top of page

తప్పు ఎవరిది శిక్ష ఎవరికి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Thappu Evaridi Siksha Evariki' New Telugu Story Written By Lakshmi Sarma B

రచన : B. లక్ష్మీ శర్మ (త్రిగుళ్ళ)


తప్పు చేసిన మనిషి కూడా శిక్ష తప్పించుకోవాలనుకుంటాడు.

మరి ఏ తప్పూ చేయని వాళ్ళు శిక్షను అనుభవించాల్సి వస్తే, వాళ్ళు పడే బాధను కళ్ళకు కట్టినట్లు చూపారు ప్రముఖ రచయిత్రి B లక్ష్మి శర్మ (త్రిగుళ్ళ) గారు.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభిద్దాం


రాధ, మాధవి స్వంత అక్కా చెల్లెళ్ళు. ఇద్దరూ కవలలు. రాధ వాళ్ళు మరీ ఉన్న కుటుంబం కాదు. అలాగని ఏమి లేని వాళ్ళుకాదు. మధ్య తరగతి కుటుంబం. ఇద్దరూ ఆడపిల్లలే కావడంచేత డిగ్రీ వరకు మాత్రమే చదివించగలిగాడు రామనాథం.


రాధ డిగ్రీలో ఉండగానే తన తోటి విధ్యార్థి అయిన మురళిని ప్రేమించింది. మురళి వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు. తన కూతురును ఆ ఇంటికి ఇవ్వడానికి భయపడిపోయాడు. తమ తాహతుకు మించిన కుటుంబంలోని మురళిని, తన కూతురు ప్రేమించిందని తెలిసి నిలువెల్లా వణికిపోయాడు. మురళి తల్లి తండ్రులు మాత్రం రాధను చూసి చాలా సంతోషపడ్డారు. కుందనాల బొమ్మలాగా ఉందని కానీ కట్నంలేకుండా పెళ్ళికి ఒప్పుకున్నారు.


అనుకున్నట్టుగానే రాధ పెళ్ళి ఉన్నంతలో ఘనంగా జరిగిందనే చెప్పవచ్చు.

పెళ్లిలో మాధవి పట్టుపరికిణిలో చూడముచ్చటగా ఉంది.పెళ్లిలో ఆరిందలాగా గలగలానవ్వుతూ , అందరిలో తిరుగుతూ సందడి చేసింది. మురళి మరదలిని బాగా ఆట పట్టిచ్చాడు. బావగారు కదా ! మరదలితో సయ్యాటలాడుతున్నాడు అనుకున్నారు చూసినవాళ్ళు. అవసరం ఉన్నా లేకున్నా కావాలని మాధవిని తాకుతుండేవాడు మురళి.

“ఏయ్ మరదలు పిల్లా , నువ్వు మీ అక్కతోపాటు వచ్చేయ్యరాదు.. నిన్ను కూడా నేనే పెళ్ళి చేసుకుంటాను, ఎలాగు మీరిద్దరు కవలలే కదా! ఒకేచోట కలిసి ఉండొచ్చు ఏమంటావు,” అంటూ మరదలిని వేళాకోళంగా అన్నాడు మురళి.


“ అబ్బో … భలే ఆశపడుతున్నావు బావా, ఒక్క దెబ్బకు రెండుపిట్టలనుకున్నావా

ఏంటి? అయినా… రెండో పెళ్ళివాణ్ణి చేసుకోవలసిన అవసరం నాకేంటట,” అంది

మూతి మూడువంకరలు తిప్పుతూ.

“ ఏమిటి … నేనప్పుడే రెండో పెళ్ళివాణ్ణయిపోయానా! పెళ్ళి జరిగి ఇరువై నాలుగు

గంటలుకూడా కాలేదు, చూడు మరదలు పిల్లా నీకు నా అంత అందమైన

మొగడుదొరకడు, అందుకని గొడవలేకుండా నన్ను పెళ్ళిచేసుకో , మీ అక్క కంటే నిన్నే మహారాణిలా చూసుకుంటాను,” అన్నాడు రాధ వైపు చూస్తూ.

“ మరింకేం , మాధవి నువ్వు వెళ్ళు మీ బావతో నేనెందుకు రావడం, నేను ఇక్కడే

ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ నాన్న వాళ్ళతో ఉంటాను,” అంది రాధ నవ్వుతూ.

“రాధా … ఏమిటామాటలు శుభమాని పెళ్ళిచేసుకుని, సమయం సందర్భం

ఉండక్కరలేదా? మాధవి.. నువ్వు లోపలకెళ్ళు,” మందలించాడు రామనాథం. ఆయనకెందుకో మురళి మాటలువింటుంటే మనసులో ఆందోళనగా అనిపించింది. అందరు గమ్మున ఉండిపోయారు.


రాధను అత్తవారింటికి తీసకవెళ్ళిపోయారు. ఒక్కర్తే అయిపోయింది. ఏమి

తోచడంలేదు. అందుకని (ఎమ్, ఏ) లో అప్లయ్ చేసింది. సీటు రావడంతో మళ్ళి

తన వ్యాపకం లో మునిగిపోయింది. రాధ వెళ్ళినప్పటినుండి రానేలేదు. రాధకు

నెలజరిగిందని శ్రీమంతం అక్కడే చెయ్యాలంటే సరేనని, కావలసినవన్నీ తీసుకొని వెళ్ళారు. మాధవిని తీసకవెళ్ళడం ఇష్టంలేక వద్దన్నాడు రామనాథం. సరేనని ఊరుకుంది మాధవి.

మాధవిని తీసుకరాలేదని రాధ బాధపడింది. మురళికి కోపం వచ్చింది మాధవి రాలేదని. దానికి సెలవులు దొరకలేదని అబద్ధం చెప్పాడు రామనాథం. వచ్చేముందు రాధను తీసుకవెళదామని అడిగింది జయంతి భర్తను. సరేనని అల్లుడిని అడిగాడు.


“ బాబు … మురళి, రాధ పెళ్ళి అయినప్పటినుండి ఒక్కసారి కూడా పుట్టినింటికి

రాలేదు, ఇప్పుడు కడుపుతో ఉన్న పిల్ల కదా ! నాలుగురోజులు తీసుకవెళతాము,” అడిగాడు .

“ రాధ ఇష్టం మామయ్య , తను వస్తానంటే తీసుకవెళ్ళండి, ఎక్కువరోజులు మాత్రం ఉంచుకోకండి నాకిక్కడ తోచదు తనులేకపోతే,” అన్నాడు మురళి.

“అలాగే బాబు,” అంటూ “ అమ్మా రాధ… నిన్ను మాతోబాటుగా నాలుగురోజులు

తీసుకవెళుతున్నాము, అల్లుడిగారిని అడిగాను, సరే అన్నారు బట్టలవి సర్దుకో

వెళదాము” అన్నాడు కూతురితో .

“ అయ్యో… నేను వస్తే ఆయనొక్కరే ఎలా ఉంటారు నాన్నా, పాపం ఆయనకు

వండుకుని తినాలంటే ఇబ్బంది కదా! పోనీ ! మీరే నాలుగురోజులు ఉండిపొండి

కలిసున్నట్టుంటుంది,” అంది రాధ తండ్రితో.


“ అదేంటే పెళ్ళికాగానే ఇంత మారిపోయావు, కనీసం పుట్టినింటికి రావాలి

అనిపించడం లేదు, తోడపుట్టిన చెల్లికోసమైనా రావాలి అనిపించడం లేదా?,” అంది

నిష్టూరంగా జయంతి.


“ అమ్మా దానికుందేమిటి? అక్క కడుపుతో ఉంది.. శ్రీమంతం చేసుకుంటుంది, పాపం తనకు తోడుగా ఉండి తయారుచెయ్యడం అవన్నీ చూసుకోవాలి అని నాకోసం వచ్చిందా అది,” అంది మాధవి మీద కోపంతో.


“ రాధ … ఇప్పుడవన్నీ ఎందుకమ్మా, మీ నాన్న చెప్పారు కదా ! తనకు సెలవులు

దొరకలేదని. అర్ధం చేసుకో , వాళ్ళ మనసు బాధపెట్టకమ్మా, నువ్వు వాళ్ళతో వెళ్ళి నాలుగురోజులు ఉండిరా, నువ్వువచ్చేవరకు నేను, మీ మామయ్య ఇక్కడే ఉంటాము,” అంది రాధ వాళ్ళ అత్తగారు.

పుట్టినింటిలో రాధ , మాధవి ఉన్న నాలుగురోజులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మురళి మంచివాడని, తనను బాగా చూసుకుంటున్నాడని చెప్పింది. రామనాథంకు, జయంతి కి మనసులు ప్రశాంతమైనాయి . కూతురు అదృష్టానికి మురిసిపోయారు. నాలుగోరోజు వెళతానంటే రామనాథం దగ్గరుండి తీసుకెళ్లి దిగబెట్టి వచ్చాడు.


రోజులు గడుస్తున్నాయి రాధకు తొమ్మిదోనెల మొదలైంది. ఒంట్లో ఓపికలేదని మాధవిని కొన్ని రోజులు పంపమని, డెలివరీ వరకు తనకు తోడుగా ఉంటుందని ఉత్తరం రాసింది బ్రతిమాలుతున్నట్టుగా.


రామనాథం, జయంతికి ఏం చెయ్యాలో తోచడం లేదు. మాధవిని పంపించాలంటే మనసొప్పుకోవడం లేదు రామనాథంకు. పోని తల్లి జయంతిని పంపిద్దామంటే ఆమెకు పెద్దగా బయటకు వెళ్ళి రావడం ఇవన్నీ తెలియవు. ఎంత ఆలోచించినా మాధవిని పంపక తప్పలేదు రామనాథంకు. జాగ్రత్తలన్నీ చెప్పి పెద్దకూతురింట్లో దిగబెట్టివచ్చాడు చిన్న కూతురును. ఆయనకు దినదిన గండంగా ఉంది మాధవి అక్కడ ఉండడం. భగవంతుని మీద భారంవేసాడు.

“మాధవి … ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి,” అంటూ ఆనందంతో మాధవిని గట్టిగా కౌగిలించుకుంది రాధ.


“ పోవే … నీకు నేను గుర్తున్నానా అసలు బావగారి మోజులో పడిపోయి, కనీసం ఒక చెల్లెలుంది, దానికి ఒక ఉత్తరం ముక్క రాద్దాము అని అనుకున్నావా ఎప్పుడైనా,” అంది బుంగమూతి పెడుతూ .


” అదిగో మధ్యలో నేనేం చేశాను, మీ అక్కను నేనేమన్నా వద్దని చెప్పానా ఏంటి? నేను ఆఫీసుకు వెళ్ళాక ఖాళీగానే ఉంటుంది కదా! అప్పుడైనా ఒక ఉత్తరం ముక్క రాస్తే నీ సొమ్మేమి పోయేదా చెప్పు, అబ్బే… ఎప్పుడు చూసినా జో జో పోవడమే మీ అక్కపని,” అంటూ రాధమీద పిర్యాదు చేసాడు మురళి.


సరదాగా గడిచిపోతున్నాయి రోజులు రాధకు. మాధవి దగ్గరుండి అన్నిపనులు చేస్తూ వేళకు అన్ని అమర్చిపెడుతుంది. ఇప్పుడు సుఖంగా ఉంది రాధకు. నున్నగా నునుపుతేలింది నెలల నిండడం వలన. మాధవి కమ్మగా పుల్లగా చేసిపెడుతుండడ వలన బాగానే లావయింది రాధ.

కానీ! మాధవి పరిస్థితి బాగాలేదు. మురళిని చూస్తుంటే, ఆకలిమీదున్న పెద్దపులిలా

మింగేసేలా చుస్తుంటాడు. ఆచూపులను తప్పించుకుని తిరుగుతుంది. ఒంటరిగా

కనిపిస్తే చాలు కావాలని చేతులు వెయ్యడం, ఏదో సరసం మాటలు అనడం భరించుకోలేకపోతుంది మాధవి.

రాధ ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా,ఈ పంజరంలో నుండి ఎప్పుడు

బయటపడదామా అని ఆలోచిస్తుంది, తోడేలులాంటి బావను తప్పించుకోవడం

కష్టంగా ఉంది.అలాగని రాధను చూస్తూ చూస్తూ వదిలి వెళ్ళలేకపోతుంది. ఎలాగైతేనేం రాధ డెలివరీ అయింది ఆపరేషన్ చేసారు. రాధ తల్లి జయంతి వచ్చింది. రాధ చాలాసార్లు చెప్పింది మురళికి వాళ్ళమ్మగారిని తీసుకరండి అని. కానీ పట్టించుకోలేదు పైగా ఇప్పటినుండి వచ్చి ఏం చేస్తారు బారసాల వరకు రమ్మంటే సరిపోతుంది అన్నాడు తేలికగా.

మాధవికి బోనుపడిన ఎలుకలాగా అయింది పరిస్థితి. ఇంట్లో ఎవరు ఉండరు బావను చూస్తుంటే ఆకలిమీదున్న ఆంబోతులాగా సమయం కోసం కాచుకున్నట్టుగా ఉన్నాడు.

దేవుడా ! నాకు నువ్వే దిక్కు అంటూ పదేపదే మనసులో వేడుకుంటుంది. ఉదయమే వంటచేస్తే మురళి హాస్పిటల్ కు వెళ్ళి టిఫిన్ భోజనం ఇచ్చి రాత్రివరకు ఇంటికి వచ్చాడు.

ఇంటికి వస్తూనే తలుపుకొట్టడంతో వెళ్ళి తలుపుతీసింది మాధవి. గుప్పున వాసన రావడంతో భయపడుతూనే అడిగింది.


“ బావ మీరు త్రాగి వచ్చారా? మీకు ఈ అలవాటు కూడా ఉందా,” అడుగుతూ వాసన భరించుకోలేనట్టుగా ముక్కుమూసుకుంది.


“ ఏం చెయ్యమంటావు మధు, నీ కోసం త్రాగక తప్పలేదు నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంటే, ఎలా ఆపుకోవాలో నాకు తెలియడంలేదు, మాధవి ఫ్లీజ్ నన్నర్ధం చేసుకో నీ కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా? నన్ను కాదనకు.. రా మాధవి,” అంటూ ముద్ద ముద్దగా మాట్లాడుతూ గట్టిగా దగ్గరకు లాక్కున్నాడు మురళి.


“ బావా నన్నేం చెయ్యకండి, మీకు నాకంటే అందమైన భార్య మా అక్క ఉంది, నా

జీవితం నాశనం చెయ్యకండి,” అంటూ అతనితో పెనుగులాడసాగింది.


“ మాధవి! మీ అక్క ఉన్నా నువ్వు కూడా నాకు కావాలి, మీ అక్కను కంటే నిన్ను

పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, నువ్వు మీ అక్క కలిసి ఉంటారు, మాధవి నన్ను కాదనకు రా,” అంటూ బలవంతంగా బెడ్ రూంలోకి తీసుకవెళ్ళాడు. మగాడు, అందులో త్రాగివచ్చిన పశుబలం ముందు మాధవి బలం ఓడిపోయింది. తనివితీరా అనుభవించాక వదిలేశాడు. కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది మాధవి. మాధవిని దగ్గరకు తీసుకుని ప్రేమగా బుజ్జగించడం మొదలుపెట్టాడు.


“ మాధవి నీకు అన్యాయం చెయ్యను పుట్టిన నా బాబు మీద ఒట్టేసి చెబుతున్నాను, నాకు రాధ , నువ్వు ఇద్దరు సమానమే, నిన్ను చూసినప్పటినుండి నువ్వు నాకే స్వంతం కావాలని కోరుకున్నాను, మీ అక్కను మనస్పూర్థిగా ప్రేమించాను, కానీ! నిన్ను చూసిన తరువాత నువ్వుకూడా నాకే కావాలనిపించింది, ఇన్నాళ్ళు ఓపికతో ఉన్నాను నేను చేస్తుంది తప్పేమోనని ఆలోచించాను నావల్ల కాలేదు, మీరిద్దరు కవలలే కదా ! ఒకే దగ్గర ఉంటూ ఒకే భర్తను పంచుకుంటే తప్పేమిటని నాకు అనిపించింది, అందుకే ఇక ఆగలేకపోయాను… నువ్వు బాధపడి నలుగురిలో అల్లరి చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు, మనందరం కలిసే ఉందాము,” అంటూ కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చాడు మురళి.

వెక్కి వెక్కి ఏడుస్తూ అలా ఎంతోసేపు ఆలోచించింది మాధవి. ఎలాగు జీవితం

నాశనమైంది. ఇప్పుడు బావ చెప్పినట్టు నలుగురిలో రసాభాస చేసుకుని నా జీవితాన్ని నేనే కుక్కలు చింపిన విస్తరిలా చేసుకునే బదులు. బావ చెప్పినట్టు అక్కతోపాటుగా కలిసి ఉంటే సరిపోతుంది. అక్క నన్ను ఎంతగా తిట్టపోస్తుందో తన జీవితంలోకి వచ్చానని. పైగా నేను గనుక బావను పెళ్ళిచేసుకకపోతే నలుగురిలో ఈ విషయం తెలిస్తే నాన్న తట్టుకోలేరు, కచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటారు, పరువుకోసం ప్రాణాలిచ్చే మనిషి ఆయన.కూతురి జీవితంనవ్వులపాలయిందని, ఇక ఎప్పటికి దానికి పెళ్ళిచెయ్యలేనన్న విషయం ఆయన జీర్ణించుకోలేడు. అందుకే నేనే నా నిర్ణయం తీసుకోవాలి. ఎలాగు బావ పుట్టిన పసికందుమీద ఒట్టుపెట్టుకున్నాడు కదా! నాకు అన్యాయం చెయ్యనని. మనసు దిటవుచేసుకుని మురళికి తన మనసులోని మాటను తెలియచేసింది. ఆత్రుతగా అక్కునచేర్చుకున్నాడు మురళి. గువ్వలా ఒదిగిపోయింది మాధవి.


రాధను బాబును హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకవచ్చారు.

“ రాధ పచ్చిబాలింతరాలు మన విషయం ఇప్పుడే తెలియనివ్వద్దు,” అన్నాడు.

“ అవును బావా … అక్కకు మన విషయం తెలిస్తే తట్టుకోలేదు, నెమ్మదిగా చెబుదాము కొన్నాళ్ళు అయ్యాక మనమే చెబుదాము,” అంది. రాధ అత్తమామలు వచ్చారు. రాధ వాళ్ళ కూడా వచ్చారు బారసాలకు. ఘనంగా చేసారు బారసాల. అందరు వెళ్ళిపోయారు

మాధవిని కూడా రమ్మనమంటే, కొన్ని రోజులుండని అని మాధవిని బలవంతంగా

ఆపింది రాధ.


ఏమనలేక దమయంతిని తీసుకుని వెళ్ళాడు రామనాథం. మాధవికి మురళిని విడిచి వెళ్ళాలని లేదు. నాన్నా ఏమంటారోనని భయపడింది. రాధ వుండుమనేసరికి ఊపిరి తీసుకున్నట్టయింది. మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది రాధకు.


“ బావా … బాబుకు మూడునెల వచ్చింది, నన్ను మా నాన్న రమ్మనమని ఉత్తరం

రాసారు,

ఇన్నాళ్ళు అక్క కంటపడకుండా జాగ్రత్తగా ఉన్నాము, ఇప్పుడన్నా అక్కకు చెపితే నేను ఇక్కడే ఉండిపోతాను కదా! మిమ్మల్ని విడిచి నేనుండలేను,” అంది. మురళి గుండెలమీద తన వేళ్ళతో రుద్దుతూ.

“ పిచ్చి మాధవి, నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా చెప్పు? నిన్ను చూసిన

క్షణం నుండి ఇప్పటి వరకు నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్నే తలుచుకున్నాను,

అలాంటి నిన్ను ఇప్పుడు నాదానివైన నిన్ను విడిచి ఎలా ఉంటాననుకున్నావు?

కొన్నాళ్ళు ఓపికపట్టు నేనే ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తా, నువ్వు మాత్రం తొందరపడి మన విషయం ఎవ్వరికి తెలియనివ్వకు సరేనా ,” అంటూ కౌగిలిలో బంధించి ఉక్కిరిబిక్కిరి చేసాడు. ఎప్పుడడిగిన ఏదో ఒక సమాధానం చెప్పి దాటవెయ్యసాగాడు. రాధకు మాధవి మీద అనుమానం రాసాగింది. ఎప్పుడు చూసిన మాధవి మురళి ఏవేవో సైగలు చేసుకోవడం రాధ కళ్ళల్లో పడింది. అడుగుదామని అనుకుంది నిజం తెలియకుండా అడిగితే చెల్లెలు బాధపడుతుందేమోనని ఊరుకుంది.

ఒకరోజు హాడావుడిగా వచ్చాడు మురళి వస్తూనే, “ రాధ… రాధ త్వరగా తయారవు. మనం సినిమాకు వెళ్దాం టికెట్స్ తెచ్చాను,” తొందరచేసాడు .


“ అదేమిటండీ … ఇంత కంగారుగా చెపితే ఎలాగండి? అయినా చిన్నపిల్లాడితో

సినిమా అంటే కష్టమవుతుందేమో! నేను రాలేనండి,” అంది రాధ.


“ ఏంకాదులే ఎన్నాళ్ళైంది మనం బయటకు వెళ్ళి, అంతగా కావాలంటే మాధవి

చూసుకుంటుందిలే బాబును మన వెళ్ళివద్దాం,” అన్నాడు మాధవివైపు చూస్తూ

కన్నుగీటాడు. మాధవికి అర్థమై నవ్వుకుంది మురళి వేసిన ఎత్తుగడకు.

“ ఛా … వద్దండి మాధవిని తీసుకెళ్ళకుండా మనం వెళితే ఏం బాగుంటుంది, వెళితే అందరం కలిసే వెళదాము,”అంది రాధ.

“ ఓసి పిచ్చిముఖమా… టికెట్స్ మనిద్దరికే తెచ్చాను, నువ్వు వస్తావారావా చెప్పు,”

అంటూ బుంగమూతి పెట్టి అలిగి కూర్చున్నాడు.

రాధకు ఏం చెయ్యాలో తోచలేదు. “ ఏమండి నేనొకమాట చెప్పనా? మీరు మాధవి వెళ్ళిరండి. నేనింట్లో ఉంటాను బాబుతో,” అంది భర్త కోపం తగ్గించాడానికన్నట్టుగా.

“ అదేం కుదరదు, నువ్వు లేకుండా మాధవితో ఎలా వెళతాను, పోనీలే ఏదో ఆశపడి టికెట్స్ తెచ్చా. చింపిపడేస్తే సరపోతుంది, నీకు నీ సంతోషమేగాని నాగురించి ఎందుకాలోచిస్తావు,” అంటూ జేబులోనుండి టికెట్స్ తీసి చింపబోయాడు.


“ అబ్బా మీకన్నీ తొందరే, మాధవి మీ బావ సినిమా టికెట్స్ తెచ్చారట, తొందరగా

తయరవు. వెళుదువుగాని,” అంటూ ” ఏమండి ఈసారికి మా చెల్లితో వెళ్ళండి,ఎవ్వరు ఏమి అనుకోరు,” అంది మురళి చేతిలోని టికెట్స్ తీసుకుంటూ.


గబగబా తయారయి వచ్చింది మాధవి. “ అబ్బా ఎన్నాళ్ళయిందో సినిమా చూసి, అక్కా! నువ్వు రావడంలేదా? ఇంకా తయారవలేదేంటి,” అడిగింది ఏమి తెలియనట్టుగా.

“ నువ్వెళ్ళిరా మాధవి, బాబుతోని కష్టం కదా! సినిమా మూడుగంటలు అయ్యేవరకు

పిల్లాడితో ఇబ్బందవుతుందని రానని చెప్పాను మీ బావతో. మీరు వెళ్ళిరండి,” అంది

అమాయకంగా.


సినిమా మొదలైంది. అందులో లీనమైపోయాడు మురళి. మాధవికి మాత్రం వింత

అనుభూతిగా ఉంది మురళితో సినిమాకు రావడం. మురళిచేతిని తనచేతిలోకి

తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ కూర్చుంది . ఇంటర్వెల్ సమయంలో మురళి కూల్ డ్రింకులు తెస్తానని వెళ్ళాడు. ఎంతసేపయినా మురళి రాకపోవడంతో కంగారుపడసాగింది మాధవి. మురళి సీటులో వేరొకతను వచ్చి కూర్చున్నాడు.

“ ఏమండి ఆ సీటు మావారిది, ఆయన బయటకు వెళ్లారు మీరు వేరే సీటులో కూర్చోండి,” అంది మొహమాటపడుతూ.


“ ఏమిటి … ఈ సీటు మీవారిదా? ఎక్కడున్నాడు మీవారు? ఎప్పుడో వెళ్ళిపోయాడు

నిన్ను నాకప్పగించి,” అంటూ భుజంమీద చెయ్యివేసాడు.పిచ్చిదానిలా చూసింది

అతనివైపు. చీకటిలో తెల్లటి పలువరస తప్పా ఏమి కనిపించడంలేదు ఆ మనిషిలో. చూడడానికి బలాడ్యుడిలా ఉన్నాడు భయంతో లేచి పరుగు పరుగున బయటకు వచ్చి పరుగెత్తసాగింది. అంతకన్నా వేగంగా వచ్చి ఒడిసిపట్టుకున్నాడు అతను. నల్లటి భీకరాకారం చూస్తేనే ఒళ్ళు జలదరించింది.


“ఎక్కడకు పోతావే నిన్ను మీ బావ అయిదలక్షల రూపాయలకు అమ్మివేసాడు,

ఇప్పుడు నువ్వు మాదానివి తెలుసా, నడువు మేమెక్కడకు తీసుకవెళితే అక్కడకు

రావాలి, మీ బావ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు,” అంటూ వెకిలి నవ్వులు నవ్వాడు.

మాధవికి అంతా అయోమయంగా అనిపించింది. ఒక్కసారిగా కళ్ళుతిరిగినట్టయింది. ఇప్పుడు తనను తాను కాపాడుకోవాలి అనుకుంటూ, ఒక్కసారిగా లేచి వాడి ముఖంమీద తన్నింది. దిబెల్మమని క్రిందపడిపోయాడు ఊహించని పరిమాణంతో. వాడికి అందకుండా పరుగు లంకించుకుంది మాధవి. సరాసరి ఇంటికి వచ్చింది. అప్పుడే వచ్చిన మురళి బట్టలు మార్చుకుంటున్నాడు. మురళి గల్లా పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించింది కసిదీరా.

“ ఏయ్ మాధవి … ఏమిటే మీ బావను పట్టుకుని అలా కొడుతున్నావు, ఏమైనా పిచ్చి పట్టిందా నీకు,” అంటూ గబగబా వచ్చి మాధవిని ఆపింది రాధ. జరిగిన విషయమంతా చెప్పింది మాధవి బోరునఏడుస్తూ. అంతావిన్నా రాధ ముఖం జేవురించింది. కోపంగా భర్తవైపు చూస్తూ

“ ఛీ ,ఛీ ఇంతనీచమైన మనుషులకోలేదు, నన్ను ప్రాణంగా ప్రేమించానని నన్ను మోసంచేసారు, మా చెల్లిని మోసం చేసావు,”అంటూ పళ్ళు పటపటా కొరికింది. మాధవి గబుక్కున వెళ్ళి కత్తి తీసుకవచ్చింది మురళిని పొడవడానికి.

అడ్డుపడింది రాధ.


“ మాధవి! నాభర్తను ఏంచెయ్యొద్దు, భర్త ఎటువంటివాడయైనా అతనితోనే నాజీవితం ముడిపడి ఉంది, నన్ను నాకొడుకును అనాథలను చెయ్యకు, ఆ పసివాడి ముఖంచూసి ఆయనను వదిలేయ్,” రెండుచేతులు జోడించి వేడుకుంది రాధ.


ఒక్కక్షణం నిరుత్తరురాలైంది మాధవి. తన స్వంత తోడబుట్టువు అయివుండి,

నేనేమైయి పోయినా పరవాలేదు, తన భర్తనే తనకు ముఖ్యం అనుకునే అక్కను

అసహ్యంతో చూసి కత్తి కింద పడేసింది.

“ ఓరేయ్ మురళి … బ్రతికిపోయావురా, తోడబుట్టిన దాని ముఖంచూసి నిన్ను వదిలిపెడుతున్నాను, లేకపోయింటే ఈపాటికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేసేదాన్ని, నువ్వింతకింత అనుభవిస్తావు, చూడు వదిలిపెడుతున్నాను కదా అని నన్ను తక్కువంచనా వెయ్యకు, మళ్ళి నాగురించి తెలుసుకునే ప్రయత్నం చేసావో నిన్ను చంపి నేను చస్తాను గుర్తుంచుకో, అక్కా… నీ మొగుడు సామాన్యుడు కాదు మగపిశాచి, డబ్బు కోసం ఏమైనా చెయ్యగలడు, ఈ రోజు నన్ను ఏమార్చినట్టు రేపు నిన్ను కూడా ఏమార్చగల నేర్పరి, జాగ్రత్తగా ఉండు. నీవు ముందే అమాయకురాలివి,”అంటూ బయలుదేరి సరాసరి తల్లితండ్రుల దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి తల్లి ఒడిలో తలపెట్టుకుని తనివితీరా ఏడిచించింది. అక్కున చేర్చుకుంటారని తన విషయమంతా విని తనకు ఓదార్పునిస్తారని తలచిన మాధవికి విషాదమే మిగిలింది తండ్రి రూపంలో.


మాధవి గురించి అంతావిన్న రామనాథం అగ్గిమీద గుగ్గిలమే అయ్యాడు. అంతా మాధవిదే తప్పన్నట్టుగా మాట్లాడాడు.

“ ఏయ్ దాన్నీ ముందు ఇంట్లోనుండి బయటకు గెంటివెయ్యి, ఇంతపాపానికి

ఒడిగట్టిన అది నాకళ్ళముందుంటే ఏం చేస్తానో నాకే తెలియదు, తోడబుట్టిన దాని జీవితాన్నే నరకం చేసిన నీకు ఈ ఇంట్లో స్థానంలేదు,” అంటూ మెడపట్టి బయటకు గెంటేసి తలుపులేసాడు.


“ నాన్నా … నేనే తప్పుచెయ్యలేదు, ఆ దుర్మర్గుడే నన్ను మోసంచేసాడు, నేను కావాలనే ఏతప్పుచెయ్యలేదు నన్ను నమ్మండి, మీకు ఈ విషయం తెలిస్తే పరువుకు విలువ ఇచ్చే మీరు తట్టుకోలేరని, గత్త్యంతరం లేక నాజీవితాన్ని మార్చుకున్నాను. ఇది మీకోసమే చేసాను, లేకపొయ్యింటే ఆరోజు బావను పోలీసులకు పట్టించి రభసచేసేదాన్ని, నన్ను నమ్మండి నాన్నా! నాకై నేను తప్పుచెయ్యలేదు,” అంటూ దీనాతిదీనంగా వేడుకుంది.


తలుపుదగ్గర కూర్చోని. వినవలసినవారు వినలేదు కానీ, ఇరుగుపొరుగు వాళ్ళందరు

వీళ్ళ గొడవకు బయటకు వచ్చి వినాల్సిందంతా విన్నారు. కడుపులో పెట్టుకుని

కాపాడవలసిన తల్లితండ్రులు రోడ్డుమీదకు విసిరేసారు. కుక్కలుచింపిన విస్తరి

అవుతుంది తన కూతురు జీవితం అని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే, గుట్టు

చప్పుడుకాకుండా తమ ఒడిలో ఒదిగిపొయ్యేది. పెద్ద కూతురి జీవితంలో నిప్పులు

పోసిందేకాక, దానికే సవతి అయికూర్చుందన్న ఆలోచననే తప్పా, చిన్న కూతురు

నడిబజారులో అంగడిబొమ్మ అవుతుందని ఆలోచించే మనస్తత్వం లేని కన్న

తల్లితండ్రులు. చుట్టూ మూగిన ఇరుగుపొరుగు మాధవిని చూసి నవ్వుకున్నారు.

కొందరు ముఖంమీదనే “ బరితెగించిన ఆడది” అన్నారు. “ఈమె ఇష్టంలేకుండానే

అలా జరుగుతుందాని” కొందరు. “ఛీ ఛీ ఏం బ్రతుకు ఎందులోనన్న పడి చావక, పాపం ఆ తల్లితండ్రులను ఎంతబాధకు గురిచేసిందో”, అని ఎవరి ఇష్టంవచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటుంటే, తట్టుకోలేని మాధవి చెవులుమూసుకుంది. ఒక తెగింపులాంటి ఆలోచన వచ్చింది. అవును తనెందుకు ఎవరికోసమని బ్రతకాలి? కన్న తల్లితండ్రులు అర్ధంచేసుకోలేనప్పుడు తను బ్రతికికూడా ప్రయోజనంలేదు. తను ఉండికూడా ఎవరిని ఉద్దరించేది లేనప్పుడు తనకు చావే శరణ్యం అనుకుంటూ, గబగబాలేచి పరుగెత్తింది బావిలో దూకడానికి.


కానీ! “మనమొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు” పరుగెడుతుంటే కళ్ళుతిరిగినట్టయింది కడుపులో ఏదో కదిలినట్టనిపించింది. అనుమానం వచ్చి కడుపును చూసుకుంది. లోపలున్న బాబు “ అమ్మా నన్ను కడుపులో ఉండగానే చంపుతావా ? నేనేం పాపం చేసాను? అమ్మా నన్ను చంపొద్దమ్మా … నీకు నేనున్నాను, నీ పగకు ప్రతీకారం తీర్చుకుంటాను, నీ జీవితం నాశనం చేసినవాళ్ళను ఊరికే వదలొద్దు వాళ్ళ అంతుచూడాలి,” అన్నట్టు బాబు ప్రతిజ్ఞ చేసినట్టనిపించి తన ప్రయత్నం విరమించుకుంది.


సంతోషంతో కడుపును నిమిరింది తల్లిప్రేమ ఉప్పొంగింది. అవును ఎవరోచేసిన తప్పుకు తనెందుకు తన జీవితాన్ని అంతంచేసుకోవాలి. తప్పుచేసినవాళ్ళు దర్జా ఉంటున్నప్పుడు నేనెందుకు పిరికిదానిలాగా భయపడాలి. తన కళ్ళతో లోకం చూడని చిన్నారిని చిదిమివెయ్యడానికి నేవెందుకు చెయ్యాలి. వాడిని పెంచి పెద్దచేసి వాళ్ళకు బుద్ధిచెప్పాలి. నన్ను నడిబజారులో నిలబెట్టిన ఆ పాపాత్ముణ్ణి ఇంతకింతకు అనుభవించాచేలా చెయ్యాలి. అందుకోసమైనా నేను బ్రతికుండాలి ఆడదాన్ని చులకనగా చూసే ఈ సమాజానికి గట్టిబుద్ధిచెప్పాలి అనుకుంది.


తను జీవించే ఉన్నట్టుగా ఎవరికి తెలియని చోటుకోసంవెదికింది చివరకు తనను

కంటిపాపలా చూసుకుంటానన్న ఒక స్వామిజీ తన శిష్యరాలిగా చేర్చుకున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి తన ప్రమేయంలేకుండానే, పండంటి బాబుకు జన్మ నిచ్చింది.

ఆ బాబుని స్వామి పాదాలచెంత పడుకోబెట్టి, “స్వామి! నా కొడుకును మీకు అప్పచెబుతున్నాను. వాణ్ణీ తీర్చిదిద్దండి, నా జీవితాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళను వదలకుండా… వాళ్ళకు బుద్ధి చెప్పేలా తయారుచేయండి,” అంటూ వేడుకుంది మాధవి.

“ చూడమ్మా … రాగద్వేషాలతో రగిలిపోతూ ఉంటే, జీవితంలో ఏమి సాధించలేము,

మనిషిని మనిషి చంపుకుంటూపోతే మనిషన్నవాడే మిగలడు, పగతో సాధించలేని పనులను సామరస్యంతో సాధించుకోవాలి, నీ కొడుకును గొప్ప ప్రయోజకుడు అయ్యేలా చేస్తాను, వాడిని చూసి నిన్ను నీ జీవితాన్ని నాశనంచేసినా వాళ్ళు తలదించుకునేలా చేస్తాను, నువ్వు పదిమందిలో గర్వంగా తలెత్తుకునేలా నిన్ను నిలబెడతాను, కానీ ! నువ్వు చాలా ఓర్పుగా ఉంటూ, నీ ఉనికిని ఎవ్వరికి తెలియనియ్యకుండా చూసుకో, నీకేం భయంలేదు నిన్ను కాపాడే బాధ్యత నాది సరేనా,” అన్నాడు స్వామి ఆప్యాయంగా.


“ సరే స్వామి , మీరు చెప్పినట్టుగా నడుచుకుంటాను,” అంది చేతులుజోడిస్తూ.

అబల అయిన మాధవి తన జీవితాన్ని నాశనంచేసిన ఆ దుర్మర్గుడిని ఏనాటికైనా తన కొడుకు బుద్ధిచెప్పగలడా, తనమీద పడిన మచ్చను తుడిచి తన తప్పులేదు అని నిరూపించగలడా? ఇదంతా జరిగేపనేనా? మాధవికాక ఇంకో ఆడది ఆ పరిస్థితిలో ఉంటే మురళిని అక్కడికక్కడే హతమార్చేదేమో! మురళి బ్రతికిపోయాడు తన అక్క భర్తకాబట్టి. తోబుట్టువు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టింది. ఇందులో తప్పు ఎవరిది శిక్ష ఎవరికి అన్నట్టు, తప్పుచేసిన వాళ్ళు దర్జాగా ఉంటే. ఏ తప్పు చెయ్యని నాకు శిక్ష అనుకుంటూ మౌనంగా రోజులు వెళ్ళదీయసాగింది.

॥॥ శుభం॥॥

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్


246 views4 comments

4 Comments


Venkatesh Etukapally • 22 hours ago

👏👏

Like

Metramsharma Bondugula

చాలా బాగుంది కథ’ చదువుతున్న వైనం బాగుంది, నేటి సమాజం జరుగుతున్న అన్యాయాలను కళ్ళకు కట్టినట్టుగా రాసారు.

Like

Shri Veda Peetham • 4 hours ago

Super

Like

sunanda vurimalla • 7 hours ago

చాలా చాలా బాగుంది మేడం 💐

Like
bottom of page