'The Trap Episode 16' New Telugu Web Series
Written By Pandranki Subramani
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
గత ఎపిసోడ్ లో
ఒకరోజు భువనేష్ కి కాల్ చేస్తుంది వరూధిని.
కాల్ ప్రభావతి లిఫ్ట్ చెయ్యడంతో, తన కూతురు మందాకిని మిమ్మల్ని చూడాలంటోందని మాట మారుస్తుంది.
మాటల మధ్యలో తన మిత్రుడు రాముకి సితారతో పెళ్లి చెయ్యడానికి భువనేష్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతుంది.
ఇక ది ట్రాప్.. 16 వ భాగం చదవండి…
రాము కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయి తలెత్తి చూసాడు. “నువ్వు నాశ్రేయోభిలాషివే—మిత్రుడివే- కాదనలేని వాస్తవం. కాని నువ్వు నా జీవిత నేపథ్యాన్ని, మానసిక దృక్పథాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేక పోయావనిపిస్తుంది. నేను పెళ్ళి చేసుకుని ఓ యింటివాడిని కావడానికి ఒప్పుకోవడానికి సరైన కారణం నువ్వు తెలుసుకోలేక పోయావనిపిస్తుంది”.
ఆ మాటతో భువనేశ్ ఉగ్గబట్టలేకపోయాడు. సర్రున లేచాడు- “ఈ డొంక తిరుగుడు మాటలు కట్టిపెట్టి విషయానికి తిన్నగా రా! సితారా నీకు నచ్చ లేదా? నీ అభిమతానికి తగ్గట్టు సొగసుగ లేదా? ”
“అలాగని నేనెక్కడన్నాను? రియల్లీ షి ఈజ్ ఎ మైటీ పర్సనాలిటీ—నోడౌట్—కాని— మనసా వాచా కర్మణ: నేనాశినట్టు లేదు. నా మనసుకి దగ్గరగా లేదు”.
ఈసారి కూడా భువనేశ్ సర్రున లేచాడు. భర్తను ఆవేశం తగ్గించుకోమన్నట్టు చేతిని అదిమింది ప్రభావతి. కాని అతడు వినే స్థితిలో లేడు-- “నువ్వూరుకో ప్రభా! తాడో పేడో ఇప్పుడే ఇక్కడే తేల్చాలి. ఇలా తిక్క తిక్కగా ఆలోచించడం, వెర్రి మొర్రిగా మాట్లాడటం యెప్పట్నించి నేర్చుకున్నావు రామూ! అమెరికాలో నీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన గార్ల్ ఫ్రెండ్సు గురించి నాకు తెలవదనుకుంటున్నావా? చూడలేదనుకుంటున్నావా! వాళ్ళతో పోల్చి చూస్తే సితార యెందులో తగ్గిందంటావు? ” భువనేశ్ అతడికి తెలియకుండానే రొప్పుతున్నాడు, ఆవేశాన్ని అదుపు చేయలేక--
”సితారను వాళ్ళతో యెక్కడ పోల్చానని—నిజానికి సితార అక్కడి బ్యూటీల కన్నా రెండు రెట్లు అధిక స్థానంలో ఉందనాలి. ఎంత ప్రయత్నించినా మేకపోతు కొమ్ముల్ని పట్టుకుని నీకు చూపించలేక పోతున్నాననిపిస్తుంది. మరొక సారి ప్రయత్నించి చూస్తాను. నాకు తెలిసిన తెలుగు పదజాలంతో-- ఏకైక లక్ష్యంతో జీవన సముద్ర తీరాలు దాటి పలు అనుభూతులు ఆస్వాదిస్తూ లెక్కలేనన్ని అనుభవాలను నాలో యిముడ్చుకుంటూ చాలా దూరం వచ్చేసాను. తీరా ఓసారి ఓపిక తెచ్చుకుని తిరిగి చూస్తే— మాఁవిడి చెట్టు కొమ్మల మాటున నాతో చెలగాట మాడిన బాల్యం నాకు కనిపించలేదు.
నన్ను వెంటాడి వచ్చిన మృదువైన అనుభూతుల జాడ కనిపించలేదు. చాలానే అనుభవించానని. నాలుగు చెరగులా బాగానే సంపాదించానను కున్న తరవాత, నాకని పించింది దారి మధ్యలో చాలానే జారవిడుచుకున్నానని-- అనవరతం అవధికి మించి అనుభవిస్తూ అలసట ముంచుకొచ్చినట్ల నిపించింది. అప్పుడు నువ్వు గుర్తుకి వచ్చావు. నీ మాటలు గుర్తుకి వచ్చాయి. మరింత జాప్యానికి చోటివ్వకుండా నిన్ను ముందుకు సాగమని చెప్పాను. నువ్వలానే చేసావు.
ఇక్కడకు వచ్చిన తరవాత నా గుండెలోని సవ్వడి మరొక రాగంతో ఆలపించ నారంభించింది. ”
అప్పుడు ప్రభావతి చప్పున అందుకుంది-- “గుండెలోని సవ్వడి మరొక రాగంతో ఆలపించ నారంభించిందా! అదేమిటి రాముగారూ? ”
అదివిని రాము సగం విచ్చుకున్న పెదవులతో నవ్వాడు- “చెప్తాను. నేను మావూళ్ళో నా చిన్ననాటి కుటుంబంలో ఉన్నట్టు ఉండాలనిపించింది. అమ్మ పెద్దమ్మ అత్తయ్య మామయ్యల చుట్టూ ఉండాలని పించింది. కనీసం అటువంటి భావనా స్రవంతితో మనుగడ చేయలేనప్పుడు నాకు పెళ్ళి అవసరమే లేదనిపించింది” .
అప్పుడు షార్ప్ గా భువనేశ్ నుండి ప్రశ్న దూసుకువచ్చింది- “సితారతో నీకు అటువంటి కుటుంబం యేర్పడదని ఎందుకనుకుంటున్నావు? ”
“చెరువు గట్టుపైన కూర్చున్నప్పుడు నెమ్మదిగా సోకే చల్లని పవనంలా కుటుంబం జీవితం ఉండాలని ఆశిస్తున్నాను. మరెందుకో సితారాతో చేరితే నాకు అటువంటి కుటుంబ జీవితం లభ్యమవుతుందని తోచడం లేదు. మళ్ళీ వాయు వేగంతో ఉండలు చుట్టే సుడిగుండంలోకి దిగబడిపోతా ననిపించింది. నాకు తోచినదే కదా నేను చెప్పగలను—ఆ మాటకు వస్తే నాకు శ్యామల క్లోజ్ గా ఉంటుందనిపించింది—”.
అది విని భువనేశ్ ఉన్నపాటున జెర్కింగుకి లోనయాడు- “నాకప్పుడే అనిపించింది ఇటువంటిదేదో జరుగుతుందేమోనని—”
అలా యెందుకనిపించిందని ప్రభావతి భర్తను ప్రశ్నించింది.
“ఎందుకంటే—రాము సితార చెల్లెలు శ్యామలతోనే యెక్కువ మాటలు కలుపుతున్నాడు. ఆ పిల్ల నోటంట వచ్చే ప్రతి మాటనూ బంగరు పళ్ళెంతో అందుకోసాగాడు.” అని మిత్రుడి వేపు తిరిగాడు చురుగ్గా-- “ఇదిగో చూడు రామూ! ఇప్పటి నవ తరపు జీవితం ఆ కాలపు తెలుగు బ్లాక్ అండ్ వైట్ సినిమాలలా నింపాదిగా సాగదు. ఉండదు. ఉంటుందని ఆశించకు.
అప్పటి రోజుల్లో అబ్బాయి అక్కయ్యను చూడటానికి వచ్చి తనకు తాను రొమాంటికి హీరోగా మారిపోయి చెల్లెను చేసుకుంటానని మంకుపట్టు పడ్తాడు. అప్పట్లా యిప్పుడు కుదరదు. ఇప్పటి అమ్మాయిలు హైలీ సెన్సిటివ్- అస్సర్టివ్-- అటువంటి అవమానాలు భరించరు. తిరగబడతారు. నువ్వు అంత దూరం నుంచి యిక్కడకు వచ్చింది అక్కయ్యను చూడటానికి— తీరా వచ్చి మంతనాలు పూర్తయిన తరవాత చెల్లెలితో చేరుతా నంటావా? ఈ విధంగా అక్కాచెళ్ళెల్ల మధ్య అంత:కలహాలను రేపుతావా!
ఐనా—ఇద్దరి మధ్యా పెద్ద వ్యత్యాస మేముందని, ఒడ్డూ పొడుగా మేని ఛాయా ఒకేలాగే ఉందిగా! అక్కడకి డ్రెస్ స్టయిల్ లో కాస్తంత వ్యత్యాసం ఉండవచ్చు. సితారా నుదుట ఎర్ర డాట్ లేదు. శ్యామలలా కాకుండా బాబ్డ్ హేయర్ తో ఉంది. చీరలో కాకుండా యెక్కువ సేపు బిజినెస్ సూట్ లో ఉంది. దానికి కారణం నీకు తెలవదూ! సితారా యేమో కొన్ని వందల మంది స్టాఫ్ ని ఆఫీసర్లను కంట్రోల్ చేస్తూన్న ప్రొఫెషనల్ బిజనెస్ వుమన్- సెలబ్రిటీ స్టేటస్ కి చేరుకోబో తూన్న డైనమిక్ పర్సనాలిటీ—
మరి శ్యామల మాటేమిటి—గ్రాడ్వేషన్ ముగించి యింట్లోనే ఉండి యింటిపెత్తం వహిస్తూ వివిధ వంటల పైన ప్రయోగాలు చేస్తూ స్కూల్ మేట్సుతో కాలేజీ మేట్సుతో చిట్ చాటింగ్ చేస్తూ ఉంటుంది. నక్కెక్కడ- నాక లోకమెక్కడ--- మరొకటి—హెచ్చరిస్తున్నాను. నుదుట కాసంత బొట్టుకుని నిండుగా చీర కప్పుకుని మొలన బీజాలు దోపుకుని గలగలమని తిరుగుతున్న వాళ్ళందరూ సౌమ్యులూ సౌశీల్య వతులూ అని భ్రమపడకు.
వెళ్ళి—వీలుంటే తెలుగు టీవీ సీరియ్స్- తమిళ్ సీరియల్స్- కన్నడ సీరియల్సు క్యాసెట్లు తెచ్చుకుని చూడు- తెలుస్తుంది-- అలా పైకి సౌమ్యంగా కనిపించే స్త్రీలు లోలోన ఎంత కర్కశంగా స్వార్థపూరితంగా ఉంటారో తెలుస్తుంది. అసలైన విల్లీలు- అంటే ఆడ విలన్లు వాళ్ళే-- ఫిట్ గా ట్రిమ్ముగా దుస్తులు వేసుకున్నంత మాత్రాన సితార వంటి వాళ్ళందరూ విచ్చలవిడిగా తిరిగే బాపతు అనుకోకు- బి వైజ్- అండ్ బి ప్రాక్టికల్.
ఆఖరి మాట. నువ్వు రెండు చేతులూ పైకెత్తి ప్రార్థించినా నేను వెళ్ళి శ్యామల కోసం వెళ్ళి మాట్లాడను. ఉన్న పరువు పోగొట్టుకోను. అంత గొప్పింటి వాళ్ళతో తగవులు తెచ్చుకోవడం ఎంత అనర్థానికి దారితీస్తుందో నాకు తెలుసు. నీకేం—తలచుకున్న వెంటనే అమెరికాకి తుర్రుమని సాగపోతావు--’
రాము చాలా సేపు నిదానంగా చూస్తూ ఉండిపోయాడు. ప్రభావతి అలజడికి లోనయింది. రాము డీప్ గా హర్టయాడేమో-- “ప్లీజ్ రాముగారూ! మీ మిత్రుడు చెప్పింది నిదానంగా ఆలోచించి చూడండి—మీరు గాని సితారను పెండ్లి చేసుకుంటే ఉభయ తారకంగా ఉంటుంది. ఆమె తోడ్పాటుతో వాళ్ళ కుటుంబ వత్తాసుతో బిజినెస్ ఫీల్డులో తారాజువ్వలా దూసుకు పోగలరు. ఇప్పటికి ఇటువంటి చిన్న చిన్న సెంటిమెంట్సుకి ప్రాముఖ్యత యివ్వకండి—”. అప్పటికీ రాము నోరు విప్పలేదు. స్పందించ లేదు. సైలెంట్ మూవీలోని పాత్రధారుడిలా అతి మెల్లగా కదులుతూ లేచాడు. రెండు చేతులూ ప్యాంటు జేబుల్లోకి జొప్పించు కుని- భువనేశ్ వేపు సూటిగా చూస్తూ అడిగాడు-- “నేను నిజంగానే ఓ యింటివాడినవాలని కోరుకుంటున్నావా? పన్నీటి పందిర వంటి కుటుంబ జీవితానికి వారసుణ్ణవాలని కోరుకుంటున్నావా?”.
భువనేశ్ కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు. ప్రభావతి మరొకసారి భర్త చేతిని నొక్కింది;శాంతించి స్పందించమని. “ఇదెక్కడి వెర్రి మొర్రి క్వరీవోయ్! నిన్ను చూస్తుంటే నువ్వెక్కడో మనోవ్యథకు బాగానే గురయినట్లున్నావు. బాగా గుర్తు పెట్టుకో—ఒకప్పటి చిన్ననాటి రోజులు తపస్సు చేసినా రావు. మీ అవ్వలూ పిన్నులూ అత్తయ్యలూ, నిన్నెత్తు కుని తిప్పిన మీ బాబాయిలూ మామయ్యలూ నీకు ససేమిరా కనిపించరు. మేఘాల మధ్య యెక్కడో దాక్కుని నిన్ను చూస్తుంటారు- అంతే—నౌ కమ్ టు ది పాయింట్ స్ట్రెయిట్ అండ్ షార్ప్—”.
“ఔను. నేను మళ్ళీ ఆ రోజుల్ని చూడలేను. ప్రేమతో నిండిన ముద్ద పప్పూ నువ్వుల పచ్చడీ చవి చూడలేను. నేను విదేశాలలో మోంక్ లా పచార్లు చేసిన తరవాతనేగా తెలుసుకో సాగాను, సాగుతూ సాగుతూ వెళ్ళిన రహదారుల్లో ఎక్కడో నాకు ఉనికి తెలియని చోట దారి తప్పానని. విలువల రవ్వల్ని పోగొట్టుకున్నానని. సరే—ఇప్పుడదంతా యెందుకు గాని—పాయింటుకి వస్తా ను. ఐతే--- ఒక షరతు—”.
ఆ మాటకు భార్య భర్తలిద్దరూ కనుబొమలెగరేసి చూసారు రాము వేపు.
“నేను ఫ్రాంక్ గా చెప్తున్నానన్నది మరచిపోకూడదు. నాపైన యెగిరి గంతేయ కూడదు—ఓకే?”
వస్తూన్న నవ్వుని ఆపుకుంటూ విస్మయంగా చూసాడు భువనేశ్-- “నేనెందుకు ఎగిసి పడతాను? అసలు మనమధ్య అటువంటిదేముందని? ”
“సరే—చెప్తాను. నాకు నీ చెల్లినిచ్చి పెళ్లి చేయి—”
“చెల్లెలా! నా కెక్కడుంది చెల్లి? “ ప్రభావతి అంతు తెలియక మిటకరించి చూడసాగింది రాము వేపు-- ”నీకు చెల్లెలు లేకపోవడం యేమిటి—కమల నీకు చెల్లెలేగా--”
అప్పుడు దంపతులిద్దరూ నోట మాట రాక గుడ్లప్పగించి చూడసాగారు. కొన్ని క్షణాల వరకూ యేమి చెప్పాలో వాళ్ళకు తోచలేదు. అప్పుడు రాము అందుకున్నాడు. “నాకు తెలుసు నాకూ కమలకూ మధ్యా యేడేళ్ళ వ్యత్యాసం ఉంటుందని. నా గుణ శీలత పైన నమ్మకం ఉంటే కమలను నాకిచ్చి పెళ్ళి చేయి. నీకు ఇక్కడలాగే అక్కడ కూడా పెద్దరికం ఉందని నాకు తెలుసు. నీ మాటకు యెదురు చెప్పరని నాకు తెలుసు. ఇక బాల్ నీ కోర్టులో ఉందని తెలుసుకో! ”
“ప్రపోజల్ సముచితంగానే ఉంది. కాని—వాళ్ళ చూపులో— కట్టూ బొట్టూ భాష ప్రకారం నువ్వొక విదేశీయుడివి. ఇప్పుడు చుట్టు ప్రక్కల చోటు చేసుకుంటూన్న ప్రతికూల పరిస్థితుల బట్టి వాళ్ళకు, ముఖ్యంగా ఏటి దరి కూడా దాటి వెళ్ళని కమలకు చాలా అనుమానాలు కలగవచ్చు. పెళ్ళి చేసుకుని ఓ యింటివాడవదలచిన వాడు అక్కడే చేసుకోవచ్చుగా— ఇంత దూరం వరకూ రావడమెందుకు— అసలు అంత దూరం నుంచి చూడటానికి వచ్చిన అమ్మాయి కలవాళ్ళ వ్యాపార కుటుంబానికి చెందినదయి ఉండగా ఉన్నపాటున మనసు మార్చుకుని తమింటి అమ్మాయిని యెందుకు కోరుకుని చేసుకోవాలంటున్నాడు—ఇటువంటివి బోలెడు బీభత్సకరమైన అనుమానాలూ అపోహలూ తలెత్తడాని ఆస్కారముంది. అందుకే వెంటనే ఔనన లేకపోతున్నాను”
“ఔను. చాలా వాస్తవం. కాదనలేను. కాని—వీటన్నిటినీ తృటిలోపటాపంచలు చేయవచ్చు నీ ఒక్కమాటతో-- ఇక చివరి మాట- వాళ్లు ముఖ్యంగా మీ చెల్లి లేవదీయబోయే అన్ని క్వరీలకు జవాబివ్వగలనన్న విశ్సాసం నాకుంది. నా గుండెల్లో ఇసుమంత గుబులు గాని దిగులుగాని లేదు విశ్వాసం తప్ప— ఇక ఇంతకంటే చెప్పడానికేముంది? కమల నాకు భార్యగా రాగల అర్హత నాకు లేదనుకుంటే--- నేను యిప్పటికే రిజర్వ్ చేసుకున్న రిటార్న్ఎయిర్ టిక్కెట్టు ప్రకారం యు యెస్ వెళ్ళిపోతాను, ఎవరికీ యెటువంటి డిస్టర్బన్సూ యివ్వకుండా-- ఐ ప్రామిస్! ”
అప్పుడు ప్రభావతి కలుగ చేసుకుంది- “తేల్చుకోవడానికి మాకు కొంచెం వ్యవధి యివ్వండి రాము గారూ! ఇదేమిటి మీ కంపెనీ వాళ్ళు చరచర జరుపుకునే వ్యాపార ఒప్పందం అనుకుంటు న్నారా! వ్యవహారం మా యింటి అమ్మాయి జీవితానికి సంబంధించినది కదా! ఇప్పటికిప్పుడు మేము కమిట్ కావాలని మీరు యెదురు చూడటం కూడా సబబు కాదు కదా— మరొకటి చెప్పాలనుకుంటున్నాను సమయం వచ్చింది కాబట్టి-- “”
ఏమిటన్నట్టు తలెత్తి చూసాడు రాము.
“పలు సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్ల అప్పటి ఉమ్మడి కుటుంబ ఇప్పుడు పటిష్టంగా లేదనే చెప్పాలి. పటిష్ఠంగా యేమిటి? దాదాపు అంతరించి పోతుందనే చెప్పాలి—ముఖ్యంగా సిటీలలో—అప్పటి చిన్ననాటి రోజుల్ని తలచుకుని యిప్పటి కుటుంబ వ్యవస్థ ఉండాలని కోరుకోవడం అత్యాశే ఔతుంది. ఇలా చెప్తున్నందుకు మిమ్మల్ని నిరుత్యాహ పరుస్తున్నా ననుకోకండి”.
అతడు తలూపి, ”ఇట్స్ ఆల్ రైట్ “అంటూ- థేంక్స్ చెప్పి మరొక కప్పు టీ కావాలని అడిగాడు; అటు వేపు దేనికోసమో నడచి వచ్చిన పనిగత్తె భాగ్యంతో—
------------------------------------------------------------------------------
ఇంకా వుంది..
------------------------------------------------------------------------------
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Commentaires