'Sathamanamu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'శతమానము' తెలుగు కథ
రచన : సుదర్శన రావు పోచంపల్లి
వసంత పూర్ణిమ సకల ఐశ్వర్యాలతో తులతూగుచున్న వృద్ధ ముత్తైదువ- భర్త సౌత్రామణి భానువు కాని ఇప్పుడు 90 ఏండ్లు దాటిన అపరదిశాంబరమణి- ఇద్దరు ఆదర్శ దంపతులు- సంప్రదాయాలను గౌరవించి పాటించేవారు- పెళ్ళినాటి మంగళ సూత్రము భార్య మెడలో ఎట్లున్నదో ఆ నాడు పెండ్లి కుమారుడుగా ధరించిన ఉంగరము ఇంకా చేతి వ్రేలికి తొడిగే ఉంచుతాడు సౌత్రామణి భానువు.
నలుగురూ ఆడపిల్లలే- వరుసగా భారతి- హారతి- ఇందుమతి-, హైమవతి. అందరికీ పెళ్ళిలయి ఎవరి అత్తవారింటికి వారు పోతారు- మనుమలు మనుమరాండ్లు కూడ. ఐతె తల్లి దండ్రులు వృద్ధులైనందున నలుగురిలో ఎవరో ఒకరు తప్పకుండా వీరిదగ్గర ఉండవలసిందే ఉంటుంటారుకూడ.
ఒక నాడు చిన్న కూతురు హైమవతి బజారుకు పోతూ తన పుస్తెలు తీసి గూటిలో పెట్టి పోతుంది- తల్లి వసంత పూర్ణిమ కంట్లో పడుతుంది. ‘ఎంత అపచారం- ఎంత అపచారం’ అనుకుంటూ కూతురు రాగానే చీవాట్లు పెడుతుంది “తల్లీ! నువ్వు చేసిన పనేమిటి” అని-
“నీ పేరే ఆ మంగళగౌరి ఐన పార్వతి పేరు- భర్త ఆయుస్సుకు రక్షణగా ఉండే ఆ మంగళ సూత్రాన్ని ఎట్టి పరిస్థితిలోను తీయగూడదమ్మా. అది ఎంతో తప్పు” అంటుంది.
“అమ్మా! అంత చిన్నదానికే ఇంత కోపమెందుకమ్మా- ఈ రోజుల్లోనైతె కొందరమ్మాయిలు పెళ్ళినాడొకనాడే ఉంచుకొని ఆ మంగళ సూత్రాన్ని ఎక్కడో పడేస్తారు- గాజులుండవు, బొట్టుండదు, మట్టెలుండవు, ముక్కుపుల్లా ఉండదు- చీరలు లంగా హోణీలు కూడా బరువే. వాళ్ళు బ్రతుకుతులేరా?” అని ఎదురు ప్రశ్న వేస్తుంది హైమవతి.
“అవును. నాకీ ముసలితనాన ఉన్మాదమెక్కువై నిన్ను కోప్పడుతున్నాను- మీరంటే ఈ కాలపు పిల్లలు చదువుకున్నారు- లోకాన్ని చూస్తున్నారు. మాలాంటివాళ్ళు చెప్పినా బుర్రకెక్కించుకోలేనంత చదువుకున్న వారైతిరి” అంటుంటె “మళ్ళీ అదేమి నిష్టూరమమ్మ.. సరెలే, ఇక నుండి నీ మాటనే వింటానమ్మ” అని తల్లి మెడలో రెండు చేతులేసి చిన్న పిల్లలా చెబుతుంది హైమవతి.
వెంటనే గూటిలో పెట్టిన మంగళ సూత్రము తీసి మెడలో వేసుకుంటుంది హైమవతి. -
“సరెనమ్మా! నీ పనులన్నీ ముగించుకొని రా. నేనొక కథ చెబుతాను” అంటుంది వసంత పూర్ణిమ. “ఐనా తోటివాండ్లు తొడ కోసుకున్నరు గదా అని మనము మెడ కోసుకుంటమా- నీ ప్రవర్తన నాకు నచ్చలేదు” అంటుంది హైమవతితో తల్లి వసంతపూర్ణిమ.
ఒక గంటలో పనులు ముగించుకొని “ఇక చెప్పమ్మా ఆ కథ ఏమిటొ” అనుకుంటూ తల్లి చెంతన కూర్చుంటుంది హైమవతి.
“కథ చెబుతాను, ఓపికగా విను” అంటూ- “పూర్వము మన దేశాన్నేలిన రాజులలో హరిశ్చంద్ర, నలోరాజ, పురుకుత్స, పురూరవ, సగర, కార్తవీర్యార్జున షడైతే షట్ చక్రవర్తి అని ఆర్గురు పేరెన్నికగల చక్రవర్తులుoడేవారు- వారిలో హరిశ్చంద్రుడు మహా సత్య నిరతుడు కావడము చే సత్య హరిశ్చంద్రుడు అని పేరు వచ్చింది.
హరిశ్చంద్రుని సత్యమెంత గొప్పదో పరీక్షించుదామని విశ్వామిత్రుడను ఋషి హరిశ్చంద్రుని దగ్గరకు వచ్చి కొంత సొమ్ము ఈయమంటాడు- హరిశ్చంద్రుడు సరె అని వాగ్దానము చేస్తాడు- విశ్వామిత్రుడు అప్పుడే ఆ సొమ్ము గైకొనక రాజ్యములో కరువు కాటకాలు వచ్చి ధనాగారములో సొమ్ము అయిపోయిందని తెలిసి, అప్పుడు తనకిచ్చిన వాగ్దానము నెరవేర్చమంటాడు-
ఈ మాట నిలబెట్టుకొను క్రమములో హరిశ్చంద్రుడు తన రాజ్యము కోల్పోవుటే కాక ప్రాణానికి ప్రాణమైన, గర్భవతియైన భార్య చంద్రమతిని, కాల కౌశికుడను నాతని దగ్గర దాసిగా అమ్మి తాను వీరబాహుడను నాతని దగ్గర కాటికాపరిగా చేరుతాడు. కొంతకాలానికి చంద్రమతి ప్రసవించి లోహితాస్యుడు అనబడే కొడుకును కంటుంది.
కొడుకు కొంత పెద్దవాడై కాలకౌశికుని శిష్యులతో అడవికి పోతాడు- దురదృష్టవశాన అక్కడ పాముకాటుకు గురై మరణిస్తాడు లోహితాస్యుడు.
చంద్ర మతికి ఈ వార్త తెలిసి మిగుల దుఃఖిస్తది- కొడుకు కొరకు పోతానంటె యజమాని భార్య పనులన్ని పూర్తి చేసి పొమ్మని ఆజ్ఞాపిస్తది- చేసేది లేక అర్థ రాత్రివరకు పనులు ముగించుకొని కొడుకు శవదహనానికి శ్మశానము పోతుంది- అంతరాత్రి దహన ఏర్పాట్లు చేస్తుంటె కాటి కాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు కాటి సుంకము చెల్లించనిదే దహనానికి వీలు లేదంటాడు-
చంద్రమతి విలపిస్తూ తన వద్ద సొమ్ము లేదంటుంది- అప్పుడు కాటి కాపరైన హరిశ్చంద్రుడు
దళమౌ పయ్యెదలో నడంగియు సముద్యత్కాంతులీరెండలన్
మలియింపన్ దిశల్ ద్వదీయ గళ సీమన్ బాల సూర్య
కలితంబై వెలుగొందుచున్న మాంగల్యంబు కాబోలు నే
వెలకైనన్ దెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్ జెల్లదే
అంటాడు.
ఈ మాటలకు వశిష్ఠ మహముని వరాన నా మెడలోని మంగళ సూత్రము నా భర్తకు తప్ప వేరెవరికి కనబడదే.. ఇతడే నా భర్త” అని హరిశ్చంద్రునికి ‘లోహితాస్యుడు తమ కొడుకే’ అని విలపించుతూ తెలుపుతది చంద్రమతి-
కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడూ మిగుల దుఃఖించి. సుంకము చెల్లించవలసిందే/ మీ యజమానురాలు దగ్గర అడుక్కరా” అంటడు. అదీ సత్య నిరతి అంటె” అంటుంది వసంత పూర్ణిమ-
“మంగళ సూత్రము విలువేమిటో నీకు అర్థమయ్యేటట్టు చెబుతాను” అంటూ “వివాహ కార్యక్రమము ముగియగానే
శతమానం భవతి
శతాయుః పురుషశ్యతేంద్రియ
ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
అని దీవించుతారు.
అందరికి సుపరిచితమైన వేద మంత్రం ఋషులు మనకందించిన వేదాలలోనుండి గ్రహింపబడినది. వివాహమైన లేదా ఏ హిందూ శుభకార్యమైనా ఆశీర్వచనంతో ముగించడం ఆనవాయితీగ వస్తుంది- నూతన దంపతులను నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యం తో ఆనందంగా జీవించమని క్లుప్తంగా దీని అర్థం.
ఈ మంత్రానికి అంత శక్తి ఉన్నదా అని సందేహము కలుగక మానదు- నిష్ష్ఠా గరిష్ఠులైన ఋష్యాదులు, పురోహితులు, విద్య బోధించిన గురువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇతర పెద్దలు ఇచ్చిన ఆశీర్వచనాలు, దీవెనలు అత్యంత శక్తివంతమైనవి- వేదమంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఆశీర్వచనం పొందుట ఆవశ్యకరం.
సూర్యోపస్థానంలో "పశ్యేమ శరదశ్శతం నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం " అని చెప్పబడింది. నిండు నూరేళ్ళు ఆ సూర్యుని చూడగలగాలి, నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించాలి.
శతమానం భవతి అని వివాహమే కాక ఇతర సందర్భాలలో ఆశీర్వదించవచ్చును. ఆశీర్వదించవలసి వచ్చినప్పుడు చాలా మందికి సందర్భోచితమైన మాటలురాక అక్షతలు వేసి ఊరుకుంటారు- పసిపిల్లలను చిరంజీవ ఆయుష్మాంభవ, దీర్ఘాయుష్మాంభవ, విద్యాప్రాప్తిరస్తు అని దీవించవచ్చు- సుమంగళియైన స్త్రీలను దీర్ఘ సుమంగళీభవ యని దీవించ వచ్చును.
ఆయుష్మాంభవ అనేది ఉత్తమమైన ఆశీర్వచనం. సంపూర్ణ ఆరోగ్యముతో కూడిన ఆయుష్యు లేనపుడు ఎంత సంపద ఉన్న ఏమి ప్రయోజనం. మీ నాన్నగారు నేను మాత్రం ఇంత వయస్సు వచ్చినా మా ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి “అంటుంది వసంత పూర్ణిమ.
“ఇంకా మంగళ సూత్రాన్ని గురించి వివరంగా చెబుతా విను” అంటూ వసంత పూర్ణిమ హైమవతితో చెబుతుంది.
“మంగళ సూత్రము బయటికి కనిపించకూడదు- భర్తకు తప్ప అది అన్యులెవరికి కనిపించరాదు- భర్తకు అమంగళం- ముత్తైదువలు ఈ విషయాన్ని గట్టిగా పాటించాలి, తెలిసిందా?” అంటుంది వసంత పూర్ణిమ.
“మంగళ సూత్రానికి అంత విలువ ఇచ్చినందున చంద్రమతి తన భర్త హరిశ్చంద్రునికి తప్ప తన తాళి అన్యులకు కనబడకుండ వశిష్ట మహాముని వద్ద వరము పొందింది తెలుసా” అంటుంది వసంత పూర్ణిమ.
ఒక మామూలు తాడుకు పసుపు పూసిన ఆ తాడుకు మంగళ సూత్రము అను పేరు వచ్చింది-
స్త్రీ పురుషులు వివాహము ద్వారా ఒక కుటుంబంగా బ్రతకడానికి స్త్రీ పురుషులిరువురు ఇష్టపడి ఈ సూత్రము కాబోయే భార్య మెడలో ధరింపజేస్తాడు భర్త- విశేషమైన జీవన విధానానికి వివాహము అంటారు.
భార్య మెడలో ఆ సూత్రము ఉండుటవలన కుటుంబము ఎన్నో మంగళములను పొందుటచే దానిని మంగళ సూత్రము అంటారు.
ఈ మంగళ సూత్రాన్ని ఎంతగా గౌరవించేవారున్నారో అంతగా నిర్లక్ష్యము చేసేవారు లేకపోలేదు. కాని మంగళ సూత్రము అనేది అనాదిగా వస్తున్న భారతీయ సంప్రదాయము.
అగ్ని సాక్షిగా ఎన్నో ప్రతిజ్ఞలు చేసిన తరువాతనే ఈ మంగళ సూత్ర ధారణ జరుగుతుంది. వివాహానికి చిహ్నంగా స్త్రీ మంగళ సూత్రము ధరించితే పురుషుడు కుడిచేతి ఉంగరపు వ్రేలికి ఉంగరం ధరిస్తాడు. మంగళ సూత్రాన్ని మాంగల్యం, తాళిబొట్టు, పుస్తె, శతమానము అని గూడా అంటారు. ఈ మంగళ సూత్రములో బంగారు పుస్తెతో పాటు నల్లపూసలు, పగడాలు, ముత్యాలు మొదలగునవి గూడ గ్రుచ్చుకుంటారు. సంస్కృతంలో మంగళమంటే శుభప్రదం- సూత్రం అంటే తాడు. ఈ మంగళ సూత్రాన్ని 108 సన్నని దారపు పోగులు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు.
మంగళ సూత్ర ధారణ చేసేటప్పుడు-
మాంగల్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతాం అను మంత్రం పఠింపజేస్తారు.
సాధారణంగా హిందూ మత సంప్రదాయం లో మహిళల వైవాహిక స్థితి తెలిపే ఐదు సంకేతాలు 1. మంగళ సూత్రము, 2. కాలి మట్టెలు, 3. కుంకుమ, 4. గాజులు, 5. ముక్కు పుడక.
మంగళ సూత్రము మంచి సంకల్పముతో ధరించే యజ్ఞోపవీతము వంటిది.
ఒక మామూలు తాడుకు పసుపు పూసిన ఆ తాడుకు మంగళ సూత్రము అను పేరు వచ్చింది-
భార్య మెడలో ఆ సూత్రము ఉండుటవలన కుటుంబము ఎన్నో మంగళములను పొందుటచే దానిని మంగళ సూత్రము అంటారు.
.
మంగళ సూత్రము మూడు ముళ్ళు ఎందుకు వేస్తారు అంటే మన హిందూ సంప్రదాయము ప్రకారము మూడు అనే అంకెకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా మూడు అనేది మంగళము అని భావిస్తారు. అందుకే ఈ మంగళ సూత్రానికి మూడుముళ్ళు వేస్తారు.
వివరంగా చెప్పాలంటె మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి- పెళ్ళి సందర్భములో వేసే ఒక్కొక్క ముడి ఒక్కో శరీరానికి వేసేది. పెళ్ళంటే ఒక్క భార్య శరీరముతోనే కాదు మొత్తం మూడు శరీరాలు మమేకం అవడము అనే అర్థం లో ఈ మూడు ముళ్ళు వేస్తారట-
మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్విత బంధానికి గుర్తు- అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడులనుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.
శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంతవరకు భర్తకు ఆయుష్షు ఉంటుంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్త్రీ మంగళ సూత్రం ధరిస్తుంది. వివాహిత మెడలో మంగళ సూత్రము లేదంటె భర్త చనిపోయినట్లుగా భావిస్తారు.
ఇక పెండ్లిలో ఏడు అడుగుల సంగతి కూడా విను అంటూ వసంత పూర్ణిమ కూతురు హైమవతికి వివరిస్తుంది-
తాళి కట్టిన అనంతరం వధూ వరులు హోమం చుట్టు ఏడు ప్రదక్షణలు ఎందుకు చేస్తారంటే- ఏడు అడుగులు వేయడం జీవిత భాగస్వామితో ఏడు జన్మలవరకు తోడు ఉంటాననే నమ్మకం ఇవ్వడం కోసమే చెబుతారు-
అంతే కాకుండ ఇందులో ఒక్కో అడుగు వెనుక ఒక్కో అర్థం కూడా ఉన్నది.
మొదటి అడుగు- అన్న వృద్ధి.
రొండవ అడుగు- బల వృద్ధి.
మూడవ అడుగు- ధన ప్రాప్తి.
నాల్గవ అడుగు- సుఖ వృద్ధికి.
ఐదవ అడుగు- ప్రజా పాలనకు.
ఆరవ అడుగు- దాంపత్య జీవితానికి.
ఏడవ అడుగు- సంతాన అభివృద్ధికి.”
అని ముగిస్తుంది వసంత పూర్ణిమ-
“అమ్మా! నీకివన్ని ఎట్ల తెలుసు?” అని అడుగుతుంది హైమవతి-
“నేను నా చిన్నతనాననే మా అమ్మ చెబితే విని దీనికి సంబంధించిన పుస్తకము ఎన్నోసార్ల చదివితే నాకు ఒంటబట్టింది” అంటుంది వసంత పూర్ణిమ.
“అమ్మా! తాతయ్య, అమ్మమ్మకు ముప్పది ముళ్ళు వేసి ఉండవచ్చునా?” అని కొంటెగా అడుగుతూ “వాళ్ళు ఇంత కాలమైనా ఇంకా బ్రతికే ఉన్నారు” అని నవ్వుతూ తల్లిని అడుగుతుంది హైమవతి.
“వాళ్ళు బ్రతికి ఉంటె నీకు కడుపు మంటేమిటే.. వాళ్ళు చక్కగా హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎంతో ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉన్నారు- నేను మీ నాన్నగారు కూడా ఆ సంప్రదాయాలు పాటించుచున్నాము కనుకనే ఏ అరమరికలు లేకుండా అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉంటున్నాము” అంటుంది వసంత పూర్ణిమ-
“అమ్మా! ఇంత వివరంగా చెప్పినందుకు నీకు పాదాభివందనము” అంటూ తల్లికి చెంతనే ఇదంతా వింటున్న తండ్రికి నమస్కరిస్తుంది హైమవతి.
“ఇక ముందు మేమూ మీ బాటే పడుతాము” అనుకుంటూ లేచి తన పనులు చేసుకొవడానికి పోతుంది హైమవతి.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comentários