top of page

సముద్రం తరంగాల మధ్యన ఓ లలన


'Samudra Tarangala Madhya O Lalana'

written by Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

“ ఏమైంది? ఏమైంది?“తన క్యుబికల్ సెల్ నుండి పరుగున వచ్చి సుమంగళిని పొదవి పట్టుకుంది కాళేశ్వరి. నెత్తిని రెండు చేతులతో పట్టుకుని నీరసంగా చూస్తూ నిల్చున్న సుమంగళి భుజం నుండి షోల్డర్ బ్యాగ్ తానుగా క్రిందపడింది. తన కొలీగ్ ని మరీ కంగారు పెట్టించేస్తున్నానేమో అనుకుని వాతావరణాన్ని తేలిక పర్చేందుకు పెదవులపైకి నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది సుమంగళి.

”అబ్బే!మరేమీ లేదే!కొంచెం బుర్ర తిరుగుతున్నట్లనిపిస్తేనూ--“

కాళేశ్వరి గ్రుడ్లు పెద్దవి చేసుకుని చుట్టు ప్రక్కల చూపు సారించింది. స్టాఫ్ అలికిడి ఇంకా పుంజుకోలేదు.అప్పుడప్పుడే అలికిడి చోటు చేసుకుంటూంది. మిత్రురాలిని తదేకంగా చూస్తూ మంచి నీళ్ల గ్లాసు తెచ్చి అందిచ్చింది కాళేశ్వరి. మంచి నీళ్ల గ్లాసు అందుకుని కాసిన్ని నోట్లో పోసుకుని మరొకమారు నవ్వడానికి ప్రయత్నించింది సుమంగళి. ఆమెకు తెలుసు కాళేశ్వరి

తననెందుకలా కన్రెప్పలు వాల్చకుండా ఎగాదిగా గుచ్చి చూస్తుందో! సుమంగళి అలా అనుకున్న కొన్ని క్షణాలలోనే కాళేశ్వరి తన ఆభిప్రాయాన్ని ఉన్నదున్నట్టు వ్యక్తం చే సింది-“రాత్రిపూట పడక వద్దకు చేరే ముందు తీసుకోవలసిన జాగ్తత్తలు తీసుకుంటున్నావు కదూ!సెవెంటీ టూ అవర్స్ బిళ్ళలు చేతిలో రెడీగా ఉంచుకుంటున్నావు కదూ! మోహం ముప్పయి రోజులంటారు-మరచిపోకు. మగాళ్ళ బుధ్ధులన్నీ పెడబుధ్ధులే- - పట్టులేకుండా కడుపు తెచ్చుకునేవు--”

అంతే! ఆ ఒక్కమాటతో ఊరుని కప్పిన మాడంతటి మబ్బు ఫెడాల్మని బ్రద్దలైనట్టు రోదించనారంభించింది సుమంగళి

”అనుకున్నంతా అయిందన్నమాట! సరే సరే! కంట నీరు పెట్టుకోకు. ఎవరైనా ఇటు వేపు వస్తే బాగుండదు. అసలే మన ఆఫీసులో గాసిప్స్ మోంగర్సు ఎక్కువ. అందుకేగా అనాది నుండీ అరిటాకు సామెతను ఆడవాళ్ళకే వర్తిస్తారు మాటిమాటికీ! ఇంతకీ విషయం చెప్పావా మీ వాడికి?” అంటూ క్రిందపడ్డ షోల్డర్ బ్యాగుని అందుకుని సుమంగళిని ప్యాంట్రీవేపు నడిపించింది కాళేశ్వరి.

ఇద్దరూ కాఫీ కప్పులు బల్లమీదుంచుకుని ప్లేటులో బిస్కట్లు పెట్టుకుని కూర్చున్నారు.

“ఎన్నో నెల?”

బదులు లేదు. నిశ్శబ్దంగా కంటనీరు కక్కుకుంటూ తల అడ్డంగా తిప్పింది సుమంగళి.

అంటే-అన్నట్టు చూసింది కాళేశ్వరి షార్పుగా.

”అటువంటిదేమీ లేదు కాళీ!”

“మరి నువ్వేగా అన్నావు ముఖం తిరుగుతుందనీ! అందులో ముఖం కూడా బాగా ఉబ్బినట్లుందే!”

పూడుకుపోయిన గొంతుని పెగల్చుకుంటూ బదులిచ్చింది సుమంగళి-“కొన్ని రోజులుగా పీడిస్తూన్న అనుమానం ఈరోజు వాస్తమని తెలుసుకున్నాను.అది షాక్ గా తాకింది.మెడిసిన్ డోస్ మోతాదుకి మించి తీసుకున్నానేమో మొహం వాచి బుర్ర గిర్రున తిరిగింది“

“ఏమీ లేదంటున్నావే-ఇంతకీ విషయం యేమిటి?”అని అడిగింది కాళేశ్వరి కాఫీ కప్పుని ముందుకు తోస్తూ-చేతి గుడ్డను అందిస్తూ.

సుమంగళి కొంచెం కాఫీ నోట్లో పోసుకుని కళ్లు తుడుచుకుని చెప్పసాగింది.”నేను బాబూరావుతో

రెండేళ్ళుగా కలసి ఉంటున్నానన్నది నీకు తెలుసు కదా! పెళ్ళి చేసుకోబోతున్నామన్నది కూడా

చెప్తుండేదానిని కదా!”

బుర్రూపుతూ స్పందించింది కాళేశ్వరి-“ఇందులో కొత్తగా తెలుసుకోవడానికేముందే! ఈ విషయంలో నేనుమాత్రం తక్కువ తిన్నానేమిటి? మావాడితో యేడాది పాటు కలిసి తిరిగిన తరవాతనే కదా పెళ్ళి చేసుకుని ఓ ఇంటిదాన్నయాను. ఆతరవాత ఆర్నెల్లకే తల్లిని కూడా అయ్యాను”

“నిజమే! కానీ అందరికీ అనుకున్న సమయానికి అంతా సమకూరదు కదా! దేనికైనా పెట్టి పుట్టాలి

కదా!“

అంటే-అన్నట్టు ప్రశ్నా ర్థకంగా చూసింది కాళేశ్వరి.

”మొదట నాకు అనుమానం కలిగింది. ఆ తరవాత తెలిసిన వారు కొందరు చెప్పగా విన్నాను. విషయం ఈరోజే రూఢి అయింది; క్యాట్ ఈజ్ ఔటాఫ్ ది బ్యాగ్ లా. బాబూరావుకి మరొక అమ్మాయితో క్లోజ్నెస్ యేర్పడిందని. అతను అకస్మాత్తుగా ముంబాయికి బదలీపైన వెళ్ళింది వాళ్ల కంపెనీ వాళ్లు చేసిన యేర్పాటు పైన కాదని; అతనే స్వయంగా యాగీ చేసి నన్ను వదలించుకోవాడానికి చేసిన తతంగమని, అక్కడికి ఆమె కూడా పకడ్పందీగా ట్రాన్సఫర్ చేసుకుని వెళ్ళిందని--!”

సుమంగళి మాట విని మిత్రురాలి కళ్లు యెరుపెక్కాయి.”చూడాటానికి పిల్లికూనలా ఉంటాడు.అంతటి ఘాతుకానికి ఒడిగట్టాడా! అటువంటి వాణ్ణి నడిరోడ్డున పట్టుకుని పళ్ళూడదీయాలి! సరే-వాడి ఊసు అలా ఉంచు. ఇప్పుడేమి చేస్తావు? కన్నీటి చుక్కలకు ఆడవాళ్ళ సమస్యల్ని తీర్చే శక్తి ఏనాడు లేదుగా! ”

“మైండూ మెదడూ బాగా కదలిపోయినట్లున్నాయి.మొదట సైకియాట్రిక్ స్పెషలిస్టుని కలుసుకుని కుమిలిపోయిన మనసుని స్థిమిత పర్చుకోవాలి. లేకపోతే నేనేమైపోతానో నాకే తెలియదు. నేనసలే ఎమోషనల్. ఆ తరవాత లీగల్ సలహా తీసుకుని ఫేమిలీ కో ర్టులో--“

ఆ ఒక్కమాటతో కాళేశ్వరి సుమంగళిని ముందుకు సాగనివ్వలేదు.”నోర్మూసుకుంటావా!ఎమోషన్స్ తాకి నీ మైండ్ బ్లాక్ అయిపోయినట్లుంది. అసలు నీవిప్పుడు ఆలోచించగల స్థితిలో లేనట్లున్నావు. నువ్వు అతడితో ఒకటిన్నరేళ్లుగా కలసి ఉంటున్నావన్నది ఆఫీసు కొలీగ్సు కొందరికి తెలిసుండవచ్చు. నాకు కూడా తెలిసుండవచ్చు. మరి నువ్వు అతనితో మాత్రమే సహజీవనం గడిపావన్న ఆధారం యేదీ అని-ఆ ధూర్తుడు అడిగితే--అది కాదని చెప్పడానికి నీవద్దేముంది? ఒక వేళ నీ అదృ ష్టం కొద్దీ కోర్టువారు నీ వేపు మొగ్గు చూపడానికి పూనుకున్నా-అదంతా ఒక కొలిక్కి రావడానికి ఎన్నాళ్ళవుతుందో ఆలోచించావా! అంతేకాదు. మరొకటి కూడా ఉంది. ఇది కూడా తెలుసుకో. ఇదిగాని నలుగురి చూపుల్లో పడితే నవ్వుల పాలయేది నువ్వే! ఆ ధూర్తుడికేమీ కాదు. నీకు తోబుట్టువు ఒకతె ఉందన్నది మరచిపోకు. విషయాన్ని సాగదీస్తే,ఆ ప్రభావం దాని భవిష్యత్తు పైన పడ్తుందన్నది మరచిపోకు. ఈ పాటికి ఆ కొత్త వగలాడితో

పెళ్లికూడా చేసుకుని హనీమూన్ కి చెక్కేసుంటాడు ఆ దగాకోరు. అటునుంచి యిటూ-యిటు నుంచి అటూ-యెలా చూసినా ఇది మగ ఆధిపత్యం గల సమాజమని మరచిపోకు” సుమంగళి మాటా పలుకూ లేకుండా మిత్రురాలిని కన్నార్పకుండా చూస్తూండి పోయింది. ఊరికెళ్లి నప్పుడల్లా వదినమ్మ అన్యాపదేశంగా ఎప్పుడూ చెప్తుండేది- “ఇప్పటి ఐటీ సంబంధాలూ కార్పొరేట్ సంస్థల్లోని క్లోజ్ నెస్ లూ ట్రైనులో-‘టైమ్ పాస్-టైమ్ పాస్’అంటూ అమ్ముకుంటూ వెళ్లే వేరుశెనక్కాయల వంటివి. నీకు పెళ్ళయినంత వరకూ అటు వంటి వ్యవహారాలకు యెంత దూరంగా ఉంటే అంత మంచిది. అంతే కాదు, మరొకటి కూడా చెప్తుండేది. ఎంతటి గుండె నిబ్బరంగల ఆడదానికయినా ఒంటరి బ్రతుకు దుర్లభమేనని. అదే సమయం,కళ్ళకు అగుపించే రుబ్బరోలుకి తలను అప్పగించకుండా చూసుకోవాలని. చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకునే పరిస్థితి తెచ్చుకోకూడదని”

అప్పుడు మిత్రురాలి గొంతు విని ఆలోచనల్లోనుంచి తేరుకుంటూ తలెత్తి చూసింది సుమంగళి.

”అదేవిటి అలా స్టన్నయి పోయినట్టు కూర్చుండి పోయావు! ముందు కాఫీ తాగు. తిన్నగా వెళ్లి పదిరోజుల పాటు లీవు వేసి ఊరికెళ్లిరా. ఇక్కడే ఉంటే అలుపెరగని తరంగాలలా పాత జ్ఞాపకాలు పదే పదే నిన్ను తాకుతూ ఉంటాయి. రెస్ట్ లెస్ గా తయారవుతావు. ఒక విషయం చెప్తాను. నిదానంగా వింటావా?”

“అదేమిటే కాళీ! నన్ను సస్పెన్సులో ముంచడానికి సమయం ఇదేనా! చెప్పబోయేది ఉన్నదున్నట్లు చెప్పొచ్చుకదా!”

“ఎమోషనల్ ఫీలింగులో ఉన్నావు కాబట్టి ఇప్పుడే చెప్తాను. లేనిపోని అనుమానానికి తావివ్వకుండా కాదూ కూడదూ అనకూడదు. చైనా సామెతలో అన్నట్టు ఆడది తనకిష్టమైన వాడితో వెళ్ళే బదులు తననిష్టపడే వాడితో వెళితేనే సముచితం. అవునా?”

ఆ మాట విని సుమంగళి ఆశ్చర్యంగా చూసింది. ”నువ్వనేది చాలా రోజులుగా నా దగ్గరితనం కోసం నా చుట్టూ తిరుగుతూన్న కృష్ణ ప్రసాద్ గురించేనా!”

తలూపింది కాళేశ్వరి.

సుమంగళి వేగంగా-అది వీలుకాదన్నట్టు తలవిదిలించింది.

”ఏం? ఎందుకు వీలు పడదు? కమౌట్ విత్ ఓపెన్ మైండ్” కాళేశ్వరి నిలదీసింది.

“ఇది పచ్చి ద్రోహమంటాను. అతను నన్ను మనస్పూర్తిగా ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా మోహపు సముద్రంలో మునిగి ఒక ప్రాణం లేని పేపరు బొమ్మ చెంత చేరి అతణ్ణి దూరంగా నెట్టాను. ఒకటి రెండు సార్లు అతణ్ణి కించపరిచాను కూడాను. ఇప్పుడతడి దరి జేరడం ఆత్మవంచనవుతుంది” .

మిత్రురాలి దేహభాషకు కాళేశ్వరి నవ్వింది.”అటువంటి వ్యక్తి గురించి మంచిగా ఆలో చిస్తున్నావు చూడూ-అంత వరకూ మంచిదే. కాని అతడు శుధ్ధ బ్రహ్మచారిగానే మడికట్టుకుని ఉంటున్నాడనుకుంటున్నావు చూడూ--అది తప్పు. ఒకసారి కాదు. రెండు మూడు సార్లు చూసాను; క్లాక్ టవరు పార్కు వద్ద ఇద్దరమ్మాయిలతో కలసి వెళ్ళడం. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో ఆడామగా తేడా లేకుండా వాళ్ల వాళ్ళ అవసరాలు వాళ్ళకుంటూనే ఉంటాయి సుమా! ఆ మాటకొస్తే ఈ కార్పొరేట్ ప్రపంచ వాతావరణంలో-ముఖ్యంగా పొరుగూళ్ళలో పనిచేస్తున్న వాళ్లలో ఎవరికి మాత్రం సరైన వయసులో పెళ్ళిల్లవుతున్నాయని? ఇప్పటి చాలామందిలా రోడ్డు రోమియోలలా కాకుండా--టైమ్ పాస్ వ్యవహారంలా తీసుకోకుండా అతను నిన్ను మనస్పూర్తిగానే

ఇష్టపడుతున్నాడేమో! అబధ్ధం చెప్పి దగ్గరయితే దగా అవుతుంది గాని-ఉన్నదున్నట్లు చెప్పి అతడి మనసులో చోటు సంపాదించుకుంటే ప్రమాదం ఏముంది?ఒకసారి నువ్వుగా కృష్ణ ప్రసాదు మనసు పొరల్ని స్పర్శించడానికి ప్రయత్నిస్తే నీ కొంపేమీ మునగదుగా! ఇంకా చెప్పాలంటే ఈ విషయం తెలుసుకోవడానికి నాకు కూడా ఆసక్తిగానే ఉంది”

సుమంగళి మిగిలిపోయిన కాఫీని తాగడం పూర్తి చేస్తూ ఎటో చూపులు నిల్పి మౌనంగా ఉండిపోయింది. వదినమ్మ అన్న మరొకమాట మనసున కదలింది-‘ఎందుకో మరి-ఆడదానికి వయసు త్వరగా దాటిపోతుంది సుమంగళీ!’

ఇది నిజమేనేమో--

మిత్రురాలి సలహా ప్రకారం సుమంగళి ఊళ్లో వారం రోజులపాటు గడిపి, తెరపి కలిగిందనిపించిన తరవాత హైద్రాబాదు వచ్చేసింది. కాని వెంటనే డ్యూటీలో చేరలేదు, మరొక మూడురోజులు లీవు పొడిగించింది. మరునాడు పొందికగా తెల్లంచు ఎర్రచీర కట్టుకుని తెల్ల రవిక వేసుకుని నుదుట పొందికగా బొట్టు పెట్టుకుని, క్లాక్ టవర్ సెంటర్ వద్దవరకూ ఆటోలో వచ్చి ఆ తరవాత అక్కడ దిగి--పక్కవీధిలోకి మలుపు తిరిగింది. ఆమె ఎదురు చూసినట్లే జరిగింది. అల్లంత దూరంనుంచి చూసిన తోడనే ఫెళ్ళున మెరిసిన కళ్లతో కృష్ణ ప్రసాదు త్వర త్వరగా షర్ట్ మార్చుకుని చకచకా గది పోర్షన్ మెట్లు దిగి ఆమెకు యెదురొచ్చాడు-“గుడ్ మోర్నింగ్!”అంటూ.

ఆమె మునుపులా మూతి బిగించలేదు. బిగుసుకు పోలేదు. విరిసీ విరియని పూరేకుల వంటి పెదవులతో నవ్వి”గుడ్ మోర్నింగ్. మీరిక్కడా ఉంటున్నారు!“ అని మిక్కిలి ఆశ్యర్యపోతున్నట్టు కళ్లు రెపరెపలాడించింది.

”అవును.నేను ఈ వీధిలోనే ఉంటున్నాను,ఇప్పుడు నేనొక మాట చెప్తాను మీకు బోర్ కొట్తుందనుకోకపోతే!”

చెప్పమన్నట్టు తలూపిందామె.

”మీరీ చీరలో రంభలా-సారీ! దేవతలా మెరిసిపోతున్నారనుకోండి!“ సుమంగళి వెంటనే బదులివ్వలేదు.మిత్రురాలి మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకుంది.”ఇది కడువేగ వంతంగా వెళ్లే ప్రపంచం! నీ కోసమూ నా కోసమూ వెనక్కి తిరిగి చూసేపాటి తీరిక దానికి లేదు.-బి ప్రాక్టిటల్!అండ్ బి వైస్!”

అభ్యర్థనపూర్వకమైన అతడి గొంతు విని తలెత్తి చూసింది,”ఏమీ అనుకోకపోతే ఒకపారి నా పోర్షన్ వచ్చి కప్పుటీ తీసుకుందురూ!మొన్ననే మా కంపెనీ వాళ్ళు నాకు హయ్యర్ గ్రేడిచ్చారు.ఆ సంతోషాన్ని మీతో పంచుకునే అవ కాశం ఇద్దురూ!”

ఆమె అలక్ష్యంగా ముఖం పెట్టి చూడలేదు.”దీనికింతగా బ్రతిమిలాడాలా!మీ సంతోషం నా సంతోషం కాదా!” అంటూ అతణ్ణి అనుసరించింది.ఆ ఒక్కమాటతో కృష్ణప్రసాదు వెచ్చదనానికి కరిగిపోయిన మంచుగడ్డలా మారిపోసాగాడు.

టీ తాగడం పూర్తయిన తరవాత ఆమె ఊహించినట్లే సంభాషణ సాగింది”మీకు ఆక్షేపణ లేకపోతే ఒక సలహా ఇస్తాను“

“ఊఁ! చెప్పండి “అంది.

మొహమాటం పడుతున్నట్లు ముఖం పెట్తూ అన్నాడు.”నా పోర్షన్కి పక్కనే సింగిల్ గది ఖాళీగా ఉంది. ఇక్కడకు వచ్చేయండి. ఎందుకంటే- మీరు పనిచేస్తున్న కంపెనీ ఇక్కడికి కిలోమీటరు దూరంలో కూడా ఉండదు. కూతవేటు దూరమన్నమాట. ఎప్పుడైనా పని రద్దీ యెక్కువై అలసటగా ఫీలయితే మీరిక్కడకు వచ్చి సేద దీర్చుకుని మళ్లీ వెళ్లిపోవచ్చు”

“మీ సలహా మరీ బాగుందండోయ్! మీలాగే నాకు కూడా క్లోజ్ గా మూవ్ చేసే రూమ్ మేట్సు ఉంటారన్నది మీరు మర్చిపోతు న్నట్లున్నారు. వాళ్లనలా అబ్ రప్టుగా విడిచి రావడం యేం బాగుంటుంది చెప్పండి.అయినా స్త్రీగా నా జాగ్తత్తలో నేనుండాలి కదండీ!“

అంటే?అన్నట్టు కళ్ళెత్తి చూసాడతను.

“మొదట మీరు నన్ను మీ పక్క పోర్షన్కి రమ్మంటారు.ఆ తరవాత--- “ఆమె చెప్పడం చప్పున ఆపుచేసేసింది.

”తరవాత-- ”అతడు అర్థోక్తిగా అడిగాడు.

“తలనొప్పని-ఇంకేదో చెప్పి కాఫీ చేసిపెట్టమంటారు. ఆ తరవాత ఫలహారమూ చేసివ్వమంటారు. కాదనలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తరవాత నిదానంగా-ఖర్చు మిగుల్చుకోవచ్చని మీ స్వంత పోర్షన్లోకి వచ్చి ఉండమంటారు. ఎందుకొచ్చిన బెడదలెండీ!”

“ఏం?నాతో చేరువగా ఉండకూడదా!నేనంత చెడ్డవాడిగా కనిపిస్తున్నానా?మీ చల్లని చూపుకోసం నేనెన్ని రోజులుగా--”

“మీరు మంచివారే కావచ్చు.కానీ వయస్సు అంత మంచిది కాదు కదా! మీ చూపులో ఉన్న వాడీ వేడీ నాకు తెలుస్తూనే ఉంది”

“సరే-ముసుగులోని గుద్దులాటెందుకు ? మీ మనసులోని మాట చెప్పేయండి. వాటీజ్ యువర్ అబ్జక్షన్?“

“ఈ విషయం తేల్చేముందు మీకు ఒక సంగతి కూడా చెప్పాలి. నాకు కూడా గతమనేది

ఉంటుందని. ఆ రీతిన నాకు కూడా--“

“ఇక్కడ మీరాగండి! ఇప్పటి రోజుల్లో ఎవరికి గతం లేదంటారు? అసలు మనం పనిచేస్తున్న వాతావరణం ఎటువంటిదని. డేషింగ్ వాతావరణం. నాకు మాత్రం గతం ఉండదంటరా? మీరు చెప్పడానికి సాహసించి మనసు విప్పుతున్నారు కాబట్టి విషయం నాముందుకు వచ్చింది. లేకపోతే-అంతా గప్ చిప్. కాదంటారా?”

“అలాగైతే నా మనసులో ఉన్నది మీ ముందుంచుతున్నాను. స్వీకరించడమూ స్వీకరించకపోవడమూ మీ వంతు. ముందు నా మెడన పుస్తె కట్టండి. గుడిలో జరిగినా పర్వాలేదు. ఆ తరవాత మీ వెంట వస్తాను“అంటూ సుమంగళి లేచింది;ఇక తను వచ్చిన పని అయిపోయినట్టు.

అతడు చప్పున లేచి ఆమె చీర కొంగు పట్టుకున్నాడు-“ఇలా అడుగుతున్నానని యేమీ అనుకోకండి, మనసు ముఖ్యం గాని-- పుస్తె కట్టిన తరవాత మాత్రం మిమ్మల్ని డిచ్ చేయనన్న గ్యారంటీ యేదీ!”

ఆమె తిరిగి చూసి చిన్నగా నవ్వింది.”బాగానే అడిగారు!మీరు మగరాయళ్లేగా!అలాగే డిచ్

చేయండి. కాని గుళ్ళో పుస్తె కట్టిన తరవాత ఆ పని చేయండి; మీకు నిజంగా అలా చేయగల గుండె ధైర్యం గాని ఉంటే--అప్పుడలా అనిపిస్తే-అలానే చే యండి. కాని—ఈ విషయంలో ఒకటి చెప్పడానికి సాహసిస్తాను .మీరు గాని నొచ్చుకోనంటే--

”ఉఁ-అన్నాడు కృష్ణ ప్రసాద్.

”మీరు కట్టబోయే అదే పుస్తెను నా మెడనుండి తీసిపడవేసే ముందు గుర్తుంచుకోవలసినదొకటుంది”

ఏమిటన్నట్టు సూటిగా చూపు సారించాడతను.

”మా కాబోయే అత్తగారి మెడన కూడా అటువంటి పుస్తే ఒకటుందన్నది మీరు మరచిపోరని నేను నమ్ముతు న్నాను“ ఆమాట విన్నంతనే అతడు నిల్చున్న చోట నిల్చున్నట్టే కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయి-“మీరు న్యాయంగా మాట్లాడుతున్నారు.మనసు విప్పి మాట్లాడుతున్నారు. నాకు బాగా నచ్చారు. ఐ ప్రామిస్. మనం పెళ్లి చేసుకున్నతరవాతనే కలసి ఉందాం. జీవితాంతం కలిసే ఉందాం“ అంటూ కుడిచేతిని ఆమె ముందుకు చాచాడు.సుమంగళి చేయి కలిపింది.

అప్పుడతని మనసు ఓరన పూలతోటలోని కమ్మని గాలి రివ్వున స్పర్శించి వెళ్ళిన హృదయానుభూతి కలిగింది.తనకు స్వంతం కాని సుఖం కోసం—ఆత్మీయత లేని పరాయిదాని పలుకు కోసం-కులుకు కోసం ఎన్నాళ్లీ వెంపర్లాట! ఇప్పుడు జ్ఞానోదయం సుమంగళికి మాత్రమే కాదు-కృష్ణప్రసాదుకి కూడా కలిగింది.

***సమాప్తం***

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల-ఆంధ్రభూమి మాసపత్రికలో

ప్రచురించబడ్డాయి.93 views0 comments

Commentaires


bottom of page