top of page

స్నేహితుడు


Snehitudu Written By Geo Lakshman

రచన : జియో లక్ష్మణ్


“నాన్నా! నాకు సైకిలు కొనిస్తానన్నావు” అన్నాడు సందీప్‌.

“అన్నాను కదా. కొంటాను” అన్నాడు సందీప్‌ డాడీ శ్రీనివాస్‌.


“ఎప్పుడు కొంటావు?”

“ఇంకా ఆలోచించుకోలేదు”

“నో. నాకు వెంటనే కొనాలి”

“నీకు కొనకపోతే ఎవరికి కొంటాను. యు ఆర్‌ మై ఓన్లీ సన్‌”

“నువ్విలాగే ఏదో చెప్పి తప్పించుకుంటావు. అమ్మ కూడా ఓకే అంది. నువ్వు కొనాలి

“కొంటానన్నాగా?”

“అదే ఎప్పుడు? గివ్‌ మి ఏ డేట్ “

“నీ వయసెంత?”

“టెన్‌ ఇయర్స్‌”

“టెన్‌ ఇయర్స్‌కే నీకు సైకిలా?”

“ఫైవ్‌ ఇయర్స్‌ వాళ్ళు కూడా జామ్‌ జామ్‌మని తొక్కుతున్నారు”

“సరే. ఇప్పుడు నాకు ఆఫీసుకి టైమవుతోంది. తరువాత మాట్లాడుదాం.”

“నో ఇప్పుడే చెప్పాలి. ఏదో ఒక డేట్‌ చెప్పు”

“వచ్చి చెబుతాన్రా నాయనా”

“నీ దగ్గర డబ్బుల్లేవా? నాకు వచ్చిన చెక్‌ ఉంది కదా ఆ డబ్బుతో కొను”

“తప్పకుండా కొంటాను. నీ పైజ్‌ మనీ ఎందుకు? నా డబ్బుతోనే కొంటాను. ఈ వీకెండ్‌కి షాప్‌కి వెళదాం. సరేనా?”

“వీకెండ్‌ వరకూనా?”

“ఈరోజు గురువారం. శనివారం సాయంత్రం వెళదాం. నీకు ఏ టైపు సైకిలు కావాలో నెట్‌లో చెక్‌ చేసి నాకు వాట్సప్‌ పెట్టు. నేను చూసి ఓకే చేస్తాను”

“సరే డాడీ. మమ్మీ ఫోన్‌లోంచి నీకు మెసేజ్‌ పెడతాను. బై”

“బై సందీప్‌. మమ్మీ మార్కెట్‌ నుంచి వస్తే డాడీ ఆఫీసుకి వెళ్ళారు అని చెప్పు”

“ఓకే. బై.”

“ బై”

******

“రా మమ్మీ! నీకోసమే చూస్తున్నాను. డాడీ ఓకే చెప్పారు సైకిల్‌ కొనడానికి” అన్నాడు సందీప్‌ ఇంట్లోకి వస్తున్న తల్లి రాధని చూసి.


“అదేం భాగ్యంరా. నీలాంటి తెలివైన కుర్రాడికి, మేథమేటిక్స్‌లో రికార్డులు క్రియేట్‌ చేస్తున్న షార్ప్ సందీప్‌కి ఏదైనా కొనాలి.” తెచ్చిన సామాను టేబుల్‌ మీద పెడుతూ అంది రాధ.


“థేంక్యూ మమ్మీ. సరే. కూరలేం తెచ్చావు? కేరట్‌ తెచ్చావా? నాకు కేరట్‌ అంటే చాలా ఇష్టం కదా”


“తెచ్చాన్రా. కేరట్‌ తేకుండా ఉంటానా? బెండకాయలు కూడా తెచ్చాను. ఏపిల్స్‌ తెచ్చాను. బటర్‌స్క్మాచ్‌ ఐస్‌క్రీం కూడా తెచ్చాను”

“మంచి మమ్మీ. నాన్న సైకిల్‌ ఇమేజెస్‌ వాట్సప్‌లో పంపమన్నారు. పంపాలి. ఐయామ్‌ బిజీ”


“ఈ రోజు నీ యూ ట్యూబ్‌ రికార్డింగ్‌ ఉంది మర్చిపోయావా?”


“నో. సందీప్‌ అలా మర్చిపోడు. ఐయామ్‌ షార్ప్ సందీప్‌”


“ఎస్‌. యు ఆర్‌ షార్ప్ సందీప్‌. యూ ట్యూబ్‌ స్టార్‌ సందీప్‌


“నా యూ ట్యూబ్‌ వ్యూవర్స్‌ ఒన్‌ మిలియన్‌ దాటేసారు మమ్మీ”


“కంగ్రాట్స్‌. నా కొడుకు రికార్డు క్రియేట్‌ చేసాడు. ఐ యామ్‌ వెరీ హేపీ”


“థేంక్యూ అమ్మా. నీతో మళ్లీ మాట్లాడుతాను. నీ ఫోన్‌ ఇలా ఇయ్యి. సైకిల్‌ ఇమేజెస్‌ సెర్చ్‌ చేసి నాన్నకు పంపేసి స్టూడియోకి రికార్డింగ్‌కి వెళ్ళాలి.


“అలాగే వెళ్ళు. ఇదిగో ఫోను”

ఫోన్‌ తీసుకుని తన రూంలోకి వెళ్లిపోయాడు సందీప్‌.

***

“హలో డాడీ”

“హలో సందీప్‌. వాట్సప్‌లో సైకిల్‌ పిక్స్‌ చూసాను. బావున్నాయి. నువ్వు సెలెక్ట్‌ చేసింది ఇంకా బావుంది. తీసుకుందాం. డన్‌”

“డన్‌”

“మమ్మీకి చూపించావా?”

“మమ్మీ చూసే ఓకే చేసింది. నేను ఓకే అన్నాను. అప్పుడే నీకు మెసేజ్‌ చేసాం”

“ఓకే ఓకే. నైస్‌. ఉంటా. బై”

“బై డాడీ”

***

ఫోన్‌ మోగుతుంటే సందీప్‌ తల్లి రాధ ఆన్‌ చేసింది.

“హలో సందీప్‌ మదరా అండీ మీరు?”

“నేను హలో అనకముందే మీరు నేను సందీప్‌ మదర్‌ని అని కన్‌ఫర్మ్‌ చేసేశారే ”

“ఈ నెంబరు కోసం ఎన్నో తిప్పలు పడి కనుక్కున్నానండి. మేథమేటిక్స్‌లో జీనియస్‌ సందీప్‌ మదర్‌ మీరు కాకపోతే ఎవరవుతారండీ”


“భలేగా మాట్లాడుతున్నారే”


“ఏంలేదు. ఎక్కువగా మాట్లాడుతున్నాను. నా పేరు సుమ. సందీప్‌లాంటి కొడుకుని కన్నందుకు నిజంగా మీరు లక్కీ ఫెలో”


“థాంక్యూ”


“యూ ట్యూబ్‌లో సందీప్‌ వీడియోలు చూసి ఇంప్రెస్స్ అయి మీకు ఫోన్‌ చేస్తున్నాను. ఒక్కసారి సందీప్‌తో మాట్లాడిస్తారా?”


“మీరు పది నిముషాల ముందు చేసి ఉండాల్సింది. వాడు రికార్డింగ్‌ పనిలో ఉన్నాడు. సాయంత్రం వరకూ దొరకడు”


“అయ్యో. పది నిముషాల ముందు చెయ్యాల్సి వుండాలి. చెయ్యలేకపోయాను. ఎలాగైనా, ఎప్పుడైనా నాకు సందీప్‌తో మాట్లాడించండి”


“డోంట్‌వర్రీ. సందీప్‌తో మీరు మాట్లాడడానికి కమింగ్‌ సండే కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రోగ్రాం ఉంది. అక్కడకు రండి”


“అక్కడ జనం ఎక్కువ ఉంటారు. బాబుని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు ”


“లేదండీ. మీలాంటి అభిమానుల కోసమే ఆ ప్రత్యేకమైన ప్రోగ్రాం. విజువల్‌ మీడియా వాళ్ళు స్పాన్సర్‌ చేస్తున్నారు”


“ఓకే మేడమ్‌. సందీప్‌తో మాట్లాడలేకపోయినందుకు నాకు చాలా నిరాశగా ఉంది”


“అంత నిరాశ ఎందుకు? అవకాశం ఉంటే నేనే మీకు ఫోన్‌ చేయించి మాట్లాడిస్తాను”


“ఇంత చిన్న వయసులో అంత మేథమెటికల్‌ జీనియస్‌ని చూడటం రికార్డు. శకుంతలాదేవి, రామానుజం అంతటి వాడవుతాడు. ఐ విష్‌ హిమ్‌ గుడ్‌లక్‌”


“మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు?”


“నో. నాకు పిల్లల్లేరండి. పదేళ్ళయింది పెళ్ళయి.”


“ సారీ అండి”


“నెవర్‌ మైండ్‌. మీ కాల్‌ కోసం ఎదురు చూస్తాను. లేదంటే కన్వెన్షన్‌ సెంటర్‌కి వస్తాను” అంది సుమ.


“ఓకే అండి. ఉంటాను. బై”


“థాంక్యూ. బై”


రాధ ఫోను కట్‌ చేసింది.

***

శనివారం. నన్నటి ముసురు. ఎక్కువ వానలేదు. అడపా దడపా పడుతోంది.

“ఈ రోజు వాయిదా వేసి మండే సైకిలుకి వెళితే బావుంటుందేమో ఆలోచించు” అన్నాడు సందీప్‌ డాడీ శ్రీనివాస్‌.

“నో వే. ఈ రోజు వెళ్ళాల్సిందే.” అని కాలు నేలకేసి కొట్టి మరీ చెప్పాడు సందీప్‌.

“సర్లెండి వెళ్దాం. అనుకున్నాం కదా. కొందాం. వాడి చిన్న కోరిక తీర్చకపోతే ఎలా? పదండి” అంది రాధ.

“మీ ఇద్దరూ ఒకటైతే నా మాట అవుతుందా? పదండి” అంటూ ముగ్గురూ బయల్దేరారు కారులో.

అరగంట తర్వాత సైకిల్‌ షావ్‌ దగ్గర ఆగారు.

కారుని పార్కింగ్‌ ఏరియాలో పెట్టి వచ్చాడు శ్రీనివాస్‌.

ముగ్గురూ సైకిల్‌ షాపులోకి వెళ్లారు. బేస్‌మెంట్‌లో షాపు ఉంది.


సైకిల్‌ పేకింగ్‌ విప్పి, అన్ని పార్టులూ అతికించి ఒక రూపం ఇవ్వడానికి సైకిలు మెకానిక్స్‌ రోడ్డు మీద పని చేస్తున్నారు. పక్కనుంచి కార్లు వెళ్తున్నాయి. మరో పక్కనుంచి మనుమలు వెళ్తూ వస్తున్నారు. రోడ్డు బాగా రద్దీగా ఉంది.


“ఇక్కడేంటి? కొంచెం లోపలికి పెట్టకపోయారా ఈ సైకిల్‌ పార్టులు అతికించే పని” అని శ్రీనివాస్‌ షాపువాణ్ణి అడిగాడు.

“గత ఇరవయ్యేళ్ళుగా ఇక్కడే చేస్తున్నామండి. రోడ్డు మీదైతే అందరికీ కనపడతాది కదా” అని ఒక మెకానిక్‌ అన్నాడు.

మా ఏరియాకి అదే పెద్ద షాపు. పేరున్న షాపు. అక్కడే అందరూ సైకిళ్ళు కొంటారు.


“సర్లే కానివ్వండి. వర్షం పడటం వలన ఒక పక్కన రోడ్డంతా బురదనీళ్ళు. మరో పక్క వాహనాలు. మీకే ఇబ్బందని అలా అన్నాను” అని సర్ది చెప్పాడు శ్రీనివాస్‌.

“అలా వెళ్లి రండి సార్‌. గంట, గంటన్నర పడతాది” అన్నాడు మెకానిక్‌. బాక్సులోని సైకిలు బయటకు తీసి ప్రతి పార్టు చెక్‌ చేస్తున్నాడు

సందీప్‌ సైకిలు వైపే చూస్తున్నాడు. ఆ సైకిలు వాడికి బాగా నచ్చింది.


రాధ, శ్రీనివాస్‌ రోడ్డుకి ఇవతలవైపు నిల్చున్నారు. సందీప్‌ సైకిలుకి దగ్గరగా రోడ్డు పక్మనే ఉన్న బురద గుంట దగ్గర నిల్చున్నాడు.


“సరే. అలా వెళ్ళొద్దాం. ఈ లోపు సైకిల్‌ ఫిటింగ్‌ చేసి ఉంచుతాడు మెకానిక్‌. రా నాన్నా సందీప్‌ అలా వెళ్ళొద్దాం” అన్నాడు శ్రీనివాస్‌.

“సర్లెండి. వాడికి సరదా. చూడనివ్వండి. మనం అలా రెడీమేడ్‌ షాప్ కి వెళ్ళి వాడికి ఓ డ్రెస్ తీసుకుని వద్దాం పదండి” అంది రాధ.

“ఓకే పద” అన్నాడు శ్రీనివాస్‌.


ఇద్దరూ బయల్దేరబోతుండగా సందీప్‌ పక్కనుంచి రోడ్డుమీద ఓ కారు వెళ్లింది. ఆ కారుకి దారివ్వబోయి సందీప్‌ పక్కనే ఉన్న బురద నీట్లొకి జారిపడ్డాడు. వెంటనే అరిచాడు. నీటిలో పడిన సందీప్‌ కరెంటు షాక్‌ తగలినట్లు ఊగిపోతున్నాడు. గిలగిలా కొట్టుకుంటున్నాడు.


శ్రీనివాస్‌ పరుగెత్తాడు.


“వెళ్లకండి. టచ్‌ చెయ్యకండి. అదేదో కరెంట్‌ షాక్‌లా వుంది” అని ఎవరో అరిచారు.


అందరూ చూస్తున్నారు. ఎవరో పెద్దకర్ర ఒకటి పట్టుకువచ్చి సందీప్‌ని నీటిలోంచి ఆ కర్రతో పక్కకు తీసేసారు. సందీప్‌ పక్కకు పడ్డాడు.

నోటిలో నురగలు. మనిషి నీలం రంగులోకి వస్తున్నాడు.


“అయ్యో సందీప్‌” అని రాధ ఏడుస్తోంది. శ్రీనివాస్‌ కొడుకుని ఎత్తుకున్నాడు. “ఫరవాలేదు” అని భార్యకి ధైర్యం చెప్తున్నాడు కాని అతడికి కూడా లోపల భయంగా ఉంది.


“ఆ నీటిలో ఎలక్టిక్‌ పోల్‌ నుంచి తెగిపడిన వైర్లు ఉన్నాయి. బాబుకి ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టింది. ఆంబులెన్స్‌కి ఫోన్‌ చెయ్యండి” అని ఎవరో అన్నారు. శ్రీనివాస్‌ ఆంబులెన్స్‌కి ఫోన్‌ చేసాడు. పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గరకు వెళ్లి పవర్‌ ఆఫ్‌ చేసారు మరో వ్యక్తి


శ్రీనివాస్‌ సందీప్‌ని ఎత్తుకుని తన కారు వైపు బయల్దేరాడు. రాధ వెనకనే ఏడ్చుకుంటూ పరుగు తీసింది. సందీప్‌ పరిస్థితి దారుణంగా ఉ౦ది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. క్షణాల్లో నవ్వుతూ నిల్చున్న సందీప్‌ నృృహలేని వాడై వేలాడుతున్నాడు. శ్రీనివాస్‌కి బుర్ర పని చెయ్యడంలేదు.


ఆంబులెన్స్‌ వచ్చింది. వెంటనే సందీప్‌ని ఎక్కించారు. ఫస్ట్‌ ఎయిడ్‌ చేస్తూ ఆంబులెన్స్‌ బయల్టేరింది. ఆంబులెన్స్‌లో శ్రీనివాస్‌, రాధ కూడా ఎక్కారు. కూత పెట్టుకుంటూ ఆంబులెన్స్‌ సిటీ హాస్పిటల్స్‌ వైపు బయల్టేరింది.


రాధ ఏడుస్తోంది. శ్రీనివాస్‌ తల పట్టుకుని కూర్చున్నాడు. కొడుకు వైపే చూస్తున్నాడు. సందీప్‌కి తెలివి లేదు.


క్షణాల్లో ఆంబులెన్స్‌ హాస్పిటల్‌కి చేరుకుంది.


***


కొంతసేపు ట్రీట్‌మెంట్‌ తరువాత సందీప్‌ కళ్ళు తెరిచాడు. స్పెషలిస్ట్ వచ్చి సందీప్‌ని చెక్‌ చేసాడు. రకరకాల టెస్టులు, ఎక్స్‌రేలు, స్మాన్‌లు చేసారు.


ఒకరోజు గడిచింది.


డాక్టరు, శ్రీనివాస్‌, రాధలను రూమ్‌లోకి పిలిచి “కూర్చోండి” అన్నాడు. ఇద్దరూ కూర్చున్నారు. ఆందోళనగా

ఉన్నారు. డాక్టరు ఏం చెబుతాడోనని భయంతో, బెంగగా ఉన్నారు.


“సందీప్‌కి ఎలక్ట్రిక్‌ షాక్‌ వలన నడుము కింది భాగం పేరలైజ్‌ అయింది. అయితే భయపడనవసరం లేదు. అది తాత్కాలికమే. నెమ్మది నెమ్మదిగా ఫిజియోథెరపీ చేయిస్తే ఆర్నెల్ల తరువాత సాధారణ స్థితికి వచ్చేస్తాడు. అంతవరకు మంచంమీద ఉండాల్సి వస్తుంది” అన్నాడు.


కొద్దిసేపు భార్యాభర్తలు ఏం మాట్లాడలేకపోయారు.


బాధగా శ్రీనివాస్‌ “ఫిజియోథెరపీ చేయిస్తే మామూలు అవుతాడు కదా డాక్టరుగారూ” అన్నాడు.

“తప్పక అవుతాడు. డోంట్‌వర్రీ. తన యూ ట్యూబ్‌ రికార్దింగ్‌లు కుర్చీలో కూర్చుని చేసుకోవచ్చు. వాటికి ఏం ఇబ్బంది ఉండదు” చెప్పాడుడాక్టరు.


“థాంక్యూ డాక్టరు. థాంక్యూ” అంది రాధ.


“వాడికి ఫేన్‌ ఫాలోయింగ్‌ ఉంది సార్‌” అన్నాడు శ్రీనివాస్‌.


“అవును. నాకు తెలిసింది. న్యూస్‌లో కూడా చూపించారట”


“అవును సార్‌. మీడియా మళ్ళీ మళ్ళీ చూపిస్తోంది.”


“ఏం చేస్తాం? దురదృష్టవశాత్తు అలా జరిగింది. మందులు క్రమం తప్పకుండా వెయ్యండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు సాయంత్రం ఇంటికి తీసుకువెళ్ళొచ్చు” అని డాక్టరు ముగించాడు.


సందీప్‌ని డిశ్చార్డ్‌ చేసారు.


***


బెడ్‌ మీద అలా పడుకుని ఉండటం సందీప్‌కి నచ్చడం లేదు. చికాకుగా ఉంది.


“నాకు సైకిల్‌ కావాలి. సైకిల్‌ తొక్కాలి. సైకిల్‌ తీసుకురండి” అని ఒకటే గొడవ.


తల్లిదం[డ్రులు వాడికి ఏమీ చెప్పలేక సతమతమవుతున్నారు. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతున్నాయి.


“కొద్దిరోజులు తరువాత నువ్వు సైకిల్‌ తొక్కుతావు. ఇప్పుడు కుదరదు నాన్నా” అని రాధ చెప్పింది కళ్ళు తుడుచుకుంటూ.


“నాకేమైంది? నేను లేవలేనా ఎప్పటికీ?” అడిగాడు సందీప్‌.


“నో. నీకేం అవలేదు. బాగానే ఉన్నావు. కొద్దినెలలు ఇలా ఉండాలి. ఆ తరువాత నువ్వ తాపీగా సైకిలు తొక్కొచ్చు” అని చెప్పాడు శ్రీనివాస్‌.


“నాకు సైకిల్‌ కావాలి. ఆ సైకిల్‌ తీసుకురండి” అని అడిగాడు సందీప్‌.


“వద్దు. దాని కోసం వెళ్ళినప్పుడే నీకు ఇలా జరిగింది. అది వద్దు. నువ్వ లేచి తిరిగినప్పుడు కొత్తది మంచిది తీసుకుందాం”


“నో. నాకు సైకిల్‌ కావాలి. సైకిల్‌ కావాలి” అని మారాం చేస్తున్నాడు సందీప్‌. కొంత కాలానికి తన గురించి తనకి అర్ధమైపోయింది. సైకిల్‌ గురించి అడగడం మానేసాడు. రాధకి చాలా బాధేసింది.


చక్రాల కుర్చీలో కూర్చుని తన మేథమెటికల్‌ సెషన్స్‌ చేస్తున్నాడు సందీప్‌. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా ఎంతో తెలివిగా సమాధానాలు చెబుతున్నాడు. కంప్యూటర్‌ కంటే వేగం పుంజుకున్నాడని చాలామంది పెద్దలు ప్రశంసించారు.


“హి ఈజ్‌ జీనియస్‌. కాని ఇలా జరగడం దురదృష్టం. తొందర్లోనే మామూలైపోతాడు”


“వెరీ షార్ప్. మార్వలెస్‌. ఇటువంటి అబ్బాయి ప్రపంచానికి కావాలి


“తొందర్లోనే గిన్నిస్‌ బుక్‌ రికార్డు కోసం ఏర్పాట్లు చేస్తాం”


ఇలా సందీప్‌ పేరు మీడియాలో వైరల్‌ అయిపోయింది.


ఒకరోజు సందీప్‌ ఇంటిముందు కారు ఆగింది. అందులోంచి దిగింది సందీప్‌ అభిమాని సుమ.


“హలో మేడమ్‌. మీకు నేను ఒకసారి ఫోన్‌ చేసాను. సందీప్‌కి ఇలా జరిగిందని తెలిసి నేను ఏడ్చాను. ఎంతో బేడ్‌లక్‌” అంది కళ్ళల్లోనీళ్ళు తిప్పుకుంటూ.


“ఓ. మీరా. రండ్రండి.” అంటూ సుమని తీసుకుని వెళ్లి సందీప్‌కి పరిచయం చేసింది.


“హలో ఆంటీ బాగున్నారా? మమ్మీ చెప్పింది మీ గురించి” అన్నాడు. సుమ సందీప్‌ చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుంది. వలవల ఏడ్చింది.


“దయచేసి ఏడవకండి. మీరు ఆశీర్వదించండి. తొందర్లో సందీప్‌ లేచి తిరుగుతాడు” అంది రాధ.


“తిరగడమే కాదు. పరుగు తీస్తాడు”


“కాదాంటేీ. సైకిల్‌ తొక్కుతాను” అన్నాడు సందీప్‌ దృఢంగా.


“ఎస్‌” అంది సుమ.


“అవును” అంది రాధ.


“సందీప్‌ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చయిందో అదంతా నేను ఇస్తాను. దయచేసి మీరు కాదనకండి” అంది సుమ.


“వద్దు. మీరెందుకు ఇవ్వడం?” అంది రాధ.


“కోట్లున్నాయి. పిల్లల్లేరు. ఈ అవసరంలో కూడా నేను సహాయం చెయ్యకపోతే దేవుడు నాకు మరో దురదృష్టం రాస్తాడు”


“అయ్యో. మీకెలా ఇష్టమైతే అలా చెయ్యండి. మీ ఆనందమే మా ఆనందం”


కారెక్కేముందు డిక్కీలోంచి ఒక పెద్ద బాక్స్‌ పేకింగ్‌ తీసి సందీప్‌ మంచం ముందు పెట్టింది.


“నేను వెళ్లిపోయిన తరువాత దాన్ని చూడండి. ప్లీజ్‌” అని వెళ్లిపోయింది సుమ.


రాధకి అర్థం కాలేదు. 'సరే' అని సుమకి బై చెప్పింది. సందీప్‌ ఆ బాక్సుని చూసి “ఏంటమ్మా అది” అని అడిగాడు.


“నాకేం తెలుసు. నీ అభిమాని నీకు తెచ్చిన బహుమతి.”

“విప్పి చూపించవా?” అనడిగాడు. వెంటనే విప్పి బయటకు తీయించింది.


“వావ్‌” అని అరిచాడు సందీప్‌. అది ఖరీదైన ఇంపోర్టెడ్‌ సైకిల్‌


రాధ మాట రాక అలాగే ఉండిపోయింది.


“సైకిలు నేను తొక్కలేను కదమ్మా” అన్నాడు సందీప్‌ బాధగా.


“ఆ విషయం ఆంటీకి తెలియదు కదా”


“ఫరవాలేదు. కీప్‌ దట్‌ సైకిల్‌ లైక్‌ దట్‌ రోజూ దాన్ని చూస్తూ ఉంటాను.”


“వద్దు నాన్నా బాక్సులో పెట్టేస్తాను


“వద్దు,అలాగే ఉంచు”


రాధ సైకిలుని సందీప్‌ మంచం ఎదురుగానే ఉంచింది. రోజూ దాన్ని చూస్తూ సందీప్‌ ఎంతో సంతోషంగా అనుభూతి పొందేవాడు. ఆ సైకిలుని మనసులో ప్రతి క్షణం తొక్కేవాడు. దానితో కలలు కనేవాడు. మానసికంగా సందీప్‌ సైకిలు వేసుకుని తనకి ఇష్టమైన ప్రదేశాలన్నీ తిరిగేవాడు.ఎవరొచ్చినా సైకిలు గురించి తన ప్రేమని వ్యక్షపరిచేవాడు.

***


ఒకరోజు రాధ డాక్టరుగారికి ఫోన్‌ చేసింది.


“సర్‌. సందీప్‌ లేచి నిలబడ్డాడు. అడుగులు కూడా వేస్తున్నాడు.” అని ఎంతో ఉద్వేగభరితంగా చెప్పింది.


“వావ్‌! రెండో నెలలో లేచి నిలబడ్డాడా? కనీసం ఆరునెల్లకి లేస్తాడని నా మెడికల్‌ నాలెడ్డితో అంచనా వేసాను. ఇది అద్భుతం. మార్వలెస్‌. సందీప్‌ ఫోటో నాకు వాట్సప్‌లో పంపండి” అని డాక్టరు ఆశ్చర్యంతో చెప్పాడు.


వెంటనే సందీప్‌ ఫోటో వాట్సప్‌లో డాక్టరుకి రాధ పంపింది.


“అద్భుతం” అని డాక్టరు థమ్సప్‌ సింబల్‌ పంపాడు. ఎంతో సంతోషం కలిగింది రాధకి.


“అతి త్వరలో సైకిల్‌ కూడా తొక్కుతాడు. సైకిల్‌ అతడికి వస్తువు (యంత్రం) కాదు. ప్రాణం పోసుకుని తన ముందు నిల్చుని తనతో మాట్లాడుతున్న ఒక స్నేహితుడు. ఆల్‌ ది బెస్ట్‌ టు జీనియస్‌ సందీప్‌” అని డాక్టర్‌ జూమ్‌లో మాట్లాడి సందీప్‌ని తెగ మెచ్చుకున్నాడు.


తరువాత పదిహేను రోజులకే సందీప్‌ ఇంటి గార్జెన్‌లో సైకిల్‌ తొక్కడం మొదలుపెట్టాడు. ఆ వీడియో యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసాడు. అది వైరల్‌ అయ్యింది.


ఆ వీడియో చూసి ఆనందభాష్పాలు కార్చింది సందీప్‌ ముఖ్య అభిమానుల్లో ఒకరైన సుమ.


***


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయిరచయిత పరిచయం :

పేరు : పొట్నూరు ఆనంద సాయి జగన్నాధ్

వీరు అప్లైడ్ జియాలజి లో ఎం.ఎస్ సి చేసారు.

గ్రౌండ్ వాటర్ కన్సల్టెంట్ గా, జియాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.

100 కి పైగా కథలు,3 నవలలు,3 సినిమా కథలు, 150 కి పైగా వ్యాసాలు,18 ఆధ్యాత్మిక గ్రంథాలు రాసారు.ఎన్నో అవార్డులు అందుకున్నారు.

వీరి రచనలు అన్ని ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
68 views0 comments

Comments


bottom of page