top of page

సంక్రాంతి లక్ష్మి


Sankranti Lakshmi Written By Neeraja Prabhala

రచన : నీరజ ప్రభల


వేకువనే తొలికోడి కూతతో నిశీధి కౌగిలి నుంచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది రామాపురం. లచ్చమ్మ వాకిలి ఊడ్చి ఆవు పేడతో కళ్ళాపు చల్లి రంగవల్లులను తీర్చిదిద్దింది. ఆ త‌ర్వాత గిన్నె తీసుకుని గొడ్లసావిడి లోకి వెళ్ళి గేదెలకు పాలు పితికి లోపలికొచ్చింది. కాసిని బొగ్గులను కుంపటి పొయ్యిలో వేసి పొయ్యి వెలిగించి ఇత్తడి గిన్నెలో పాలుకాచి ముందే తీసి ఉంచిన కాఫీ డికాక్షన్ తో కాఫీ కాచి, భర్త రంగయ్యకు ఇచ్చి తనుకూడా త్రాగింది. కాఫీ త్రాగిన రంగయ్య తలపాగా చుట్టుకుని, చద్దన్నం మూటగట్టుకొని వంకె కర్ర చేతబూని కిర్రుచెప్పులేసుకుని పొలానికి బయలుదేరాడు. ఆరోజు పొలంలో కుప్ప నూరేరోజు. ఆయన పొలానికి చేరుకున్న కాసేపటికి కూలీలందరూ అక్కడికి చేరుకుని కుప్పనూరే పనిలో నిమగ్నమయ్యారు.

రంగయ్య పొలానికి వెళ్లగానే లచ్చమ్మ ఆవుపేడతో ఇల్లంతా అలికి ముగ్గులు వేసి చల్ల చిలికే పనిలో పడింది. కూతురు సుమను నిద్ర లేపే పనిలో గట్టిగా పిలిచింది. తల్లి కేకలకు నిద్రమత్తు వదిలి సుమ పరుగున వచ్చింది.

"సుమా ! వెళ్ళి ముఖం కడుక్కొని మందార చెట్టు వద్ద ఉన్న ఆవుపేడతో గొబ్బిళ్ళు చేసి, కాస్త పసుపు- కుంకుమ, పువ్వులతో వాటిని అలంకరించి పూజ చేసి బెల్లం నివేదన చేసి వాకిట్లో ముగ్గుల మీద పెట్టు." అంది లచ్చమ్మ. సుమ తల్లి చెప్పినట్టే చేసి ఇంటి పనులు మొదలుపెట్టింది.

ధనుర్మాసం రోజులు. వేకువనే గుడిలో పూజలు. పొంగలి, దధ్ధోజనం పంపిణీ. సుమ తోటి స్నేహితురాళ్లతో కలిసి గుడికి పరుగున వెళ్ళి తీసికెళ్ళిన బాదం ఆకులలో వేడి వేడి పొంగలి, దధ్ధోజనం పూజారి చేత పెట్టించుకుని తిని ఇంటికి వచ్చింది.

రేగిపళ్ళు అమ్మేవాడి కేక విని 'సరికి సరి' చొప్పున ధాన్యం ఇచ్చి రేగిపళ్ళను కొన్నది లచ్చమ్మ. గంగిరెద్దుల వాడు వచ్చి సన్నాయి వాయిస్తుంటే వాడు చెప్పినట్టుగా ఆ ఎద్దు చిందులు వేస్తూ ఉంటే ముచ్చటపడి తిలకిస్తూ తల్లి ఇచ్చిన మానెడు ధాన్యాన్ని , ఒక ధోవతిని తీసుకెళ్లి వాడికిచ్చింది సుమ. వాడు "అమ్మ గారికి దండం పెట్టి దీవించు " అంటే ఆ ఎద్దు తల అటూఇటూ ఆడిస్తూ మోకాలితో వంగి దీవించింది. వాడు ఆ ఎద్దును తోలుకుని వెళ్ళాడు.

కాసేపటికి కాళ్ళకు గజ్జెలు కట్టుకుని నెత్తిమీద పూలతో అలంకరించిన గిన్నెతో హరిదాసు చేతిలో చిడతలు వాయించుకుంటూ హరిభజన చేసుకుంటూ వచ్చాడు. సుమ కాసిని బియ్యాన్ని, కొన్ని కూరలను, పండ్లను తీసుకుని హరిదాసు గిన్నెలో వేస్తే ఆయన " కృష్ణార్పణం " అంటూ చిడతలు వాయిస్తూ పాట పాడుతూ వెళ్ళాడు


ఆ సాయంత్రం ఆ ఊరిలో పిల్లలందరినీ పిలుచుకొని సందెగొబ్బిళ్ళను పెట్టి దాని చుట్టూ పాటలు పాడుతూ పేరంటం చేసుకుంది సుమ. నానబెట్టిన శెనగలను , అరటి పండ్లను, రేగిపళ్ళను అందరికీ పంచింది సుమ. కాసేపటికి నూర్చిన ధాన్యం బస్తాలతో ఎడ్లబండి మీద రంగయ్య పొలం నుంచి రాగానే లచ్చమ్మ ఎదురువెళ్ళి ధాన్యలక్ష్మికి హారతిచ్చి సంతోషంగా ఇంట్లోకి స్వాగతించింది. కూలీలు పురి వేసి అందులో కొంత ధాన్యాన్ని , పెరటిలో పాతర తవ్వి అందులో కొంత ధాన్యాన్ని భద్రపరిచారు. రంగయ్య సుమ చేత ఆ రెండింటికీ హారతిప్పించి పళ్ళెరములో దక్షిణ పెట్టాడు. సుమ సంతోషంగా అందరికీ మిఠాయిలు పంచగా , కూలీలందరూ రంగయ్య వద్ద తమ కూలీని తీసుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళారు.

ఆ మరుసటి రోజు భోగి. లచ్చమ్మ భోగి మంటలు వేసి , సుమకు తలంటు పోసి క్రొత్త బట్టలను వేసింది. ఆ సాయంత్రం ఆ ఊళ్ళో అందరినీ పిలిచి సుమకు భోగిపళ్ళు పోసి పేరంటం చేసింది. పేరంటాళ్ళకు నానేసిన శెనగలను, రేగిపళ్ళను, అరటిపండు, తాంబూలంతో దక్షిణ ఇచ్చింది.

రెండవరోజున సంక్రమణం. ఆరోజున సాయంత్రం అందరినీ పిలిచి సుమ చేత బొమ్మలకొలువు పెట్టించి, బొమ్మలకు హారతిప్పించి పేరంటం చేసి ముత్తైదువులకు యధావిధిగా దక్షిణ తాంబూలాలను ఇచ్చింది. మూడవ రోజున కనుమ. పశువుల శాల లోని పశువులను పసుపు-కుంకుమ ,పువ్వు లతో పూజించి హారతిచ్చింది లచ్చమ్మ. రంగయ్య పలుగు, పార, నాగలి, గొడ్డలి, ఎడ్లబండి మొ... వాటిని పూజించాడు. ఆ సాయంత్రం ఆ ఊరి లోని ముత్తైదువులందరూ బొమ్మలకొలువుకు పాటలు పాడి హారతిచ్చి‌ , పాలల్లో అటుకులను వేసిన దానిని నివేదన చేసి ఆ ఊరి పెద్ద కాలువలోకి అందరూ ఊరేగింపుగా వెళ్ళి ఒక బొమ్మను పాటలు పాడుతూ ఓలలాడించి ఆ నివేదన ప్రసాదాన్ని అందరూ ఆరగించి తమతమ ఇళ్ళకు సంతోషంగా వెళ్లారు.

అందరూ తమ తమ కుటుంబాలలో పిత్రృదేవతలను తలుచుకుని తమను చల్లగా చూడమని పెద్దగుమ్మడి కాయను ,స్వయంపాకంతో బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలను ఇచ్చి సత్కరించారు.

ఆ మరుసటి రోజు ముక్కనుమ. ఆ రోజున 'ఎక్కడికీ ప్రయాణం మంచిది కాదు' అంటారు పెద్దలు. ఈ నాలుగు రోజులూ అత్తారింటికి వచ్చిన క్రొత్త అల్లుళ్ళు అరిశెలు, చక్కిరాలు మొ...ఆరగించి భార్య తో, మరదళ్ళతో సరదాగా గడిపారు. మావగారు పెట్టిన క్రొత్త బట్టలను కట్టు కొన్నారు..అందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ ఆనందంతో వేడుకగా జరుపుకున్నారు.

అలా రామాపురంలో ప్రతి గడప పచ్చని తోరణాలు, పాడిపంటలతో, ధాన్యలక్ష్మీ, సంక్రాంతి లక్ష్మి లతో కళకళ లాడుతూ ఆనందం తో విరాజిల్లుతున్నది.

ఇలా కలకాలం పిల్లా పాపలతో,ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి లతో , సిరిసంపదలతో తమ తమ లోగిళ్ళు కళకళలాడుతూ ఉండాలని అందరూ సంక్రాంతి పురుషుడిని ప్రార్థించారు.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


రచయిత్రి పరిచయం :

"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు. బ్రాంచి పోస్ట్ మాస్టర్. వ్యవసాయ దారుడు. పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల. గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని .చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గ్రృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు .మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ... ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను .నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి.గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ....నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం...అయినది. నాకు నా మాత్రృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏



334 views5 comments
bottom of page