'Sani Mahardasa' New Telugu Story
Written By P. L. N. Mangaratnam
'శని మహర్దశ' తెలుగు కథ
రచన: P.L.N.మంగారత్నం
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో..
బాల త్రిపుర సుందరి పోన్ మ్రోగింది. అవతలవాళ్ళు ఏమన్నారో గాని..
“ఇంకా ఆఫీసులోనే ఉన్నాను. ‘హాఫ్ డే’ లీవ్ పెట్టేసాను. మీరు ఇంటికొచ్చేసరికి.. నేనూ, వచ్చేస్తాను” చెప్పింది.
అవసరానికి ‘లీవ్’ పెట్టినా, ఇంకా వర్క్ నుంచి బయట పడలేకపోతుంది ఆమె. అప్పటికప్పుడు ఓ ఇన్ఫర్మేషను, పై ఆఫీసు వాళ్ళు అడిగారు. ఆఘమేఘాల మీద తయారు చేస్తున్నా అవడం లేదు. పని పూర్తి చేసి, ‘నెట్లో’ పెడితే తప్ప.. తను కదల్లేదు.
రేపు రెండవ శనివారం, ఎల్లుండి ఆదివారం రెండురోజులు శెలవులు వస్తున్నాయంటే.. ముందున్న శుక్రవారానికి అర్జంటు వర్క్ మీద పడుతుంది.
ఇప్పుడూ అంతే,
ఈ రెండురోజుల శెలవులూ కలసి వచ్చేలా మరో రెండురోజులు శెలవు పెట్టి ‘మంత్రాలయం’ ప్రయాణం పెట్టుకున్నారు, తమ కుటుంబం.. పెద్ద అక్కా వాళ్ళ కుటుంబం.
పెద్దక్క జగదాంబ వైజాగు నుంచే పెద్దకారు మాట్లాడుకుని వస్తుంది. ఈ సాయంత్రం నుంచే ప్రయాణం మొదలైతే.. టైము కొంత కలసి వస్తుందన్న ఆలోచన. అందర్నీ హడావుడిపెట్టి మరో గంటకి పని పూర్తి కానిచ్చి ఆటో ఎక్కింది సుందరి.
సుందరి ఇంటికి చేరుకోవడ౦.. వైజాగు నుంచి ‘బోలారో’ కారు వచ్చి ఆగడం ఒకేసారి జరిగినయ్.
అక్కా.. చెల్లెళ్ళు కలుసుకుని.. ఆరు నెలల పై మాటే, చిన్నచెల్లెల్ని చూడగానే జగదాంబకు ప్రేమ పొంగింది. ” ఏమిటే, ఇంత చిక్కిపోయావు. నల్లగా అయిపోయావు కూడా ” అంది ఆశ్చర్యంగా చూస్తు.
“ఎండలో వచ్చానుగా” నవ్వింది.
“ ఒక్కసారి ఎండలో వస్తే నల్లబడిపోతారా ఏమిటి? మనిషివే మారిపోయావ్. ఈ ఎండాకాలంలో అయినా పిల్లల పరీక్షల వంకతొ, ఓ నాలుగురోజులు శెలవు పడేసి కాస్త రెస్టు తీసుకోవచ్చుగా. అదేదో ఎత్తేసే యూనిట్ అన్నావుగా! ఇంకా ఎత్తలేదా?” అడిగింది.
“సంవత్సర౦ సంవత్సర౦ ఆయుష్షు పెంచుతున్నారు. అది పోకూడదని అందరూ దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు. మాలాంటి వాళ్ళకి ఎక్కడో పొస్తింగు చూపించినా.. ఔట్సొర్సింగ్ లకే ఇబ్బంది. వాళ్ళ కోసం అయినా యూనిట్ నిలవాలని కోరుకోవడం”.
***
మనుషులతో పాటు లగేజీ ఎక్కువగా ఉండడంతో కారు కిక్కిరిసిపోయింది.
జగదాంబకి ఇద్దరూ కూతుర్లే కావడంతో వాళ్ళతోపాటు అలంకరణ సామగ్రీ ఓ అదనపు లగేజి. లంగా ఓణిలకు తగ్గట్టు కొన్నిరకాల నగలైతే, డ్రస్సుల మీదికి మరికొన్నిరకాల అలంకరణలు.
“ ప్రయాణంలో అనవసరపు బరువులెందుకు?” అన్నా వినరు.
ప్రయాణం సంతోషంగానే ఉన్నా ఆఫీసులోనే అలసిపోయింది సుందరి. వాడిపోయిన తోటకూర కాడలా సీటుకి జారబడి కూర్చున్న చెల్లెల్ని చూస్తే బాధనిపించింది జగదాంబకి.
తమ తల్లి తండ్రులకు నలుగురు సంతానం. తండ్రి ఉద్యోగంలో ఉన్నపుడే ‘పోవడం’తో ఆ ఉద్యోగం చిన్నదైన బాల త్రిపుర సుందరికి వచ్చింది.
ఆ తరువాత పెళ్లి భర్తతోపాటు ‘యలమంచలి’ లో నివాసం. అక్కచెల్లెల్లలో, వీళ్ళీద్దరే కాస్త దగ్గరగా ఉండడంతో అప్పుడప్పుడూ సందర్బాన్ని బట్టి, కలుసుకుంటారు. మిగిలిన వాళ్ళు దూరంగా ఉంటారు.
జగదాంబ పిల్లలూ, సుందరి కొడుకులూ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులేసుకుంటున్నారు. ఇంజనీరింగులూ, ఇంటర్మీడియట్లూ చదువుతున్నారు.
ఉద్యోగస్తురాలు అయిన చెల్లెలి అలసటను చూసి, “ఆఫీసులో పనేక్కువగా ఉంటున్దేమిటే” అడిగింది.
“ అలాగా ఇలాగా కాదు. చచ్చేలా! అన్ని నేనే చేసుకోవాలి, ఎవ్వరూ ఏమీ చెయ్యరు”
“ ఎవ్వరి పని వారికీ అప్పచేప్పేయ్యాలి గాని.. అంతా నువ్వే మీదేసుకుంటే ఎలా? ఇంతకుముందూ ఇదే విషయం చెప్పావు. అలా వెర్రి పీనుగులా ఎన్నాళ్ళని చేస్తావు వేరేవాళ్ళ పనులు. మొన్న చూసినప్పటికీ.. ఇప్పటికీ ఎంత తేడా! వచ్చిందీ” అంటూనే..
కన్ఫర్మేషన్ కోసం వాళ్ళాయన్నీ అడిగింది “సుందరి చిక్కింది కదా! ఈ మధ్య” అని.
ఇంత సందడిలోనూ, కారులో ఉన్న పాత వారపత్రిక తిరగేస్తున్న సూర్యనారాయణ “ అవునవును” అన్నాడు పుస్తకం నుండి దృష్టి మరల్చకుండానే.
బావగారూ అలా అనేయ్యడంతో డీలా పడిపోయింది సుందరి.
“అదేమో తెలీదు గానీ, ఆఫీసులో ప్రతి నిముషమూ టెన్షనే మా ‘మేడం’కి ఆఫీసు పట్టదు. ఎప్పుడు శెలవు వస్తుందా! ఇంటికి చెక్కేద్దామా! అన్నట్లు ఉంటుంది. కొత్తగా వచ్చింది. వేరే జిల్లా నుంచి ఎలక్షను అయిపోగానే వెళ్లిపోతుందిలే అనుకుంటే, అదీ అవడం లేదు. అస్తమానం ‘నన్నే’ పిలుస్తుంది. అన్నీ నన్నే అడుగుతుంది. సూపరి౦టె౦డెంటుని కదా అని ”
కాస్త ఆగి “ మొన్నీమధ్య కళ్ళు తిరిగి నట్లుంటే, డాక్టరు దగ్గరకు వెళ్ళా, టెస్టులు చేసి ‘లో- బిపి’ అన్నాడు” అంది దిగులుగా.
“ఇకనుంచైనా.. ఎవరి వర్క్ వాళ్ళకి అప్పగించి.. సూపర్వైజ్ చెయ్యి చాలు. ఆరోగ్యం మీదకి తెచ్చుకునేలా పని చేసేయ్యనవసరం లేదు” సలహా ఇచ్చాడు సూర్యనారాయణ.
“అయ్యో బావగారూ! ఆ దిక్కుమాలిన ఆఫీసులో.. ఒక్కళ్ళకీ ‘ఓ’ అంటే ‘నా’ రాదు. రాసేవన్నీ బూతులు.. వాటిని సరిచేస్తూ పోయేకన్నా ఆ కంప్యుటర్ దగ్గర కూర్చుని టైపు కొట్టుకోవడం అంత ఉత్తమం లేదు. ”
“ప్రింటు తీసి సంతకాలకి ‘ఆవిడగారి’ దగ్గర పెడితే ఓ చుక్కా, కామా కూడా సరి చెయ్యడం ఉండదు. సంతకం అయిపోయి వస్తుంది. మహాతల్లి చదివి పెడుతుందో చదవక పెడుతుందోగాని, నాకు టెన్షను వచ్చేస్తుంది. నేనేమన్నా తెలియక తప్పులు రాస్తానేమోనని. ”
“అందుకే ప్రతి కాగితాన్ని బాగా చూస్తేగాని, సంతకం పెట్టను, నేను సంతకం పెట్టకపోతే ఆవిడా చూడదు. అయినా క్రిందివాళ్ళు రాసింది రాసినట్లు ఉంచడానికి నాకు మనసు ఒప్పదు. అలా చేస్తే ఇక మనం ఎందుకు? ఎవరికి వాళ్ళకే కొమ్ములోచ్చేస్తాయి. మా అంతటివాళ్ళు లేరని. ఇప్పటికే ఎవడూ మాటవినడం లేదు” చెప్పింది స్వగతంలా..
చెల్లెలి మాటలకు మనసులోనే నవ్వుకుంటూ “ మీ ఆఫీసరమ్మగారు ఎవరేమిటి?” అడిగింది జగదాంబ, ఆవిడ ఏ వర్ణపు ఆవిడో తెలిస్తే, తెలివితేటల్ని ఈజీగా అంచనా వెయ్యోచ్చని.
“ఇంకెవరు? ‘మనే.. ’
“అక్కడే కొట్టింది. దెబ్బ, మనలో.. మనకే పడి చావదు. వేరేవాళ్ళు అలాక్కాదు” తేల్చేసాడు బావ సూర్యనారాయణశర్మ.
ఆ మాటకు ఉత్చాహం వచ్చింది సుందరికి, “ ఏదైనా విషయంలో ‘ఏక్ట్’ చెబుతానా! బావగారూ! అస్సలు వినదు. తనకు తోచిందే చెబుతుంది. మన మాటే వినదు. ‘ఏక్ట్’ని కాదని ఏం చేస్తాం. అందుకే విసుగోచ్చేస్తుంది అక్కడ పని చెయ్యడానికి”
“ కొన్నాళ్ళ పాటు శెలవు పడేసి బయటకి రా! నీరసం తగ్గిన తరువాత ఇంకో చోట పోస్టింగు అడగొచ్చు” సలహా ఇచ్చింది జగదాంబ.
***
సుందరి ఆఫీసులో తన టూర్ విశేషాలతో పాటు తన ఆరోగ్యం కోసం అక్క ఎంత వెంపర్లాడిందీ కధలు కధలుగా చెప్పుకొచ్చింది.
కాబట్టి, ‘కొద్ది రోజులు తప్పనిసరిగా.. శెలవు పెట్టి తీరతానని’ నొక్కి వక్కాణి౦చింది.
సుందరికి కాస్త జాతకాల పిచ్చి ఈ సంవత్సర౦ తన జాతకంలో ‘శని’ మహర్దశ ప్రారంభం అవుతుందని’ ఉంది, అది ఇదే కావచ్చని అందుకే ‘బి. పి’కూడా మొదలయ్యిందన్న భావన.
దానికితోడు నోటి దురుసూ ఎక్కువే. పై పోస్థులో ఉన్న.. అనదగ్గవ్యక్తి అని. అందుకే, నోటికెంత వస్తే అంతా మాట్లాడేసేది. అందుకు, “మీరు కాబట్టి, ఈ రిమార్క్స్ ఇలా వ్రాయగాలిగారు. అదే మా నుంచి అయితే అయ్యేపని కాదు” అంటూ పొగిడేవాళ్ళు.
రోగి కోరిందీ వైద్యుడు ఇచ్చిందీ ఒకటే..
తన నైజాన్ని బట్టి, మాట్లాడేసినా ఎదుటి వాళ్ళు తనగురించి ఏమైనా అనేసుకుంటారేమోనన్న, , అనుమానమూ లేకపోలేదు. అందుకు అటెండర్లను పట్టుకుంటుంది. వాళ్ళకి పైవాళ్ళ అండదండలు కావాలి.
అందుకే ముందు రోజు సాయంత్రం ఆమె ఆఫీసు నుంచి బయటకు వెళ్ళింది మొదలు మళ్ళీ మరునాడు తిరిగి వచ్చేంతవరకు జరిగిన.. విషయాలు అన్నీ పూస గుచ్చుతారు. అన్నీ సరిగ్గా ఉంటే ఫర్వాలేదు తేడా వచ్చిందో! ఇక ఆ రోజు అవతల వాళ్ళ పని అయిపోయినట్టే.
తనకి ఆఫీసులో వాళ్ళు..
అడగ్గానే ఫైళ్లు అందిస్తున్నారే తప్ప వ్రాసే ప్రయత్నం ఏమీ చెయ్యడం లేదు. ఏది రాసినా కొట్టివేతలకు గురి కావడంతో ఈమాత్రం దానికి మళ్ళీ మేమెందుకు కష్టపడాలి? అనుకుంటూ, “సరస్వతీదేవి మీ చేతిలోనే ఉంది. మీరు చూస్తేనే బాగుంటుంది” అంటూ తప్పించుకోసాగారు.
ఓ సారి ఏదో పని మీద ఆఫీసుకొచ్చిన..
ఓ ‘రిటైర్డు ఉద్యోగి ’ అననే అన్నాడు. ఆవిడ వైఖరిని చూసి “ అన్ని పనులూ మీరే మీద వేసుకుంటే చివరికి మీకే కష్టం అవుతుంది మేడం. వాళ్ళకి అర్ధం అయ్యేలా చెప్పండి” అని. ఒకప్పటి తన అనుభవాన్ని గురించి చెబుతూ.
“ఏం చెయ్యమంటార౦డీ. చూస్తూ ఊరుకోడానికి మనస్సాక్షి వప్పుకోదు. ఈ దిక్కుమాలిన ఆఫీసులో అన్నీ నేనే చూసుకోవాలి ” అంటూ ఎప్పటి భారతమే ఏకరువు పెట్టింది..
చివరికి అదే నిజం అయ్యింది.
***
కోర్టు నుంచి కాయితం వచ్చిందంటే, ముట్టుకోవడమే మానేసారు మిగతావాళ్ళు.
ఆఫీసరుగారు కూడా “సుందరిగారు ఈ కోర్టు కేసు చూడండి. త్వరగా కౌంటర్ ఫైల్ చెయ్యాలి మనం” అంటూ చేతికిచ్చేవారు.
అది మొదలు వ్రాసిన రిమార్కులు సీనియర్ అసిస్టెంటు ముర్తికో, జునియర్ అసిస్టెంటు రెడ్డికో ఇచ్చి, ‘హైదరాబాదు.. హై కోర్టుకు’ పంపే వరకూ.. ఆఫీసులో హడావుడి అంతా ఇంతా కాదు. కోర్టు వాళ్ళు వ్రాసే ఎలాంటి ‘కొర్రీ’ కి అయినా నిముషాల మీద.. అన్సర్ వ్రాయగలిగే తెలివితేటలు ఆమెవి.
అయితే..
రానురానూ సుందరిపై అక్క మాటలు బాగానే పని చేసినయ్.
రోజు రోజుకి తన మీదే ఆఫీసుభారం పడిపోతున్నట్లుగా అనిపించసాగింది.
కొత్తగా వచ్చిన ‘మధుసూదన్’ తనలాగే మరో గెజిటెడ్ ఆఫీసరు. కబుర్లతో కాలక్షేపమే గాని అస్సలు పని చెయ్యడు. అస్తమానం ‘ఫోను’లే. పొద్దస్తమానం చెవికి ఫోను అతికించుకునే కనిపిస్తాడు.
“ ఎప్పుడూ ఫోన్లేనా! ఎంతసేపు మాటలు” అందొకసారి నవ్వుతూనే, తానొవ్వక.. నొప్పింపక అన్నట్లు. అలా అంటేనన్నా.. ఫైళ్లు ముట్టుకుంటాడని.
మాటలు మధ్యలో ఆపి “డబ్బులు మావేనండీ ” అన్నాడు వెటకారంగా.
నువ్వూ నేనూ ఒకే కేడరు అది గుర్తుపెట్టుకో అన్నట్లు.
అంతే..
అందరిలోనూ తల కొట్టేసి నట్లయ్యింది. ఇక మళ్ళీ అతని జోలి కెళ్ళలేదు. అతను రోజులో ఒక్క ఫైలూ వ్రాయడు. కబుర్లతో కాలక్షేపం తప్ప.
ఇలా అందరూ కాలం గడుపుకు పోవడం, తన మీద బర్డెన్ పడిపోవడం. రోజు రోజుకి ‘ఊబి’ లో కూరుకు పోతున్నట్లు అనిపించింది.
విజయవాడలో అన్నయ్య కూడా ‘స్క్యైప్’ లో చూసి “నీరసపడ్డావే” అన్నాడు.
జగదాంబ కూడా మళ్ళీ చివాట్లు వేసింది,
“ఈ నెలలో ‘ఇంక్రిమెంటు ఉంది. అది తీసుకున్న ఆ తరువాత ఆలోచిస్తాను” ఉరడించింది అక్కని.
‘ఆఫీసు ఆర్డర్’ మార్పించి.. మధుసూదన్ కి.. ఎడిషనలుగా కొన్ని సబ్జక్తులు ఇప్పిస్తే, తన మీద అంత బర్డెన్ ఉండదు. కాబట్టి, ఆఫీసు ఆర్డర్ ‘మార్చమని’ అన్నది ఆఫీసరు అంజనాదేవితో.
“ఆఫీసులో పెద్ద పనేం ఉంది గనుక ఆఫీసు ఆర్డర్ మార్చడానికి. నడుస్తుంది కదా! నడవనివ్వండి ” అంటూ తేల్చేసింది ఆవిడ.
ఆ మాటకు కోపం తెచ్చుకున్న సుందరి..
“పనెందుకు లేదు మేడం. చెయ్యాలేగాని, చాలా వుంది. ఆ మధుసూదన్ గారు అస్సలు పని ముట్టుకోవడం లేదు. పది రోజుల క్రిందట ‘అర్జెంట్’ అని చెప్పిన ఫైలు.. ఈరోజుకీ ‘పుటప్’ చెయ్యలేదు. ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఎక్కడికి వెళుతున్నారో, తెలీడం లేదు. మూమెంట్ రిజిస్టరులో వ్రాయడం లేదు. మీరా ఎక్కువగా టూర్లలోనే ఉంటారు. ఆఫీసుకి.. ఏదైనా ప్రాబ్లం వస్తే.. నేను బేర్ చెయ్యలేను.”
అన్నీ నిజాలే. ఆఫీసరుగారి మౌనం ఆమెకు మరింత మాట్లాడే అవకాశాన్నిచ్చింది.
“నాకా ‘లో బి. పి’ కొత్తగా, ఈ దిక్కుమాలిన ఆఫీసుకి వచ్చిన తరువాతే ఎఫెక్ట్ అయ్యింది. ఇలాంటి పరిస్తితిలో నేను పని చెయ్యలేను. శెలవు పెట్టిపోతాను” చివ్వరిగా తన అస్త్రం ప్రయోగించింది.
దానికి ఆఫీసురుగారు పకపకా నవ్వి..
తన కుడి చెయ్యి ముందుకు చాచి చూపిస్తూ “ చూడండి సుందరిగారూ, మన చేతికున్న అయిదు వేళ్ళూ ఒక్కలా ఉన్నాయా! వాళ్ళకి పని చెప్పి జాగ్రత్తగా మనమే చేయించుకోవాలి. అయినా వాళ్ళ కోసం మీరు శెలవు పెట్టడం ఎందుకు? వంట్లో బాగోకపొతే రెండురోజుల కొకసారి వచ్చి వెళుతూ ఉండండి. ఈమాత్రం దానికి ‘ఎర౦డ్ లీవ్ ఎందుకు పాడుచేసుకోవడం” చెప్పిందావిడ.
ఆ మాటలేమి రుచించలేదు సుందరికి. రెండురోజుల తరువాత అయినా ఆ పని మళ్ళీ తనే చెయ్యాలి. దానివల్ల తనకు ఒరిగేది ఏమీ లేదని.
***
ఒకసారి మనసులోకి ఆలోచన వచ్చేసింది.
శెలవు పెట్టిపోవడానికి కారణం కనిపించడం లేదు. రెండు నెలలుగా పదే పదే పలుకుతుంది. “ ఎవ్వరూ మాట వినడం లేదు, శెలవు పెట్టిపోతాను, శెలవు పెట్టిపోతాను” అంటూ.
అందరూ ఆ మాట సరదాగానే ఖండిస్తున్నారు “మీరు శెలవు పెడితే ఎలా! మేడం. ఆఫీసేమైపోవాలి. అలాంటి పనులు చెయ్యకండి, పనులందరూ కలిసి చేసుకుంటే అవే తెములుతాయి” భరోసా ఇచ్చాడు ఎకౌంటెంట్ దైవసహాయం.
“ఆ ఆలోచన అందరిలోనూ ఉండాలి. వచ్చింది మొదలు ఫోన్లు.. కబుర్లతో కాలక్ష్తెపాలు ఎంతకని ప్రాకులాడను. నాకే మన్నా. ఎక్కువ ‘ఎలవేన్సులు’ ఇచ్చేస్తున్నారా ఏమిటి? అందుకే శెలవు పెట్టిపోతే అందరికీ జబ్బు కట్టేస్తుంది” అనేది కచ్చగా.
“ఆఫీసు ఆర్డర్’ మార్చ౦డి, ఔట్సొర్సింగ్లకు కూడా ఒక్కో సబ్జక్టు ఇవ్వండి. నాకు బర్డెన్ అయిపోతుంది. లేకపొతే సోమవారం నుండీ శెలవు పెట్టేస్తాను” అంది మరోసారి.
“చూద్దాంలెండి. ఇప్పుడు ఊరెళుతున్నను సోమవారం వచ్చిన తరువాత చూద్దాం” అంటూ ట్రైను టైము అవడంతో బయలుదేరింది అంజనాదేవి.
లోపల జరిగిన విషయం చెప్పి..
చాలాసేపు కారాలు మిరియాలు నూరి. తనమాటకు విలువ లేని చోట ఎందుకు? పనిచెయ్యాలని, సణుగుతునేఉంది.
“అబ్బా! ఈవిడ శెలవెప్పుడు పెడుతుందోగాని పబ్లిసిటి ఎక్కువైపోతుంది” తలపట్టుకుంది టైపిస్ట్ రేణుక. ఆవిడ శెలవు పెట్టేస్తే అందరి కన్నా ఇబ్బంది పడేదే ఆమే. అయినా విన్నదే, విని.. విసిగిపోయింది.
***
సోమవారం..
ఈ రోజుతో తాడో, పేడో తెల్చేసుకోవలనుకుంది సుందరి, ఇంటినుంచి బయలుదేరేటపుడే. ఇంక్రిమెంటు, డి. ఏ ఎరియర్సు అన్ని వచ్చేసినాయ్. కొద్దీ రోజుల శెలవు పడేస్తే అన్ని సర్దుకుంటాయి అనుకుంటూ.
కానీ, ఆరోజు.. అంజనాదేవి రాలేదు.
ఆమెకు తెలుసు ఆవిడ రాదని.. వచ్చినా ‘ఆర్డర్’ మార్చదని.
వెంటనే,
‘పది రోజులు’ శెలవు పెట్టి వెళ్ళిపోయింది ‘తన కోడి కుయ్యందే, ఊరు మేల్కోదు’ అన్నట్లు.
***
ఆవేశంగా శెలవు అయితే పెట్టి౦ది గాని, ఇంట్లో ఏం తోచలేదు.
పిల్లలకి కేరేజిలు కట్టడానికి తప్ప.. మరో ప్రయోజనం కన్పించలేదు. మేడం ఫోన్ చేసి.. పలకరిస్తే. వెంటనే.. వెళ్లి ‘వాలి’ పోదాం అనుకుంది. కానీ..
ఆమె ఆశించినట్లు.. జరగలేదు.
అంజనాదేవి నుంచి ‘కర్టసీ’ కైనా ఓ పలకరింపు లేకపోవడం.. పుండు మీద కారం చల్లినట్లయ్యినది. ‘ఇగో’ దెబ్బతింది. ఇన్నాళ్ళు ఆఫీసుకెంత సేవచేసాను. “ఎలా ఉంది.. ఆరోగ్యం” అని ఒక్కసారీ.. తెలుసుకోలేదా! తనంటే విలువ లేనపుడు.. ఇక ఆమె ముఖం చూడకూడదు. ఆ ఆఫీసుకే పోకూడదు నిర్ణయించేసుకుంది సుందరి.
నిద్ర పోయేవాళ్ళని లేప వచ్చేమో! గాని నిద్ర ‘నటించే’ వాళ్ళని లేపడ ఎవరి తరం.
లీవు పొడిగించింది.
అలా రెండు నెలలు గడచిపోయాయి..
డిపార్టుమెంటు వాళ్ళు ట్రాస్ఫర్లకి పిలిస్తే తప్ప.. తను ముందుకెళ్ళే దారిలేదు. నెల తిరిగేసరికి.. హౌసింగ్ లోను, ఆర్. డి లు నెలకి ఇరవై వేలు బాకీలు కనిపిస్తున్నాయి. ‘చిట్ ఫండ్’ డబ్బులోస్తే కొన్నాళ్ళ పాటు, చూసుకోనక్కరలేదు అనుకుంటే, ఆఫీసు నుంచి ‘శాలరీ సర్టిఫికేటు’ అందలేదు.
శెలవు పడెయ్యడం తనకు చేతనయిన పనైతే..
జీతం సర్టిఫికేటు ‘ఆపగలగడం’ ఆఫీసరుగారి పని.
బాకీలు పేరుకు పోవడంతో.. ఇంట్లో గొడవ మొదలైంది “ ఎవరి నడిగి పెట్టావ్ శెలవు” అంటూ విసుక్కున్నాడు భర్త వాసూరావు.
నడుంవాల్చి మంచం మీద పడుకున్నా, మనస్సుకి శాంతి లేకుండా పోయింది.
మనిషి సుఖపడడం కోసమే కష్టపడుతుంటాడు.
గడచిపోయిన రోజులు వెలుతురులోనూ.. గడుస్తున్న రోజులు చీకటిలోను ఉన్నట్లనిపిస్తుంది. ఆరోజు విశ్రాంతి లేక ఆరోగ్యం పాడై౦ది అనుకుంటే.. ఈరోజు సుఖం ఎక్కువై మనసు పాడై౦ది.
అక్క మాటలు తనమీద ఇంత ప్రభావం చూపిస్తాయని అనుకోలేదు. తాడుని తెగేంతవరకు లాగిందేమో! తను.
తనే అనవసరంగా ఆఫీసు మీద అయిష్టత పెంచుకుంది. ఎవరైనా శెలవు పెట్తోద్దనే చెప్పారు. అయినా ఎందుకో తొందరపడింది. లోకంలో ఎంతమందికి బి. పి లు రావడం లేదు. వచ్చిన వాళ్ళందరూ శెలవులు పెట్టేసుకుని ఇంట్లో కూర్చున్నారా!
చివరికి, ఒంటరిగా ఇంట్లో.. మగ్గిపోవడం కన్నా ఆఫీసుకి పోవడమేనయమనిపించింది.
రేపటితో తను పెట్టిన శెలవు అయిపోవస్తుంది కూడా. ఆఫీసు ముఖం చూడనని ప్రతిజ్ఞ చేసినా.. ట్రాస్ఫర్ల కౌన్సిలింగ్.. ఇప్పట్లో ఉన్నట్లు లేదు.
ఇంకా.. ఇంకా శెలవు పాడుచేసుకోకూడదు.
రేపు వెళ్లి జాయిను అవ్వాలి. ప్రతివాళ్ళ డ్రాఫ్ట్ నీ.. తను చూడాల్సిన పనిలేదు. ఎదుటివాళ్ళకూ.. భావస్వతంత్ర్యం ఇస్తే, తనకూ బర్డెన్ తప్పుతుంది. దేశంలో ఎన్నెన్నో ఆఫీసులు ఉన్నాయి, అవి అన్ని నడవగా లేనిదీ.. తను పనిచేసే యూనిట్ మాత్రం నడవదా! ఏ సెక్షను డిప్యుటీ తహసిల్దార్ ఆ సెక్షను చూసుకుంటారు.
తను లేకపోతే రోజులు జరగడం మానేసాయా!
అలా అనుకోగానే.. మనసు ప్రశాంతం అయ్యింది. కొద్దిసేపటికే మబ్బులు తొలగిన ఆకాశంలా.. దూదిపింజంలా గాలిలో తేలిపోయింది. ఇన్నాళ్ళకు నాలుగు గోడల మధ్య.. మనసు పడిన ఆవేదనకి, తెర పడింది.
ఎప్పుడు తెల్లవారుతుందా! అని రేపటి ఉదయం కోసం ఎదురు చూడసాగింది.
***
P.L.N.మంగారత్నం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు పి.ఎల్ ఎన్. మంగారత్నం, బి.ఎస్సీ చదివి 1984 లో రెవిన్యూ డిపార్టుమెంటులో జూనియర్ అసిస్టెంటుగా జాయిను అయి, డిప్యుటీ తహసీల్దారుగా డిసెంబర్ 2018లో రిటైరు అయ్యాను. చిన్నప్పుడు బొమ్మలు బాగా వేసేదాన్ని. ఇప్పుడు రచనలు జై సమైక్యాంద్ర సమయంలో వచ్చిన సెలవులలో రెండవ సారి మొదలు పెట్టి వ్రాయడం మొదలు పెట్టాను. ఇప్పటికి 100 పైగా కధలు వ్రాసాను. త్వరలో ఒక సంకలనం కూడా వేసుకునే ఆలోచనలో ఉన్నాను.
Comentarios