top of page

శాంతి నిలయం
'Santhi Nilayam' written by U. Vijaya Sekhar reddy

రచన : U . విజయశేఖర్ రెడ్డి

అమ్మా! పుట్టిన రోజు శుభాకాంక్షలు... “ అంటూ ఫోన్లోనే కరతాళ ధ్వనులు వినిపించాడు మురళి. అప్రయత్నంగా శాంతమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. అవి ‘ఆనంద భాష్పాలో.. ఆవేదన భాష్పాలో..’ అని శాంతమ్మ భర్త రాఘవయ్య విస్మయంగా చూడసాగాడు. శాంతమ్మ విప్పారిన ముఖంలో ఆమె కంటి బిందువులు ముత్యాల్లా మెరిసిపోతూండడంతో.. అవి ఆనందభాష్పాలే అని ఊరటచెందాడు.

“బాబూ మురళీ.. నువ్వైనా గుర్తు పెట్టుకున్నావు. నాకు అంతే చాలు. నా కడుపు నిండి పోయిందిరా.. చాలా సంతోషంగా ఉంది” అంటూ కడకొంగుతో కళ్ళు తుడుచుకోసాగింది.

“సారీ అమ్మా.. నన్ను క్షమించు. నీ పుట్టిన రోజంతా మన ఇంట్లోనే గడపాలనుకొని రాత్రే బయలు దేరాను. కాని చిన్న అవాంతరం వచ్చింది. తప్పనిసరి పరిస్థితిలో ఉండిపోయాను. మధ్యాహ్నంకల్లా వస్తాను. నాన్నకొక సారి ఫోనివ్వమ్మా” అన్నాడు.

“ఏమండీ.. మురళి ఫోన్..”అంటూ రాఘవయ్యకు ఫోన్ అందజేసింది.

”హలో నాన్నా...వసారాలోకి వచ్చి మాట్లాడండి” అంటూ మురళి కాస్త నెమ్మదిగా అన్నాడు.

“ఆ.. ఇప్పుడు చెప్పు”

“నాన్నా.. మీరు టిఫిన్ చేసి అర్జంటుగా కావ్య నర్సింగ్ హోంకు రండి”.

“ఏంట్రా .. ఏం జరిగింది” అంటూ ఆతృతగా అడిగాడు.. మురళికేమైనా అయిందా అన్నట్లుగా.

“కంగారేమీ లేదు నాన్నా.. అమ్మ అయితే ఇంకా భయపడుతుందని మీకు చెబుతున్నాను. నాకేం కాలేదు. అయాం ఓకే. మీరు టిఫిన్ చేసి రండి. వచ్చాక చెబుతాను”.

“అలాగే” అంటూ రాఘవయ్య ఫోన్ కట్ చేసి డైనింగ్ హాల్లోకి దారి తీసాడు. శాంతమ్మ అప్పటికే వేడి వేడి ఇడ్లీలు వడ్డించి రాఘవయ్య కోసం చూస్తోంది.

రాఘవయ్యా టిఫిన్ చేస్తూ.. “శాంతా నేనలా బయటికి వెళ్లొస్తాను. మురళి ఒక పని చెప్పాడు. వీలైతే ఇద్దరం కలిసి భోజనం వేళకు వచ్చేస్తాం..” అన్నాడు.

“మురళి దగ్గరకి.. వెళ్ళండి. వాడు పనిలో పడి భోజనం కూడా మర్చి పోతాడు. దగ్గరుండి తీసుకురండి” అంది శాంతమ్మ.

“అలాగే” అని బయటకు వచ్చి ఆటోను పిలిచి కావ్య నర్సింగ్ హోంకు చిరునామా చెప్పాడు. ఆటో ముందుకు వెళ్తుంటే అతని ఆలోచనలు వెనక్కి వెళ్ళసాగాయి.

రాఘవయ్యకు బాల్యం నుండి పర్యావరణ పరిరక్షణ అంటే ప్రాణం. ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. ‘ప్లాస్టిక్ సంచులు వద్దు.. కాగితపు సంచులే ముద్దు’ అనే నినాదంతో ఒక పరిశ్రమ స్థాపించాడు. తన కాళ్ళ మీద తాను నిలబడుతూ పది మందికి ఉపాధి కల్పించాడు. కాలగమనంలో ఇద్దరు కొడుకులు కలిగారు. తాను పనుల ఒత్తిడివల్ల పిల్లలపెంపకాన్ని పట్టించుకోలేదు. శాంతమ్మ ముద్దు చేసిన పర్యవసానం.. ఆస్తి పంపకాల వరకూ వెళ్ళింది. ‘అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదు’ అనే నానుడి నిజమయ్యింది. కొడుకులు కాదనుకున్నప్పుడు.. కోడండ్లకు పుల్లలు పెట్టే శ్రమతప్పింది. ఇల్లూ.. పరిశ్రమ రెండు ముక్కలయ్యాయి. రాఘవయ్య హృదయం

వెయ్యివక్కలయ్యింది. శాంతమ్మను తీసుకొని కట్టుబట్టలతో స్వగ్రామంలో స్థిరపడ్డాడు.

​ రాఘవయ్య నాన్నగారు సంపాదించిన పెంకుటిల్లు.. దాని వెనుకాల విశాలమైన పెరడు. చేద బావి. పెరడులో సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు పండిస్తూ పట్టణానికి సరఫరా చెయ్యడం.. మళ్ళీ విరామము లేని జీవనమే..

“సర్.. నర్సింగ్ హోం వచ్చింది..” అంటూ ఆటో డ్రైవర్ అనేసరికి తేరుకున్నాడు రాఘవయ్య. డ్రైవరుకు డబ్బులిచ్చి హాస్పిటల్లో అడుగుపెట్టాడు.

నాన్నకు ఎదురుపడి “నాకేమీ కాలేదు నాన్నా.. చెప్పానుగా” అన్నాడు మురళి.

అయితే విషయమేమిటన్నట్లు రాఘవయ్య కళ్లతో అడిగే సరికి.. చూపిస్తాను అన్నట్లు చేతి కర్ర సాయంతో నడుస్తూ రాఘవయ్యను తీసుకొని ఎమర్జెన్సీ హాలు వైపు నడిచాడు. కిటికీ గుండా హాల్లోని దృశ్యం చూసి రాఘవయ్య కొయ్యబారి పోయాడు. ఇంతవరకు తాను కనీ వినని.. ఊహకందని దృశ్యం. కావ్య నర్సింగ్ హోం అధినేత డాక్టర్ కరుణ తన రక్తాన్ని ఒక పేషంటుకిస్తోంది.

“నాన్నా..” అని రెండు సార్లు తట్టి పిలిస్తే గాని రాఘవయ్య దృష్టి మరల్చుకోలేకపోయాడు.

“నాన్నా.. నేను అమ్మ పుట్టిన రోజని కొన్ని పనులు పోస్ట్ పోన్ చేసుకొని బయలుదేరాను. కూకట్ పల్లి బస్ స్టాఫ్ వద్ద అప్పుడే ఆక్సిడెంట్ జరిగినట్లుంది. ఒక పెద్దావిడ రోడ్డుపై రక్తపు మడుగులో పడిఉంది. జనం మనకేంటి.. పోలీసులు చూసుకుంటారన్నట్లుగా చూస్తూ వెళ్ళిపోతున్నారు. వెంటనే కారు పక్కకాపాను. అంబులెన్స్ వచ్చేసరికి ఆలస్యమవుతుందని.. దగ్గరలో ఉన్న ఈ నర్సింగ్ హోంలో చేర్పించాను. రాత్రి రెండు బాటిల్స్ రక్తం ఎక్కించారు. మరో బాటిల్ అవసరమయ్యింది.. కాని దొరకలేదు. డాక్టర్ కరుణదీ అదే గ్రూప్ కావడంతో రక్తమిస్తోంది”

“ఒకే గ్రూపు రక్తమయినప్పటికీ డాక్టరు తన రక్తమివ్వడం.. చాలా ఆశ్చర్యంగా ఉందిరా..”

“అవును నాన్నా.. ఆమె చాలా సహృదయురాలు” అన్నాడు మురళి.

ఇరువురు కలిసి క్యాంటీన్‍కు దారి తీసారు. కాసేపు ఇంటి కబుర్లు చెప్పుకొని తిరిగి హాస్పిటల్‍కు వచ్చారు. డాక్టర్ కరుణ నుండి కబురొచ్చింది. డాక్టర్ గదిలోకి వెళ్తూనే..“డాక్టర్.. వీరు మా నాన్నగారు.. రాఘవయ్య” అంటూ పరిచయం చేసాడు మురళి. రాఘవయ్య రెండుచేతులా నమస్కరించాడు.

“మీరు పెద్దవారు. ఆశీర్వదించాల్సిన చేతులు” అంటూ వినయంగా కరుణ ప్రతినమస్కారం చేసింది.

“నేను నమస్కారం చేసింది.. ఒక మానవతా మూర్తికి. ఒక డాక్టరు తన రక్తమివ్వడమనేది సామాన్యమైన విషయం కాదు. మీకు నాహృదయపూర్వక అభినందనలు” అన్నాడు రాఘవయ్య. “డాక్టర్ నేనొక సారి ఆ తల్లిని చూసొస్తాను” అంటూ మురళి అనుమతి అడిగాడు.

“రాఘవయ్యగారు.. నన్ను అంతగా పొగడకండి. నాకిది మామూలు విషయం. నా పుట్టినరోజుతో బాటుగా.. అప్పుడప్పుడు రక్తం దానం చేస్తూనే ఉంటాను. నాది చాలా అరుదైన గ్రూపు.. దొరకడం చాలా కష్టం. అయినా మీ అబ్బాయి చేసే మంచి పనుల ముందు నేనిప్పుడు చేసిన పని గొప్పదేం కాదు” అంది కరుణ.

“మా మురళి ముందే తెలుసా..!” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రాఘవయ్య.

కరుణ చిన్నగా నవ్వుతూ.. తెలుసన్నట్లు తలూపింది. “మురళి తన జీతంలో నుండీ ప్రతీ నెల సగభాగం అనాధాశ్రయానికి దానం చెయ్యడమూ తెలుసు. నాకు పరిచయమయ్యింది ‘శాంతి నిలయం’ అనాధాశ్రయంలోనే. నేనూ తరచుగా శాంతి నిలయానికి వెళ్తాను. అక్కడి వారికి పరీక్షలు జరుపుతాను. వారికి కావాల్సిన మందులకు ఖర్చు మురళి సర్దుతుంటాడు. శాంతినిలయంలో విద్యార్థులకు యూనిఫాంలు కొనివ్వడం.. పరీక్షలకు ఫీజులు కట్టడం.. మురళి దాతృత్వం చూస్తుంటే.. అలాంటి స్నేహితుడు ఉన్నందుకు చాలా గర్వపడుతుంటాను” అంటూ మురళిని పొగడసాగింది కరుణ.

“ఔను.. డాక్టర్.. వాడి మనసు అమృతమయం. దాతృత్వం హిమాలయం. జనం బాధలు చూడలేడు. వాడూ ఒకప్పుడు అనాధ” అనగానే విస్తుపోయింది కరుణ.

“ఔనమ్మా.. మురళి మా స్వంత కొడుకు కాదు. కన్న కొడుకులకన్నా మిన్న. మా కొడుకులు మమ్ములను కాదనుకొని దూరంగా ఉంటున్నా.. మమ్ములను విడిచి మురళి.. మురళిని విడిచి మేమూ క్షణకాలం కూడా ఉండలేము. ఇది ఏనాటి అనుబంధమో..! మురళి ఆరేళ్ళప్రాయంలో స్పృహ తప్పిన స్థితిలో మా ఇంటి ముందు దొరికాడు “మురళి గురించి పోలీసు స్టేషన్లో రిపోర్టు చేసాం. ఎవరైనా వస్తే మురళిని అప్పగిస్తామని.. అంతవరకు మా వద్దనే ఉంటాడని భరోసా కలిగించాం. మురళికి రెండు కాళ్ళూ చచ్చుపడి పోయాయి. సరిగ్గా నిలబడలేని పరిస్థితి. ఇక నడువలేడనే కారణమో.. ఏమో..! ఎవరూ రాలేదు.. మేము ఆర్థోపెడిక్ డాక్టరు సలహాలతో.. లేపనాలు.. వ్యాయామాలు.. బలానికి టానిక్కులూ.. వాడాం. మా శ్రమ ఫలించింది. ఆ దేవుని దయవల్ల కర్ర సాయంతో నడిపించగలిగాం” అని చెబుతూ చెమ్మగిల్లిన కళ్ళను తుడ్చుకోసాగాడు రాఘవయ్య.

“మీరు మాలాంటి డాక్టర్లకంటే గొప్పవారు. మానవత్వంలో మహనీయులు..” అంటూ కరుణ మర్యాద పూర్వకంగా లేచి వచ్చి రాఘవయ్య పాదాలనంటింది.

రాఘవయ్యకు అనుమానమేసింది. అతని ఊహల్లో.. కరుణ మదిలో మురళి ఉన్నట్లనిపించి ఎంతో సంతోషమేసింది.

“డాక్టర్.. ఆమెకు మెలకువ వచ్చింది. తన పేరు సావిత్రి అని.. కొడుకు ఇంట్లో నుండి గెంటి వేస్తే.. శాంతినిలయంలో చేరుదామని బయలుదేరితే.. ఏదో వాహనం ఢీ కొట్టి వెళ్లిందని చెబుతోంది” అన్నాడు మురళి.

“ఓకే.. మురళీ.. వారం రోజులు నా పర్యవేక్షణలో ఉంచుతాను. ఆ తరువాత శాంతినిలయంలో చేర్పిద్దురుగాని..” అని అంటూ ఇద్దరు కలిసి సావిత్రిని చూడ్డానికి వెళ్ళారు.

మురళితో “కరుణ గురించి నీ అభిప్రాయం” అన్నాడు రాఘవయ్య.

“మనిషికి నడక కాదు ముఖ్యం నడత అంది కరుణ. అలా మా పరిచయం పెళ్లిదాకా వచ్చింది నాన్న! ఈవిషయం ఈ రోజే మీకూ అమ్మకు చెప్పాలనుకున్నాను” అన్నాడు మురళి.

మురళి పెళ్లి గురించి తపించే శాంతమ్మను.. ‘శాంతి నిలయం’ ఊరట కలిగించిందని రెక్కలు గట్టుకొని ఆమె ముందు వాలి ఈ విషయం చెప్పాలని తహ, తహలాడసాగాడు. కాని మురళిని అధికారికంగా దత్తత చేసుకున్న వేళ అనాధలకు ఆశ్రయం కల్పించాలనే తలంపుతో తన భార్య పేర ‘శాంతినిలయం’ స్థాపించిన విషయాన్ని తన కడుపులోనే దాచుకున్నాడు రాఘవయ్య.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత పరిచయం : యు.విజయశేఖర రెడ్డి

మన తెలుగు కథలు.కామ్ సంపాదకులకు నమస్కారములు ప్రభుత్వ రంగ సంస్థలో సీనిర్ అసిస్టెంట్‌గా పనిచేసి 2014 సంవత్సరంలో పదవి విరమణ చేశాను.రచనా రంగంలో ఇప్పటివరకు 200 కథలు పలు దిన,వార,మాసపత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇవి కాకుండా కార్టూన్లు,వ్యాసాలు,వివిధ ప్రక్రియలలో రచనలు సుమారు 750 వరకు ప్రచురింపబడ్డాయి.
575 views2 comments

2 Comments


Santhi nilayam story chala bagundi

Like

శాంతి నిలయం కథ బాగుంది

Like
bottom of page