top of page

తనదాకా వస్తే

Tanadaka Vaste Written By Telikicherla Vijayalakshmi

రచన : తెలికిచెర్ల విజయలక్ష్మి


"ఏవిటో, ప్రతీ సంవత్సరం చక్కగా కార్తీక మాసం అందరం గుడికి వెళ్ళి, పురాణాలు, అభిషేకాలు, అర్చనలు వాటితోపాటు...ముచ్చట్లు కూడా ఎన్ని చెప్పుకునేవాళ్ళమో?”" అంటూ మహచెడ్డ బాధపడుతోంది రాజారావు భార్య వనజ.


"అవునే వనజా, ఎప్పటికి ఈ కరోనా పోయి మళ్లీ మామూలు అవుతామో? ఎప్పుడు వనభోజనాలకు వెళతామో కదా? అంటూ రాజారావు కూడా బాధపడినట్టు నటించాడు పెళ్ళాం మెప్పు పొందచ్చని.


"అవును, కానీ జీయమ్‌ గారి వాకిట్లో ఉసిరి చెట్టు ఉంది కదండీ. మనం అందరం పోయి అక్కడ భోంచేస్తే పోలా. వనభోజనాలకు వెళ్ళినట్టూ వుంటుంది. అందరమూ సరదాగా కలుసుకోవటం అవుతుంది " అంటూ రాగాలు తీస్తూ...ఐడియా ఇచ్చింది వనజ.


"అమ్మో, జీయమ్‌ తో పెట్టుకోవద్దే. మాకు ఇప్పటికే ఫ్యాక్టరీ షట్‌ డౌన్‌ అని పగలూ, రాత్రీ పడుకోనియ్యకుండా, రోజుకి పదహారు గంటలు పని చేయిస్తున్నాడు మహానుభావుడు" అన్నాడు రాజారావు భయంగా!


"మీరు ఊరుకోండి, మీకు అన్నీ భయాలే. చెప్పుకోటానికే మీరు ఏజీయమ్‌ కానీ, దేనికీ పనికి రారు. పేరుగొప్ప, ఊరుదిబ్బ" అంటూ... చిర్రుబుర్రులాడింది వనజ.


"అదికాదు వన్నూ", అంటూ... మెల్లిగా సముదాయించబోయాడు ముద్దుగా రాజారావు.


"వన్నూ లేదు పిన్నూ లేదు, 'సర్‌ సర్‌' అంటూ జీ యమ్‌ వెనుక తిరగటానికి తప్ప మరి దేనికి పనికి వస్తారు మీరు?” అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది వనజ.


"నేనెప్పుడు తిరిగాను? జీ యమ్‌ వెనుక" అంటూ ఆశ్చర్యపోయాడు రాజారావు.


"అదే, మొన్న పొల్యూషన్‌ ఫ్రీ సర్టిఫికేట్‌ కోసం, మీ ఫ్యాక్టరీ ఓనర్‌, మలబార్‌ గోల్డ్‌ నించి అరడజను గాజులు కొని, ఆఫీసర్‌ కి ఇయ్యమంటే, అందులోనించి మీ జీయమ్‌ రెండు గాజులు నొక్కేసాడు. అప్పుడు తిరగలేదా?" అని వనజ గట్టిగా మాట్లాడుతుంటే...


"ఒసేయ్‌, ఇవన్నీ గట్టిగా మాట్లాడకూడదే, జీయమ్‌ కి తెలిస్తే కొంపలంటుకుంటాయి. అయినా నీకెలా తెలిసాయి ఈసంగతులు?" అంటూ వనజను అడిగేడు.


"మీరు ఫోన్లో మాట్లాడుతుంటే, అర్ధమయింది లెండి" అంది వనజ.


"సరే పడుకోవే అర్ధరాత్రి అయింది” అన్నాడు.


"ఏవండీ, ఈ రోజు కార్తీక సోమవారం. నేను గుడికి వెళుతున్నాను" అని మాస్క్‌ కట్టుకొ ని వెళుతున్న వనజ తో...

"గుడికి వెళితే అయిదువందలు ఫైన్‌ వేస్తున్నారు, అన్నావు కదా?" అన్నాడు రాజారావు.


"కార్తీక మాసమని కొంచం పట్టు సడలించేరు, మాస్క్‌ వేసుకొని సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ... దర్శనం చేసుకోండి అన్నారుట, మీ ఫ్యాక్టరీ ఓనర్‌. సరే నేను వెళుతున్నాను తలుపు వేసుకోండి" అంటూ వనజ వెళ్ళింది.


వనజ గుడికి వచ్చిన ఫ్రెండ్స్‌ తో మెల్లిగా మాటలు కలిపింది. అందరూ జీయమ్‌ బంగ్లా ప్రాంగణం లో వుండే ఉసిరిక చెట్టుకింద వనభోజనంకి ఇష్టపడ్డారు. ఇంటికి వెళ్ళేక అందరమూ ఫోన్‌ లో మాట్లాడుకుందాము అనుకొని, అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళి పోయారు.


రాజారావు డ్యూటీకి బయలుదేరుతున్నాడు. కంపెనీ ఫోన్‌ మోగింది, "హలో ఎవరూ?” అన్నాడు రాజారావు.

"నేను అన్నయ్యాగారూ సుధని" అంది సుధ.


"హా అమ్మా, సుధా వనజ కి ఫోన్‌ ఇయ్యమంటావా?" అన్నాడు.


"లేదండీ మీతోనే మాట్లాడాలి" అంది సుధ.

"చెప్పమ్మా!" అన్నాడు.

"వనభోజనాలకు ప్రతీ సంవత్సరం వెళ్ళేవాళ్ళం కదా అన్నయ్యగారూ. ఈ సారి కూడా వెళదాం అంటే, మావారు ఒప్పుకోవటం లేదు. ఎలాగయినా సరే మీరే చెప్పి ఒప్పించాలి" అంది సుధ.


"అయ్యో, దానిదేముందమ్మా, చెప్తాను కానీ... జీయమ్‌ ఒప్పుకోడేమో? ఈ సారి. కరోనా అని, అన్నీ కాన్సిల్‌ చేసేరు కదా" అన్నాడు.


"పోనీ అన్నయ్యగారూ, బయటకు వెళ్లనియ్యకపోతే, జీయమ్‌ గారి ప్రాంగణం లో ఉసిరిక చెట్టు ఉంది కదా, అక్కడే వనభోజనాలు ఏర్పాటు చేసుకుందామా? మీరు అడిగితే అతను కాదని అనరు కూడా" అంది సుధ.


"సరేలేమ్మా, ట్రై చేస్తాను. నేను డ్యూటీ కి వెళ్ళాలి ఉంటాను మరి" అని ఫోన్‌ పెట్టి... "ఏమే, నువ్వు నాకు చెప్పేవు సరిపోలేదా? మళ్లీ వామనరావు వాళ్ళావిడ చేత ఫోన్‌ ఎందుకు చేయించేవు? అన్నాడు కోపంగా రాజారావు.


"వాళ్ళకు తెలియదు లెండి మీ సంగతి. మీరేదో ఏజీయమ్‌, మీకు పవర్స్‌ వుంటాయి, మీరు అడుగుతారు అనుకుంది పాపం సుధ" అంటూ వాపోయింది వనజ.


"పవర్స్‌ వుంటే, ఇలాటి వాటికి ఉపయోగిస్తారా? నీతో నాకు వాదన ఎందుకు? వస్తా" అంటూ గుమ్మం దాకా వెళ్ళేడు రాజారావు.


"అవునవును మీతో నాకెందుకు గానీ వెళ్ళండి. పెళ్ళి చూపుల్లో ఎంచక్కా కుంకుమ బొట్టు పెట్టుకొని వచ్చిన మిమ్మల్ని చూసి, మా బామ్మ ముచ్చటపడి 'రోజూ సంధ్య వారుస్తావా నాయనా"? అని అడిగితే, మీ అక్క 'మాతమ్ముడు సంధ్య వార్చడు కానీ... గంజి వారుస్తాడు' అంటే మేమందరమూ అనుకున్నాము, ఎంచక్కా వంటలు వచ్చు అని, కానీ...తరువాత మహ బాగా అర్ధం అయింది లెండి" అంది వనజ.


"ఏంటర్థమయింది?" అన్నాడు కోపంగా ఒక అడుగు లోపలకు వచ్చి రాజారావు.


" అన్నం ఉడుకుతున్నప్పుడు చిట్టుడుకు నీళ్ళు తీసుకొని తాగితే కానీ... మీకు కడుపు ఉబ్బరం తీరదని" అంటున్న వనజను చూసి, ఇంకా అక్కడే వుంటే, వనజ విసిరే తూటాల్లాంటి మాటలు వినవలసి వస్తుందని, జంప్‌ అయిపోయాడు అక్కడనించి.



రాజారావు డ్యూటీ లో వున్నాడు కానీ... వనజ సతాయింపులే, బుర్రలో తిరుగుతున్నాయి. జీయమ్‌ ని ఒకసారి అడిగి చూస్తాను పోయేదేముంది, అనుకున్నాడు.


జీయమ్‌ కేబిన్‌ కి వెళ్ళేడు రాజారావు. 'జీయమ్‌ ఇంకా రాలేదు ' అన్నాడు పిఎ. ఒక గంట పని చేసుకున్నాక జీయమ్‌ కి ఫోన్‌ చేసేడు రాజారావు.


వనభోజనాలగురించి చెప్పగానే... "ఈ కరోనా కి తోడు వాయలు వాయలుగా వాయుగుండాలు చంపేస్తుంటే... ఏం వనభోజనాలూ?" అన్నాడు జీయమ్‌.


"అదే సర్‌, ఆడవాళ్ళు సరదాపడుతున్నారు, ఈ తుఫాన్‌ తగ్గిపోతే, బయటకు వెళ్లకుండా మీ బంగ్లా ప్రాంగణం లో వున్న ఉసిరి చెట్టు కింద, సింపుల్‌ గా ఏర్పాటు చేసుకుందామని” అంటూ నీళ్ళు నమిలేడు రాజారావు.


"సరే, కానీయండి, మా ప్రాంగణం లో చేసుకోండి. మాస్క్‌ లు తియ్యద్దు, సోషల్‌ డిస్టెన్స్‌ గురించి తెలిసిందే కదా! ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవండి" అన్నాడు జీయమ్‌.


"సర్‌, మీరు మేడంగారు రావాలి" అన్నాడు రాజారావు.

"తప్పకుండా వస్తాము. అందరమూ హ్యాపీగా సెలబ్రేట్‌ చేసుకుందాము" అన్నాడు జీయమ్‌.


రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవ లేదు, అన్నట్టు వనభోజనాలకు జీయమ్‌ వద్ద నించి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే... రాబోయే ఆదివారం వనభోజనాలకు ఫిక్స్‌ చేసుకున్నారు. ఆడవాళ్ళు అందరూ హడావిడి మొదలుపెట్టారు.


ఒక్కొక్క ఇంటినుంచి వంటకాలు తేవాలని కొందరు. పాటలు ప్రిపరేషన్‌ కొందరు, హౌస్‌ ఆడాలని కొందరు, అందరూ చాలా ఇంట్రెస్టింగ్‌ గా వున్నారు.


ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. పులిహోర, బూరెలు, పెరుగుగారెలు, పూరీలు రకరకాల స్వీట్స్‌ ఎన్నో రకాల వంటకాల ఘుమ ఘుమ లతో దరిదాపు యాభైమందితో జీయమ్‌ బంగ్లా ప్రాంగణం లోకి చేరుకున్నారు అందరూ.


జీయమ్‌ ఇంకా రాలేదు ఎందుకో? అందరూ అతని కోసం ఎదురు చూస్తూ... ఉన్నారు. విష్ణు సహస్రం కొందరు చదువుతున్నారు, మరి కొందరు ముచ్చట్లు ఆడుకుంటున్నారు. అందరికీ టిఫిన్‌ టైమ్‌ అయింది జీయమ్‌ ఇంకా రాలేదు.


అతనొస్తే టిఫిన్‌ తినటానికి అందరూ రెడీ గా వున్నారు. రాజారావు ఫోన్‌ చేసేడు జీయమ్‌ కి "సర్‌ మీకోసం అందరం వెయిట్‌ చేస్తున్నాము” అని.

"ఇదిగో వస్తున్నా" అంటూ వచ్చేసేడు ఆయన.


అందరూ టిఫిన్‌ లు తిన్నారు. 'టిఫిన్‌ చాలా బాగుంది' అని మెచ్చుకున్నాడు జీయమ్‌. ఆమాట వినగానే, టిఫిన్‌ తయారుచేసిన వనజ చెడ మురిసిపోయింది.


అందరితోనూ కబుర్ల లో మునిగిపోయాడు జీయమ్‌. భోజనాలు టైమ్‌ అయింది. అందరూ వాళ్ళు వాళ్ళు తెచ్చినవి తీసి వడ్డిస్తున్నారు.


అంతలో జీయమ్‌ని వనజ అడిగింది "మేడం గారు రాలేదు, నన్ను లోపలకు వెళ్లి పిలవమంటారా? అని.


"వద్దులే అమ్మా, తనకి కొంచం ఒంట్లో బాగులేదు" అన్నాడు జీయమ్‌.


"అయ్యో, ఏంటయింది పద్మ గారికి? అంటూ అడిగింది వనజ.


"నాలుగు రోజుల క్రితం మా అమ్మాయి ఢిల్లీ నించి వచ్చింది” అన్నాడు జీయమ్‌.


"ఢిల్లీలో కరోనా బాగా ఉన్నాదిట కదా? సర్‌!” అన్నాడు రాజారావు.


"అవును, వచ్చేక రెండురోజులు బాగానే వుంది అమ్మాయి, కానీ నిన్నటినించీ మాకూ... అదే కరోనా ఏమో? అని, అనుమానంగా వుంది. పొద్దున్నించి మా ఆవిడ కూడా గొంతు మండుతోందిఅంటోంది "అన్నాడు జీయమ్‌.


జీయమ్‌ మాటలు విన్న రాజారావు కోపంగా వనజ వైపు చూసేడు. వనజ కి గుండె గుభేలుమంది ! 'అమ్మో, అయితే ఈయనకి వచ్చిందేమో? మాయదారి కరోనా. అందరికీ అంటించి చచ్చేడేమో? అయినా నాదే తప్పు. సామూహిక సమావేశాలు వద్దు అని గవర్నమెంట్‌ మొత్తుకుంటున్నా సరే... వనభోజనాలకు పరిగెట్టేము' అనుకొంటూ... మెల్లిగా అందరికీ హింట్‌ ఇచ్చి, సైగలు చేసింది.


"నాకు తలనెప్పి గా వుంది, ఇంటికి వెళతాం సర్‌" అన్నాడు రాజారావు.


"అదేంటి, రాజారావు గారూ? చాలా ఎంజాయ్‌ చెయ్యాలని అనుకున్నాం కదా, ఇప్పుడు టైం రెండే అయింది ఇంకా" అని జీయమ్‌ అనగానే... వనజ ముఖంలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది "లేదు సర్‌ వెళ్ళాలి, వస్తాం" అని నమస్కారం పెట్టి, వడి వడిగా అడుగులు వేస్తూ ఇంటివైపు బయలుదేరారు రాజారావు దంపతులు.


వీళ్ళ వెనకాలే మిగతా సభ్యులు కూడా మెల్లిగా జారుకున్నారు అక్కడనించి.


నాకూ కరోనా వుందేమో? అని భయంతో పరుగెత్తారు వీళ్ళు. ఈ దెబ్బతో ఇంత తొందరగా ఈ కాలనీ సభ్యులు మరెక్కడా కలవరు, ఏ ఏక్టివిటీస్‌ కి అటెండ్‌ అవరు ఇంత తొందరగా. కరోనా తనదాకా వస్తుంది అనేసరికి భయం తెలిసింది వీళ్ళకి.

'బాగానే భయపెట్టేను, పాపం అందరినీ' అని నవ్వు కుంటూ... లోపలకు వెళ్ళేడు జీయమ్‌.

(సమాప్తం)


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి





201 views0 comments

Comments


bottom of page