top of page

తెలివైన వ్యాపారులు (బాలల కథ )

Dr. Bellamkonda Nageswara Rao

'Telivaina Vyaparulu' written by Dr. Bellamkonda Nageswara Rao

రచన : డా. బెల్లంకొండ నాగేశ్వర రావు

అవంతి రాజు చంద్రసేనుడు తనమంత్రి సుబుధ్ధితో కలసి బాటసారుల్లా మారువేషంలో నగర సంచారం చేయసాగాడు. ఎండ తీక్షణంగా ఉండటంతో శివాలయం ఎదురుగా ఉన్న పెద్ద నందీశ్వరుని మండపంలో విశ్రమించాడు. మరికొద్ది సేపటికి తూర్పు దిశగా గుర్రంపై వచ్చిన వ్యక్తి అదేమండపంలో నందీశ్వరుని అటుపక్కగా విశ్రమించాడు. మరికొద్ది సేపటికి పడమర దిశనుండి వచ్చిన వ్యక్తి, తూర్పుదిశగా వచ్చిన వ్యక్తి పక్కనే కూర్చుంటూ "నమస్కారం నాపేరు రత్నాల రంగయ్య. నేను కుంతల రాజ్యంనుండి వస్తున్నాను"అన్నాడు.

"తూర్పుదిశగా వచ్చినవ్యక్తి "అయ్యా! నమస్కారం. నాపేరు సోమయ్య. నేను రత్నాల వ్యాపారిని కళింగ దేశవాసిని తమతో వ్యాపార విషయాలు మాట్లాడటానికి నేను కుంతలరాజ్యం

వెళుతున్నాను. తమరే ఎదురు చూడని విధంగా తారసపడ్డారు" అన్నాడుసంతోషంగా.

"అలాగా! నేను కొన్ని రత్నాలు తీసుకువచ్చాను చూడండి" అని చిన్నచిన్న సంచులలో రత్నాలను చూపించాడు రంగయ్య.

రాజు,తనమంత్రితో కలసి నందీశ్వరుని శిలకు ఇటువైపున ఉండి, అటు వైపున ఉన్న వ్యాపారుల

మాటలు ఆలకించసాగాడు.

నందీశ్వరుని విగ్రహానికి అవతల భాగంలో మనుషులు ఉన్నారని సైగ చేసిన సోమయ్య " ఏకలవ్యుడు ఎంత ?"అన్నాడు.

"అయ్యా! ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసారా? " అన్నాడు రంగయ్య.

" రావణునికి ఓ తల తగ్గింది" అన్న సోమయ్య"ఈ కంసుని భార్యలో " అన్నాడు.

"చంద్రుని రధ గుర్రాలు"అన్నాడు రంగయ్య.

"కాదులే సూర్యుని రధ గుర్రాలు చేసుకో"అన్నాడు సోమయ్య


"ఈనలదమయంతి సోదరులో"అన్నాడు.

"అయ్యా! అక్షౌహిణి కూడినంత"అన్నాడు రంగయ్య.

"కాదులే చంద్రకళలు చేసుకో" అన్నాడు సోమయ్య. అలాగే అన్నాడు రంగయ్య.

వ్యాపారం ముగిసి పోవడంతో సోమయ్య, రంగయ్యలు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి పోయారు. అప్పటి వరకు వారి మాటలు ఆలకించిన చంద్రసేన మహారాజు తన మంత్రి సుబుద్దితో

"అమాత్యా వాళ్ళిద్దరి మధ్య జరిగిన రత్నాల వ్యాపార సంభాషణ ఇతరులకు అర్ధంకాకుండా మాట్లాడుకున్నారు కదా మీకేమైనా అర్ధమైయిందా?"అన్నాడు.

"బాగా అర్ధమైయింది ప్రభూ! ఏకలవ్యుడు అంటే ఒకటి. దానివెల ద్వాదశ లింగాలు అంటే పన్నెండు వరహాలు.

“కాదు రావణుని ఓ తల తీసివేయి” అంటే తొమ్మిదివరహాలకు కొన్నాడు. అలాగే కంసుని భార్యలు అంటే ఇద్దరు. అంటే రెండు రత్నాలు వాటి వెల చంద్రుని గుర్రాలు పది కనుక పది వరహాలు

అని అర్ధం వచ్చేలా అన్నాడు. అంటే పది కాదులే సూర్యుని రధ గుర్రాలు అన్నాడు. అంటే ఏడు వరహాలకు కొన్నాడు.

నలదమయంతి సోదరులు ముగ్గురు అంటే మూడు రత్నాల వెల అక్షౌహిణి కూడినంత అంటే

ఎటు కూడినా పద్దెనిమిది వస్తుంది. అంటే పద్దెనిమిది వరహాలు అన్నాడు. కాదులే చంద్రకళలు చేసుకో అన్నాడు అంటే చంద్రుని కళలు పదహారు.పద్దెనిమిది వరహాలు చెప్పిన మూడు రత్నాలను పదహారు వరహాలకు బేరం చేసికొన్నాడు. ప్రభూ! వాళ్ళు తెలివైన

వ్యాపారులు. సామాన్యులకు అర్ధం కాకుండా వ్యాపార విషయాలు మాట్లాడుకున్నారు. పురాణ విషయాలపై మంచి అవగాహన కలిగిన వారు" అన్నాడు మంత్రి సుబుద్ది.


***శుభం***


33 views0 comments

Comments


bottom of page