top of page

తనకు మాలిన ధర్మం


'Thanaku Malina Dharmam' written by Janardhan Amballa

రచన : అంబల్ల జనార్దన్

“అగర్వాల్ గారికి కూడా పాజిటివ్ వచ్చిందట. ఇప్పుడు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్నారట” జోసెఫ్ వార్త చెప్పాడు.

“మొన్న ఆదివారం నాడు మనతో పాటు ఉన్నాడుగా? అప్పుడే ఏమైంది?” రసూల్ భాయ్ లో ఆందోళన.

“సోమవారం, వారి పక్క ఫ్లాట్ లోని అరోరా గారికి కరోనా సూచనలు కనపడగా, వారింట్లో మగవారెవరూ లేనందున, వారిని తీసుకొని కార్పొరేట్ ఆస్పత్రికి అగర్వాల్ గారే తన కార్లో తీసుకెళ్లారట. అక్కడ అరోరాగారికి పాజిటివ్ అని తేలగానే అక్కడే అడ్మిట్ చేసి, తిరిగొచ్చారట. మంగళవారం, అగర్వాల్ గారికి దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది మొదలయ్యాయట. వెంటనే వారి అబ్బాయి అగర్వాల్ గారిని అదే కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చాడట. అప్పుడు ఆయనకి కరోన సోకిందని నిర్ధారించారట. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కొనసాగడంతో వెంటిలేటర్ పై పెట్టారట. పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉందట” అగర్వాల్ గారి పొరుగింటి రుద్రరాజు గారు చెప్పారు.

“మంచి చేయబోతే చెడు ఎదురైందన్న మాట.” జోసెఫ్ తన అభిప్రాయం వెలిబుచ్చాడు.

“అందుకే అంటారు, ‘తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం కలదా?’ అని” గిరి ప్రసాద్ కుండ బద్దలు కొట్టాడు.

అవధాని, అగర్వాల్, అరోరా, రుద్రరాజు, జోసెఫ్, రసూల్ భాయ్, నగర శివార్లలో ఉన్న కాలనీ నివాసులు. అంతా అరవై సంవత్సారాలు పైబడి ఉద్యోగాల నుంచి రిటైరైన వారే. కరోనా లాక్ డౌన్ కాలంలో ఇంటి దిగ్బంధంలో ఉన్నవారే. అన్ లాక్ డౌన్ ప్రక్రియ మొదలై ఓ వారం రోజులు గడిచాక, ఇంటివారు ఎన్నో జాగ్రత్తలు చెప్పగా, ముక్కుకు, నోరుకు మాస్క్ వేసుకుని భౌతిక దూరం పాటిస్తూ, రెక్కలు తొడిగిన పక్షుల్లా, తమ కాలనీలోని పార్క్ సన్నిధిలోని చెట్లచెంత, వారంతా వాలిపోవడం మొదలుపెట్టారు. అగర్వాల్, అరోరా ఆస్పత్రి పాలవగా తక్కిన నలుగురు స్వచ్ఛమైన గాలి పీల్చడానికి పార్క్ లో కొలువుదీరారు. తనకు మాలిన ధర్మం అనే మాట వినగానే రుద్రరాజు, తనకూ అలాంటి అనుభవం ఎదురైందన్నాడు. “ఏంటది? చెప్పు, చెప్పు” అని అందరూ కోరస్ పాడారు.

“ఇది జరిగి దాదాపు పది సంవత్సరాలు కావస్తోంది. మా అమ్మగారు ‘నాకు కాశీ చూడాలని ఉంది రుద్రా’ అని ఎన్నో ఏళ్లు ప్రాధేయ పడింది. నా ఉద్యోగ బాధ్యతల వల్ల, సెలవుకు ఇబ్బందిగా ఉండడం వల్ల మా కాశీ ప్రయాణానికి వీలు కాలేదు. ఓ సారి మా అమ్మకు తీవ్ర జబ్బుచేసి ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. వారం రోజులు ఆస్పత్రిలో ఉండి వచ్చాక ‘ నేను ఇంకెన్ని రోజులు బతుకుతానో తెలియదు. ఇప్పుడన్నా నాకు కాశీ చూపించరా!’ అని దీనంగా అడిగింది. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఉద్యోగ బాధ్యతలకు అంతు ఉండదు. మా అమ్మ కోరిక ఎలాగైనా తీర్చాలనే ఉద్దేశ్యంతో మా అమ్మగారితో పాటు మా కుటుంబమంతా కాశీ యాత్ర చేయడానికి ప్లాన్ చేశాము. ఆ సంగతి తెలుసుకున్న మా పక్కింటి పెద్దమ్మ, తనని కూడా కాశీ తీసుకెళ్లమని మా అమ్మతో రాయబారం నడిపింది.

“ఆమె కొడుకు ముంబయిలో ఉంటాడు. ఈ పెద్దమ్మ అక్కడి ఇరుకింటిలో ఇమడలేక పోయింది. పైగా ఆ కోడలుకి అత్త పొడ గిట్టదు. అందుకే కాళ్లూ చేతులూ ఆడుతున్నాయి కాబట్టి, ఒక్కతే తమ ఇంటి ఓ భాగం అద్దెకిచ్చి, ఆ అద్దె డబ్బులతో రోజులు వెళ్లదీస్తోంది. పెద్దావిడను మనతో పాటే తీసుకెళితే, ఆమెకు కాశీ విశ్వేశ్వరుని దర్శనభాగ్యం


కలుగుతుంది, ఆమెకు ఆ అవకాశం కల్పించినందుకు, మనకూ అంతో ఇంతో పుణ్యం దక్కుతుంది.” శ్రీమతి సిఫారసు చేసింది. హోం మినిస్టర్ మాటకు ఎదురు చెప్పే దమ్ము లేకపోయింది. ‘సరే’ అన్నాను. రానూ పోనూ రైలు టిక్కట్లు తీసాను. కాశీలో మన తెలుగువారి సత్రంలో దిగి, అక్కడి పురోహితున్ని కుదుర్చుకున్నాం. అతను మాకు కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణ, భైరవనాథ్ మొదలగు మందిరాల దర్శనం చేయించాడు.

ఆ తర్వాత గంగా తీరంలో మా పూర్వీకుల పిండదానానికి ఏర్పాటు చేశాడు. గంగా నదిలో స్నానాలు చేసి కొంత సేపు గంగా విహారం కూడా చేశాము. నదీ తీరంలోని మణికర్ణికా ఘాట్ లో కొన్ని శవాలు దహనం చేయడం చూశాము. ఆ తర్వాత సాయంత్రం గంగా హారతి కనుల పండుగలా తిలకించాము. ఆ హారతిచ్చే యువకులు మా తెలుగువారని తెలిసి ఆనంద పడ్డాం. ఆ తర్వాత విడిదికి వచ్చాం. మర్నాడే మా తిరుగు ప్రయాణం. అప్పుడు వచ్చింది సమస్య.” రుద్రరాజు మంచి నీళ్ల బాటిల్ నుండి నీళ్లు తాగాడు.

“ఆ తర్వాత? అసలు వచ్చిన సమస్యేమిటి? ” జోసెఫ్ లో కుతూహలం.

“చెబుతా, చెబుతా నన్ను కాస్త ఊపిరి పీల్చుకోనియండి. మాతో వచ్చిన పెద్దమ్మకు ఆ రాత్రి గుండెపోటు వచ్చింది. మా పై ప్రాణాలు పైనే పోయాయి. మర్నాడు ప్రయాణం అనుకుంటే ఇవేం తిప్పలురా నాయనా! అనుకున్నాను. ఆ సత్రం వారి సహాయంతో పెద్దమ్మను అక్కడి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చాము. వారు డిపాజిట్ కట్టమంటే నా క్రెడిట్ కార్డ్ తో కట్టాను. ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే కాని, ఏమీ చెప్పలేమన్నారు. పెద్దమ్మ ఐ.సీ.యూ. లో ఉంటే, నేనూ, శ్రీమతీ బయట జాగారం చేశాము. మర్నాడు ఉదయమే మా అబ్బాయిని రైల్ టిక్కట్లు రద్దు చేయడానికి పంపించాను. ఆ రోజు సాయంత్రానికి టెస్ట్ రిపోర్ట్ లు వచ్చాయి. గుండెలో కొన్ని బ్లాకులు ఉండడంతో రక్త ప్రసరణ సరిగా కావడం లేదన్నారు. స్టెంట్ లు వేయాలి కాబట్టి ఆపరేషన్ చేయడం తప్పదన్నారు. గాలికి పోయే కంపను ఒంటికి చుట్టుకున్నట్టయింది. ఆ పెద్దమ్మ కొడుకుతో మాట్లాడితే ‘ఆపరేషన్ అక్కడ వద్దు, మా ఆఫీస్ మెడిక్లెయిం సౌకర్యంతో ముంబయిలోనే చేయిస్తాను. మీరెలాగైనా హైద్రాబాద్ తీసుకువస్తే, నేను ముంబయి తరలించి అక్కడే ఆపరేషన్ కి ఏర్పాటు చేస్తానన్నాడు.’ పెద్దమ్మ ఆరోగ్యం ప్రయాణానికి అనుగుణంగా లేకపోవడంతో, ఆమెను నాలుగైదు రోజులు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స చేయించాల్సి వచ్చింది.

జబ్బు మనిషితో రైలులో సుదీర్ఘ ప్రయాణం చేయలేకా, ఏసీలో కూడా రైలు టిక్కట్ల రిజర్వేషన్ దొరుకక, విమానంలో తిరుగు ప్రయాణం చేయాల్సి వచ్చింది. నా సెలవు ఇంకో వారం పొడిగించాను. కాశీలో పొడిగించిన మా బసకూ, విమాన టిక్కట్లకూ నా బడ్జెట్ లో యాభై వేల రూపాయల బొక్క పడింది. పెద్దమ్మ చికిత్సకు ఖర్చు పెట్టిన మొత్తం ఆమె సుపుత్రుడి నుండి రాబట్టడానికి ఏడు చెరువుల నీళ్లు తాగాల్సి వచ్చింది. ‘అసలు నన్ను సంప్రదించకుండా అంత ఖరీదైన ఆస్పత్రిలో ఎందుకు చేర్చారు?’ అని పేచీ పెట్టాడు. అప్పటి నుండి ‘తనకు మాలిన ధర్మం చేయకూడదని చెవులు పట్టుకున్నాను” రుద్రరాజు తన సుదీర్ఘ ఏకరువు ముగించాడు.

“మానవత్వంతో నువు ఆమెకు చేసిన మేలు ఎన్నటికీ వృథా పోదు. ఆ దేవుడు నిన్ను తప్పక కరుణిస్తాడు” జోసెఫ్ ఉవాచ.

“అలాంటి అనుభవం నాకూ ఎదురైంది. కాకపోతే అది, అంత ఖర్చుతో కూడుకున్నది కాదు.” రసూల్ భాయ్ అన్నాడు.

“ నువ్వూ కానీయ్ రసూల్ భయ్యా!” గిరి ప్రసాద్ లో ఉత్సుకత.


“అవి నేను ముంబయిలో పని చేస్తున్నప్పటి రోజులు. నా జీతానికీ అక్కడి ఖర్చులకీ పొంతన కుదరక, కుటుంబాన్ని హైద్రాబాద్ లోనే ఉంచి నేనక్కడ బ్యాచిలర్ జీవితం ఆస్వాదించే వాణ్ణి. రెండు మూన్నెళ్ల కొకసారి, సెలవులు, శని, ఆదివారాలు కలసి వచ్చినపుడు, హైద్రాబాద్ వచ్చే వాణ్ణి. అలా ఓ సారి హుసేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ లో హైద్రాబాద్ బయలుదేరాను. నాకు ఎస్. మూడులో బర్త్ రిజర్వ్ అయింది. నా బర్త్ లో ఓ పెద్దావిడ కూచొనుంది.

అది నా బర్త్ అని చెప్పడం తో ఓ యువకుడు ‘సర్! మా అమ్మ గారికీ నాకు టిక్కట్లు తీసినప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యాయి కాని మా అమ్మకు ఇక్కడ, నాకు ఎస్. పదకొండులో బర్త్ లు దొరికాయి.

మీకు అభ్యంతరం లేకపోతే ఎస్ పదకొండు లోని నా బర్త్ తీసుకోండి. అప్పుడు మా అమ్మతో నేను ఉండవచ్చు. ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నేను తనతో ఉండడం తప్పనిసరి. మీరొక్కరే కాబట్టి, దయచేసి అక్కడికి మారండి’ అని విన్నపం చేశాడు.

ఒక సాటి ప్రయాణీకుడిగా ఆ మాత్రం సర్దుకుంటే పోయేదేముంది? అనుకుని నేను ‘సరే’ నన్నాను. అదే నా ప్రాణం మీది కొచ్చింది. ఛత్రపతి శివాజి టర్మినస్ నుండి బయలుదేరిన హుసేన్ సాగర్ ఎక్స్ ప్రెస్, దాదర్, ఠాణే లో ఆగకుండా, నేరుగా కళ్యాణ్ లోనే ఆగుతుంది. కోచ్ లోపల జనాలు నిండా ఉండడంతో నా సూట్ కేస్, చంక బ్యాగ్ పట్టుకుని ప్లాట్ ఫాం పై దిగాను. అప్పుడుగాని తెలియలేదు, నేనెంతటి సాహసానికి ఒడిగట్టానో. స్టేషన్ నిండా జనం, వారి సామాన్లూ, పిల్లా పాపలతో పరుగెడుతున్నారు. పద్మవ్యూహం కంటే జటిలంగా ఉన్న ఆ జన సమూహాన్ని నా బరువైన లగేజితో పాటు ఛేదించడం చాలా కష్టమైంది. రైలు కదిలే లోగా ఎస్ పదకొండుకి చేరడం అసంభవ మనిపించింది. ఐనా ఎలాగో ముందుకు సాగాను. అంతలో రైలు కదలడానికి సిద్ధంగా ఉన్న సూచనగా విజిల్ వినపడింది. వెంటనే నాకు దగ్గర్లో ఉన్న కోచ్ లో దూరాను. రైలు కదిలింది. తీరా చూస్తే అది ఎస్. ఆరు కోచ్. అంటే కోచ్ లోపలినుంచే, ఇంకా ఐదు కంపార్ట్ మెంట్లు దాటాలి. రైలు తప్పి పోతుందేమో అన్న టెన్షన్ ఒకపక్కా, లగేజి మోయడంతో నీరసం ఇంకో పక్కా నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఓ ఐదు నిమిషాలు నుంచుని సేద తీరాను. ఆ తర్వాత నా సామాను మొస్తూ, జనాల్లోంచి సందు చేసుకొని ముందుకు సాగాను. నా సామాను తమకు తగిలిందనే వారి తిట్లు తింటూ అవి నన్ను కాదని అనుకుంటూ, ఎలాగోలా ఎస్. పదకొండు కోచ్ లో నా బర్త్ దగ్గరికి చేరుకున్నాను. అదృష్టవశాత్తు టి.సీ. అక్కడే ఉన్నాడు. ఆ బర్తు శాల్తీ రాలేదని చూడడంతో అది ఆర్.ఏ. సీ. వారికి కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను టిక్కట్టు చూపించేసరికి అది ఎస్. మూడు గదా అన్నాడు. నేను బర్త్ మార్పిడి సంగతి వివరించి అతన్ని ఒప్పించేసరికి తాతలు దిగి వచ్చారు. ఆ కోచ్ టీ.సీ. వేరు, నేను వేరు. ఇలా మీలో మీరే బర్త్ లు మార్చుకుంటే మేము డ్యూటీ ఎలా చేసేది? అని మండి పడ్డాడు. చివరికి కొన్ని గాంధీ తాతలు చేతులో పడే సరికి శాంతించాడు. ఆ గంట సేపు నేను పడ్ద యాతన, శ్రమ గుర్తుకు వస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ మనఃస్తాపం మాటల్లో వర్ణించలేను. ఏదో మానవతా దృక్పథంతో ఒకరికి సాయం చేయాలనుకుంటే ప్రత్యక్ష నరకం కళ్ల జూడాల్సి వచ్చింది. అప్పటి నుంచి తనకు మాలిన ధర్మం చేయకూడదని నిశ్చయించాను.” రసూల్ భాయ్ తన కథనం ముగించాడు.

“మీరు చెబుతుంటే నాకూ అలాంటి ఘటన జ్ఞప్తికి వస్తోంది.” గిరిప్రసాద్, తన అనుభవం నెమరు వేసుకున్నాడు.


“మనం ఇళ్ళకు బయల్దేరడానికి ఇంకా బోలెడు సమయముంది. నువ్వూ కానీయ్” రుద్రరాజు ఉత్సహ పరిచాడు.

“ఎనిమిది సంవత్సరాల క్రితం నేనిక్కడ మా కంపెనీ, దాక్షిణాత్య రాష్ట్రాల జోన్ కు అధినేతగా ఉండేవాణ్ణి. ఉద్యోగ రీత్యా పలు చోట్లకు తనిఖీకి వెళ్లే పని ఉండేది. కంపెనీ కారు, డ్రైవర్ ను కూడా సమకూర్చింది.

ఓ రోజు నా మిత్రుడు, తన చెల్లి పెళ్ళి ఆహ్వాన పత్రిక తీసుకుని ఇంటికి వచ్చాడు. పెళ్లికి తప్పకుండా రావాలని చెబుతూనే ఇంకో విన్నపం చేశాడతను.

పెళ్ళికి వచ్చే బంధువుల రాకపోకలకు సౌకర్యంగా ఉండేందుకు గాను, రెండు రోజులపాటు నా కారు, డ్రైవర్ ను పంపమన్నాడు. నేను తటపటాయించాను. వ్యక్తిగత అవసరాలకు కంపెనీ కారు వాడటం నాకు ఇష్టముండదు. అదే ఆ మిత్రునికి చెప్పాను. అంతలో మా శ్రీమతి జోక్యం చేసుకుంది.

‘ఆ రెండు రోజులు మీకు సెలవులే కదా? పాపం అన్నయ్య గారు నోరు తెరిచి అడిగారు. ఐన వారికి ఆ మాత్రం సాయపడకుంటే ఎలా? కారు, మన ఇంటి గ్యారేజీలో ఉండే బదులు వారి అక్కరకు పనికొస్తుంది. మీరు ఒప్పుకోండీ” అంటూ దీర్ఘాలు తీసింది. అన్యమనస్కంగానే తల ఊపాను.

‘కార్లో పెట్రోల్ మేమే పోసుకుంటాం. తిరిగి ఇచ్చేటప్పుడు ట్యాంక్ నింపి అప్పజెప్పుతాం. డ్రైవర్ కి భోజన పానీయలతో పాటు బేటా కూడా ఇస్తాం.’ అన్నాడా స్నేహితుడు.

‘కారు సరే. కాని వ్యక్తిగత పనులకు కంపెనీ డ్రైవర్ ని వాడుకోవడం నాకు ఇష్టముండదు. మీరు వేరే డ్రైవర్ ను మాట్లాడుకుంటే మంచిది. కారుకి మాత్రం ఏ చిన్న దెబ్బ తగిలినా మా హెడ్ ఆఫీస్ తో మాట పడాల్సి వస్తుంది. జాగ్రత్త.’ నేను హెచ్చరించాను. ‘అలాగే. అలాగే’ అంటూ తెగ ఆనంద పడ్దాడతను.

పెళ్లికి మేము టాక్సీలో వెళ్లాల్సి వచ్చింది. ఐనా ఓర్చుకున్నాను. రెండు రోజుల తర్వాత, ఆఫీసుకు తీసుకెళ్లడానికి మా డ్రైవర్ వచ్చాడు, కాని కారు పత్తా లేదు. ‘ఉదయం ఎనిమిదింటికల్లా కారు మీ ఇంట్లో ఉంటుందని’ చెప్పిన మిత్రుని ఫోన్ స్విచాఫ్! నాకు బి.పి. పెరిగిపోతోంది. కంపెనీ కారు ఎందుకిచ్చానా? అని పశ్చాత్తాపం మొదలైంది.

‘నువు చెప్పావని ఇచ్చానని’ శ్రీమతి పై విరుచుకు పడ్డాను. ఆమె మాత్రం ఏం చేస్తుంది? నా ఆతృత నాది. గడియారం పది గంటలు కొట్టింది. ఇక ఆగలేకపోయాను. నేనూ, డ్రైవర్, ఆటోలో ఆఫీసుకి బయలుదేరాం. దారి పొడుగునా ఆ మిత్రున్ని తిడుతూనే ఉన్నాను, మనసులో. నన్ను నేను కూడా తిట్టుకున్నాను. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? చివరాఖరికి పగలు రెండు గంటలకి ఆ మిత్రుని ఫోన్. నేను అతనిపై విరుచుకు పడ్డాను. అతను మాత్రం శాంతంగా ‘నేను చెప్పేది విను గిరీ! పెళ్ళి హడవుడిలో ఫోన్ చార్జింగ్ లో పెట్టడం మరిచి పోయాను. అందుకే అది నీకు స్విఛ్చాఫ్ అని వచ్చింది. ఉదయం ఏడు గంటలకే మేము కుదుర్చుకున్న డ్రైవర్ ను మీ కారుతో పాటు మీ ఇంటికి బయలు దేరాము. తొందరగా మీ ఇంటికి వచ్చి, మళ్ళీ తన డ్యూటికి వెళ్లాలనే హడావుడిలో అతను కాస్త స్పీడ్ గానే బండి నడిపాడు. అంతలో ఓ ఆవు అడ్దమొచ్చింది. దాన్ని తప్పించడానికి స్టీరింగ్ తిప్పితే కారు పోయి డివైడర్ కి గుద్దుకుంది. ఇంకేముంది పోలీస్ కేసు, పంచనామా, ఆ తర్వాత డ్రైవర్ ను ఆస్పత్రి లో చేర్చి, కారు రిపేర్ కు ఇచ్చి, నీకు ఫోన్ చేసే సరికి ఇంత టైం పట్టింది. చాలా చాలా సారీ గిరీ! సారీ గిరీ! సారీ గిరీ!’ అని అతను పలు మార్లు తన విచారం వ్యక్తం చేశాడు. అతను పదే పదే సారీ చెప్పినా, నా మీద ‘స్వారీ’


చేసిన మనఃస్తాపం ఏ మాత్రం తగ్గలేదు. మొదటి సారి నా సిద్ధాంతానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు తగిన శాస్తే జరిగింది. దాదాపు వారం రోజుల తర్వాత, కారు మా ఇంట్లో వాలింది. దాంట్లో ఉన్న రెండు లీటర్ల మోటర్ ఆయిల్, ఇంకా కొన్ని స్పేర్ పార్ట్ లు మాయమయ్యాయి. కారుకు పడ్డ సొట్టలు అదనం. ఏం చెప్పేది? ఎవర్ని నిందించేది? మళ్లీ నన్ను నేనే తిట్టుకున్నాను. కారు ప్రమాదానికి గురైనందుకు మా హెడ్డాఫీసుకు సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. గుడ్డిలో మెల్లగా, ఇన్ష్యూరెన్స్ వాళ్లు ఇచ్చిన డబ్బుపోగా, కారు రిపేరుకి ఐన ఖర్చు, ఆ మిత్రుడే భరించాడు. ఐతే వారం రోజులు నా రాకపోకలకి ఐన ఖర్చు నేనే నా నెత్తిన వేసుకున్నాను. అది కూడా నా మిత్రుడు ఇస్తానన్నాడు కాని నా అంతరాత్మ ఒప్పుకోలేదు.

అప్పటినుంచి, తనకు మాలిన ధర్మం కూడదని ఒట్టు పెట్టుకున్నాను.” గిరి ప్రసాద్ తన అనుభవాన్ని ముగించాడు. అంతా విన్న అవధాని గారు మొదలు పెట్టారు.

“మీ అందరి అనుభవాల వల్ల మీరు, మీకు మాలిన ధర్మం కూడదని అనుకోవడం సబబే. కాని లోకంలో మానవత్వం అనేదొకటుంది. దాని ప్రభావంతో మనలో చాలా మంది, సాటి వారి కష్టాల్లో, వారిని ఆదుకోవాలనుకుంటారు. మీ లాంటి వారి అనుభవాల వల్ల ఆ తర్వాత సహాయం చేయడానికి వెనకాడతారు. అది సరి కాదు. మీకు ఎదురైన సంఘటనలు, మీ నుండి సహాయం పొందిన వారు కావాలని సృష్టించినవి కావు. దైవ సంకల్పంతో అవి అనుకోకుండా జరిగినవి తప్పితే, ఎవరో మీకు నష్టం కలిగించాలనే ఉద్దేశ్యంతో చేసినవి కావు. మీకు జరిగిన నష్టం, కలిగిన మనస్తాపం, అన్నీ కాకతాళీయమే, తాత్కాలికమే, కాని మీ నుండి సహాయం పొందిన వారి మనసులో మాత్రం ఆ కృతజ్ఞతాభావం ఆజన్మాంతం ఉంటుంది. వారికి మీరు చేసిన ఉపకారం, ఏదో రూపంలో మీకు తిరిగి చేరుతుంది. ‘అపకారికి ఉపకారం నెపమెల్లక చేయువాడు నేర్పరి’ అన్నాడు సుమతీ శతకాకారుడు. ఆ మధ్య వాట్సాప్ లో ఓ ఉదంతం చదివాను. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేత్రి శ్రీమతి సుధా మూర్తి గారు రైల్లో, దీన పరిస్థితిలో ఉన్న ఓ బాలికను చేరదీసి ఆ అమ్మాయికి చదువు, వసతి కల్పిస్తారు. ఆ తర్వాత మరిచిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీమతి సుధా మూర్తి గారు ఏదో సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళతారు. అక్కడి ఆమె హోటల్ బిల్లు వేరెవరో చెల్లించారని తెలుస్తుంది. ఎవరు చెల్లించారని ఆరా తీయగా ఓ యువతి తనే చెల్లించానని చెబుతుంది. ఆ యువతి ఎవరో కాదు, రైల్లో శ్రీమతి సుధా మూర్తి గారు చేరదీసినప్ప్పుడు దీన పరిస్థితిలో ఉన్న బాలిక! శ్రీమతి సుధా మూర్తి గారి చలవతో, పై చదువులు చదివి, అమెరికాలో ఉన్నత స్థాయి వరకు ఎదిగిన యువతి! ఇంతకూ చెప్పేదేమంటే మనం చేసిన మేలు వృథా పోదని. ఇది నా స్వానుభవంతో కూడా చెబుతున్నాను. నాకూ మీలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. అలా అని నేను నా శాయశక్తులా ఇతరులకు చేయూత నీయడం మానలేదు. నేను చేబదులుగా ఇచ్చిన సొమ్ము, నాకు అవసరమున్నప్పుడు తిరిగి రాక, నేను ఎక్కువ వడ్డీకి అప్పు చేసి నా మాట నిలబెట్టుకున్నాను. అవి జీవితంలోని భాగాలుగా పరిగణించాను తప్పితే, మనసులో ఉంచుకుని బాధ పడలేదు.

అందుకని నేను మీకు విన్నవించేదేమంటే, మనం మన శాయశక్తులా తోటి వారికి సహాయ పడదాం. ఒక్కోసారి మనకు మనఃస్థాపం కలిగినా ఓర్చుకుందాం. మనలోని మంచిని పెంపొంద్దిద్దాం. ఈ జీవన సంధ్యలో సమాజానికి చేతనైన సహాయం చేద్దాం.” అవధాని గారు కాస్త పెద్ద క్లాసే తీసుకుని, బయల్దేరడానికి లేచారు. తక్కిన వారు దాన్ని సహేతుకంగా


తీసుకుని, ఆయన చెప్పిన అంశాలను నెమరువేసుకుంటూ, తమ తమ నెలవులవైపు అడుగులు వేశారు.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత పరిచయం : డా. అంబల్ల జనార్దన్

తల్లి దండ్రులు : అంబల్ల నర్సవ్వ, అంబల్ల నర్స్మయ్య

జననం : 9 నవంబరు, 1950.

చదువు : ఆంధ్ర ఎడ్యుకేషన్‌ సొసైటీ వారి ఉన్నత పాఠశాల, ముంబయి నుండి ఎస్‌.ఎస్‌.సి.- మార్చ్‌-1967

యం.కాం., ఎల్‌ ఎల్‌.వీ.,(ముంబయి విశ్వవిద్యాలయం) సి.ఏ.ఐ.ఐ.బి. (ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌

బ్యాంకింగ్‌ & ఫైనాన్స్‌)

సొంతఊరు :పోస్ట్‌: ధర్మోరా, మోర్తాడ్‌ మండలం, నిజామాబాద్‌ జిల్లా.-503 311 తెలంగాణ రాష్ట్రం. పుట్టిన్నుండి ముంబయిలో నివాసం.

ఉద్యోగ ప్రస్థానం :మార్చి, 1970 లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో మొదలై, బాంబే మర్కంటైల్‌ బ్యాంక్‌, ప్రెస్మన్‌ కార్పొరేట్‌

గ్రూప్‌, కాస్మాస్‌ బ్యాంక్‌, మార్గంలో పయనించి, ఎప్రిల్‌ 2007 లో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుండి “హెడ్‌-క్రెడిట్‌-

ఎడ్మినిస్టేషన్‌” గా పదవీ విరమణ. ఆ తర్వాత కొన్ని సంస్థలకు ఆర్థిక సలహాదారునిగా సేవలు.

సాహిత్య ప్రస్థానం ; 1ఆరు కథా సంపుటాలు, మూడు కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి, ఒక మోనోగ్రాఫ్‌ ప్రచురణ.

2. స్వీయ కథల ఇంగ్లీష్‌, హిందీ, మరాఠీ మరియు ఒడియా సంపుటాలు ప్రచురితం. (గుజరాతీ కథా సంపుటి ముద్రణలో)

3. “అంబల్ల జనార్దన్‌ కథలు” కథా సంపుటిపై పరిశోధనకు గాను యూనివసిటీ ఆఫ్‌ హైద్రాబాద్‌ వారిచే శ్రీ గుడుగుంట్ల

ఆంజనేయులు గారికి యం.ఫిల్‌. ప్రదానం.

4. ఒక కథ, అసామీ భాషలోకి అనువాదమయింది. కొన్ని కథలు, కవితలు వివిధ సంకలనాల్లో చోటు చేసుకున్నాయి.

బిరుదులు ; “ముంబయి తెలుగు రత్న, “ముంబయి కథా కెరటం” ” మరియు “సాహిత్య రత్న”

పురస్కారాలు : పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారంతో సహా, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌

రాష్ట్రాల్లోని ఎన్నో సాంఘిక, సాహిత్య సంస్థల ద్వారా సన్మానాలు. 2012 లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా

“మహారాష్ట్రలో తెలుగువారు” మోనోగ్రాఫ్‌ రాసినందుకు గాను, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సన్మానం.

5. దాదాపు రెండు దశాబ్దాలుగా కొన్ని కథలు, మహారాష్ట్ర ప్రభుత్వంచే ప్రచురింపబడిన తెలుగు మరియు మరాఠీ 8వ, 9వ, 10వ, 11వ

మరియు12 వ తరగతి పుస్తకాలలో పాఠ్యాంశాలు.

ఓ కథ “శ్రీకారం” యూనివసిటీ ఆఫ్‌ హైద్రాబాద్‌ వారు ఎం.ఏ. విద్యార్థుల పాఠ్యాంశంలో చేర్చారు.

6. కాకతీయ విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం తో సహా కొన్ని సాహితీ సదస్సుల్లో పత్రాల సమర్పణ.

నేషనల్‌ వర్చువల్‌ యూనివర్సిటీ ఫర్‌ పీస్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ వారిచే గౌరవ డాక్టరేట్‌ పట్టా ప్రధానం - 2019

473 views1 comment

1 Comment


Very good. Excellent narration

Like
bottom of page