top of page

తీరం చేరిన కెరటం


Thiram Cherina Keratam written by Thalloju Padmavathi

రచన : తల్లోజు పద్మావతి

శిశిర కోసం ఎదురుచూస్తూ పార్కులో సిమెంటు బెంచీపై కూర్చున్నాడు చైతన్య. అప్పటికే గంట కావస్తుంది. మొబైల్ తీసి ఒకసారి తనకు కాల్ చేశాడు." వస్తున్నాను చైతూ!అరగంటలో అక్కడికి రీచ్ అవుతాను" అంది. ఇలాంటి అరగంటలు ఇంకా ఎన్ని గడవాలో... అనుకుంటూ నిట్టూర్చాడు చైతన్య.

శిశిరతో తాను ప్రేమలో పడి సరిగ్గా ఈ రోజుకు సంవత్సరం కావస్తోంది. తనకు మాత్రమే గుర్తున్న ఈ రోజు ప్రత్యేకతను ఒక అందమైన బొకేతో, ఆమెను సర్ ప్రైజ్ చేసి గుర్తు చేయాలని, చెల్లి దగ్గర దాని ప్యాకెట్ మనీ ₹500/ లు అప్పు చేసి మరీ కొన్నాడు. తన నిరీక్షణలో ఆ పూలు కూడా వాడి పోతున్నాయి. ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫామ్ కొనాలి, అంటూ ఎన్నోసార్లు తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని శిశిర కోసం ఖర్చు పెట్టాడు. తల్లి దగ్గర తీసుకున్న డబ్బులకయితే ఇక లెక్కేలేదు.


శిశిర సంతోషం కోసం ఎన్ని తప్పులు చేయడానికైనా, ఎన్ని అప్పులు చేయడానికైనా తాను సిద్ధమే! మొన్నీమధ్య వాలెంటెన్స్ డే కి కలిసినప్పుడు" నా కోసం ఏం తెచ్చావు చైతూ! "అని తాను అడిగిందే తడవుగా.. తన తల్లి ముచ్చటపడి తన కోసం చేయించిన ముత్యపు ఉంగరం ఆమె వేలికి తొడిగేసాడు. ఆమె కళ్లలో వెలుగు చూసి చైతన్య ఆనందానికి అంతే లేదు. ఆ తర్వాత ఉంగరం గురించి తల్లి అడిగితే, అది ఇంట్లోనే ఎక్కడో పడిపోయింది... అంటూ తల్లి పైన, చెల్లి పైన అరుస్తూ పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. అది వేరే సంగతి ! కళ్ళల్లో తడి చేరిందో, నిజంగానే చీకటి పడిందో తెలియదు కానీ, కళ్ళు మసకబారాయి


తాను శిశిరను ప్రసన్నం చేసుకోవడానికి, ఆమె చుట్టూ తిరిగి అలసి ఇంటికి చేరిన ప్రతి సారీ... తల్లి ఎదురొచ్చి మంచినీళ్లు అందిస్తుంది. చెల్లి కాఫీ పట్టుకొని తయారుగా నిలిచి ఉంటుంది. తాను ఉద్యోగాల వేటలో అలసి పోతున్నాడని, వారికి చైతన్య పై ఎక్కడ లేని జాలి, సానుభూతి! వారి కళ్ళలోకి చూస్తూ కనీసం మంచినీళ్లు కూడా తాగలేని రోజులు ఉన్నాయి చైతన్య కి. అపరాధ భావంతో బెడ్ రూం లోకి వెళ్ళిపోయేవాడు.


తన వెనకే చైతన్య తల్లి సావిత్రమ్మ తన గురించి తండ్రితో చెబుతున్న మాటలు లీలగా వినిపించేవి."అబ్బాయి ఎంసీఏ పూర్తి చేసి సంవత్సరం అయింది. పాపం వాడు ఉద్యోగాల కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు. తిండి కూడా సరిగా తినడం లేదు. వాడిని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. మీకు తెలిసిన వారితో మాట్లాడి వాడికి ఏదైనా.. ఉద్యోగం చూడొచ్చు కదా" అనేది. దానికి చైతన్య తండ్రి రాఘవయ్య, "నేనే గవర్నమెంట్ ఆఫీస్ లో గుమాస్తా గిరి వెలగ పెడుతున్నాను. వాడి చదువుకు సరిపడా ఉద్యోగం అంటే... నేను ఎక్కడ నుండి తెచ్చి పెట్టను" అంటూ బాధపడేవాడు.


రాఘవయ్య గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అతని తండ్రి హఠాత్తుగా చనిపోతే విధిలేని పరిస్థితుల్లో అదే ఆఫీసులో గుమస్తాగా చేరాడట. ఆటల్లో చదువుల్లో అన్నింటిలో ఫస్ట్ ఉండే రాఘవయ్య పాపం ఉద్యోగంలో చేరాక కూడా పై చదువులు చదవాలని చాలా ప్రయత్నం చేశాడట. కానీ, తన తండ్రి హఠాన్మరణం తర్వాత తల్లి మంచాన పడటం, పెళ్ళికి ఎదిగిన చెల్లెళ్ళు గుండెల మీద కుంపట్లా మారడం, రాఘవయ్యను ఊపిరి కూడా తీసుకొనివ్వలేదట. తల తాకట్టు పెట్టి ఒక చెల్లి పెళ్లి చేస్తే, ఇంకో చెల్లి పెళ్లి కోసం తన జీవితాన్నే తాకట్టు పెట్టాడు రాఘవయ్య.


సావిత్రమ్మను, రాఘవయ్య పెళ్లాడక మునుపు ఒక దూరపు చుట్టాల అమ్మాయిని ఇష్ట పడ్డాడట.ఆయన తల్లి ఆ విషయాన్ని గ్రహించి, వాళ్లతో పెళ్లి సంబంధం కూడా మాట్లాడిందట. కానీ, వాళ్ళు రాఘవయ్య చిన్న ఉద్యోగం, ఆయనకున్న బాధ్యతలు చూసి అబ్బాయి ఇల్లరికం వస్తేగానీ, పెళ్లి జరగదని తేల్చి చెప్పారట. తన రెండో చెల్లి పెళ్లి చేయడానికి తాను ప్రేమించిన అమ్మాయిని కాదని, సావిత్రమ్మను కుండ మార్పిడి పెళ్లి చేసుకున్నాడట రాఘవయ్య. ఈ విషయాలన్నీ సావిత్రమ్మ చెప్పిన రోజు చైతన్య తండ్రి త్యాగానికి నోట మాట రాక ఉండిపోయాడు. ఒకవేళ శిశిర తనతో పెళ్లికి ఒప్పుకోవాలి గానీ, తన కుటుంబాన్ని వదిలేసి ఇల్లరిమైనా వెళ్లిపోయే వాడే !చెమర్చిన తన కళ్ళను తుడుచుకుంటూ మరోసారి శిశిర కు డయల్ చేశాడు చైతన్య."వస్తున్నా! ఆన్ ది వే చైతూ!" అంటూ అదే రొటీన్ డైలాగ్.


అసహనంగా అటూ ఇటూ కదులుతున్న చైతన్యకు, తన బెంచి చివర కూర్చున్న పదేళ్ల వేరు శనగ కాయలు అమ్ముకునే కుర్రాడు కనిపించాడు. వాడు ఆ రోజు తనకొచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు. వాడికి తనివితీరలేదు కాబోలు, మరో రెండు సార్లు లెక్క పెట్టాడు. వాడి కళ్ళల్లో వెలుగు మసక చీకట్లో కూడా చైతన్య దృష్టిని దాటిపోలేదు. కాసేపు వాడితో బాతాఖానీ వేస్తే బాగుంటుందనిపించింది చైతన్యకు.


"ఏంట్రా! ఈరోజు బాగానే సంపాదించినట్టు ఉన్నావ్? ఎంత వచ్చింది ఏమిటి ?" అంటూ చనువుగా పలకరించాడు చైతన్య. వాడు తనకేసి అదోలా చూస్తూ అటువైపు తిరిగి కూర్చున్నాడు. చైతన్య అహం దెబ్బతింది.


"ఏంట్రా! పిలుస్తుంటే పలకవేంటి? బడికి వెళ్లాల్సిన వయసులో ఈ పనులు చేస్తున్నందుకు నిన్ను, మీ అయ్యను కూడా బొక్క లో వేస్తారు తెలుసా? ఒక్క కంప్లైంట్ ఇచ్చానంటేనా!?" అన్నాడు కోపంగా


"నేను పొద్దున పూట బడికి పోతా సార్! బడి అయ్యాకనే ఈ పని చేస్తా! " అన్నాడు వాడు.


వాడి గొంతులో భయం ధ్వనిస్తోంది. చైతన్య అహం కాస్త చల్లారింది." బడికి వెళ్లి వచ్చాక, హోం వర్క్ చేసుకొని ,ఆడుకోవాల్సింది పోయి, ఇంత చిన్న వయసులో ఇంతలా ఎందుకు కష్టపడుతున్నావు" అని అడిగాడు. వాడి గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో...


"అవ్వ తాత తో కలిసి ఆరుగురం ఉంటాము సార్ ఇంట్లో. అమ్మ ,అయ్యా కూలికి పోతారు. మా పుత్తకాల కర్సు, మా అందరికీ కూడూ.... చాలా కట్టంగా ఉంది సార్ ..అందుకే అయ్యకు తెలియకుండా అవ్వను అడిగి ఈ పల్లీలు ఏయించి తెచ్చి అమ్ముత సార్.. ఏదో ఎన్నీళ్ళకు కాసిన్ని సన్నీళ్ళు !అమ్మ అయ్య అట్టా కట్ట పడుతుంటే సూడ బుద్ధి కాదు

సార్ !" అంటూ వాడు ఇంకా ఏదో చెప్తూనే ఉన్నాడు. బడిలో గాని, తల్లి ఒడిలో గాని నేర్పని ఎన్నో పాఠాలు జీవితమే వాడికి నేర్పినట్టు ఉంది. చైతన్య మనసులో ఏవో మబ్బు తెరలు తొలగుతున్నాయి. తన కళ్లు తెరిపించడానికే వచ్చిన బాల బుద్ధునిలా కనిపించాడు తనకా క్షణంలో ..!అప్రయత్నంగానే తన రెండు చేతులు జోడించాడు. వాడికి అర్థం కాలేదు. చైతన్యకేదో అయ్యిందనుకొని భయపడి, అక్కడి నుండి పారిపోయాడు.


ఆర్తితో చెమర్చిన కళ్ళను అరచేతితో తుడుచుకున్నాడు. ఇప్పుడు తాను వెళ్లాల్సిన దారి స్పష్టం గా కనబడుతోంది. ఎంతో కాలంగా కాల్ సెంటర్ లో జాబ్ కు అప్లై చేయమని ఒత్తిడి చేస్తున్న క్లోజ్ ఫ్రెండ్ గుర్తొచ్చాడు ఆ క్షణంలో. తనకి ఫోన్ చేసి చెప్పాడు రేపు వచ్చి కలుస్తాను అని. ఇక వెళ్దామని లేస్తూ ఉండగా, శిశిర దగ్గర్నుండి ఫోన్." ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను చైతూ! ఇంటికి వెళ్ళి పోతాను. రేపు కలుద్దామా?" అంటూ. ఫోన్ లో ట్రాఫిక్ శబ్దం లేదు. పైగా వాళ్ళ అమ్మానాన్న మాటలు లీలగా వినిపిస్తున్నాయి. అప్పుడు తనకు అర్థం అయింది. అసలు ఇంటి నుండి తాను బయల్దేర లేదని. తనను పిచ్చివాడిని చేసి ఆడిస్తోందని.


"రేపే కాదు ఇకముందు ఎన్నడూ మనం కలుసుకోనక్కర్లేదు శిశిర !

గుడ్ బై ఫరెవర్ ..."అంటూ సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు.


తన ఎదురింట్లో ఉండే ఆటో వాలా రోడ్డుపైన వెళుతూ కనిపించాడు చైతన్యకు ఆ సమయంలో. తన వయసు వాడే! కానీ, వాడికి చదువు అబ్బలేదు. అందుకే ఆటో తోలుతూ రోజుకు ఐదు వందలు సంపాదిస్తున్నాడు. ప్రతిరోజు రాత్రివేళ తన సంపాదనను తల్లికి గుమ్మంలోనే అందిస్తాడు వాడు. అది చూసి వీడేంటి.. ఎగ్జిబిషన్ పెడుతున్నాడు అని నవ్వుకునే వాడు చైతన్య. కానీ, ఈ క్షణంలో అర్థమైంది. తన కష్టార్జితాన్ని తన తల్లికి అందించడంలో వాడు పడుతున్న తాపత్రయం, పొందుతున్న ఆనందం.


తనకు జీవితాన్ని ఇచ్చిన తన తండ్రి, అనుకోకుండా తారసపడి తనకు మార్గం చూపిన వేరుశెనక్కాయలు అమ్ముకునే కుర్రాడు, తన ఎదురింట్లోని ఆటోవాలా.., ఇలా ఎందరో,ఇంకా మరెందరో ఎంతో ఎత్తులో ఉంటే తాను మాత్రం పాతాళంలోకి కుంగిపోయినట్టుగా బాధపడ్డాడు చైతన్య. ప్రేమించడం తప్పు కాదు.కానీ, దాని కోసం మనల్ని నమ్ముకున్న వాళ్ళను వదిలేయడం, వంచించడం తప్పు. ఉద్యోగం చూసుకొని తండ్రి బరువును తగ్గించాలన్న బాధ్యతను మరిచి, అమ్మాయిల వెంట బలాదూర్గా తిరగటం నేరం. తన చేతిలోని బొకే బరువెక్కి సాగింది తన గుండె లాగే! దాన్ని దూరంగా విసిరేశాడు. చేతిలోని బరువు, గుండెలోని బరువు ఒక్కసారిగా దిగిపోయినట్టుగా తేలికగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు చైతన్య ఒంటరిగా సిమెంట్ బెంచ్ పైనే కూర్చున్నాడు. తన తల్లిదండ్రుల సంతోషాన్ని, రేపటి తన భవిష్యత్తును కళ్ళు మూసుకొని కమ్మగా ఊహించుకుంటూ..!


-------సమాప్తం--------

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

నా పేరు తల్లోజు పద్మావతి. చింతపట్ల పద్మా రమేష్ అనే పేరుతో రచనలు చేస్తుంటాను.ఇప్పటి వరకు పది కవితలు , ఐదు కథలు అచ్చయ్యాయి.వందకు పైగా కవితలు,ఇరవైకి పైగా కథలు వ్రాయడం జరిగింది.పుట్టింది కల్వకుర్తి(మహబూబ్నగర్ జిల్లా,తెలంగాణ). తల్లిదండ్రులు సుమిత్రమ్మ, రామేశ్వరయ్య గార్లు.భర్త పేరు రమేష్ బాబు, గవర్నమెంట్ టీచర్. నాకిద్దరు అబ్బాయిలు పెద్దవాడు సూర్య(ఇంజనీరింగ్ ఫైనల్),చిన్నోడు పృథ్వి (డిగ్రీ ఫస్ట్ యియర్) రచనలతో పాటు,చిత్రలేఖనం ,పాటలు పాడటం,కొత్త వంటలు చేయడం,కుట్లు,అల్లికలు నా హాబీలు.



1,367 views34 comments
bottom of page