top of page

తరాలూ - ఆంతర్యాలూ


'Tharalu Antharalu' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

అప్పుడే పెళ్లిళ్ల పేరయ్యగారు కబురు చేస్తే ఆయనను కలిసి వచ్చారు చలపతిరావు గారు ! ఆయన రావడం చూసిన అన్నపూర్ణమ్మగారు, ‘వచ్చారా..’ అంటూ వంటింట్లోకి వెళ్లి మంచి నీళ్ల గ్లాసు ఆయన చేతికి అందిస్తూ అక్కడే సావడిలో ఆయన కెదురుగా కూలబడి, సంగతేమిటో ఆయనే చెబుతారు కదా అని ఆయనకేసే చూస్తూ ఉండిపోయారు !

“పంతులుగారు ఒక సంబంధం గురించి చెప్పారు పూర్ణా ! చాలా బాగుంది. అబ్బాయి బి.ఏ. పాస్ అయి విజయనగరంలో ట్రెజరీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. అతనిపైన ఇద్దరు అక్కలు !

వారికీ వివాహమైపోయిందని చెప్పారు. అఖరన మరో తమ్ముడు, పీయూసీ చదువుతున్నాడుట. తండ్రి స్కూల్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారుట! విజయనగరంలో సొంత ఇల్లు, కాస్తంత పొలం పుట్రా కూడా ఉన్నాయని చెప్పారు.

అయితే పదివేలు కట్నం, ఇద్దరు ఆడపడుచులకూ తలో అర్ధ వేయి నూటపదహార్లు లాంఛనాలు, వెండి కంచం, గ్లాసు, అబ్బాయికి ఉంగరం పెట్టాలిట. మన అమ్మాయికి ఆరు కాసుల బంగారం పెట్టి పంపాలిట, ఇదీ వారి కోరిక! సాంప్రదాయమైన కుటుంబం అని చెప్పారు పంతులుగారు. పైగా ఆ అబ్బాయికి బామ్మా తాతగారూ కూడా ఉన్నారని, వాళ్లమూలానే అన్ని పద్ధతులనూ తూచా తప్పకుండా పాటించవలసివస్తోందని పంతులుగారన్నారు ! ఈ షరతులకు ఒప్పుకుంటే పెళ్లి చూపులకు కబురు పెడ్తాడుట పంతులు. మన అమ్మాయి రాధమ్మ జాతకాలూ, ఆ అబ్బాయిదీ బాగా కలిసాయని చెప్పారాయన !

‘పదివేలు కట్నమా!’ గుండెలమీద చేయి వేసుకున్నారావిడ ! ఆవిడ పెళ్లికి అర్ధ వెయ్యినూట పదహార్లు కట్నంగా ఇచ్చిన సంఘటన, అప్పటి రోజుల్లో అదే ఎక్కువని చెప్పుకోవడం గుర్తుకొచ్చింది! తనకు పన్నెండో ఏటే పెళ్లవడం, పద్నాల్గవ ఏటనే పెద్దాడు భాస్కరం తన కడుపున పడటం జరిగిపోయింది. నిజమే! అప్పటికీ ఇప్పటికీ నలభై సంవత్సరాల వ్యత్యాసం!

“అదే ఆలోచిస్తున్నాను పూర్ణా ! ఉన్న ఎకరం పొలం బేరం పెడదామా అని ఆలోచిస్తున్నాన”ని ఆయన అనగానే, “సాయంత్రం పెద్దాడిని రానీయండి. వాడితో కూడా కలిసి ఆలోచిద్దామ’న్నారావిడ ! భాస్కరం వారి పెద్దబ్బాయి, అతను కాకుండా వారికి పెళ్లీడుకొచ్చిన మరో ఇద్దరు ఆడపిల్లలు, బి.కామ్. మొదటి సంవత్సరం చదువుతున్న మరో అబ్బాయి ఉన్నారు ! ఇప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడి వస్తున్నది పెద్దమ్మాయి రాధకు !

భాస్కరానికి పెళ్లై మూడు సంవత్సరాలు అయింది. భాస్కరం భార్య అరుంధతి మహా గుణవంతురాలు. అత్తవారింట్లో బాగా కలిసిపోయి, అందరికీ అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉంటూ బాధ్యతలను పంచుకుంటూ, భాస్కరానికి తగిన భార్యగా, అణకువ కలిగిన కోడలుగా పేరు తెచ్చుకుంది. అత్తవారింటి కష్ట సుఖాలు తనవిగా భావిస్తూ, భాస్కరానికి చక్కని సలహాలిస్తూ, అన్నింటా తానై మెసిలే అరుంధతి అంటే భాస్కరానికి తగని ప్రేమ ! భార్యా భర్తలంటే అరుంధతీ భాస్కరమే అన్నట్లుగా చూడముచ్చటగా, అన్యోన్యంగా ఉంటారిద్దరూ ! ఇంట్లో ప్రతీ చిన్న విషయానికి సలహాలు అడుగుతూ, మాటి మాటికీ ‘అరుంధతీ!’ అని పిలుస్తూ తన మనసులోని భావాలను కోడలితో పంచుకోవడం అన్నపూర్ణకు ఒక ధైర్యాన్ని, ఆలంబననూ ఇస్తుంది.

సాయంత్రం భాస్కరం ఆఫీస్ నుండి వచ్చాడు. భాస్కరం తాలూకాఫీసులో క్లర్క్ గా పనిచేస్తున్నాడు! భార్య అరుంధతి ఇచ్చిన కాఫీ తాగి రిలాక్స్ అవుతూ, “ఏమిటీ సంగతులు? ఈరోజు నాన్నగారు పెళ్లిళ్ల పేరయ్యగారిని కలుస్తానన్నారు, ఏమైందో”నంటూ భార్యకేసి సాలోచనగా చూసాడు !

“ఆ! కలిసి వచ్చారు మామయ్యగారు. శుభవార్తే! కానీ కాస్తంత ఆందోళనగా ఉన్నారు మామయ్యగారు!” అని చెబుతుండగా, తల్లీ తండ్రీ భాస్కరం కూర్చున్న చోటికి వచ్చి పెళ్లి సంబంధం వివరాలు చెప్పసాగారు.

“చూద్దాం నాన్నగారూ! రెండు రోజులు ఆగి ఏ విషయమూ చెపుతామని చెప్పండి పంతులుగారికి. మీరు ఆందోళన పడకండి. చెల్లాయి పెళ్లి జరిపించే పూచీ నాది! కట్నం, పెళ్లి ఖర్చులూ అవీ ఆలోచించాలి. నాకు ఆఫీస్ లో ఏదైనా లోన్ వస్తుందేమో ప్రయత్నిస్తాను. ఏ మార్గమూ లేకపోతే అప్పుడు మీ పొలం విషయం ఆలోచిద్దామ"ని తండ్రికి ధైర్యం చెప్పి బెడ్ రూమ్ లోకి వచ్చాడు ! బెడ్ రూమ్ లోకి వచ్చి ఏదో ఆలోచిస్తూ అన్యమనస్కంగా బట్టలు మార్చుకుంటున్న భాస్కరాన్ని చూసింది అరుంధతి !

" చెల్లాయి పెళ్లి కుదరబోతోందన్న సంతోషం శ్రీవారిలో ఎక్కడ వెతికినా కనబడడం లేదేమిటా అని చూస్తున్నాను " అంటూ అరుంధతే సంభాషణ మొదలు పెట్టింది !

“సంతోషం ఎందుకు ఉండదు అరుంధా ? కాని ప్రతీ చిన్న సంతోషాన్నీ ' డబ్బు ' అనే పదం అణగదొక్కేస్తోంది! నా దగ్గరే ఈ పాటికి డబ్బుంటే మా చెల్లి రాథ పెళ్లికి అంగీకారం చెప్పేసి ఉండేవాడినేమో కదా అని అనుకుంటున్నాను ! పాపం నాన్నగారు ఉన్న ఎకరం పొలం అమ్మేద్దాం అంటున్నారు. నాన్నగారి ఆస్తి అది, ఆయనకు ఆ పొలం ఇన్నాళ్లూ ఒక ధైర్యాన్నిస్తూ రక్షణ కవచంలా ఉంది ! ఎంత క్లుప్తంగా చేసినా ఒక నలభై, ఏభై వేలేనా ఉండద్దా.." నెమ్మదిగా గొణుగుతున్నట్లుగా అన్నాడు భాస్కరం !

ఓస్! ఇదో పెద్ద సమస్యాండీ ? కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు, ఇది కూడా అంతే ! అలా చూస్తూండగానే మన రాధ పెళ్లి అయిపోవడం, తనని అత్తారింటికి సాగనంపడం కూడా జరిగిపోతుంది, చూడండి!”

“అబ్బా.. ఎంత తేలికగా అనేస్తున్నావు అరుంధా ? నీ దగ్గరేమైనా అల్లాఉద్దీన్ అద్భుతదీపం ఉందా ఏమిటే?” అంటూ హాస్యంగా పరిహసించాడు భాస్కరం !

“అదేమీ లేదు గానీ, నాకు నా పుట్టింటివారు పసుపు కుంకుమల కింద ఇచ్చిన అరెకరం పొలం మీద అప్పు తెచ్చుకుందాం, సంవత్సరానికి వచ్చే పంట డబ్బులను అలా అప్పు భాగంగా కోసేసుకోమందాం ! మేము కౌలుకిచ్చిన రైతు మంచివాడే, మా నాన్న ఆయన పొలం మీద అడపాదడపా అప్పు తీసుకోవడం నాకు తెలుసు !”

అరుంధతి మాటలకు ఒక్క క్షణం అప్రతిభుడైనాడు భాస్కరం !

ఏమిటి ఈ అరుంధ! ఎంతో అమాయకంగా నాది అనే స్వార్ధం లేకుండా ఇంతగా ఆలోచిస్తూ, ఏ సమస్యనైనా చిటికలో పరిష్కరిస్తుంది కదా’ అనుకుంటూ.. “బాగానే ఉంది కానీ, మీ అమ్మ, నాన్నగారు ఏమైనా అనుకోరా అరుంధా?”

“ఓ.. సోస్ .. పిచ్చి మారాజా! ఎవరూ అనుకునేది ? అది నా పొలం, నా ఇష్టం, నా కుటుంబం కోసం అప్పు తీసుకుంటున్నాను ! అదీ నా ఇంట్లో ఆడపిల్ల పెళ్లి కోసం !

ఆ.. ఇంకో సంగతి శ్రీవారూ! నాకు నా పుట్టింటి వాళ్లు పెట్టిన పాతిక కాసుల బంగారం ఉందికదా. అందులో ఆరు కాసుల బంగారంతో మన రాధమ్మకు నానుతాడు, రెండు బంగారు గాజులు, నల్లపూసల గొలుసు చేయిద్దామనుకుంటున్నాను ! “

“అప్పుడే నీకన్ని ఆలోచనలు ఎలా వచ్చేసాయి?” భార్యవైపు మురిపంగా చూస్తూ అడిగాడు భాస్కరం !

“పాపం.. మధ్యాహ్నం మామయ్యగారు అత్తయ్యగారితో చెప్పడం, మామయ్యగారు ఆ ఆలోచనతో సరిగా భోజనం కూడా చేయలేదు. అదంతా చూసిన నేను పరిష్కారం గురించి ఆలోచిస్తే ఈ మార్గం కనిపించిందండీ ! ఊ.. చెప్పండి, మిమ్మల్ని సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని నన్ను తప్పుగా అర్ధం చేసుకోవడం లేదు కదా, మీకు నచ్చకపోతే చెప్పండి, నేను ఏమీ బాధపడను !”

“లేదు అరుంధా, నేనేమీ అనుకోవడంలేదు, నా బదులు కూడా నువ్వే ఆలోచించి నాకు శ్రమని తగ్గించావు. సంసారంలో ‘భర్త అధికుడు, భార్య అతని కన్నా తక్కువ’ అని భావించే వారికి దాంపత్యం అంటే ఏమిటో తెలియదు. దాంపత్యమంటే కలసి ఎదగటం, కలిసి కష్ట సుఖాలను అనుభవించటం, పరస్పర అవగాహనతో సహజీవనం సాగించటం. కానీ.. నీ నగలు మార్చడం భావ్యం కాదనిపిస్తోంది నాకు !”

“అలా అనుకుంటే మన రాధమ్మకు పెళ్లి ఎలా చేస్తామండీ ? చూడండి, ఆ నగలన్నీ నేను దిగేసుకుని తిరగడం నాకు బాగుండడం లేదు. ఇంట్లో పాపం ఇద్దరాడపడుచులు బోసి మెడలతో ఏమీ వేసుకోకుండా, నేను వాటిని సింగారించుకుని ఆర్భాటంగా తిరగడం నాకు నచ్చదండీ ! వాళ్లు కూడా ఆనందంగా ఉంటేనే నాకూ ఆనందం ! ఇంకేమీ మాటలాడకండి” అంటూ భాస్కరాన్ని మరేమీ మాట్లాడనీయకుండా మరుసటిరోజు వారు ఉంటున్న పెద్దాపురానికి కాస్త దూరంలోని సూరంపూడి గ్రామానికి బయలుదేరింది ! అరుంధతి పుట్టిల్లు సూరంపూడి ! రెండురోజుల్లో రైతు దగ్గర నుండి ఒక నలభై వేలు అప్పు తెచ్చింది ! భాస్కరం ఆఫీస్ నుండి పదివేలు లోన్ కు దరఖాస్తు పెట్టుకున్నాడు ! ఆ తరువాత పెళ్లిచూపులూ, నిశ్చితార్ధం, పెళ్లీ అవీ టక టకా జరిగిపోయాయి ! రాధ అత్తవారింటికి వెడ్తూ వదినను అభిమానంగా కౌగలించుకుని ఏడ్చింది ! అరుంధతి అత్తగారు అన్నపూర్ణమ్మ గారు, “ఇదంతా నీమూలానే అయిందమ్మా అరుంధతీ!” అంటూ అరుంధతిని ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు ! మరో రెండు సంవత్సరాలకు రెండో ఆడపిల్ల వసంత పెళ్లికి కూడా అలాగే చేసి అత్తారింటికి పంపారు !

రెండో ఆడపడుచుకి కూడా తన నగల్లోని ఒక నగను చెరిపించి, ఆరుకాసుల్లో పెద్దాడపడుచుకు చేయించినట్లుగానే చేయించింది అరుంధతి ! ఈ రెండు సంవత్సరాలలో అరుంధతికి మగ పిల్లాడు పుట్టడం, అలాగే పెద్దాడపడుచు కూడా డెలివరీకి పుట్టింటికి రావడం జరిగింది ! మొదటిసారి పురిటి ఖర్చులూ, బాలసారె ఖర్చులూ అన్నీ భాస్కరం దంపతులే చూసుకున్నారు ! అరుంధతి తన పుట్టింటివారిచ్చిన వెండి చెంబును కరిగించి ఆడబిడ్డ కూతురికి ఒక చిన్న వెండి కంచం, వెండి కడియాలు అవీ చేయించడమే కాకుండా తన రెండు కాసుల గాజు ఒకటి మార్పించి పిల్లకు చిన్న గొలుసు, ఉంగరం, కాస్తంత పెద్దయ్యాకా చెవులు కుట్టించి పెట్టమని చిన్న బుట్టలు కూడా చేయించి ఇచ్చింది !

ఇలా ఆడపడుచులు పండుగలూ, పబ్బాలకూ పుట్టింటికి రావడం, ఉన్నంతలో వారికి ఏలోటూ లేకుండా, ముద్దు ముచ్చటలూ తీర్చడం, ఈలోగా మరల అరుంధతి భాస్కర్ దంపతులకు కూతురు పుట్టడం అవీ జరిగిపోయాయి కాలప్రవాహంలో !

ఆడపడుచుల పిల్లల అచ్చటా ముచ్చటా తీర్చే నెపంలో మరో నాలుగు కాసుల బంగారపు నగ తీసి మార్చివేసింది అరుంధతి ! భాస్కరం తమ్ముడు వేణు చదువు పూర్తి అవడం, గవర్నెమెంట్ జాబ్ రావడంతో వారి ఆర్ధిక పరిస్తితి కొంచెం కుదుటపడింది !

ఒకరోజు చలపతిరావు గారు కొడుకులిద్దర్నీ పిలిచి తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఇంటిని, మిగిలి ఉన్న ఎకరం పొలం ఇద్గరికీ చెరిసమానంగా వ్రాసిస్తానంటే, చిన్నవాడు వేణు తనకు ఏమీ వద్దని అన్నయ్యకే ఇచ్చేయమన్నాడు. “అన్నయ్యా వదినా మొదటి నుంచి అన్ని బాధ్యతలూ దగ్గరుండి నిర్వర్తించారు, అన్నయ్యకే ఇవ్వడం సమంజసం” అంటూ సున్నితంగా చెప్పాడు ! చిన్న కొడుకు మంచితనానికి ఆ తండ్రి కళ్లు చెమర్చాయి.

ఆ తరువాత రెండు సంవత్సరాలకు చిన్న కొడుక్కి కూడా పెళ్లి చేయడం, అతను వైజాగ్ లో కాపురం పెట్టడం జరిగిపోయింది. వేగవంతమైన కాలప్రవాహంలో ఎన్నో మార్పులు !

ఒక రెండేళ్ల వ్యత్యాసంలో భాస్కరం తల్లీ తండ్రీ ఇరువురూ కాలధర్మం చెందారు ! తన కన్నతల్లి, తండ్రీ దూరమైనట్లుగా ఏడ్చింది అరుంధతి. అన్నేళ్ల సాహచర్యంలో ఏనాడూ తనని పల్లెత్తు మాట అనలేదిరువురూ ! ప్రతి చిన్న విషయానికీ ‘అమ్మా అరుంధతీ!” అంటూ ఆప్యాయంగా పిలుస్తూ తనని సలహాలడిగే ఆ ఇద్దరినీ పదే పదే తలచుకునేది అరుంధతి

భాస్కరం పిల్లలు కాలేజ్ చదువులకు వచ్చారు ! పిల్లలిద్దరూ తెలివైన వాళ్ళు ! భాస్కరం కొడుకు రఘురాం మెడిసన్ చదువుతానన్నాడు, నేను చదివించలేనురా అబ్బాయి! మరో కోర్సు ఏమైనా చేయమంటే, కాదు కూడదంటే, తండ్రి పరంగా తనకు మిగిలిన ఆ ఉన్న ఎకరం పొలం అమ్మేసి కొడుకుని మెడిసన్ చదివించాడు ! కూతురు శిరీషను బి..ఎస్..సి చదివించి, బీ..ఈడీ చేయిస్తున్నాడు ! కొడుకు పి..జీ..కూడా చేసి హైద్రాబాద్ లో ఒక కార్పొరేట్ హాస్పటల్ లో ఉద్యోగం చేస్తున్నాడు ! సాయంత్రాలు సొంతంగా క్లినిక్ చూసుకుంటున్నాడు !

రఘురాం తన “స్నేహితుని చెల్లెలు ఉష అనే అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయి కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తోందని , ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం నాన్నా” అనగానే ఆనందంగా దగ్గర ఉండి శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించారు భాస్కరం దంపతులు ! నిజానికి కొడుకు పెళ్లి శిరీషకు జరిపించాక చేద్దామనుకున్నాడు! ఉద్యోగస్తుడైనాడు, కూతురి పెళ్లికి రఘురాం నుండి ఆర్ధికంగా సహాయముంటుందని, శిరీష పెళ్లి సమస్య లేకుండా జరిపించచ్చు అనుకున్నాడు భాస్కరం !

‘ఉద్యోగం వచ్చింది నాన్నా’ అని రఘురాం చెప్పగానే, శిరీష పెళ్లి బాధ్యత గురించి రఘుకి చెప్పాడు కూడా ! ‘దానిదేముంది నాన్నా, చెల్లాయ్ కు పెళ్లి సంబంధం చూడండి, చేసేద్దాం’ అన్నాడు !

రఘు అంత భరోసా ఇచ్చేసరికి కాస్త రిలీఫ్ అనిపించింది భాస్కరానికి !

ఒకరోజు పెద్ద చెల్లి రాధ నుండి ఫోన్ ! ‘అన్నయ్యా! శిరీ కు ఒక సంబంధం ఉంది ఇక్కడ ! మీ బావగారికి బంధువులు ! మంచి కుటుంబం, ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చేసి పూనేలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. నెలకు రెండు లక్షల వరకు వస్తుందిట జీతం ! మీ గోత్రం, వాళ్లదీ ఒకటి కాదు, శిరీ నక్షత్రం తెలుసు కాబట్టి చెప్పాను ! ప్రస్తుతం ఆ అబ్బాయి సెలవు పెట్టి ఇక్కడే తల్లీ తండ్రీ దగ్గర ఉన్నాడు. మీరు వస్తే శిరీ ను చూపించవచ్చు’ అంటూ మాట్లాడింది !

‘చూడడంలో తప్పేముందీ, మనకు అన్నీ నచ్చాకనే కదా ఒప్పుకునే’దంటూ అరుంధతి కూడా ప్రోత్సహించేసరికి సరేనని అందరూ బయలదేరారు. రాధ ఇంట్లోనే పెళ్లిచూపుల ఏర్పాట్లు జరగడం, కుందనపు బొమ్మలాంటి శిరీష అందరికీ నచ్చేయడంతో, అబ్బాయి కూడా సెలవులో అక్కడే ఉన్నాడు కాబట్టి సింపుల్ గా నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది! రఘూని, కోడలిని నిశ్చితార్ధానికి రమ్మని భాస్కరం ఫోన్ చేస్తే , అంత అర్జంట్ గా రావడం సాధ్యం కాదని, కేసులు ఎక్కువగా ఉన్న మూలాన సెలవు దొరకదని, ఉషకు కూడా స్టూడెంట్స్ కు పరీక్షలు మూలాన లీవ్ దొరకడం కష్టం అంటూ, మీరే సింపుల్ గా కానిచ్చేయమని చెప్పేసాడు. కొంచెం సేపు బాధ పడ్డాడు భాస్కరం. వైజాగ్ నుండి తమ్ముని కుటుంబం, చిన్న చెల్లెలి కుటుంబం అంతా వచ్చారు.. తమ్ముడు తన వెన్నంటే ఉండి సహాయం చేసాడు !

పెళ్లికి కట్నకానుకలేమీ వద్దని, పెళ్లిమాత్రం ఘనంగా చేయాలని నెలరోజుల గేప్ లో పెళ్లి మహూర్తం పెట్టేసుకున్నారు ! విఘ్నేశ్వరుని ముడుపు కూడా కట్టేసుకుని పెళ్లి పనుల ఏర్పాటు చేసుకోవాలని అందరూ తలబోసారు !

ఆరోజు రాత్రి భోజనాలైన తరువాత భాస్కరం, వేణు పెళ్లికి ఎంత అవుతుందో ఉజ్జాయింపుగా లెక్కవేసారు. కట్నం లేకపోయినా మంచి ఫంక్షన్ హాల్, డెకరేషన్స్, కేటరింగ్ కే మూడు లక్షలు అవుతుంది.. పెళ్లికొడుకు బట్టలు, బంగారపు గొలుసు, ఉంగరం, మిగతా లాంఛనాలతో కలిపి మరో మూడు లక్షలు, అవిగాకా ఇక్కడ ఆడపెళ్లివారి ఖర్చులు, అన్నీ కలపి మొత్తం ఒక ఎనిమిది లక్షల దాకా అవుతుందని అనుకున్నారు !

వేణూ వెంటనే, "అన్నయ్యా నీవేమీ అన్యదా భావించనంటే ఒకటి చెబుతాను విను ! నాకు ఇద్దరూ మగపిల్లలే.. శిరీ నాకు కూతురులాంటిది, దానిపెళ్లికి నా వంతు సాయం అన్నయ్యా!" అంటూ రెండు లక్షలరూపాయలకు చెక్ అన్నగారి చేతిలో పెట్టాడు. వేణు చిన్నతనం నుండి అన్నగారిని చూస్తూనే ఉన్నాడు. స్వార్థం లేకుండా అక్కలకు, తనకూ ఎంత చేసాడో తనకు తెలుసు. వదిన కూడా అంతే. పెద్ద చెల్లి రాధ, చిన్న చెల్లెలు వసంత మేనకోడలికి తలో ఇరవై వేలు ఇస్తూ పెళ్లి చీరలు కొనుక్కోమన్నారు !! వాళ్లందరి దగ్గర వీడ్కోలు తీసుకుని, పెళ్లికి ముందరే రావాలని చెబుతూ తిరుగుముఖం పట్టారు భాస్కరం దంపతులు, శిరీష !

ఇంటికి రాగానే కొడుక్కి వివరాలన్నీ ఫోనులో చెప్పాడు !

"నాన్నా! బాగానే ఉంది గానీ, ఇలా ఆఘమేఘాల మీద చెల్లాయ్ పెళ్లి జరిపించేస్తానంటే ఎలా ? మిగతా డబ్బు ఎలా సమకూర్చాలనుకుంటున్నారు ? నిన్ననే నేనూ మీకోడలూ ఇక్కడ హైటెక్ సిటీలో కడ్తున్న విల్లాలను చూసాం. చాలా బాగున్నాయి. హాట్ కేకుల్లా అయిపోతున్నాయి. ప్రస్తుత ధర కోటిన్నర ఉంది ! మరికొంతకాలం ఆగితే రేట్లు డబల్ అయిపోతే అప్పుడసలు కొనలేం. అందుకనే ధైర్యం చేసి, మా ఇద్దరి సేవింగ్స్ అన్నీ ఊడ్చేసి ఎడ్వాన్స్ పేమెంట్ కి ఇరవై లక్షలు పే చేసి విల్లా బుక్ చేసాం. మిగతా ఎమౌంట్ కు బేంక్ లోన్ తీసుకోబోతున్నాం ! అయినా మన తాహతుకి మించిన పెళ్లి సంబంధాలు చూసుకోవడమేమిటి నాన్నా ? ఎలా చేద్దామనుకున్నారు ? సరే, ఫిక్స్ చేసేసుకుని నాకు చెపుతున్నారు ! ప్రస్తుతం నా పరిస్థితి చెప్పాను కదా !

అమ్మ పేరున అమ్మ పుట్టింటివారిచ్చిన అరెకరం పొలం ఉందిగా! అప్పుడెప్పుడో అమ్మ దాని ధర పదిహేను లక్షల వరకు ఉందన్నట్లు చెప్పగా విన్నాను ! ఇంకా ఆ పొలం ఎందుకు, ఇటువంటి అవసరాలకే కదా, అమ్మేయండి నాన్నా! వింటున్నారా ?”

భాస్కరానికి నోటమాటరావడం లేదు.. గొంతుకు దుఖంతో పూడుకుపోతోంది ! చెల్లాయి పెళ్లివార్త విని, రఘు ఆనంద పడ్తూ, నాన్నా శిరీ పెళ్లి బాధ్యత నాది , మీరు ఆందోళన పడకండని ధైర్యం చెబుతూ తనకి ఆసరాగా ఉంటాడనుకున్నాడు !

కానీ తనకే ఎదురు వస్తూ.. ‘తాహతుకు మించిన సంబంధం చేయడమేమిటి’ అంటూ ప్రశ్న ?

అవును! తమ పిల్లలు ఆనందంగా సుఖంగా ఉండాలనే తల్లితండ్రులు తమ తాహతుకి మించిన ఆలోచనలు చేస్తారు! ఆరోజు మెడిసన్ నేను చదివించలేనురా రఘూ! అంటే అదే చదువుతానని మొండికేసాడు.. రేపు డాక్టర్ నైతే బోలెడు డబ్బు నీ చేతిలో పోస్తాను నాన్నా అన్నాడు ! ఉన్న ఒక ఎకరం పొలం తన చేత అమ్మించేసాడు !

రఘు ఉద్యోగస్తుడైనాడు, వాడి జీతంలో సగం శిరీష పెళ్లికి సేవ్ చేస్తాడని, శిరీష పెళ్లికి కొడుకుగా తనకు చేయూతనిస్తాడనుకున్న రఘు, తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి , చెల్లెలు పెళ్లి అయేదాకా వేచిచూడకుండా తాను ముందరే పెళ్లిపీటలకెక్కేసాడు !

ఏమిటో విరక్తిగా అనిపించింది.. తను అరుంధతి పొలం అమ్మడు ఎన్నటికీ ! ఇంకో ఆర్నెలలో రిటైర్ అవబోతున్నాడు భాస్కరం ! పి..ఎఫ్..లోన్ మూడు లక్షలకు అప్లై చేసాడు.. తన స్నేహితుని నుండి ఒక ఏభై వేలు అప్పుగా తెచ్చుకున్నాడు ! అరుంధతి పుట్టింటి పొలంపై ఏమీ అప్పులేని మూలాన, ఆ పొలంపై మరో రెండులక్షలు అప్పుగా తెచ్చింది. అరుంధతి అన్నగారు మేనకోడలి పెళ్లికి ఒక ఏభైవేలిచ్చాడు తన కానుకగా !

ఇవేమీ మనసులో పెట్టుకోకుండా రఘునీ, కోడలినీ పెళ్లికి పదిరోజులు ముందరే వచ్చి అన్ని ఏర్పాట్లూ చూడమని ఫోన్ చేసి చెప్పాడు భాస్కరం ! అరుంధతి కూడా ప్రత్యేకంగా కోడలికి ఫోన్ చేసింది ! అరుంధతితో ఆ అమ్మాయి అసలు మాట్లాడడమే తక్కువ ! శిరీష పెళ్లి కుదిరిందన్న వార్త విని, ఉష ఫోన్ చేసి సంబరపడుతూ మాట్లాడుతుందేమో అనుకుంది ! కానీ అటువంటి మాటలు లేవు.. కొడుకు కోడలు పెళ్లి అయ్యి రెండు సంవత్సరాలు దాటినా ఆమె అత్తవారింటికి ఇంతవరకూ ఒకేసారి వచ్చి రెండురోజులు మాత్రమే ఉంది !

ఎప్పుడు ఫోన్ చేసి రమ్మన్నా, బిజీ బిజీ అంటారు. శెలవు కుదరదంటారు ! వాళ్లు రారు, తమని రమ్మని పొరపాటున కూడా అనరు ! ఏది ఏమైనా ఇవేమీ మనసులో పెట్టుకోకుండా పెళ్లికి నాలుగు రోజుల ముందర వచ్చిన కొడుకూ కోడలి ని ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంటూ సాదరంగా ఆహ్వానించింది.. కోడలిని మురిపెంగా చూసుకుంది !

అన్నిటాతామై, ప్రతీ పనిలోనూ చేదోడువాదోడుగా ఉంటూ ఎంతో సహాయపడ్డారు ఆడబడుచులు!

శిరీషకు చేతికి ఒక పదివేలు ఇస్తూ పెళ్లి చీరలు కొనుక్కోమన్నారు రఘూ, ఉషా ! అప్పటికే చీరలన్నీ కొనుక్కున్న శిరీష ‘వద్దన్నయ్యా, చీరలు కొనేసుకున్నా’నంటూ తిరస్కరించింది !

ఆ డబ్బు తల్లికివ్వబోతే, ‘మీ నాన్నగారికియ్యి రఘూ, పెళ్లిఖర్చులూ, సర్దుబాటులూ అన్నీ నాన్నే చూసుకుంటున్నా’రని చెప్పింది ! భాస్కరం వెన్నెంటే ఉంటూ, అన్నయ్యను ఎక్కువ అలసిపోనీయకుండా పెళ్లి అంతా తనే దగ్గరుండి జరిపించాడు వేణు !

పాతికవేలు ఖరీదు చేసే పట్టుచీరలో, కొత్తగా చేయించుకున్న ఒడ్డాణంతో ఒంటినిండా నగలతో హడావుడిగా తిరుగుతున్న ఉష వైపే అందరి దృష్టీ ! నిజానికి ఉష అందమైనది, దానికితోడు ఒంటినిండా మెరుస్తున్న బంగారు నగలు ! అందరూ ఉష చుట్టూ చేరి ఆమె పెట్టుకున్న బంగారు వడ్డాణం డిజైన్ బాగుందని ఎక్కడ కొన్నారని, ఎన్నితులాలలని అడగడం ఉష సమాధానం చెప్పడం అన్నీ అరుధతి చెవులను సోకుతున్నాయి !

అరుంధతి పెద్దాడబడుచు వదినను పట్టుకుని " వదినా! మీకోడలు ఉష పెట్టుకున్న బంగారపు ఒడ్డాణం తనకు బాగా నప్పింది కదూ?” అని అనేసరికి .. అరుంధతి " అవును రాధా! కొనుక్కున్నానని ఉష నాకు చూపించిందిలే , అవును.. నీవన్నట్లు ఉషకు బాగా నప్పింద"ని సమాధానమిచ్చింది ! కొన్ని బంధాలు నిలవాలంటే అప్పుడప్పుడు అబధ్దాలాడక తప్పదు .. “లేదు! ఉష నాకు తను కొనుక్కున్న ఒడ్డాణం చూపించనేలేదం”టే అత్తా కోడలిమధ్య సమైక్యతా భావం ఎంతుందో అవతల వ్యక్తికి అర్థమైపోతుంది. రాధకి తనంటే ఎంతో ఇష్టం, గౌరవం ఉన్నా రాధ తనమీద జాలిపడడం తనకిష్టం లేదు !

తనకి అర్ధం కానిది ఒకటే! అత్తయ్య బ్రతికి ఉండగా తనూ అత్తయ్యా ఎంతో సన్నిహితంగా ఉండేవారు ! తను ఏమి చేసినా, కొనుక్కున్నా వెంటనే అత్తగారికి చూపించేది ! చివరకు వాయిలు చీర కొనుక్కున్నా ! ఆవిడనేవారు, ‘ఏమ్మా ఇంకాస్త ఎక్కువ వేసి మంచిది కొనుక్కోలేకపోయావా?’ అని ! అరమరికలు లేని తమ బంధం అలా అల్లుకుంటూ ఆవిడ చనిపోయేవరకు సాగిపోయింది! ఆవిడ లేని లోటును అరుంధతి ఎంతగానో అనుభవించింది !

అరుంధతి దగ్గర మిగిలి ఉన్న ఎనిమిది కాసుల బంగారానికి మరో రెండు కాసుల బంగారం కలిపి శిరీషకు పెళ్లి నగలు చేయించింది.. అరుంధతికి ప్రస్తుతం మెడలో నిలిచి ఉన్నది కేవలం మంగళసూత్రం గొలుసు మాత్రమే !

ఉన్నంతలో పెళ్లి ఘనంగా జరిపించారు.. పెళ్లికొడుకు బాగున్నాడు, సౌమ్యుడు. ఏ గొడవలూ లేకుండా పెళ్లి జరిగిపోవడం బంధువులందరూ ఎక్కడివాళ్లు అక్కడకు వెళ్లిపోయారు. మూడు నిద్రలకు శిరీషతో రెండో ఆడబడుచు, భర్త వెళ్లారు ! తెల్లారితే భాస్కరం తమ్ముడు వేణు, పెద్దాడబడుచు వాళ్లూ, అలాగే రఘు, ఉషాల ప్రయాణం ! వాళ్లూ వెళ్లిపోతే ఇల్లు చిన్నబోతుంది !

ఆరోజు మధ్యాహ్నం భోజనాలైనాక అందరూ ఒక్కచోట సమావేశమై ఉండగా వేణు అన్నాడు " అన్నయ్యా! నీవు తొందరలో రిటైర్ అయిపోతున్నావుకదా! నీవూ వదినా ఇద్దరూ ఒంటరిగా ఇక్కడెందుకు? వైజాగ్ వచ్చేయండి నా దగ్గరకు” అంటూ.

ఈమాటలు విన్న వేణు అక్క రాధ " నీ పిచ్చి గానీ తమ్ముడూ, అన్నయ్య, వదిన నీ దగ్గరకు ఎందుకొస్తారు? హాయిగా కొడుకూ కోడలు దగ్గర ఉంటారు గానీ!" అనేసరికి రఘూ ఉషాలనుండీ ఏ సమాధానమూ లేదు. మౌనంగా అటూ ఇటూ చూస్తూ ఉండేసరికి అరుంధతి వెంటనే కలగచేసుకుంటూ, " తప్పకుండా వేణూ, నీవు పిలిస్తేనే రావాలని లేదుగా, నీవు మమ్మలని పిలవకపోయినా చనువుగా వచ్చేసి ఉండిపోయే అధికారం మాకు ఉంది! చూద్దాంలే, మరో ఆరు నెలలు టైమ్ ఉందిగా, ఈలోగా ఎన్ని మార్పులు వస్తాయో’నంటూ మాట మార్చింది !

అందరూ వెళ్లిపోయారు.. రఘు ఉషా కూడా బయలుదేరుతున్నారు.. కొడుక్కి ఇష్డమైన పిండి వంటలన్నీ చేసి నీట్ గా పేక్ చేసింది. అలాగే నాలుగు రకాల నిల్వ పచ్చళ్లు, పొడులూ చేసి కోడలికి ఇచ్చింది !

వియ్యపురాలు తనకు పెట్టిన చీరల్లోంచి మంచి చీరొకటి తీసి ఉషకు బొట్టు పెట్టి ఇస్తూ, ఉషను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది! కనీసం తండ్రిని 'పెళ్లి ఖర్చులు ఎలా పెట్టారు, అమ్మ పొలం అమ్మారా లేదా' అనిగాని, 'రిటైర్ అయ్యాక నా దగ్గరకు వచ్చేయ'మనిగానీ అనలేదు రఘు! అరుంధతే కోడలితో పదే పదే చెప్పింది, " వస్తూ ఉండండమ్మా, ఇద్దరమే ఉన్నాం, మీరు తరచుగా వస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంద’ని . సరేనంటూ తలూపింది ఉష !

“వెళ్లొస్తాం నాన్నా, అమ్మా” అని రఘూ, “వస్తాం అండీ” అంటూ ఉషా వీడ్కోలు తీసుకున్నారు ! ఇద్దరూ వెళ్లిపోతుంటే కళ్లు చెమ్మగిల్లాయి. ఇల్లంతా చిన్నబోయింది ! ఆ ఇంట్లో దంపతులిరువురూ మిగిలారు !

రాత్రి ఎనిమిది గంటల సమయం.. అప్పుడే కరెంట్ పోయింది. ఇంట్లో కొవ్వొత్తి వెలిగించింది అరుంధతి. ఇన్వర్టర్ కొనుక్కోవాలని అనుకోవడం, దానికంటే ముఖ్య అవసరాలు రావడంతో ఆ ఆలోచన కాస్తా వెనక్కి వెళ్లిపోతోందని మనసులో అనుకోసాగింది ! వరండాలో కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు భాస్కరం ! బైట పుచ్చపువ్వులా వెన్నెల ప్రకాశిస్తోంది.. చల్లని గాలి మనసుకు సేద తీరుస్తున్నట్లుగా ఉంది !

“ఏమి ఆలోచిస్తున్నారండీ?” అంటూ అరుంధతి కూడా అక్కడే ఉన్న మరో కుర్చీలో కూర్చుంది.

“ఏమి లేదు అరుంధా! బాధ్యతలను పూర్తి చేశాను, నీ సహకారం లేనిదే నేను ఇవన్నీ నెరవేర్చేవాడిని కాదు కదా అనుకుంటున్నాను ! "

"భలేవారే! మీ బాధ్యతలన్నింటినే చక్కగా నిర్వర్తించారని వేరే చెప్పాలా ? మన చేతుల మీదుగా జరిపించిన మీ చెల్లాయిల పెళ్లిళ్లు, తమ్ముడు పెళ్లి, మన అబ్బాయి, అమ్మాయి పెళ్లిళ్లు అన్నీ శుభప్రదంగా జరిగాయి.. అందరూ పచ్చగా కళ కళలాడుతూ ఎవరికి వారు సంసారాలు చేసుకుంటున్నారు ! అది చాలదా మనకు ? "

“కానీ అరుంధా, శిరీ పెళ్లికి మన రఘూ ఏమాత్రం బాధ్యత తీసుకోకపోవడం నీకు బాధగా అన్పించడం లేదా ? నేను ఎప్పుడూ ఆలోచిస్తాను .. మనకంటూ ఏమీ దాచుకోకుండా పిల్లల ఆప్యాయతానురాగాల మీద ఆధారపడి, అదే పెన్నిధిగా భావించే హిందూ ధర్మంలో నమ్మకం పునాది. మా నాన్న గారి జీవితం ప్రకారం పూర్వం ఉమ్మడి కుటుంబాలకు పెద్ద కొడుకు పునాది. అతణ్ణి చూసుకుని ఇంటి యజమాని నిశ్చింతగా ఉండేవాడు. మరి అపనమ్మకం పునాదిగా ఉన్న విదేశీ సంస్కృతికి అలవాటు పడిన ఈ తరం వారు బాధ్యత నెత్తిన వేసుకోకుండా తప్పుకుంటున్నారు. అలాగే ‘మన’ అనే సంప్రదాయం పోయి ‘నాది’ అన్న సంప్రదాయం ఎరువు తెచ్చుకుంటున్నారు. అది చెప్పడానికే ఈ వ్యక్తిత్వపు నిజ జీవితం గూర్చిన వ్యధ. మనల్ని పైకి తీసుకురావడానికి మన తల్లితండ్రులు చేసిన త్యాగం అనితర సాధ్యం. మా అమ్మ ఏనాడూ ఆ రొజుల్లో పది రూపాయలు మించిన చీర కట్టలేదు. మా నాన్న కూడా చాలా నిరాడంబరంగా ఉండేవారు. మా నాన్న ఉద్యోగం చేసే రోజుల్లో, ఒకటొ తారీఖున ఖచ్చితంగా మా తాతగారు ఊరునుండి వచ్చి మా నాన్న గారి జీతంలో కుటుంబానికి పన్నెండు రూపాయలు వుంచి ఇరవై మూడు రూపాయలు పట్టుకుపొయేవారు. ఎందుకు చెబుతున్నానంటే అదే ఈ రోజుల్లొ జరిగితే ‘నీకెందుకు ఇవ్వాలి? కాన్వెంటులో చదివించావా? పెద్ద చదువులు చదివించావా? నేను కష్టపడి చదువుకున్నాను కాబట్టే ఈ ఉద్యోగం వచ్చింది.. అని మా ఆవిడ చెప్పమం’దంటారు ! ‘నీకు మాకు ఏ సంబంధం లేదు’ అని చెబుతారు. అంతే కాదు అరుంధా! అప్పటి రోజుల్లో ఏమీ లేకపోయినా సాటి వారిలొ గొప్పలు పోవడానికి మా తాత గారి ఇంట్లో బారసాల, నామకరణం , ఏ ఖర్చులు , అవసరాలూ వచ్చినా ఓ పసుపు కొమ్ము తెచ్చి మా అమ్మకిచ్చి ఆవిడ మంగళసూత్రాలు పట్టుకుపొయేవారుట తాకట్టు పెట్టడానికి ! మా నాన్న గారు ఏమీ మాట్లడడానికి వీల్లేదు.

అలాగే మనం కూడా మనకు చేతనైంతలో నాన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ' అమ్మో ఇన్ని బాధ్యతలా, చెల్లాయిల పెళ్లిళ్లు నేనెందుకు చేయాలి' అనలేదు. నీ పుట్టింటివారు పెట్టిన నగలను మార్పించి నీ ఆడపడుచులకు పెళ్లి నగలు చేయించావు, అలాగే మీ పుట్టింటి వారు నీకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన పొలం మీద అప్పు తెచ్చి కుటుంబ అవసరాలను ఎన్నో సర్దావు.. ఏనాడూ కాస్త ఖరీదైన చీర కూడా కొనుక్కోలేదు నీవు ! 'నేనెందుకు ఇవ్వాలి, అవి నా పుట్టింటివారు పెట్టిన సొమ్ముల'ని ఏనాడూ నీవు భావించలేదు ! బాధ్యత అన్నది ఒకరు చెబితే వచ్చేది కాదు అరుంధా! ఎవరి మనసుకి వారికి తోచాలి, ఇష్టంగా మనసారా చేయాలి !

కానీ రఘు చూడు, చిన్నప్పటి నుండీ మన పరిస్థితులనూ, ఆర్ధిక ఇబ్బందులనూ చూస్తూనే పెరిగాడు ! అయినా కూడా కష్టాలనూ , పరిస్థితులనూ అర్ధం చేసుకోలేదు ! వాడు విల్లా కొనుక్కుంటునందుకుగానీ, కారు కొన్నందుకుగానీ నేను బాధపడడం లేదు అరుంధా ! 'చెల్లెలి పెళ్లికి వాడికి ఏమాత్రమూ బాధ్యత లేదా?' అని బాధపడిన మాట వాస్తవం ! 'మన తాహతుకు మించిన సంబంధం చూడడం ఏమిట'ని ప్రశ్నించాడు ! 'నాన్నా ప్రస్తుతం సహాయం చేయలేను, తరువాత కాస్త నిలదొక్కుకున్నాక పంపుతాను' అన్నా ఏమీ అనుకోను, ఆ మాట వాడు అని అంటే 'వద్దులేరా రఘూ' అని నేనే అనేసేవాడినేమో ! అలా అనలేదు సరికదా ‘అమ్మ పొలం అందుకేగా ఉన్నది, అమ్మేయండి’ అన్న వాడి ఉచిత సలహాకి బాధపడ్తున్నాను !”

“చూడండి! ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మనకు వాడిమీద ఎప్పటకీ చెడు అభిప్రాయమే ఉంటుంది.. తరాల అంతరాలు ఇలాగే ఉంటాయేమో ! తరాలతో, ఆంతర్యాలు మారుతాయేమో!మంచి మంచి చదువులు, ఉద్యోగాలూ, పెళ్లి కాకుండానే సొంత ఇళ్లూ, డబ్బు వెనకేసుకోవడం నేటి తరం పిల్లల ఆలోచనలు ! మనలాగే ఉండాలని మనం అనుకోకూడదు ! తల్లిదండ్రులుగా మన బాధ్యత వారికి మంచి చదువు చెప్పించి వారిని కాళ్లమీద నిలబడేలా చేయడం ! వాళ్లు ఏదో మనలని ఉద్ధరిస్తారన్న ఆశతో ఏదీ చేయకూడదు. మనం వారి నుండి ఆశించడం, అది లభించనప్పుడు నిరుత్సాహపడడం కంటే అవివేకం మరొకటి లేదు నా ఉద్దేశంలో !

బాధ్యతలు, బరువులూ, బంధాల గురించి మనం, మీ నాన్నగారి తరం వారు ఆలోచించినట్లుగా నేటి పిల్లలు ఆలోచించరు ! పోనీలెండి, వారికి కావలసినంత సంపాదించుకుంటూ, ఇష్టమైనది కొనుక్కుంటూ సుఖంగా ఉన్నారు ! అది లేక మీ దగ్గరకు వచ్చి 'నాన్నా1 ఓ ఐదు లక్షలు ఇస్తారా' అని అడిగితే అప్పుడు మీరు బాధపడాలి !

ఒక కన్న తండ్రిగా మీరు శిరీ పెళ్లి చేసారు ఘనంగా ! ఇది మనకు ఎంతో ఆత్మ సంతృప్తిని కలగచేస్తుంది ! మీరు రిటైర్ అవుతున్నారు. మీకు వచ్చే బెనిఫిట్ లో అప్పులు తీర్చేసుకుందాం ! మీకు పెన్షన్ వస్తుంది, దానితో జీవించలేమా చెప్పండి? మీకు నేనూ, నాకు మీరూ ! ఇన్వర్టర్ లేకపోయినా ఈ కొవ్వొత్తి కాంతిలో ఉన్న ఆనందాన్ని అనుభవిద్దాం ! మనకు మిగిలిన ఈ చిన్న ఇల్లే ఒక పెద్ద భవంతి ! ఈ మాత్రం కూడా లేనివాళ్లు లోకంలో ఎందరో ఉన్నారు ! వాళ్ల కంటే మనం ఎంతో అదృష్టవంతులం ! మన పిల్లలు మనకు చెడ్డవారిలా అనిపించకూడదండీ ! మన పిల్లలు వాళ్లు, ఏదో ఒకరోజున అమ్మా నాన్నా అనుకుంటూ మన ఒడిలో చేరుతారు ! అయినా వాడి తల్లితండ్రులం మనం ! 'నాన్నా.. అమ్మా.. మాఇంటికి రం'డంటూ వాడు పిలిచేదేమిటి, పిలవలేదని బాధపడడమేమిటి ? మనమే వెడుతూ ఉందాం, మన కోడలికి మనమేమిటో, మన ఆప్యాయతానురాగాలు ఎటువంటివో, మన బంధంలోని విలువేమిటో రుచిచూపిస్తూ అలవాటు చేద్దాం !

కష్టాలు మనిషిలో దృఢత్వాన్ని పెంచుతాయి. బలమైన వ్యక్తిత్వం గల వ్యక్తి ఎట్టి పరిస్థితిలోను మానసిక స్థైర్యాన్ని కోల్పోడు. ఎక్కువగా ఆలోచిస్తే మనస్సు పాడవడం తప్పించి మరేమీ మిగలదు ! మనకు మనమే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగాలి ! ఏమంటారు శ్రీవారు..?” అని అరుంధతి అనగానే, “నిజం అరుంధా! నీ ప్రోత్సాహం, ధైర్యం నాకు ఎంతో బలానిస్తోందం”టూ ఆమె వైపు ప్రేమగా చూస్తూ జవాబిచ్చాడు భాస్కరం !

కొంతసేపటి వరకూ ఆ విశాల వినీకాశంలో మెరిసే నక్షత్రాల అస్పష్టపు కాంతిలో వారిద్దరూ మౌనంగా గడిపారు !

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


123 views0 comments

Comments


bottom of page