top of page

సంకెళ్లు


'Sankellu' written by Chunduru Umabala

రచన : చుండూరు ఉమాబాల

ఉదయం పదిన్నర ప్రాంతంలో కాలింగ్ బెల్ మోగింది.... ‘ఎవరై ఉంటారు’ అనుకుంటూ తలుపు తీసింది నందన. ఎవరో పెద్దాయన...

."అమ్మా! పక్క ఫ్లాట్ వాళ్ళు లేరా.. బెల్ కొట్టినా తలుపు తీయకపోతే మీకు ఏమైనా తెలుసేమో అడుగుదామని” అన్నారాయన, కొంచెం మొహమాటంగా...

తను కూడా ఆ ఫ్లాట్ వైపు చూసింది. 'ఇప్పుడందరూ మునుపటిలా తాళాలు బయటికి కనపడేలా వేస్తున్నారా ఏంటి… ఉన్నారో లేదో కనిపెట్టేయడానికి’ అనుకుని… "తెలీదండీ" అంది.

“నేను ‘శనివారం కదా.. ఇంట్లో అమ్మాయైనా ఉంటుంది కదా’ అని వచ్చేసానమ్మా… ముందు ఫోన్ చేయాల్సింది” అనుకుంటూ ఉండగా

నందన అంది... ‘ఇప్పుడు చేయండి ఆయనకి’ అంది...

'ఆఫీస్ లో ఉండగా చేస్తే ఏమైనా అనుకుంటాడేమో' అని తనలో తను అనుకుని...

ఎక్కడ కూర్చుందామా అని చూస్తున్నట్లు అనిపించడంతో తను లోపలికి జరిగి ‘ఇలా కూర్చుని ఫోన్ చేసుకోండి’ అంది...

ఆయన “శ్రమ ఇస్తున్నాను..” అంటూ కుర్చీలో కూర్చుని, సంచీ లోంచి ఫోన్ తీసి, కళ్ళజోడు పెట్టుకుని నెంబర్ వెతుక్కుని ఫోన్ చేసాడు...

అవతల అతను ఫోన్ తీసినట్టు ఉన్నాడు...

"బాబూ.. నేను మీ ఇంటికి వచ్చాను… తాళం ఉంది…” అని చెప్తుండగానే...అవతలివైపు ఏమన్నాడో…”ముందు చెప్పే వద్దామనుకున్నా... వేరే పనుండి ఇక్కడికి రావలసి వచ్చింది... ఎలాగూ వచ్చాకదా ఇచ్చిపోదామని వచ్చాను...మళ్లీ అంతదూరం నుండి రావాలని...సెలవు రోజే కదా... మీరుండకపోయినా అమ్మాయి ఉంటుందికదా అనుకున్నా బాబూ... వచ్చేసారి ఫోన్ చేసే వస్తా... మీ పక్క ఫ్లాట్ వాళ్ళకి ఇవ్వనా... ? ఆమెకి ఫోన్ ఇవ్వనా” అన్నారు...

అవతల వ్యక్తి ఏమన్నాడో గానీ... మొహం చిన్నగా చేసుకుని నందనకి ఫోన్ ఇచ్చి “మాట్లాడమ్మా” అన్నారు...

నందన ‘హెలో’ అనగానే…”మేడమ్! నేను మీ పక్క ఫ్లాట్ 201 లో ఉండే వికాస్ ని... ఆయన పది వేలు ఇస్తారు తీసుకోండి… నేను రెండురోజుల్లో వచ్చి తీసుకుంటాను…” అన్నాడు...

సరేనంది నందన...

“థాంక్స్ అండీ” అన్నాడు వికాస్...

ఫోన్ ఆయనకి ఇచ్చేసింది...

ఆయన అది తీసుకుని, జేబులోంచి డబ్బు తీసి రబ్బరు బ్యాండ్ వేసి ఉన్న నోట్ల కట్టని ఇచ్చి...

“అమ్మా ఇవి పది వేలమ్మా...ఒకసారి చూసుకో” అన్నారు...

నందన కూర్చుని లెక్కపెట్టింది...

“ఉన్నాయండీ” అంది..

'ఏంటో ఒక్కోసారి వద్దనుకున్నా అందరికీ శ్రమ ఇవ్వాల్సి వస్తుంది...ధన్యవాదాలు తల్లీ...అబ్బాయి వచ్చి తీసుకుంటాడు’ అని లేవబోయారు..

ఎందుకో కొంచెం జాలి అనిపించింది ఆయన్ని చూస్తే. .

“ఒక్క నిమిషం ఆగండి …” అని నందన కిచెన్ లోకి వెళ్లి ఒక గ్లాసు నిండా చిక్కని మజ్జిగ తెచ్చి ఇచ్చింది...

ఆయన మొహమాట పడిపోయి…”వద్దమ్మా” అని లేవబోయారు...

“అయ్యో! మీ అమ్మాయి లాంటి దాన్నే నేను… ఇది తాగండి పరవాలేదు” అంది...

ఆయన మొహమాటం గానే తీసుకుని తాగి...

“సుఖీభవ తల్లీ…” అని లేచి..

“నీ పేరమ్మా?” అని అడిగారు…

"లక్ష్మీ నందన అండీ” అంది నందన...

"చక్కటి పేరు...దీర్ఘ సుమంగళీ భవ" అంటూ బయటికి వెళ్లి చెప్పులు వేసుకున్నారు...

అనుకోకుండా చెప్పులు చూసింది...పాతగా అయిపోయి జీర్ణావస్థలో ఉన్నట్టు ఉన్నాయవి...

చివుక్కుమంది నందనకి...

“వెళ్ళొస్తానమ్మా” అంటూ ఆయన వెళ్లిపోయారు...

'ఎవరై ఉంటారబ్బా అనుకుంది' నందన...

సాయంత్రం భర్త రాగానే చెప్పి, “పాపం! ఆ పెద్దయన్ని చూస్తే జాలేసిందండీ… ఎండని పడొచ్చారు… వాళ్ళకి ఏమవుతారో” అంది...

'ఏదో డబ్బుల వ్యవహారం అయి ఉంటుందిలే.. వదిలేయ్” అన్నాడు... నందన భర్త కృష్ణ వంశీ..

“డబ్బు ఇక్కడ పెట్టాను...నేను లేనప్పుడెప్పుడైనా వాళ్ళు వస్తే ఇచ్చెయ్యండి” అంది భర్తతో…

మరుసటి రోజే ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసారు

అంతటితో ఆ సంగతే మరచి పోయింది...

ఆ తరువాత కొన్ని రోజులకి నందనా వాళ్ళకి చెన్నై ట్రాన్స్ఫర్ అయింది....

భర్త ది బాంక్ ఉద్యోగం కావడంతో వాళ్ళకి ఇదేమీ ఊహించనిది కాదు...

చెన్నై కి...ఇక్కడ స్కూల్ బ్రాంచ్ అక్కడ ఉండటం తో తమ నాలుగో తరగతి చదివే అబ్బాయికి సమస్య లేదు...

కొత్తగా స్కూల్ లో జాయిన్ చేయాల్సిన పాపకి స్కూల్ వెతుక్కోవాలి...

అయితే షిఫ్టు అయ్యే హడావిడిలో ఉండగా నందనకి కొరియర్ లో ఒక బోకే వచ్చింది...

ఎవరు పంపించి ఉంటారబ్బా అనుకుంటూ చూస్తే దానితో ఒక కవర్ ఉంది...

అది ఓపెన్ చేస్తే...ఇంగ్లీష్ లోరాసి ఉంది...

“నందన గారూ నమస్తే… నేను మీ పక్క ఫ్లాట్ లో ఉండే వికాస్ భార్యని… మొన్న మా నాన్నగారు వస్తే, మీరు ఆదరించి, ఆయన ఇచ్చిన డబ్బు తీసుకున్నట్లు తెలిసింది...కృతజ్ఞతలు... స్వయంగా వచ్చి చెప్పనందుకు ఏమీ అనుకోకండి... వాచమన్ ద్వారా మీరు చెన్నై షిఫ్ట్ అవుతున్నట్టు తెలిసింది...అల్ ద బెస్ట్...

అభినందనలతో

"శివాన్విత" అని ఉంది...

అదేంటో.. అని భుజాలు ఎగరేసింది నందన...

బొకేని మాత్రం టేబుల్ మీద పెట్టుకుని, చాలా బావుంది అనుకుంది...

తరువాత ఓ నాలుగు రోజులకి నందన వాళ్ళు చెన్నై షిఫ్టు అయిపోయారు...

కొత్త ఇంట్లో సామాను సర్దుకుని మామూలు స్థితికి రావాలంటే కొంత టైం పడుతుంది… భాష, ప్లేస్ అన్నీ కొత్తే...

విశాలంగా చెట్లతో ఉన్న అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ బాగానే ఉంది సౌకర్యంగా...

పిల్లాడిని స్కూల్ లో ఈజీ గానే చేర్చారు...

పాపని చేర్చడానికి ఇంకా మూడు నెలలు టైం ఉంది...

ఒకరోజు పాపని తీసుకుని, బాబుని స్కూల్ బస్

స్టాప్ నుండి ఇంటికి తీసుకువస్తుంటే...దారిలో ఒక చోట గుంపు కన పడింది...

ఏంటా..? అని చూస్తే ఆక్సిడెంట్...స్కూటర్ మీద నుండి కొంచెం పెద్దాయనే.. పడిపోయి ఉన్నాడు...

కార్ ఏదో డాష్ ఇచ్చి వెళ్ళిపోయిందట...

అందరూ తమిళంలో మాట్లాడుకుంటూ గొడవ గొడవ గా ఉంది...

ఒక కుర్రాడు మాత్రం ఆయన్ని లేవదీసి ఎవరినో నీళ్లు అడిగి అతని నోట్లో పోసాడు...

100 కి ఫోన్ చేయమని అందరినీ అడుగుతున్నాడు...

అందరికీ చూడటానికి ఉన్న ఇంట్రెస్ట్ హెల్ప్ చేయడానికి ఉండదు కదా...

అతను నేనే ఫోన్ చేసేవాడిని.. నా వొళ్ళో ఈయన తల ఉంది కదా అంటున్నాడు...

ఎవరో ఫోన్ చేశారు...కొద్దినిమిషాలకి అంబులెన్స్ వచ్చింది...

కొంతమంది, ఆ కుర్రాడు సహాయంతో ఎక్కించారు లోపలికి...

ఆయనతో ఎవ్వరూ వెళ్ళడానికి ఇష్టపడటం లేదు...

ఆ కుర్రాడు బతిమాలుతున్నాడు..."సర్ నేను పిజ్జా డెలివరీ చేయాలి టైం కి...లేకపోతే నేనే వెళ్ళేవాడిని అంటూ"..

ఆయన స్పృహ లోనే ఉన్నారు కదా..ప్లీస్ సర్ అని అడుగుతున్నాడు...

ఎవరూ ముందుకు రావడం లేదు...చివరికి ఒకతను ఎక్కాడు అంబులెన్స్...

ఈ పిజ్జా అతను 'థాంక్ యు భయ్యా' అని తన బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు...

అందరూ చెల్లా చెదరైపోయారు..

నందన మాత్రం బాధ్యత గల ఆ పిజ్జా డెలివరీ అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది...

ఆ వయసులో... ఇంకా అలాంటి కుర్రాళ్ళు ఉన్నారంటే గ్రేటే అనుకుంది...

బయటికి వెళ్లి షాపింగ్ చేయలేక, భర్త కొత్త ఆఫీస్ లో బిజీ అవడం చేత ఇంటికి కావలసినవి అన్నీ ఆన్లైన్ లోనే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటోంది...

అలా ఒక రోజు పిల్లాడికి స్కూల్ బాగ్ ఆర్డర్ ఇచ్చింది అమెజాన్ లో.. అది ఆదివారం పొద్దున్న డెలివరీ చేస్తామన్నారు...

పిల్లాడికి తెలిసి, ఉత్సాహంతో తెగ ఎదురు చూసేస్తున్నాడు కొత్త బాగ్ కోసం...

పొద్దున్నే బెల్ మోగగానే చూసి “అమ్మా! బాగ్ వచ్చింది” అని గంతులేశాడు...

నందన వచ్చి డోర్ తీసి బాగ్ తీసుకుంది...

అతను "మామ్ మీరు తెలుగా" అని అడిగాడు...

ఆమె అతన్ని చూసి ..అవును అని…”మీరేకదా ఆ రోజు రోడ్ మీద ఆక్సిడెంట్ అయితే అతన్ని అంబులెన్స్ లో పంపించింది” అని అడిగింది....

అతను కూడా కొంచెం ఆశ్చర్యం గానే “అవును మేమ్...మీరున్నారా అక్కడ?” అన్నాడు...

నందన అవునంటూ " మీరు చాలా బాగా స్పందించారు ఆ రోజు… ఆయన ఎలా ఉన్నారో తెలిసిందా” అంది...

“నేను సాయంత్రం ఆ హాస్పిటల్ కి ఫోన్ చేసి వాకబు చేశాను... ఆక్సిడెంట్ కేస్ కదా గుర్తు పట్టారు...సేఫ్ అని తెలిసింది... ఇంక నేను పట్టించుకోలేదు మేడమ్...వాళ్ళ వాళ్ళు వచ్చిఉండొచ్చు” అన్నాడు...

అప్పుడు నందన ... “మీరు ఈ జాబ్ కూడా చేస్తున్నారా?” అని అడిగింది...

దానికి అతను “అవును మేమ్...చదువుకుంటున్నాను… పొద్దున్న 9 లోపు కొరియర్ ఇస్తాను... సాయంత్రం ఒక రెండుగంటలు పిజ్జా డెలివరీ చేస్తాను…” అన్నాడు...

“వెరీ గుడ్” అంది నందన...

“బాగా చదువుకోండి” అని...వాళ్ళు హైదరాబాద్ నుండి కొత్తగా వచ్చినట్టు చెప్పింది...

అతను నమస్తే పెట్టి వెళ్ళిపోయాడు..

అదే విషయం భర్తకి చెప్పి, “ఇలా సినిమాల్లోనే చూపిస్తారు అనుకున్నా... నిజ జీవితంలో కూడా ఇంత కష్టపడి చదువు కునే వాళ్ళు ఉంటారని ఇతన్ని చూస్తే తెలిసింది” అంది...

“అందరూ గోల్డెన్ స్పూన్ తో పుట్టరు కదా...కొంతమంది కుర్రాళ్ళు జాలీగా జీవితాన్ని గడుపుతూ చదువుతారు... కొంతమంది ఇలా చెమటోడ్చి చదువుతారు...నిజజీవితం నుండే పుట్టుకొస్తాయ్ సినిమాలు…” అన్నాడు వంశీ...

ఇది జరిగిన వారం రోజులకి స్కూల్ లో టీచర్ పేరెంట్ మీటింగ్ ఉందని లెటర్ పంపించారు స్కూల్ వాళ్ళు...

ఆరోజు సెప్టెంబర్ ఆఖరి రోజు కావడంతో బాంక్ కి సెలవు పెట్టడానికి లేదన్నాడు నందన భర్త...

“ఈ ఒక్కసారి వెళ్లకపోతే ఏమీ కాదులే. నువ్వూ వెళ్లొద్దు” అన్నాడు...నందనతో...

కానీ నందన అంది.. “మనం వచ్చాకా మొదటి మీటింగ్ కదా! ఒకసారి వెళ్లి టీచర్ తో కలిసి మాట్లాడితే బావుంటుందేమో..

వీడి గురించి తెలుసుకోవచ్చు,

"చైత్ర" అడ్మిషన్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు” అంది…”కానీ వీడిని తీసుకెళ్తే బాగుండదు” అంది...

“సరే నేను తీసుకెళ్తాను. నువ్వు ఇంటికి రాగానే ఫోన్ చెయ్యి. వీడిని పంపిస్తాను” అని భర్త అనడంతో..

తనూ కూతురూ తయారయ్యి పదిన్నర కల్లా ఆటో ఎక్కి కోడంబాకం..ఆ స్కూల్ ఉండే జాగా పేరు చెప్పింది.

ఆటో అతను తను చెప్పిన అడ్రస్ కి బాగానే తీసుకెళ్లి స్కూల్ ముందు ఆపాడు...ఒక గంట పట్టింది సుమారు ..దూరమే...

స్కూల్ పరిసరాల్లో అక్కడక్కడ ఇళ్ళు ఉండి కొంచెం ప్రశాంతంగానే అనిపించింది...

ఇంతకుముందు వంశీ వెళ్లడంతో, నందనకి ఇదే మొదటిసారి స్కూల్ కి వెళ్లడం..

పిల్లలెవ్వరూ లేకపోవడం తో స్కూల్ నిశ్శబ్దంగా ఉంది...

పన్నెండు అవుతుండగా టీచర్ ను కలిసింది...

టీచర్ పృధ్వి గురించి మంచి ఫీడ్ బాక్ ఇచ్చింది...

‘పిల్లలతో బాగానే కలిసిపోతాడాని, తొందరగా గ్రహిస్తాడని…’

నందన హ్యాపీ అయ్యింది...

ప్రిన్సిపాల్ ని కలిసి చైత్ర ఆడ్మిషన్ గురించి మాట్లాడింది...

జనవరిలో అప్లికేషన్స్ ఇస్తారని...ఇదే స్కూల్ లో పాప అన్నయ్య కూడా చదువుతున్నాడు కాబట్టి ఈజీ గానే అడ్మిషన్ దొరుకుతుందని...

నందన నిశ్చింత తో ఆవిడకి నమస్తే పెట్టి బయటికి వచ్చింది చైత్రతో..

బయటికి వచ్చి చూస్తే ఆటోలు లేవు...

నార్మల్ డే అయితే ఉండేవేమో...

కొద్దిసేపటికి ఆటో దొరికింది...ఆటో అతనికి తనుండే ఏరియా పేరు చెప్పింది...

వన్ ఫిఫ్టీ అన్నాడు..

సరే అని ఎక్కి కూర్చుంది...

అతను స్పీడ్ గా అనడం కంటే, రాష్ గా డ్రైవ్ చేయడం అనడం బెటరేమో అనేలా డ్రైవ్ చేస్తున్నాడు...

నందన "స్లో స్లో" అంటోంది...

వాడొకసారి వెనక్కి తిరిగి నందన మొహం చూసాడు విచిత్రంగా...

ఫోన్ వచ్చింది అతనికి.

ఫోన్ తీసి...భుజం మీద పెట్టుకుని తల ఒక పక్కకు వంచి

మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు...

నందనకి ఆందోళన గా ఉంది...ఏంటి ఇతను అని...

కొంతసేపటికి ఎవడో... ఆటోని ఆపి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు...

డ్రైవర్ వెనక్కి తిరిగి నందనతో..."ఫ్రెండ్ మాడం… ఆగే ఉతర్ జాతా" అన్నాడు...

నందన మాట్లాడలేదు...

వాళ్లిద్దరూ తమిళంలో తెగ మాట్లాడుకుంటున్నారు...మధ్యలో పెద్దగా నవ్వడం… నందనకి దారి కూడా కొంచెం వేరేలా ఉండి వచ్చేటప్పుడు లా అనిపించలేదు...

అదే అడిగింది హిందీ లో...

వెంటనే వేరే అతను వెనక్కి తిరిగి " ఏ నజదీక్" అన్నాడు...

నందనకి అయోమయంగా లోపల ఆందోళనగా అనిపించింది...

బాగ్ లోంచి ఫోన్ తీసి భర్తకి ఫోన్ చేసింది...ఏంటో ఒకసారి రింగ్ అయ్యి కట్ అయిపోతోంది...

నెట్వర్క్ సరిగ్గా లేదని మెసేజ్ వస్తోంది...

సర్లే పట్ట పగలే కదా అని ధైర్యం తెచ్చుకుంది నందన…

"బి బ్రేవ్ నందనా" అని తనకి తను చెప్పుకుని గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది...

వొళ్ళో చైత్ర కునిపాట్లు పడుతోంది....

పరిగెడుతున్న ఆటో సడన్ గా ఆగింది.

డ్రైవర్ తమిళంలో ఏదో అనుకుంటూ దిగాడు...

పెట్రోల్ చూసుకున్నాడు...

మళ్లీ మళ్లీ స్టార్ట్ చేయడానికి ట్రై చేసాడు...

ఇద్దరూ డిస్కస్ చేసుకున్నారు...

"మాడం ఎక్ బార్ ఉతరో అని" ...నందన దిగాకా నందన కూర్చున్న సీట్ ఎత్తి... ఏవో పరికరాలు తీశారు...

"పాంచ్ మినిట్ మాడం" ...అన్నాడు...

నందన దిగాకా పక్కన పెద్ద రాయి ఉంటే దాని మీద కూర్చుని ఫోన్ తీసి ట్రై చేసింది భర్తకి...

కలవడం లేదు...చుట్టూ చూసింది .

మెయిన్ రోడ్ గానీ...అక్కడక్కడ దూరంగా విసిరేసి నట్టున్నాయి ఇళ్ళు...ఏంటో చిన్న చిన్న పొలాల్లా కూడా అనిపిస్తోంది...

మిట్ట మధ్యాహ్నం అవడం వలన రోడ్ మీద అప్పుడప్పుడు మోటార్ సైకిల్స్ రాష్ గా పోతున్నాయి...అందరూ హెల్మెట్స్ తో ఉన్నారు... వీళ్ళని విచిత్రంగా చూసుకుంటూ పోతున్నారు...

కొంచెం భయం స్టార్ట్ అయింది నందనకి...

భుజం మీద చైత్ర నిద్ర పోతోంది...

గట్టిగా అడుగుదామంటే భాష సమస్య...

అప్పటికీ హిందీ లో అడిగింది...

దానికి అతను "హమ్ కో భీ నై మాలుమ్...దేఖ్ రహేహై నా" అన్నాడు...

సడన్ గా అప్పుడప్ప్పుడు వచ్చే వెహికల్స్ కూడా రావడం లేదు...

ఒక్క ఆటో వచ్చినా ఆపి వెళ్లిపోదాం ఎవరైనా ఉన్నా రిక్వెస్ట్ చేసి అనుకుని చైత్ర ని ఎత్తుకుని రోడ్ మీదకి వచ్చింది...

ఆటో వాళ్లిద్దరూ అప్పుడప్పుడు నందన ని చూస్తున్నారు...

ఇంతలో... ఒక మోటార్ సైకిల్ నందన ముందు నుండి నందనకి చూసుకుంటూ వెళ్లి...కొంచెం దూరంలో ఆగింది… దానిపై అతను దిగి హెల్మెట్ తో వెనక్కి నడిచి వచ్చాడు… దగ్గరికి వచ్చి హెల్మెట్ తీసి…”మేమ్..మీరు ఇక్కడున్నారేంటి…” అని అడిగాడు నందనని గుర్తు పట్టి...

అతను తెలుగులో మాట్లాడటంతో నందనకి ఒక్కసారి దుఃఖం వచ్చింది....

“మరి...ఆటో” అంటూ చూపించి దుఃఖంతో గొంతు వణుకుతుండగా…”పాడయ్యింది” అని చెప్పింది...

“అసలు ఈ ఏరియా లో ఉన్నారేంటి మీరు… నన్ను గుర్తు పట్టారా...నేను ఒకసారి మీ ఇంటికి కొరియర్ ఇవ్వడానికి వచ్చాను” అన్నాడు...

నందనకి గుర్తు వచ్చింది...

“మీరుండండి... “ అని ఆటో దగ్గరికి వెళ్లి వాళ్ళతో ఏదో మాట్లాడాడు గట్టిగానే...

వాళ్ళేదో చెప్తున్నారు...

బైక్ అతను ఆటో వాళ్ళకి వేలు చూపించి బెదిరిస్తున్నాడు...

ఆటో నెంబర్, కంప్లైంట్ అన్న మాటలు వినిపించాయి నందనకి...

నందనకి ఏమీ అర్ధం కాలేదు...

బైక్ అతను వెనక్కి వచ్చి “వాళ్ళకి... ఒక వంద రూపాయలు ఇచ్చేయండి మేడమ్...మీరు నాతో వస్తే, ముందు సెంటర్ లో వేరే ఆటో ఎక్కిస్తా” అన్నాడు...

నందన తల ఊపి పర్సు లోంచి వంద తీసి ఇచ్చింది....

అతని వెనక వెళ్లి బండి మీద కూర్చుంది...చైత్రని గట్టిగా పట్టుకుని....

ఆటో వాళ్ళు కొంచెం షాక్ గా చూస్తుండగా... బైక్ వెళ్ళిపోయింది...

కొంత దూరం వెళ్ళాక అన్నాడు అతను “ఇది రాంగ్ రూట్ మేమ్ మీ ఇంటికి...ఎక్కువ మంది రారు...నేను కొరియర్ డెలివర్ చేసేసి రూమ్ కి వెడుతున్నాను… ఒకటి మేమ్...ఇద్దరు డ్రైవర్స్ ఉంటే...అదే.. డ్రైవర్ సీట్ లో ఇద్దరు జెంట్స్ ఉంటే లేడీస్ ఎక్కకూడదు…అది గుర్తు పెట్టుకోండి…”

నందన ఏమీ మాట్లాడలేదు...బిగుసుకుపోయి ఉంది...

ఒక సెంటర్ రాగానే ఆపి…”ఆటో ఎక్కుతారా” అని అడిగాడు...

వెంటనే నందన…”ప్లీస్.. మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. మీకు కష్టమని తెలుసు...ప్లీజ్” అంది బేలగా..

రెండు నిమిషాలు ఆలోచించి…”సరే మేమ్” అని స్పీడ్ గా పోనిచ్చి ఒక పదిహేను నిమిషాల్లో ఇంటి దగ్గర డ్రాప్ చేసాడు...

బైక్ దిగి నందన రెండు చేతులూ జోడించింది...

“లోపలికి రండి” అంది...అసలు మాట రావడం లేదు నందనకి...గొంతు పూడుకు పోయినట్టు అనిపించింది...

అతను అన్నాడు…”మేమ్ ఇంకోసారి వస్తాను తప్పక. నాకు రేపు ఇంటర్వ్యూ ఉందండీ.... దానికి ప్రిపేర్ అవ్వాలి. నేను వెళ్తాను. నేను తప్పక మిమ్మల్ని కలుస్తాను...ఎక్కడికి వెళ్లాలన్నా క్యాబ్ బుక్ చేసుకోండి మేమ్...అది సేఫ్...వస్తాను…” అని బైక్ స్టార్ట్ చేసి రివ్వున వెళ్ళిపోయాడు..

నందన ఇంట్లోకి వెళ్ళేసరికి వంశీ కొడుకుతో ఉన్నాడు...

వీళ్ళని చూడగానే ఆందోళన గా “ఏంటి ఇంతసేపయ్యింది...

ఫోన్ కలవట్లేదు...

స్కూల్ కి ఫోన్ చేస్తే ...ఎప్పుడో వెళ్ళి పోయావన్నారు…” అనగానే నందన బోరున ఏడ్చేసింది...వంశీ నీళ్లు తీసుకొచ్చి

ఇచ్చాడు...తాగి తేరుకుని మొత్తం జరిగింది చెప్పింది...

“చాలా భయం వేసింది… సమయానికి ఆ అబ్బాయి వచ్చాడు దేవుడిలా” అని కూడా అంది...

“ఆటో నెంబర్ నోట్ చేసుకున్నావా” అని అడిగాడు...

“లేదు...అతను నోట్ చేసుకున్నాడు...ఏదో ఎగ్జామ్ ఉంది అని హడావుడి గా వెళ్ళిపోయాడు...మళ్లీ వస్తానన్నాడు చూద్దాం” అంది..

“అదేంటి? ఆమాత్రం తెలీదా నీకు” అని కోప్పడ్డాడు కృష్ణ వంశీ...

నందన అంది “నిజమే! నాకు తోచలేదు. కానీ వాళ్ళేదో ప్లాన్ చేశారు.. అది ఫెయిల్ అయింది ఇతని వలన...అయినా ఇది నాకు భయంకరమైన అనుభవమే” అంది...మొహంలో ఇంకా భయం కనపడుతుండగా....

ఒక వారం రోజులకి ఆదివారం రోజు పొద్దున్న తొమ్మిదింటికి నందన ఇంటికి వచ్చాడు నందనని సేవ్ చేసిన అబ్బాయి...నందనకి చాలా సంతోషంగా అనిపించింది...

లోపలికి పిలిచి కూర్చోమంది...

“మేమ్.. ఎలా ఉన్నారు” అని అడిగాడు..

“నీ దయ వలన బావున్నాను” అంది నవ్వుతూ...

“అయ్యో అదేంటండీ.?” అన్నాడు...

“ఏదో ఆ టైం లో అటువైపు రావడం జరిగింది అంతే...మీ ప్లేస్ లో ఎవ్వరున్నా ఆగేవాడిని...

అయితే మేమ్ నేనెందుకు వచ్చానంటే, రేపు నేను చెన్నై వదిలి వెళ్లిపోతున్నాను...నాకు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చింది... క్యాంపస్ ప్లేస్మెంట్...రేపు వెళ్లిపోతున్నాను... మీకు చెప్పి మిమ్మల్ని ఒకసారి కలిసి పోదామని వచ్చాను…” అన్నాడు..

.ఇంతలో వంశీ వచ్చాడు...

నందన అతని గురించి వంశీ కి చెప్పింది...

వంశీ షేక్ హాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పాడు...

“మీ పేరు?” అన్నాడు...

నా పేరు "భరత్ వ్యాస్" ..

నందన లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చింది...

వంశీ థాంక్స్ చెప్తున్నాడు ఆరోజు నందనకి హెల్ప్ చేసినందుకు...

భరత్ కాఫీ తీసుకుంటూ అన్నాడు…”ఏమీ లేదండీ! ఆ రోజు ఆటో అతను ప్లాన్ చేసే లాంగ్ డిస్టెన్స్ అయిన ఆ నిర్మానుష్య ప్రదేశం లోంచి ఆటో తీసుకుని వచ్చాడు...ఫోన్ చేసి రెండో అతన్ని ఎక్కించుకున్నాడు...ఆటో పాడవలేదు...జనం రానప్పుడు ఒకడు స్టార్ట్ చేసి రెడి గా ఉంటాడు. ఇంకోడు మీ మెడలోని చైన్ గానీ ఇంకేమైనా విలువైనవి గానీ లాక్కుని ఆటో ఎక్కేస్తే ఇద్దరూ పారిపోదామని వాళ్ళ ఐడియా అయ్యుండొచ్చు...మీరు ఇక్కడి వాళ్ళు కాదని వాళ్ళు గ్రహించారు…” అన్నాడు భరత్…”ఈ లోపల నేను వచ్చాను. అదీ సంగతి!” అన్నాడు..

“మీరు క్యాబ్ ఎక్కడం బెటర్...దూరాలు ఆటోలో వెళ్ళకండి” అన్నాడు...

వంశీ అతని వివరాలు అడిగాడు...నందన అతని జాబ్స్ గురించి అడిగింది...

భరత్ చెప్పుకొచ్చాడు...

వాళ్ళది అమలాపురం ...తండ్రి .టీచర్ గా చేశారు...

ఒకబ్బాయి, అమ్మాయి...

ఇద్దరు పిల్లలూ చాలా బాగా చదివేవారు...

అమ్మాయి పెద్దది...

అమ్మాయిని బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్ లో చదివించారు.

ఆయన రిటైర్ అయ్యే టైం కి అమ్మాయి చదువు కంప్లీట్ అయ్యి హైదరాబాద్ హెచ్ సి ఎల్ లో ఉద్యోగం వచ్చింది...

అమ్మాయితో కూడా ఆయన కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది...

అప్పటికి కొడుకు ఇంటర్ చదువుతున్నాడు...

కూతురు ఉద్యోగంతో, ఆయన పెన్షన్ తో బాగానే జరిగేది ఇల్లు...

ఈ లోపు కూతురిని పెళ్లి చేసుకుంటానంటూ ఆమె ఆఫీస్ లో ఒకతను వచ్చి అడగడంతో... అమ్మాయికీ ఇష్టం అని తెలిసి పెళ్లి చేశారు...

ఈ లోపు కొడుక్కి చెన్నై ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చింది...

కష్టమైనా మెరిట్ లో ఉన్నాడు కాబట్టి ఫీస్ లో రాయితీ ఇచ్చారు...

భరత్ వ్యాస్ చెన్నై వచ్చి... ఫ్రెండ్స్ తో కలిసి ఉంటూ తండ్రికి భారం కాకుండా

ఖాళీ టైంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ....సెలవలకి ఇంటికి వెళ్లకుండా డబ్బు సంపాదిస్తూ చదువు పూర్తి చేశాడు...

అతను తండ్రిని పైసా అడక్కుండా చదువు కొనసాగించాడు...

కొడుకు వద్దన్నా తండ్రి తన పెన్షన్ డబ్బుల్లో పదో పరకో పంపిస్తూనే ఉండేవాడు...ఇన్నాళ్లకు అతని కష్టం ఫలించి చక్కని ఉద్యోగం తెచ్చుకున్నాడు...

అదీ అతని కధ...

భరత్ అన్నాడు…”నాకు సంతోషం గా ఉంది మేమ్...మా అమ్మా నాన్నలని సుఖ పెట్టగలిగే అవకాశం వచ్చింది” అన్నాడు...

“చాలా సంతోషం భరత్...నన్ను మేమ్ అనకు...అక్కా అను...నీలాంటి వాళ్ళు ఎందరికో స్ఫూర్తి...నువ్వు జీవితంలో ఇంకా పైకి రావాలి...ఎంత ఎదిగినా అమ్మా నాన్నలని మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు” అంది...

“నీ ఫోన్ నెంబర్ ఇవ్వు” అని తీసుకుంది...

“నా నెంబర్ రాసుకో...నా పేరు లక్ష్మీ నందన” అని చెప్పింది..

“మేము హైదరాబాద్ వస్తూ ఉంటాం...మా చుట్టాలు చాలా మంది ఉన్నారు...వచ్చినప్పుడు నీకు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తాము సుమా” అంది నవ్వుతూ...

"తప్పకుండా రండక్కా" అన్నాడు..భరత్ నవ్వుతూ...

అతను వెళ్ళాక...

“నిజంగా ఈ వయసులో ఇంత పరిణితి తో ఉండటం గ్రేట్ కదా” అనుకున్నారు ఇద్దరూ...

తరువాత అప్పుడప్పుడు నందన భరత్ కి ఫోన్ చేస్తూ విశేషాలు తెలుసుకుంటూ ఉండేది...

నందన క్రమంగా చెన్నై లో అడ్జెస్ట్ అవుతోంది...నందన పాపకి కొడుకు చదువుతున్న స్కూల్ లోనే సీట్ కూడా వచ్చింది...

ఈ లోపు వంశీ మేనమామ కూతురి పెళ్లికి రమ్మని.. ఆహ్వానం వచ్చింది...ఇద్దరూ వెళదామని నిశ్చయించుకున్నారు...

వంశీ ఒక వారం సెలవు పెట్టి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాడు...

హైదరాబాద్ లో శ్రీనగర్ కాలనీ లో ఉంటారు వాళ్ళు...

అక్కడే సత్యసాయి నిగమాగమం లో పెళ్లి...

పెళ్లికి అట్టెండ్ అయ్యి పెళ్లి కార్యక్రమాలు అయ్యాకా నందన భరత్ కి ఫోన్ చేసింది...

నందన చెప్పింది ఇలా పెళ్లికి వచ్చినట్టు, అతనింటికి వస్తామని....

“తప్పకుండా అక్కా....మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్తే నేను వచ్చి పికప్ చేసుకుంటాను” అన్నాడు..

నందన వంశీతో మాట్లాడి రోజు, టైం చెప్పింది...

ఆ రోజు నందన చెప్పిన అడ్రస్ కి వచ్చాడు భరత్...తన సొంత కార్ తో...

భరత్ లో మార్పు వచ్చింది...ఒక సంతృప్తి, హోదా మనిషిని మార్చడం సహజం...

భరత్ వంశీ ని, నందనని పిల్లలని తన కార్ లో తీసుకెళ్తుంటే నందన అంది..."నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది భరత్...అంత కష్టపడిన నువ్వు... ఇంకా చాలా వాటికి అర్హుడివి...అవన్నీ పొందాలి నువ్వు"...అంది మనస్ఫూర్తిగా...

ఒక అరగంటలో గచ్చిబౌలి లోని ఒక పెద్ద అపార్ట్మెంట్స్ ముందు ఆపాడు...అంతా గేటెడ్ కమ్యూనిటీ...

“ఇల్లు అద్దె ఇల్లే అక్కా...కొనుక్కోవాలి సొంతిల్లు” అన్నాడు లోపలికి తీసుకుని వెడుతూ...

అంతా బావుంది వాతావరణం అన్ని సౌకర్యాలతో...

‘కొత్తగా కట్టారనుకుంటా’ అనుకుంది నందన...

లిఫ్ట్ లోంచి మూడో అంతస్థులోకి తీసుకెళ్లాడు...వాళ్ళ ఫ్లాట్ ముందు ఆగి బెల్ కొట్టాడు...

భరత్ వ్యాస్ తల్లి తలుపు తీసింది. లోపలికి నందనా వాళ్ళని రమ్మంటూ, తల్లితో అన్నాడు భరత్...

“అమ్మా! నేను చెప్పానే ‘చెన్నై లక్ష్మీ అక్క అని’...తనే” అని చెప్తూ.... నందన వాళ్ళని కూర్చో పెట్టాడు...

తల్లి పెద్దావిడ...కళ గా ఉన్నారు నేత చీరతో...

“కూర్చోండమ్మా” అన్నారు ఆప్యాయంగా...

మా వ్యాసు మీ గురించి చెప్తూ ఉంటాడు అందావిడ...

భరత్ లోపలికి వెళ్ళాడు...

అపార్ట్మెంట్ విశాలంగా ఉంది...

ఇంతలో ఒక రూం లో నుండి ఒక పెద్దాయన భరత్ నాన్నగారనుకుంటా వచ్చారు కళ్ళజోడు పెట్టుకుంటూ...ఇంతలోకి భరత్ నీళ్ల గ్లాసులతో వచ్చి “మా నాన్నగారక్కా” అన్నాడు...

ఆయన వచ్చి ఎదురు సోఫాలో కూర్చున్నాడు...

“నమస్కారమండీ” అంది నందన...

ఆయన చెయ్యి ఎత్తారు ఆశీర్వదిస్తున్నట్టు..

.భరత్ తెచ్చిన నీళ్ల గ్లాసు అందుకుంటూ ఆయన్ని చూసింది నందన....

ఎక్కడో చూసినట్టుందే అనుకోగానే...చటుక్కున గుర్తొచ్చి…”అరె.. మీరు నాకు తెలుసు...భరత్... మీ నాన్నగారిని నేను చూసాను” అంది ఉద్వేగంతో నందన...

"అవునా...ఎక్కడక్కా" అని అడిగాడు ఆశ్చర్యం గా భరత్...

వెంటనే నందన…”బాబాయ్ గారూ మీకు గుర్తుందా.. మీరు హైద్రాబాద్ లోనే హిమాయత్ నగర్ లో మా ఫ్లాట్ కొచ్చారు...మా పక్క వాళ్ళు లేకపోతే, నాకు డబ్బులిచ్చి ఇమ్మన్నారు గుర్తుందా” అని అడిగింది...

ఆయన పరిశీలనగా నందన ని చూసి...

“అవునమ్మా...నన్ను కూర్చోపెట్టి చల్లని మజ్జిగ ఇచ్చావు కదా తల్లీ> నువ్వేనా” అన్నారు ఆయన ఎంతో మందస్మితం గా...

"నేనే నండీ...భలే విచిత్రంగా ఉంది...ఈయన మీ నాన్నగారా భరత్...ఈయన్ని మీ నాన్నగారిగా చూడటం నాకు భలే సంతోషం గా ఉంది” అంది నందన...

భరత్ అర్ధం కాక "ఏంటి నాన్నగారూ” అంటే..

ఆయన చెప్పారు…”అదేరా...వికాస్ కి డబ్బు ఇద్దామని వెళ్ళాను...వాళ్ళిల్లు తాళం వేసుంటే వీళ్ళింటికి వెళ్ళాను...ఈ అమ్మాయి చల్లని తల్లి...ఆ మాట, తీరు నిజంగా లక్ష్మీ దేవే...నాకు సహాయం చేసింది” అన్నారు ఆయన...

నందన అంది "ఏంటి భరత్... అక్కడ ఉన్నది ఎవరు” అని.

భరత్ కూర్చుని చెప్ప సాగాడు...

"మా అక్క ది ప్రేమ వివాహం అని చెప్పా కదక్కా...

కొన్నాళ్ళు బాగానే ఉన్నారు...

తరువాత మా బావ వికాస్ మనస్తత్వం బయటపడింది...

డబ్బు మనిషి...

మా అక్కని మా ఇంటికి కూడా పంపేవాడు కాదు...

'మా అక్క ఎక్కడ మాకు డబ్బు ఇస్తుందో' అని...

నా చదువుకి ముందుగా ఒక లక్ష రూపాయలు వరకూ అవసరం అయ్యింది...

ముందు ఫీజ్ కట్టాలి...తరువాత వాళ్ళు రిఫండ్ చేస్తారు...

నాన్నగారు అక్క పెళ్లి చేసి... చేతిలో పైసా లేకుండా ఉన్నారు...ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందామన్నా ఏదో ష్యురిటీ లేనిదే ఇవ్వరు...ఆ పరిస్థితి లో మా బావని నాన్నగారు ఒక లక్ష రూపాయలు అప్పుగా అడిగారు...

బావ "నో " అన్నాడు...

అక్క ఊరుకోకుండా లక్ష రూపాయలు మాకు తెచ్చిచ్చింది...

బావకి చాలా కోపం వచ్చింది....ఇద్దరికీ బాగా గొడవయ్యింది...

‘నా తమ్ముడికి నేను సాయం చేయకపోతే ఎలా’ అని అక్క...

‘నేను లేదని చెప్పినప్పుడు... నువ్వెలా ఇస్తావ’ని బావ బాగా పొట్లాడుకున్నారు...

అప్పుడు నాన్న అక్కకి, బావకి సర్ది చెప్పారు...

తను తన దగ్గర ఉన్నప్పుడల్లా కొంత కొంత ఇచ్చేస్తానని...

అక్కని కూడా సర్దుకుపొమ్మని...బతిమాలడారు...

అప్పటికి సర్దు మణిగింది గొడవ...

అక్క తనకి ఇష్టం లేకపోయినా మధ్యతరగతి కుటుంబాల సమస్యలు తెలుసు కాబట్టి సర్దుకుపోడానికే ప్రయత్నించింది...

ఆ ప్రాసెస్ లో నాన్నగారు డబ్బు ఇవ్వడానికి వచ్చి ఉంటారు...

నాకు ఇవన్నీ తెలుసు కాబట్టే నేనే ఏదో కష్టపడి, నాన్నగారిని ఇబ్బంది పడకుండా ఉండేలా చాలావరకు చూసుకున్నాను...అక్క ఇచ్చిన డబ్బు మొత్తం అతనికి తిరిగి ఇచ్చేసాం..

అయితే అక్క తరువాత ఎంత ప్రయత్నించినా అతనితో సర్దుకు బ్రతకలేకపోయింది....

నాన్నగారు, అమ్మ ఎంత సర్ది చెప్పినా మా అక్క వినలేదు...

తనే డివోర్స్ కి అప్లై చేసింది...ఒక రెండు నెలలయింది డివోర్స్ వచ్చి...

నాన్నగారికి అమ్మ కీ నేనూ నచ్చ చెప్తున్నాను...ఈ రోజుల్లో ఇలాంటివి చాలా సాధారణం...బాధ పడొద్దని...

ఇప్పుడు విడిపోవడమే మంచిది...పిల్లలు పుట్టాక విడిపోతే ఇంకా సమస్యలు అని...

ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నారు...అన్నాడు భరత్...

ఇంతలో కిచెన్ లోంచి... భరత్ అక్క ట్రే తో వచ్చింది..నవ్వుతూ

పకోడీ ప్లేట్లు అందిస్తూ “నేను భరత్ అక్క శివాన్విత ని…” అంది నవ్వుతూ...

నందన సాలోచనగా 'ఆరోజు నాకు బోకే ని పంపింది మీరేనా' అంది...

"అవును" అంది శివాన్విత...

"వావ్.. ఒకటి తరువాత ఒకటి....ఇన్ని ఆనందకరమైన షాక్ లా నాకు...? ఈ రోజు ఒక అత్యుత్తద్భుతమైన రోజు....! అందరూ అభిమానవంతులు...! గొప్ప ఫైటర్స్… మంచి పరిణీతి ఉన్నవాళ్లు...!

మీరంతా విడివిడిగా తెలుసు… మీ అందరి కష్టం నేను నా కళ్లారా చూసాను… ఇప్పుడు ఒక కుటుంబం గా చూస్తున్నాను...

"ఇంత ఉన్నతమైన వ్యక్తులు నాకు తెలుసు" అనుకుంటే నాకు గర్వంగా ఉంది అంది నందన"...

శివాన్విత అంది... "నేను మీ ఇంటికి వచ్చి మనస్ఫూర్తిగా థాంక్స్ కూడా చెప్పలేదు...నా పరిస్థితులు అటువంటివి నందన గారూ...ఒక పక్క తమ్ముడి చదువు అవలేదు...ఈ పరిస్థితి ల్లో అమ్మానాన్నగారికి, నేను ఒక సమస్య కాకూడదనుకున్నా...తమ్ముడికి నా బాధలు చెప్పుకుంటే వాడు చదువు మీద శ్రద్ద పెట్టలేడని చెప్పుకోలేదు...అతనికి ఎలా ఇష్టమో అలానే ఉండటానికి ప్రయత్నించాను...నన్ను డబ్బు సంపాదించే మిషన్ లా చూడటం,నాకూ ఒక మనసూ, బంధాలు ఉంటాయనిగ్రహించకపోవడం..అన్నీ భరించాను..ఊర్లోనే ఉండి అమ్మానాన్నల అతీ గతీ చూడలేకపోయాను...

నెలకి లక్షవరకు సంపాదిస్తున్న నేను నాన్నగారికి అవసరానికి ఒక లక్ష ఇస్తే అది నేరం అయిపోయింది...దాన్ని నాన్నగారు తిరిగి ఇచ్చేసారు కూడా...ఆడపిల్ల తన తల్లిదండ్రులకి సాయం చేయడానికి కూడా లేకపోతే ఎలా...నన్నూ చదివించారు..నేను ఇలా ఉద్యోగం రాగానే అలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాననుకోండి...పెళ్లిచేసుకుంటే పేరెంట్స్ ని పూర్తిగా మరచి పోవాలా ఆడపిల్ల...?

ఎప్పుడైతే తమ్ముడు తన గమ్యం విజయవంతంగా చేరుకుంటున్నాడు అని తెలిసిందో...ఇక తెగించి నిర్ణయం తీసుకున్నాను...వాడి సపోర్ట్ నాకు పూర్తిగా ఉంటుందని తెలుసు…’లోకం ఏమైనా అనుకోనీ అనుకున్నాను'...

నా తమ్ముడు, అమ్మా నాన్నలతో సంతోషంగా ఉన్నాను ఇప్పుడు...ఒకప్పుడు ఏ డబ్బుకైతే పరితపించామో, ఆత్మగౌరవాన్ని చంపుకున్నామో....అది ఇప్పుడు పుష్కలంగా ఇచ్చాడు దేవుడు మాకు..

నాకు టి.సి.ఎస్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది రీసెంట్ గా...

మేమే నలుగురు పిల్లల్ని చదివించే పరిస్థితి లో ఉన్నాం...

నాన్నగారూ తమ్ముడూ ఎంత కష్టపడ్డారో తెలుసు నాకు...కష్టం విలువ తెలుసు మాకు...తెలియక తప్పటడుగు వేసి సరిదిద్దుకున్నాను అనే అనుకుంటున్నాను…” అంది...శివాన్విత ఉద్వేగంతో...

వెళ్లి తల్లిదండ్రులు పక్కన సోఫా హ్యాండిల్ మీద కూర్చుంది. .

ఇంకోవైపు భరత్ వ్యాస్ కూర్చున్నాడు...

నలుగురూ అద్భుతంగా అనిపించారు.. సహనం తో...తమ పరిస్థితులు అనే "శృంఖలాలని" తెంచుకున్న స్వేచ్ఛా విహంగాల్లా అనిపించారు...

వీళ్ళకి స్వచ్చమైన ప్రేమని అందించే జీవన సహచరులు రావాలి...

అనుకుంది నందన మనస్ఫూర్తిగా...

***శుభం***


237 views1 comment
bottom of page