top of page

సుఖీభవ


'Sukhibhava' written by A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

విజయవాడ నుంచి హైదరాబాదు వచ్చినప్పుడు పరిచయం అయ్యారు గోపాల్ గారు. ధురి భర్త కలీగ్... డిపార్ట్ మెంట్ వేరు. గొప్ప సాహిత్యాభిమాని. ధురి రచయిత్రి. ఇకనేం.. చర్చలు, విమర్శలు, బుక్స్ కొని చదువుకోడం.. వేగంగా కాలం గడిచిపోయేది. గోపాల్ గారి అమ్మాయి సాగరి ధురికి బాగా చేరిక. దానికి చాలా కారణాలు వున్నాయి. మొదట్లో గోపాల్ గారి కుటుంబం గురించి తెలియదు..... రెండేళ్ల తర్వాత తెలిసింది. గోపాల్ భార్య అరవింద చాలా అందగత్తె. ఆవిడకి మేకప్ అంటే ప్రీతి. అందం చెరగ నీయదు, చీర నలగనీయదు. ఇంటిని భర్త పిల్లలను పట్టించుకోదు కానీ శ్రద్ధగా ముస్తాబు అవుతుంది. ఆవిడకు పెద్ద లోపం

మానసిక వికలాంగురాలు. కొడుక్కి అదే జెనిటిక్ ప్రాబ్లమ్. సాగరి ఒక్కతే బాగుంది. కానీ పాపం.. ఇంట్లో అమ్మ ఆదరణ, ప్రేమ లేకుండా పోవడంతో ధురికి దగ్గరైంది. కుటుంబ విషయాలు అన్నీ చెప్పేది..... 'అమ్మ కి ఏమీ పట్టదు. అందంగా మేకప్ చేసుకుని టీవీ చూసి టైముకి భోజనం చేసి హాయిగా నిద్రపోతుంది. అన్నయ్య

రీహాబిలటైజేషన్ సెంటర్లో ఉంటాడు. దానికి నెలకి 50 వేలు కట్టాలి. అక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది. మా నాన్నకి

వాడంటే ప్రేమ. వారానికి మూడు రోజులు వాడితో ఉంటాడు. ఇంట్లో అమ్మ బాధ్యత నాది. డిగ్రీ పూర్తిచేసి

ఇల్లు చూసుకుంటున్న సాగరికి పెళ్లి చేయాలనే ఆలోచన ఎవరికీ లేదు. గోపాల్ లెక్చరర్. కొంత ఆస్తి, వుంటున్నదికాక రెండు ఫ్లాట్స్ వున్నాయి. వాటిమీద యాభై వేలు రెంట్ వస్తుంది.

సాగరి చెప్పిన మాటలకూ జాలి కలిగింది ధురికి.

ఒకరోజు గోపాల్ గారిని అడిగింది.

''మీ కష్టాలు మీకు ఉంటాయి అనుకోండి. సాగరికి పెళ్లి చేయాలి కదా! సంబంధాలు చూస్తున్నారా?''

''బంధువుల్లో ఎవరూ ముందుకు రావడంలేదు. బయట సంబంధాలు చూస్తే వుద్యోగం, చదువు అడుగుతున్నారు. దీనికి చదువంటే శ్రద్ధ పట్టదు. ''అన్నాడు.

''అవుననుకోండి.... ఐనా తప్పదు.... ఏదోలా చేసెయ్యండి. వాళ్ళమ్మగారు బాగుంటే వూరుకునేవారుకాదు కదా '' అంది ధురీ.

ఆలా అడిగినందుకు కోపం వచ్చినట్టుంది. రావడం తగ్గించాడు.

కానీ సాగరి వస్తూనే ఉండేది. ఏదో తన బాధలు చెబుతూ ఉండేది.

''సాగరీ నువ్వు ఏదైనా కోర్స్లో చేరు. ఖాళీగా ఉండకు.... అని కంప్యూటర్ కోర్స్లో చేర్పించింది మాధురి.

ఒకరోజు గోపాల్ సాగరికి పెళ్లి కుదిరింది అని చెప్పేడుట, ధురి భర్త భరత్ కి కాలేజీలో.

‘అదేమిటీ! సాగరి నాతో చెప్పలేదు....’ అని ఫోన్ చేసింది ధురి.

''మీ ఇంటికి వచ్చ్చినపుడు చెబుతాను ఆంటీ...........” అంటూ రెండురోజుల తర్వాత వచ్చినపుడు చెప్పింది.

''మా నాన్న వట్టి అమాయకుడు ఆంటీ... ఆయన డిపార్ట్మెంట్లో కొత్తగా జూనియర్ లెక్చరర్ చేరాడుట.

అతను మాఇంటికి వచ్చాడు. పేరు మదన్అట. అదేలేండి, మానాన్న పిలిస్తే ! నన్ను పరిచయం చేసాడు. నెలరోజుల తర్వాత ''అతను భార్యకి విడాకులు ఇచ్చాడు. నిన్ను పెళ్లి చేసుకోడానికి ఇష్ట పడుతున్నాడు. ఏమంటావ్?అని అడిగాడు మానాన్న.

“అదేమిటి నాన్నా! రెండవ పెళ్లి అతనా... ?” అన్నాను.

''నీకు సంబంధాలు రావడం లేదు. వచ్చిన దాన్ని వదులు కుంటామా?” అన్నాడు.

“మీతో పరిస్థితి చెబుదాం అనుకుంటున్నా. నాకు ఇష్టం లేదు. నాన్నతో ఇంకా చెప్పలేదు. మీతో చెప్పి సలహా తీసుకుందామని ఎదురు చూస్తున్నా. మదన్ నన్ను MA చదివిస్తాను ట్యూషన్ కి రమ్మన్నాడని నాన్న చెబితే ఒకరోజు వెళ్ళాను. అప్పటికే ఇద్దరు ట్యూషన్ కి వచ్చిన అమ్మయిలు వున్నారు అతని ఇంట్లో.

ఎందుకో వాళ్ళ తీరు అనుమానంగా తోచింది. నన్ను చూసి, వాళ్ళని పంపేశాడు. నాకు గంట లెసన్స్ చెప్పి

పంపేశాడు. మధ్యలో ఏవో ఫోన్ కాల్స్ వస్తూనే వున్నాయి. ''అంటూ జరిగింది చెప్పింది సాగరి.

''నీ అనుమానం ఏమిటి?” అడిగింది ధురి.

''మదన్ బ్రోతల్ హవుస్ నడుపుతున్నాడని. భార్యకి విడాకులు నిజం కాదని. ఏదో అతని వెనకాల కథ ఉందని. '' మీరు సహాయం చేయాలి అంకుల్తో చెప్పి!” అంది సాగరి.

''సరే మదన్ ఇంటి అడ్రస్ చెప్పు. అంకుల్కి ఇచ్చి తెలుసుకోమంటాను.... నువ్వు తొందరపడి ఒప్పుకోకు” అంది ధురి.

''బాబోయి ఇలాంటి పెళ్ళికంటే పెళ్లి కాకపోవడమే మంచిది. మీకు చెప్పనిదే ఏ నిర్ణయం తీసుకోను. '' అంది.

రెండు రోజుల తర్వాత భరత్ అన్నీ తెలుసుకున్నాడు.

మదన్ బ్రోతల్ హవుస్ నడిపేది నిజమే. అతడి భార్య వేరే వెళ్ళిపోయి కేసు పెట్టింది. రాజకీయ నాయకుడి

సపోర్ట్ వుందిట మదన్కి. గోపాల్ కూడా మదన్ మాయలో పడి సాగరి నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు.

గోపాల్ ని, సాగరిని ఇంటికి రమ్మని ఈ విషయాలు చెప్పేడు భరత్.

''నాన్నా! నాకు పెళ్లి చేయద్దు. ఇలా బతకనీ.... ఆ మదన్ లాంటివాడిని ఎలా నమ్మావు? ఇంత అమాయకుడివేమిటి నాన్నా!” అంటూ ఏడ్చింది సాగరి.

''మదన్ చెప్పే మాటలు అలాగే వుంటాయిలే సాగరీ. పాపం మీ నాన్నగారే కాదు, ఎవ్వరూ కనిపెట్టలేరు. ''

అన్నాడు భరత్.

అప్పటినుంచీ గోపాల్ కి మంచి, చెడూ చెబుతూ వయసులో చిన్నవాళ్ళు ఐనా భరత్, ధురీ ఆత్మీయులయ్యారు.

గోపాల్ రిటైర్ అయ్యాడు. ఆయన, సాగరి కలసి టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఇంటిదగ్గిరే ట్యూషన్స్ చెప్పడం మొదలు పెట్టారు.

''ఆంటీ! మీ స్నేహం, సలహా నా జీవితానికి పెద్ద ఆసరా ! మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలి…” అనేది సాగరి.

''దానికేంగానీ నీ లైఫ్ బాగుండాలి.... మీ అమ్మగారు మొదటినుంచీ ఇంతేనా.. తర్వాత ఈ మెంటల్ ప్రాబ్లమ్ వచ్చిందా..... ?

''నాకు సరిగా తెలియదు. మా బంధువుల్లో ఒకరు చెప్పారు. ‘మా తాతగారికి ఒక్కటే కూతురు మాఅమ్మ.

చాలా అందంగా ఉండటం వలన చాలా మంది అడిగేవారుట కోడలిగా చేసుకుంటామని.... కానీ తాతగారికి వారిమీద నమ్మకంలేక అనాధ ఐనా, నాన్నగారిని చేరదీసి చదువు చెప్పించి 'మా అమ్మాయిని చేసుకుని

నా ఆస్తి కాపాడు'' అన్నారట. ఆ కృతజ్ఞత వలన నాన్న వెంటనే ఒప్పుకున్నారుట. అమ్మ ఎలా ప్రవర్తించినా

ఏమీ అనలేదుట. అమ్మను ఒక దేవతగా చూసేవారట. తాతగారు తృప్తిగా నాన్న చేతిలోనే మరణించారు.

ఇంట్లో ఎప్పుడూ నలుగురు పనివాళ్ళు ఉండేవారు. అన్నయ్య కి పదహారేళ్లు వచ్చేసరికి అమ్మలాగే ప్రవర్తించడం, డాక్టర్లు ఏమీ చేయలేక పోవడం నాన్నను బాగా క్రుంగ దీసింది. సిగరెట్లు, సినిమాలు, డబ్బు విచ్చల విడిగా ఖర్చు చేయడం.. ఏదైనా అంటే పెద్దగా గొడవ. చివరికి వాడి చేష్టలు వికృతంగా మారాయి. నన్ను కొట్టేవాడు. విపరీతంగా తినేవాడు. దానితో బరువు పెరిగి అనారోగ్యం. వాడితో సమస్య పెరిగింది.

భరించలేక హోంకి పంపించారు. '' అంటూ చెప్పింది.

గోపాల్ ఎప్పుడూ చెప్పలేదు. భరత్, ధురీ కూడా ఆ ప్రసక్తి తీసుకురాలేదు.

భరత్ కి అమెరికా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఆఫర్ రావడంతో అమెరికా వెళ్లిపోయారు.

కొన్నాళ్ళు సాగరి ఫోన్ చేసి విషయాలు చెప్పేది. ధురీ కూడా వచ్చిన అవకాశం వినియోగించుకుంది.

కాలేజీలో చేరి డిగ్రీ చేసి ఉద్యోగంలో చేరింది. ఆ బిజీలో నాలుగేళ్లు గడిచి పోయాయి.

చాలా కాలానికి ఇండియా వచ్చినపుడు తెలిసింది. గోపాల్ కుటుంబం హైదరాబాదు నుంచి గుంటూరు దగ్గిర

వాళ్ళ వూరికి వెళ్లిపోయారని. ఫోన్ చేస్తే సాగరి చెప్పింది.

''అవును ఆంటీ.... హైదరాబాదులో.... మాకు ఖర్చులు పెరిగాయి. అమ్మలో మార్పులేదు కానీ నాన్నగారి

ఆరోగ్యమూ పాడైంది. చాలా డబ్బు ఖర్చు అయింది. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసారు. అన్నయ్య వుండే హోమ్ కి ఫీజు లక్ష ఏభైవేలు చేసారు. ఒక ఫ్లాటు అమ్మేసి వచ్చేసాం. సంవత్సరానికే నాన్నగారు పోయారు.

ఇప్పుడు అమ్మ, నేనూ ఉంటున్నాం. మిమ్ములను కలిసే అవకాశం లేదు. '' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

''మరి ఆస్తి నీకు రాశారా నాన్న?” అడిగింది ధురీ.

''అదే కొంప మునిగింది ఆంటీ. ‘నాన్నా! విల్లు రాయండి…’ అని చెప్పినా వినలేదు. మేము వుండే ఈ ఇల్లు మాత్రం నాకు ఇచ్చారు నాన్న. విజయవాడలో మా భూములు

అన్నీ స్టేట్ విడిపోయినప్పుడు అమరావతి గొడవల్లో పోయాయి. హైదరాబాదు రెంటు వచ్చే ఫ్లాట్లు అన్నయ్య పేరుతొ రిజిస్టర్ చేశారట. లాయరుతో మాటాడాలి. అన్నకి రాస్తే చెల్లుతుందా? నాపేరుకి రిజిస్టర్ చేయాలంటే ఏమిచేయాలో ఏమీ అర్థం కావడం లేదు. నాకు అన్నీ సమస్యలు తెచ్చిపెట్టారు ఆయన. ''

''అయ్యో పాపం. అన్నీ ఉండి ఆ పిల్లకి మళ్ళీ కష్టాలు. ఏ సాయం చేద్దామన్నా మనం ఇక్కడ ఉండటంలేదు…”

అని భరత్ కూడా బాధపడ్డాడు. అతనికి తెలిసిన లాయరుకి సాగరి కేసు అప్పగించాడు.

''పెళ్లి, పిల్లలు ఎటూలేదు. ఆతల్లి కి తోడు కోసమే సాగరి పుట్టిందేమో..... కొందరి జీవితాలు ఇంతే!”

అనుకుంది జాలిగా ధురీ.

''ధైర్యంగా వుండు. వీలుంటే నేనే వస్తా......” అంటూ చెప్పింది..... కానీ ధురీకి టైం సరిపోలేదు. అమెరికా వెళ్ళిపొయిన్ది.

వెళ్ళాక ఫోన్ చేసింది “నీకు ఎలాంటి అవసరం వచ్చినా నాతో చెప్పు.... నన్ను మరిచిపోకు” అని.

ఏడాదితర్వాత సాగరి ఫోన్ చేసింది. “అంకుల్ అప్పగించిన లాయర్ ధర్మతేజ నాకు చాల సాయం చేయడమేకాదు..... నాన్న గారి ఆస్థి మొత్తం నాకు వచ్చింది.

నన్ను పెళ్లి చేసుకున్నారు. అమ్మ కూడా నాకు లైన్ క్లియర్ చేసి వెళ్ళిపొయిన్ది. నేను ఇప్పుడు సమస్యలు తీరి సుఖంగా వున్నాను. అంకుల్, మీరు చేసిన సహాయం నా జీవితాన్ని

నిలబెట్టింది... '' అంటూ.

''మీ దాంపత్యం నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం సాగరీ.... అంటూ అభినందనలు

చెప్పింది ధురీ.

***శుభం ***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :  63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.




35 views0 comments
bottom of page