top of page

సముద్రం


'Samudram' written by Dr. Kanupuru Srinivasulu Reddy

రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

ముగ్ధ భార్గవికి భర్త ఉన్నా, పిల్లలున్నా, ఒంటరి తనమే ఆమె ఆత్మీయ స్నేహితురాలు. ఆమెకు ఎలాంటి ఆరోగ్య ఆర్ధిక సమస్యలు లేకపోయినా, పిల్లలతో ఇబ్బంది లేకపోయినా, కోటి ఆలోచనలు తలలో వీరవిహారం చేస్తూనే ఉంటాయి. మంచి ఇరుగుపొరుగు. లోకం ఇంతవరకు చాలా అనుకూలంగా ఉంది. ఆమెను చెడ్డగా ఎవ్వరు ఏమీ అనుకోవడం లేదు. వినిపించినా ఆ ఒక్క మాటే , 'ఎంత ధైర్యం!' ఒంటరిగా ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఈ మహా పట్టణంలో, ఈ దరిద్రపు జనం మధ్య, ఈ వయస్సులో, అంత అందగత్తె! నిజంగా మెచ్చుకోతగిన మహాతల్లి!!

ముగ్ద- పొగడ్తలకు పొంగిపోనూ లేదు, విమర్శలకు కృంగిపోనూలేదు. ఆమె ధ్యాసంతా భర్త మీదనే! ఉద్యోగరీత్యా భర్త విదేశాలకు వెళ్లి సంవత్సరం పైనే అయ్యింది. ఆమె భర్త భాను, అందగాడు, మంచి ఉద్యోగం, భవిష్యత్తును చేతిలో ఉంచుకోగల సమర్ధుడు, ముఖ్యంగా తనంటే ప్రాణం అని, ప్రగాఢ విశ్వాసంతో మంచి కాలం కోసం, క్షణం క్షణం ఎదురు చూస్తుంది. చిన్నాడు పుట్టి నెలరోజులు కూడా కాలేదు. అప్పుడే వెళ్ళాల్సి వచ్చింది. ఎప్పుడు వస్తాడో తెలియక అసంతృప్తి మందిరంలో మగ్గుతుంది.

తనూ వస్తానంటే, పిల్లలతో కష్టం అన్నాడు. "వద్దు, వద్దు మనం ఇక్కడే ఉందాము" అని నెత్తి నోరు బాదుకుంది, ఏడ్చింది, తిండి తిప్పలు మానేసింది. అయినా వినలేదు. కోట్లు జీతం , అక్కడ పెద్ద ఆఫీసుకు అధికారిని చేసారు. వచ్చేస్తాగా, ఒక సంవత్సరం ఎంత? వెన్నెల వచ్చేటప్పుడు మీకు అన్నీ పంపుతాను.”

“వెన్నెలా! “ఆశ్చర్యపోయి చూసింది.

“అదే మా ఆఫీసులో పనిచేస్తుందే, నీ స్నేహితురాలు. ఆవిడిని ఆరునెలలు నాతో పంపుతున్నారు.”

సంతోషంతో తలమునకలయిపోతూ ఆకాశంలో విహరిస్తున్న అతన్ని తన ప్రేమ, పిల్లలు నిలపలేకపోయారు .

ఒక్క సంవత్సరమన్నది నాలుగు వసంతాలు పూర్తి అయిపోయాయి. ఎంతోమంది నీతులు చెపుతారు, నీ ఆనందం నీలోనే ఉందని, నువ్వు ఉన్నచోటే ఆనందాన్ని సృష్టించుకోవాలని!! ఏమో.. ఆశ లేనిచోట నిరాశ నిస్పృహలను సంతోషంగా మార్చుకోమని వాళ్ళ బోధ. నిజమే! తను ఏం చేస్తుంది? ఉన్నారుగా పేగు తెంచుకుని పుట్టిన వాళ్ళు!! పితృ వాత్సల్యాన్ని, ఆత్మీయ అనురాగాలను, బొచ్చె చేతికిచ్చి డబ్బు పెట్టి కొనుక్కోమని ప్రతి వీధికి, తను ఎక్కడ పంపించగలదు. నీడనిస్తానంటే తోడు ఉందామనుకుంది. ఎండమావులను చూపించాడు. పోనీ ఎడారిలో నీటి చెలమలుంటాయి కదా అనుకుంది . నీ పిచ్చి అక్కడుండేది ఆవేదనల ఆస్థి పంజరాలే అని జోస్యం చెపుతున్నాడు.

ఎప్పుడొస్తారని అడగకూడదు, అని అనుకుంటూనే ఫోను చేసినప్పుడల్లా అడుగుతూనే ఉంటుంది. ఎంత సేపయినా మాట్లాడుతాడు. వదల బుద్ది వెయ్యదు. తిరిగి వచ్చే విషయం దాటేస్తాడు. మధుర తలపులు ఎప్పుడో మరణించాయి. ఓర్పు, సహనం మానని గాయాలుగా మదిలో ఘోషిస్తున్నాయి. ఇప్పుడు ఎదురు చూసి, చూసి, నిరాశ నిస్పృహ ఎక్కువయి, ఒక నిరామయ స్థితికి చేరిపోయింది ముగ్ధ. భార్యా పిల్లలు బంధం అనుబంధం, బాధ్యతని అతనికి ఉండాలి . ఎప్పుడూ బంగారం, డైమండ్స్ కొనమని డబ్బు పంపుతాడు.

, మీరు లేకుండా నాకెందుకు ?అంటే అదొక పెట్టుబడి, భవిష్యత్తుకు స్థిరత్వం అని తల తినేస్తాడు. ఇక్కడే విశాఖలో మరొకటి, హైదరాబాదులో ఒక ఫ్లాటు కొన్నానని చెప్పాడు. ఎవరి పేరు మీద అని తను అడగలేదు. ఇప్పుడున్నది మాత్రం తన పేరు మీదే ఉంది. కారు ఆయన కొన్నదే! పిల్లల్ని గాని, తనను గురించిగాని ఎక్కువగా అడగడు. తాళి బొట్టుకు, కాలి మెట్టుకు సంస్కృతి సంస్కారపు సంకెళ్ళు వేసాడు. కట్టుబడికి, పెట్టుబడికి ఉచిత రక్షక బందీని చేసాడు. అతని దృష్టిలో స్త్రీకి మర్యాద మతింపు అదేనేమో !! డబ్బుతో తనకు పిల్లలకు, ప్రేమ అనుబంధం తెస్తాడేమో ! అనుకుంటూ నిస్పృహతో నిట్టూర్పులు వధలడమే ముగ్ద దినచర్య.

“మీరు వచ్చేయ్యకూడదా! ఇద్దరం ...పిల్లలు కలిసి హాయిగా ఉండొచ్చు. ఏం డబ్బు ..ఎందుకు డబ్బు? ఉన్నది చాలదా! అనుబంధాన్ని మించిందా? బిడ్డల ముచ్చటలకంటేనా? కావాల్సి వస్తే నేనూ ఉద్యోగం చేస్తాను.”

“ఆహ! అలా అనకూడదు. అవకాశం ఉన్నప్పుడుగాకపోతే మరెప్పుడు ? డబ్బుతో అన్నీ వస్తాయి.”

“అన్నీ పోగొట్టుకోనుకూడా పోగొట్టుకోవచ్చు. మానవ స్పందనలన్నీ చచ్చిన తరువాత శరీరానికి కావాల్సింది అగ్గిపుల్ల మాత్రమేనండి. మీరు లేకుండా నేను ఉండలేక పోతున్నాను. పెద్ద పాప అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నాను. చిన్నవాడి రూపురేఖలు కూడా తెలియవు మీకు.” బాధతో మాట్లాడ లేక పోయింది.

చాలా సేపటి వరకు జవాబు వినపడక పోతే, “ఛీ అలా ఉండకూడదు. నేను దూరంగా ఉంటే మాత్రమేం. మనసంతా మీ దగ్గరే కదా! రేపటినుంచి పేస్ టైములో చూస్తాను. లేకపోతే స్కైప్ ఉందిగా! నేను అక్కడున్నట్లే దానికెందు...!” అన్నాడు భర్త భాను. ముగ్ధ మనసు కాలిన వాసన వచ్చింది. చూసి ఆనందించ మంటున్నాడు. నయం భగవద్గీత చదువుకోమనలేదు. అదే మేలేమో, ఈలాంటి బాధ్యతారహితుల్ని పెండ్లి చేసుకుంటే ! తరువాత పేస్ టైము లేదు. స్కైపీ లేదు.

అసలు పలకరింపులే పలచబడి పోయాయి. పిల్లలు నిదురపోయిన తరువాత విపరీతమైన ఆలోచనలు. ఏడుస్తూ నిద్ర మరిచి పోవడం ముగ్ద జీవితం. అతను కట్టిన తాళి ఈ జన్మది కాదేమో అనిపిస్తూ ఉంటుంది ఆమెకు. ​

“చాలా మంది సెలవలో వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళుతున్నారే! మరి మీరు..?”

“ ఆ... వాళ్ళు లోయర్ కాడర్. వస్తారు..పోతారు..మల్లీ రారు. నాది పెద్ద పోస్టుకదా, అడుగు బయట పెడితే కోట్లు నష్టం. ఇక్కడ సంసారం, పిల్లల చదువు అంటే బోలెడు ఖర్చు అవుతుంది. ఇప్పుడు వస్తే సిటిజన్ షిప్పు కూడా రాదు . పిల్లల బర్త్ సర్టిఫికేట్లు, ఫోటోలు పంపు . చెరో కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేసి పెడతాను. ఎం మాట్లాడవు? నువ్వు అలాగుంటే నేను ఉద్యోగం ఎలా చేస్తాను, సంతోషంగా ఎలా ఉంటాను? మీ కోసమే కదా!”

ఇవన్నీ నిజాలు అని నమ్మి బ్రతకాలి,తప్పదు అని తెలుసు ముగ్దకు.

ఎదుటి అపార్టుమెంటులో ఉన్న భారతీ, పార్దవ్ మాత్రమే తోడు నీడ. భారతి ముగ్దను చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకునేది. అతను చాలా ముక్తసరిగా పలకరించేవాడు. భారతీ అతని మీద లేనిపోనివి వ్యంగ్యంగా చెప్పేది. ముగ్ద భర్త మీద కూడా బాణాలు వేసేది. మనస్పూర్తిగా నవ్వుకునేది. అవి ఎగతాళి నిందలుకావు.ఆత్మీయ చతురులు.

“ఏం ఆ మగాడు వస్తాడా ,ఇంకొకర్ని చూసుకోమంటాడా. అతనెప్పుడో చిలకల్ని

చూసుకోనుంటాడు. ఈ మగవాళ్లకు వెరైటీలు గావాలమ్మాయి. ” నవ్వుతూ ముగ్ధను ఆట పట్టించేది.

నవ్వుకుంటూ మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయేది .

“ నేనయితే ఇంత కాలం ఓర్చుకోనుండలేను, వస్తావా విడాకులు ఇస్తావా అని తాడో పేడో తేల్చుకొని ఉండేదాన్ని. ఇ-మెయిల్ చెప్పు, సోషల్ మీడియా లో ప్రేమిస్తా! చాలా మంది త్రాష్టులు ఈ వ్యభిచారం చేస్తున్నారు. నేను నచ్చుతానంటావా?” అంటూ ముగ్దను చూసి నవ్వింది.

“మీకేం ఆక్కా! సినిమా స్టారులు కూడా సరిరారు.”

“నువ్వేం తక్కువ ఉన్నావా? మేకప్ లేకనే కళ్ళు తిప్పుకోలేనట్లుంటావు. మరెందుకు అతను రావడం లేదంటావు? అక్కడ అన్నీ జరిగిపోతూ ఉండాలి. లేదంటే డబ్బుకు మరీ గడ్డితినేవాడయినా ఉండాలి. అలాంటి వాడికోసం ఎందుకు పడిగాపులు కాయడం? మోడుగా బ్రతకడం !? ”

మౌనంగా ఉన్న ముగ్ద ను చూస్తూ,” వయసులో కోరికలను అణచుకోవడం చాలా కష్టం అమ్మాయి. విసుగు, కోపం, విరక్తి పిచ్చివాళ్ళను చేస్తాయి. అవి తీరితే, ఎంతో మనశ్శాంతి, జీవితమీద అనురక్తి కలుగుతుందో నీకు తెలియదు. ఆ అమృతం ఒక్కటే నన్ను బ్రతికిస్తుంది.”

ఆ మాటలు నచ్చ లేదు ముగ్ద భార్గవికి. తనకు ఇలాంటి అసంతృప్తి ఉందా? లేదు!! భర్త తోడులేడని తప్ప!

“శరీరాన్ని తృప్తి పరిచడానికి, అనుబంధాన్ని ఎలా అవమానపరుస్తాము అక్కయ్యా!”

“ చింతకాయలు. అతను పవిత్రంగా ఉంటాడంటావా? నాకు నమ్మకమే లేదు. తెల్ల పంది కొవ్వు రుచి మధురమని , బంధం అనుబంధాలు బురద పురుగులని, సంకర జాతి శరీరాల్ని బజారులో కొనుక్కునే ఉంటాడు. అంతా కధలు!! ఈ కాలంలో ఆడవాళ్లే ఉండటం లేదు.”

చాలా ఆలోచనలో పడింది ముగ్ద . మొగుళ్ళు లేని వాళ్ళందరూ నిజాయితీగా లేరా? నిగ్రహశక్తి, స్త్రీల రక్షణ కవచం, ఆత్మాభిమానపు నిధి, మగాడు మెరుపుకు వసం తప్పుతాడేమోగాని స్త్రీ కాదు!!

“ఈ కాలంలో గాని ఏ కాలంలో అయినా స్త్రీలో ఆడతనమే చూసారుగాని, వ్యక్తిత్వాన్ని ఏ మగాడయినా చూసాడా? వ్వ క్తిత్వాన్ని చూడనప్పుడు ఈ కలిసి ఉండటం ఎందుకు? కాలం మారింది. హద్దు దాటితే, అడ్డు ఉండదమ్మాయి. తప్పొప్పులు అసందర్భాలే అవుతాయి. ” ఆలోచనగాచూస్తూ ముగ్దతో అంది భారతి.

“ బంధానికి యింకా విలువుందని బ్రతుకుతున్నాను అక్కా!! మనిషిలో నైతిక ఆదర్శాలు చావలేదు.”

పక్కున నవ్వింది భారతి. ” ఒక్క తెలుగు సినిమా చూస్తే ఎంత పవిత్రుడికైనా మనసు తప్పుడు ఆలోచన చేయిస్తుంది. అంత స్థిరంగా ఉన్నాయి నేటి ఆదర్శ వంతుల మనస్తత్వాలు,”అంది.

దానికి సమాధానం చెప్పక ఉండిపోయిన ముగ్దను, భారతి చాలా సేపు చూసి . గాఢనిట్టూర్పు వదులుతూ, “ఓదార్పు, అనునయం, నమ్మకం కలిగించే మగవాడి కోసం, ఎంత త్యాగమైనా చెయ్యొచ్చు. ఎంతకాలమైనా ఎదురు చూడొచ్చు .కానీ...?” అంది.

ముగ్ద, భారతి కళ్ళు తడిగా ఉండటం గమనించింది. ఆశ్చర్యమేసింది. ఎప్పుడూ ఆమెను అలా చూడలేదు. వాళ్ళుకూడా సరిగా లేరా అని అనుమానం వేసింది. కానీ సంతోషంగా ఉన్నట్లు ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఇంట్లోనే ఉండదు. తిరుగుతూనే ఉంటుంది.

“ఎందుకక్కా! అలా ఉన్నారు. పార్దవ్ సరిగ్గా....!?ఆత్రుతగా ముందుకు అడుగు వేసింది.

“ఛీ..ఛీ. అలాంటిదేమీ లేదు. మరీ మంచిగా ఉన్నాడనే నా బాధ.” అని నవ్వేసి కళ్ళు తుడుచుకుంది భారతి.

ఏమన్నా అనుకుంటుందేమోనని తటపటాయిస్తూ “మరెందుకు?” అడిగింది ముగ్ద.

“పుట్టగానే ఎవ్వరూ చెప్పకుండానే నవ్వడం, ఏడవడం నేర్చుకుంటాము. ఇందుకో మరెందుకో అవే సాధనచేస్తూ బ్రతికేస్తూ ఉంటాము. బతుకును బహు జాగర్తగా వృధా చేస్తుంటాము. వసంతోత్సవం చేసుకోలేని వనాన్ని నేను.” అంది వెలితిగా నవ్వుతూ భారతి.

“అంటే?” ఆశ్చర్యంగా ఆత్రుతగా ఆమె వైపు చూసింది.

“నాకు బిడ్డలు పుట్టరు.” అని ముగ్ద కళ్ళల్లోకి చూసి తల ప్రక్కకు తిప్పుకుంది.

నిర్ఘాంతపోయి చూస్తుండిపోయింది ముగ్ద. అందుకని పార్దవ్ ప్రేమగా చూసుకోవడం లేదా?

మెల్లగా తిరిగి ముగ్డను చూస్తూ,” అది ఆయన తప్పుకాదు. నాదే..నాకే!” అంది.

ఆమెలో ఒక్కసారిగా చాలా తేడా కనిపించింది. ముఖం అంతా కుంచించుకు పోయి వనవాసపు సీతమ్మలా ఉంది. ఆ అసంతృప్తిని దాచుకోవడానికేమో వారమంతా అలా బయట తిరుగుతుంటుందేమో! ఎక్కడలేని జాలి ముంచుకొచ్చింది. పాపం అనుకుంది ముగ్ద. కొందరి జీవితాలు అన్నీ ఉండి కూడా ఎడారులేమో!

“ నువ్వు అనుకున్నట్లు, వేరే వాళ్ళు అనుకుంటున్నట్లు నేను నా జీవితాన్ని వ్యర్ధంగా గడపడం లేదు. రోజూ ఎదో ఒక అనాధ శరణాలాయానికి వెళ్లి గడపగలిగినంత సేపు వాళ్ళతో గడిపి. నాకు చేతనయిన సహాయం చేస్తున్నాను. అది కూడా లేకపోతే ఆత్మహత్యే గతి.” అని ముగ్డను చూసింది.

“మరీ అంత ప్రేముంటే దత్తత తీసుకోవచ్చుకదా !” అనుమానాల్ని ప్రక్కకు నెట్టి అంది ముగ్ద.

“మీ బావ అదే అంటాడు. రెండుసార్లు ప్రయత్నించాము. ఎవర్ని చూసినా మాతృత్వం పొంగలేదు. కృతిమంగా చేసుకుంటే, ఏ త్రాష్టుల నీచత్వ అస్థిరత్వాన్ని నా గర్భంలో ఉంచి పోషించలేను. తలుచుకుంటేనే కంపరం పుడుతుంది. గొప్పతనంగాకపోవచ్చు, స్వార్ధంగావచ్చు!!

నా మనసును నేను మభ్యపెట్టుకోలేను. అందుకే పార్దివ్ నన్ను మరిపించడానికి చూపించాల్సిన దానికంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తాడు. కోరుకున్నవన్నీ చేస్తాడు. అదే నా బాధ. కొట్లాడుతూ, అలుగుతూ ఉంటేనే సంసారం మధురంగా ఉంటుందేమో! మరి నాకెందుకో...అసంతృప్తి. నా ఆడ

జన్మకు...?నా బిడ్డే నాకు కావాలి అని అసాధ్యమైన తీరనికోరిక.” అని చాలా వెలితిగా నవ్వింది.

“అదేంటక్కా, పురిటి బిడ్డకు ఆంక్షలు! దొరికితే చాలు అని అనుకుంటున్నారు. ఎదో ఒక బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వ వచ్చుగా! అంతకంటే త్యాగం, ఉదాత్తత మరేదయినా ఉంటుందా? స్త్రీ జన్మకు పరిపూర్ణత, నిర్వచనం అదే కదా!”

“ ఈ ఉదాత్తతలన్నీ వంచన ఆదర్శాలు. చెప్పుకోవడానికి పనికి వస్తాయి. నేను మానవ మాత్రురాలిని. నిస్వార్ధమైన ప్రేమతో, మమకారంతో పెంఛి, ఆ బిడ్డ మన అంచనాలకు సరితూగక పోతే నిత్య నరకమే అవుతుంది. కోరి కొరవితెచ్చుకున్నట్లు !! నాకు పుట్టిన బిడ్డ తప్పు చేస్తే క్షమించగలనుగాని. అంచనాలతో, ఊహలతో తెచ్చుకున్న ఆ బిడ్డ చేస్తే....? నిజంగా చెప్పాలంటే నేటి యువతను చూస్తే పిల్లలులేకుండా ఉండటమే ఒక అదృష్టం అనిపిస్తుంది. ఏ ఒక్కరూ తల్లి తండ్రుల భాధ్యతగాని, సంస్కారయుతంగాకానీ బ్రతుకుతున్నారా? స్వార్ధం. డబ్బు కక్కుర్తి. పుట్టే అవకాశం ఉన్నా లేకుండా చేసుకుని భార్యా భర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అర్ధం చేసుకుని, ఆత్మీయ అనురాగాలతో జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడం ఉత్తమమైన మార్గం. ”

ఆమె మాటలు ఆశ్చర్యాన్ని, బాధను కలిగించాయి ముగ్ధకు. “ అందరూ ఒకేలాగా ఉండరుకదా! మన అనుకొని, మనసున్నప్పుడు, తల్లిగాక మరెవ్వరు క్షమిస్తారు. మీరు జరగబోయేదాన్ని ఎక్కువగా ఆలోచించి బిడ్డ ఇచ్చే ఆనందాన్ని, మాతృత్వంలో ఉన్న తృప్తిని తక్కువగా చూస్తున్నారు.” అంది.

“నీకు తెలియదు. నా పేగు తెంచుకుని పుట్టనప్పుడు రక్త సంబంధం ఎలా అవుతుంది? మాతృత్వపు తృప్తి ఎలా కలుగుతుంది? అర్పణ వేరు. అసంతృప్తిని తీర్చుకునే అవసరం వేరు. అయినా దత్తత తీసుకునే ముందు చాలా విచారించాలి. వాళ్ళ వంశ పారంపర్య గుణాలు, జబ్బులుకూడా తెలిసుండాలి.”

“మరీ విడ్డూరం అక్కా!మన బిడ్డలకు ఉండవని, రావని నమ్మకం ఏవిటి? విధి వంచితులు వీధుల్లో బ్రతకాల్సిందేనా?”

“అది కని పారేసిన దరిద్రులకుండాలి. పసిగుడ్డును కుక్కలకు కాకులకు వదిలేసే నికృష్టులు, కామాందులైన కర్కోటకులకు ఉండాలి. అందుకనే చెప్పాను. ఇవి భరించడం తేలికని. నాకు తెలిసి దత్తత తీసుకుని రెండు కుటుంబాలు త్రిశంఖు స్వర్గంలో సలసల కాగుతున్నారు. ఎంతో పెద్ద పండుగ చేసారు బిడ్డను తెచ్చుకున్నప్పుడు. అపురూపంగా పెంచారు. నోరు తెరిస్తే ఆ బిడ్డ వీరోచితాలే! చివరకు ఏమయ్యింది. వ్యసనపరుడై ఉన్న ఆస్తి అంతా కాజేసి వీళ్ళకు నిలువ నీడ లేకుండా చేసాడు. ఇంకోరయితే ఆత్మ హత్యలే చేసుకున్నారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.” అంది భారతి.

విస్తుపోయినట్లు చూస్తూ,” అది పెంపకం తప్పు. అతి ముదిగారంగా ఎప్పుడూ పెంచకూడదు. అందరూ అలా అవుతారని ఎందుకు అనుకోవాలి. అది మన అదృష్టం.” అంది ముగ్ద.

“అది తెలుస్తూనే ఉందిగా... గొడ్రాలుగా!! వంశపారంపర్య గుణాలు సరిదిద్దలేనివమ్మాయి .” అంది భారతి. ఆ మాటల్లోని నిరుత్సాహానికి దిగులేసింది ముగ్డకు.

కొంచెం సేపు మౌనంగా ఉండి, “ఎవరైనా తెలిసిన వాళ్ళు, పేదవాళ్ళు ,పిల్లలు ఎక్కువ ఉన్నవారి దగ్గర తీసుకువచ్చుగా!” అంది ముగ్ద.

“మరి నువ్వు ఇస్తావా?” అంది భారతి ముగ్ద కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.

అనుకోని ప్రశ్నకు నోట మాట రాలేదు ముగ్దకు . విస్తుపోయి విభ్రాంతితో చూస్తుండి పోయింది. తను బిడ్డల్ని పెంచుకోలేదా! వాళ్ళు దిక్కులేని వాళ్ళా? తల తిరిగిపోయింది ముగ్ధకు .

అది గమనించి.” ఎందుకు అలా అయిపోతావు? తమాషాకు అన్నాను. అనాధ శరణాలయాలలో దొరికేదంతా క్షణిక సుఖపు నిర్భాగ్యపు మలినమే ! ఏ తల్లీ బిడ్డను ఒప్పి వీధిలో పారెయ్యదు. వాళ్ళకోసం ఎన్ని బాధలైనా ఓర్చుకుంటుంది. జీవితానికి సవాలు విసిరి ఎదురు నిలుస్తుంది. అందుకే నిన్ను దేవతగా చూస్తాను. నీ సహనానికి, త్యాగానికి ప్రాణం ఇస్తాను.” అని ముగ్ధను కౌగలించుకుంది. మాటలు భావోద్వేగంతో తడబడ్డాయి.

కాస్సేపటికి ముగ్డను వదిలేస్తూ,” కానీ ఇది నిజం. అతని మీద ఆశలు ఇక పెట్టుకోకు. గట్టిగా మాట్లాడు. రానంటే విడాకులు తీసుకో. సంస్కారవంతులకు ఈ దేశం గొడ్డుపోలేదు. నీకు జీవితంగావాలి. ఆ బిడ్డలకు గౌరవంగావాలి. నువ్వు ఉద్యోగం చెయ్యి. నీకు అన్ని విధాల మేము తోడుంటాము. నీ బిడ్డలతో నా కొరత తీరుతుంది. పార్దవ్ సంఘర్షణ తగ్గిపోయి మనల్ని ఆనంద సముద్రంలో విహారానికి తీసుకెళతాడు. బాధ్యత తెలిసిన నీకు, వేషగాళ్ళ కుసంస్కార మురళీరవాలు మొహనరాగాలుగా వినిపించవు. అయినా ఒక తోడు అవసరం. ” అని ముగ్డను ముద్దుపెట్టుకుంది భారతి.

“అతను వస్తాడక్కా! రాడని అనుకోవడానికి ధైర్యం చాలడం లేదు. రాక పోయినా ఏ మగపురుగు ఈ జన్మకు నాకొద్దు. ఈ రుచి, వాసన చాలు!! ” అంది దృఢ నిశ్చయంతో ముగ్ద .

భారతి చాలాసేపు మెచ్చుకోలుగా చూసి దగ్గరకు తీసుకుని . ‘ పిచ్చిదానా ..పిచ్చిదానా!! నా చెల్లి స్త్రీ జాతికి ఆదర్శ మాణిక్యం, సహనంలో భూమి భారతి. పరిమళాలు వెదజల్లే శౌఘంధిక పర్వతం. ఆ నికృష్టుడికి అదృష్టం లేదు !! ” అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నొసటముద్దు పెట్టుకుంది భారతి. ’

ముగ్ద ఆలోచిస్తూ ఉండిపోయింది.అతని మీద నమ్మకం ఇంకా చావలేదు. పిల్లల్ని చూసుకోవడం, స్కూ లుకు తీసుకెళ్ళడం. వచ్చి పుస్తకాల ఆత్మీయ నేస్తాలతో రోజును మరిచిపోవడం. శరీరాన్ని , కోరికలను ఎప్పుడో చంపేసింది. వాటి తృప్తి కోసం అతనెందుకు? బరువు బాధ్యత, వడిదుడుకులు, పంచుకోవడానికి కావాలి. మమతానురాగాలు లేని ఏ భార్యా భర్తల అనుబంధం అయినా శవాలతో విందు భోజనమే! ఏవేవో ఆలోచనలు. వాటిని దూరం చేస్తూ భారతి చెప్పిన మాటల్ని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిదుర...?

ఎప్పుడు కలిసినా పార్దవ్ మీద నిజం అనుకునేటట్లు చలోక్తులు విసురుతూనే ఉంటుంది భారతి. నమ్మి, భయపడి, అర్ధం అయినప్పుడు నవ్వుకుంటుంది ముగ్ధ.

ఒక రోజు వచ్చి, “ రాత్రి మీ బావకు గుండె పోటు వచ్చింది. నిదురేలేదు.” చాలా ఆత్రుతగా చెప్పింది.

ఆందోళనగా,” అదేవిటక్కా! నన్ను పిలవక పోయావా?” అంది ముగ్ద్ద .

పక్కున నవ్వి, “అసలది ఉంటే కదా? ఈ మగాళ్ళకు అవి ఉండవు, ఎవరికంటే వాళ్లకు అడగకనే ఇచ్చేస్తుంటారు. మీ వాడు కూడా అక్కడ గిలగిల లాడుతున్నాడేమో?” అంది.

తలొంచుకుంది ముగ్ద. భుజం తట్టుతూ,” బాధ పడ్డావా? ఇవన్నీ లెక్క చేయకూడదమ్మాయి. ఉంటే ఏడుపే నీ జీవితం అవుతుంది.” అంది నవ్వుతూ భారతి.

“నువ్వంటే ఏం లే అక్కా!” అంటూ నవ్వేసింది ముగ్ద.

ఒక రోజు లిఫ్ట్ లోనుంచి వాళ్ళిద్దరూ దిగటం చూసింది. పార్దవ్ వణికిపోతున్నట్లు చేతులు చుట్టుకోనున్నాడు. ఆమె శాలువా కప్పుకోనుంది.

ముగ్దను చూసి నవ్వుతూ,” మలేరియా అంట. నాకు తగులుకుంటుందేమోనని శాలువ కప్పుకున్నా!” అంటూ నవ్వి,” నేనే పంపించాను దోమల దండుని, కుట్టమని. మనకు సైన్యం ఉండాలమ్మాయి లేకపోతే నీ మొగుడులాగా విదేశీ వాసనతో మతిపోయి శ్వేత కపోతాలనుకుని రాబంధుల పాలిటబడి నాగిన్ డ్యాన్స్ ఉచితంగా చేస్తారమ్మాయి .గర్భాధానం సరే...! ” అంది పార్దవ్ ను కొంటెగా చూస్తూ.

అంతే...అదే చివరి చూపు మాట. వారం రోజులు లోపే, లిఫ్టు పనిచేయ్యలేదని, భారతీ మెట్లు దిగుతూ మూడంతస్తులు దొర్లి పడిపోయింది. కోమాలోకి వెళ్లి పోయింది. రెండు సంవత్సరాలు పడరానిపాట్లు పడ్డాడు పార్ధవ్. ముగ్ధ, భారతి పరిస్థితిని చూసి చాలా దిగులుపడేది. పిల్లలు తను అప్పుడప్పుడు హాస్పిటల్ కు వెళ్లి చూసి వచ్చేవారు. పార్ధవ్ ప్రేమ అంకిత భావం చూసి ఇలాంటి మగవాళ్ళు ఉంటారా అనిపించేది. ఈ డాక్టర్లు ఒక రొజు తప్పక బ్రతుకుతుందని, మరుసటి రోజు ఏమో చెప్పలేమని, ఆశను మనశ్శాంతిని ముక్కలు ముక్కలుగా తెగగోస్తుంటే జబ్బున్న వాళ్ళకంటే దగ్గరున్న వాళ్ళే ఎక్కువ జబ్బున పడేటట్లు చేస్తారు. తనకే తల తిరిగిపోయేది. అంత బాధలోనూ పిల్లలతో చాలా సరదాగా ఉనట్లు ఉండేవాడు పార్దవ్. బహుశా ప్రస్తుతాన్ని మరిచిపోవదానికేమో!

చివరకు భారతీ చనిపోయింది. పార్దవ్ దిగులుతో కృంగిపోయినట్లు తెలుస్తున్నా ధైర్యంగా ఉన్నట్లు తిరుగు తున్నాడు. ముగ్ద తోబుట్టువును పోగొట్టుకున్నట్లు బాధతో నలిగి పోయింది. చావు అంత నిర్ధయగలది, ఏడిపించి ఆడుకునే ఉన్మాదపు మనస్తత్వంమున్నది, మంచి చెడులు తెలియని మందబుద్ధి మరొకటి ఉండదేమో! అటువంటి సమయంలోనే భర్త దగ్గరనుంచి ఫోను. అతను చెప్పిన మాటలు విని ముగ్ద గుండె పగిలిపోయింది. వాదోపవాదాలు చాలా రోజులు జరిగాయి. తను వచ్చేందుకు వీలుకాదని తెగేసి చెప్పేసాడు. సమస్య పరిష్కారం కూడా చెప్పాడు. నిలువునా కూలబడిపోయింది. రెండు ప్లాట్లు అమ్మేశానన్నాడు. ఆ కాగితాలు, ఈ కాగితాలు తీసుకొని త్వరలో వస్తానన్నాడు. ఇంకా ఎక్కడో ఆశ, వస్తే పిల్లల్ని చూసి మారుతాడేమో అని!?

ఎదురింటి కర్మ క్రతువులకు కూడా వెళ్ళ లేదు. ఎన్నో రోజులు గుండెల్లో గునపాలు దింపుతున్న సమస్యను గురించి ఆలోచిస్తూ, నిదురపోతున్న పిల్లల్ని గుండెలుకు హత్తుకుని, అలా ఎలా చెయ్యగలడు. అలాంటి ఘాతకుడా? అని హృదయం ముక్కలయ్యేలా ఏడుస్తూ, నిరామయంగా శూన్యంలోకి చూస్తూ, నిదురపోయేది కాదు. పిల్లలు దిగులుగా చూసేవారు. నిదురలేని కళ్ళను మూగపోయిన హృదయం అరువు తీసుకుంది. పిల్లల్ని ఎదురింటికి పోవడం ఆపలేకపోయింది. ఎప్పుడూ అక్కడే.! పిల్లలు, అమ్మ

ఎప్పుడూ ఏడుస్తుంది అని చెప్పారేమో వచ్చి .” భారతీ చనిపోవడం మీకు ఇంత మానసిక వ్యధ కలిగిస్తుందనుకోలేదు. పాపం పిల్లలు; వాళ్ళ కోసమైనా మనం మరిచిపోకపోతే ఎలా? నిజంగా ఈ సమయంలో వాళ్ళు నాకు ఓదార్పు దేవుళ్ళు. వాళ్ళ కోసమే బ్రతకాలనిపిస్తుంది.” అని ధైర్యం చెప్పి పార్దవ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయేవాడు.

తనలో రగులుతున్న బడబాగ్నికి అదికాదు కారణం అని చెప్పలేకపోయేది . నిజమే పిల్లలు..!?తన హృదయం తగల బడుతున్నా, లేచి తిరగక తప్ప లేదు. ఎందుకిలా..ఎందుకిలా? తనలో ఏం లోపం? సమాధానం...! మగవాడి వ్యభిచారపు మనస్తత్వం.!! పార్దివ్ ఒకరోజు అడిగాడు, భాను ఎప్పుడొస్తాడు అని, మరదల్నిపెండ్లి చేసుకోమని తనను బలవంత పెడుతున్నారని చెప్పాడు.

విని ఎక్కడో ఉన్న ముగ్ద ఉలిక్కిపడి చూసింది. అంతర్ యుద్ధం సంవత్సరం ముందే మొదలయ్యిందని, బాధ్యత, అనుబంధాల పోరాటం, ముమ్మరంగా, నిర్విరామంగా జరుగుతుంది అని ఎలా చెప్పగలదు.?

“ చేసుకోండి. తోడు తప్పక అవసరం. వస్తాడు త్వరలో! అపార్టుమెంటులు అమ్మాలట, మరో దానికి కూడా నా చేవ్రాలు కావాలంట. ”ఆ మాటలు అంటున్నప్పుడు రాలిన కన్నీటి బొట్టును గమనించలేకపోయాడు పార్దవ్.

అతని ముఖం వెలిగి పోయింది.” ఇన్ని నాళ్ళ మీ తపస్సు ఫలించిందన్నమాట . నాకెంతో సంతోషంగా ఉంది.”

ముగ్ధ ఏం మాట్లాడలేదు. పాప అడిగిన మాట గుర్తుకొచ్చింది.‘ పెదమ్మ కొచ్చినట్లు నీకొస్తే ఎట్లమ్మా! నాన్నకూడా లేడు.” ఎంతో దిగులుగా భయపడుతూ వేసిన ఆ ప్రశ్నకు, సమాధానం ఏం చెప్పాలో తెలిసేదికాదు . రాని నవ్వు తెచ్చుకుంటూ, తననే అతుక్కుని పడుకున్న చిన్నాడిని చూసేది . వాడి ముఖలోకూడా బాధ భయం కనిపించెవి. అతను వచ్చాడు. అతి ప్రేమగా ప్రవర్తించాడు. ఆశ్చర్యపోయింది.నమ్మలేక పోయింది.

ఆనంద సముద్రంలో మునిగి పోయింది. పేపర్సులో చేవ్రాలు చేయమన్నప్పుడు సంతోషంగా చేసింది. ఇది కూడా అన్నప్పుడు తెలిసింది, అది ఎందుకో?ఆశ ఆవిరైపోయింది. గుండె పగిలిపోయింది. బాధ్యతానుబంధాల విలువను మరిచి పోయిన వానితో వాదోపవాదాలు అనవసరం. లాకర్, బీరువా తాళాలు ఇచ్చేసింది. ఏమి తీసుకున్నాడో, ఏమి ఉంచాడో తను పట్టించు కోలేదు. పనులు, స్నేహితులు అంటూ ఇంటి పట్టునే లేడు.

ఒక రోజు మాత్రం,” రా! పడుకుందాము. మాట్లాడుకోవచ్చు.” అని పడక గదిలోకి పిలిచాడు. పురుగును చూసినట్లు చూస్తూ అసహ్యాన్ని అంతా ముఖంలో నింపుకుని , “ ఎందుకు మూడోదికూడా ఇచ్చి ముష్టి ఎత్తుకోమనడానికా!” అని చీత్కరించుకుని పిల్లల దగ్గరకు వెళ్ళింది ముగ్ద.

బయలుదేరాడు. ముగ్ధను ఎయిర్ పోర్టుకు రమ్మని బలవంతం చేశాడు. దగ్గరకు తీసుకోబోతే, దూరంగా జరిగింది. ఎయిర్ పోర్టుకు వెళ్లక తప్ప లేదు. అది తెలిసి “అదేవిటి అప్పుడే?’ ఆశ్చర్యంగా అంటూ, ఎయిర్ పోర్టుకు తనూ బయలు దేరుతూ ముగ్ద వైపు చూసాడు పార్దవ్ . చూపు తిప్పుకుంది. దిగి వెళుతూ పార్దవ్ తో చేతులుకలిపి ” చూసుకో.” అంటూ ముందు కెళ్ళిపోయాడు. అర్ధం గాక ముగ్ద భార్గవిని చూసాడు. ఆమె ఈ లోకంలో లేదని గమనించి పిల్లలు వైపు చూసాడు.

సంతోషంగా బై చెపుతున్నారు. వాళ్ళకేం తెలుసు? తిరిగి వస్తూ భగ భగ మండుతున్న ఎడారుల్లోని ఆక్రందన, ఆక్రోశపు సెగలో ఉడుకుతున్న హృదయం , మబ్బుగమ్మి వర్షపు సూచనలతో వీచిన చల్లటి గాలి, సముదాయించ లేక పోయింది. దిగులుగా ఉన్న ఆమె నే చూస్తూ, ఎడబాటు, పాపం అనుకుని “బీచ్ కు వెళదాం. కాస్త మార్పు కోసం.” పార్దవ్ అన్నాడు.

అడ్డు చెప్పలేదు. పిల్లలు ఎగిరి గంతేశారు. ముగ్ద బార్గవి, పార్దవ్, మౌనంగా గట్టుమీదనిలుచున్నారు. పిల్లలు ప్రపంచాన్ని మరిచిపోయి, ఇసుకలో ఆడుకుంటున్నారు. ప్రపంచంతో సంబధం లేనట్టు ఉన్న ముగ్డను రెండు మూడు సార్లు పలకరించాలని ప్రయత్నించాడు పార్దవ్ . ఆమె ముఖలో కనిపించే ముడిని చూసి వెనకాడుతూ, “ ఎప్పుడొచ్చి తీసుకెళతాడంట.?” అడిగాడు.

జవాబు చెప్పలేదు.

“ భాను వస్తాడు. అలా ఉండకండి.” అని సముద్రం వైపు తిరిగి,” చూస్తుంటే చూడాలనే అనిపిస్తుంది. గంభీరంగా, నిండుగా ప్రశాంతంగా ఉంది. ఎంతో ఓదార్పు దొరికినట్లు అనిపిస్తుంది. ” అన్నాడు.

“ మీకు తెలియదు. అది పైకి మాత్రమే ! సముద్రంలో భీకర సుడిగుండాలు, అగ్ని పర్వతాలు దాగి అల్లకల్లోలం చేస్తుంటాయి. కానీ అన్నింటిని భరిస్తుంది. ” అంటూ హ్యాండు బాగ్ లోనుంచి ముఖం తుడుచుకోవడానికి చేతిగుడ్డ తీయబొతే అందులోని కాగితాలు గాలికి ఎగిరి ఇసుకలో దొర్లుకుంటూ పోసాగాయి. పార్డవ్ వెళ్లి అన్నీ పట్టుకొని చేతి కిస్తూ “జాగర్త” అన్నాడు.

“అవసరం లేదు.” అంది సముద్రపు ఆవలిగట్టు వెతుకుతూ, కనిపించదని తెలిసికూడా!?

నిరాశకు లొంగక ,కూలిపోయి కటిక చీకటికమ్ముకున్న హృదయపు లోగుడిలో, ఆరిపోబొతున్న భవిష్యత్తు ఆనంద సామ్రాజ్యపు ఆశాకిరణాన్ని, ఆత్మవిశ్వాసపు ప్రమిదతో వెలిగించి జీవితంలో చెరగని తరగని సంతోషాన్ని సొంతం చేసుకుంటాను. నా బిడ్డల భష్యత్తును సముద్రంలో వదిలేయ్యను అని దృఢ నిశ్చయానికొచ్చి పిల్లల వైపు చూస్తూ గాఢ నిట్టూర్పు వదిలింది ముగ్ధ.

చేతిలో ఉంచుకున్న పేపర్లను పారెయ్యబోయి సర్టిఫికెట్స్ లాగ ఉంటే చూసి ,” డైవర్స్.” అంటూ విభ్రాంతితో ఆమె వైపు చూసాడు పార్దవ్.

“ మునిగిపోతారు..మునిగిపోతారు.” అంటూ సముద్రపు నీళ్ళల్లోకి దిగబోతున్న పిల్లల వైపు పరుగెత్తి, చిన్నాడి చేయిపట్టుకుంది ముగ్ద భార్గవి . వెనకనే పరుగెత్తుకొచ్చిన పార్దవ్ , చిన్నాడిని పట్టుకున్నపాప చేయిని అందుకున్నాడు.

అలలు తాకుతున్నకాళ్ళతో ఇసుకలో చిందులు వేస్తూన్న వాళ్ళను చూసి, నవ్వుతున్న పార్దవ్ వైపు తిరిగి చూసింది ముగ్ద.

*** శుభం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి.. నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.


75 views0 comments

コメント


bottom of page