Take It easy Policy written by Choppadandi Sudhakar
రచన : చొప్పదండి సుధాకర్
గోదావరి ఖని డిపో బస్సు ఇంకోటి వస్తుంది బస్సును చూడగానే ఆలోచనల నుంచి ఒక్కసారిగా వాస్తవప్రపంచం లోకి జారిపడ్డాను బస్సు గిర్రున 180 డిగ్రీల కోణంలో తిరిగి పదవ నెంబర్ ప్లాట్ఫాం పైకి వచ్చి ఆగింది. జనమంతా పొలోమని పోటీలు పడి బస్సును ముట్టడించి కిటికిలోంచి పేపర్లు జేబురుమాళ్ళు విసిరేసి తమతమకు ప్రాప్తించిన సీట్లను ఖాయం చేసుకొని హమయ్య అంటూ చేతనైనంత మేర గాలి పీల్చి వదిలేసారు అదో తృప్తి.... బస్సులో సీటంటూ ఒకటి లభిస్తే అదే కైవల్యప్రాప్తి అనుకునేవారు చాల మందే ఉంటారు.అది ఏ రకం కైవల్యమో ..మానసిక వైకల్యమో తేల్చి చెప్పడం కొంచం కష్టమే. బస్సు లోంచి ఐదారుగురు దిగారు.ఆదివారం కావడం వల్లనేమో కాని పెద్దగా రష్ లేదు.అదే సోమవారమైతే చూడాలి.ఒకే బస్సు లో వందమందిని కూరి కూర వండేస్తారు మన ఆర్టిసీ నిర్వాహకులు. తప్పదు మరీ ...!అదను మీదే పంట కోసుకోవాలి.మళ్ళీ ఆలోచనల్లోంచి బయట పడ్డాను.కారణం ...ఒక లేలేత చిగురుమావిలాంటి కొమ్మ అదే...అమ్మాయి ..నింపాదిగా బస్సు దిగుతూ ఎదురయింది.మనిషి మంచి పుష్టిగా ఉంది వయసు ఇరవై రెండో మూడో ఉండి ఉండవచ్చు.చూడాలనిపించే అందం తగు మ్యాచింగ్ డ్రెస్ లో తాజా సంచిక కవర్ పేజీలా ఉంది. నడక ,కదలికలు, చూపూఅన్నీ ఓ రేంజ్ లో పెర పెర లాడుతున్నాయ్.అయితే నా దృష్టిని ఆకర్షించినవి అవేమి కావు.ఆమె ఒక అమ్మాయి అంతే..! కొంపదీసి ఈ అమ్మాయే దయానంద్ గాడి కూతురు కాదు గదా ! లోలోన ఒక అనుమానం .ఏమో కావొచ్చు వాడు చెప్పిన వయసు దాదాపు ఇంతే .పేరు శిరీష అట.! శిరీషయే కావొచ్చు .ఎపుడో పుష్కర కాలం కింద ఓ పెళ్ళిలో చివరి సారిగా చూశాను.మళ్ళీ వాడి కుటుంబాన్ని కలిసే సందర్భమే రాలేదు.పోనీ అడిగి చూస్తే...! “అమ్మాయి...నువ్ శిరీషా ...?”అడుగుతుంటే గొంతు తడారి పోయింది . మనసులో ఏ చెడు ఆలోచన లేకున్నా అంతకన్నా ఎక్కువ మాట్లాడలేకపోయాను.అలాగని నేనేమి కుర్రోణ్ణి కాదు.యాభయి దాటుతోన్నఆడాల్లంటే నాకు మాచెడ్డ భయం.ఎందుకో స్పష్టంగా తెలియదు గాని మరీ ముఖ్యంగా అందమైన ఆడవాళ్లంటే ఇంకా జంకూ ,జడుపూ.....! “కారణం స్వాతి కావొచ్చు” అంతరాత్మ చప్పున గుర్తు చేసింది. “ఎహే ఇపుడా గోల ఎందుకు..? “లోలోన అంతరాత్మను కసురుకొన్నాను. దాదాపు ముప్పయ్ ఏళ్ళు వెనక్కి వెళితే స్వాతి నా కలల రాణి.స్వాతి అంటే నిజంగా పచ్చి పాల స్వచ్ఛత! అందాని కొస్తే అచ్చమైన వరూధినే... అటువంటి స్వా...తి....నన్ను నాలుగేళ్ళపాటు ప్రేమించి చివరకు వేరేవరినో పెళ్లి చేసేసుకొని చక్కా వెళ్ళిపోయింది.చిన్న వయసులో నాకది పేద్ద శరాఘాతమే ..! పైగా వాళ్ళ నాన్న తప్పు తన కూతురుదని తేటగా తెలిసినా దాన్ని మరుగు పరచి నడివీధిలో నన్నే చితక తన్నాడు,అది మరింత అవమానం...అందుకే ఆ రోజు నుండి నాకు అందమైన అమ్మాయిలంటే హడల్ ,వెన్నులో వణుకు పుట్టుకొస్తాయ్.గతం గుర్తొచ్చి నిటారుగా అయిపోయాను. “ష్ .....”ఒక వెచ్చని దుఃఖ నిమిషం గడచిపోయింది. నా ఆలోచనల్లో నేనుండగానే నా ప్రశ్నకు బదులివ్వకుండా ఆ అమ్మాయి త్రుణీకరిస్తున్నట్టుగా చూపులు విసిరి నిశ్శబ్దంగా కాంటీన్ లోకి వెళ్ళిపోయింది. “అమ్మాయి అట్లా వెళ్లిపోయిన్దేమిటీ..?అసలు నా ప్రశ్న విన్నదా..వినలేదా అయినా అవసరం ఆమెది కదా ...?”ఆలోచనలో పడిపోయాను. “నిజానికి బస్సు దిగగానే ఆవిడే శివరాజ్ అంకుల్ మీరేనా?” అంటూ ఆరా తీయాలి.కాని అటువంటి ఆలోచనేమీ లేనట్టు ...కనీసం చుట్టుపక్కల వెతికినట్టు కూడా అనిపించకుండా కాం గా ఎమీ పట్టనట్టు వెళ్లి పోయిందంటే ఖచ్చితంగా శిరిష కాదు.నాకు నేనే సర్ది చెప్పుకొన్నాను. అసలు ఈ శిరీష ఏమిటి..?బస్టాండ్ లో నా వెయిటింగ్ ఏమిటీ?అంటే ఐదు నిమిషాల్లో వివరిస్తాను. నేను దయానంద్ పదో క్లాసు దాక క్లాస్మేట్స్ ...ఒకే ఊరు కాకున్నా అంతకన్నా ఎక్కువే కలసి ఉండే వాళ్ళం.వయసు కూడా సమానమే!తేడా ఏమిటంటే వాడు బాగా శ్రీమంతుడు..లక్కీ ఫెలో...అపుడూ...ఇపుడూ..నేను పూర్తి వ్యతిరేకం ..అపుడూ...ఇపుడూ. కాకపొతే ఇద్దరివీ ప్రభుత్వ ఉద్యోగాలే...అవీ ..టీచర్ ఉద్యోగాలే !ఆ కాలంలో చుట్టూ పది ఊళ్లకు మా ఊళ్లోనే పెద్ద బడి ఉండడం వల్ల..ఈ కాలంలో ఉన్నట్టు లోకల్ నాన్లోకల్ అనే పట్టింపులు పెద్దగా లేక పోవడం వల్ల వాడిది కరీంనగర్ జిల్లా అయినా మెదక్ జిల్లాలోనే జాబు తెచ్చుకున్నాడు.తరువాత తరువాత జరిగిన అనేకానేక మార్పుల వల్ల దయానంద్ జిల్లా మారి గోదావరిఖనిలో సెటిల్ అయిపోయాడు. అట్లా విడిపోయిన ఇరవై ఏళ్ళ కాలంలో రెండంటే రెండే సార్లు కలుసుకొన్నాం.ప్రాణ స్నేహితుల మైనప్పటికి బతుకు పోరాటం మమ్మల్ని బలీయంగా విడదీసింది.వాడికి నాకు ముగ్గురేసి సంతానం. అందులో ఒక అమ్మాయికి మా అమ్మాయి పేస్ బుక్ ఫ్రెండ్ ట ...! ఆ అమ్మాయికి ఈరోజు సిద్దిపేటలో ఎదో కార్పొరేట్ చిట్స్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి ఇంటర్ వ్యూ ఉందట.పెద్దగ పోటీ ఏమి లేదట ..జీతం కూడా ముప్పయి వేలు..ట ఇంటర్వ్యూ ముగిసే వరకు కాస్త తోడుగా ఉండమని బాల్య స్నేహితుని ఆజ్ఞ ...ఆ విషయాన్ని ఫోన్లోనే ఇంటికి వచ్చి చెప్పినంత బీభత్సంగా పదేపదే చెప్పి చెప్పీ చావగొట్టాడు మా దయానందుడు..! అందుకే నేను చేతిలో ఓ కర్ణ పిశాచి ..అదే సెల్ ఫోన్ ధరించి ఇలా ఆ అమ్మాయిరాక కోసం పోద్దుటినుండి నాలుగు గంటలుగా అఘోరిస్తున్నాను. అమ్మాయికి తొలిసారిగా ఉద్యోగం రాబోతోంది.అదీ ప్రాణస్నేహితుడి కూతురు.ఆదివారం పూట కాస్తాసాయంగా ఉంటె తప్పేమిటి అనుకోని పోద్దుటినుంది ఇలా అంకితమై పోయా...!అయితే ఇప్పటికి నాలుగు గోదావరిఖని డిపో బస్సులు వచ్చినా శిరీష మాత్రం రాలేదు.ఎండాకాలం ఒంటిగంటవుతోంది.ప్రాణం పోయేలా ఉంది, అసలే బి.పీ . అయినా పంటి బిగువున బాధ బిగబట్టి భరిస్తున్నాను. మధ్య మధ్యన ఓ మాజా బాటిల్ తాగాలనిపించినా అక్కడి పరిసరాలూ అవీ చూసి రోతవేసి మానుకొన్నాను.బయటకు వెళ్లి తాగి వద్దామంటే అదే సమయంలో శిరీష బస్సు దిగి....నేను కనిపించకపోతే కంగారు పడుతుందని గుంజాటన....! అసలే మొదటిసారి ఉద్యోగ ప్రయత్నం ....అదీ చిన్న వయసులో,ఉద్యోగమంటే మాటలా?అది మన జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసే సంజీవని...దాని అవసరమేమిటో అది సాధిస్తే వచ్చే మజా ఏమిటో నాకు బాగా తెలుసును.అందుకే ఎంత సేపయినా ఎంత ఇబ్బందయినా ఖచ్చితంగా ఆ అమ్మాయి కి ఆసరాగా ఉండడానికే తీర్మానించు కొన్నాను.తొలిరోజుల్లో ఉద్యోగం కోసం నేను దయానంద్ పడ్డ పాట్లూ ,శ్రమ గుర్తొస్తే కళ్ళకి రక్తమొస్తుంది ఈ విషయంలో మాత్రం వాడు నాకు సరి జోడీయే...!రాత్రి పగలు కష్టపడి చదివాడు...సాధించాడు అసలు వాళ్ళ నాన్నకు దయానంద్ ఉద్యోగం చేయడం ఏ మాత్రం ఇష్టం లేదు.పొలం పుట్రా ఇల్లు ఆస్తి అన్నీ ఇబ్బడి ముబ్బడిగా ఉన్నవాళ్ళు కావడంతో ఉద్యోగం అంటే ఒకరకమైన చులకనగాఉండేది.పైపెచ్చుఅప్పట్లోమాజీతం వందలోపే !నాకేమోఉద్యోగంఅత్యవసరం,వాడికేమో కాలక్షేపం...అయినా వల్ల నాన్న వద్దన్నా చెప్పాపెట్టకుండా నాతొ సంగారెడ్డి కి ఇంటర్ వ్యూ కి వచ్చాడు అదీ సైకిల్ మీద... ! అవునూ....! సైకిల్ మీదే ...! అప్పుడు సైకిల్ కిరాయి రోజుకు రూపాయి కన్నాతక్కువే..సంగారెడ్డి పోయి రావాలంటే రాను పోను కనీసం పదిహేను రూపాయలైనా కావాలి.మా ఇద్దరి దగ్గర ఉన్న డబ్బంతా కూడేసినా ఆర్రూపాయలె ఉన్నాయ్...ఎట్లా ...ఖచ్చితంగా వెళ్లి తీరాలన్న సంకల్పం ముందు ఇవేవి సమస్యల్లా తోచలేదు.అంతే చెరో సైకిల్ తీసుకొని చలో సంగారెడ్డి అంటూ 130కిలో మీటర్లూ అలవోకగా వెళ్ళిపోయాం.అంటే మా పట్టుదల చూసి అప్పటి జిల్లా చైర్మన్ నోరెళ్ళ బెట్టాడు.వెంటనే అప్పాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టి తిరుగు ప్రయాణంలో బస్సు లోనే వెళ్ళండ ని యాభయ్ రూపాయలిచ్చి స్వయంగా బస్సు ఎక్కించి పంపించారు.ఆ కలం ప్రేమలు, ఆప్యాయతలు భయభక్తులు,చిత్తశుద్ది ఇపుదేక్కడి వీ...అదో స్వర్ణయుగం ..! ఉద్యోగాలతో తిరిగొచ్చిన మమ్మల్ని చూసి ఊరు మొత్తం కళ్ళు తేలేసింది. ఎండ చుర్రుమంటుంటే జ్ఞాపకాల ప్రవాహంలోంచి మళ్ళీ బయటకొచ్చాను.ఒకటిన్నర..!మిట్టమధ్యాహ్నం పిట్ట కూడా తిరగనంత వేడీ చంపేస్తుంది . “హూ ..ఇక వెయిట్ చేయడం వేస్ట్ “ఇంటికి వెళ్ళబోతూ ఎందుకైనా మంచిదని అమ్మాయికి ఫోన్ చేసాను.చిత్రం ...పోద్దుటినుంది ఎంతకూ కలవని కాల్ ఇపుడు కలిసింది. “హలో ..అమ్మాయ్..శిరీషా “నేనే మాట్లాడా మొదటగా . “హా... అంకల్ “నిదానంగా బదులి చ్చింది “పోద్దుటినుండి నీ ఫోన్ కలవడం లేదమ్మా “గొంతులో తీవ్ర అసహనం పొడసూపింది నాకు తెలియకుండానే.. “హా.. అంకల్ నాది డబల్ సిం ..ఆ సిం స్విచ్ ఆఫ్ చేశా “ “సర్లే.. మరీ ఉద్యోగం ..ఇంటర్ వ్యూ అయిపోయిందా” “లేదు అంకల్ నేను సిద్దిపేటలో దిగలేదు సిటీ వెళ్ళిపోతున్నా” “అదేమిటీ ఉద్యోగం ..?”నేనాశ్చర్యపోయాను “అ..అఆ..సారీ అంకుల్ మీకు చెప్పనేలేదు కదా ..అయినా నాకు ఇపుడే జాబు ఎందుకూ ...?రాకేశ్ మాంచి పోజిషన్ చూపిస్తా అన్నాడు” “ఆ... రాకేశ్ ఎవడో ..ఆ పోజి షన్ ఏమిటో అస్సలు అర్థం కాలేదు .అమ్మాయి తెలిసి తెలిసి ముప్పయి వేల జీతం వదులుకొందా ఏమిటీ ఈ విపరీత ధోరణి “మనసంతా కకావికల మయింది. “మరీ అమ్మా ఆ విషయం నాకు ముందే చెప్పవచ్చు కదా..!”అటునుండి మౌనం.బస్సు వెళ్ళిపోతున్న శబ్దం వినిపిస్తుంది. “ఏమిటో అంకల్ నాకు వినిపించడం లేదు “ఫోన్ కట్టయింది. మళ్లీ ప్రయత్నించాను “అదేమిటమ్మా అంతమంచి ఉద్యోగం వదలుకోన్నవా ?”ఊరుకోలేక బుద్ది చెప్పబోయాను. ‘ఆ ...బోడి ఉద్యోగం ...అది కాకపొతే ఇంకోటి ..అయినా అంకల్ పొద్దున మీ ఫోన్ అస్సలు కలవలేదు.ఆ ఫోన్ మార్చండి “నాకే ఓ ఉచిత సలహా విసిరేసింది. మాట్లాడుతూ మాట్లాడుతూ ఎపుడు రోడ్ మీది కొచ్చానో తెలియలేదు. “రోడ్ మీద చూసుకొని నడవరా ..పాగల్ “తన బైక్ కి అడ్డొచ్చానని ఎవడో బండ బూతులు తిడుతున్నాడు. “అవునూ..ఒక బాధ్యత లేని అమ్మాయి కోసం పొద్దుటి నుండి ఎండలో పడిగాపులు కాసిన నేను పాగల్ గాణ్ణి కాక మేధావిని ఎట్లా అవుతాను ?” నన్ను నేను తిట్టుకొంటూ ఎండలో ఇంటికి చేరాను.స్నానం అయ్యాక కాసింత భోంచేసి నిద్ర పోయాను.ఎండలో అలసిన దేహం చచ్చి బతికినట్టు పులిసి పోయింది.రాత్రయినా మనసు ఎదో గాయపడ్డట్టు పచ్చి పచ్చి గానే ఉంది .సాయంకాలం దయానంద్ ఫోన్ చేసిన మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి “ఒరేయ్....శివ రాజ్ ఏమి అనుకోకు రా ...ఈ కాలం పిల్లలే అంత...!ఏదీ పట్టించుకోరూ ..దేన్నీ లెక్కే చేయరు ..మా అమ్మాయి ఈ విషయంలో ఇంకో రెండాకులు ఎక్కువే చదివింది.ఫోన్లు ,మేస్సజులు,ఇహ చాటింగుల కైతే కొదవే లేదు నా బిడ్డ అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంటుంది.పైపెచ్చు ఇంట్లో ఒక్క రోజు కూడా ఉండదు.హాస్టల్ యే దానికి దేవాలయం. అదేమంటే పాతకాలం మనుషులమని మనల్ని దెప్పి పొడవడం.ఏమిటోరా ఈ తరం అబివృద్ది చెందుతుందో నాశనమై పోతుందో అర్థం కావడం లేదు.”అంటూ వాపోయాడు. “హూ ..ఇది నాశనమై పోవడం కాదురా అభివృద్దే కాకపోతే పనికి రాని అవయవం పెరిగినట్టు అంటే కాన్సర్ లాంటిది.కష్టం తెలియకుండా మనం మన పిల్లల్ని పెంచాం చూడు అదీ మన అసలు తప్పు.ఏదైనా కొరతగా ఉంటేనే విలువ తెలుస్తుంది.ఒకరోజు తాగు నీరు రాకపోతే రోడ్దేక్కే జనం అదే నీరు కరెంటు ఉన్నంత సేపు నీరు వృధాగా పోతున్న పట్టించుకోరు.” అంతకన్నా మిక్కిలి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు ...కాని ఆ రాత్రి మొత్తం నిద్ర లేదు నాకు......!
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
Comments