top of page

షష్టి'పూర్తి' బహుమతి


'Shashti Purthi Bahumathi' written by alekhya Ravikanthi

రచన : అలేఖ్య రవికాంతి

తెల్లవారు జాము సుమారు ఐదు కావొస్తుంది. ఫోన్ మ్రోగడంతో నిద్రపోతున్న మాధవయ్య నెమ్మదిగా లేచి కళ్ళద్దాలను పెట్టుకుని ఫోన్ ఎత్తి... 'సీత , చెప్పరా.. !' అన్నాడు కాస్త మగతగా.


"నాన్న, మీరింకా లేవలేదా...!. ఇప్పుడు మీరు నిద్రమత్తు వదిలి జాగింగ్ చేయాల్సిన సమయమని ప్రతి రోజు చెప్పాలా...! "అంది కోపంగా సీత.


"అయ్యో, ఈ ఒక్కసారికి మన్నించు చిట్టి తల్లి" అంటూ గోముగా బతిమిలాడాడు మాధవయ్య.


నాన్న, మీకు హై. బీపి, కొలెస్ట్రాల్, షుగర్ పైగా ఒకసారి గుండెపోటు చుట్టపు చూపులా పలకరించింది కదా. మీ ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా చెప్పండి. డాక్టర్ చెప్పింది మరిచిపోయారా..!?.

ఆరోగ్యకరమైన ఆహరం, శరీరానికి సరైన వ్యాయామం వలన మీరు ఆరోగ్యంగా ఉంటారని ఆయన చెప్పిన మాటలు మరిచిపోతారే !ఏ పూటకా పూట నేను ఫోన్ చేసి గుర్తు చేసేంతవరకి అచ్చం గజినిలా" అంది రుసరుసలాడుతూ.


"నేను మరిచిపోయిన నువ్వు మరిచిపోవుగా. పేరుకే అమెరికాలో ఉన్న నీ మనసు ఇండియాలోనే ఉంటుంది.నువ్వు ఎంత దూరంలో ఉన్నా నన్ను, నా ఆరోగ్యాన్ని కనిపెట్టుకునే ఉంటావు కంటికి రెప్పలా" అన్నాడు నవ్వుతూ మాధవయ్య కూతురు సీతతో.


"నాన్న, నాకు అమ్మైనా, నాన్నైనా నువ్వేగా. అమ్మ నా ఐదవ ఏటే దూరమైన నాకు తన లోటు తెలియకుండా గారాభంగా పెంచి పెద్ద చేసి నేను మనసు పడ్డ రామ్ తోనే పెళ్లి జరిపించావు. ఉద్యోగ రిత్య నీ నుంచి ఇంత దూరం రావాల్సి వచ్చింది. అందుకే ఓ నెలకైనా అమెరికా రా, అంటే నువ్వేమో రావు. నేను అక్కడ లేనందుకే చూడు ఇప్పుడు నీకు అంత బద్దకం వచ్చింది" అంది బాధగా సీత.


"సర్లే సీత , నువ్వెక్కడున్న నీ మనసు నా పక్కనే ఉంటుందని తెలియదా!' అన్నాడు మాధవయ్య ఆప్యాయంగా.


"సరే నాన్న, ఇప్పుడు మీరు జాగింగ్ చేసి ఏడింటికళ్ళా ఇడ్లీ తినేసేయండి.మధ్యాహ్నం కప్పు అన్నం, పప్పు, ఒక రోటి తినేయండి.ఈ రోజు మీ మెనూ రెడి చేసి వంటబ్బాయి రవికి చెప్పా. ఇక లేచి పరిగెత్తండి.ఆ .., మందులు వేసుకోవడం మరిచిపోకండి సరేనా" అని మాధవయ్య పాఠించాల్సిన సూత్రాలన్నీ వివరించి ఫోన్ పెట్టేసింది సీత.


'ఏంటో, పిచ్చిపిల్లకి నేనంటే ఇంత ఇష్టం..!ప్రతి నిమిషం దగ్గరున్నట్టే అన్నీ చెబుతుంది. నా బాగోగులను చూసుకోడానికి కూడా మనిషిని పెట్టింది. బహుశా కూతురి ప్రేమ అంటే ఇదే కాబోలు' అనుకుంటూ జాగింగ్ కి వెళ్ళిపోయాడు మాధవయ్య.


రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి.ప్రతిరోజులా ఈ రోజు సీత నుంచి మాధవయ్యకు ఎలాంటి ఫోన్ కానీ, సందేశం కానీ రాలేదు. మాధవయ్య మనసులో మెల్లగా అలజడి మొదలైంది.


ఏంటి మూడు రోజుల నుంచి సీత ఫోన్ చేయడం లేదు.., ఏమయ్యుంటుంది! అనుకుంటూ సీతకి, అల్లుడికి ఫోన్ చేసాడు. ఫోన్ కవరేజ్ ఏరియాలో లేదు అని తెలిపేసరికి తనలో ఇంకా కంగారు మొదలైంది. మాధవయ్య దేవుడి గదిలోకి పరిగెత్తి దిగాలుగా కూర్చుని దేవుడికి దండం పెట్టుకుని కూతురి గురించే ఆలోచిస్తూ అట్టే నిద్రలోకి జారుకున్నాడు.

సమయం ఉదయం ఏడు కావొస్తుంది. 'నాన్న... నాన్న, లేవండి' అంటు సీత పిలుపు వినిపించేసరికి కళ్ళను నలుముకుంటూ నెమ్మదిగా కళ్ళను తెరిచాడు. ఎదురుగా కూతురు నవ్వుతూ నిలుచుంది.

ఇది కలా.., నిజమా! అంటూ తనని తాను గిల్లుకున్నాడు. "అబ్బా.... నిజమే", సీత నిజంగా నువ్వు వచ్చావా...! ఎప్పుడు, ఎలా? అంటూ ఆశ్చర్యంగా అడిగాడు మాధవయ్య .


సీత నవ్వుతూ..."అరవై వసంతాలు నిండుకున్న నా బంగారు తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు" అంటూ తండ్రి ఎదపై వాలింది.


ఈ రోజు నా పుట్టిన రోజు అనే సంగతే మరాచిపోయా తల్లి.నిండా నూరేండ్లు చల్లగా ఉండమ్మ. ఇంతకి నువ్వెప్పుడు వచ్చావు.నా అల్లుడు,మనమవరాలు ఎక్కడా, అన్నాడు మాధవయ్య గదంతా వెతుకుతూ.


నాన్న, వాళ్ళిద్దరూ ఇంకాసేపట్లో వస్తారు.నేటితో మీరు ఆరు పదుల వసంతాలను పూర్తి చేసుకోబోతున్న పుట్టిన పండుగ రోజు కదా. అందుకే షష్టి'పూర్తి' చేసుకోబోతున్న మీకు దగ్గరుండి పుట్టిన రోజు వేడుకలను జరిపించి ఓ అందుమైన బహుమతిని అందించాలని ఇలా మీకు చెప్పా పెట్టకుండా వచ్చాము.


సరే పదండి నాన్న. ముందుగా మీరు స్నానం చేసి ఈ పట్టుబట్టలు కట్టుకుని కిందికి రండి. మిగితావన్ని తరువాత మాట్లాడుకుందాం అంటూ వెళ్లిపోయింది సీత.


మాధవయ్య కూతురిచ్చిన పట్టుబట్టలు కట్టుకుని కిందికి వెళ్ళాడు. హాలు మొత్తం అందంగా అలకరించబడింది.' పుట్టిన రోజు శుభాకాంక్షలు మామయ్య,' అంటూ రామ్ మాధవయ్యకు నమస్కరాంచాడు. అందరిని చూసేసరికి మాధవయ్య కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు జాలువారాయి.


నాన్న, ఇది ఏడ్ఛే సమయం కాదు పండగ జరుపుకూనే సమయం. మీ అనుమతి లేకుండా మేము మీ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నాం. మీరు కూడా ఒప్పుకుంటారనే ఆశతో అంది సీత కాస్త తటపటాయిస్తూ.


సీత , మీరేం నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ మీరేం ఆలోచించిన నా మంచి కోసమేనని నాకు తెలుసు తల్లి. మీ నిర్ణయం ఏంటో ధైర్యంగా చెప్పు. నేనేమి అనుకోనులే అన్నాడు మాధవయ్య.


సీత గదిలోకీ వెళ్లి ఒక యాభై ఏళ్ల వయస్సు గల స్త్రీ ని తీసుకువచ్చింది. నాన్న, ఈవిడ పేరు తులసి.అమెరికాలో గత సంవత్సరంగా మా ఇంట్లోనే పాపకి కేర్ టేకర్గా, ఇంటి పనుల్లో నాకు చేదోడువాదోడుగా ఉంటుంది. అనాథైన తనకు తన మేనమామ ఊహ తెలియని వయసులోనే ఓ తాగుబోతుకిచ్చి పెళ్లి జరిపించి చేతులు దులిపేసుకున్నాడు. ముక్కు పచ్చలారని వయసులోనే పసుపు కుంకుమలకి దూరమయ్యింది. పాపం, మానసిక వికలాంగుడైన తన కొడుకుకి ఓ పూట ముద్దుపెట్టడం కోసం ఎన్నో కష్టాలు పడింది. కొడుకు భవిష్యత్తు ఆలోచించి నాలుగు డబ్బులొస్తాయని ఆశపడి తన కొడుకును ఆశ్రమంలో ఉంచి ఓ దళారి వలన తను కేర్ టేకర్గా అమెరికా వచ్చింది. నీలానే తను కూడా యవ్వనంలోనే భాగస్వామిని కోల్పోయిన తన బిడ్డ కోసం బతుకుతో పోరాడుతుంది.


ఈ సంవత్సరంలో తనని దగ్గరగా గమనించా.తను చాలా మంచిది. నీకు సరైన జోడి. నాన్న, నువ్వు తులసమ్మని పెళ్లి చేసుకుని నీ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని మేము కోరుకుంటున్నాము అంది తండ్రి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ.

కూతురి మాటలు విన్న మాధవయ్య ఆశ్చర్యపోతూ..,' ఏంటమ్మ.., నాకీ వయసులో పెళ్ళేంటి. ఎవరైనా వింటే నవ్వుతారు.నా బాధ్యతలన్నీ తీరిపోయి చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ఈ పెళ్ళి ఎందుకు..! సరదాగా తోడుతో తిరిగే వయసా నాది' చెప్పు అన్నాడు.


"నాన్న...., పెళ్ళనేది సరదాల కోసమే కాదు, అవసాన దశలో ఒకరికొకరు ఉండే ఆసరా, ఓ భరోసా" . ఒక మనిషికి ఎన్ని బంధాలున్న తనకంటూ ఓ తోడు చాలా అవసరం. అది అవసాన దశలో మరీను. ఇక సమాజం గురించి మరిచిపోండి.అమ్మ పోయాక మీరొక్కరే ఎంత కష్టపడి పెంచారో అందరికీ తెలుసు కదా. మరి అందరూ వచ్చి అయ్యో... పాపం, అనేవారే కానీ ఒక్కరూ దగ్గరుండి చూసుకున్నారా చెప్పండి....! ఇక మీరేం ఆలోచించకండి. నా మాట విని మీరు కొత్త జీవితం ఆనందంగా ఆరంభించండి అంది తులసి చేతులను మాధవయ్య చేతుల్లో పెడుతూ.


సీత మాటే నా మాట మామయ్య. ఈ అరవై ఏళ్ళ మీ ఒంటరి జీవితానికి మేము మీకు ఇస్తున్న షష్టి'పూర్తి' బహుమతి అనుకోండి. కొత్త జీవితం సరికొత్తగా ఆరంభించండి మీ భాగస్వామితో అన్నాడు రామ్ నవ్వుతూ.


కూతురు, అల్లుడి మాటలు విన్న మాధవయ్య ఆనందబాష్పాలు రాలుస్తూ...! నా ఆనందం కోసం చిన్న వయసే అయిన ఎంత ఉన్నతంగా ఆలోచించారు.మీరిచ్చిన ఈ షష్టి'పూర్తి' బహుమతి నిజంగా అమూల్యమే అని తులసి దగ్గరికి వెళ్ళి... తులసి గారు, పదండి ముందుగా మన అబ్బాయిని ఆశ్రమం నుంచి మన ఇంటికి తీసుకువద్దాం. ఆ తర్వాత మన బిడ్డల సమక్షంలో వివాహం చేసుకుందాం. ఏమంటారు మీరు, అన్నాడు మాధవయ్య.

మాధవయ్య మాటలు విన్నాక కళ్ళతోనే తన అంగీకారం తెలిపింది తులసి. ఆ మరుసటి రోజు పిల్లల సమక్షంలో మూడుముళ్ళ బంధంతో ఒకటైనారు మాధవయ్య, తులసి ఒకరికొకరు తోడు, నీడలా మారి.

🌷కథ సమాప్తం 🌷


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

నమస్తే, నా పేరు అలేఖ్య రవికాంతి. నేను Msc. Microbiology చదివాను. నేను గృహిణిని.నాకు చిన్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడమంటే ఇష్టం. ఇప్పటి వరకు వివిధ సాహిత్య గ్రూపుల్లో 100 కి పైగా కథలు, 200 కు పైగా కవితలు రాసాను. మున్ముందు మరిన్ని మంచి రచనలు నా కలం నుంచి జారువాలాలని కోరుకుంటున్నాను. అందరికి ధన్యవాదాలు.


110 views1 comment

1 Comment


Surekha Devalla
Surekha Devalla
Jan 16, 2021

కథ చాలా బాగుంది అండీ.. తండ్రి గురించి కూతురి ఆరాటం, ఆ కూతురిపై తండ్రి కి ఉన్న ప్రేమ చాలా బాగుంది. పరిస్థితులను అర్థం చేసుకుని మామగారికి తోడు కావాలి అని సపోర్ట్ చేసిన ఆ అల్లుడి మంచితనం సూపర్. కథనం బాగుంది అండీ. మంచి కథ.

Like
bottom of page