'Sapavimochana' New Telugu Story
written By Kalanos
రచన: కాలనోస్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
కుక్క కి ఉన్న విశ్వాసం మనుషులకెక్కడ అని అంటారు కొందరు మనుషులు.
ఓ కుక్కగా చెబుతున్నా.. మా కుక్కలకి విశ్వాసం, అవిశ్వాసం అనే పదాలు అర్థమే కావు. మరి ఇది నాకెలా తెలుసని ఆలోచిస్తున్నారా? నేనో స్పెషల్ కుక్కని!
ఒకప్పుడు నేను కూడా మీకు లాంటి ఓ మనిషినే. కానీ కుక్కలని రాళ్ళతో కొట్టానని శపించబడ్డాను. నేను కూడా ఓ కుక్కలా మారి నా తప్పు తెలుసుకుంటే నాకు శాపవిమోచనం కలుగుతుంది. నేను చేసిన తప్పులన్నీ తెలుసుకున్నా కానీ ఇంకా నేను మనిషిలా మారలేదు. ‘నా తప్పులను నేను తెలుసుకున్నా..’ అని నేను ఆకాశం వైపు చూసి రోజుకో పది సార్లైనా చెప్తాను. కానీ లాభం లేదు! నాకీ కుక్క బతుకు అలవాటు కూడా అయిపోతోంది. మెల్లెగా ఇదే బాగుందని అనిపిస్తుందేమో అని భయంవేస్తూ ఉంటుంది అప్పుడప్పడు.
ఇప్పుడు అలవాటయినప్పటికీ మొదట్లో బాగానే కష్టాలు పడ్డాను. ముందుగా నా మాట పడిపోయింది. నాకు మనుషుల భాష అర్థమయినప్పటికీ, మనుషులకి నా భాష ఇప్పుడు అర్థమవ్వదు. నేను స్పెషల్ కుక్కని కాబట్టి నాకు మనుషుల భాష, వెరే కుక్కల కంటే బాగా అర్థం అవుతుంది. వీధి కుక్కలు మనుషుల మధ్య పెరగడం వల్ల కొన్ని పదాలు అర్థం చేసేసుకుంటాయి. కానీ నాకు వాళ్ల సంభాషణలు స్పష్టంగా అర్థమై పోతాయి. నిజానికి నేను కుక్కగా మారిన కొత్తలో వాటితో ఎలా మాట్లాడాలని భయపడ్డాను. కానీ నేను కుక్కగా మారగానే నా భాష కూడా ఆటోమాటిక్ గా కుక్క భాషగా మారిపోయింది.
కుక్కలకి కూడా అంత యూనిటీ ఏమీ ఉండదు. ఈ వీధి కుక్కలకి పక్క వీధి కుక్కలతో పడదు. ప్రతీ వీధికి ఓ లీడర్ కుక్క ఉంటుంది. ఈ లీడర్లు అందరు ఇంకో బాస్ కి రిపోర్ట్ చేయాలి. పది నుండి పదిహేను వీధులు అడ్డా అనబడతాయి. ఈ లీడర్లు ఆ అడ్డా లీడర్ కే రిపోర్ట్ చేస్తాయి. వీధి కుక్కలక్కి వాటితో వాటికి పోటీ ఉన్నప్పటికీ, అడ్డా కి ఏదైనా సమస్య వస్తే అన్నీ ఏకం అవుతాయి.
ఈ రోజు నేను ఓ అడ్డాకి లీడర్ అయ్యాను. అవ్వడం అంత ఈజీ ఏమీ కాదులేండీ! నా మనిషి తెలివితేటలు చాలానే వాడాల్సి వచ్చింది. ఇది చేయడానికి నా స్వార్థం కూడా ఉంది. ఓ వీధి కుక్క, అడ్డా కి ఏదైనా సమస్య వస్తే కానీ ఇంకో వీధి లోకి అడుగు పెట్టకూడదు. కానీ అడ్డా లీడర్ ఆ అడ్డా లోని ఏ వీధిలోనైనా అడుగు పెట్టవచ్చు.
నేను మనిషిగా ఉన్నప్పుడు నా ఇల్లు ఇంకో వీధిలో ఉండేది. నేను కుక్కగా మారాక ఇంకో వీధిలో సెటిల్ అయ్యను. నా ఇంటికి దగ్గరలో ఉండాలని ఈ అడ్డాకే లీడర్ అయ్యాను. ఈ వీధిలో ఉన్న కుక్కలు, నా ఇంట్లో ఉంటున్న అతను చాలా మంచివాడని, ఎప్పుడు ఏదో తినడానికి పెడతాడు అని చెప్పాయి.
అదేదో ప్రత్యక్షంగా చూద్దాం అని నేనూ వెళ్లాను. అవి చెప్పినట్టే నన్ను చూసి అతను నాకు బ్రెడ్ పెట్టాడు. నా ఇంటిని చూడగానే నా గతం గుర్తుకొచ్చి బాధేసింది. కుక్కల పైన రాళ్ళెయ్యకుండా ఇలా బ్రెడ్ పెట్టి ఉంటే నేను ఇప్పటికీ ఇంకా ఓ మనిషిగా ఉండేవాడినని అనుకున్నాను.
బహుశా ఈ మాట నేను బయటకనుకున్నానేమో. నా ఇంట్లో ఉంటున్న అతను నన్ను ఆశ్చర్యంగా చూసాడు. నా భాష ఇతనికెలా అర్థమైందని నేనూ ఆశ్చర్యంగా తిరిగి చూసాను.
“మనుషులని కరిచానని నన్ను శపించి మనిషిగా మార్చారు. నా బాధెవరికి చెప్పుకోను?” అని అన్నాడు.
---0---
కాలనోస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
---0---
రచయిత పరిచయం: కాలనోస్
పరిచయ వాక్యాలు- నేను Children's Hospital of Philadelphia లొ Data Analyst గా పని చేస్తున్నాను. నేను తెలుగు మరియూ ఇంగ్లీష్ లో కథలు వ్రాయడం ఇష్టపడతాను. నేను వ్రాసిన మొదటి తెలుగు కథ 'డ్రైవింగ్ స్కూల్' సెప్టెంబర్ 2019 లో ఆంధ్రజ్యోతి లొ ప్రచురింపబడింది. సెంటిమెంట్ నా రెండవ కథ.
Comments