top of page

సత్య


Satya New Telugu Story

Written By Dharanipragada Venkateswarlu

రచన : ధరణీప్రగడ వేంకటేశ్వర్లు
'రావోయ్ మిస్టర్ చైతన్యా! కూర్చో. నీ సర్టిఫికెట్లు అన్నీ మా ఇంటర్వ్యూ టీం అందరం చూసాం. ఇందులో నీ రెసిడెన్షియల్ ప్రూఫ్ ఏమీ సబ్మిట్ చేయలేదు' అని ఇంటర్వ్యూ చేస్తున్న ఒక అధికారి విశ్వం, చైతన్యను అడిగాడు. ఈ విశ్వం దుర్మార్గుడు, స్త్రీ లోలుడు‌. దొడ్డిదారిన వుద్యోగంలో ప్రవేశించి, పలుకుబడితో పైకి వచ్చాడు.


'సారీ సార్, అప్లై చేసే సమయానికి రాలేదు' అంటూ కొత్తగా వచ్చిన ఆధార్ కార్డు చూపాడు చైతన్య.


ఆ కార్డు చూసి, 'ఓ నీ అమ్మ పేరు సత్య అన్న మాట'. అందులో తండ్రి పేరు లేకపోవడంతో నవ్వుతూ 'నీ అమ్మకు మొగుడు లేకుండా నువ్వు .... ' అంటూ విశ్వం హేళన ధ్వనించేలా వాక్యం పూర్తి చేయబోతూ, చైతన్య ఎర్ర కళ్ళు చూసి, ఆగిపోయాడు.

చిర్రెత్తుకొచ్చిన చైతన్య 'నీ అమ్మకు మొగుడు నీకు తెలుసా, అమ్మ చెప్పింది కాబట్టి ఆయన మీ నాన్న అని నీ విశ్వాసం మాత్రమే, మా అమ్మ మాత్రం సత్యం' అని ఎక్కడో మనసు మీద చివాలున దెబ్బ కొట్టి, తన ఫైలు లాగేసుకుని, అంత కోపంగానూ ఛాంబర్ నుండి బయటకు వచ్చేసాడు.


ఆలోచించకుండా కోపంతో ఆ మాట అనేసాడు కానీ బయిటకు వచ్చాకా ఓ 'అమ్మ'ను అలా ఎమోషనల్ గా అన్నందుకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి చైతన్యకు.


స్వతహాగా చైతన్య చాలా సౌమ్యుడు. కానీ ఈ అధికారి తన అమ్మ విషయంలో మాట్లాడే తీరు చూసి, మనస్సు అధీనం తప్పి అలా అనేసాడు. తమ గురించి వెనకాల అనుకునే మూర్ఖులలో యితను ఒకడు అని సరిపెట్టుకున్నాడు.


ఇంటర్వ్యూలో జరిగిన విషయం అమ్మకు చెప్పాడు. వారిద్దరూ తల్లీ కొడుకులైనా, అన్ని విషయాలు స్నేహితుల్లా మాట్లాడుకుంటారు. ఇక్కడ సత్య గతం చెప్పాలి.


హైస్కూలు లోను, కాలేజీలోనూ సత్యకు విప్లవకారిణి అని పేరు. ఆమె భావాల్లో తుపాకులు, కత్తులు కనిపించవు. అభ్యుదయం, మానవత్వం, విశాల భావాలు మాత్రమే కనిపిస్తాయి. అవి నిర్మాణాత్మకంగా ఆలోచింపజేస్తాయి.


స్త్రీలు ఎంత అభ్యుదయ భావాలు వున్నా, యేమి లాభం? ఒక కీచకుని దృష్టిలో అబలే అయ్యింది. అయినా ఆ 'బల' డీలా పడలేదు. కీచక వృత్తాంతం ప్రత్యేకంగా చెప్పేది యేమీ లేదు. అందరికీ తెలిసిందే. అందరూ ఆమె ఆలోచనలు మెచ్చుకున్నా, ఆమెను వివాహం చేసుకునే ఆచరణాత్మక ధైర్యశీలురు, విశాల దృక్పథం వున్న మనుష్యులు సంఘంలో యెదురు పడలేదు. పైగా కీచకుని విషయంలో యేమీ చేయలేని, మాట్లాడలేని కొంతమంది చేతకాని చవటలు, పిరికివారు ఆమెను దుశ్శీలగా చిత్రించే యత్నం చేసారు.


విశ్వానికి వుండే పలుకుబడి కారణంగా అభయ చట్టం కూడా 'సత్య'కు అభయాన్ని యీయలేదు. న్యాయం జరగలేదు. ఇటువంటి అన్యాయాలకు సాక్ష్యాధారాలు కష్టం. అందుకే సమాజంలో 'ఆడ బలి' జరుగుతూనే వుంది. అంబేద్కర్ అన్నట్లు దేవతలకు మేకనే బలి చేస్తారు కానీ పులిని బలి చేయరు. పులి స్వేచ్ఛగా తిరుగుతూనే వుంటుంది. పశువు సమాజంలో పెద్దమనిషిగా చెలామణి అవుతూనే వుంది.


సహనము, నైతికత, మంచి ఆలోచనా ధోరణి సత్యకు మానసికంగా బలానిచ్చాయి. ప్రజలకు సహాయపడగల మంచి వుద్యోగ అధికారిణి అయ్యింది. అమ్మ బంధము, తండ్రి బాధ్యత తనే తీసుకుని తన కుమారుడు చైతన్యను తన ఆలోచనలకు అనుగుణంగా పెంచి, మంచి సంస్కారవంతుణ్ణి చేసింది.

*******************

రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు చైతన్య తన తల్లితో గుడికి వెళ్ళి వస్తూండగా, ఒక చోట గుమికూడిన జనం. ప్రమాదం జరిగింది. జనం చోద్యం చూస్తున్నారు. ఒకరిద్దరు మీడియాకు ఫోన్ చేసే పనిలో వున్నారు. ఇంకొందరు సెల్ ఫోన్ లలో ఫొటోలు తీస్తూ, ఫేస్బుక్లో, వాట్సాప్ ల్లో పోస్ట్ చేస్తున్నారు. అయ్యో పాపం అనేవారే కానీ తగువిధంగా స్పందించే వారు లేరు. కనీసం దగ్గరలో వున్న ఆసుపత్రికి తరలించాలని కాని, అంబులెన్సుకు ఫోన్ చేయాలనే ఇంగితజ్ఞానం కానీ లేదు.


రోడ్డు వైపు వున్న సత్య, చైతన్య ఆ సంఘటన చూడగానే 'ఆయన యెవరో ప్రాణంతో వున్నట్టు వున్నారు' అని అమ్మ అనడమేమిటి, చైతన్య ఆటో తీసుకుని రావడం, దగ్గరలో వున్న ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడం వెంటవెంటనే జరిగిపోయాయి.


చాలా రక్తం పోయింది. ఆ వ్యక్తికి కావలసిన రక్తం బీ-పాజటివ్. ఆ రక్తం అందుబాటులో లేదే అనుకునేసరికి 'నా రక్తం బీ-పాజటివే' అని అమ్మను కూడా సంప్రదించకుండా రక్త దానం చేయడానికి అంగీకరించాడు చైతన్య. వైద్య సహాయం తొందరగా అందటంతో ఆ వ్యక్తి ప్రమాదం నుండి కోలుకున్నాడు. చికిత్స జరుగుతున్నంత సేపూ తల్లీ కొడుకులు ఆసుపత్రిలో వేచి వున్నారు.


తరువాత డాక్టర్ గారు సత్య, చైతన్యల వద్దకు వచ్చి, "చాలా థ్యాంక్స్ అండి మా నాన్నగారిని నా ఆసుపత్రికే వెంటనే తీసుకుని వచ్చినందుకు' అని నమస్కరిస్తూ, నాన్న గారికి పరిచయం చేస్తూ, చూపాడు.


ఆయన్ను చూసి చైతన్య 'అమ్మా మొన్న నాకు ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్ వీరే' అని చెప్పాడు అమ్మతో. 'నాకు కూడా తెలుసు. నా క్లాస్మేట్, మంచి ఆస్తిపరుడు అయిన విశ్వం' అంటూ నవ్వింది విశ్వాన్ని చూసి అదే నిర్మలమైన చిరునవ్వుతో. ఆపద సమయంలో తల్లీ కొడుకులకు మానవత్వమే కనిపించింది కానీ అతని వ్యక్తిత్వం కాదు.

వాళ్ళిద్దరినీ చూసిన విశ్వానికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కృతజ్ఞతతోనూ, సిగ్గుతోనూ 'అమ్మ' చేతులు పట్టుకుని 'క్షమించు సత్యా' అనేసరికి చైతన్యకి అర్థం కాలేదు.


సత్య తన కొడుకు వైపు చూసి నవ్వుతూ 'నీ రక్తానికేరా నీ రక్తం యిచ్చి రక్షించింది' అని ధైర్యంగా ఆ కీచకుని పరిచయం చేసింది పరోక్షంగా నీ తండ్రిరా అని. తండ్రి అంటే తల్లి 'సత్యం' పరిచయం చేసిన 'విశ్వాసం', ప్రేమబంధం, బాధ్యత. ఇటువంటి లక్షణాలు లేని 'విశ్వం' తండ్రి కాజాలడు. అయినా సత్య స్వచ్ఛమైన కళ్ళలో ప్రశాంతత మాసిపోలేదు. నమ్మక ద్రోహి విశ్వం కళ్ళలో చెరుపుకోలేని కంపు మురికి నీరు.


ఇదంతా పక్కనుంచి వింటున్న డాక్టర్ కు అర్థమైంది తనకు కాని 'అమ్మ' మనసు. తన నాన్న బుద్ధి తెలుసుకున్న డాక్టర్ వెళ్ళి పోతున్న సత్యకు రెండు చేతులతో నమస్కరిస్తూ, తండ్రిని చూడకుండా, చీదరించుకుంటూ తన ఛాంబర్ కి వెళ్లి పోయాడు.

దూరం చేసుకున్న "ఒక రక్తం" తనకు ప్రాణం పోసి, చిరునవ్వుతో వెళుతుంటే; తను పెంచి, పోషించిన "ఇంకో రక్తం" అసహ్యించుకుంటూంటే, రెండూ భరించలేక పోయాడా సత్యాన్ని ఆదరించలేని, విశ్వాసం లేని ఆ 'మృగాడు'.రచయిత పరిచయం

నేను ధరణీప్రగడ వేంకటేశ్వర్లు, విశ్రాంత ఉప సంచాలకులు, రాష్ట్ర పురావస్తు శాఖ, హైదరాబాద్.

నేను కథలు, కొన్ని కవితలు మొత్తం మీద ఇరువది ఐదు మాత్రమే వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మా బంధువుల ఇంట్లో జరిగే వివాహాది శుభకార్యాలకు మాత్రం సరదాగా వ్రాసి, కానుకగా యిస్తూ వుంటాను. అంతకు మించి రచయితగా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమీ లేవు.

ధన్యవాదాలు,

ధరణీప్రగడ వేంకటేశ్వర్లు


261 views9 comments
bottom of page