top of page

స్వేచ్ఛ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.'Sweccha' written By Sita Mandalika

రచన : సీత మండలీక

అమెరికా వచ్చి దగ్గర దగ్గర మూడేళ్లవుతున్నా ఆ దేశం పై ఇంకా పూర్తిగా మమకారం రాలేదు.

పొద్దున్నే అందరూ ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళేక తీరికగా కూర్చుని కాఫీ తాగే సమయం లో హాలుకి దగ్గరగా ఉన్న వరండాలో పంజరంలో రామచిలుక ‘కరుణా, కరుణా’ అని పలకరిస్తూ ఉంటుంది. దానిని ఒక సారి పలకరించి ఆపిల్ కట్ చేసి పంజరం లో పెట్టడం కరుణ రోజూ అలవాటు.

ఇంతకూ ఆ చిలక కరుణ మనవరాలు ప్రియ కి పెట్. దానిని ముద్దుగా మిట్టూ అని పిలుస్తుంది. మిట్టూ వచ్చి ఒక ఏడాదయింది. అందరూ వెళ్లిపోయేక ఈ మిట్టూ మాటలతో కరుణకి, శ్రీరామ్ కి మంచి టైం పాస్. స్కూల్ నించి వస్తూనే ప్రియ మిట్టూ తో కబుర్లాడుతూ ఉంటుంది. కరుణ అన్న పిలుపు దానికి ప్రియే నేర్పింది. కరుణ కోడలు వైజయంతి ని అమ్మా అని, ప్రియ డాడీని శేషు అని.. ఇలా అందరిని వేరే వేరే పేర్లతో పలకరిస్తుంది. ప్రియ మిట్టూని పంజరం లోనించి తీసి ఒక గంట సేపు ఆడుకుంటుంటే దాని ఆనందానికి అంతులుండవు. ఎగిరి ప్రియ భుజం మీద, ఒంట్లోనూ కూర్చుని కబుర్లు చెప్తుంది.

ఆటలయి పోగానే "నౌ గో ఇన్సైడ్ మిట్టూ’ అంటే మొహం వేళ్ళాడేసుకుని పంజరంలో దూరుతుంది. మిట్టూని చూస్తే అరుణకు జాలి వేసేది. ఎన్ని భోగ భాగ్యాలు ఉన్నా స్వేచ్ఛ అన్నది లేక పొతే ఏ ప్రాణి సంతోషంగా ఉండలేదు కదా అనిపించింది.

దసరా పండుగలు తరవాత చలి ఆరంభం అయ్యింది. మళ్ళీ ఏప్రిల్ వరకు స్వట్టర్ లు వేసుకోవాలి అని విసుక్కుంటూ కబోర్డ్ తెరిచి హాంగర్ కి ఉన్న బట్టలు చూస్తుంటే "కరుణా! నావి కూడా అన్నీ తీసి హాంగర్ కి పెట్టు. ఏమిటో ఈ దేశంలో వచ్చి పడ్డాము ఎప్పుడూ ఊహించలేదు" అని శ్రీరామ్ అన్నాడు.

“అదే మరి! జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకి తెలియదు కదా! పిల్లల చదువు, వాళ్ళ భవిష్యత్తు.. వాళ్లకి ఇక్కడ అన్ని విధాలా బాగుంటుందని స్థిర

పడుతున్నారు. అందరితో పాటు మన శేషు కూడా. మన అమ్మాయి లావణ్య ఎం. బీ. ఏ. అయ్యేక ఇండియా లో ఎన్ని సంబంధాలు చూసేము. ఏది మనకి నచ్చలేదు. బాగా తెలిసిన వాళ్ళు శేషు స్నేహితుడు అయిన హరీష్ కి ఇచ్చి పెళ్లి చేసేము. ‘అమెరికా మ్యాచ్ అయితే బాగుండును.. అన్నయ్యకి దగ్గరగా ఉంటాను’ అని లావణ్య కూడా సరదా పడింది. ఏది ఏమైనా దానికీ ఈ అమెరికా తప్పలేదు”.

“ఆ రోజుల్లో మనం ఇంక ఎక్కువగా ఆలోచించలేదు. హాయిగా రెండేళ్లకోసారి వచ్చి ఆరు నెలలు గడిపి వెళ్లిపోయే వాళ్ళం. లేక మనవలు మనవరాళ్లు పుట్టినప్పుడు వాళ్ళని చూసుకోడానికి కొన్నాళ్ళకు వచ్చే వాళ్ళం. టైం సులువుగా గడిచిపోయేది. తిరిగి ఇండియా వచ్చేక మన స్వేచ్ఛ.. మన స్వాతంత్రం. ఈ ఇరవై ఏళ్ళు అలాగే గడిచి పోయాయి. అదే జీవితం అనుకున్నాము. వయసు మళ్ళిన కొద్దీ ఒంట్లో మార్పులు వస్తాయి. పిల్లలే మనని ఆదుకోవాల్సి వస్తుందన్న ధ్యాసే మనసుకి రాలేదు”.

"అలా అని పాపం పిల్లలు మనకేం తక్కువ చెయ్యడం లేదు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. అయినా కరుణా, మన దేశం వెళ్తే బాగుండును అని మనసు లాగుతూనే ఉంది. అక్కడ చుట్టాలు, ఏవో నెపంతో అందరూ కలుసుకోడాలు, వంట మనిషి, పని మనిషి ఈ సౌకర్యాలు అలవాటై పోయేయి"

"మనదేశం లో మాత్రం, ఈతరం పిల్లల రొటీన్ వేరుగా ఉంటుందా? ఇలాగే ఉంటుంది కదండీ. అయినా మన లాంటి వయసు మళ్ళిన వాళ్ళం, పిల్లల మధ్య ఇమడలేక పోతున్నాం.”

కరుణ శ్రీరామ్ ల ఈ తలపులతో పిల్లలు వచ్చే సమయం అయ్యింది

ఆ వేళ శేషు ఆఫీస్ నించి తొందర గా వచ్చేడు. వస్తూనే “అమ్మా!” అంటూ కరుణ గదిలోకి వచ్చి మీ ఇద్దరికీ ఒక మంచి వార్తమ్మా” అన్నాడు

“ఏమిటి శేషూ? నీకు గాని, కోడలికి గాని ప్రమోషన్ వచ్చిందా..” అని కరుణ ఆతురతగా అడిగింది

“లేదమ్మా, దానికి ఇంకా టైం ఉంది. డిసెంబర్ లో పిల్లలకి సెలవులు ఇవ్వగానే మనం అందరం ఇండియా వెళదాము. మేము ఒక నెల రోజులుంటాము. మీరు మరో నాలుగు

నెలలు ఉండి వస్తే మీకు ఈ చలి బాధ తగ్గుతుంది. మీరు అక్కడ మనవాళ్లందరినీ కలిసి నాలుగు నెలలు గడిపి రావచ్చు” అన్నాడు శేషు

శేషు మాటలు వినగానే కరుణ కు చెవిలో అమృతం పోసినట్టయింది. మన ఇంట్లో, ఆ స్వేచ్ఛ తలుచుకుంటుంటూనే ఆనంద భాష్పాలు వచ్చేసేయి కరుణకి.

“కరుణా.. సరే! సూట్ కేసులు సద్దడం పని మొదలు పెట్టు” అని శ్రీరామ్ కూడా నవ్వుతూ సందడి ఆరంభించేడు.

ఆరాత్రి కరుణకి ఏ కారణం వల్లో నిద్ర పట్టలేదు. స్వేచ్ఛ అంటూ పిల్లలకి ఇన్ని మైళ్ళ దూరం లో ఉండడం మంచిది కాదేమో. నాకన్నా వయసులో పెద్దయిన శ్రీరామ్ కి ఏ మాత్రం ఆరోగ్యం బాగులేక పోయినా ఒంటరిగా తల్లడిల్ల వలసిందేనా? మాటి మాటికీ పిల్లలు కూడా రాలేరు కదా. అలాంటి స్వేచ్ఛలో ఏం ఆనందం ఉంటుంది?

ఇక్కడ మూడేళ్లై ఉంటున్నాము. ఎంత ధైర్యం గా, నిష్పూచీ గా ఉంటున్నాము. శేషు, కోడలు వైజయంతి ఎంత బాగా చూసుకుంటున్నారు. మనవడు మనమరాలు తో ఎంత సరదాగా గడుస్తోంది. వాళ్ళింటికెళ్లినా అమ్మాయి, అల్లుడూ ఎంతో ఆదరిస్తారు. వాళ్ళ పిల్లలతో కూడా సరదాగా గడుపుతుంటాము. మనకి ఈ వయసు లో ఇంతకన్నా ఏం కావాలి. వాళ్ళ జీవన విధానంలో కొంత మట్టుకు ఇమిడి పోతే వాళ్లు సంతోషిస్తారు కదా.

చిన్న తనం లో మనం స్వేచ్ఛ కోరుకోడం వేరు. వయసు వచ్చిన వాళ్ళు పిల్లల దగ్గర ఏ పూచీ లేకుండా ఉంటే అదే స్వేచ్ఛ అనుకుంటాను” అని మనసు లో ఏదో నిర్ణయించుకుని హాయిగా నిద్ర పోయింది కరుణ.

ఆ మర్నాడు కాఫీలు తాగుతుంటే “శేషూ! మీరు ఎప్పటినించో అనుకుంటున్న యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. నన్ను, నాన్నని లావణ్య దగ్గర దింపు” అంది కరుణ

“అమ్మా! మరి మన ఇండియా ప్రయాణం ఎప్పుడు?”

“శేషూ! మనం అందరం కలిసి మీకు కుదిరినప్పుడు ఒక నెల రోజులకి ఇండియా వెళ్లి వద్దాము. నాన్న కూడా అదే అంటున్నారు”. శేషు మొహంలో సంతోషం కరుణ గమనించకపోలేదు

“మీకు ఆపరేషన్ అనగానే ఇద్దరు పిల్లలు కోడళ్లతో సహా పరుగున వచ్చి మనకి ఎంత సేవ చేసేరు. ఆ తరువాత మనిద్దరినీ ఇండియాలో వదలమని పట్టు పట్టి శేషు మనని వెంఠనే ప్రయాణం కట్టించేడు” అంది కరుణ

పిల్లలకైనా ముసలి తల్లి తండ్రులని దగ్గర ఉంచుకోవాలి గానీ వాళ్ళని దూరంగా వదిలేయడం, వాళ్ళకేమైనా అయితే బాధ పడడం, మంచి పనా. వాళ్ళ తప్పేమీ లేక పోయినా మనకేమయినా అయితే అందరూ పిల్లలనే నిందిస్తారు. మన స్వేచ్ఛ కోసం లోకం పిల్లల్ని నిందిస్తే భరించగలమా. ఈ తలపులతో కరుణ శ్రీరామ్ ‘మంచి నిర్ణయమే తీసుకున్నాము’ అని ఊపిరి పీల్చుకున్నారు.

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : సీత మండలీక

నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది

కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది


230 views0 comments

Comments


bottom of page