top of page

సుఖ దుఃఖాలు



Sukha Dukhalu Written By Ram Mohan Thimmaraju

రచన : రామ్ మోహన్ తిమ్మరాజు


"ఫోన్ ఎవరి నుంచి జానకి" అంటూ హాల్లోకి వచ్చాడు రామచంద్రం.

"ఎవరో బ్యాంకు వాళ్ళు అప్పు కావాలా అని చేసారు. అయినా మీ పిచ్చి కానీ మనకు ఎవరు ఫోన్ చేస్తారు ఏ పని లేకుండా" అంది. ఆ మాట నిజమే అయినా ఎదో ఆశ, ఎవరైనా ఫోన్ చేసి తనని పలకరిస్తారని. వాట్సాప్ , పేస్ బుక్ లో మాత్రం చాలానే సందేశాలు వచ్చాయి, తొందరగా కోలుకోమని. తనకు వచ్చిన రోగం అలాంటిది. మహా అయితే మూడు నెలలు దాటి బ్రతకవని అందరు డాక్టర్లు చెప్పేసారు. రామచంద్రం భార్య ఈ విషయం అందరికి తెలియ పరిచింది. మొదట్లో కొందరు హాస్పిటల్ కి వచ్చారు కానీ రామచంద్రం ఉన్న పరిస్థితి, హాస్పిటల్ నియమాల వలన వారితో ఎక్కువ సేపు గడపలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చాక అందరిని చూడాలి, మాట్లాడాలనే తాపత్రయం పెరిగింది కానీ అందరూ రావడం తగ్గించేశారు. కేవలం సందేశాలు మిగిలాయి. "ఈ రకంగా జీవితం అరవైఏళ్లకే ముగిసి పోవాల్సిందేనా" అని నిరాశగా అనుకుంటూ రామచంద్రం లోపలికి వెళ్లి పోయాడు.

***** ***** *****

ఆ రోజు చాల ఆనందంగా ఉన్నాడు సాయిరాం. సొంత ఇల్లు కట్టుకోవాలనే తన చిరకాల కల నిజమైంది నేటితో. అంతే కాక ఇవాళ అతని నలభయ్యవ పుట్టినరోజు కూడా. చిన్నప్పటి నుండి అద్దె ఇంట్లో ఉండడం, మాటి మాటికి మారాల్సిరావడం ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డ తను ఎప్పటికైనా సొంత ఇల్లు ఉండాలనుకొనేవాడు. సాధారణ ఉద్యోగస్తుడైన తాను, చిన్నదైనా అందమైన ఇల్లు కట్టాడంటే అందులో తన భార్య పాత్ర ఎంతో ఉంది. తన ఆశయాన్ని అర్థం చేసుకొని, ఉన్నదానితో సర్దుకుపోతూ ఎంతో సహకారం అందించింది. నిజానికి పెళ్ళికి ముందు ఇద్దరం ఒకరికొకరు తెలియక పోవడంతో ఒక రకమైన భయం ఉండేది. కానీ, కలిసి బ్రతకడం మొదలు పెట్టి, ఒకరి నొకరు అర్థం చేసుకుంటున్నకొద్దీ ఆ భయాలన్నీ పోయాయి. ఇంత మంచి భార్య, అందమైన ఇల్లు ఇంతకంటే నాకు ఇంకేమీ కావాలి అనుకున్నాడు సాయిరాం.

***** ***** *****

అప్పుడే సృహలోకి వచ్చిన రామ్ కి తండ్రి మాటలు కొద్ది కొద్దిగా వినిపిస్తున్నాయి. నాన్న "డాక్టర్ గారు, మా రామ్ ని ఎలాగైనా కాపాడండి. వాడు మా ఏకైక సంతానం. ఇంకా ఇరవైఏళ్లు కూడా నిండలేదు చదువుల్లో, ఆటల్లో ఎంతో చలాకీగా ఉండే వీడు ఇలాంటి పిరికి పని చేస్తాడనుకోలేదు. నిన్న వచ్చిన ఐఐటీ ఫలితాల్లో వీడికి మంచి రాంక్ రాలేదు. కానీ, మేమెవ్వరం ఒక్క మాట కూడా అనలేదు. కానీ వీడు ఓటమిని జీర్ణించుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. " అని కన్నీళ్ల పర్యంతంతో చెప్తున్నాడు. ఆ మాటలు వింటున్న రామ్ కి తాను హాస్పిటల్ లో ఉన్నానని, తల్లి తండ్రులని ఎంత బాధ పెట్టే పని చేసాడో అర్థమైంది. సృహలోకి వచ్చిన రామ్ ని డాక్టర్ చూసి, అతని తల్లి తండ్రులని బయటకు పంపించి రామ్ తో "చూసావా! మీ తల్లి తండ్రులు ఎంత బాధ పడుతున్నారో. ఐఐటీ సీట్ రానంత మాత్రాన జీవితం లో ఓడిపోయినట్టు కాదు. నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావన్నది కాలేజీలో చేరే దాకానే. నువ్వు ఇంజినీరింగ్ లో చేరాక నీ స్కూల్ గురుంచి ఎవ్వరూ అడగరు. ఇది కూడా అంతే. నువ్వు ఫై చదువులకు వెళ్లి మంచి ఉద్యోగంలో చేరాక నువ్వు ఎక్కడ ఇంజినీరింగ్ చదివావు అని ఎవ్వరూ పట్టించుకోరు. ఉద్యోగంలో నీ ప్రతిభ మాత్రమే వారికి ముఖ్యం" అని చక్కగా చెప్పారు. ఇది విన్న రామ్ ఆలోచనా దృక్పధంలో ఎంతో మార్పు వచ్చింది. వాళ్ళ తల్లి తండ్రులకి ఇంక ఇలాంటి పిచ్చి పని ఎప్పుడూ చెయ్యనని మాట ఇచ్చాడు.

***** ***** *****

విజయదశమి సాయంత్రం 6 గంటలు. దేశమంతా పండుగ సందడి. కృష్ణమూర్తి ఇంట్లో పండుగ హడావుడికి, ఇంకో మంచి శుభవార్త కలిసింది. అది కృష్ణమూర్తి దంపతులకు పండంటి బాబు పుట్టడం. అదీ దీర్ఘకాల నిరీక్షణ తరువాత. వాళ్ళ పెళ్లయి తోమిదేళ్ళు దాటింది. పెళ్లయిన సంవత్సరం నుంచే వారిని పిల్లల కనమని పెద్దవాళ్ళు పోరు పెట్టేవారు. అది మెల్ల మెల్లగా మాటలు అనడం, హేళనగా చూడడం వరకు వెళ్ళింది. కృష్ణమూర్తి దంపతులు ఆ మాటలకు బాధ పడ్డా , ఆశ వదులుకోకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేసారు. చివరకి ఈ దసరా రోజు విజయం సాధించారు. బాబుకి వారి కుల దైవం, పండుగ సందర్భం కలిసి వచ్చేట్టుగా "సాయి రామ చంద్ర" అని పేరు పెట్టారు.

***** ***** *****

పాఠకులారా, ఒక్కసారి పైన రాసిన పేరాలు ఆఖరి పేరా నుంచి మొదటి పేరా దాక మళ్లీ చదవండి. ఈ సారి చదివేటప్పుడు, ఈ సంఘటనలు అన్ని ఒక మనిషి జీవితంలో జరిగినవే అనుకుని చదవండి. సాయి రామ్ చంద్ర అనే పేరు గల ఆ బాలుడిని వివిధ దశల్లో రామ్ అని, సాయి రామ్ అని, రామచంద్రం అని చుట్టూ పక్కల వారు పిలిచేవారు. అతని జీవితంలో పైన పేర్కొన్న ముఖ్యమైన సంఘటనలు మానవ జీవితపు సుఖదుఃఖాల చక్రాన్ని ప్రతిబింబిస్తాయి.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి

రచయిత పరిచయం


నా పేరు రామ్ మోహన్, వయస్సు యాభయ్ ఆరు సంవత్సరాలు. పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా లో, గత నలభై ఆరు సంవత్సరాలు గా ఉంటున్నది భాగ్యనగరం లో. చదువు కున్నది ఎమ్. ఎస్, ఉద్యోగం చేస్తున్నది ఒరాకిల్ హైదరాబాద్ లో. నేను చిన్నప్పటి నుంచి కథలు చదవడము (పుస్తక రూపం లో), వినడం (రేడియో లో), చూడడం (టీవీ, నాటకం, సినిమా రూపం లో) జరిగేది. వాటి ప్రభావం వలన కథలంటే ఆసక్తి కలిగి కథలు చెప్పడమనే విద్య అబ్బింది.ఇన్నేళ్ళ తరువాత అది కథలు రాసే అలవాటుగా మారింది. కొన్ని నెలలు గా నేను కొన్ని వ్యాసాలు, కథలు రాస్తున్నాను. నా మొదటి పుస్తకం "నేను చూసిన లోకం", సెప్టెంబర్ 2, 2020 న విడుదల అయింది. నా మనసులో వివిధ అంశాల పైన వచ్చిన ఆలోచనలు పదిహేను వ్యాసాలుగా మారగా, వాటి సంపుటి ఆ పుస్తకం. నేను రాసిన కధలు కొన్ని పత్రికలలో ప్రచురించారు.


70 views1 comment

1 Comment


Vasu Dasu
Vasu Dasu
Dec 29, 2020
కథ భావోద్వేగాలతో నిండి ఉంది. అభినందనలు
Like
bottom of page