top of page

దట్ ఈజ్ సరోజినీ ఆమ్మా.. !


'That Is Sarojini Aamma' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 12/05/2024

'దట్ ఈజ్ సరోజినీ ఆమ్మా' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత



సంచి పట్టుకుని ఆ వీధి మలుపు తిరిగేసరికి కనపడే పెంకుటిల్లు మా ఆమ్మ ఇల్లు. చిన్న పెంకుటిల్లు పక్క సందుకున్న బెల్ కొడితే ఆమ్మ..  ప్రత్యక్షం. తెల్లని తెలుపు, తెల్లని జుట్టు, పొట్టిగా వుండే ఆమ్మ.. ! ఇపుడే ఇలా ఉందంటే ఇదివరకు ఇంకా బావుండేదన్నట్లుగా.. అనిపించేది. 


ఇంతకీ ఎవరీ ఆమ్మ.. ! ముందు చెప్పండంటారా. మావారి మేనత్త, సరోజనమ్మ. నాకు వరసకు ఆమ్మ.. ! అవుతుంది. నన్ను మా అమ్మ తర్వాత అంత ప్రేమగా చూసుకుంది ఈ ఆమ్మా.. ఉరఫ్ సరోజినీదేవి. 


తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఎవరన్నా వస్తారేమోనని,  అలవాటుగా కాఫీ డికాషన్ వేసి అన్నం పెద్ద గిన్నెలో వండి ఉంచేది. వచ్చేవాళ్ళను బట్టి తర్వాత కూరలు లేదా.. వీలు కాకపోతే పచ్చడైనా వేసి అన్నం పెట్టటం ఆమెకు అలవాటు. ఒకవేళ ఎవరూ..  రాకపోతే వండినది పక్కనుండే వాళ్లకు పిలిచి ఇచ్చేది. 


మా ఆయన వాళ్ల మేనత్త గురించి "ఇపుడు ఇలా వుంది కానీ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది మా అత్తయ్య. మా మామయ్య క్వారీ మేనేజరుగా పని చేసేవాడు. పెద్ద క్వార్టర్సులో వుండేవాళ్ళు. చుట్టూతా పెద్ద స్థలం, ఆవులు, పని మనుషులు.. చాలా గొప్పగా బతికింది. తెల్లవారేటప్పటికి అన్నీ సిద్ధం చేసి, ఆయన్ను క్వారీకి పంపేది. ఆమెకు పిల్లలు లేరన్న మాటే కానీ మా పెదనాన్న పిల్లలను, మమ్మలని, వాళ్ల మరిది పిల్లలను అందర్నీ తన పిల్లలుగా చూసుకునేది. మేము సెలవులకు వెళ్తే మాకు పండగే. పిండివంటలు పెద్ద జల్లలకు చేసి పోసేదని చెపుతుంటే ‘అవునా!’ అని ఆశ్చర్యపోయాను. 


 "వసంతా.. ! ఇది నీకు పెద్ద పుట్టి”ల్లనేది. మా నాన్న ఒకసారి ఆమ్మతో అన్నారుట ఈ మాట. అదెప్పుడూ గుర్తుచేసేది నాకు. ఆవిడ ముత్తైదువ. ఫోటోలో ఎంతో హుందాగా పెద్ద బొట్టు, నగలు, చేతికి గాజులతో నిజమే.. గుప్తుల కాలము స్వర్ణయుగం లాగా సరోజనమ్మగారు తన కాలమును స్వర్ణయుగం లాగా గడిపింది. 


 "రామ్మ.. !" అని లోపలికి దారి తీసింది. లోపలికి వెళితే దొడ్లో వెనుక చిన్న గది వుంది, దానిలోనే మా ఆమ్మ వుండేది. గది ముందు పెద్ద సిమెంట్ దిమ్మెలు, ఒక బావి, పక్కనే ఒక గాబు వుండేది. ఎవరొచ్చినా ముందు గాబులో నుండి నీళ్ళు తీసుకుని కాళ్ళు కడుక్కోవాలి. ఆ చెంబు నీళ్ల వెలితి వారా..  బావిలో నుండి నీళ్ళు తోడి ఆ గాబులో పోసి గదిలోకి వెళితే భలే చల్లగా వుండేది. ముందు పోర్షన్ అద్దె కిచ్చింది. ఆ అద్దె డబ్బులతో కాలక్షేపం చేసేది మా అమ్మ. 


 "రామ్మా, రా! మంచినీళ్ళు తాగనీ.. !" నాచేతికి మంచి నీళ్ళు గ్లాసు మీది మూత తీసిచ్చింది. తాగుతూ చూస్తే మంచినీళ్ళ గ్లాస్ పక్కన ఒక రెండు చెంబులు, ఐదారు గ్లాసులు అన్నీ క్రమపద్దతిలో సిపాయిలు, సైన్యంలో టోపీలు పెట్టుకున్నట్లు.. మూతలు పెట్టుకున్నట్లుగా! అనిపించింది "ఇంకా కావాలా.. ?" అని అడిగింది. వద్దని తలాడించాను. 


పక్కనే వున్న చెక్క కుర్చీలో కూర్చుంటే కర్రతో ఫాన్ తీసి నా చేతికి తాటాకు విసనకర్ర ఇచ్చింది. "ఫ్యానేస్తే స్టౌ మీది మంట ఆరుతుం”దని చెప్పింది. 

కాఫీ చేతికి ఇచ్చి మళ్ళీ కర్రతో ఫ్యాన్ వేసింది. 


 "ఆమ్మా! నేను బజారెళ్ళి మిక్సి జారు బాగు చేయించుకొస్తాను. నీకేమన్నా కావాలా? బజారు నుండి.. !" అంటే ఒక అట్టకున్న క్లిప్ నుండి ఒక కాగితం తీసిచ్చి "ఇవి కొంచం తెచ్చిపెట్టు. నాకు మోకాళ్ళ నొప్పులు గామ్మా.. ! నేను నడవలేను” అనేది. 


"పర్లేదు నేను తెస్తానంటూ ఆ చీటి తీసి బాగులో దోపుతూ స్టౌ పైకి చూస్తే అప్పటికే పెద్ద సత్తు గిన్నెలో అన్నం స్టౌ పైన వండి వుంచేది తినటానికి రెడీగా. 


 "తొందరగా వస్తావా.. ! అన్నం తిందువుగానీ ఎండకు పడి వచ్చావు. ఈ ఆమ్మ.. ! పచ్చడి మెతుకులు మాత్రమే పెడుతుం”దనేది.  


"అయ్యో! ఆమ్మా! అది వండి పెట్టటం కూడా గొప్పే!" అంటూ నేను తెచ్చిన మా ఇంటి గణుపు చిక్కుడుకాయలు ఆమె దగ్గరున్న చిల్లుల గిన్నెలో పోసేదాన్ని. రేపు ఆమ్మ దగ్గరికి వెళ్తానంటే డాబా ఎక్కి చిక్కుడు కాయలు కోసేదాన్ని ఆవిడ కిష్టమని. ఇక ఆవిడ అవి వలిచే క్రమములో పడితే నేను లేచి కాఫీ బలముతో బజారుకెళ్ళాను. చకచకా పనులు పూర్తి చేసుకుని ఆవిడ ఇచ్చినవి కొని.. సాధు సోడా షాపుకు వెళితే సుగంధ సోడా ప్యాక్ చేసి ఇస్తారు అది ఆమ్మకు తీసుకొచ్చి ఇచ్చాను ఆ సోడా ఆవిడ కిష్టం. 

 

 "రామ్మా రా.. ! ముందు అన్నం తిను" అంటూ కంచంలో చిక్కుడుకాయ కూర, నిమ్మకాయ పచ్చడేసి పెట్టింది. అసలు ఆవిడ వైపు చూడకుండా బ్రహ్మానందం లెవెల్లో కంచం వైపు చూస్తూ కలుపుకున్నా. 

ఇదిగో "ఆవు నెయ్యి వేసుకో.. !" అంటూ! వేసింది. 


"ఆవు నెయ్యా.. !" అని నేను నోరెళ్ళబెడితే "ఓసి! పిచ్చి మోహమా.. !" అనే భావంతో చూస్తూ "ఇదినూనె.. !” అంటూ నవ్వుతూ వేసేది కంచంలో. అయినా ఆ టేస్ట్ అదరహో. 


"ఇంటిముందు కొస్తే ఈ నిమ్మకాయలు పెద్దవి ఎంత బావున్నాయో! తీసుకుని తరిగి పచ్చడి చేసి దానిలో అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు వేసా తిననీ కంచంలో వేసింది. ఎర్రగా వున్న ఆ నిమ్మకాయ పచ్చడి చూస్తే లాగించు లాగించు జోరుగా పాట గుర్తుకొచ్చి ఆమ్మ మధ్యలో అన్నం పెట్టింది కూడా గుర్తుకు రాలేనంతగా లాగించా. కాబేజీ పచ్చడి తిరగమాత అనకుండా అదొక రకంగా తిరమాత పెట్టా.. తిను!" అనేది ఆ మాట గమ్మత్తుగా వుండేది. కానీ ఆ పచ్చళ్ళు మేము చేస్తే ఆ టేస్టు రావటం లేదు. ఆవిడకు మనం ఎంత తింటే అంత తృప్తిగా వుండేది. 

 

 ఆవిడ ఎంతమంది వచ్చినా వండి పెట్టేది విసుగు లేకుండా. చుట్టాలొస్తే వండి పెట్టలేమని బద్దికించే మనము ఈవిడ దగ్గరకు ఎవరొచ్చినా! నిముషంలో వండి పెట్టటం నేర్చుకోవచ్చు. బంధువులను పో.. ! పొమ్మని.. ! అనే ఈ రోజుల్లో "రా.. ! రమ్మని.. ! పిలవటం ఆమెకు మన మీదున్న ప్రేమకు నిదర్శనం. 


 ఆ మోకాళ్ల నొప్పులతోనే పనులన్ని చకచక శుభ్రంగా చేసేది. గ్యాసు పొయ్యి ఇపుడే షాప్ నుండి తెచ్చినట్లు క్లీన్ గా వుండేది. గ్యాసు స్టౌవు కింద అరలో పెద్ద చిళ్లుల గిన్నెలు, వాటి మూతలపై నాపరాళ్ల ముక్కలు వుండేవి. ఎలుకలు తిరుగుతున్నాయని అన్నిటిపై రాళ్ళు పెట్టేది. ఆ నాపరాళ్ళతో ఇల్లు కట్టోచ్చు. 


బాత్రూం కెళితే కొట్టటానికి ఫినాయిల్ కలిపిన నీళ్ళ బకెట్ వుండేది. ఒక వస్తువు అయిపోయెలోపే అది తెప్పిచ్చి పక్కన పెట్టుకునేది. మా పిల్లలను తీసుకొస్తే అన్నం పెద్ద బేసిన్లో కలిపి పెట్టేది. మేము వెళ్లేప్పుడు తను చేసిన జొన్నచక్రాలు, పెద్ద కవరులో వేసిచ్చేది. చాలా కష్ట జీవి, మధ్య వయసులో భర్త పోవటం, అన్నీ పనులు తిరిగి తనే చేసుకునేది. 


 త్యాగరాజ స్వామి కీర్తన సమయానికి తగు మాటలాడెనే! పాటను మా ఆమ్మ బాణీలో సమయానికి తగు మాటలు + పనులు చేసెనే! అని పాడుకోవచ్చు. అప్పు చేసేది కాదు. పాలవాళ్లకు, చాకలికి.. ! అమ్మో! ఒకటో తారీఖు అనుకుంటూ డబ్బులిచ్చేదాకా వూరుకునేది కాదు. చాలావరకు మాట పడకుండా ఉండటానికి ప్రయత్నించేది. తను ఒకళ్ళను అనదు ఎవరన్నా! అంటే సమయం కోసం చూసి అపుడు మటుకు వాళ్ళను వేసుకున్నాననేది. 

 

 ఆచారాలను తప్పకు పాటించేది. పెద్దతనములో కూడా నాకెందుకులే అనుకోకుండా! ఎవరైనా! జబ్బున పడ్డా మనుషులు పోయినా.. ! వాళ్ళను నిద్రకు పిలిచి తన దగ్గర ఉన్నది పెట్టి పంపేది. ఎపుడు ఎక్కడ.. ఎలా మాట్లాడాలో? మనం టివి వాల్యూం ఎలా పెంచి తగ్గిస్తామో అలాగే, మాట్లాడేది. 


 అలాంటి ఆమ్మకు.. ! చివరి దశలో సేవ చేసే వీలు నాకు కలిగింది. తన అనుభవాలను పంచుకునేది. "అపుడు ఎనిమిది మానికల మినప్పప్పు రుబ్బి వడియాలు పెట్టేదాన్ని రాములు వారి గుడిలో ప్రసాదాలు వండేదాన్ని. మరిపుడు అనేది. "ఆమ్మా! నువ్వు ఈ వయసులో ఓపిక లేదంటున్నావు మాకిప్పుడే.. ఒపికలు లేవనేదాన్ని. " 

"ఏదీ మీరు బాగా తింటే ఓపిక వస్తుంది, కానీ! మీరు తినరుగా!" అనేది. 


 లిబర్టీ స్టాచు విగ్రహము చేతిలో కాగడా వున్నట్లు మా ఆమ్మ చేతిలో ఎపుడూ.. ! బ్యాటరీ లైట్ వుండేది. మధ్యలో కరెంట్ పోతే.. !" అని దాన్ని చేతిలో వుంచుకునేది. పక్కనే పెద్ద కొవ్వొత్తి అగ్గిపెట్టె వుండేవి. రెండు పొడుగు కర్రలతో అటూఇటూ వున్న టివి, ఫ్యాన్, కూలరు స్విచ్చులను మార్చి వేసుకుంటూ వుండేది. మాటిమాటికి మమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక. 


 బయట మంచినీళ్ల డ్రమ్ములో నుండి నీళ్ళు తోడుతూ జారి పడింది. సర్జరీ మా డాక్టర్ అన్నయ్య చేసాడు. సక్సెసయి కుట్లు తీయించుకుని ఇంటికి తెచ్చాము. అపుడు అన్నం ముద్దలు కలిపి పెడితే "మా అమ్మలాగే.. ! కలిపి ముద్దలు పెడుతున్నా”వనేది. పడకుండా వుంటే ఇంకో ఐదేళ్లు వుండేది. 

 

 ఒకసారి నాతో "సారీ అమ్మా.. !" అంది. నాకు ఆమ్మ ‘సారి’ అని పలకటం ఎంతో, ముచ్చటేసింది. 


"ఎందుకమ్మా!"అంటే "నన్ను నడిపించాలని.. ! ప్రయత్నిస్తున్నావు, కానీ, నాకు లేచి కూచునే శక్తి లే”దంది.  


 "నువ్వు పెద్దదానివి.. ! అలా అన”కంటే తృప్తిగా ఒక నీరసపు నవ్వు నవ్వింది. ఎపుడూ "నీళ్ల ఋణం, నిద్ర ఋణం మనకు ఎపుడు.. ఎక్కడో ? తెలియ”దనేది ఆమ్మ. 


 ఒకరోజు పొద్దున కాఫీ ఇద్దామని వెళితే, నా వైపు చూస్తూనే, ప్రాణం వదిలింది. ఆమ్మా.. ! నన్ను అమ్మలాగా.. ! కనిపెట్టుకుని ప్రేమగా చూసావు. 


 'మిస్ యూ ఆమ్మా.. ! నువ్వెక్కడున్నా.. ! నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి.. ! కోరుకుంటున్నా. '

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.

25 views0 comments

Comments


bottom of page