top of page

తండ్రికి తగిన తనయ


'Thandriki Thagina Thanaya' New Telugu Story

Written By Neeraja Hari Prabhala

'తండ్రికి తగిన తనయ' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"ఏయ్! సుగుణా! ఆఫీసుకు టైమవుతోంది. బ్రేక్ఫాస్ట్ రెడీనా?" ఆఫీసుకు రెడీ అవుతూ అడిగాడు గోపాల్.

" రెడీ. రండి." అంది సుగుణ.

గోపాల్ డైనింగ్ హాల్లోకి రాగానే భర్తకు పెట్టి, తనూ తీసుకుంది సుగుణ. బ్రేక్ఫాస్ట్ పూర్తిచేసి హడావుడిగా ఆఫీసుకు వెళ్లాడు గోపాల్.


ఆ తర్వాత మిగిలిన పనిని పూర్తి చేసి తమ ఊరిలో ఉన్న తల్లితండ్రులకు ఫోన్ చేసి వాళ్లతో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది సుగుణ. తరచూ వాళ్లకు ఫోన్ చేసి వాళ్ల యోగక్షేమాలను తెలుసుకోవడం సుగుణకు పరిపాటే. వాళ్లతో మాట్లాడి ఫోన్ పెట్టేయగానే తన తల్లి తండ్రులు, తన ఊరిని గురించిన ఆలోచనలతో గత స్మృతులలోకి వెళ్లింది సుగుణ.


వెంకటాపురం గ్రామంలో రామయ్య తన భార్య జానకమ్మ, ఏకైక కూతురు సుగుణతో పెద్దలిచ్చిన విశాలమైన ఇంట్లో సంతోషంగా ఉంటున్నారు. ఉన్న ఎకరం పొలంలో కష్టపడి వ్యవసాయం చేస్తూ తనకున్నంతలో ఏలోటూ లేకుండా సుగుణను పెంచి పెద్దచేశారు రామయ్య గారు. ఆయన ఆ ఊరి ప్రెసిడెంటు కూడా కనుక ఊరి పెద్దగా ఉంటూ ఎవరికి ఏసాయం కావాల్సొచ్చినా లేదనకుండా చేసేవారు. అందరికీ ఆయనంటే చాలా గౌరవము, అభిమానము.


పురాతనంగా ఉన్న ఆ ఊరి శివాలయాన్ని చుట్టుప్రక్కల గ్రామప్రజల నుంచి చందాలు ప్రోగుచేసి, తమ ఊరి వాళ్ల చేత కూడా చందాలు వేయించి, మిగిలింది తను వేసి దగ్గరుండి ఆలయపునరుధ్ధరణ చేశారు రామయ్య గారు. ఆయనమీద గౌరవంతో ఆ ఊరి ప్రజలు ఆయన్నే ఆలయ ట్రస్టీగా నియమించుకుని ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆలయ పూజారిని నియమించుకుని తన ఇంటిలో ఒక భాగాన్ని ఆదంపతులకు నివాసానికి ఉచితంగా ఇచ్చారు రామయ్య గారు.


సుగుణ కూడా తన కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా మెలుగుతూ కష్టపడి చదివి మంచి మార్కులతో పదవతరగతి పాసయింది. ఆ ఊరి స్కూలులో అంతవరకే చదువు ఉన్నందున ఇంటరు చదువు కోసం ప్రక్క ఊరిలోని కాలేజీలో సుగుణను చేర్చారు రామయ్య గారు.


కాలేజీకి ప్రతిరోజూ సుగుణ తన తోటి స్నేహితురాళ్లతో కలిసి నడిచి వెళ్లేది. తమ గ్రామం 'అందమైన పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతోందా?' అన్నట్లుగా ఎంత సుందరంగా, కనువిందు చేస్తూ ఉంటుందో? తమ ఊరిని దాటి ప్రక్క ఊరి కాలేజీకి వెళ్లాలంటే చుట్టుప్రక్కల అంతా చెట్టు చేమలు, దూరంగా ఎత్తైన కొండలను చూసుకుంటూ మధ్యలో గలగల పారే పెద్దకాలువ, దాని చుట్టూ ఆకు పచ్చనితివాచీ పరిచినట్టు కళకళలాడే మాగాణి పంటలు. ఆ కాలువ నుంచే ఆ పంటలకు నీరు అందేది. బల్లకట్టు ఎక్కి ఆ కాలువ దాటితే గాని కాలేజీకి, ఇతర గ్రామాలకు వెళ్లలేరు. బల్లకట్టుని నడిపేవాడికి నెలకు కొంత ధాన్యం ఇచ్చి ఆ కాలువను దాటి చుట్టుపక్కల గ్రామాల్లో తమ పనులను పూర్తిచేసుకుని తమగ్రామం వెంకటాపురం చేరుకొనేవారు ఆ ఊరి ప్రజలు.

'అంత అందమైన గ్రామంలో పుట్టటం తన అదృష్టమని' ఎప్పుడూ భావించే సుగుణ కాలేజీలో చక్కగా చదివి ఇంటరు పూర్తి చేసింది. పెళ్లి చేద్దామన్న తల్లి ఆలోచనలను త్రోసిబుచ్చి డిగ్రీ చదువుతానని పట్టుబట్టింది. రామయ్యగారు కూతురికే వంతపాడి ఆమెని డిగ్రీలో చేర్చారు. సుగుణ డిగ్రీ ఫస్ట్ క్లాసులో పాసయ్యాక రామయ్య దంపతులు చాలా సంతోషించి తన పొలంలోని వ్యవసాయ కూలీలకు, చుట్టుపక్కల వారికీ మిఠాయిలను పంచిపెట్టారు. సుగుణకు పెళ్లి చేయాలని పట్టుబట్టింది జానకమ్మ. తనకి ఇంకా పై చదువులు చదవాలన్న కోరిక ఉన్నా తండ్రి స్ధోమతను అర్ధం చేసుకున్నదై మౌనం వహించి పెళ్లికి సుముఖత చూపింది సుగుణ.


సుగుణకు పెళ్లి సంబంధాలను చూస్తున్న సమయంలో గోపాల్ వాళ్ల సంబంధం రామయ్య దంపతులకు బాగా నచ్చింది. గోపాల్ కు తల్లితండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్ లో చనిపోవడంతో మేనమామ శరభయ్య చేరదీసి పెంచి పెద్ద చేశాడు. ఆయన మధ్య తరగతి కుటుంబీకుడు. ఏకైక కొడుకు ధీరజ్ ని చదివించాలనే తాపత్రయం ఉన్నా వాడికి చదువంటే ఇష్టం లేదు. ధీరజ్ ఎలాగోలా పదవతరగతి అత్తెసరుమార్కులతో పాసయ్యాడు. ఇంక ధీరజ్ కి చదువబ్డదని శరభయ్య అతని చేత కిరాణా కొట్టును పెట్టించాడు. కిరాణా వ్యాపారంలో కొంత డబ్బుని సంపాదించాక దూరపు బంధువుల పిల్లతో ధీరజ్ కి వివాహం జరిపించాడు శరభయ్య.


ధీరజ్, గోపాల్ ఇంచుమించు సమ వయస్కులే. చదువంటే ప్రాణంగా ఉన్న గోపాల్ కష్టపడి చదివి మంచి మార్కులతో డిగ్రీ పాసయ్యాడు. బాంకు పరీక్షలకు ప్రిపేరవుతున్న దశలో శరభయ్య గుండె జబ్బుతో చనిపోయాడు. జరిగిన దారుణానికి విలవిలలాడాడు గోపాల్. జరగవలసిన కార్యక్రమాలను తనే దగ్గరుండి ధీరజ్ చేత జరిపించాడు గోపాల్. కొన్నాళ్లకు బాంకుపరీక్షలు వ్రాసిన గోపాల్ కి బాంకులో ఉద్యోగం వచ్చింది. అతని ఆనందానికి అవధులు లేవు.


పట్నంలో చక్కగా ఉద్యోగం చేసుకుటూ బాంకులో మంచి పేరు సంపాదించుకున్నాడు గోపాల్. రెండు సం… తర్వాత తెలిసిన వాళ్ల ద్వారా సుగుణా వాళ్ల సంబంధం వచ్చింది. పెళ్లి చూపులనేర్పాటుచేశారు రామయ్య గారు. గోపాల్ స్ధితిగతులు, అతని వినయవిధేయతలు వాళ్లకు బాగా నచ్చింది. సుగుణ చదువు, చక్కదనం, వాళ్ల ఇంటి మర్యాద, మంచితనం గోపాల్ కు బాగా నచ్చింది. సుగుణకు కూడా గోపాల్ బాగా నచ్చడంతో పెళ్లికి ముహూర్తం పెట్టారు రామయ్య దంపతులు.


తనకున్నంతలో అత్యంత వైభవంగా సుగుణ పెళ్లి గోపాల్ తో జరిపించారు రామయ్య దంపతులు. ఆ ఊరిలో రామయ్యకు పలుకుబడి బాగా ఉన్నందున ఊరంతా కలిసికట్టుగా నిలబడి ఆయన చెప్పిన పెళ్లి పనులన్నీ పూర్తిచేశారు. గోపాల్ తరపున పెద్దగా బంధువులు లేనందున ధీరజ్ దంపతులు, బాంకు సిబ్బంది, స్నేహితులు వచ్చారు. సుగుణ, గోపాల్ లు మూడునిద్దర్లను పూర్తి చేసుకుని రామయ్య దంపతులకు నమస్కారం చేసి పట్నంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని క్రొత్త కాపురం పెట్టారు. గోపాల్ వద్దన్నా వినకుండా ఇంటికి కావలసిన వస్తువులను కాపురం సారెగా కూతురికి ఇచ్చారు రామయ్య గారు. మూడుపువ్వులు- ఆరు కాయలుగా సాగుతున్న వాళ్ల కాపురాన్ని చూసి సంతోషంగా ఉంటున్నారు రామయ్య దంపతులు. ఏదో అలికడైతే తృళ్లిపడి గతస్మృతులనుంచి తేరుకుని త్వరలో అమ్మావాళ్లను, ఆ ఊరిని చూసిరావాలనుకుని నెమ్మదిగా వంటగదిలోకి వెళ్లింది సుగుణ.

కాలం హాయిగా గడిచిపోతోంది. గోపాల్, సుగుణలు అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ల ప్రేమకు గుర్తుగా సుగుణ గర్భవతి అయింది. గోపాల్ ఆనందం చెప్పనలవికాదు. సంతోషంగా అత్తారింటికి ఫోన్ చేసి చెప్పాడు గోపాల్. శుభవార్తను విన్న జానకమ్మ దంపతులు పరుగున వచ్చి కూతుర్ని చూసి నాలుగు రోజులు ఉండి ఆమెకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి వెళ్లారు. గోపాల్ సుగుణను జాగ్రత్తగా చూసుకుంటూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నాడు.


సుగుణకు ఏడవ నెల రాగానే జానకమ్మ కూతుర్ని తనింటికి తీసుకునిపోయి సీమంతం చాలా వేడుకగా జరిపింది. గోపాల్ రెండు రోజులు అత్తవారింట్లో మర్యాదలను పొంది భార్యని తనింటికి తీసుకు వచ్చాడు. ఆ ఊరిలో వైద్యసదుపాయాలు లేనందున సుగుణకు పురుడు తనింట్లోనే పోయమని కోరాడు గోపాల్. అందుకు జానకమ్మ దంపతులు అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత జానకమ్మ వచ్చి సుగుణకు సపర్యలు చేస్తూ ఉంటోంది. కాలం సాఫీగా సాగుతోంది. నెలలు నిండి సుఖప్రసవం జరిగి పండంటి మగబిడ్డను కన్నది సుగుణ. గోపాల్ సంతోషంగా ఆఫీసు వాళ్లకు పార్టీ ఇచ్చాడు. మనవడు పుట్టిన వార్త విని రామయ్యగారు పరుగున వచ్చి సంతోషంగా ఆ పసిబిడ్డని చేతుల్లోకి తీసుకున్నాడు.


రామయ్య దంపతులు కూతురిని, అల్లుడిని, మనవడిని తమింటికి తీసుకునిపోయి ఇరవై ఒకటవరోజున బారసాల కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు. వాడికి "కిరణ్" అని పేరు పెట్టారు గోపాల్ దంపతులు. గ్రామస్థులందరూ కిరణ్ ని ముద్దాడి మనసారా ఆశీర్వదించారు. ఆఊరి శివాలయంలో మనవడిపేరున పూజలు జరిపించారు రామయ్యగారు. ఉద్యోగ పనులనిమిత్తం ఆఫీసులో శెలవులు లేనందున మామగారింట సుగుణను, కిరణ్ ని వదల్లేక వదిలి తనింటికి వచ్చాడు గోపాల్.

కిరణ్ చక్కగా పెరుగుతూ మూడునెలల పసివాడయ్యాడు. మరికొన్ని రోజులకు దసరా పండుగ వచ్చింది. తనే దేవాలయం ట్రస్టీ అయినందున ఎప్పటిలాగే ఆఊరి శివాలయంలో గ్రామస్థుల సహకారంతో భ్రమరాంబా సమేత శ్రీసోమేశ్వర స్వామి వారికి దసరా ఉత్సవాలను చాలా ఘనంగా జరిపించారు రామయ్య గారు. నవరాత్రులలో అమ్మవారికి రోజుకొక అవతారం వేయించి, భక్తిశ్రధ్ధలతో కుంకుమ పూజలు చేయించి భక్తులకు పానకం, ప్రసాద వితరణ చేశారు రామయ్య గారు. విజయదశమి రోజున అత్తారింటికి గోపాల్ వచ్చాడు. భార్యాబిడ్డలను చూసి సంతోషించాడు. శమీపూజ, పారువేట, అమ్మవారిని, అయ్యవారిని ఊరేగింపు కార్యక్రమాలతో దసరా నవరాత్రులు ఇట్టే గడిచాయి.

పండుగ వేడుకలు అయిపోగానే సుగుణను, కిరణ్ ని తీసుకుని తనింటికి వచ్చాడు గోపాల్. నెలలు గడుస్తున్నాయి. కిరణ్ అల్లారుముద్దుగా పెరుగుతూ తన ముద్దు ముద్దు మాటలతో, ఆటపాటలతో అలరిస్తున్నాడు. వీలు కుదిరినప్పుడల్లా రామయ్య దంపతులు వచ్చి మనవడితో ఉల్లాసంగా గడిపిపోతున్నారు. గోపాల్ సుగుణ తల్లితండ్రులను తమతో పాటే ఉండమని కోరగా వాళ్లు ఆ ఇంటిని, పుట్టి పెరిగిన ఆ ఊరిని వదిలి రామని మొండి పట్టు పట్టారు. చేసేది లేక మిన్నకున్నారు సుగుణ, గోపాల్ లు.

రామయ్య దంపతులని, ఆఫీసు సిబ్బందిని, స్నేహితులని పిలిచి కిరణ్ కు మొదటి పుట్టినరోజు వేడుకల్ని చాలా ఘనంగా చేశారు గోపాల్ దంపతులు. నాలుగు రోజులు ఉండి వాళ్ల ఊరెళ్లారు జానకమ్మా వాళ్లు. వారాంతంలో కిరణ్ ని, సుగుణని బయటికి తీసుకు వెళుతూ సంతోషంగా ఉంటున్నాడు గోపాల్.


కిరణ్ కి మూడవసం… రాగానే అక్షరాభ్యాసం చేసి దగ్గరలో ఉన్న బడిలో వేశారు సుగుణా వాళ్లు. కిరణ్ రోజూ బడికి వెళ్లి వస్తున్నాడు. స్వతహాగా చురుకుదనం, తెలివితేటలు కలిగిన కిరణ్ చక్కగా చదువుకుంటున్నాడు. శెలవులప్పుడు తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మా, తాతల వద్దకు వెళ్లి వస్తున్నాడు కిరణ్.

కాలం ఎల్లవేళలా ఒకటిగా ఉండదు కదా! ఒకరోజున కార్డియాక్ అరెస్టుతో హఠాత్తుగా నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు రామయ్యగారు. జరిగినది తెలుసుకుని హడావుడిగా సుగుణా వాళ్లు వెళ్లారు. వాళ్లు ఆ ఇంటిముందుకు వెళ్లేటప్పటికి 'ఊరు ఊరంతా తరలి వచ్చిందా'! అన్నట్లుగా జనమంతా రామయ్యగారిని కడసారి చూసేందుకు కన్నీటి వదనాలతో బారులు తీరి నిలుచున్నారు. సుగుణా వాళ్లను చూడగానే వాళ్ల కనులు మరింతగా వర్షించాయి. సుగుణ పరిస్థితి వర్ణించనలవి కానిది. దుఃఖిస్తూ వారినందరినీ దాటుకుని లోపలికి వెళ్లి తండ్రి పార్ధివ దేహాన్ని చూసి బావురుమంది సుగుణ. ఆమెనోదార్చడం ఎవరితరమూ కావట్లేదు. గోపాల్ కూడా బాధపడుతూ భార్యని ఓదారుస్తున్నాడు. జానకమ్మ పరిస్థితి చాలా దారుణం. ఊహించని ఈ ఆపదకి ఆవిడ దుఃఖిస్తూనే ఉంది. జరిగింది ఏమిటో తెలియని చిన్నారి కిరణ్ "తాతా! కళ్లు తెరు. నిద్ర లే! నన్ను ఎత్తుకొని ఆడించవా!" అంటూ తన చిట్టి చిట్టి చేతులతో ఆయన ముఖాన్ని తడుతూ లేపుతుంటే అక్కడున్న వారందరి హృదయాలు భారమయ్యాయి. కాసేపటికి సుగుణ తనని తాను నిబ్బరించుకుని తల్లిని ఓదార్చింది. తరువాత జరుగవలసిన కార్యక్రమాన్ని యధావిధిగా జరిపించాడు గోపాల్. అందరూ రామయ్య గారి కీర్తిప్రతిష్టలను, ఆయన మంచితననాన్ని, సేవా దృక్పధాన్ని వేనోళ్ల మెచ్చుకుంటూ తమ తమ ఇళ్లకు వెళ్లారు. బాంకులో పదిరోజులు శెలవు పొడిగించుకుని అక్కడే ఉండి అత్తగారికీ, భార్యకు ధైర్యం చెప్పాడు గోపాల్.


అక్కడ ఒంటరిగా ఉండవద్దని తమతో పాటు వచ్చి ఉండమని జానకమ్మని కోరగా ఆవిడ అంగీకరించలేదు. తను కూడా ఇక్కడే ఈ మట్టిలోనే కలిసిపోవాలని చెప్పింది. సుగుణ బలవంతంగా ఆవిడని ఒప్పించి తనింటికి తీసికెళ్లింది. రోజూ మనవడిని చూసైనా బాధనుంచి ఆవిడ త్వరగా బయటపడుతుందని సుగుణ ఆశ.

'కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుంది' అన్నట్లుగా సుగుణ సపర్యలు‌, ఓదార్పుతో రెండునెలల తర్వాత జానకమ్మ మామూలు మనిషయింది.


కొన్నినెలల తర్వాత సుగుణ, గోపాల్ లు జానకమ్మని, కిరణ్ ని తీసుకుని వెంకటాపురం వెళ్లారు. అక్కడ కొన్నాళ్లు ఉండి ఆ ఊరివాళ్ల ద్వారా రామయ్యగారి పొలాన్ని అమ్మించారు. వచ్చిన డబ్బుతో ఆ ఇంటిని అనాధాశ్రమంగా కొన్ని ఆధునిక మార్పులు, వసతులు ఏర్పాటు చేసి దానికి " రామయ్య అనాధాశ్రమం" అని నామకరణం చేసి కొంతమంది అనాధలకి ఆశ్రయమిచ్చారు. ఇంకా ఎవరొచ్చినా చేర్చుకోమని చెప్పి, దాని బాధ్యతలను ఆ ఊరిలో నమ్మకమైన వ్యక్తికి అప్పగించారు గోపాల్ దంపతులు. "ఏ సాయం కావలసి వచ్చినా తమని నిస్సందేహంగా అడగవచ్చు" అని ఆ ఊరి ప్రజలకు హామీ ఇచ్చి తన ఇంటి అడ్రసు, ఫోన్ నెంబర్లు వాళ్లకందించింది సుగుణ. "తండ్రికి తగిన తనయ. నూరేళ్లు చల్లగా ఉండాలి" అని సుగుణను ఆ ఊరి ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వీడ్కోలు పలికారు. తండ్రిని, తన ఊరిని, ఆ తీపి జ్ఞాపకాలను పదేపదే గుర్తుచేసుకుంటూ తల్లితో, భర్తతో, కొడుకుతో వెనుతిరిగి తన ఇంటికి వచ్చింది సుగుణ.


'ఊరివారందరి ఆదరణా, ఆప్యాయతలే తనకు అన్నిటి కన్నా మిన్న' అని ఎప్పుడూ భావిస్తూ ఉంటుంది సుగుణ. ఇంతటి కీర్తిప్రతిష్టలను సంపాదించిన తన తండ్రిని నిత్యం స్మరిస్తూ మనసులోనే ఆయనకు నమస్కరిస్తుంది సుగుణ. భర్తనే దైవంగా భావించిన జానకమ్మ అనుక్షణం భర్త తలపులతో కాలం గడుపుతోంది. తన శేషజీవితం కూతురివద్ద హాయిగా, ప్రశాంతంగా గడవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది జానకమ్మ.


……సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


POdcast Link:

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
71 views0 comments

댓글


bottom of page