top of page

సరస్వతి



'Saraswathi' written by Vaddadi Ravikanth Sarma

రచన :వడ్డాది రవికాంత్ శర్మ

" ఏవండీ కాఫీ తీస్కోండి ........" సుశీల చేతిలో కాఫీ ఉంది కానీ మోహంలో చిరునవ్వు లేదు .

"అక్కడ పెట్టు ..." " అక్కడ అంటే ???"....... మనసు బాగాలేనప్పుడు , రోజు చేసే పనులు కూడా కొత్తగానే ఉంటాయి , కొత్త ప్రశ్నలు లేవనెత్తుతామని సుశీలకి ఈమధ్యే తెలుస్తోంది .

" టేబుల్ మీద ...."

దశాబ్దం అవుతోంది , తాను చేతికి కాఫీ ఇస్తే తిరిగి చిన్న చిరునవ్వు ఇస్తూ .....

'సుశీలా ఎప్పుడు పనేనా .... మీ ఆయన వస్తే కాసేపు కూర్చో రాదూ..." అని సరసంగా తనపక్క కుర్చీలో కుర్చోబెట్టుకొని ....

" మీ చేతిలో పెట్టేసాను .... చూ స్కోలేదేమో ...." అని వాక్యం పూరించే లోపు ......." టోప్..... మని శబ్దం "

కాఫీ కప్పు చేయిజారి కింద పడింది ..... రంగనాథ్ కి సుశీల మీద కోపం రాలేదు.

' పాతిక రూపాయల కప్పు పొతే పోయింది , మరి నా హృదయం .... పాతికేళ్ల ప్రాయంతో ఇంట్లో గజ్జల సవ్వడితో ....... ఆవేశంలో ఏవేవో ఆలోచిస్తూ , తెల్లటి రంగుతో ప్రకాశించే ఆయన మొహం ఎర్రగామారింది '

" అయ్యో .... సారు రిటైర్మెంట్ కి దగ్గరకొచ్చారే " అని మురిపంగా కాస్త కోపముతో సెటైర్ వేసే సుశీలకీ కోపం రాలేదు .... ఇంట్లో సంతోషంతో తిరిగే గాజుబొమ్మ పగిలి చాల ఏళ్ళు దాటిపోయాయి... గాజు కప్పు ముక్కలు ట్రే లోకి వేస్తూ సుశీల మౌనంగా ఏడుస్తోంది ....

చదువుకున్న వాడు , స్థితప్రజ్ఞుడు కాబట్టి తనని తాను తమాయించుకుని వాట్స్ అప్ ఓపెన్ చేసాడు రంగనాథ్ మాస్టారు ...... సమయం పదిగంటల యాబైనిమిషాలు ...... పదకొండు గంటలకి జూమ్ వీడియో కాల్ లో పదవతరగతి బాలికలకు సాంఘిక శాస్త్రం క్లాస్ చెప్పాలి అతడు . ఈరోజే కాదు కరోనా లేకపోయిఉంటే కస్తూర్బా స్కూల్ లో బోర్డు తుడుస్తూ , గోడకి మాత్రమే తప్ప ఎవ్వరికి కనపడకుండా తన కన్నీళ్లు తుడుచుకునే వాడు రంగనాథ్ .

" అమ్మాయిలూ.... కేంద్రప్రభుత్వం నూతన విద్యా విధానం తీస్కొచ్చింది..... మీ తరానికి ఏది చేరువ అవుతుందో అవ్వదో నాకు తెలీదు కానీ , ఇది కనుక అమలైతే రేపు మీ కడుపున పుట్టబోయే ఆడబిడ్డలకు శాశ్వతంగా మంచి రోజులు వచ్చినట్టే ...." పిల్లలు ఆశ్చర్యపోతున్నారు , రంగనాథ్ మాస్టర్

పూనకం వచ్చినట్టు విద్యావిధానం పైన క్లాస్ చెప్తుంటే ..... సాధారణంగా సర్ అలా ఉండరు , ఒక తండ్రిలాగా మొదటి పది నిముషాలు వాళ్ళ మంచి చెడ్డలు అడిగి , కొన్ని జోక్స్ చెప్పి వాళ్ళ మొహంపై నవ్వులు పూయించాక క్లాస్ చెప్తారు .....ఈరోజు ఏంటో , ఇంత ఆవేశం , ఆవేదనతో చెప్తున్నారని వింతగా చూస్తున్నారు పిల్లలు .

" 5 + ౩ + ౩ + 4 "..... బడాబాబుల స్కూళ్లలో మీకు ఇక పనిలేదు , మీ తరువాతి తరం మొదటి ఐదేళ్లు హాయిగా తెలుగులోనే చదువుకుంటారు , మీరు ఇప్పటితో చదువు ఆపేసినాసరే మీ పిల్లలకి తృప్తిగా ఐదేళ్ల వరకు చదువు చెప్పగలరు , మీరే కాదు రిక్షా తొక్కుకునే వాళ్ళు , కూరగాయలు అమ్ముకునే పెద్దమ్మలు కూడా హాయిగా ట్యూషన్ టార్చెర్ లేకుండా , వేలకు వేలు సమర్పించుకోకుండా మొదటి ఐదేళ్లు బిడ్డలకు తామే చదువు చెప్పుకో గలరు ....

"తరువాత మూడేళ్లు వృత్తి విద్య , ఇంకో మూడేళ్లు నైపుణ్యం , ఆఖరు నాలుగేళ్లు ఉన్నత విద్య ..... ఫీజుల దోపిడీ ఉంటే కోర్సు మధ్యలోనే చదువు ఆపేయచ్చు , మీకు సర్టిఫికెట్ ఇస్తారు , కనీసం పదివేలతో ఏదయినా ఫ్యాక్టరీ లో చిన్న ఉద్యోగం ఉంటుంది ...... ఎంట్రన్స్ టెస్టుల గోల ఉండదు . మీరు హాయిగా నిద్రపోవచ్చు , మీ అమ్మానాన్నలాగా , మీ పుస్తెలమ్మి పిల్లలతో పరీక్షలు రాయించాల్సిన ఖర్మ పట్టదు ........."

రంగనాథ్ చాలా భావోద్వేగానికి లోనయ్యారు . వ్యవస్థని కడిగిపారేస్తూ , తనజీవితంలో దెబ్బతిన్నవాడు కాబట్టి , ఆడపిల్లల మంచి చెడ్డలు తెలిసినవాడు కాబట్టి , రికార్డు అవుతుంది అన్న స్పృహలేకుండా చెడా- మాడా లోపాల్ని మొహమాటం లేకుండా ఎట్టి చూపుతున్నాడు .

" పుస్తకాల బరువొద్దు , పరీక్షల టెన్షన్ వద్దు , హాయిగా చదువుకోండి ....... ఎంట్రన్స్ టెస్టులకి చెల్లు చీటీ రాబోతోంది , ఒక్క పరీక్షా ..... ఒకేఒక్క పరీక్షతో మంచి సీట్లు వస్తాయి ..... నా బిడ్డలాగా రేపు మీ బిడ్డలు ........"

అశ్రునయనాలతో తన లాప్టాప్ ని మూసేసి , క్లాస్ లోనుండి అర్దాంతరంగా బయటకి వచ్చేసాడు రంగనాథ్ . ఆయన ఒకప్పుడు డి ఈ ఓ . అంటే జిల్లా విద్యాశాఖాధికారి . తాను ఆదర్శంగా ఉండి , జిల్లా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశ్యంతో ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు . స్కూల్ లో చెప్పనివి తనే ఉపాధ్యాయుడిగా మారి ఇంట్లో చిట్టితల్లికి నేర్పించి , అన్ని విద్యలలో నేర్పరిగా తయారు చేసాడు .

' నాన్న ... నువ్వు పిల్లలకి పాఠాలు చెప్తావ్ కదా ...'

' అవును తల్లి '.....

' మరి జ్వరం వస్తే పిల్లలు క్లాస్ కి రాలేరు కదా ...'....

' అవునురా బుజ్జి .... ' కూతురు నుదిటిమీద ముద్దాడి , మురిపంగా చూసాడు . వాళ్ళ అన్యోన్యాన్ని చూసి పక్కనే ఉన్న భార్య సుశీల , కూతురే అయినా సరే చిట్టితల్లిమీద కుళ్లుగాఉండేది ఆవిడకి .

' కాబట్టి వాళ్ళ జ్వరాన్ని తగ్గించే డాక్టర్ ని అవుతాను నాన్న , అప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళకి నువ్వు క్లాస్ చెప్తావు , జ్వరంగా ఉన్నవాళ్ళకి తగ్గించి నేను వాళ్ళని మాములు చేసి నీ క్లాస్ కి పంపిస్తా ,,,,ఎలా ఉండి నాన్న న ఐడియా అన్నది ..'

' నా బంగారం కదా......అంతే అందంగా వుంది' అని మళ్ళీ ముద్దుపెట్టాడు రంగనాథ్ . అలా మొదటి తరగతి చదివే రోజుల్లోనే వైచుకున్న ఆ జ్ఞానపుష్పం , తన వయసుతో పాటు , అంటే అందంగా ఎదుగుతూ , మంచి మంచి విషయాలు నేర్చుకుంటూ విద్యా సౌరభాలను వెదజల్లుతూ పెరిగింది .

ఇంటర్మీడియట్ ప్రతి మనిషి జీవితాన్ని మలుపుతిప్పుతుంది , మంచివైపో , చెడువైపో .... ఆ ఒత్తిడిని , పోటీ చదువుల పేరుతో బట్టి పద్దతిని తట్టుకోలేక రెండు మూడు సార్లు ఇంటికి వచ్చేసి ' నాన్నా , అది నరకంలా వుంది ..... చదువు తప్ప ఇంకేమి లేదు , నేను వెళ్ళాను నాన్న ,,,ఇక్కడే వుంది మీతో పాటు చదువుకుంట అని బ్రతిమాలాడింది చిట్టి ....'

ఎంత సంస్కరణ వాది అయినాసరే ప్రపంచంతో పాటు ముందుకెళ్లాలని , కాస్త మనసు మార్చుకుని ' లేదు తల్లి , జస్ట్ రెండు సంవత్సరాలు ఓపిక పట్టు ,

ఎంట్రన్స్ టెస్ట్ రాసి మెడికల్ సీట్ సంపాదించు .... తర్వాత నీకు కావాల్సినట్టుగా , ఎక్కడ సీట్ వస్తే అక్కడకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటా ....

హ్యాపీ గా మళ్ళీ మనం చదువుకోవచ్చు' అంటూ భుజం తట్టి హాస్టల్ కి పంపేవాడు . తప్పు జరిగిపోయింది ,,,,,ఇక్కడే ,,,,,

ఒత్తిడిని ఎలాగోలా జయించి , తొమ్మిదివందల మార్కులతో ఇంటర్ పాస్ ఐపోయింది చిట్టి . తండ్రి అబద్దం చెప్పాడు . రెండేళ్లు చదివితే ఈ నరకం ఉండదు అన్నారు , కానీ అసలు తలనొప్పి ఇప్పుడే మొదలైంది , ఒకటా, రెండా పదమూడు రకాల ఎంట్రెన్స్ టెస్టులు రాయాలంట.... సమయం ఏమో కేవలం మూడు నెలలు , ఒక్కో సెంటర్ ఒక్కో చోట , ఢిల్లీ నుండి చెన్నై దాకా

....... చూడడానికి చాల సింపుల్ గా కనిపించే ఈ విషయం , స్వేచ్ఛగా పెరిగి , చదువేకాకుండా , సృజనాత్మకతతో ఉండే చిట్టిలాంటి పిల్లలకు భూమిపై నరకంలాంటి స్థితి అది . పన్నెండు టెస్టులు రాసేసింది , పదిరోజుల్లో రిసిల్ట్స్ ఇస్త్తున్నారు , తన సామజిక , ఆర్థిక విభాగాల్లో పెట్టిన కట్ ఆఫ్ మార్కులకు తాను చేరుకోలేక అన్నిటిలోను విఫలం ఐంది . గెలవడమే తప్ప ఓటమి ఎరుగని చిట్టి , అర్థం చేసుకొని చదవడమే తప్ప , మార్కులకోసం బట్టివేయలేని ఆమె బుర్ర చాలా కంగారుపడిపోయి , తాను ఎందుకు పనికిరాని దాన్ని అనే న్యూనతతో నిండి పోయింది .

' ఏంట్రా చిట్టి ! చిన్నప్పటినుండి అన్నిట్లో నీదే ఫస్ట్ , ఏంటి హాస్టల్ లో సరిగ్గా చదవట్లేదా .....' తండ్రి సున్నిత విమర్శ...' లేదు నాన్న ! బాగానే రాస్తున్న అనుకున్నా....అదేంటో ఒక్కదాంట్లోనూ సీటు రావట్లేదు ...'

' మరేం పర్వాలేదు , పోటీ అలావుంది , రేపటిపరీక్ష బాగా రాసేయ్ ....సీట్ అదే వస్తుంది .... కానీ బిడ్డా .... ఇందులో కూడా రాకపోతే మళ్ళీ ఏడాది లాంగ్ టర్మ్ తీసుకోవాలి , వచ్చే బ్యాచ్ వాళ్లతో కలిసి పోటీ పడాలి ..... కాస్త కష్టపడవమ్మా అంటూ కొంచం గరుగ్గా మాట్లాడాడు రంగనాథ్ '... కూతురిపై కోపంతోటో , నమ్మకం లేకో కాదు , ఇలా రెచ్చగొడితే , స్పోర్టివ్ గా తీసుకోని గతంలో గెలవడం తనకి గుర్తుంది . కానీ బాల్యానికి , కౌమారానికి ఉన్న తేడాను ఆక్షణం అతడు మర్చిపోయి ప్రవర్తించాడు .

" షిట్ !..... 90 మార్కులు వస్తే ఆఖరి సీట్ దక్కేది .......... వెయిటింగ్ లిస్ట్ లో తనపేరు ముందు వుంది , 89 .75 మార్కులొచ్చాయి చిట్టితల్లికి ....." కళ్ళవెంట నీరు ఎడతెగని గంగలా ప్రవహిస్తోంది , కూతుర్ని ఓదారుస్తున్నాడే కానీ , లోపల ఆలోచనల సుడిగుండం తిరుగుతోంది రంగనాథ్ లో .....

" ఇలా జరగకూడదే...."

" నా కూతురు వారంనుండి ఇంట్లోనే వుంది ..... తిండి నిద్ర కలిపి నాలుగు గంటలు తప్ప , మిగతా ఇరవై గంటలు చదువుతూనే వుంది "

" నా సామాజిక వర్గం వేరేది ఐతే బాగుండు "......" నా గ్రహచారం ,చెట్టుకి అంటిందేమో " చదువుకున్నవాడు , శాస్త్రీయవాది , చాలా ప్రాక్టికల్ గా ఆలోచించే రంగనాథ్ , తన చిట్టి ఓటమిని తట్టుకోలేక చాలా మామూలు మధ్య తరగతి పేరెంట్ లాగా ఆలోచిస్తూ , ఇంకో పక్క చిట్టిని ఓదారుస్తూ కొన్ని గంటలు గడిపాడు రంగనాథ్ .

' నాన్నా చాలా చక్కగా చెప్పారు , లాస్ట్ ఎక్సమ్ కదా , బాగా చదవమని ...... పుట్టిన దగ్గర్నుండి , అన్నీ ఇచ్చారు , నేర్పించారు , అన్న -అక్క లేరు కాబట్టి అన్నీ తానై చూసుకున్నారు ....'

ఏంకాదులే అమ్మా, ఇంకో ఏడాది తీస్కో , మళ్ళీ రాయి , నాలాగా డిగ్రీ ఆపేసి పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది , పొద్దున్నే లేచి నాన్నతో మాట్లాడి ఒక నిర్ణయానికొద్దాం చిట్టీ....అని ఆవులిస్తూ నిద్రలోకి జారుకుంది సుశీల .

' కాలేజీ లో సార్లు కూడా బాగా క్లాస్ చెప్పే వారు , సుస్మిత ,గీత , వనితా అందరు సీట్స్ సంపాదించారు , అంటే నా పేరెంట్స్ , టీచర్స్ , ఫ్రెండ్స్ అంతా సరిగ్గానే ఉన్నారు , ఒక్క నేను తప్ప ....' ఇంక చాలు , వీళ్లెవరికి న్యాయం చేయలేని ఈ జీవితం వొద్దు ... సారీ నాన్నా ...మిస్ యూ అని చిన్న లేఖ రాసి తన తనువు చాలించింది చిట్టీ .

" చిట్టీ ..........!!" హృదయవికారంగా గావుకేక పెట్టాడు రంగనాథ్ . విగతజీవిగా పడివున్న తనజీవన విరించిని చూస్తూ , ఆమెని తాకబోయేలోపు , తండ్రిగా గత ఏడాదిగా తాను చేసిన తప్పులు గుర్తొచ్చి ఆగిపోయాడు .

' సుశీలా ...... బిడ్డ కార్యక్రమాలు నువ్వే కానివ్వు ....... ఈ చేతులతో నేనే దాన్ని చంపేసాను .. ముందునుండి ఈ విద్యావిధానాన్ని అది ఇష్టపడలేదు ...... నా పేరుకు , తృప్తికోసం , నేనే ఒత్తిడిచేసి .......'

భర్తకు ఎదురుచెప్పలేదు సుశీల . డిగ్రీకుడా చెప్పించకుండా తనకి పెళ్లిచేసి మానసికంగా , డిగ్రీలకు మించి చదవాలి , తనకు పేరు తేవాలనే స్వార్థంతో తన చిట్టిని శారీరకంగా చంపేశారు . తప్పు భర్త రంగనాథ్ ది కానే కాదు , కేవలం బిడ్డమీద ప్రేమ తో కాస్త ఆదమరిచి ప్రవర్తించాడు తాను. తప్పు వ్యవస్థది. ఆలోచనల అలలు ఒడ్డుకుచేరి ప్రశాంతంగా చల్లారిన తరువాత , ఈ

ప్రపంచంలోకి వచ్చాడు రంగనాథ్ . కళ్ళు తుడుచుకుని , ఫోన్ కాల్ మాట్లాడి రేపటి కార్యక్రమానికి ఒకే చెప్పేసాడు .

' సరస్వతి విద్యామందిర్ '............ కేవలం యాభైమంది ఆడపిల్లలకు పదవతరగతి దాకా ఉచిత విద్య , నివాస వసతితో పాటు , పీజీ పూర్తి చేసేదాకా ఆ హాస్టల్ లోనే ఉండే అవకాశం ఇస్తున్న సంస్థ అది .' సరస్వతి విగ్రహ ఆవిష్కరణ ' అని ఆహ్వానపత్రంలో ఉంటే , సరస్వతి మాతది అనుకున్నారు అంతా... కానీ అది చిట్టిది .చిట్టితల్లి అసలు పేరు ' సరస్వతి '.

' చదువుల తల్లి సరస్వతి అంటూ మా ఆవిడ కొలుస్తుంది , నా చిట్టీ బాగా చదువుతుంది కాబట్టి తనకి సరస్వతి కటాక్షం ఉందని మురిసిపోయేది ....... అంటే ఆ చదువులతల్లి గా కొలువబడే సరస్వతి అంశ నాతల్లిలో ఉన్నట్లే కదా ...... అందుకే ఆమె ప్రతిరూపంగా , నా చిట్టి విగ్రహాన్ని పెట్టాను ' విజ్ఞులైన పెద్దలు తప్పు ఉంటే మన్నించాలి అంటూ విగ్రహంపై పాలాభిషేకాన్ని చేస్తూ అన్నాడు రంగనాథ్ .

' లేదు సర్ .... సరస్వతికి ప్రతిరూపం గా మీ అమ్మాయిని చేసి విగ్రహం పెట్టారు , మీ కూతుర్ని చూసే చూపుతోనే మాకు పాఠాలు చెప్తున్నారుకదా ..... ఆమె అంశతో మమ్మల్ని సొంతబిడ్డలుగా భావించి ఆశీర్వదించండి అంటూ అక్షింతలు ఇచ్చారు ' ' ఇష్ట కార్యా ఫలసిద్ధి రస్తు...' ఆ జంట పెరిగిన బాధ్యతతో తమ కూతురి యాభై ప్రతిరూపాల్ని ఓపిగ్గా దీవించి , కంటినిండానిద్రపోయారు ఆరాత్రి . మర్నాడు నుండి కాఫీ కప్పు పగల లేదు , రఘనాథ్ కళ్ళు చేమడ్చలేదు, ఎటుచూసినా చిట్టి కనిపిస్తుంటే ఇంక వెలితి ఎక్కడిది వారిద్దరికి.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

రచయిత పరిచయం :

వడ్డాది రవికాంత్ శర్మ , సివిల్ సర్వీసెస్ అభ్యర్థి , ఖమ్మం నగరం , తెలంగాణ రాష్ట్రము .

తెలుగు , ఆంగ్ల సాహితీ ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొంటాను .


యువకవిగా అనేక రాష్ట్ర, జాతీయ , అంతర్జాతీయ పోటీలు , సమ్మేళనాలు , సంకలనాలలో చోటు సంపాదించుకోగలిగాను . సామాజిక దృక్పధం , శాస్త్రీయ చింతన , జాతీయవాదం , సాంస్కృతిక పునరుజ్జీవనం , స్త్రీవాద కోణాలలో రచనలు చేయడం ఇష్టం .


కేవలం సాహిత్యమే కాక అభివృద్ధి రాజకీయాలు , ఆర్ధిక ,న్యాయ , అంతర్జాతీయ విశ్లేషణలు , శాస్త్రీయమైన వ్యాసాలు , చర్చలలో పాల్గొన్న అనుభవం , ఆసక్తి ఉన్నాయి .

పై అంశాలపై ఆసక్తి ఉన్న పెద్దలు , మిత్రులు ravikanthsharma 9 @ gmail . com లో సంప్రదించవచ్చు .


1,092 views3 comments
bottom of page