top of page

శాంతి నికేతన్


'Santhi Nikethan' New Telugu Story
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

సూర్యోదయాన పక్షుల కిలకిలా రావాలు, కోకిల కుహు కుహూలు శ్రావ్యంగా వినిపిస్తుంటే నిద్ర లేచి కనులు తెరిచి ఎదురుగా ఉన్న దేవుని పటానికి రెండు చేతులూ జోడించి నమస్కరించి హాలులోకి వచ్చింది రాధమ్మ.


అంతక్రితమే నిద్రలేచి తన కాలకృత్యాలను పూర్తి చేసుకుని పాతకాలం నాటి పడకుర్చీలో కూర్చుని ఉన్న భర్త రాఘవయ్యగారిని చూసి చిరునవ్వుతో "మీరు నిద్ర లేచి ఎంత సేపయిందండీ? అయ్యో! నాకివాళ ఆలశ్యంగా మెలకువ వచ్చింది. మీతోపాటే నన్ను లేపచ్చుగా!" అంది రాధమ్మ.


" హాయిగా పడుకుని మంచి నిద్రలో ఉన్న నిన్ను లేపబుద్ది కాలేదు. నిద్రలో కూడా నీవు ఎంత అందంగా ఉన్నావో తెలుసా "? అన్నారు రాఘవయ్యగారు చిరునవ్వుతో భార్యను చూస్తూ.


"చాల్లేండి! మీ కబుర్లు. ఎవరన్నా వింటే నవ్విపోతారు. మనమేమన్నా క్రొత్త దంపతులమా?" అంది రాధమ్మ.


"ప్రేమానురాగాలకు వయసు అడ్డం రాదోయ్! ప్రేమించే మంచి హృదయం ఉంటే చాలు. జీవితమంతా స్వర్గమే" అన్నారు రాఘవయ్యగారు.


"మీరు ప్రక్కన ఉంటే నాకెప్పుడూ స్వర్గమే నండి. మీలో సగం నేనే. " అంది అనురాగంగా రాధమ్మ.


"మన తనువులు వేరైనా మన మనసులు మాత్రం ఒకటేనోయ్!" అన్నారు రాఘవయ్యగారు ప్రేమగా.


భర్త మాటలకు, తనపై ఆయనకున్న ప్రేమకు మనసులో లోలోపల సంతోషంగా ఉన్నా పైకి మాత్రం అది బయటపడకుండా క్రొత్త పెళ్లికూతురిలా సిగ్గు పడిపోతూ పెరటిలోకి వెళ్లి తన పనులను పూర్తి కానిచ్చి వంటగదిలోకి వెళ్లింది రాధమ్మ. కాసేపటికి చిక్కటి కాఫీ కలిపి తీసుకొచ్చి భర్త చేతికందించి తనూ కాఫీ త్రాగుతూ ప్రక్కన కూర్చుంది.

"నీ చేతిన కాఫీ కూడా అమృతంగా ఉంటుందోయ్!" అన్నారు రాఘవయ్యగారు. ఆయన వైపు నవ్వుతూ చూసింది రాధమ్మ.


" రాధమ్మగారూ ! మన ఆశ్రమంలో ఈరోజు కూరగాయలమ్మిన పైకమిదిగోనమ్మా" అని తన కొంగుకు కట్టిన ముడిలోంచి పైకం తీసి ఆవిడ చేతికందించింది లక్ష్మి. దాన్నందుకుని భర్త చేతికి ఇచ్చింది రాధమ్మ.


ఆ తర్వాత యాదయ్య వచ్చి "అయ్యగారూ ! ఇదిగోనయ్యా ! ఈ వారం పండ్లను అమ్మిన తాలూకు రొక్కం " అంటూ కొంత డబ్బును చేతికివ్వగా దాన్నందుకున్నాడు రాఘవయ్య గారు. ఇదే విధంగా ఆ ఆశ్రమంలో నివశించే రకరకాల చేతివృత్తుల పనివాళ్లు కూడా వాళ్లు తయారుచేసిన ఉత్పత్తులను సంతలో అమ్మి వారాంతంలో ఆ డబ్బును ఆయనకు అందిస్తారు. వాటినంతటినీ ఒక మొత్తంగా డిపాజిట్ చేసి అక్కడ ఉండే వాళ్లందరికీ కావలసిన నిత్యావసర వస్తువులను, తిండిగింజలను, వైద్య సదుపాయాలను సమకూరుస్తారు రాఘవయ్య గారు. వాళ్లందరికీ ఏ కష్టం వచ్చినా ఆ దంపతులు కొండంత అండగా ఉండి వాళ్లని ఆదుకుంటారు.


కాసేపు ఏవో సరదా సంభాషణలతో గడిపి అమెరికాలో ఉంటున్న మనవడు ధీరజ్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు రాధమ్మ దంపతులు. వారాంతంలో అతను తప్పకుండా ఫోన్ చేసి వీళ్ల యోగక్షేమాలను తెలుసుకుంటాడు. ఇంతలో ఫోన్ రింగవగా లిఫ్టు చేసిన రాఘవయ్యకు " హలో! తాతా! మీరు, బామ్మ ఎలా ఉన్నారు ? మీ ఆరోగ్యం ఎలా ఉంది ? మన ఆశ్రమంలో వాళ్లందరూ బావున్నారా?" అంటూ కుశలప్రశ్నలు అడిగాడు ధీరజ్. ఆతర్వాత ఆశ్రమంలో వాళ్లకి ఏమేం కావాలో అన్నీ కనుక్కుని బామ్మతో కూడా చాలా సేపు మాట్లాడి తండ్రి చేతికి ఫోనిచ్చాడు.


"హాయ్! నాన్నా! ఎలా ఉన్నారు? " అంటూ కాసేపు తల్లితో కూడా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు సతీష్.


"వాళ్లతో మాట్లాడినట్టే లేదు" అనుకున్న రాధమ్మ మనసు గతస్మృతులలోకి వెళ్లింది. ఆ దంపతులది మధ్యతరగతి కుటుంబం. రామాపురంలో పెద్దలిచ్చిన ఇంట్లో ఉంటూ, ఉన్న ఎకరం భూమిని సాగుచేసుకుంటూ ఏకైక కొడుకు సతీష్ ను కష్టపడి పెంచి పెద్దచేసి పట్నంలో ఇంజనీరింగ్ ను చదివించారు. కాంపస్ సెలక్షన్స్ లో మంచి ఉద్యోగాన్ని పొందిన సతీష్ తను ప్రేమించిన వనజను రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడు. పెద్ద మనసుతో ఆదంపతులు వాళ్లిద్దరినీ దీవించారు. కొన్ని నెలల తర్వాత తను పనిచేస్తున్న కంపెనీ ద్వారా సతీష్ అమెరికా ప్రయాణపు ఏర్పాట్లు చేసుకుని భార్యతో అమెరికా వెళ్లాడు.


ఎన్నో ఆశలతో ఒక్కగానొక్క కొడుకు సతీష్ ను పెంచి పెద్దచేసి అతను తమ కళ్లముందే భార్యాబిడ్డలతో ఇండియాలోనే ఉంటూ తమను కనిపెట్టుకుంటాడు అని ఆశపడిన ఆదంపతులకు కొడుకు అమెరికా ప్రయాణం చాలా నిరాశను కల్లించింది. తల్లి తండ్రులంటే ఏ మాత్రం ప్రేమాభిమానాలు లేకుండా ఏదో నిమిత్తమాత్రం అన్నట్టు ప్రవర్తించే అతని ప్రవర్తన మనసుకు బాధను కల్గించినా, కోడలన్నా కలివిడిగా ఉంటే చాలనుకున్నారు. స్వతహాగా తెలివైన వనజ 'అరటి పండుని చేతిలో పెట్టినట్లు' వీళ్లతో మాట్లాడుతుందే కానీ చేతలు మాత్రం శూన్యం. మూడేళ్ల కొకమారు వచ్చే కొడుకు, కోడలి రాకకోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేవాళ్లు రాఘవయ్య దంపతులు. వాళ్లు ఉన్నన్ని రోజులు ఆ దంపతులకు పండుగరోజులు.


కొన్నాళ్లకు సతీష్ దంపతులకు అమెరికాలో ధీరజ్ పుట్టాడు. మనవడు పుట్టాడన్న శుభవార్తను విని ఆ ఊరిలో అందరికీ స్వీట్లు పంచి సంతోషాన్ని పంచుకున్నారు రాఘవయ్యావాళ్లు. వీలు కుదిరినప్పుడు ధీరజ్ ను వీడియోకాల్ చేసి చూపించేవాళ్లు సతీష్ వాళ్లు. మూడేళ్ల కొకమారు తల్లి తండ్రులతో వస్తున్న ధీరజ్ ను చూసి ముచ్చటపడేవాళ్లు రాధమ్మావాళ్లు.


కాలం సాఫీగా గడిచిపోతోంది. ధీరజ్ పెరిగి పెద్దయి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యాడు. అతనికి తాతా, బామ్మలంటే చాలా ప్రేమ. పల్లెలన్నా, అక్కడ నివశించే వాళ్ల జీవనవిధానమన్నా, వాళ్ల స్వచ్ఛమైన ప్రేమ అన్నా చాలా ఇష్టపడే ధీరజ్ ప్రతిసం…క్రమం తప్పకుండా రామాపురం వచ్చి తాతాబామ్మలతో సంతోషంగా గడపడం అలవాటు. వనజ, సతీష్ లు తల్లితండ్రుల వద్దకు రావడం క్రమేపీ తగ్గించారు. అది చాలా బాధను కల్గించినా ధీరజ్ ప్రేమాప్యయతలు, అతని రాకపోకలు ఆ బాధను కాస్త తగ్గించింది.


ఆరేళ్ల క్రితం సతీష్ అక్కడి పొలాన్ని, ఆ ఇంటిని అమ్మేయమని తండ్రిని ఒత్తిడి చేశాడు. వాటిని అమ్మగా వచ్చిన దానిలో కొంత డబ్బుని పట్నంలో ఏదైనా వృధ్ధాశ్రామానికిచ్చి అక్కడే తన తల్లి తండ్రులను ఉంచాలన్న సతీష్ ఆలోచనకు రాఘవయ్య దంపతులు ససేమిరా ఇష్టపడలేదు. తను పుట్టిపెరిగిన ఆ ఊరన్నా, అక్కడి ప్రజలన్నా రాఘవయ్యకు ప్రాణం. కడదాకా అక్కడే ఉండి ఆ మట్టిలోనే కలిసి పోవాలని ఆయన కోరిక. తాతకు మద్దతుగా ధీరజ్ నిలబడి తండ్రికి నచ్చచెప్పి ఆఆలోచనను విరమింపచేశాడు.


తన బామ్మాతాతల కోసం, ఆ ఊరిజనుల సుఖసంతోషాల కోసం అతను తోటి ఎన్నారై మిత్రుల సాయం తీసుకుని తమ పొలంలోని కొంత భాగంలో అన్ని వసతులతో ఒక ఆశ్రమాన్ని కట్టించి దానికి 'శాంతి నికేతన్ ' అని పేరు పెట్టి బామ్మాతాతలను అందులో ఉండమని కోరాడు. తోడుగా నిరుపేదలుండేందుకు ఆ ఆశ్రమంలోనే వాళ్లకు ఉచితవసతిని ఏర్పాటు చేసి వాళ్ల జీవనభృతి కోసం చేతివృత్తులు, కూరగాయలు, పంటల సాగుని ఏర్పాటు చేశాడు. వాటి మార్కెటింగ్ కోసం తన మిత్రుల సాయంతో కొంత డబ్బుని వెచ్చించి, విరాళాలను సేకరించి, జిల్లా అధికారులతో సంప్రదించి ఆ ఊరికి రవాణా సదుపాయాలను కల్పించాడు. ఆ ఊరి జనుల కోసం ఒక హాస్పిటల్ ను, పిల్లల చదువులకోసం ఒక హైస్కూలును, కాలేజీని ఏర్పాటు చేశాడు. ఉచిత విద్య, వైద్య సదుపాయాలను పొందుతూ అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆఊరిలో అందరికీ ఏదోవిధంగా ఉపాధి ఉంది. అక్కడ అందరూ సమానులే.


మేలురకం జాతి పాడిగేదెలను కొని వాటి పాలను అమ్ముకునేందుకు పాలకేంద్రాన్ని ఏర్పాటుచేశాడు ధీరజ్. గోబర్ గ్యాస్ ద్వారా అందరికీ గ్యాస్ వసతిని, సోలార్ విద్యుత్ ని ఏర్పాటుచేశాడు. ఆధునిక వ్యవసాయ విధానంతో పంటలను బాగా పండించుకునేలా ఏర్పాట్లు చేశాడు. ఆ ఊరికి ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఏర్పడింది.


ప్రతి సం… ధీరజ్ ఆ ఊరికి వచ్చి అక్కడ కొన్నాళ్లు ఉండి తాతాబామ్మలతో పాటు, అక్కడి వాళ్ల యోగక్షేమాలను కనుక్కుంటూ వాళ్లకు కావలసినవి ఏర్పాట్లు చేస్తున్నాడు. పచ్చదనం - పరిశుభ్రతలను గురించి వివరిస్తూ, విద్యావేత్తలు, రాజకీయ నాయకులను ఆ ఊరికి పిలిపించి వారి ఉపన్యాసాలను, అవగాహనా సదస్సులను ఏర్పాటు చేసి ఆ ఊరివారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాడు. వారికోసం వయోజన విద్యాకేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు.


ఇప్పుడు రామాపురం అభివృధ్ధి చెందిన ఆదర్శ గ్రామంగా ఉత్తమ అవార్డును కూడా పొందింది. ఆ ఊరి ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఏదో అలికిడికి ఉలిక్కిపడి గతస్మృతులనుంచి తేరుకున్న రాధమ్మ నెమ్మదిగా వంటగదిలోకి వెళ్లింది.


కాలం గడుస్తోంది. ధీరజ్ చేసిన మంచిపనులకు రాఘవయ్య దంపతులు సంతోషంతో పొంగిపోతూ తమ శేషజీవితాన్ని తృప్తిగా గడుపుతున్నారు. తమకోసం, తమ ఊరి జనుల సుఖసంతోషాల కోసం అహర్నిశలు పాటుపడుతున్న ధీరజ్ నిండునూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నారు రాఘవయ్య దంపతులు, ఆ ఊరి పురజనులు.


కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు. రెండేళ్ల తర్వాత వనజ అకస్మాత్తుగా హార్ట్ఎటాక్ తో నిద్రలోనే తనువు చాలించింది. జరిగిన దారుణానికి సతీష్ తల్లడిల్లాడు. విషయం తెలిసి ధీరజ్, రాఘవయ్య దంపతులు చాలా వ్యధ చెందారు. ధీరజ్ వెంటనే అమెరికా వెళ్లి తన తల్లిని ఆఖరి చూపు చూసి తల్లికి జరగవలసిన కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. నాలుగు రోజులు అక్కడే ఉండి తండ్రిని ఓదార్చి " నీవు ఇక్కడ ఒంటరిగా ఉండద్దు. నీవు నాతోపాటు మన ఊరికి రా! తాతాబామ్మలు నీ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మనమందరం ఒకేచోట హాయిగా, ప్రేమగా ఉందాము " అని చెప్పాడు. సతీష్ అందుకు అంగీకరించి ధీరజ్ తో ఆ ఊరికి వచ్చాడు.


చాలా సం…. తర్వాత కొడుకుని చూసిన ఆనందంతో రాఘవయ్య దంపతులు పొంగిపోయి సతీష్ ను ఆప్యాయంగా, ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు. సతీష్ మనస్సు కూడా కాస్త తడిఅయి కళ్లు చెమర్చాయి. మనసు పరివర్తన చెందగా తల్లితండ్రుల పాదాలకు నమస్కరించి "మీకు ఇన్నేళ్లూ దూరంగా ఉండి మిమ్మల్ని బాధపెట్టినందుకు నన్ను క్షమించండి" పశ్చాత్తాపంతో అన్న సతీష్ ను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు ఆ దంపతులు. "ఇదంతా మన ధీరజ్ వలననే సాధ్యమైంది" అని మనవడిని పిలిచి ముద్దిచ్చారు. ధీరజ్ సంతోషించాడు.


క్రొన్నాళ్ల తర్వాత తన దూరపుబంధువులలో ఒక మంచి అమ్మాయి సుమతో ధీరజ్ కు ఆ ఆఆశ్రమంలోనే పెళ్లి జరిపించారు సతీష్, రాఘవయ్య దంపతులు. ఆరోజు ఆ ఆశ్రమంలో అందరికీ వస్త్ర దానం, అన్నదానాన్ని ధీ‌రజ్ దంపతుల చేత జరిపించారు రాఘవయ్యగారు. అందరూ సంతోషంగా ఆ క్రొత్త దంపతులను ఆశీర్వదించారు. స్వతహాగా కలుపుగోలుతనం కలిగిన సుమ తన మంచితనంతో ఇంట్లోనే వాళ్ల మనసులనే కాక, ఆశ్రమంలో అందరి మనసులను ఆకట్టుకుంది. ఆమెని అందరూ "చిన్నమ్మ గారూ" అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. ధీరజ్, సుమలు అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. వాళ్ల ప్రేమకు గుర్తుగా రెండు సం…. తర్వాత పండంటి కొడుకును కన్నది సుమ. వాడికి "సంతోష్" అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు.


చిన్నారి సంతోష్ చక్కగా పెరుగుతూ తన ముద్దు ముద్దు మాటలతో, బుడిబుడి అడుగులతో అందరినీ అలరిస్తున్నాడు. నిత్యం తమ కనులముందే తిరుగుతున్న మనవడు, మునిమనవడిని చూస్తున్న ఆనందంతో రాఘవయ్య దంపతులు సంతోషంతో పొంగిపోతూ ఆభగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

ఇప్పుడు ధీరజ్, అతని మిత్రులు ఆ చుట్టుప్రక్కల మరికొన్ని గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ది చేసే ఆలోచనలతో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు.


ధీరజ్ లాగా అందరూ ఆలోచించి, వాటిని ఆచరణలోకి తెచ్చి అమలుచేస్తే ప్రతి కుటుంబం బావుంటుంది. తద్వారా గ్రామం, రాష్ట్రం, క్రమేణా దేశం అభివృద్దిచెంది ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా ఉంటారు. దేశం రామరాజ్యంలా సుభిక్షంగా ఉంటుంది.

సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


Twitter Link

https://twitter.com/ManaTeluguKatha/status/1632358063356379137?s=20


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
59 views0 comments

Comments


bottom of page