top of page

స్నేహలతలు

'Snehalathalu' written by Bhagavathula Bharathi

రచన : భాగవతుల భారతి

“ఏమండీ! శ్యామ్ కూతురు పెళ్ళి! రెండు రోజుల ముందే రమ్మన్నాడండీ! ఇద్దరినీ!

రాకపోతే ఊరుకోనని గొడవచేస్తున్నాడండీ!” అంది మందాకిని

" ఫోన్ చేసాడు. నాకూ ముఖ్యమైన పనులేం లేవు. వెడదాం " అన్నాడు మందాకిని భర్త.

ఆనందంతో గతాన్ని నెమరు వేసుకుంటూ ఉండిపోయింది మందాకిని.

/////////

"హాయ్ మందాకినీ !"

"హోయ్ శ్యామ్! "

"ఏం చేస్తున్నారూ? రాణీవారూ?" అడిగాడు శ్యాం.

"ఏం చేస్తాం! రొటీనే! వంటలూ వార్పులూ,

శ్రీవారికీ, పిల్లలకూ వండి పెట్టటాలూ, మీ మగాళ్ళు వంకలు పెడుతుంటే భరించటాలూ!

అదీగాక ఏలూరు నుండి మా పిన్ని కూతురు పెళ్ళి శుభలేఖ వచ్చింది. దాన్ని చూస్తూ ఆలోచిస్తూ, నీతో మాట్లాడుతున్నా. తమరేం చేస్తున్నట్లో" మందాకిని ప్రశ్న.

"ఈ రోజు మేం నలభీములం వంటమాదే! ఇంతకీ ఏం టిఫిన్ చేస్తున్నారు?" అన్నాడు శ్యామ్.

"పెసరట్టు ఉప్మా " అంది మందాకిని.

"అబ్బోసూపర్ ! మాకూ పంపరాదూ!" అన్నాడు శ్యామ్.

"ఇంతకూ అయ్యగారి చేతికి గరిటె ఎందు కొచ్చిందో? " అడిగింది మందాకిని.

"మా ఆవిడ ఆరోగ్యం బాగుండలేదు. జలుబూ దగ్గూ ,జ్వరమూ.. ఏవో మందులు వేసా! తగ్గలేదు." శ్యామ్ భాధగా అన్నాడు.

"అయ్యో! అదేంటీ! అంత అశ్రధ్దపనికిరాదు.

అసలే రోజులు బాగుండలేదు. వైరస్ ల కాలం. రాజమండ్రి లో నా ఫ్రెండ్ డాక్టర్

ఉంది. ఆవిడకి ఫోన్ చేసి చెబుతాను. మీ మిసెస్ ను చూడమని!

మీ ఇంటి అడ్రస్ మెసేజ్ చేయండి నాకు , క్విక్ " అంటూండగానే..

మందాకిని వాట్సప్ లోకి ఓ అడ్రస్ మెసేజ్ వచ్చింది.

మెసేజ్ పెట్టి, "అయినా మీ కెందుకు శ్రమ?"అన్నాడు శ్యామ్.

"అదేమిటీ! మనిద్దరం మంచి స్నేహితులం. మనమధ్య శ్రమ అనే పదం ఉండకూడదు. ఆగు. నేను మా స్నేహితురాలికిఫోన్ చేసి అడ్రసు మెసేజ్ పెడతాను"

ఫోన్ పెట్టేసి, రాజమండ్రి లోని తన స్నేహితురాలికి మెసేజ్ పెట్టి,మాట్లాడటంలో నిమగ్నమైపోయింది మందాకిని.

ఇంతలో తలుపు చప్పుడయింది "ఏమోయ్! ఏం చేస్తున్నావ్? ఏంటి సంగతులూ " మందాకిని భర్త లోపలికి వస్తూ అడిగాడు.

"ఏలూరు నుండి శుభలేఖ వచ్చిందండీ!

మా పిన్ని కూతురు పెళ్ళి అనీ, అదేచూస్తూ ఫోన్ లో రాజమండ్రి కి అర్జంట్ మెసేజ్ పెట్టేసి, ,పిన్నితో కూడా మాట్లాడుతున్నాను. పెళ్ళికి ఇద్దర్నీ రమ్మన్నారు. వెడదాం " అంది మందాకిని.

"నాకూ ఫోన్ చేసి రమ్మని చెప్పారు. నేను బిజీవల్ల రాలేనని చెప్పాను. పోనీ నువ్వు పోయిరారాదూ ! ఎలాగోలా రెండు రోజులు పిల్లలను నేను చూసుకుంటా పసిపిల్లలేం కాదుగా! "

"మావారూ మంచివారు" నవ్వి, వంటింట్లోకి దారితీసింది మందాకిని

భర్తకు కాఫీ పెడుతుంటే మళ్లీ శ్యామ్ భార్య మనసులో మెదిలి, గతంలో తమకు స్నేహం ఎలా కుదిరిందో ఆలోచిస్తోంది, మందాకిని.

టెక్నాలజీ పెరిగాక మంచికీ, చెడుకీ కూడా సహాయకారిగా మారింది. ఇందులో చెడే కాదు మంచీ ఉంటుందనే చక్కని సూచనగా శ్యామ్, మందాకినీ ఓ ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ తో కలిసారు.

అభిప్రాయాలూ, ఆలోచనలూ కలిసి స్నేహితులయ్యారు.

రోజూ వాట్సప్ మెసేజ్ లు శుభోదయాలూ, సుప్రభాతాలూ,శుభరాత్రులే కాకుండా, పలకరింపులూ,

ఎన్నో విషయాలమీద అవగాహనా చర్చలూ, పిల్లల చదువుల విషయాల్లో సలహాలూ....చాలా చక్కటి స్నేహం.

ఇద్దరూ వివాహితులే. ఇద్దరికీ కుటుంబాలున్నాయ్. పిల్లలున్నవాళ్ళే.

మళ్ళీ ఫోన్ మ్రోగింది..ఆలోచనల్లోంచి బయటికొచ్చి, వాట్సప్ మెసేజ్ చూసింది

"ఇప్పుడు మాట్లాడవచ్చా" అని శ్యాం మెసేజ్.

"చెప్పండి" అంది మందాకిని .

"మీకు చాలా ధన్యవాదాలు మందాకినీ!

డాక్టర్ గారు స్వయంగా మా ఇంటికే వచ్చారు. బ్లడ్ తీసుకున్నారు. రిపోర్టులు రేపటికి కానీ రావు. "

కానీ ఇంజక్షన్ చేసారు జ్వరానికి. రిపోర్ట్స్ వచ్చాక, దాని ప్రకారం వైద్యం చేస్తామన్నారు. బహుశా కరోనా లక్షణాలు కావచ్చు అంటున్నారు. వేరే సపరేట్ గదిలో ఉంచేశాము. నీరసంగా ఉంది, ఈవిడ.

సెలైన్ పెట్టాల్సివస్తే నర్స్ ను పంపి ఇంటిదగ్గరే పెడతానన్నారు.

"ఈ రెండువారాలూ, పిల్లలతో మీరేం ఇబ్బంది పడకండి అని ..ఓ పని పిల్లను కూడా డాక్టర్ గారే మాట్లాడి,పంపారు. మీ సహాయం మర్చిపోలేనిది మందాకినీ. "

కృతఙ్ఞతగా అన్నాడు శ్యామ్.

"శ్యాం! నన్ను మీరూ! గారూ! అని గౌరవించక్కరలేదు. అనుకోకుండా పరిచయమైన వాళ్ళమధ్యనే చక్కని అనుబంధం ఏర్పడుతుందంటారు. మనం స్నేహితులం. ఓకే "

"ఓకే!"

/////////////

మర్నాడు "మందాకినీ! రిపోర్ట్స్ లో కరోనా అనే వచ్చింది. చికిత్స ఇంటిదగ్గరనుండే ప్రారంభించారు. ఈ పరిస్థితిలో పిల్లలతో చాలా ఇబ్బంది పడాల్సివచ్చేది. చాలా సహాయం చేసారు. పనిమనిషి ఉండటం వల్ల ఇంటి పనీ సులభంగా ఉంది.

కృతఙ్ఞతలుఎలా చెప్పాలో తెలియడం లేదు. మనిద్దరం కేవలం ఫేస్ బుక్ లో కలిసిన స్నేహితులం. ఒకరుముఖాలు ఒకరం చూసుకోకుండానే దేవతలా భలే సాయం చేసారు. ఏమనుకోకపోతే మిమ్మల్ని చూడాలనుంది ," అన్నాడు శ్యామ్.

"కరోనాకు ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ తీసుకునే చక్కని సౌకర్యం డాక్టర్స్ కల్పించేసారు అందరికీ.... మరీ ...సీరియస్ ఐతేనే హాస్పటల్ కి....ఇక ....వచ్చేనెల ఏలూరులో ఓ పెళ్ళి ఉంది .వద్దామనుకుంటున్నా! మీది రాజమండ్రి కదా! ~ ఎలా కలుస్తారూ ?" అడిగింది మందాకిని .

"ఆ రోజుకి ఏలూరు రావటానికి ప్లాన్ చేసుకుంటాను. సరే ..కానీ బయట కరోనా బాగా ఉంది. మాస్క్, సానిటైజర్.. సామాజిక దూరం.. అన్ని జాగ్రత్తలతో రావాలి మరిచిపోవద్దూ" చెప్పాడు శ్యామ్.

ఆరోజు పెళ్ళికని, ఏలూరు వెళ్ళటానికి రైలు ఎక్కింది మందాకిని. రైలు ఎక్కిన

దగ్గరనుండీ , శ్యాం మెసేజ్ పెట్టి ఫోన్ లో ఫాలో అవుతూనే ఉన్నాడు.

కొంతదూరం వచ్చేసరికి మందాకిని ఫోన్ మ్రోగింది. చూస్తే చెల్లి .. ఫోన్ లో ఏడుస్తూ....

" ఏమే!అక్కా! మీ మరిదికి గుండె నొప్పి వచ్చిందే! ఇప్పుడే విజయవాడ తీసుకొచ్చామే! భయంగా ఉందే! మాకు తెలిసిన వాళ్ళెవరూ లేరే! పల్లెటూరి వాళ్ళమని మమ్మల్ని మోసం చేస్తారేమో! పైగా కరోనా రిపోర్ట్ తెస్తేగానీ ,ట్రీట్మెంట్ చేయమంటున్నారు " ఏడుస్తూ చెప్పింది మందాకిని చెల్లెలు.

"నేను వస్తున్నా ఆగు! " అని చెల్లికి ,ధైర్యం చెప్పి ఇటు భర్తకీ ,అటు శ్యాం కి జరిగిందంతా చెప్పేసి తను విజయవాడ లో రైలు దిగేసింది మందాకిని. కానీ దారిపొడవునా చక్కటి సూచనలిస్తూనే ఉన్నాడు శ్యామ్.

మందాకిని విజయవాడ లో దిగి, స్టేషన్ నుండి బయటకు వచ్చేసరికి, ఓ అపరిచితుడు "మీరూ... మందాకిని కదూ! రండి! " అన్నాడు కారు డోర్ తీస్తూ.

అనుమానంగా చూసింది మందాకిని

"అయ్యో! నేను శ్యామ్ నండీ ! అంటూ ఎన్నో ఆధారాలు చూపించి “మీరు భయపడకండి! ముందు హాస్పటల్ కు వెడదాం పదండి."

అని దారి పొడుగూతా ఎన్నోవిషయాలు మాట్లాడుతూనే ఉన్నాడు.

"ఓ స్నేహితుని కారు తీసుకుని నేను నిన్ననే ఏలూరు వచ్చేసా! రైలులో నువ్వు విషయం చెప్పగానే, అదే కారులో ఇటు వచ్చేసా. కారు కాబట్టే తొందరగా రాగలిగా.. చెల్లిగారు, మరిది గారికి ధైర్యం చెప్పండి. మనం వెడుతున్నాంగా... " అన్నాడు శ్యాం.

కారుదిగి వచ్చిన ఇద్దరినీ, చెల్లీ, ఆమె తాలూకు వారూ అనుమానంగా చూసారు.

కానీ శ్యామ్ చకచకా, డాక్టర్స్ తో మాట్లాడాడు. తన ఫ్రెండ్స్ కి ఎవరెవరికో ఫోన్ లు చేసి, ఎ, టి, యమ్ లో డబ్బులు డ్రా చేసి, సమయానికి అందజేశాడు. అక్కడున్న వాళ్ళని " ఏమండీ ఎందుకంత భయం? ఫేస్ బుక్ ఫ్రెండ్స్ అంటే, చాలా దురభిప్రాయం ఉన్నట్లుందీ! ఎందులో నైనా మంచీ చెడూ రెండూ ఉంటాయ్.చెడు మన పక్కింట్లోనైనా .. ఎదురింట్లో నైనా.. ఉంది. అలా అనీ ఇలాంటి వాట్సప్ స్నేహాలు అందరి పట్లా మంచివీ అని నేనూ వాదించలేను.. చూడండీ! నేను మందాకిని భర్తకి ఫోన్ చేసి మాట్లాడతాను. "

అని మందాకిని భర్తకి ఫోన్ చేసి,

" హలో?! నా పేరు శ్యామ్ అండీ! నేను మందాకిని స్నేహితుడినండీ " అని జరిగిందంతా చెప్పి,

"మీరేం భయపడకండీ! నేను ఇక్కడే తోడుగా ఉంటాను. మళ్ళీ మీ శ్రీమతిని మీకు జాగ్రత్తగా అప్పగిస్తాను. " అని పకపకా నవ్వాడు,

విజయవాడలో మందాకినికి తోడుగా ,ఉండి ట్రీట్మెంట్ పూర్తయ్యాక, మందాకిని తన చెల్లెలితో ఉండిపోతుందని తెలుసుకొని, తను తన ఊరు వెళ్ళిపోవటానికి ఉపక్రమించాడు.

గబగబా మాట్లాడేస్తున్న శ్యామ్, మందాకినీ, కుటుంబ స్నేహితులుగా మారటానికి ఎంతో కాలం పట్టలేదు. కాలంతో పాటు కరిగి పోకుండా స్నేహం ఇలాగే కొనసాగుతూ, కొత్త టెక్నాలజీ మంచి స్నేహాలకూ ఉపయోగపడుతుందని, అందరికీ అర్థమయింది, ఇద్దరి ఇళ్ళల్లో పిల్లల పెళ్ళెళ్ళవరకూ ...

÷÷÷÷÷

సెల్ ఫోన్ మ్రోగటంతో గతంలోంచి బయటికి వచ్చి "హలో శ్యామ్ "అంది మందాకిని.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


197 views0 comments

Comments


bottom of page