top of page

సమవర్తి


'Samavarthi' New Telugu Story Written By Bhagavathula Bharathi

'సమవర్తి' తెలుగు కథ

రచన: భాగవతుల భారతి

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"ఈ బీద బ్రాహ్మణునితోనే ఆడుతున్నావుగా ఆట. ఆడూ!.. నీ ఇష్టం వచ్చినట్లు!.. నువ్వు రావు!.. ఫోన్ చేస్తే ఎత్తవు.. కట్ చేస్తావ్.. " మనసులోనే కసిగా అనుకున్నాడు విష్ణుమూర్తి.


"ఏమండీ! కల్యాణ్ ఏమన్నాడూ!? " అడిగింది భార్య.


"నా శ్రాద్దం అన్నాడు. ఫోన్ తీస్తేగా వాడు ఏమన్నా అంటానికీ! నేను వినటానికీనూ?!" విష్ణుమూర్తి విసుగ్గా అన్నాడు.


"ఒకటి కాదూ! రెండు కాదు.. లక్షరూపాయలు పిల్లపెళ్ళికని పైసా పైసా కూడబెట్టిన సొమ్ము, వాళ్ళ అమ్మ చచ్చిపోతుందేమోనంటే, అప్పటికప్పుడు డబ్బులన్నీ పోగుచేసి, వాడి చేతుల్లో పోసాం.. నోటూ పత్రం లేకుండా.. పిల్లపెళ్ళీడుకు వస్తోంది గానీ, వాడి చేతుల్లోంచి డబ్బు మాత్రం రాలేదు! " "అవునే! తల్లికి ఆరోగ్యం బాగుండలేదూ. గుండె ఆపరేషన్ అంటే, తప్పదుగా.. మనిషికి మనిషేగా సాయపడాల్సింది. అప్పు ఇచ్చి రెండేళ్ళయింది. అడిగితే ఇప్పుడు దాగుడు మూతలు ఆడుతున్నాడు. ఏం చేయమంటావ్?


వాడిండికి నేను వెడితే.. మామూలు ఆటో డ్రైవర్. వాడిలో ఏం చూసి ఇచ్చారని.. నలుగురూ నాకే.. " అంటూ అర్ధోక్తితో ఆగిపోయాడు.


"మరి ఏం చేద్దామండీ!" భార్యఅడిగిన ప్రశ్నకు "ఆట.. వేట" అన్నాడు.

"అంటే?" ఆమెప్రశ్న.


"అదే ఆలోచిస్తున్నా!" అన్నాడు.


అదే సమయంలో పేరిశాస్త్రి ఆ ఇంట్లో అడుగుపెట్టాడు.. విష్ణుమూర్తి కబురందుకుని.


పేరిశాస్త్రి మంచి లాయరు.


'ప్రకృతి కూడా సహకరించిందేమో!' అన్నట్లుగా.. ఆరాత్రి పెద్ద గాలివాన వచ్చి, కరెంటు పోయింది.


అందరూ తలుపులు మూసేసుకుని ఇంట్లో కూర్చున్నారు.


గాలివాన తగ్గేసరికి.. ఊరందరూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారి చూస్తే.. కల్యాణ్ ఇంటి ఆవరణలో వానకి చెత్తాచెదారం కొట్టుకొచ్చి.. ఓ మెుండి చెయ్యీ మెులిచింది.


ఏం చేయాలో అర్ధంగాక కల్యాణ్ కుటుంబమంతా కళవెళ పడిపోయారు.

ఊరిలోని అయ్యగార్లనూ, శ్రేయోభిలాషులనూ, వేడుకుంటూ అడిగాడు.

ఎవరినడిగినా "ఇలా మెుండి చెయ్యి మెులవటం.. ఇంటికే కాదు. తల్లికే ప్రాణహాని. పెద్ద ప్రాణానికే ముప్పు" అన్నారు.


"ఇప్పుడు పరిహారం ఏంచేయాలి? ఏం చేస్తే అమ్మ బాగుంటుంది? "


ఎవరూ చెప్పలేదు.


గబగబా విష్ణుమూర్తి దగ్గరికి పరుగెత్తుతూ వచ్చాడు.

విషయం చెప్పి "అయ్యా! ఊరిలో ఎవరూ దీనికి పరిహారం చెప్పలేక పోతున్నారు ఏ అయ్యగారి నడిగినా.. మెుండి చెయ్యి అమ్మకు మంచిదికాదు. దానికి ఉపాయానికి మీ దగ్గరకే వెళ్ళమన్నారు. మీరైతేనే చెప్పగలరన్నారు. చెప్పండయ్యా! "


"ఎవరో ఎందుకు చెబుతారూ!? నువ్వు నాదగ్గరకే రావాలిగా " మనసులో అనుకుని

"అయ్యో.. కంగారుపడకు.. ఇంటికి కీడు పోవాలంటే.. ఇంటిచుట్టూ గుండంతీసి, అగ్నిరాజేసి, పెద్ద హోమంచేసి, ఈ మెుండి చెయ్యికి పసుపూకుంకుమ వేసి, ఆరాధన చేస్తే.. పరిహారమవుతుంది. అమ్మబాగుంటుంది. "


"అవునా! ఎంతవుతుందయ్యా? ఎంతయినా ఫరవాలేదు.. మీరే చేయించండయ్యా!"


"అంత ఖర్చు నువ్వు భరించలేవేమో వద్దులే"


"అట్టనకండయ్యా! ఎంతయినా ఫరవాలేదు. చెప్పండయ్యా "


"లక్షన్నర అవుతుందేమోనని అంచనా.. "


"తలతాకట్టు పెట్టయినా.. రేపటిలోగా తెత్తానయ్యా!"


మర్నాడు రెండు లక్షలతో దిగిన కల్యాణ్ ని చూసి.. నవ్వి..

"మూఢనమ్మకాలకే సమాజంలో విలువెక్కువని నిరూపించావుగా! నువ్వూ!?..


ఎక్కడ నీతీ? ఇంకెక్కడి నిజాయితీ!? మర్యాదగా, గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చావుగా!? పోనీలే అమ్మమీదన్నా గౌరవం ఉంది. మెుదటిసారి అమ్మకోసమే అప్పుచేసావ్. ఇప్పుడూ అమ్మకోసమే ఎక్కడో అప్పుచేసి తెచ్చావ్! నీ అమ్మభక్తి మెచ్చదగినది. నోటు పత్రం లేకుండా ఇచ్చిన నేనూ!?.. "


"ఇదిగో నీ సొమ్ము.. నువ్వు నాకు ఇవ్వల్సిన లక్ష తీసుకుంటున్నాను. బీదరికంలో ఉన్నావ్ వడ్డీకూడా వద్దునాకు. నేనూ బీదబాపనయ్యనే. బీదరికానికి ఇద్దరమూ స్నేహితులమే!

నీఆటోచూసి సమాజం అయ్యో! అని జాలైనా పడుతుంది.

నుదుటన త్రిపుండ్రాలు పెట్టుకుని తిరిగే నన్నూ.. ఏమయిందీ ఈయనకీ?!.. పాపం! ఆటోవాణ్ణి కష్టపెట్టాడూ అంటారు.. అదికూడా మృగయావినోదమే! సమాజానికి. "


"ఇదిగో! నాకు సలహా ఇచ్చిన స్నేహితుడు పేరిశాస్త్రి కి పదివేలు ఫీజు.. మిగతాది నాకక్కర్లా! అమ్మకోసం రేపు నీఇంట్లో నేను చెప్పిన పూజలన్నీ.. ఉచితంగా చేయిస్తా. అన్నీ తెచ్చుకో. "


"నేను చేసిందంతా సరైనదేనా? మరి నువ్వు చేసింది సరైనదేనా? ఎవరు చెప్పాలి? మృగయా న్యాయం ఇంకా సమాజంలో ఆటలాడాలా? "


"రేపట్నించి నీ ముంగిట్లో మెుండిచెయ్యి కాదు ఆపన్నహస్తం ఉండేటట్లు మాత్రమే చూసుకో..”

కల్యాణ్ నమస్కారం చేసి వెడుతూ, "అమ్మకోసం నేను ఏదైనా చేస్తానయ్యా! అమ్మ లేకపోతే, నేనూ లేనూ! ఎవరూ లేరు! సృష్టే లేదయ్యా! రేపు రండయ్యా! యఙ్ఞగుండం ఎక్కడ తవ్వాలో, ఎంత తవ్వాలో చెప్పండి. నేను తవ్వి రెడీగా ఉంచుతా! అమ్మనే అక్కడ కూచోబెడతా! అమ్మ కోసమే మీరు చెప్పిన పూజలన్నీ చేయండయ్యా! నేనేం ఇచ్చుకోలేనయ్యా "అన్నాడు చేతులు కట్టుకుని.


"తప్పకుండా! అమ్మమీద నీకున్న భక్తివిశ్వాసాలే నిన్ను కాపాడతాయి. రేపు నేను వస్తా! వెళ్ళిరా " అని పంపేసి, "పేరిశాస్త్రీ నేను చేసింది కరెక్టేనంటావా? " అనడిగాడు.


"విష్ణూ! మీరిద్దరూ బీదవాళ్ళే! ఇద్దరిదీ న్యాయమే! నువ్వు చెప్పినట్లు సమాజం ధృక్కోణం మాత్రం అతనిదే న్యాయం అంటుంది. మనదేముందీ, ప్రకృతే సమవర్తి.

నీ డబ్బులు నీకు వచ్చినాయిగా! ఏం ఆలోచించకు! నీ బీదరికాన్ని ఈ డబ్బుతో జయించు. అతని బీదరికాన్ని వెక్కిరించకుండా వెళ్ళి, ఆ యఙ్ఞమేదో ఉచితంగా చేసిరా! తప్పు చేసానేమోననే, ఫీలింగ్ నీకూ ఉండదు. గుండం తవ్వి హోమం చేయించటమంటే మాటలుకాదుగా!


ఫలితం సంగతి దేవుడెరుగు. బోలెడు వసూలు చేస్తారు. పాపం అమ్మకోసం పడే వాడి ఆరాటం ఎందుకు కాదనాలీ? " అంటూ నిష్క్రమించాడు పేరిశాస్త్రి.


"అందరూ బాగుండాలి. అందులో మనముండాలి. " అని నమస్కారం చేసాడు విష్ణుమూర్తి.

భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.










177 views1 comment

1 Comment


Srinivas Bhagavathula • 2 hours ago

మల్లవరపు సీతారాం గారు చక్కగా చదివారండీ

Like
bottom of page