top of page

తరగని నిధి


'Tharagani Nidhi' New Telugu Story



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"ఈశాన్యం వైపు పొడిచింది. నాలుగు వందల ఎనభై గజాలు... అద్భుతమైన స్థలం. మీరు 'ఊ!' అనండి రామకృష్ణ గారూ. కింద బ్రహ్మాoడమైన షాపింగ్ కాంప్లెక్స్, పైన విశాలంగా రెండు ఫ్లోర్లు నివాసానికీ... చక్కని ప్లాన్ గీసి ఇస్తాను. నాలుగు రోజుల్లో ఈ పాత ఇంటిని పడగొట్టి, పునాదులు తీయించే పనిలో ఉంటాను" ఇంజనీరు చెబుతున్న మాటలు నాకెందుకో అంతగా రుచించలేదు. నిర్లిప్తంగా ఉండిపోయాను.


"కిష్ణయ్య బాబూ! ఊర్లోకొచ్చారని తెలిసి, చేను ఊడ్పులు ఆపి ఇలాగొచ్చీసినాను. ఏం బాబూ... ఇల్లు పడగొట్టేత్తారంట కదా!? ఆళ్ళూ ఈళ్ళూ సెప్పుకుంటన్నారు. నిజవేంటో తెలుసుకుందారని పరిగెట్టుకొచ్చీసినాను" నేను వచ్చానని తెలిసి, చేలో పని వదిలేసి, సైకిల్ మీద వచ్చిన వెంకన్న, సైకిల్ వెనక క్యారేజీ స్టాండ్ కి తగిలించిన చిన్న సంచిలోంచి, థమ్స్ అప్ బాటిల్ మూత తీసి చేతికందిస్తూ అడిగాడు.


సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాను. ఆ ఇల్లు పరబ్రహ్మం గారు వారసత్వంగా నాకు ఇచ్చినది. ఆ తరం మనుషులతోపాటే ఇల్లూ మూగబోయింది. శిథిలమైపోతున్న మట్టి ఇటుక గోడల్లో, నిక్షిప్తమైన ఎన్నో జ్ఞాపకాలు నా మనసులో గందరగోళంగా తిరుగుతున్నాయి.


అరవై అయిదేళ్ల నాడు... రామేశ్వరం యాత్రలకు వెళ్లిన పరబ్రహ్మం, వెంకట శేషమ్మ దంపతులు, అక్కడ వారికి ఆతిధ్యం ఇచ్చిన సుబ్రహ్మణ్యం గారి మూడో సంతానమైన నన్ను దత్తత తీసుకున్నారు. తల్లిలేని బిడ్డల్ని పెంచడానికి సతమతమవుతున్న సుబ్రమణ్యం గారికి నచ్చచెప్పి, బిడ్డని వృద్ధిలోకి తెస్తామని హామీనిచ్చి, తమతోపాటు తెచ్చి, తమ ఇంటి బిడ్డగా ఎంతో గారాబంగా పెంచుకున్నారు. వేదపండితుడైన పరబ్రహ్మం గారి అస్థిపై దాయాదుల కన్ను ఉండేది. సంతానం లేని పరబ్రహ్మం గారు, నన్ను తెచ్చి పెంచుకోవడం ఊర్లో చాలామందికి మింగుడుపడలేదు. కొందరు మొహం మీద చెప్పినా, కొందరు చాటుగా చెవులు కొరుక్కునేవారు. ఇవేమీ పరబ్రహ్మం గారు పట్టించుకోలేదు. నాకు అయిదేళ్ల వయసు రాగానే రెండు ఊళ్ల అవతల వున్న కాన్వెంటు స్కూల్లో చేర్పించి, రోజూ జట్కా బండిలో స్కూలుకి పంపేవారు.


తాళాలు తీసి ఇంట్లోకి అడుగుపెట్టిన నాతోపాటూ, వెంకన్న కూడా ఊర్లో విషయాలు చెబుతూ లోపలకి వచ్చాడు. మండువా లోగిలిలో ఓ పక్కగా నాపరాళ్ల గచ్చుపై ముద్రించి ఉన్న అష్టా చెమ్మా గడులు చూడగానే, అమ్మ తన తోటి ఇల్లాళ్ళతో కలిసి కూచుని, గవ్వలు విసురుతూ పందెం వెయ్యడం గుర్తొచ్చింది. భోజనం పూర్తిచేసి, నిద్ర రాకుండా ఉండేందుకు అమ్మ ఇలా కాలక్షేపంగా ఆడేది. పెరట్లో అవిస చెట్టుమీదకి పాకించిన తమలపాకు తీగ నుంచి, లేత తమలపాకులు కోసి, కుండలో దాచివుంచిన గుల్లసున్నం ముద్దతీసి వేలితో ఆకులపై రాసి, వక్కా, కవిరి, పచ్చకర్పూరం, గులాబీ రేకల చూర్ణం, తేనె కలిపి అమ్మ చుట్టియిచ్చే తాంబూలం అంటే నాన్నకి చాలా ఇష్టం. నోట్లో ఆకుల రసం ఊరుతుంటే, బుగ్గలో తాంబూలం కొరికి పట్టి ఉంచి, విసనకఱ్ఱతో విసురుకుంటూ, పడక్కుర్చీలో కునుకు తీసేవారు నాన్న. అమ్మ చేతి గాజుల గలగలలూ, గవ్వల సడీ కలిసి లయబద్ధంగా ఉండదేమో హాయిగా నిద్రలోకి జారుకునేవారు.


పడగ్గదిలో పందిరిమంచం చెక్క అరలు తాళం తీసి చూసిన నేను ఆశ్చర్యపోయాను. నాన్న ఎంతో అపురూపంగా దాచుకున్న వారసత్వ సంపద. 'విలువైన ఈ నిధిని నా తరువాతి తరాలకి జాగ్రత్తగా అందించాలి...' మనసులోనే అనుకుని, భద్రంగా నాతో తెచ్చుకున్న సూట్ కేస్ లో పెట్టుకున్నాను.


అద్దాల బీరువా తలుపు తీసి చూసాను. అమ్మ లేని ఇల్లులా వెలవెలబోతోంది. మూలనున్న అరలో ఖాళీగా ఉన్న చిన్న సైజు ఫేము బుట్ట కనిపించింది. చేతిలోకి తీసుకుని తడిమి చూసాను. లోపల నా వేలు సైజులో... గోల్డు కలరు మూత బిగించి ఉన్న చిన్న గాజు అత్తరు బాటిల్ కనిపించింది. అమ్మకి సాయేబు తెచ్చే అత్తరు వాడడం అలవాటు ఉండేది. ప్రత్యేకించి పెళ్లిళ్ళూ, పేరంటాలప్పుడు మొగలి సెంటు దూది మీద అద్దుకుని, చెవి వెనక మడతలో పెట్టుకునేది. ఒళ్ళంతా నగలతో, పరిమళంతో... పూజలందుకున్న లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉండేది. అమ్మ జ్ఞాపకంగా అత్తరు సీసా తీసి జాగ్రత్త పెట్టాను.


పడమటింటి తలుపు తీసే ఉంది. "ఉండండి బాబూ! లోనకి రాకండి... బూజులు తలకి పట్టుకుంటై" అంటూ గబగబా చేతికందిన బూజులు తీస్తూ శుభ్రం చేసాడు వెంకన్న.

అక్కడున్న చెక్క పెట్టెపై కప్పి ఉన్న బట్ట, మట్టి పట్టేసి ఉంది. పెట్టెకి తాళం వేసి లేదు. మూత పైకెత్తి చూసాను. లోపలున్న చేప పురుగులు అటూఇటూ పరిగెత్తాయి. వెంకన్న సాయంతో లోపలున్న హార్మోనియం పెట్టె హ్యాండిల్స్ పట్టుకుని, బయటకి తీసాను. దానిని చూడగానే అమ్మ పాడే త్యాగరాజకీర్తనలు చెవిలో వినిపించి, అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. హార్మోనీ మెట్లు చేతితో తాకి చూసాను. అమ్మ ఒడిలో ఉన్నట్టే అనిపించింది. ఇక అక్కడ ఉండలేక బయటకి వచ్చేసాను.


ఈ ఇంటితో నాకు ఎన్నో జ్ఞాపకాలు ముడివేసుకున్నాయి. ఒక్కొక్కటీ గుర్తొస్తుంటే, భారంగా ఇల్లంతా తిరిగి చూసాను. పాడుబడిపోతున్న ఆ ఇంట్లో ఎటుచూసినా నా చిన్ననాటి జ్ఞాపకాలే.


"ఒరే వెంకన్నా! మరో పదిరోజుల్లో మళ్లీ వస్తాను... ఈ ఇల్లు పడగొట్టినప్పుడు నీకు కావాల్సిన తలుపు చెక్కలు, సరంబీ పలకలూ తీసుకువెళ్ళు. దగ్గరుండి అన్నీ చూసుకో" వెంకన్నకి పురమాయించి, ఇంజనీరుకి నా మనసులో మాట చెప్పాను. నేను కోరుకొంటున్న విధంగా బిల్డింగ్ ప్లాన్ సిద్ధం చేసి ఉంచమని చెప్పాను. సరేనన్నాడు.

****** ****** ****** ******

వేదం చదివిన పరబ్రహ్మం గారు పంచాంగం చూసి ముహూర్తం పెడితేకానీ ఆ ఊర్లో ఎవరింట్లోనూ శుభకార్యం జరిగేది కాదు. అలాంటి ఇంట్లో పెరిగిన నన్ను పెద్ద చదువుకోసం పట్నం పంపినప్పుడు, ఉన్న ఒక్క బిడ్డా దూరమైపోతాడేమోనని అమ్మ గిలగిల్లాడిపోయింది. నేను ఎక్కడున్నా, నెలకి ఒకసారైనా ఊరికి వస్తేకానీ మనిషిని కాలేకపోయేవాడిని. నాన్న ఆశీర్వాదం... నాకు రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ డిపార్టుమెంట్ లో ఉద్యోగం వచ్చింది. సర్వీసు మొత్తం హైదరాబాద్ లోనే గడిచింది.


అమ్మకి చివరి క్షణాల్లో సేవ చెయ్యడానికి వసుంధర సాయంగా ఉండేది. కోడలు అయినా, కూతురిలాగే పెద్దవాళ్ళిద్దర్నీ దగ్గరుండి చూసుకుంది. అభిషేక్ అమెరికాలో సెటిల్ అయ్యాక, అక్కడే ఉద్యోగం చేస్తున్న జయని పెళ్లి చేసుకున్నాడు. పిల్లలతో ఏడాదికి ఒకసారి ఇండియా వచ్చి వెళ్లడమే తప్ప, నేను పెరిగిన ఊరితో నా బిడ్డకి అనుబంధమేర్పడలేదు.


రిటైరయ్యాక అమ్మా, నాన్నల జ్ఞాపకాలు నన్ను చాలా బాధపెట్టేవి. సంతానం లేని వారికి, ఆసరా అవకుండా, నా దారి నేను చూసుకున్నానని తరచూ బాధపడేవాడిని. ఆ ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో, దానిని పడగొట్టి దాని స్థానంలో మరో భవంతిని కట్టాలనుకున్నాను. కానీ నాకు మనసొప్పలేదు. అందుకే ఊరు వారి క్షేమం కోరుకునే నాన్న ఆశయాలకు అనుగుణంగా నిర్మించాలని నిర్ణయించుకున్నాను.

దగ్గరుండి కనస్ట్రక్షను పనులన్నీ చూసుకున్నాను. బిల్డింగ్ పూర్తయ్యాక తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను.


"కీ.శే. పరబ్రహ్మం గారు, వెంకట శేషమ్మ దంపతుల జ్ఞాపకార్థం" అని, కట్టించిన ఆ కళ్యాణమండపంపై పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కించాను. ఇప్పుడు అమ్మా, నాన్నా ఊరివాళ్ళ మనసుల్లో ఇంకా సజీవంగానే ఉన్నారు అన్న సంతృప్తి కలిగింది. కళ్యాణమండపం నిర్మాణ పనుల్లో వెంకన్న చేదోడువాదోడుగా ఉన్నాడు. ఆ ఇంటి రుణం తీర్చుకున్న సంతృప్తి వాడి ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడింది.


"డాడీ! తాతగారి ఆస్తి ఏదో వారసత్వంగా తెచ్చుకున్నాను అన్నారు. ఇంతకీ ఏంటది?" కుతూహలంగా అడిగాడు అభిషేక్.


అప్పుడు తీసాను బయటకి... భద్రంగా నాన్న పరబ్రహ్మం గారి జ్ఞాపకంగా, అపురూపంగా దాచుకున్న తాళపత్రాలు. ఎప్పుడో తన పదవ ఏట వేదాభ్యాసం చేస్తున్న సమయంలో నాన్న, తాళ పత్రాలపై రాసిన వెంకటేశ్వర కళ్యాణానికి సంబంధించిన వేద మంత్రాలు అవి. వీడియోకాల్ లో వాటిని చూసిన అభిషేక్ చాలా సంతోషించాడు.


"నిజంగా ఇది తరగని నిధే డాడీ... ఇండియన్ మైథాలజీ పై జయ చేస్తున్న రీసెర్చ్ వర్క్ కి ఇవి అవసరం. మన వేదాలూ, వాటి విశిష్టత గురించీ తరువాతి తరాలకు తెలియజెప్పాడానికి ఇదొక అద్భుత అవకాశం. ఏమంటారు డాడీ?" అభిషేక్ మాటలకి నాకు కాస్త ఊరట కలిగింది. తరగని ఈ నిధి నా వారసులకి చేరుతోందన్న తృప్తితో ఆ రాత్రి నిశ్చింతగా పడుకున్నాను.

------సమాప్తం-----

వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Link


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ

నమస్తే!

నేను రాసిన "రంగుల లోకం" కథను మీ పత్రికలో ప్రచురణకు స్వీకరించినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

విశాఖపట్నం కు చెందిన వేలూరి ప్రమీలాశర్మ అను నేను, వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా, న్యూస్ కరెస్పాండెంట్ గా ఉన్నాను. నా రచనలు ఇంతవరకు ఆకాశవాణిలో 2 సీరియల్స్, పలు నాటికలతోపాటు, వివిధ పత్రికలలో వందకు పైగా కథలు ప్రచురించబడ్డాయి. తొలి ప్రచురణ "గజల్ సౌరభాలు" 2022 నవంబర్ లో రిలీజ్ అయ్యింది. కృష్ణమాలికలు శతకం అముద్రితం.


వారం రోజుల్లో 25 కథలతో కూడిన కథాసంపుటి ఒకటి ఆవిష్కరణకు రానుంది. నా భర్త వేలూరి గోపాలకృష్ణ శర్మ (విశాఖ కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సయిజ్ dept), మరియు నా కుమార్తెలు నిఖిత, సంహితల సహకారం, ప్రోత్సాహంతో మరిన్ని రచనలు చేయాలన్న ఆకాంక్షతో, తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో ముందుకు సాగుతున్నాను. మా తెలుగు కథలు.కామ్ ద్వారా నా కథలు పరిచయం అవుతున్నందుకు మరోసారి ధన్యవాదాలు.

ఇట్లు,

వేలూరి ప్రమీలాశర్మ.









50 views1 comment
bottom of page