సంస్కరించని సంప్రదాయము
- Poorna Kameswari vadapalli
- Jun 23, 2021
- 4 min read

'Samskarinchani Sampradayamu' Written By Poorna Kameswari vadapalli
రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి
ఊహించని రాకకు ఆశ్చర్యపోతూ, కలిగిన అసౌకర్యం కనబడనివ్వడకుండా అసహజమైన పలకరింపుతో "రండి రండి అన్నయ్యగారూ"అంది మహాలక్ష్మి.
మండుటెండకు నిదర్శనంగా ఎర్రగా కందిన మొహం, ఆడపిల్ల తండ్రికి సహజంగానే వుండే జంకూ, మొహమాటపడుతున్న స్వరంతో, "కులాసానా అండీ" అని నెమ్మదిగా అడిగాడు
నారాయణమూర్తి, చెమటలు కక్కుతున్నా, అలసటను కప్పిపుచ్చుకుంటూ. మంచినీళ్లైనా అడగకుండా, వచ్చిన పనేమిటాన్నట్టు బయటపడిపోతున్న వారి ముఖకవళికలను గ్రహించి,
"అప్పుడే నెల గడిచిపోయింది, ఏ విషయమూ చెప్తారేమోనని వచ్చానండి", అని సంకోచంగానే అడిగాడు.
ఈ రోజు మా ఇంట్లో ఆబ్దీకము జరిగింది. పితృకార్యము జరిగినరోజున, శుభకార్యము గురించి మాట్లాడుకోకూడదన్నది సంప్రదాయం. మీకు మళ్ళీ తెలియపరుస్తాము". అని అంది మహాలక్ష్మి, మరో మాట మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా.
"మీ మాటకోసం ఎదురు చూస్తూ ఉంటాము", వచ్చిన పని ఇదేనన్నట్టు లేచి నిలబడి చేతులు జోడిస్తూ బయలుదేరాడు మూర్తి.
********
మేజెంటా అంచుతో ఆకుపచ్చరంగు ప్యూరుసిల్క్ చీర, పొడవాటి జెడలో మూరెడు కనకాంబరాల పూమాల, మెడలో కనీకనిపించని సన్నని గొలుసు, చక్రాల్లాంటి కళ్ళని అమ్మమ్మ చేసిన కాటుకతో తీర్చిదిద్ది, కుడి చేతికి గలగలలాడే తన కిష్టమైన మట్టిగాజులు, ఎడంచేతికి బుల్లి ఓవల్ డయల్ వున్న వాచి పెట్టుకుని, పదహారణాల తెలుగు అమ్మాయిలా తయారయ్యి, హాల్లో బాబయ్యలు పిన్నులు, అత్తయ్యలు మావయ్యగార్లూ అందరూ పడుతున్న హడావిడంతా చెవులకు వినపడుతున్నా, మనసంతా ఆ ఫోటోలోనే నిమగ్నమైపోయివుంది.
ఇప్పుడేంటీ, వారం రోజులుగా తన మనసువ్విళ్ళూరడం చూసి తనకే ఆశ్చర్యమేసింది.
మొన్నటివరకు అసలు అతనెవరో తెలియదు, ఈరోజుకీ ఇంకా అతనిని చూడలేదు, అయినా నిన్నటి రోజునుంచీ మనసు-మనసులో లేదు. ఫొటోలో చూసిన ఆతని రూపమే మనసంతా నిండిపోయి, ఎపుడెపుడు తెల్లవారుతుందాని నిముషానికి ఒకసారి గడియారాన్ని చూస్తున్న మాళవికకి ఇన్నాళ్ల వరకూ తెలియలేదు కానీ ఇప్పుడు మాత్రం అది చాల నెమ్మదిగా తిరుగుతున్నట్టనిపించింది. పెళ్లిచూపుల పేరుతో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని చూడబోతున్నందుకు, కొన్నాళ్లుగా మనసులో నింపుకున్న అతన్ని ముఖాముఖీ కలవబోతున్నందుకు ఎంతో పరవశంగా వుంది.
సరిగ్గా, వారం రోజుల క్రితం ఫోటో చేతిలోకిస్తూ, “ఈ అబ్బాయిని చూడమ్మా, చాలా అందంగా వున్నాడు, ఎం.టెక్. చదివి మంచి ఉద్యోగంలో వున్నాడు. 22 ఏళ్ళు గల వుద్యోగం చేస్తున్నమ్మాయి కోసం వాళ్ళూ చూడడం, నీ ఫొటో చూసీచూడగానే నచ్చడం, ఐదేళ్ళ వయసు తేడా సరిగ్గా ఉంటుందనీ, జాతకాలు కలిశాయనీ, మనదీ చిన్న కుటుంబమే కనుక అన్ని విధాలా నప్పుతుందని ఆసక్తి చూపుతున్నారు” అన్నాడు మూర్తి మాళవిక తల నిమురుతూ.
ఫోటో చేతికందుకుంటున్నమాళవికతో “హార్ట్-ఎటాక్ వచ్చి తండ్రి పోయారుట. కారుణ్య నియామకంలో వాళ్ళమ్మగారికి ఆయన పనిచేసిన ఆఫీసు లోనే వుద్యోగం ఇచ్చారుట. ఇద్దరే అన్నదమ్ములు. ఈ అబ్బాయి పెద్దబ్బాయి. పేరు నవీన్. తమ్ముడు అమెరికాలో వుద్యోగం చేస్తున్నాడు. నాకు నచ్చిందమ్మా, అన్ని విధాలుగా మనకి నప్పే సంబంధమే” నువ్వేమంటావు, అన్నట్టు ప్రశ్నర్ధకంగా చూస్తూవుండగానే తండ్రి ఆవాక్యం పూర్తి చేసేలోపే, మీ ఇష్టం నాన్నగారూ అని బుద్ధిమంతురాలైన మధ్యతరగతి అమ్మాయిలా సమాధానమిచ్చింది.
ఫోటో చూడకుండా నాన్నగారితో ఆ మాటైతే అనింది కాని, అతను ఎలావుంటాడోనని మనసు ఆరాటపడడం మొదలెట్టింది. ఐతే ఫోటో చూసీచూడగానే, కళ్ళల్లో కాంతులు మెరిసాయి. పెళ్లి అనేది ప్రతీ ఆడపిల్ల జీవితంలో ఎంతో అపురూపమైన ఘట్టం.చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా, రోజులు ఎంతగా మారినా సాంప్రదాయ బద్ధంగా పెరగుతున్న మధ్య తరగతి అమ్మాయిలకి మాత్రం పెళ్లనేది ఆజన్మతమూ మదిలో నిలిచిపోయే ఒక రంగుల కల, కలకాలమూ మిగిలిపోయే మధురస్మృతీనూ.
********
కారులో దిగిన పెళ్ళివారిని, కిటికీ లోంచి ఆశక్తిగా చూస్తోంది మాళవిక. మెట్లు అడ్డు ఉండడంతో ఆ గదిలోంచి చూస్తున్నది అవతలివారికి కనబడదు కానీ రైలింగ్ సందుల్లోంచి వాళ్ళు వచ్చేది స్పష్టంగా కనిపిస్తుంది. ముందుగా ఒక పెద్దాయన దిగారు, పెళ్ళికొడుకు తాతగారని స్పష్టంగా తెలుస్తోంది. మధ్య వయస్కురాలుని చూడగానే, కాబోయే అత్తగారు కాబోలు అనిపించింది. సుమారు 35 ఏళ్లావిడా, ఓ చిన్న పాప ఆ తరువాత పెళ్ళికొడుకూ దిగారు.
"అక్కా పెళ్ళికొడుకు ఫొటోలో కంటే ఇంకా బాగున్నాడు", అన్న చెల్లి శ్వేత నోరు నొక్కుతూ, ‘ష్, వాళ్ళకి వినిపిస్తుంది. పక్కనే హాల్ లో టిఫిన్లు చేస్తున్నారు’ గుసగుసగా అంది మాళవిక, చెల్లెలు చెప్పిన దాంట్లో నిజంలేకపోలేదని గ్రహించినా, ఆ సంతోషాన్ని కనబడనివ్వకుండా.
********
మా అబ్బాయి అమ్మాయితో మాట్లాడతాడు. మనం ఆలా వెళదాము అన్నారు పెళ్లి కొడుకు తల్లిగారు.
"మీ హాబీసేమిటి? జాబ్ చేస్తున్నారు కదా, రేపు ఎప్పుడైనా నాకు విదేశాల్లో అవకాశాలు వస్తే, మీరు ఎలా రియాక్ట్ అవుతారు?"" అడిగాడు నవీన్.
"నాకు విదేశాలకు వెళ్లాలని పెద్ద మక్కువ లేదు. సో, ఐ విల్ నాట్ ప్రిఫర్. కానీ, అప్పటి పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికి నా ఉద్దేశ్యం ఇది." అని స్పష్టంగా చెప్పింది.
"మా తమ్ముడు ఆల్రెడీ విదేశాల్లో వున్నాడు, వాడు నన్ను కూడా వచ్చేయమంటున్నాడు కానీ, అమ్మని తాతగారిని వదిలి వెళ్లడం నాకూ ఇష్టం లేదు. పైగా, క్వాసి గవర్నమెంట్ ఉద్యోగమైనందువల్ల గ్రోత్ బాగానే వుంటుంది. ఇద్దరమూ జాబ్స్ చేసుకుంటూ ఇక్కడే ఉంటే ఆ సుఖమే వేరు. మీ ఉద్దేశ్యం కూడా తెలుసుకోవడానికే ఆలా అడిగాను. బట్, థాంక్ యు ఫర్ ది బోల్డ్ నెస్ అండ్ క్లారిటీ ఇన్ యువర్ ఎక్స్ప్రెషన్. ఇంకా నన్నేమైనా అడగలనుకుంటున్నారా", కొంచం చిలిపిగా చూస్తూ అడిగాడు.
లేదన్నట్టు తల ఊపి, ఆ చిలిపి చూపులోని ఆంతర్యాన్ని అంచనా వేస్తూ మరి మన ఈ పరిచయ పయనం కొంగుముడుల దారికేగానన్న మనసులో మెదుల్తున్న ప్రశ్నని దాచేసుకుని, తల దించుకుని ఉండిపోయింది.
గొంతు సవరించుకుంటూ హాల్ లోకి వస్తూ "అమ్మా మాళవికా, మీరిద్దరూ ఇలా పక్కపక్కనే నుంచోండి." ఎంతో ముచ్చట పడుతూ, నుంచోపెట్టి, "హైట్స్ కూడా చాల పర్ఫెక్ట్ గా వున్నాయి. మా వాడు నీకు నచ్చాడా?" అని నెమ్మదిగా చెవిదగ్గరగా వచ్చి రహస్యంగా అడిగిన మహాలక్ష్మి గారి ప్రశ్నకి తన సిగ్గే సమాధానం చెప్పింది.
"అన్నయ్యగారూ, మేము రెండ్రోజుల్లో కబురంపుతాము. సంప్రదాయం ప్రకారం అన్నీ వివరంగా మాట్లాడుకుందాము. పెళ్ళికి మాత్రం కనీసం ఆరు నెలలు పడుతుంది. మా చిన్నబ్బాయి రావడానికి ఆ టైం పడుతుంది". అంది మహాలక్ష్మి.
అలాగేనండి దాందేముందన్నట్టు, తలవూపుతూ అంగీకారంగా నమస్కరిస్తూ సాగనంపారు మూర్తి దంపతులు.
********
"ఆకుపచ్చ చీర కట్టి పచ్చజెండా ఊపేసావు. నాకంతా అర్ధమయిపోయింది, ఇంక నిశ్చితార్థమే తరువాయి. ఏమంటున్నాడు పెళ్ళికొడుకు. వెళ్ళేటప్పుడు కూడా నీకోసమే తిరిగి చూసాడు. రేపట్నుంచి ఫోన్లూ అవీ మొదలేమో. అంటూ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ", సత్యం మావయ్యగారు ఆటపట్టించేసరికి మాళవిక మోహం కెంపురంగులోకి మారింది.
"మొదలెట్టారూ, ఆట పట్టించడం?" అంటూ మేనత్త శోభ మేనకోడలికి వకాలతు తీసుకుంటూ భర్త మీద కన్నెర్ర చేసింది.
"నాకు పెళ్ళికొడుకు చాలా నచ్చాడు చెల్లీ అన్నాడు", అన్న సూర్యం. "వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు, మంచి సివిలైజ్డ్ గా అనిపించారు. చదువూ సంప్రదాయం గల కుటుంబం. యు అర్ వెరీ లక్కీ."
"వాళ్ళంతా నవ్వుతూ వున్నారు, నువ్వు ఎంతగా నచ్చకపొతే ఆవిడలా మీ యిద్దరినీ పక్కపక్క నుంచోపెట్టి అన్ని సార్లు చూసుకుని మురిసిపోతుందీ!" అన్నాడు బాబయ్య మోహన్.
ఇంక రెండ్రోజుల్లో చెబుతామన్నారు కనుక బహుశా నిశ్చితార్ధం తేదీ తెలియపరుస్తారు. పనులు మొదలెట్టి సిద్ధమవ్వాలని అందరూ అనుకున్నారు.
********
నారాయణమూర్తి రాక కోసం భార్యా, మాళవికా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయోమయం, ఆందోళనా మిళితమై నిరాశగా ఇల్లు చేరిన మూర్తిని చూడగానే విషయం అర్ధమయ్యింది మాళవికకి. ఏమన్నారు నాన్న అని అడగాలని వున్న మాటను, మనసులోనే ఆపేసుకుని, నాన్నగారి మొహం చూసి, మళ్ళీ యీ వారమూ అదే కబురై వుంటుందని గ్రహించి, అమ్మ అడగగా విందామని కూడా చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. మూడు వారాలుగా వాళ్ళ గుమ్మం ఎక్కీ-దిగీ వస్తున్నా వారి నిర్ణయం గురించి నాన్నగారికి ఏ విషయమూ చెప్పకుండా, ఇలా దాటేస్తుండడం వాళ్ళకేమాత్రమూ న్యాయం కాదని మనసులోనే ఆక్రోశపడింది.
తప్పమ్మా, ఆడపిల్ల ఆలా మాట్లాడింది అని ముద్ర పడిపోతుందనీ, మన సంప్రదాయం కాదనీ క్రితంవారం
అమ్మ అన్న మాటలు, తన నోటిని కట్టి వేసాయి.
*******
గౌరవనీయులైన మూర్తి గారికి,
మా అబ్బాయి నవీనుకి పెళ్లి చేయడానికి మాకు మరి కొంత సమయం పడుతుంది. కావున మీరు మరో సంబంధము చూసుకో గలరు.
ఇట్లు మహా లక్ష్మి.
మనసును పెద్దగా గాయపరచిన చిన్న ఉత్తరమది. అరఠావులో వ్రాసి వున్న ఆ ఉత్తరాన్ని తదేకంగా చూస్తూ, పెల్లుబుకుతున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ, కన్నీళ్ళని ఆపుకుంటూ, ఈ మాట చెప్పడానికి రెండున్నర నెలలు కావాల్సొచ్చిందా అని అనాలనిపించినా పైకి అనలేకపోయింది. పెళ్లి చేయడానికి టైం పడుతుందన్న వాళ్ళు పెళ్ళిచూపుల కెందుకొచ్చినట్టో?
రెండోసారీ, మూడోసారీ వాళ్ళ చుట్టాలందరినీ ఎందుకు తీసుకొచ్చినట్టో? ఆశలు రేపేలా, భావిజీవిత ప్లాన్లు మాట్లాడడాలు, పక్కపక్కన నుంచోపెట్టి మురుసుకోవడాలూ సంప్రదాయమేనా? నాన్నగారు ఎన్ని మాట్లు వాళ్ళ గుమ్మం ఎక్కీ-దిగారో? అతడు అన్ని మాటలు చెప్పాడే? నచ్చకపోవడం తప్పుకాదు, వెంటనే నిర్ణయం చెప్పక శ్రమ పెట్టడం సమంజసమేనా? ఇదా మన సంప్రదాయము? ఇందులో సంస్కారముందా?"
సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు మదిలో కదలాడగా, ఒక్కసారి నిట్టూర్చి, స్పష్టత వచ్చినట్టై మనసులో కొన్నాళ్లుగా నింపుకున్న ఆతని రూపాన్నీ, జరిగిన ఆ తతంగ జ్ఞాపకాలనీ చెరిపివేసింది. తొలుత బాధ కలిగినా సంస్కరించని సంప్రదాయంగల కుటుంబంలోకి వెళ్లవలసిన పరిస్ధితి తప్పినందుకు సంతోషమే కలిగింది.
*******
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం
నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కధలకు, బహుమతులు పొందాను.
Comments