తీర్పు ఎటువైపు
- Malla Karunya Kumar
- May 31
- 6 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #తీర్పుఎటువైపు, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Teerpu Etuvaipu - New Telugu Story Written By - Malla Karunya Kumar
Published In manatelugukathalu.com On 31/05/2025
తీర్పు ఎటువైపు - తెలుగు కథ
రచన: మళ్ళ కారుణ్య కుమార్
“సార్! మీ సక్సెస్‌కి కారణం ఏమిటి?.. దాదాపు మీరు టేకప్ చేసిన కేసులన్నీ గెలిచారు. ” అని లోహిత్‌ను అడిగాడు చైతన్య.
“చైతన్య! నీకు తెలియని ఒకటి వుంది.. నేను కూడా బోలెడు కేసులు ఓడిపోయాను.. అయితే ఆ విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు.. న్యాయం కోసం గొంతు చించుకొని అరుస్తున్న ఏదో తెలియని వెలితి ఇంకా కనిపిస్తుంది.. ”
“ఏమిటి సర్, ఎప్పుడూ లేనిది మీలో ఈ నిరాశ?”
“అవును చైతన్య, ఇంకా న్యాయం సరిగ్గా అందని అభాగ్యులు ఎందరో వున్నారు. మనిషి అవసరానికి తగ్గట్టుగా న్యాయం మారిపోయిందయ్యా.. ”
“ఏంటి సార్, మీరే ఇలా మాట్లాడితే ఎలా? నాకు తెలిసి న్యాయం అందరికీ సరిగ్గా అందుతుంది సార్. దానికి ఉదాహరణ మా వూరు.. ఎప్పటి నుండో మా వూరు రచ్చబండ న్యాయానికి ఫేమస్. మీకు బాగా తెలుసు కదా.. ఇప్పటికీ మా వూరి ప్రజలు రచ్చబండ దగ్గరే న్యాయం పొందుతున్నారు. నేను కూడా ఒకటి రెండు తీర్పులు ఇచ్చాను. మీ ఆశీర్వాదం కారణంగా ఇక్కడ చదువుకున్న జ్ఞానం అంతా అక్కడ ఉపయోగించి అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాను”
“మంచిది చైతన్య. నీ ఆలోచన సరైనదే. అయితే నేను అన్న మాట మాత్రం నిజం.. ఎప్పుడైతే మనిషి లోభాన్ని జయిస్తాడో, అప్పుడే న్యాయం నిజరూపం దాల్చుతుంది. నీకే ఈ విషయం స్వయంగా అర్థం అవుతుంది. ” అని అన్నాడు లోహిత్.
కొంత సమయం మాట్లాడిన తర్వాత అక్కడినుండి తన ఊరికి తిరిగి ప్రయాణం అయ్యాడు చైతన్య. పట్నంలో పని చూసుకుని ఇంటికి చేరుకునే సరికి రాత్రి సమయం అయ్యింది.
అప్పటికి తన తండ్రి ఎవరోతోనో మాట్లాడటం దూరం నుండి గమనించాడు చైతన్య.. తాను దగ్గరకు వెళ్లేసరికి అక్కడనుండి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న చైతన్య తన తండ్రి దగ్గరికి వెళ్లి, “నాన్న, ఎవరు వాళ్లు?.. చూస్తుంటే వాళ్లలో ఏదో కంగారు కనిపిస్తోంది?” అని అడిగాడు చైతన్య.
అప్పటికి కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్న రామయ్య, “ఏమి లేదు రా.. పక్క ఊరు వాళ్లది. ఏదో పంచాయితీ తగవు వుందని కలిసి వెళ్లారు. ” అని నిదానంగా సమాధానం ఇచ్చాడు.
“ఏంటి ఆ గొడవ?” ఆశ్చర్యంతో అడిగాడు చైతన్య.
“అదంతా నేను చూసుకుంటాను.. నీకు ఎందుకు ఆ తలనొప్పి.. ” అని అన్నాడు రామయ్య. తెలుసుకోవాలనే లోపలున్న తండ్రి మాటలకు ఎదురు చెప్పలేక అక్కడనుండి వెళ్లిపోయాడు చైతన్య.
మరుసటి రోజు రామయ్యకు ఎప్పుడూ లేని విధంగా జ్వరం వచ్చి, చలికి వణుకుతున్నాడు.. తండ్రికి అలా అవ్వడం తో కంగారు పడ్డ చైతన్య డాక్టర్ను తీసుకు వచ్చాడు. మొత్తం పరీక్షించి చూసిన డాక్టర్..
“సీజన్ బాగాలేదు కదా.. ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చి వుంటుంది.. నేను శాంపిల్ తీసుకొని వెళ్ళి టెస్ట్ చేయించి తీసుకువస్తాను.. ”అని చెప్పి కొన్ని మందులు ఇచ్చి వెళ్ళాడు.
మళ్ళీ నిన్న రాత్రి రామయ్యను కలిసిన మనుషులు వచ్చారు రామయ్య దగ్గరకు..
వాళ్ళను చూసాడు చైతన్య.. వాళ్ళలో ఏదో తెలియని కంగారు స్పష్టంగా కనిపిస్తూ వుంది..
“చైతన్య నువ్వు లోపలికి వెళ్ళు. ”అని రామయ్య అనడంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు చైతన్య.
కానీ వాళ్ళలో కంగారు చూసిన చైతన్యకు వాళ్ల మీద అనుమానం కలిగింది.. పక్కనే వుండి వాళ్ల మాట్లాడేది ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు.
“ఏమిటి మళ్ళీ వచ్చారు?.. ”అని అడిగాడు రామయ్య.
“చాలా బ్రతిమాలాడి చూసాను.. లాభం లేదు.. పంచాయితీ పెట్టాల్సిందే అంటున్నారు. ”అని వాళ్ళు అన్నారు..
ఇదంతా వింటున్న చైతన్య ను లోపల నుండి ఎవరో పిలిచారు.
“ఛా, ఇప్పుడే పిలవాలా?. ”అని అసహనంతో లోపలికి వెళ్ళిపోయాడు.
“చూస్తుంటే సమస్య జఠిలంగా వుంది.. అందుకే ఏదొకటి చేసి వాళ్ళను పంచాయితీకి రాకుండా చూసుకోండి అని చెప్తాను.. కానీ మీరు ఏమి చేయలేక పోయారు. ”అని రామయ్య అన్నాడు.
“మీరే ఏదొకటి చేయాలి.. మా గురించి మీకు తెలుసు కదా.. ఈ నేరం వీడిపై మోపబడితే మా పరువు కూడా పోతుంది.. ఏదో తాగిన మైకంలో అలా చేశాడు.. పైగా వీడికి దెబ్బలు కూడా తగిలాయి. ఆ అమ్మాయి సురక్షితంగా వుంది. ”అని అన్నాడు భద్రం.
“అదే ఆలోచిస్తున్నాను.. నాకు కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు.. నేను పంచాయితీ తీర్పు చెప్పలేను.. మా వాడు తీర్పు ఇవ్వవచ్చు.. వాడి సంగతి మీకు తెలిసిందే కదా.. ”అని అన్నాడు రామయ్య హెచ్చరింపుగా.
“మీరే అలగంటే ఎలా?.. కాస్త దయచూపండి.. ”అని అంటూ చాటుగా ఒక కాగితం చుట్టిన నోట్ల కట్ట రామయ్య ఒడిలో పెట్టాడు..
ఎవరైనా చూస్తున్నారా అని చుట్టూ పరికించి చూసి.. మెల్లగా ఆ పొట్లం ను తన దుప్పటి తో కప్పాడు రామయ్య.
“మీకు తెలియంది కాదు.. న్యాయాన్ని అమ్ముకోవడం నాకు ఇష్టం లేదు. ”అని పెదవి విరుస్తూ అన్నాడు రామయ్య ఆ కట్టను చూస్తూ.
“ఎందరి బ్రతుకులో బాగుచేశారు.. మా బ్రతుకు కూడా బాగుచేయండి.. ఇది న్యాయం కొనడానికి మేము ఇస్తున్న పైకం కాదు.. మీకు చెల్లిస్తున్న మూల్యం.. కావాలంటే ఇది కూడా తీసుకోండి. ”అని మరొక నోట్ల కట్ట రామయ్య దుప్పట్లో తోసాడు ఆ వ్యక్తి.
కాసేపు అక్కడ నిశబ్దం ఆవహించింది..
కొంత సమయం అయిన తర్వాత ఆలోచనల నుండి బయటకు వచ్చిన రామయ్య..
“సరే, , , అయితే నా తీర్పు మీద ఎటువంటి మచ్చ పడకూడదు.. మీరే సాక్ష్యం ఏర్పాట్లు చేసుకోండి. మా వాడి సంగతి నేను చూసుకుంటాను. ”అని అన్నాడు రామయ్య.
“మీరు సరే అన్నారు కదా.. సాక్ష్యం సంగతి మేము చూసుకుంటాము.. చాలా సంతోషం.. మీ రుణం ఎప్పటికీ మరచిపోలేము. ”అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు.. ఆ సొమ్మును భద్రంగా దాచి.. కొడుకు ను పిలిచాడు రామయ్య..
“చైతన్య!. రేపు తీర్పు వుంది.. నాకు ఆరోగ్యం బాగులేదు కనుక.. నువ్వే చెప్పాలి.. నేను చెప్పినట్టు చెప్పు. ”అని ముందుగానే చెప్పాల్సింది ఏమిటో వివరించాడు రామయ్య.
“అదేంటి నాన్న.. పూర్వాపరాలు తెలుసుకోకుండానే తీర్పు ఒకరికి అనుకూలంగా ఎలా ఇస్తారు?.” అని అడిగాడు చైతన్య..
“చైతన్య, ఈ వ్యవహారాలు నీకు తెలియదు.. నేను చెప్పినట్టు చెప్పు.. ”అని గట్టిగా అన్నాడు రామయ్య.
రామయ్య గట్టిగా చెప్పడం తో మరో మాట మాట్లాడలేక ఊరుకున్నాడు చైతన్య.
ఇరువర్గాలు వారికి కబురు పెట్టించాడు. అలాగే ఊరు మొత్తం దండోరా వేయించాడు రామయ్య.
రామయ్య ఆరోజు పంచాయితీ కి వెళ్ళలేదు.. రామయ్య తరుపున వెళ్ళాడు చైతన్య..
అందరూ అక్కడ సమావేశం అయ్యారు. చైతన్య తో పాటు కొందరు పెద్దలు కూడా వున్నారు..
ఇరువైపుల నుండి వ్యక్తులు వాదనలు వినిపిస్తున్నాయి. వాటిని ఏవీ కూడా పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో వున్నాడు చైతన్య.. ఇరువైపుల వాళ్ళు పేర్లు కూడా వినటానికి ఇష్టపడటం లేదు చైతన్య. ఇంతలో తనకో పేరు వినిపించడం తో ఒక్కసారిగా ఆలోచన ల నుండి బయటకు వచ్చి చూసాడు.. తన గుండె వేగం పెరిగింది.. తాను చూస్తున్నది తననేనా అని మళ్ళీ పరిశీలనగా చూసాడు.. ఎదురుగా తలదించుకుని నిల్చొని వుంది మల్లిక..
“అవును ఆమె!.. ఆమె ఇక్కడ ఎందుకు వుంది?.. ”అని అనుకొని.. “ఆమె!.. ”అని ఆమెవైపు చూపిస్తూ అడిగాడు చైతన్య..
“ఆమె మల్లిక బాబు. తనకు అన్యాయం జరిగింది అని ఆమె.. ఆమె కావాలని చేసింది అని ఈ భద్రం.. పంచాయితీకి వచ్చారు. ”అని అన్నాడు అక్కడ వున్న పెద్ద మనిషి..
“అవును బాబు.. ఈమె కావాలనే.. నా కొడుకు మీద ఈ నేరం మోపింది. ”అని గట్టిగా అరుస్తూ ఆమె వైపు కోపంగా చూస్తూ అన్నాడు భద్రం..
చైతన్య కు ఎందుకో తెలియని దుఃఖం కలిగింది..
“తాను ఎవరు?.. ఎందుకు ఇక్కడ వున్నాను?.. తోలుబొమ్మలా తీర్పు ఇవ్వడానికా?.. ”. అని తనలో అనుకున్నాడు.. తన మీద తనకే అసహ్యం కలిగింది.
ముందుగా తాను చేసుకున్న ఏర్పాట్లు కారణంగా దొంగ సాక్ష్యాలను ప్రవేశ పెట్టాడు భద్రం..
ఆ సాక్ష్యులు కూడా తప్పు మల్లికా దే అని చెప్పారు..
మల్లికా వైపు తన కుటుంబం తప్పించి వేరే వాళ్ళు సాక్ష్యంగా లేరు. గుండెలు బాదుకుని మల్లికా తల్లితండ్రులు తమ బాధ వినిపిస్తున్నారు.. అయినా వాళ్ళ గోడు వినే వాడు ఎవడూ లేడు..
“లేదు న్యాయం.. దొరకదు న్యాయం.. ఆ పునాదుల కింద సమాధి అయిపోయింది న్యాయం.. ” అని మాటలు వినిపించాయి.
ఈ మాటలు పంచాయితీ కి వచ్చిన వాళ్ళకు కొత్తేమీ కాదు.. ప్రతి పంచాయితీకి వస్తాడు.. మతిస్థిమితం లేని ఒక వ్యక్తి.. అతని నోటి నుండి వచ్చేవి ఈ నాలుగు మాటలే.. అతని మాటలు ఎవరూ పట్టించుకోకుండా పంచాయితీ పెద్దలు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.
ఎన్నడూ లేని విధంగా ఆ వ్యక్తి మాటలు చైతన్య చెవిలో లో మారుమ్రోగుతున్నాయి.. ఏదో తెలియని సత్యాన్ని బోధిస్తున్నాయి ఆ వ్యక్తి మాటలు.. “నిజమేనా.. ఈ రచ్చబండ ఎన్నో న్యాయాలను సమాధి చేసిందా?.. ఇప్పుడు నేను వున్నది అన్యాయాల సింహాసనం పైనా?” అని సందిగ్ధం లో పడ్డాడు.
తండ్రి మాటకు ఎదురు చెప్పలేని తన దీనస్థితికి బాధపడుతున్నాడు చైతన్య..
“బాబు.. మొత్తం పరిశీలనగా చూస్తే.. సాక్ష్యాలు ఆధారంగా చూస్తే మల్లిక కు వ్యతిరేకంగా వున్నాయి.. మల్లికదే తప్పు అని తేలిపోయింది.. చివరిగా మీరు తీర్పు ఇస్తే పంచాయితీ ముగుస్తుంది.” అని అక్కడున్న పెద్ద మనుషులు అన్నారు.
సందిగ్ధంలో వున్న చైతన్య.. వాళ్ళ మాటలు విన్న తర్వాత ఒక్కసారి మల్లిక వైపు చూసాడు..
న్యాయం కోసం ఈ రచ్చబండ వైపు దీనంగా చూస్తున్నాయి ఆమె కళ్ళు.. మహిళకు అనుకూలంగా ఇక్కడైనా తీర్పు వస్తుందా అని ప్రశ్నిస్తునట్టుగా అనిపిస్తున్నాయి ఆమె కళ్ళు.. పాపానికి సహాయం వెళితే ప్రచండ జ్వాలలు సృష్టించే విధంగా ఎర్రగా ఉన్నాయి ఆ కళ్ళు..
“తండ్రి మాటలు పొల్లు లేకుండా ఇక్కడ అప్పజెప్పాలా?.. లేక న్యాయాన్ని మళ్ళీ బ్రతికించాలా”అని ఏవేవో ప్రశ్నలు తనని ఛిద్రం చేస్తున్నాయి.
“ఎప్పుడైతే మనిషి లోభాన్ని జయిస్తాడో.. అప్పుడు న్యాయం నిజరూపం దాల్చుతుంది.. ”అని తన గురువు చెప్పిన మాటలు చీకట్లు చీల్చిన జ్ఞాన భాషితం లా మదిలో మెదులుతున్నాయి..
ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.. తనలో వున్న భయాన్ని సమాధి చేస్తూ..
“న్యాయం సాక్షిగా.. నేను న్యాయం చేయడానికే ప్రాధాన్యత ఇస్తాను.. మొత్తం అన్నీ విన్నాక.. ఈ భద్రం, అతని కొడుకుదే తప్పని తేలింది.. అందుకు గాను వీళ్ళు మల్లిక కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. అలాగే తప్పుడు సాక్ష్యాలు సృష్టించినందుకు దానికి తగిన కోరాడ దెబ్బలు కూడా తినాలి. ” అని అన్నాడు చైతన్య..
అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు!..
“బాబు మీరు తీర్పు వేరే విధంగా చెప్పారు.. ఇక్కడ మల్లిక కు విరుద్ధంగా సాక్ష్యాలు వున్నాయి. ”అని పెద్ద మనుషులు అన్నారు.
“నేను చెప్పింది నిజమా కాదా.. అని మీకు కూడా తెలుసు.. ఇకనైనా ఇలాంటి నేరాలకు కాపుకాయడం మానేసి.. న్యాయాన్ని బ్రతికిద్దాం.. ”అని తన చివర మాటగా చెప్పి ముందుకు కదిలాడు..
తనకు తెలుసు.. మళ్ళీ తాను ఆ స్థానాన్ని అధిష్టించబోను అని.. కానీ ఒక్క తీర్పు అయినా న్యాయంగా ఇచ్చానని తృప్తి ముందు ఇవి ఏవీ కూడా నిలబడవు అని అనుకుంటూ ముందుకు కదిలాడు..
అప్పటి వరకు న్యాయం కోసం ఎదురుచూసిన కళ్ళు చైతన్య వైపు కృతజ్ఞత పూర్వకంగా చూస్తున్నాయి. చైతన్య లో ఏదో తెలియని అసంతృప్తి ఇంకా వుంది కారణం తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మల్లికా ను పొందలేకపోయాను అని..
సమాప్తం..
******
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.
Commenti