top of page

శేషప్రశ్న


'Sesha Prasna' written by Sudhamurali

రచన : సుధామురళి

"ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః" వల్లె వేయిస్తోంది మాలతి తన స్కూలు పిల్లలతో.

"మేడం, మేడం! దీని అర్థం ఏమిటి మేడం?" అంటూ ముద్దు ముద్దుగా అడుగుతూ దగ్గరికి వచ్చింది ఏడేళ్ల వాణి.

"ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనలను రక్షిస్తుంది అని వాణీ" అంటూ వాణిని దగ్గరకు తీసుకుని ప్రేమగా, అర్థం అయ్యే రీతిలో చెప్పాలని ప్రయత్నించింది మాలతి.

"మేడం అసలు ధర్మం అంటే ఏమిటి?" మళ్లీ ఎదురు ప్రశ్న వేసింది వాణి.

ఇంత చిన్న పిల్లకు ఎలా చెప్పాలి 'ధర్మం అంటే ఏమిటి?' అని ఆలోచనలో పడింది మాలతి.

"మేడం, చెప్పండి మేడం, చెప్పండి!" అంటూ తన చేతులతో మాలతిని కదుపుతూ అడుగుతోంది వాణి.

"ధర్మం అంటే ఎవరికీ కష్టం, నష్టం కలగకుండా, అందరూ సంతోషంగా ఉండేటట్లు చూసుకుంటూ, పెద్దల మాటను వింటూ, గౌరవిస్తూ వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఆదర్శంగా ఉండటం అమ్మా వాణీ!"

"అంటే మేడం?"

"అంటే ఇప్పుడు నీలాంటి పిల్లలు ఉన్నారనుకో. తల్లిదండ్రులు, గురువులు , ఇంకా పెద్దలు చెప్పిన మాటలు వింటూ బుద్దిగా చదువుకోవాలి. వాళ్ళను ఎదిరించకూడదు. ఇతరులకు కష్టాన్ని, నొప్పిని, బాధను కలిగించకూడదు. అదే పెద్దలు ఉన్నారనుకో! వాళ్ళూ అంతే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పింది వింటూ, ఆచరిస్తూ, అందరికీ సహాయం చేస్తూ నడుచుకోవాలి. భార్య భర్త మాట వింటూ , అతనిని గౌరవిస్తూ, భర్త భార్యను ప్రేమగా చూసుకుంటూ, గౌరవిస్తూ ఒకరినొకరు నొప్పించకుండా...."

"ఏంటి టీచర్ వాణి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందా?"

వాణికి ధర్మం అంటే ఏమిటో చెబుతున్న మాలతి, ఆ మాటలు వినిపించిన వైపు చూసింది. వాణీ వాళ్ళ అమ్మ సునంద నవ్వుతూ కనిపించింది.

"అమ్మా! చూడు, మా టీచరు ఏం చెబుతోందో? మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందట. మరి నువ్వేమో నాన్నను పోలీసులకు పట్టిచ్చి అదే ధర్మం అని చెబుతున్నావు నాకు. ఎందుకు నాన్నను జైలుకు పంపావమ్మా? ఎందుకు నువ్వు ధర్మాన్ని పాటించలేదు?"

ఉన్నట్టుండి ఏడుస్తూ, వాణి సునందను అడిగిన ప్రశ్నలకు సునంద, మాలతి ఇద్దరూ నిశ్చేష్టులు అయ్యి ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.

ముందుగా తేరుకున్న మాలతి “వాణీ పెద్దవాళ్ళను ఎదిరించకూడదు అని చెప్పాను కదా తల్లీ. అమ్మను అలా మాట్లాడవచ్చునా, తప్పు అమ్మకు సారీ చెప్పి వెళ్ళు, వెళ్లి ఆడుకో” అని చెప్పీచెప్పగానే

వాణీ ఇష్టం లేకున్నా' సారీ అమ్మా!' అంటూ ఏడుపు గొంతుతోటే చెప్పి పరిగెడుతూ వెళ్ళింది.

"సునంద గారూ! అసలు ఏం జరిగింది? నేను ఇక్కడికి వచ్చి ఆరు నెలలు అయ్యింది. ఈ ఆరు నెలల్లో మీ గురించి నాకు తెలిసినంతవరకు మీరు ఎవరికీ హాని చేసేవారిలాగా కనిపించలేదు. మరి ఇప్పుడు వాణీ అన్న మాటలు..."

"చెప్తాను మేడం! అసలు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో అంతా చెప్తాను" అంటూ కళ్ళనీళ్లతో గతాన్ని చెప్పడం ప్రారంభించింది సునంద.

***

మాది చిన్న పల్లెటూరు. నాన్నగారు గుడి పూజారి. ఉన్నంతలో నన్ను, చెల్లిని చదివించారు. ఇప్పుడు మీరు చెబుతున్న ఈ ధర్మ పాఠాలు వింటూ పెరిగాము నేనూ, మా చెల్లి. ఎవరికీ హాని చేయకూడదు, పెద్దవాళ్లను గౌరవించాలి, అందరినీ ఆదరించాలి, నీతికి నిలబడాలి ఇలా ఎన్నో సూక్తులు చిన్నప్పటినుంచీ విని, అవే నరనరాన జీర్ణించుకుపోయి పెద్దవాళ్ళం అయ్యాము. మా వారు నాకు అత్త కొడుకే! చిన్నప్పటినుంచీ అనుకున్న సంబంధం కావడం, అదీ తన చెల్లెలి కొడుకు కావడం, చెల్లెలి పెంపకం మీద వున్న ధీమాతో మా నాన్న బావ గురించి ఏ ఎంక్వైరీ చేయకుండానే, కనీసం నాకు ఇష్టమో లేదో అడగకుండానే మా పెళ్లి జరిపించేశాడు. మా బావ.. అదే నా పతి దేవుడు అందరికీ చాలా సౌమ్యుడిగా కనిపించే పురుషోత్తముడు. ఎటువంటి వ్యసనాలూ లేని రాముడు మంచి బాలుడు. నిజంగానే ఆయనకు మందు, సిగరెట్లు లాంటి పెద్ద పెద్ద దుర్వ్యసనాలు లేవు. ఒక్క ఆడవాళ్ళ చుట్టూ తిరగడం, తిప్పుకోవడం అనే చిన్న వ్యసనం మాత్రమే ఉంది. అది నా చెల్లినీ వదలలేదు. అది తనను మోసం చేసింది బావే అని నాతోనూ, అమ్మానాన్నతోనూ ఎవ్వరితోనూ చెప్పలేక, చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు నాకు నా పతిదేవుడు మీద ఎటువంటి అనుమానం కలగలేదు. కానీ పనిమనిషి కూతురినీ, చివరికి పక్కింట్లో వుండే పదహైదేళ్ల బిడ్డనూ వదలకుండా వాళ్ళ బతుకుల్ని నాశనం చేసే దాకా కూడా నా భర్త నిజ స్వరూపం తెలుసుకోలేక పోవడం నా దురదృష్టం. తీరా తన అసలు నైజం తెలుసుకున్నాక ఇక క్షణం ఓర్చుకోలేక పోయాను. వెంటనే పోలీసు రిపోర్ట్ ఇచ్చి, నా భర్త వల్ల జీవితాన్ని నష్టపోయిన ఆ పిల్లలకు ఆ మాత్రం న్యాయం అన్నా చేశానేమో? అని తృప్తి పడ్డాను. చాలా మంది నన్ను బహిరంగంగానే విమర్శించారు. ఎందరి మొగుళ్లు తిరగడం లేదు? ఇలాంటి ఘటనలు ఎన్ని చూడటం లేదు? అయినా మొగుడిని పోలీసులకు పట్టిస్తారా? అసలు భార్య అంటే ఇలానా ఉండేది? ఈవిడ సుఖం ఇవ్వకపోతేనే కదూ వాడు అలా బయట తిరుగుళ్లకు అలవాటు పడింది? తప్పంతా ఈవిడలో పెట్టుకుని ఇలా చేయడం విడ్డూరం కాకపోతే ఏంటీ? మొగుణ్ణి అదుపులో పెట్టుకోవడం రాక ఇలా బజారుకు ఎక్కింది? ఇలా ఒకటా రెండా ఎన్నో సూటిపోటి మాటలతో నన్ను హింసించేశారు. ఇక అక్కడ ఉండలేక ఇదిగో ఈ ఊరుకు వచ్చి ఏదో నా కాళ్ళ మీద నేను బతుకుతూ ఉంటే, వచ్చి పోయే మా మేనత్త ఉరఫ్ అత్తగారూ, ఇంకా అమ్మ వాళ్ళు మాట్లాడే మాటలు ఇలా వాణి చిన్న బుర్రలో నా గురించి విషబీజాలు నాటాయి.

అంటూ ఎంతో ఆత్మ విశ్వాసంతో, తొణకని నిశ్చలత్వంతో తన జీవితాన జరిగిన విషాదాన్ని, అందుకు తాను తీసుకున్న నిర్ణయాన్ని చెబుతున్న సునందను రెప్ప వాల్చకుండా చూడడం మాలతి వంతయ్యింది.

చివరగా సునంద..

"మాలతీ మేడం! ఇప్పుడు ధర్మాన్ని తప్పింది నేనా?, మావారా? తప్పు అని తెలిసీ, శిక్షించడం తప్పు అని అంటున్న లోకమా?, నన్ను అర్థం చేసుకుని ఆదరించని నా అత్తగారూ, తల్లిదండ్రులా?" అంటూ వేసిన ప్రశ్న ఎప్పటికీ మాలతి సమాధానం చెప్పలేని ‘శేషప్రశ్న’

***శుభం***


124 views0 comments

Comments


bottom of page