక చిన్న పిల్లగానే బ్రతికాను. ఆయన ప్రేమ నా మనసంతా నిండిపోవడంతో నాకు ప్రేమను మరెక్కడా వెదకవలసిన అవసరం రాలేదు. అయన నా పక్కన వుండడమే నాకెంతో ధైర్యంగా ఉంటుంది. అందువల్లనే అయన నాతో మాట్లాడలేకపోతున్నారని నాకు ఎన్నడూ అనిపించదు. నేను ఆయనతో మాట్లాడగలుగుతున్నాను. అన్నీ ఆయనతో పంచుకుంటూ ఆయన కళ్ళల్లోకి చూస్తున్నప్పుడల్లా నాకు యీ నాటికీ ఆ ప్రేమే కనిపిస్తుంది. ఆ కళ్ళను చూస్తే నాకళ్ళలో నీరు రాదు. ఆయనతో పయనమే నాకు సర్వదా సుఖం” అంకిత మాటలు శైలూ మనసుని కదిల్చేశాయి. ఆయన తదేకంగా ఆమె కళ్ళల్లోకి చూడడాన్ని గమనించిన శైలూకు, వారిరువురూ ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నట్టే అనిపించింది. ఆమె చెపుతున్న ప్రతీ సంగతిపైనా ఆయన స్పందన శైలూకి కనబడుతోంది, ఆంటీకి వినబడుతుంది కూడా. ఆ ప్రేమ లోతు ఆమెకిప్పుడే అర్ధమైయ్యింది. అర్ధాంగి అన్న పదానికి సగ-భాగమై జీవిచండమన్న నిర్వచనం ఆమెను చూశాకా చాలా సంకుచితంగా అనిపించింది. "కార్యేషు దాసి కరణేషు మంత్రీ..." అన్న సహధర్మచారిణి మంత్రానికి “ఆరోగ్యేషు వైద్యే, సెవేషు దాది” అన్నవి కూడా జోడించాలేమో ననిపించింది!!! ***** అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. “శైలూ, నువ్వు ఇంటి ఆడపిల్లగా బిందెతో నీళ్ళు పోస్తావా అమ్మా?” ఆర్తిగా అడిగింది అంకిత. “మూడవ ప్రదక్షిణ చేసి నోట్లో బియ్యం వెయ్యండమ్మా” అన్నారు పురోహితుడు. తడిచీరతో మూడో ప్రదక్షిణ చేసి, నోట్లో బియ్యం వేసి, పాదాలకు నమస్కరించింది అంకిత. “కడసారిగా చూసుకోండమ్మా”, బ్రహ్మగారు అంటున్నా స్పందించని అంకితను పట్టుకుని లేపబోయింది శైలూ. అలాగే పక్కకు ఒరిగిపోయింది అంకిత. సహధర్మచారిణిగా గిరి అంతిమ యాత్రలోనూ కూడా వెళ్ళడానికి తానూ సిద్ధమైయ్యింది. “తల్లిని కాను తనయను కాను, ఎవరికి నేను కోడలు కాను, దేవుడు లేక కోవెల లేదు, నా దైవం లేక నే లేను... నిత్యసుమంగళి నీవమ్మా.....” రేడియోలో లీలగా వినిపిస్తున పాట. వినిపింస్తుండగా భర్తతోనే పయనమైయ్యింది అంకిత. ఆలుమగలు అంటే తనువుల పరంగా కాదు, మనసుల పరంగా కలసి ఉండడం అని చాటుతూ ఆమె జీవితం ఆతనికే అంకితమైంది. * * * * *

రచయిత్రి పరిచయం

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కధలకు, బహుమతులు పొందాను.


331 views0 comments

Comments


bottom of page