top of page

తెలుగు ప్రాణం


'Telugu Pranam' written by Dr. Ramana Yashaswi

రచన : డాక్టర్ రమణ యశస్వి

మల్లి మనసు తనుకూర్చుని ప్రయాణిస్తున్న విమానం కన్నా వేగంగా పరిపరివిధాల పోతోంది కన్నీళ్లే ఇంధనంగా . కరోనాకి భయపడి బిజినెస్ క్లాస్ లో సీట్లు బుక్ చేసాడు భర్త. తన లాగే మాస్కు ,ఫేసుషీల్డు పెట్టుకొని తొమ్మిదేళ్ల తన కూతురు దూరంగా అవతల సీట్లలో కూర్చుని ఉంది . కరోనా వల్ల భౌతిక దూరం అంటూ సొంత పిల్లల్నే దగ్గర కూర్చోపెట్టుకుండే పరిస్థితిలేదు. అమ్మకు కరోనా పాజిటివ్ వచ్చింది అని అన్నయ్య ఇండియా నుండి ఫోన్ చేసి చెప్పడంతో పిల్లను తీసుకొని బైల్దేరింది . కరోనాతో మానవ జీవన యుద్ధం మూడోప్రపంచ యుద్ధాన్ని తలపిస్తుంటే , వాళ్ళ ఇంట్లో మళ్ళీ భారత యాత్ర నాలుగో ప్రపంచయుద్ధాన్నే సృష్టించింది. కూతురు 'వరాలు' వైపు చూసింది .శ్రద్ధగా పెద్దబాల శిక్ష పుస్తకం చదువుతోంది అలసిపోయిన కళ్ళతో . తనకు కూడా అలసటతో కళ్లుమూతలుపడుతుండగా అమ్మ గురించిన ఆలోచనలతో మనసు మాయా దుప్పటి కప్పేసింది . మల్లేశ్వరిగా ఇండియా నుండి మాధవ్ ని పెళ్లి చేసుకొని పదేళ్ల క్రితం అమెరికా వచ్చి 'మల్లి' గా పిలవబడుతూ, సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పగలనక రాత్రనక కష్టపడుతూ డాలర్లు వెనకేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని పుట్టించి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న సమయంలో అమ్మకి కోవిడ్ వచ్చినట్లుగా తెలిసింది ఇండియా పంపించడానికి అడ్డు ఏమీ చెప్పరు కానీ కరోనా టైం లో ,పిల్లలను తీసుకొని జర్నీ చెయ్యొద్దు అని గట్టిగానే భర్త చెప్పాడు . నాన్నను మిస్ అయినట్లు అమ్మని మిస్ అవ్వకూడదు . అమ్మని చూడాల్సిందే .అమ్మకు పిల్లల్నిచూపాల్సిందే అని పట్టుపట్టింది . చివరికి పాపని తీసుకొని వె ళ్ళు అని ఒప్పుకున్నాడు . తన భయం కరోనా గురించే పాపం . మల్లి ఇండియా వెళ్లి ఆరేళ్ళ య్యింది .అప్పుడు నాన్నకి ఆరోగ్యం బాగాలేదు ఒక్కసారి వచ్చివెళ్ళు అనే ఫోన్ కాల్ తో పిల్లల్ని కూడా వదిలేసి ఊరొచ్చింది . అప్పటికే నాన్నారు గుండెపోటుతో చనిపోయారు అని తెలుసుకొని షాక్ అయింది. అమ్మని చూసి గుండె తరుక్కుపోయింది అమ్మని తీసుకెళదామంటే తనకు పాసోపోర్ట్ కూడా లేదు . ఆమె ఎప్పుడూ నాన్నను వదిలి అమెరికా రావడానికి ఇష్టపడలేదు .నాన్న అసలు ఎప్పుడూ ఇష్టం చూపేవాడు కాదు . ఇరవైరోజులు వుండి అమ్మ కి ధైర్యంచెప్పి అమెరికా వెళ్ళిపోయింది . అన్నయ్య అమ్మకు పాసుపోర్టు తెప్పించాడు .వీసా కూడా వచ్చింది అమ్మ ఆ తర్వాత ఏడాదికే మా దగ్గిరికి వచ్చి ఆర్నెల్ల టికెట్టుని బోర్ కొడుతోంది బాబోయ్ అనుకుంటూ మూడ్నెళ్లకు కుదించుకొని తిరిగి వెళ్ళిపోయింది . ఉన్న ఆ మూడునెలలలో పిల్లలకి తెలుగు మాటలు,పద్యాలు, రైమ్స్ ,శ్లోకాలు నేర్పడానికి ప్రయత్నిం చింది . మల్లి అమ్మపేరు వరలక్ష్మి .పాప పేరు వైష్ణవి . . అమ్మ పేరునుంచి తీసుకొని ముద్దు పేరు వరాలు అని పెట్టారు . నిజంగానే వైష్ణవి అమ్మ ముద్దుల మన'వరాలు' .అమ్మకు వరాలు బాగా అలవాటైంది . అమ్మ తోటే లోకం అయిపొయింది ముద్దుల మనవరాలుకి . అమ్మపిల్లలిద్దరికీ తెలుగు నేర్పాలనే తాపత్రయంతో ముందుగా 'శుక్లాంబరధరం విష్ణుం 'అంటూ విఘ్నే శ్వర ప్రా ర్ధనతో మొదలుపెట్టింది .పిల్లవాడు పారిపోతున్నాడు ,పిల్ల మాత్రం శ్రద్ధగా అమ్మమ్మ చెప్పేవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది . 'సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ 'కూడా ఆసక్తిగా నేర్చుకుంటోంది. అన్నిటికన్నా వరాలుకి నచ్చింది అమ్మమ్మ చూపించిన 'పుణ్యకోటి - ఒక ఆవు కథ' యానిమేషన్ లో తీసిన త్రీడీ ఆవు పులి కథ . ఆవు దూడలకు వరాలు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపొయింది .ఆ పులిని పోలీసులకి పట్టిద్దాములే పడుకో 'అంది అమ్మమ్మ . ‘ థాంక్స్ అమ్మమ్మ ‘అని వళ్ళో తలపెట్టి పడుకుంది . 'థాంక్స్ కాదు తెలుగులో ధన్యవాదములు అని చెప్పాలి 'దయ్యంపాదములు 'అని ముద్దుముద్దుగా చెప్పింది. మొత్తానికి ధన్యవాదములు నేర్చుకుంది . ‘సారీ అంటే క్షమించు’ అని బాగా చెప్పడానికి వారం రోజులు పట్టింది వరాలుకి . ' వందేమాతరం ,సుజలాం సుఫలాం' అని వరాలు చెపుతుంటే అమ్మమ్మ ఆనందంతో మురిసిపోయింది .'.చిట్టీ చిలకమ్మా ,అమ్మ కొట్టిందా 'నేర్చుకుంటూ 'మా అమ్మ కొట్టడు' అని తుర్రుమంటుంది చిలక పలుకుల వరాలు . ముద్దుల మూట వరాలు తెలుగు విన్యాసాలన్నీ వీడియోలు ఫోటోలు తీసుకుంటోంది అమ్మమ్మ జ్ఞాపకాల తోరణం కట్టుకుంటున్నట్లు . తెలుగు పంతులమ్మమ్మ మనవరాలికి పొదుపు కథలు కూడా చెప్పింది .' అక్కా చెల్లెళ్లు ఏడుస్తారు, అయితే దగ్గరకు చేరలేరు' అంటే ఏమిటో చెప్పవే ఇంగిలీషు భడవా ' అడిగింది అమ్మమ్మ 'ఐ డోంట్ నో 'అంది వరాలు . 'తెలీదు అని చెప్పు ' అని సరి చేసింది అమ్మమ్మ . 'తెలీదు అని చప్పు' అమ్మమ్మని ఎక్కిరిస్తూ తుర్రుమంది తూనీగ లాగా . మరుసటి రోజు కూడా అదే పొదుపు కథ అడిగితే ' చప్పు' అంది వరాలు 'కళ్ళు' అని చెప్పింది కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించి ' కరెక్ట్ దే క్రై ,దే కాంట్ మీట్ 'ఐ గాట్ ఇట్ 'అని అమ్మమ్మని వాటేసుకొని ముద్దు పెట్టుకుంది . మా తెలుగు తల్లి కి మల్లెపూదండ 'సుందరాచారి రాశారు అని చెప్పేదాకా వచ్చింది . అయితే వాళ్లకు తెలుగు కొంచెం వంటబట్టకముందే అమ్మ వెళ్లిపోవాల్సివచ్చింది. . పిల్లలు కూడా ఆరేళ్ళు ,నాలుగేళ్ల పసివాళ్లు . అమ్మ వెళుతూ ఒక కోరిక కోరింది . 'నేను మళ్ళీ సప్తసముద్రాలను దాటి అమెరికా రాలేనమ్మా మీ పిల్లలకు చిన్నప్పటి నుంచీ తెలుగు నేర్పండి అదే నా చివరికోరిక . తెలుగు పంతులమ్మ మనవడికి ,మనవరాలికి తెలుగుకూడా రాదు అనే అపప్రధ నాకు తెప్పించకండి. మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలు ధారాళంగా తెలుగులో మాట్లాడాలి. నాకు తీరనికోరికంటూ ఏమీలేదు నా జీవితం హాయిగా సాగిపోయింది .ఈ కోరిక నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే తెలుగు లో పుట్టి ,తెలుగులో చదువు కొని తెలుగు బోధించిన నాకు తెలుగు అమృతభాషగా మిగిలిపోవాలి అనే అభిప్రాయం నాటుకుపోయింది. నాకు తెలిసిన ప్రతివారికి ,పిల్లలకు తెలుగు నేర్పండి. తెలుగు భాషను అంతరించిపోయే భాషల్లో కలవనీకండి అనిచైతన్యం కలిగిస్తూనే ఉంటాను. అలాంటిది నా వంశాంకురాలకే తెలుగు రాదు అంటే నాకు యెంత నామర్దా .నేను పోయిన తర్వాత అయినా నేను అది అవమానంగా భావిస్తాను . అంత అనుబంధం నాకు తెలుగుతో' .అంది అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతుండగా . 'సరే అమ్మా నీ కోరిక తీర్చడానికి ఇవ్వాళే శ్రీకారం చుడతా . ఇక్కడ తెలుగు పుస్తకాలు ఏమీలేవు .నువ్వేమైనా పలానా పుస్త కాలు అని చెప్తావా ? ' . 'అలా రా దారికి. పెద్దబాలశిక్ష ,శతకాలు ,అక్షరమాల పుస్తకాలు , పంచతంత్రం, తెనాలి రామలింగడు కథలు , స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర బొమ్మల పుస్తకాలు లాంటివి ఇంట్లో ఉంటే మంచిది . లేకపోతే మిగతావన్నీ ఆన్ లైన్ లో గూగుల్ తల్లిని అడిగి తెలుసుకొని ప్రింట్ ఔట్స్ తీసి చెప్పు ,చదివించు. ఊరికెనే మాట్లాడటం కాదు చదవటం రాయటం రావాలి . అప్పుడే నేను నమ్మేది వాళ్ళు నా వంశాంకురాలని.'' అన్నది అమ్మ ఎంతో భావావేశంతో . ఈ చిన్న కోరిక తీర్చలేనా ,తెలుగు తల్లిదండ్రులు గా మేమున్నాము .అమ్మ చెప్పినట్లు పుస్తకాలు తెప్పిస్తాము నేర్పుతాము. ఏముంది కష్టం అనుకుంటూ అమ్మకి వెయ్యి రూపాయలు ఇచ్చి'పిల్లలకు తెలుగు నేర్పడానికి ఉపయోగపడే యేపుస్తకాలైనా పంపు అమ్మా 'అన్నాను హలో నేను పెన్షనర్ని .నా బంగారాలకు నేను ఆ మాత్రం ఖర్చుపెట్టి తెలుగు పుస్తకాలు పంపలేనా అని ఆ డబ్బు తీసుకోకుండా అమ్మ ఊరెళ్ళిపోయింది .పుస్తకాలు చాలా పంపింది . నాకు తర్వాత అర్ధమైంది .అమెరికాలో పెరుగుతున్న తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించడం అంత సులభంకాదని . ఎందుకంటే చదువులు ఇంగ్లీష్ లో ,స్నేహితులు అందరూ ఇంగ్లీష్ వాళ్ళు , తెలుగుపిల్లలున్నా తల్లిదండ్రులు వాళ్ళని తెలుగులో మాట్లాడనివ్వరు. చాలా తెలుగు కుటుంబాలుకూడా ఇంట్లో ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు. కర్ణుడి చావుకెన్నికారణాలో తెలుగు పిల్లలకి తెలుగు రాకపోవడానికి అన్ని కారణాలు అనిపించింది మల్లి కి అయినా అమ్మ కోరిక తీర్చడం తన కింకర్తవ్యం అనే గట్టి సంకల్పంతో ఇద్దరు పిల్లలకి ఒక నెల రోజులపాటు మేము ఎక్కడ పుట్టాము ,మాతృభాష ,భారతదేశము ,ఆంధ్ర దేశము ,స్వాతంత్య్ర గాధలు ,గాంధీ ,నెహ్రూ ల చరిత్ర ,వివేకానందులవారి చారిత్రిక చికాగో ఉపన్యాసము హిందూ సంస్కృతి ,అశోకుడి గాధ ,రామాయణ భారత భాగవత ఇతిహాసాల ప్రాముఖ్యత అచ్చ తెలుగులో బొమ్మల పుస్తకాలు చూపిస్తూ ,యు ట్యూబ్ వీడియోలు చూపిస్తూ వాళ్ళల్లో కొంచెంఆసక్తి కలిగేలా చేసాము . నిజంగానే వాళ్లకు అవన్నీ బాగా నచ్చి మమ్మల్ని పదేపదే మళ్లీ ఆ కథ చెప్పు ,ఈ పద్యం చెప్పు అని వాళ్ళే అడగసాగారు. అయితే స్కూల్లో ఎవరూ తెలుగు మాట్లాడేవాళ్ళు లేకపోయేసరికి తెలుగు ఉచ్చారణ మీద పట్టు రావడానికి కొంత ఎక్కువ సమయం పడుతోంది . వీళ్ళ గురించి మేము పన్నెండు నెలల ప్రణాళిక ఒకటి తయారు చేసాము . అందులో భాగంగా మా ప్రాంతంలో ఉన్న తెలుగు సంఘాల వాళ్ళతో మాట్లాడి మా చుట్టుపక్కల ఉన్న తెలుగు కుటుంబాల అడ్రస్సులు తీసుకొని వాళ్ళతో స్నేహం మొదలుపెట్టాము వాళ్లకి మా అమ్మ కోరిక చెప్పాము. వారందరూ ఆశ్చర్యపోయి నిజమే మన పిల్లలు మదర్ టంగ్ మర్చిపోకూడదు మనం అందరం కలిసి పథక రచనచేసి మన భాష ని ఇక్కడ మరుగునపడిపోకుండా కాపాడుకుందాము. ముఖ్యంగా భావి తరాలు మాతృభాషని మరువకుండా వారికింది తరాలకు అందించేలా చూద్దాము అదే మన తెలుగు సంస్కృతి ని కూడా కాపాడే ఒక గొప్ప ఆయుధంగా మలుద్దాము అంటూ మాతో చెయ్యి కలిపారు . ముందు ఇళ్లల్లో అందరం ఖచ్చితంగా తెలుగు లోనే మాట్లాడుకోవాలి అలాగే పిల్లలు కూడా ఇది అనుసరించేలా చెయ్యాలి. విధిగా పిల్లలు రోజూ ఒక గంట తెలుగు రాయడం కానీ ,చదవడం కానీ చేయాలి . వాళ్లకి ఆ గంట కొన్ని మిగతా కోర్సులు కానీ ఆటలు కానీ త్యాగం చేయాలి .ఒకే స్కూల్ లో చదువుకునే తెలుగు పిల్లలు కలిసినప్పుడు కనీసం తెలుగులోనే మాట్లాడుకొనేలా వాళ్ల కు చైతన్యం కలిగించాలి. ఇలా వాళ్లకు తెలుగు భాష గొప్పతనం మీద ఆసక్తి కలిగి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత వాళ్లకు లిపి మీద ఆసక్తి కలిగేలా చేయడం మొదలుపెట్టాము . అంటే ఇంగ్లీష్ లో 26 అక్షరాలు ఉన్నట్లు తెలుగులో మొత్తం 56 అక్షరాలు ఉంటాయి అంటూ రెండు భాషల ను పోల్చిచూసుకొనేలా చేసి అక్షరాలు దిద్దించాము . పెద్దబాల శిక్ష పుస్తకము చూపించి అందులో అక్షర మాల ,ఒత్తులు పొల్లులు ,గుణింతములు అచ్చులు ,హల్లులు ,వ్యాకరణము సామెతలు ,శ తకములు ,పిట్టకథలు ,పొదుపు కథల పైన ఎంతో అవగాహన కలిగించాము . ఇంగ్లీష్ వొకాబులరీ లాగా తెలుగు పదసంపద ఎంత గొప్పదో విశదీకరించాము . సంవత్సరంలో తెలుగు బాగానే పట్టుదలగా నేర్చుకుంది . అమ్మను చూడగానే 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడతానుఅమ్మా' అని ముద్దు ముద్దుగా చెప్పింది వరాలు ఆ పాట బాగా నేర్చుకొని తప్పుల్లేకుండా పాడుతోంది. అమ్మకి ఇలా అవుతుందని తెలియక ముందు గ్రీన్ కార్డు రాగానే కుటుంబం అంతా ఊరెళ్ళి ఒక నెల గడుపుదాము అనుకున్నారు . ఈ లోపు కరోనా మహమ్మారి విజృంభణ జరగడం ,అమ్మకు కోవిడ్ అని కబురంది ఇలా బైల్దేరడం జరిగింది 'ఇంతలో స్నాక్స్ అంటూ ఎయిర్ హోస్టెస్ లేపడంతో ఈ లోకంలోకి వచ్చింది మల్లి. అటువైపు తలతిప్పి చూసింది వరాలు ఇంకా పుస్తకం చదువుతూనే ఉంది. వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన ఛాలెంజ్ ని గట్టిగానే స్వీకరించింది అనుకుంటూ 'స్నాక్స్ తినమని చెప్పింది .వరాలు కి అమ్మకు సీరియస్ గా ఉందని చెప్పలా . పాపం పిచ్చి పిల్ల అమ్మ ఒళ్ళో కూర్చొని ఆ పాట వినిపించి మంచి మార్కులు కొట్టేద్దామనుకుంటోంది . అసలు డాక్టర్లు ఆమె దగ్గరకే పోనివ్వరని తెలీదు. అమ్మని మంచి చికిత్స కోసం హైదరాబాద్ అంబులెన్సు లో తరలించారు .మల్లీ ,వరాలు ఫ్లైట్ దిగి క్యాబ్ లోవెళ్లి అన్నయ్య బావమరిది ఇంట్లో దిగారు మల్లిని ,పిల్లని ఏడు రోజులు క్వారంటైన్ తర్వాత గానీ అమ్మని చూడటానికి ఆస్పత్రికి పొనీలేదు . ఐసీయూ చికిత్స తర్వాత అమ్మని రూమ్ కి మార్చారుట . రూంలో చూడటానికి కూడా పీపీఈ కిట్ వేసుకొని వెళ్లారు . అమ్మమ్మ నిద్ర పోతోంది అన్నది వరాలు ఆనందంగా, బెడ్ మీద కళ్ళుమూసుకొని నిస్సత్తువగా పడుకున్న ఆవిడని చూసి. అమ్మకు ముక్కులో ఆక్సిజన్ పెట్టిఉంది,నోట్లో ఇంకో ట్యూ బ్ పెట్టి ఉంది ఆహారం పంపించడానికి ట . బోరున ఏడ్చేసింది మల్లి. పిల్ల కూడా కళ్లనీళ్లు పెట్టుకొని బిక్కచచ్చి చూస్తోంది . అన్నయ్య చెప్పాడు 'బతుకుతుందని అనుకోలేదు ,అదృష్టం కొద్దీ నువ్వొచ్చేసరికి వెంటిలేటర్ తీసి ,ఐసీయూ నుండి రూమ్ కు మార్చే పరిస్థితికి వచ్చింది .కళ్లుతెరిచి చూసి మళ్ళీ పడుకుంటుంది, ఆ చూసినప్పుడన్నా నన్ను గుర్తుపట్టినట్లు కూడా లేదు మల్లి 'అన్నాడు అన్నయ్య బాధతో దిగాలుగా . ఇంతలో వరాలు పెద్దగా 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ 'అని ముందుకు వంగి అమ్మకు వినపడేలా మృదుమధురంగా పాడటం మొదలుపెట్టింది. ఆ పసిమనసుకి అమ్మమ్మ అలా పడుకొనిఉండటం నచ్చలా,అలాగే తన పాటను ఇన్నిరోజులు వినిపించలే కపోవడం వల్ల ఇక ఆగలేక పా డేస్తోంది. అదే భావావేశంతో మొత్తం పాడి అమ్మ వైపు చూసింది విజయగర్వముతో అమాయకంగా . ఒక్కసారి వరాలు ని దగ్గరకు లాక్కొని 'బంగారుతల్లీ ఎంత బాగుంది నీ కంఠస్వరం ,నువ్వు రోజూ ఏదో ఒకటి ఇలా వినిపిస్తే అమ్మమ్మ ఖచ్చితంగా కళ్ళు తెరిచిచూస్తుంది 'అని ప్రేమగా ముద్దులు పెట్టుకుంది. మేనమామ కూడా ఆప్యాయంగా ఎత్తుకొని 'బాగా పాడావు తల్లీ' అమెరికా యాస లేకుండా ' అన్నాడు. ఇలా రోజూ ఆస్పత్రిలో అమ్మమ్మ దగ్గరకి కరోనా కిట్స్ వేసుకొని వెళ్లడం ఆ చిన్నారి వరాలు కి ఒక టాస్క్ లాగా అనిపిస్తున్నట్లుంది . ఆనందంగా వచ్చి సుమతీ శతకంలో పద్యాలు ,వేమన పద్యాలు ,తెనాలి రామలింగడి కథలు ,అమ్మమ్మ చిన్నపిల్లయినట్లు ,తాను అమ్మమ్మలాగా ఆవిడని అలరిస్తున్నట్లు చేస్తోంది . రోజూ ఒక గంట సేపు మల్లి ,అన్నయ్య మైమరచి వరాలు తెలుగు విన్యాసాలను తిలకించి పులకించిపోతున్నారు .విశేషమేమిటంటే వరాలు మొదలుపెట్టిన ఐదో రోజునుంచి చిన్న చిన్నగా కళ్ళు తెరిచి చూడటం మొదలుపెట్టింది వరలక్ష్మి.ఎనిమిదోరోజు పిల్లలిద్దరినీ చూసి వలవల ఏడ్చేసింది . అంటే కొంచెం గుర్తుకూడా పడుతుందన్నమాట అని అనుకొన్నారు . ఆ రోజు సాయంత్రం వరాలు ని చూసి చేతులు రెండూ చాపింది దగ్గరకు రమ్మన్నట్లు.కానీ వరాలుని అమ్మమ్మ దగ్గరకు పంపలేదు కోవిడ్ దృష్ట్యా, అమ్మమ్మని ,మనవరాలిని వేరుచేసిన కరోనాని మనసులోనే తిట్టుకుంటూ . మల్లి ఆనందానికి అవధులు లేవు . అన్నయ్యను హత్తుకొని ' అమ్మకు ఇంత సేవ చేసే అదృష్టం దొరకడం నీ పూర్వ జన్మసుకృతం'ప్రాణాలకు ,డబ్బులకు వెరవక చేశావు ,నీకు మరో జన్మలేకుండా చేసుకున్నావు ,ఉంటే మాత్రం జన్మజన్మల కు నీ చెల్లిగా పుట్టాలనికోరుకుంటున్నాఅన్నయ్యా ' అంది ఆనంద భాష్పాలు రాలుస్తూ . తొమ్మిదోరోజు కాళ్లకు గజ్జెలు పెట్టుకొని భరతనాట్యంకూడా చేసింది అమ్మమ్మ ముందు రెట్టించినఉత్సాహంతో వరాలు . అమ్మమ్మ చూస్తూనే వుంది తదేకంగా . అంతలో అనుకోని సంఘటన జరిగింది .పెద్ద డాక్టర్ వస్తున్నాడు అంటూ కిట్టు వేసుకొని చిన్న డాక్టర్ వచ్చాడు చెప్ప్పడానికి . మైమరిచి పీ పీ ఈ కిట్టులో డాన్స్ చేస్తున్న వరాలను జబ్బ పట్టుకొని పక్కకు లాగి పారేసాడు .'డాక్టర్' అంటూ శంకరాభరణం సినిమాలో శాస్త్రి గారు 'శారదా' అని అరిచినట్లు పెద్దగా అరిచింది ఐ సీయూ మంచంపై ఉన్న అమ్మమ్మ . అంతలో పెద్ద డాక్టర్ రానే వచ్చాడు రౌండ్స్ కి. చిన్న డాక్టర్ ఇం గిలీషులో వివరిస్తున్నాడు ' సార్ మొదటి సారి తను మాట్లాడటం ' గత తొమ్మిది రోజులుగా మనవరాలు పాటలు పాడటం ఆమె కళ్ళు తెరిచి చూడటం ' అంటూ అంతా వివరించి చెప్పాడు . ఇప్పుడు తన ప్రాణం కన్నా ఎక్కువైన తన మనవరాలిని లాగి తోసేసే సరికి ఎమోషనల్ గా పెద్దగా అరిచింది సార్’ అని చెప్తూ ఆయన్ని అనుసరిస్తూ నడుస్తున్నాడు . ఇం గిలీషులో పెద్ద డాక్టర్ అన్నాడు ' మన ట్రీట్మెంట్ తర్వాత ఆ పాప పాటలు ,మాటలు ,నాట్యం మాత్రమే ఆమె మానసిక సంఘర్షణ నుండి బయటపడేసింది ఇక ఇప్పుడు చాలా త్వరగా కోలుకుంటుంది చూస్తుండు ' అని ఆమె ఆరోగ్య పరిస్థితి మోనిటర్ లో చూసాడు . 'కోవిడ్ చికిత్సలో ఇది అరుదైన కేసు పూర్తిగా స్టడీ చేసి రాబోయే కాన్ఫరెన్స్ లో పేపర్ ప్రెజెంట్ చెయ్యండి 'అంటూ వెళ్ళిపోయాడు ఆ గజ్జెల చప్పుడుకి ,ఆ శ్రావ్యమైన పాటకు స్పందించిన అమ్మమ్మ'వరాలు నువ్వెప్పుడొచ్చావమ్మా ? తెలుగు స్పష్టంగా వచ్చిందే చిట్టితల్లీ !' అని మాట్లాడటంతో అందరూ సంతోషంతో నిండిన గుండెలతో ఏడ్చేశారు . ముక్కులో ట్యూబ్ తీయమని అడగటం మొదలుపెట్టింది . డాక్టర్ అది తీసేసి నోటిద్వారా ద్రవపదార్ధాలు ఇవ్వమని చెప్పివెళ్ళారు .నర్సు వచ్చి ఆసరా ఇచ్చి కూర్చోపెట్టింది బెడ్ పైనే . 'మల్లీ నువ్వెప్పుడొచ్చావే తల్లీ 'అంటూ చేతులు చాచింది . . వారమైంది అమ్మా ,ఇలాంటి జబ్బు పగవాడికి కూడా రాకూడదు కనీసం దగ్గరకి వచ్చి కూర్చోవడానికి కూడా లేదు 'అంటూ పెద్దగా ఏడ్చేసింది . ఆర్టీ పీసీఆర్ టెస్టు నెగటివ్ వచ్చింది . ఇంకో వారంలో డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారు ఇంటికి . అక్కడకూడా ఇంకో వారం రోజులు ఐసోలేషన్ లోనే ఉంచారు అమ్మ ఈ వారంలో బాగానే మాట్లాడుతోంది . లేచి నడిచి తన పని తాను చేసుకోగలుగుతుంది. వరాలు తో కబుర్లు చెబుతోంది . తెలుగు ఎంతవరకు వచ్చిందో కనుక్కుంటోంది . అట్లతద్దె పాటలు ,జానపదాలు ,సవర్తబంతి పాటలు ,బతుకమ్మ పాటలు ,దసరా పద్యాలు .అల్లూరి ఏకపాత్ర ,ఒకటేమిటి పెద్ద బాలశిక్షలో ముఖ్యమైనవి తనకు నోరు తిరిగి బాగా పాడగలిగినవన్నీ నేర్చుకొనివచ్చింది అమ్మమ్మ దగ్గర తెలుగు సర్టిఫికెట్ కొట్టెయ్యడానికి . మల్లి చూస్తుండగానే ,ఇక ఉండబట్టలేక అమ్మమ్మ ప్రేమతో వరాలుని దగ్గరకు తీసుకొని గట్టిగా హత్తుకొని ,నుదుటిమీద ముద్దులు కురిపించి దీవించింది . దిష్టి తీసేసింది. 'తలంటి స్నానం చేయించమ్మా ,నేనుముద్దుపెట్టుకున్నా కదా' అంది కరోనా జాగ్రత్త తో అలాగేనమ్మా ! అమ్మా ఇంతకుమించిన తెలుగు సర్టిఫికెట్ ఏ యూనివర్సిటీ కూడా ఇవ్వలేదు,అని వంగి తల్లి పాదాలకునమస్కరించి దీవెనలు అందుకుంది మల్లి 'అమ్మా దాని తెలుగు వల్లనే నీకు తెలివి వచ్చింది .లేకపోతే ఇంకా చాలా రోజులు ఆ బెడ్ పైనే ఉండేదానివి' అంటూ ఆనందంగా నవ్వుతూ చెప్పింది మల్లి . వరాలు పసి(డి)మనసు మొదటేమో అమ్మమ్మని తన తెలుగుతో మెప్పించాలని చూసింది . ఆ తర్వాతేమో అమ్మమ్మని ఎలాగైనా తన తెలుగు ప్రావీణ్యంతో ,నాట్యంతో నిద్రనుంచి లేపాలని పట్టుదలతో రోజూ ప్రయత్నించింది. ఇక్కడ తనకు తెలీకుండానే ఫలితం ఆశించకుండా మంచిపని చేసి భగవద్గీత తత్వాన్ని పండించింది కల్లాకపటం ఎరుగని ఆ పసిమనసు . అది ఎంత ఫలితమంటే ఒక అమ్మమ్మ తెలుగుప్రాణం కుదుటపడేంత ఫలితం . తెలుగులో ఉన్న మధురత్వము ఆమరత్వము ప్రసాదించింది ఒక అమ్మమ్మకి ఒక మన'వరాలు '.మానవ సంబంధాలకు పెద్దపీట వేసి , ప్రేమ ముందు కరోనా తలవంచింది .

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత పరిచయం :

ఒక్క వాక్యంలో నా గురించి నేను గుండెను తాకే అలలా , స్వప్నాన్ని తాకే జోలలా , అసమానతలను తాకే జ్వాలలా సామాజిక భాద్యత కలిగిన సాహిత్యం , మనుషులను ఇష్టపడుతూ , ధనం వైపు చూడక మనుషుల జీవితం వైపు చూస్తూ , ఆకాశం ఆశలను , పుడమి స్వప్నాలను ఈ రెంటి మధ్య వున్న ప్రకృతిని , నలుగుతున్నజీవితాలను వాక్యాలలో దట్టిస్తూ సమాజంలో మంచి మార్పు కోసం ' నేను సైతం ' అని నిశ్శబ్ద శబ్దం చేస్తూ గమ్యం సుదూర తీరాలలో దాగి ఉందని తెలిసీ

సామాజిక చైతన్యాన్ని సాహిత్య ప్రగతిగా మార్చాలని

సమతా ఉషస్సు సమాజ శ్రేయస్సు

సాహిత్యానికి రెండుకాళ్లలాంటివి అని నమ్మి

పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న ఒక అసాధారణ సామాన్యుడిని, మరియు ఆర్థో సర్జనుడిని

డాక్టర్ రమణ యశస్వి

*****



395 views1 comment
bottom of page