top of page

తీయని అబద్ధం


'Tiyani Abaddham' New Telugu Story

Written By Thimmaraju Ram Mohan

రచన : రామ్ మోహన్ తిమ్మరాజు


ఆదివారం సాయంత్రం అయిదు గంటలు అవుతోంది. కూకట్‌పల్లి ఫోరమ్ మాల్ లోని క్రాస్ వర్డ్ షాపులో పుస్తకాలు చూస్తున్నాం, నేను, మా ఆవిడ సుమతి. దాదాపు ప్రతి ఆదివారం సాయంత్రం ఇక్కడకు రావడం, కాసేపు తిరగడం , ముఖ్యంగా ఈ పుస్తకాల షాప్ లోకి రావడం అనేది మాకు అలవాటు అయిపొయింది. పుస్తకాలు చూడడమే కాదు అప్పుడప్పుడు కొనడం కూడా జరుగుతుంది. మా ఇంటికి ఇది నడిచి వచ్చే దూరంలో ఉండటం, ఇద్దరికీ పుస్తక పఠనం ఇష్టమైన వ్యాపకం అవడంతో ప్రతీ వారం ఇక్కడకు రాకుండా ఉండలేము. ఈ షాప్ వాళ్ళకి కూడా మేము సుపరిచయమే.


ఎప్పటిలాగా పుస్తకాలు చూస్తున్న నాకు ఎందుకో షాప్ బయట ఉన్న ఒకతను నన్నే చూస్తున్నట్టుగా అనిపించింది. అతనికి దాదాపు నా వయసే ఉండవచ్చు. అలా అనుకొంటుండగానే అతను నా దగ్గరికి వచ్చి ‘మీరు జయేంద్ర కదా’ అన్నాడు. అప్పుడు అర్థం అయ్యింది ఇది గుర్తింపు సమస్య అని. ఎందుకంటే, జయేంద్ర నాకంటే అయిదు నిముషాలు ముందు పుట్టిన కవల సోదరుడు. అందుకే మాకు జయేంద్ర, విజయేంద్ర అని పేర్లు పెట్టారు, ఇంటికి ద్వారపాలకుల లాగా ఉంటామని. ఇద్దరం అచ్చు ఒకే లాగా ఉండటంతో చాల మంది ఇలా పొరపడుతూ ఉంటారు. దీని వలన ఎన్నో హాస్య సంఘటనలే కాక ఇబ్బందికర సంఘటనలు కూడా జరిగేవి. మేము కూడా హాస్యానికి కాసేపు ఇంకొకరిలా నటించి, అవతలివారిని ఆట పట్టించే వాళ్ళం. అయితే గత రెండేళ్ల నుంచి నన్ను చూసి అన్నయ్య అనుకున్న వాళ్ళే కాని, అన్నయ్యను చూసి నేననుకున్న వాళ్ళెవరూ లేరు. ఎందుకంటే, అన్నయ్య ఎవ్వరూ చూడలేనంత దూరానికి…. ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు, హఠాత్తుగా ఒక రోజు గుండె నెప్పితో. అప్పటి నుండి ఎవరైనా పొరబడినా నేను వెంటనే నిజం చెప్పేస్తున్నాను, హాస్యమాడే ఆసక్తి లేక. ఇప్పుడు కూడా నేను జయేంద్రని కాదు అని చెప్పబోయి అతని మొహంలో ఉన్న సంతోషం, ఉత్తేజం చూసి ఆగిపోయి కాదనలేక అవును ‘నేనే జయంద్రని’ అన్నాను.


దాంతో అతని సంతోషం ఇంకొక స్థాయికి చేరి నన్ను గట్టిగా పట్టుకొని "ఎంత కాలమైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు, ఎం చేస్తున్నావు?" అనే ప్రశ్నల వర్షం మొదలయ్యింది. ఈ అరుపులు విన్న సుమతి మా దగ్గరకు వచ్చి ఎవరీయన అన్నట్టుగా నా వైపు చూసింది. చుట్టు పక్కల వారు కూడా మా వైపు చూస్తుండడంతో "పద బయటకు వెళ్లి మాట్లాడుకొందాము" అని బయటకు వచ్చి, ఎదురుకుండా ఉన్న బెంచి మీద కూర్చున్నాము.

సందేహంగా చూస్తున్న నన్ను అతను "నేనురా రాజాని. గుర్తుపట్టలేదా?" అన్నాడు.


నేను "గుర్తు పట్టాను, ఎలా ఉన్నావు" అన్నాను ఇంకా సందేహంగానే. ఎందుకంటే నేను జయేంద్రని కాదు కదా. ఇది గమనించిన రాజా "అలా మెల్లగా చెప్తున్నావంటే నన్ను మర్చిపోయినట్టున్నావు. అసలు మనము ఎక్కడ పరిచయమో గుర్తుందా" అని అడిగాడు. అతని ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి తడపడుతున్న నన్ను గమనించి సుమతి ఆయనతో "ఏమి అనుకోవద్దు రాజా గారూ ! ఈయన కొంతకాలంగా మతి మరపు వ్యాధి ‘అల్జీమర్స్’ తో బాధపడుతున్నారు. ఒకప్పటి సంగతులు గుర్తు చేయడానికి ఎంతో కష్టపడాల్సొస్తోంది " అని నన్ను కాపాడే ప్రయత్నం చేసింది. వెంటనే రాజా "అయ్యో, నాకు ఈ విషయం తెలీక కాస్త గట్టిగా మాట్లాడాను, ఒక ఉద్వేగంతో. ఏమీ అనుకోవద్దు. అయితే నీకు ఎన్నో విషయాలు చెప్పాలి. ఆ కాఫీ షాపులో కూర్చొని కాసేపు మాట్లాడుకుందామా?" అన్నాడు.


అతని మాటని కాదనలేక మౌనంగా కాఫీ షాప్ లోకి నడిచాము. అక్కడ కూర్చుని కాఫీ ఆర్డర్ చేసాక, రాజా "మనము డిగ్రీ కలిసి చదువుకొన్నాము విజయవాడలో. డిగ్రీ పరీక్షలు పూర్తయ్యాక నాన్నగారికి ఢిల్లీకి ట్రాన్సఫర్ అవడంతో వెంటనే ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాము. అక్కడి నుండి అమెరికా కి ఉద్యోగ రీత్యా వెళ్లి అక్కడే స్థిరపడ్డాను. ఆ తరువాత పెళ్లి చేసుకోవడం, పిల్లలని పెంచడం, ఇల్లు కొనడం లాంటివి వేగంగా జరిగి పోయాయి. నా దగ్గర ఎవరి అడ్రస్ లేకపోవడం తో అందరికీ ఇన్నాళ్లు దూరం అయిపోయాను. ఈ ముప్పై ఏళ్లలో చాల కొద్దిసార్లు మాత్రమే ఇండియాకి రావడం, వచ్చినా ఢిల్లీలో అమ్మావాళ్లతో గడిపి వెళ్లిపోవడం జరిగింది.


వారం రోజుల క్రితం మా బావమరిది కూతురి పెళ్ళికి ఇక్కడకు వచ్చాము. రేపే ఢిల్లీకి వెళ్ళి, అక్కడ నుండి అమెరికాకి ఎల్లుండి తిరిగి వెళ్లి పోతున్నాను. ఇన్నాళ్ల తరువాత నిన్ను ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ ఎప్పటినుండో నాలో దాచుకొన్న ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి. బహుశా అందుకే ఇవాళ కలిసామేమో" అన్నాడు. నేను కూడా మతిమరుపు నటిస్తూనే, కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నట్టుగా చూసాను. నా మతి మరుపుని నమ్మించే ప్రయత్నంలో సుమతి కాలేజీ అయ్యాక నా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు చెప్పింది, నా బదులు. ఇంతలో కాఫీ రెడీ అవడంతో నేను తీసుకొస్తాను అంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు రాజా.


అతను వెళ్ళగానే సుమతి నాతో "నేను జయేంద్రని కాదని చెప్పకుండా మతి మరపు మనిషి లాగా ఎందుకు నటిస్తున్నారు?" అంది. దానికి నేను "అతని మొహంలో ఉత్సహం, సంతోషం చూశాక నిజం చెప్పి నిరుత్సాహ పరచాలనిపించలేదు. మెల్లగా నిజం చెప్దామనుకున్న నాకు ఇప్పుడు అతను చెప్పబోయే రహస్యం తెలుసుకోవాలనే ఆదుర్దాతో ఇంకాసేపు నిజాన్ని ఆపుతాను" అన్నాను. ఇంతలో రాజా కాఫీలతో వచ్చాడు.


కాఫీ తాగుతూ రాజా "నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం, ఒక రకమైన క్షమాభిక్ష కూడా. మన చివరి పరీక్ష రోజు జరిగిన సంఘటన. ఆ పరీక్ష చాల కష్టమైనది, ముఖ్యంగా నాకు. కాపీ కొట్టడం తప్పని తెలిసినా పరీక్ష లో ఉత్తీర్ణత సాధించకపోతే నాకు భవిష్యత్ లేదనే భయం నన్ను కాపీ చీట్లు పరీక్షకి తెచ్చేలా చేసింది. అవి వాడకుండానే గంట గడిచి పోయింది. ఇంతలో నువ్వు మంచి నీళ్లు తాగిరావడానికి బయటకు వెళ్లడం, హాల్లోకి వస్తున్న పై అధికారులని నేను చూడడం జరిగింది. వెంటనే కంగారులో, నేను తెచ్చుకొన్న చీట్లు ఎదురుకుండా ఉన్న నీ టేబుల్ లో వేసేసాను, అది ఇంకా పెద్ద తప్పని తెలిసినా. ఇంతలో వాళ్ళు లోపలకి రావడం, నీ టేబుల్ లో ఉన్న చీట్లు చూడ్డం జరిగింది. ఆ తరువాత లోపలికి వచ్చి ఆశ్చర్యపోయిన నిన్ను ఎంత చెప్పినా వినకుండా డిబార్ చేసారు.


ఇంత జరిగినా నువ్వు నన్ను అనుమానించకుండా నీ పక్క టేబిల్ లో కూర్చున్న వెంకట్ తో గొడవ పెట్టుకున్నావు. ఎందుకంటే అతను నీ మీద ఎప్పుడు తనకన్నా బాగా చదువుతావనే అసూయతో ఉండేవాడు. ఆ తరువాత నీకు నిజం చెప్పే దైర్యం లేకపోవడం, వెంటనే ఢిల్లీకి వెళ్లిపోవడం జరిగింది. కానీ విచిత్రం ఏమిటంటే, కాపీ కొట్టకపోయినా నేను పరీక్ష పాస్ అయ్యాను. పరీక్ష తప్పుతాననే భయంతో అనవసరంగా చీటీలు తీసుకువచ్చి నీకు తీరని ద్రోహం చేశాను. అప్పటి నుండి ఈ తప్పు చేసిన భావన నన్ను వదలలేదు. నిన్ను జీవితంలో ఒక్క సారైనా కలిసి క్షమాపణ కోరుకుంటే చాలు అనిపించింది. ఈ రోజు నాకా అవకాశం లభించింది. దయచేసి నన్ను క్షమించు జయేంద్ర !" అని కన్నీళ్ల పర్యంతం అవుతూ వేడుకొన్నాడు.


నేను వెంటనే "ఎంత మాట, నువ్వు అలా బాధ పడవద్దు. తప్పులు చేయడం మానవ సహజం. నీవు ఇప్పటికే శిక్ష అనుభవించేశావు, ఇన్నాళ్లూ ఈ బాధ గుండెలో దాచుకొని. అందరం ఇప్పుడు ఆనందంగా ఉన్నాము. దయచేసి ఆ విషయం ఇంక మర్చిపో " అన్నాను. సుమతి కూడా "ఈయన మతి మరుపు వ్యాధితో మర్చిపోయారు కానీ, పెళ్లైన కొత్తలో ఒక సారి నాకు ఈ సంగతి చెప్పారు. ఆ తరువాత ఆయన ఆ సంగతి పూర్తిగా మర్చిపోయారు, ఎందుకంటే , ఆ ఓటమిని పట్టుదలగా తీసుకుని ఆ తరువాత అదే పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారట. ఆ తరువాత మంచి ఉద్యోగం రావడం, అందులో స్థిరపడడంతో ఈ విషయం పూర్తిగా మర్చిపోయారు" అంది నాకు వంత పలుకుతూ. ఆ మాటలకి తేలికపడ్డ రాజా కళ్లలో ఒక ప్రశాంతత , ఉపశమనం స్పష్టంగా కనిపించాయి.


ఆ తరువాత కాసేపు మాములు మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. మేము కూడా అప్పటికే ఆలస్యం అవడంతో ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి భోజనం చేసాక సుమతి నాతో " ఆయనకు నిజం చివరిదాకా ఎందుకు చెప్పలేదు?. మీ అన్నయ్యకి అయన చేసిన అన్యాయానికి కోపం రాలేదా?" అంది.


దానికి నేను "పిచ్చిదానా , నాకెందుకు రాజా పైన కోపం ఉండాలి? నష్టపోయిన అన్నయ్యే ఈ రోజు బ్రతికి లేనప్పుడు. అంతేకాదు, అన్నయ్య కూడా ఈ విషయాన్ని మర్చిపోయి మిగతా జీవితాన్ని హాయిగా గడిపాడు. అన్నయ్య లేడనే నిజం చెపితే , రాజా తాను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకోలేకపోయాననే బాధ జీవితాంతం మిగిలిపోతుంది. మనం ఈ రోజు చెప్పిన అబద్ధం అతనికి కొండంత ఊరట ఇచ్చింది. దాన్ని, పోగొట్టడం ఇష్టం లేకే నిజం చెప్పలేదు. ఎప్పుడో జరిగిన తప్పుకి ఈ రోజు కోపం తెచ్చుకొని, అవతల వారిని బాధ పెట్టి, అలాంటి తప్పే ఇప్పుడు నన్నూ చేయమంటావా?. ఇప్పుడు అందరి మనసులూ తేలికగా, సంతోషంగా ఉన్నాయి కదా!. అంతే కాదు, ఇక్కడ నేను చెప్పిన ఒకే అబద్ధం నేనే అన్నయ్యనని. వేయి అబద్ధాలాడైన ఒక పెళ్లి చేయమన్నారు. అలాంటప్పుడు, ఒక అబద్ధం చేప్పి, ఇంకొకరికి దీర్ఘకాలంగా ఉన్న బాధ నుంచి ఊరట కలిగిస్తే తప్పేముంది?." అన్నాను.


అందుకు సుమతి మెచ్చుకోలుగా "పాత సంఘటనలను మానవతా దృక్పధంతో చూస్తూ, నేటి పరిస్థితిని అర్థం చేసుకొంటూ , ఎవరినీ నొప్పించకుండా, లేని మతిమరుపు నాటకాన్ని చివరిదాకా కొనసాగిస్తూ చాలా బాగా ప్రవర్తించారు ఈ రోజు. కానీ ఒక చిన్న సందేహం. రాజా ఇకపై తరచూ ఫోన్ చేస్తూ వుంటే మీకు ఇబ్బంది కదా?" అంది. నేను నవ్వుతూ "అదేమీ లేదులే, ఈ మతి మరపు మనిషి తో ప్రతి సారి పరిచయం చేసుకుంటూ వేగలేక వదిలేస్తాడులే. అప్పటిదాకా, నేను జయేంద్రననే తీయటి అబద్దాన్ని కొనసాగిస్తాను." అన్నాను.


రచయిత పరిచయం:

నా పేరు రామ్ మోహన్, వయస్సు యాభయ్ ఆరు సంవత్సరాలు. పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా లో, గత నలభై ఆరు సంవత్సరాలు గా ఉంటున్నది భాగ్యనగరం లో. చదువు కున్నది ఎమ్. ఎస్, ఉద్యోగం చేస్తున్నది ఒరాకిల్ హైదరాబాద్ లో. నేను చిన్నప్పటి నుంచి కథలు చదవడము (పుస్తక రూపం లో), వినడం (రేడియో లో), చూడడం (టీవీ, నాటకం, సినిమా రూపం లో) జరిగేది. వాటి ప్రభావం వలన కథలంటే ఆసక్తి కలిగి కథలు చెప్పడమనే విద్య అబ్బింది.ఇన్నేళ్ళ తరువాత అది కథలు రాసే అలవాటుగా మారింది. కొన్ని నెలలు గా నేను కొన్ని వ్యాసాలు, కథలు రాస్తున్నాను. నా మొదటి పుస్తకం "నేను చూసిన లోకం", సెప్టెంబర్ 2, 2020 న విడుదల అయింది. నా మనసులో వివిధ అంశాల పైన వచ్చిన ఆలోచనలు పదిహేను వ్యాసాలుగా మారగా, వాటి సంపుటి ఆ పుస్తకం. నేను రాసిన కధలు కొన్ని పత్రికలలో ప్రచురించారు.


217 views5 comments

5 Comments


Radhika Vasu
Radhika Vasu
Dec 20, 2020

చాలా బావుంది

Like

dasutrivikram
dasutrivikram
Dec 19, 2020

అభద్దం ఆడడం అన్నివేళలా తప్పుకాదు అని చెప్పటానికి ఇది ఒక మచ్చుతునక.

Like

msmmaddikonda1942
msmmaddikonda1942
Dec 13, 2020

అబధ్ధంచెప్పినా ఒకమనిషి మానసిక చింతను దూరం చేయాలనే సంకల్పం గొప్పది .

Like

నిజం చెప్పి ఎదుట వారిని బాధించే కన్నా , అవసరానికి హాని లేని ఒక చిన్న అబద్ధం చెప్పి తెలియని వారినైనా సంతోష పెట్టే అబద్ధం నిజంగా తీయని ఆనందం. పాఠకులు కి ఒక మంచి సందేశం. చాలా బాగుంది. రచయిత రామ్మోహన్ గారికి అభినందనలు.

Like

చాలా బాగుంది... కథ మలచిన తీరు ఎంతో గొప్పగా ఉంది...రచయిత రామ్మోహన్ కు నా అభినందనలు...

Like
bottom of page