top of page

స్వీయ





'Sweeya' Written By Nandiraju Padmalatha Jayaram

రచన: నందిరాజు పద్మలతా జయరాం

తల్లిదండ్రుల పైన ప్రేమ చూపించడంలో ఆనాటి శ్రవణ కుమారుడికి ఎంతమాత్రం తీసిపోడు ఈనాటి శ్రవణ్

అందుకోసం తన ఉద్యోగాన్ని మానడానికి మాత్రం ఒప్పుకోదు స్వీయ.

వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతామంటారు శ్రవణ్ తల్లిదండ్రులు.

అందుకు కూడా ఒప్పుకోదు స్వీయ.

తన మనసులో ఉన్నది అందరికీ చెప్పి , ఒప్పిస్తుంది.

అందరి మనసులూ గెలుచుకుంటుంది.

కొత్త ఆలోచనలు రేకెత్తించే ఈ కథను నందిరాజు పద్మలతా జయరాం గారు రచించారు.


వారం రోజుల్నుంచీ ప్రచ్చన్న యుద్ధం భార్యాభర్తలిద్దరికీ.

కంచం, మంచం రెండూ వేరయ్యాయి. ఎవరూ తగ్గట్లేదు. ప్రశ్నలు హృదయాల్లోనే నిక్షిప్తమై ఉన్నాయి కనుక ఎవరి సమాధానాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. భార్యాభార్తలిద్దరికీ పెళ్ళికి ముందునుంచే ఉద్యోగాలున్నాయి.

ప్రస్తుతానికి స్వంత ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఆరోగ్యంగా తిరుగుతున్నా, తానొక్కడే సంతానం కాబట్టి పది పదిహేనేళ్ల తర్వాతయినా తల్లితండ్రులు స్వంత ఊరు వదిలి తన దగ్గరకి వస్తారని, పెళ్ళికి ముందే మూడు పడగ్గదుల అపార్ట్మెంట్ కొని ఉంచాడు శ్రవణ్. అనుకోనివి జరగడమే జీవితం. వాళ్ళ పెళ్ళయిన ఆరు నెలలకే శ్రవణ్ తల్లి వైదేహికి గుండె జబ్బు చేసింది. పనిపాటలలో పడి సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోవడంతో జబ్బు ముదిరింది. శ్రవణ్ దగ్గరకి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న, ఆమెకు ఏ మాత్రం అలసట పనికిరాదని డాక్టర్లు గట్టిగా చెప్పడంతో, నగరానికి రాక తప్పలేదు వాళ్లకి. అయితే, ఇప్పుడు సమస్యకి కారణం అత్తా కోడళ్ళు కాదు. స్వీయ, వైదేహి ఇద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. కోడలు అత్తగారి మాటను గౌరవిస్తుంది. అత్తగారు కోడలు అడిగితే తప్ప ఏ విషయం లోనూ కల్పించుకోదు. కోడలి తెలివితేటలమీద, నడవడిక మీద అత్తమామలకు మంచి అభిప్రాయం ఉంది.

స్పర్థ కి కారణం ఒకటే! తల్లిని చూసుకోవడం కోసం స్వీయని ఉద్యోగం మానేయమని ఒత్తిడి చేస్తున్నాడు శ్రవణ్. ససేమిరా అంటోంది స్వీయ. కోవిడ్ కారణంగా ప్రస్తుతానికి శ్రవణ్ ఇంట్లో నుంచీనే పని చేస్తున్నాడు.

సోమవారం. దీపావళి సందర్భంగా నాలుగు రోజుల శెలవు పూర్తయ్యి, ఉద్యోగానికి వెళ్ళడానికి రెడీ అవుతోంది స్వీయ. యథావిధిగా అత్తగారికి ప్రత్యేకమైన ఆహారం, మామగారికి భోజనం అన్నీ ఏర్పాటు చేసి, తనకు లంచ్ ప్యాక్ చేసుకుని స్కూటీ తాళాలు తీసుకుని బయల్దేరింది .

“అంటే మాట వినవన్నమాట! నీ మెండితనమే నీదన్నమాట! అత్త మామ అక్కర్లేదు! మొగుడి మాట అసలే లెక్క లేదు! ఉద్యోగం తప్ప ఇంకేదీ ముఖ్యం కాదు నీకు! అంతేనా…!” రౌద్రంగా అన్నాడు శ్రవణ్.

చెప్పులు వేసుకుంటున్న స్వీయ, వాటిని గుమ్మం లోనే వదిలి రెండు అడుగులు వెనక్కి వేసింది స్వీయ.

“ఇదేంటండీ…ఇరవయ్యేళ్లు కష్టపడి సాధించిన ఉద్యోగం, నా ఆత్మగౌరవానికి, వ్యక్తిత్వానికి దక్కిన ప్రతిఫలం ఇది. ఎలా మానేస్తానండీ? అర్థం చేసుకోరే? సంసారం, ఉద్యోగం నా రెండు కళ్ళు. ”

“నాకదంతా అనవసరం స్వీయా! ప్రస్తుతం మా అమ్మానాన్నలని చూసుకునే మనిషి కావాలి. కోడలిగా, భారతీయ స్త్రీ గా అది నీ బాధ్యత. మర్చిపోకు!”

“నేను కాదనట్లేదు శ్రవణ్. అత్తయ్య, మావయ్య మీకే కాదు, నాకు కూడా తలిదండ్రుల లాగానే!. కానీ, ఓ ప్రత్యామ్నాయం ఉందేమో అని వెతకకుండా, నా ఇష్టాన్ని మొండిగా తృణీకరించడమేమిటి?”

“నువ్వనేది అమ్మానాన్నల్ని వృద్ధాశ్రమం లో పడేయమనేగా?” విసురుగా అన్నాడు శ్రవణ్.

“కానే కాదు!”

“మరి?”

“మీరు ఉద్యోగం మానేయండి.... కొన్నాళ్లపాటు.” నింపాదిగా సోఫా లో కూర్చుంది స్వీయ.

అరికాలి మంట నెత్తికెక్కింది శ్రవణ్ కి.

“అతి తెలివికి పోకు స్వీయా….! చాలా దూరం వెళ్తుంది వ్యవహారం. మగాడిని..నన్ను కొంపలో కూర్చోమంటావా? ఎంత ధైర్యం నీకు?” కోపంతో కందగడ్డయిపోయింది శ్రవణ్ ముఖం .

“కోపం తెచ్చు కోవద్దు శ్రవణ్! నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. డబ్బుకి లింగభేదం ఉండదు. విలువ మారదు. మీ కన్నా నా జీతం ఎక్కువ. నేను మానేజెమెంట్ లో ఉన్నాను, ఇంటి నుంచి పని చేయలేను. మీరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కనుక చేయగలరు. "

" నథింగ్ డూయింగ్ ....ఇప్పటికే ఏడాదిన్నర నుంచీ కొంపలో కూర్చున్నాను. తొందర్లో, మళ్ళీ ఆఫీసులు మొదలవుతాయి. నేనిలాగే ఇంట్లో నుంచీ పని చేస్తానంటే ఉద్యోగాలు ఊడిపోతాయి. తప్పదు...నువ్వు మానేయాల్సిందే!"

" నాకూ స్వంత అభిప్రాయం, స్వాభిమానం ఉంటుంది. ఇలా బెదిరిస్తే ఎలా శ్రవణ్?. సాధ్యాసాధ్యాలు సంయమనంతో ఆలోచించుకోవాలి గానీ ఆవేశ పడితే సొల్యూషన్ దొరకదు.” తొణకలేదు స్వీయ.

“ఛ! ఇక తాడో పేడో తేల్చుకోవడమే, నీతో మాట్లాడేదీ, వినేదీ ఏం లేదు. నా మాటే శాసనం ఈ ఇంట్లో! దట్సాల్.” గుమ్మం దాటి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు శ్రవణ్.

అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి వైదేహి, రఘురాంగార్లకి. పడగ్గది దాటి బయటికి వచ్చాడు రఘురాం.

“నాన్నా..శ్రవణ్…ఒక్కసారి ఆగు. ! అమ్మా..స్వీయా…మా కోసం మీరు గొడవ పడడం చాలా బాధేస్తోంది. ఒక్క నిమిషం నా మాట వినండి. ఒరిగి పోయే వృక్షాలం మేం. చివురిస్తున్న మొక్కలు మీరు. మాకోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. మా లాంటి వాళ్ళ కోసమేగా వృద్ధాశ్రమాలున్నది. వెళ్ళిపోతాం. వైదేహీ…పద…సర్దుకో…”

తండ్రి మాటలకి గుండె నీరయింది శ్రవణ్ కి.

“నాన్నా…నా ప్రాణం పోయినా మిమ్మల్ని, అమ్మని వదిలిపెట్టను. ఎవరేమయినా అననీ! .ఎటయినా పోనీ…! అమ్మ ఆరోగ్యం కన్నా నాకేదీ ముఖ్యం కాదు.”

“మావయ్యా….! మీరు కూడా నన్నర్థం చేసుకోలేక పోయారా….నేను మిమ్మల్ని వెళ్లిపొమ్మన్నానా?” కళ్ళనీళ్ళతో మామగారిని అడిగింది స్వీయ.

“మరెలా తల్లీ? మాకున్నది శ్రవణ్ ఒక్కడేగా …? మీ అత్తగారిని మీరూ చూసుకోక, వృద్దాశ్రమానికీ వెళ్లనీయకపోతే ఎలా?” అయోమయంగా అన్నాడు రఘురాం.

“మావయ్యా…అత్తయ్యా…మీరూ వినండి. శ్రవణ్ ..ప్లీజ్…నన్ను మాట్లాడనీయండి. నేనేమీ స్వార్ధపరురాలిని కాదు. చిన్నప్పటి నుంచీ మొదటి స్థానంలో ఉండేలా చదువుకున్నాను. ఆర్ధిక స్వాతంత్య్రం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నమ్మిన దాన్ని. ఆధునికతని కోరే అమ్మాయినే కానీ, విశృoఖలత్వం కోరే మనిషిని కాదు. కుటుంబ వ్యవస్థ, సాంప్రదాయం నాకు ప్రాణం."

"ఇవన్నీ ఎందుకు? టాపిక్ లోకి రా స్వీయా! ఉద్యోగం చేస్తావా. మానేస్తావా? అమ్మని చూసుకుంటావా, వదిలేస్తావా? సమస్యని దాటేయడం మాత్రం పరిష్కారం కాదు. " చాలా సీరియస్ గా అన్నాడు శ్రవణ్.

తామేం చేయాలో అర్థం కాక అవస్థ పడుతున్న రఘురామ్, హాల్లోకి వచ్చి ఆందోళనగా చూస్తున్న వైదేహి కూర్చుందుకు కాస్తంత ఎత్తు కుర్చీ తెచ్చి వేశాడు.

"కంగారేమీ పడద్దు అత్తయ్యా ....! శ్రవణ్....వినండి...."

" ఇంకా వినేదేమిటి?"

" మీతో వచ్చిన చిక్కు ఇదే...!అవతల వాళ్ళని వినరు. అసలు చెప్పనివ్వరు. బయటి వాళ్ళ విషయాలను కూడా తెలుసుకుని, పరిష్కరించి మేనేజ్ చేయగలిగే నన్ను, ఎందుకంత చిన్న చూపు చూస్తారు శ్రవణ్?" బాధగా అంది స్వీయ.

" అవునురా! అమ్మాయిని మాట్లాడనీ....! చెప్పు తల్లీ? ఎలా ఈ సమస్య వీడేది?" అడిగింది వైదేహి.

" అత్తయ్యా....ప్రస్తుతం, మనకి వచ్చింది సమస్య కాదు, కేవలం అసౌకర్యం. మీరే గమనించండి. శ్రవణ్ కన్నా నా జీతం ఎక్కువ. ఇలా అని నేనాయన్ని కించపరచడం లేదు. నా డబ్బు, నీ డబ్బు అని నేను ఎప్పుడూ మాట్లాడలేదు. నిజం. నమ్మండి. విషయానికి వస్తే, ఆయన వర్క్ ఫ్రం హోం చేసుకోగలరు. కానీ, హెచ్ ఆర్ ప్రొఫెషనల్ గా నేను ఇంట్లో ఉండి పని చేయలేను. నాకా వెసులుబాటు లేదు. అవునా, కాదా...శ్రవణ్?

"అందుకేగా నిన్ను మానేయమనేది!" విసురుగా వచ్చింది మాట శ్రవణ్ నుంచీ.

" మానేస్తే? ఇంటి అప్పు, కారు లోన్ ఇవన్నీ ఎవరు తీరుస్తారు?"

"నేనే కష్టపడతాను. కుదరకపోతే అమ్మి పారేస్తాను. అమ్మ కన్నా అవి నాకెక్కువ కాదు."

"నిజం. అత్తయ్య కన్నా నాకూ, అవేవీ ఎక్కువ కాదు అందుకే ఉద్యోగం మానేయాను అంటున్నాను."

స్వీయ మాటలకి ముగ్గురూ షాక్ తిన్నారు.

" చూడండీ....నేను ఉద్యోగం చేయడం వలన అత్తయ్యగారికి ఖరీదయిన వైద్యం చేయించడానికి వెనుకంజ వేయాల్సిన అవసరం ఉండదు. కొద్ది రోజులపాటు, అత్తయ్యగారికి సేవ చేసే మనిషి అవసరం. అందుకు, నేనే అవసరం లేదు. చక్కగా జీతం ఇచ్చి ఒక అమ్మాయిని పెట్టుకుందాం. పూర్తిగా ఆ మనిషి మీద వదిలివేయకుండా, శ్రవణ్ ఉంటారు. మీరూ ఉంటారుగా మావయ్యా...నేను ఇంటిని, ఉద్యోగాన్ని సమతూకంగా చూసుకోగలనన్న నమ్మకం నాకుంది. నా మాటలు మీకు అహంకారాన్ని సూచిస్తున్నాయా మావయ్యా?”

“అస్సలు లేదమ్మా….నీ దూరదృష్టి, ఆలోచన.... మా మీద నీకున్న బాధ్యత సూచిస్తున్నాయమ్మా…” మనస్ఫూర్తిగా అన్నాడు రఘురాం.

" మరి నా ఆఫీస్ ఆఫ్ లైన్ మొదలవుతే? అప్పుడూ? "

" అడిగి చూద్దాం...సమస్య ఇది అని చెప్పి చూద్దాం. కాదంటే, మనవి గవర్నమెంట్ జాబ్స్ కాదుగా, మీ పన్నెండేళ్ల మెరిటోరియస్ సర్వీస్, మరో మంచి జాబ్ తెచ్చివ్వకపోదు. మీ అవసరం చెప్పి ఒప్పించగలిగితే , మీకు వీలైన ఉద్యోగం దొరక్కపోదు. లేదూ, అప్పుడే ఆలోచిద్దాం! " స్వీయ మాటలు శ్రవణ్ లో కొంత కదలిక కల్గించాయి. ఆలోచిస్తున్నాడు.

"మరో మాట. శ్రవణ్...మన ఉద్యోగాలలో కొద్ది కాలం గ్యాప్ వచ్చినా, దాన్ని భూతద్దాల్లోంచి చూస్తుంది ఇండస్ట్రీ. మళ్ళీ సంపాదించుకోవడం చాలా కష్టం. అంతే కాదు...అత్తయ్యను దగ్గరగా ఉండి చూసుకునే మనిషిని పెట్టుకుంటే, మనం ఒకరికి ఉపాధి కల్పించినట్లు కూడా అవుతుంది. మీరూ ఆలోచించండి అత్తయ్యా...!" అత్తగారి ముందు కూర్చుని అడిగింది స్వీయ.

“స్వీయ నా కోడలు కాదురా.. కూతురు. తను చెప్పినట్లే చేద్దాం. నేను తొందర్లోనే మామూలవుతాను. నాకు నమ్మకం ఉంది” కోడలిని దగ్గరికి తీసుకుంటూ అంది వైదేహి.

“శ్రవణ్….ఆడవాళ్లు విమానాలు, జలాంతర్గాములూ నడుపుతున్నారు. వ్యోమగాములవుతున్నారు. మేము లేని ఫీల్డ్స్ లేవిప్పుడు. చూడండి….ఆటంకాల్లేని జీవితాలుండవు. అధిగమించే శక్తి యుక్తులు, కాసింత ఓర్పు ఉంటే చాలు. స్త్రీ పురుషుల భేదాలు, విభేదాలుగా మారకూడదు. ఆసరా ఇవ్వకపోయినా పర్వాలేదు…అవమానించకుండా ఉండమనే మేం అడిగేది. చెప్పండి అత్తయ్యా…మనం కోరేది మనలా మనని బ్రతకనీయమనే కదూ…కాదా….?” ఉద్వేగం స్వీయ మాటల్లో.

" నిజమేరా! స్వీయ మాటలు అక్షరాక్షరం నిజం." చెప్పాడు రఘురాం.

శ్రవణ్ మనసు కరిగింది. స్వీయ మంచితనం తనకి తెలియకపోవడానికి కారణం తన తొందరపాటుతనమే అన్న తలంపు కలిగింది. బరువుగా ఉన్నదేదో గుండె నుండి జారిన భావన.

“ అయాం…సారీ…స్వీయా…” ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు శ్రవణ్.

“అంత మాటనొద్దు. మనమిద్దరం ఒకటి. ఇప్పటి వరకూ మన నలుగురం. త్వరలో కొత్త సభ్యడు రాబోతున్నాడు. మనందరం ఒక టీం. కలిసి ఆడుదాం! గెలుద్దాం!” చెప్పింది స్వీయ.

" నిజమా! చెప్పనేలేదేమ్మా? " కోడలి నుదుటి మీద ముద్దిచ్చింది వైదేహి. రాఘవరాం ముఖం వెలిగిపోయింది.

ఆనందం ముప్పిరిగొంటున్న శ్రవణ్ వైపు సిగ్గుగా చూసి మూడు వేళ్ళు చూపించింది స్వీయ.

**********

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


116 views0 comments

Comments


bottom of page