top of page

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 3


'Tholagina Nili Nidalu episode 3' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు. ఆమె వివరాలు స్నేహితుడు సుధాకర్ ని అడిగి తెలుసుకుంటాడు. ఆ వూరు వదిలి వెళ్లాలనిపించదు అతడికి.


ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 3 చదవండి.


రెండురోజులు వుండిపోదామని వచ్చిన రవిప్రకాశ్‌ రెండు వారాలు ఆ ఊరిలోనే ఆగిపోయాడు. అతను తిరిగి వెళ్ళాల్సిన రోజు దగ్గర పడింది. ప్రతిరోజూ వెన్నెల కనిపిస్తుందేమోనని ఎదురు చూసిన అతనికి నిరాశే మిగిలింది.


ఆ రోజు ఏదో పని మీద ప్రక్క ఊరు వెళ్ళాడు సుధాకర్‌.

ఎప్పటలా వెంకటరామయ్య ని చూడటానికి రవిప్రకాశ్‌ ఒక్కడే వెళ్ళాడు. ఏదో అద్భుతం జరగబోతున్నట్టు ఎందుకో అనిపించసాగింది అతనికి. అతని రాక తెలుసుకున్న వెన్నెల గదిలోంచి బయటికి వచ్చింది. ఇల్లు చాలా నిశ్శబ్దంగా వుంది.


"రండి.. కూర్చోండి" అంటూ ఆమె ఆహ్వానించి కుర్చీ చూపించింది.

"అమ్మా, నాన్న గుడి కెళ్ళారు. " చెప్పి " కాఫీ తీసుకస్తాను" అని లేపలికి వెళ్ళి పోయింది.


గదిలో ఒంటరిగా మిగిలిపోయాడతను. గోడలకి వ్రేలాడదీసిన పటాలను చూస్తూ కూర్చున్నాడతను.

రెండు నిమిషాలలో ఆమె కాఫీగ్లాస్‌ తో తిరిగి వచ్చి అతని ముందు బల్లమీద పెట్టింది. వెళ్ళి తలుపునానుకుని నిలుచుంది.


అతను మౌనంగా కాఫీ త్రాగేశాడు. అతను నిశ్శబ్దంగా ఆమె అందెల సవ్వడి కోసం ఎదురు చూస్తూంటే ----

అతని మనసు ఆమె మాటకోసం ఎదురు చూస్తూంటే------

రవిప్రకాశ్‌ తలెత్తి వెన్నెల వంక చూశాడు.


తలవంచుకుని నుంచుని ఉన్నదామె. కుడికాలి బొటనవేలు తో నేలపై ఏవో గీతలు గీస్తోంటే ఆమె కాలి మువ్వలు ఆ కదలిక కే చిరుసవ్వడి చేస్తున్నాయి.


అతడు కొద్దిసేపు కన్నార్పకుండా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. కాసేపలా చూసేసరికి ఆమె కాసేపు మాత్రమే అక్కడ వుంటుందన్న విషయం స్ఫురణ కు వచ్చింది. సదృశ్యానికి, అదృశ్యానికి మధ్య కాలం తెరపట్టుకుని నుంచుని వుందన్న విషయం గుర్తుకు రాగానే అతడు తేరుకుని " వెన్నెలా!" అని పిలిచాడు.


ఆమె శరీరంలో చిన్నటి ప్రకంపన. కళ్ళెత్తి వెంటనే వాల్చేసింది. కరిగిపోతున్న కాలం అతన్ని విసుక్కుంటూ ముందుకు కదులుతోంది.


"ఏదయినా మాట్లాడు వెన్నెలా!" అన్నాడు.


ఏమ్మాట్లాడగలను అన్నట్లు ఆమె కనురెప్పలు ప్రశ్నార్థకంగా కదిలాయి.


"పోనీ నేను మాట్లాడేదా?” అనడిగాడు.


అసంకల్పితంగా ఆమె తలూపింది.


"నువ్వంటే నాకు చాలా ప్రేమ" అన్నాడు. అన్నాక అనిపించింది. ఆ మాట వ్యక్తపరచటానికి మరింత అద్భుతమైన భాష తనకి వచ్చి ఉంటే బావుండునని. ప్రేమలో పడ్డ పండితుడు కూడా ప్రేమని తప్ప పాండిత్య ప్రకర్షణని మరుస్తాడన్న విషయం స్ఫురణ కొచ్చింది. భాష తాలూకు సందిగ్ధము దూరమైంది.


స్పష్టంగా చెఫడం ప్రారంభించాడు. "ప్రేమ గురించి కవులూ, రచయితలూ ఏవేవోవ్రాస్తోంటే, అది చదివి అదంతా తేలిగ్గా తీసుకునేడిని. ఎక్కడా అంత అద్భుతమైన ప్రేమభావం వుండి వుండదని అనుకునేవాడిని. కానీ! ప్రేమంటే నిన్ను చూశాకే తెలిసింది. అప్పుడనిపించింది ఏమిటంటే - కవులూ- రచయితలూ వ్రాసిందంతా నాకు కలిగిన ప్రేమ భావంతో పదోవంతుక్కూడా సాటిరాదు" అని ఆగాడు.


ఆమె కదిలింది. కనురెప్పలపై సంశయము తాలూకు బరువు కరిగింది. కళ్ళెత్తి కన్నులారా అతడిని చూసింది. అతని చూపులో చూపు కలపలేక సిగ్గు ముంచుకొచ్చి ఆ భారాన్ని ఏపలేక ముఖాన్ని క్రిందకు దించుకుంది.


సిగ్గు పడితే చామంతి

సిగ్గు దాస్తే పూబంతి

రెండూ కలిస్తే తోటకే సీమంతి.


తిరిగి చెప్పడం ప్రారంభించాడు. "..అసలు ప్రేమకు ప్రారంభం అనేది లేదేమో! అది అనంత కాల ప్రవాహంలో జన్మతః ముడి వేసుకుని జనించిన బంధమేనేమో అనిపిస్తుంది. ఈడూ జోడూ కలపటానికి నువ్వు నా కన్నా వెనక పుట్టివుంటావు.


నేను నీ కోసం ఆత్రుత అణచుకోలేక ముందే పుట్టి ప్రపంచమంతా వెతికి- వెతికి అలసి సొలసి వున్న తరుణాన నా ఇన్నాళ్ళ నిరీక్షణ తాలూకు నిర్వేదాన్ని పోగొట్టే సమయం ఆసణమైనప్పుడు నిన్ను నా కళ్ళబడేలా చేసుంటాడా భగవంతుడు" ఆగి ఆమె మొహం లోకి చూశాడు.

నీరెండ తాలూకు అరుణకిరణం ఒక్కటి ఆమె బుగ్గమీద కెంపు పొదుగుతోంది. శీతలం తాలూకు పవనం ఒక్కటి ఆమె ఫాలబాగం పైని ముంగురులతో ఆడుకుంటోంది. అతడి మనసు తాలూకు యావత్తు ఆమె మనసులో తనమవుతోంది. అతడంత చెప్పాక ఆమె ఏమంత చెప్పకపోతే అదేమంత సంస్కారం కాదని గుర్తుకువచ్చింది. కానీ, అంతలోనే బిడియం ముంచుకొచ్చింది.


అయినా చెప్పాలనే ఆత్రుత ఎగతన్నుకొచ్చి ఆమె నెమ్మది నెమ్మదిగా తల పైకెత్తింది. అతడిని చూసి చిన్నగా నవ్వింది. ఆ చిరునవ్వు కే అతని వక్షస్థలం గర్వంగా పొంగింది. ప్రియురాలి చిన్న నవ్వుకోసం.. నాదనుకున్న యావత్తు ధారాదత్తం చేయనూ?! అనుకున్నాడతను.


ఆమె చిన్నగా నోరు విప్పింది. మంచు మల్లెపూవు వెన్నెలమీంచి కలిగి జారినంత మె మెత్తగా అంది.


"మీరు చాలా చెప్పారు. కానీ, నేనేమీ చెప్పలేకపోతున్నాను. ఏమి చెప్పలేని మనిషి కూడా ప్రేమించగలదని మీరు నమ్మితే చాలు. సెలవు"


చెప్పడం పూర్తవ్వగానే గానే ఆమె అక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. రవిప్రకాశ్‌ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుండిపోయాడు.


ఊరికి వెళ్ళగానే తాతయ్య, బామ్మలతో చెప్పి వెన్నెలను తన దాన్ని చేసుకోవడానికి అతని మనసు వేగిరపడసాగింది.


వెంకటరామయ్య, జానకమ్మ లు గుడినుంచి తిరిగొచ్చాక వాళ్ళతో కాసేపు కూర్చొని.. వెళ్ళిపోతున్నానని చెప్పి బయలుదేరాడతను ఒక్కడే.. మనసుని వెన్నెల దగ్గరే వదిలేసి.


ఆ మరునాడు రవిప్రకాశ్‌ అక్కడకు అతిత్వరలోనే రావాలని వూహిస్తూ.. ఆ ఊరొదలి హైదరాబాద్‍ కు ప్రయాణమయ్యాడు. బస్సులో కూర్చున్నాక అతని కనిపించింది - ఒంటరిగానే వెళ్ళిపోతున్నాడు. కానీ, వచ్చేటప్పుడు లేని సంతృప్తి వెళ్ళిపోయేటప్పుడు తనకు తోడుగా ఉంది.

--------------

"వెన్నెల గుడికి వెళ్ళినప్పుడు ధర్మపురం భూపతిరావుగారు చూశారట. వాళ్ళింటి కోడలిగా చేసుకోవటానికి యిష్టపడుతున్నట్లు కబురు పంపించారు”.

'ఏమిటీ మీరంటున్నది' రెట్టించి అడిగింది జానకమ్మ.


"భూపతిరావుగారని.. వాళ్ళ నాన్న, మా నాన్న స్నేహితులు. మన లాగే రైతు కుటుంబం. వెన్నెలని చూసి. వాళ్ళవిడ ముచ్చటపడి సివిల్‌ఇంజనీర్‌ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ అబ్బాయికి, మనమ్మాయిని ఇస్తారేమోనని అడగడానికి మనిషిని పంపారు" వివరించి చెప్పాడాయన.


"వెన్నెలకి పెళ్ళి సంబంధాలు రావటమేమిటి?"


"ఏం? పెళ్ళీడు వచ్చింది కదా? పెళ్ళి సబంధాలు రాకుండా ఎట్లా ఉంటాయి?” ఆయన ముఖము అమాయకంగా పెట్టాడు.


'నా ఉద్దేశ్యం అది కాదు. సరే సంబంధం మంచిదైతే సరేనని చెప్పండి'.


"ఎవరెచ్చి అడిగినా వెన్నెలకి పెళ్ళి నిశ్చయమైందని చెప్పు.. ఈ లోగా మిగిలిన పనులకి అందరికీ కబురు పెట్టి పురమాయిస్తాను”.


“చిన్నమ్మగారూ.."


రాధమ్మ పిలుపుతో ఆలోచనల్లోంచి బయటపడింది వెన్నెల.

"అప్పుడే కలల్లో తేలిపోతున్నారా?" పరిహాసం చేసింది. ఆ మాటలు ముందులా ఆహ్లాదంగా తోచలేదు. గుండెల్లో తూటాలు గుచ్చుకున్నాయి. ఆమె మనసు ఆలోచనా కొలిమిలో కాలిపోతోంది. మనస్ఫూర్తిగా నవ్వే లేకపోయింది. ఏదో నిర్ణయానికి వచ్చినదానిలా వేగంగా ఇంట్లోకి దారితీసింది.


ఇంకా జానకమ్మ, వెంకటరామయ్య వెన్నెల పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్నారు.

"ఏదో చెప్పడానికి గదిలోపలికి అడుగేయబోయిన ఆమె గుమ్మం ఇవతల ఆగిపోయింది.


"వెన్నెల అభిప్రాయం కూడా కనుక్కుంటే.." అన్నారాయన.

"పిచ్చిపిల్ల దానికేం తెలుసు? మనం ఎంత చెబితే అంతే అంటుంది. ఇన్నేళ్ళు వచ్చినా.. ఆకలేస్తే అన్నం పెట్టమని నోరు తెరిచి అడగదు. అలాంటిది తన గురించి ఏం మాట్లాడుతుంది?”.


నిజమేనన్నట్లు తలూపారాయన.


అది విని మ్రాన్పడిపోయింది వెన్నెల. ఈ పెళ్ళి తనకిష్టం లేదని, వెళ్ళి చెప్పడానికి ధైర్యం చాలలేదు. మొహమాటం అడ్డొచ్చింది. కనీసం మాట వరసకయినా తన అభిప్రాయం వాళ్ళలో ఎవరయినా అడిగి ఉంటే బాగుండు" అనుకుంది.


గిరుక్కున వెనుదిరిగి తన గదిలోకి వచ్చేసింది. దిండులో మొహం దాచుకుని పడుకుంది. ఆమె కళ్ళముందు రవిప్రకాశ్‌ మెదలుతున్నాడు. వెళ్ళేముందు అతను

చెప్పిన మాటలు పదేపదే గుర్తుకువస్తున్నాయి. పెదవులు బిగపట్టి ఏడుపు ఆపుకుంది.

--------------------------------

.. మీకు-----

మనస్సుమాంజలి. మీ కిదినేను వ్రాసే మొదటి ఉత్తరం. ఇదే చివరి ఉత్తరం అవుతుందేమోనన్న భయంగా ఉంది.

అనంత జలనిధిలో ఒంటరిగా ముడుచుక్కూర్చున్న పద్మాన్ని- సూర్యకిరణాన్ని తట్టి లేపినట్టు.. మీ మాటలు నన్ను కదిలించాయి. మొన్న వరకూ నిర్మలంగా వుండిన నా మనస్సు అనే సరస్సు లో ఒక చిన్నరాయి విసిరి కల్లోలం సృష్టించారు.


సంతోషం.. హృదయమంతా నిండినప్పుడు మిగిలేది అనిశ్చితా ప్రవాహమే కదా!

మిత్రమా! వేల వేల ఉదయాస్తమయాలని చూశాను. కానీ ఇంత అందమైన సంతోషష్షులనూ ఎన్నడూ చూడలేదు.

ప్రకృతి అందంగా.. గాలి చల్లగా.. నా గదే నాకు క్రొత్తగా.. నా మేను మెరుపులా.. ఇదేనా ప్రేమంటే..


ఏమో ప్రేమ ఎలా వుంటుందో.. దాని అనుభవం ఏమిటో నిన్నా మొన్నటివరకు నాకు తెలీదు.


నా ప్రపంచం ఎంత చిన్నదంటే ఈ ఇల్లు మాత్రమేకాదు. నా ఇల్లే నాకు ప్రపంచం.. అదే లోకం. కాని ఈ లోకం గురించి తెలుసుకోవడానికి నాకు మా నాన్నగారు మార్గదర్శి అయ్యారు. నాతో ఎక్కువగా పుస్తకాలు చదివించారు. వ్యక్తుల మనస్తత్వాల గురించి విశ్లేషించారు. ప్రేమ గురించి.. ఆఖరికి చావు పుట్టుకల గురిచి, వేదాంతాల గురించి ఎంతో చెప్పారు. అన్నీ వినడమే కానీ ఏ ఒక్కటీ నాకు అనుభవం లోకి రాలేదు.


మొట్టమొదటి సారి.. ఇదేదో అలజడి నన్ను పట్టి కుదిపేస్తోంది. ఈ అనుభవం నాకు చాలా క్రొత్తగా వింతగా ఉంది. అయితే వీటన్నిటి వెనకా మీకూ.. నాకు మధ్య పెద్దలు ఏర్పరిచిన అంతరం మన మధ్య అంతరాయాన్ని సృష్టిస్తోంది. అదొక్కటే కారణం కాదు. నాన్న స్నేహితుడి కొడుక్కి ఇచ్చి చేయాలని అనుకుంటున్నారు.


ఏం చేయగలను నేను! మీ రెక్కడుంటారో తెలీదు. మిమ్మల్ని చేరుకోవటానికి దారి కానరాదు. నిజానికి అసలు కారణం నేను మౌనంగా జరిగేవన్నీ చూస్తూ పెదవి కదపకపోవడమే.. కదపలేను కూడా!

నేను నడిస్తే నా పాదం ఎక్కడ కందిపోతుందో నని నేను నడిచే స్థలమంతా తివాచీలు పరచిన మా అమ్మ, నాన్న నా జీవితపు రెండో అధ్యాయంలోని ముఖ్యమైన పెళ్ళిం ఘట్టం లో తప్పటడుగు వేస్తున్నా నోరు మెదపలేదు.


ఏదో అధ్బుతం జరిగి- మీరు నన్ను మీ దాన్నిగా చేసుకునే ఘడియ వస్తూందేమోనన్న వెర్రి ఆశలతో ఎదురు చూస్తున్నాను.


వుంటాను..

నా పేరు వ్రాయలేను..


పూర్తిగా రాసిన తరువాత పెన్నుని పెదవులకానించుకుని చాలా సేపు ఆలోచిస్తూ వుండిపోయింది.


ఆమె మస్తిష్కంలో తుఫాను హోరులా వేల ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆలోచనకీ.. అనుభవానికిలమధ్య తర్కం ఆమెని భయపెడుతోంది.


ఇదేమిటి తనలో ఈ మార్పేమిటి? నిన్నటి దాకా అస్పష్ఠంగా వున్న ఆలోచనలు ఒకరూపం పొందాయేం! తన మనసు ఎవరి వశ మో అయినట్టు.. వారు దాన్ని ఆటవస్తువులా అటూ ఇటూ కదుపుతున్నట్టు - తన మనసు మీద తనకే ఆధిపత్యం లేకుండా పోవటం ఆమెని ఆశ్చర్యం గురిచేసింది.


మామూలుగా అయితే అతని మీద తన ప్రేమను బహిర్గతం చేయటానికి మరికొంత కాలం పట్టేది. అలా ఉత్తరం రాయానికి మాత్రం ఎప్పుడూ సాహసించేది కాదు.


కానీ తనకు ఇష్టం లేని వాడు తన జీవితం లోకి దూసుకు వస్తూంటే మాత్రం భరించలేకపోయింది.


ఈ లోపు గది బయట అలికిడయ్యింది. "అమ్మా వెన్నూ.. ఏం చేస్తున్నావ్‌ తల్లీ?” జానకమ్మ కంఠం వినిపించింది.


చప్పున ఆ ఉత్తరం తీసి దిండు క్రింద దాచేసింది.


"నిద్రపోతున్నావా?" అడిగింది జానకమ్మ.


"లే.. లేదమ్మా " ఆమెలో తడబాటు. మొదటిసారిగా జానకమ్మ వైపు సూటిగా చూడలేక తలొంచేసుకుంది.


"ముఖం అలా వాడి పోయిందేమిటీ? ఉండు, ఎవరి కళ్ళయినా పడ్డాయేమో.. దిష్టి తీస్తాను" వెళ్ళబోయింది జానకమ్మ.


"అబ్బే.. నా కేం కాలేదమ్మా.. మామూలుగానే వున్నాను."


అప్పుడు అటుగా వచ్చిన వెంకటరామయ్య "ఏమిటీ జానకీ ఏమైందీ?” అనడిగాడు.


"చూడండి. అమ్మాయి ముఖం ఎలా వాడిపోయిందో?"

“నిజమే సుమీ! నువ్వు చెప్పిన దాంట్లో నిజముంది. అమ్మాయి ముఖం వడలిపోయింది." అన్నారు.


"హూ.." భారంగా నిట్టూర్చింది జానకమ్మ "మీరు నిజంగా అలా అంటున్నారో, వేళాకోళం చేస్తున్నారో నాకు మాత్రం అర్ఖమవటం లేదు. అయినా అమ్మాయి కోసం

అక్కడక్కడ చలువ పందిళ్ళు వేసిద్దామనే ఆలోచన లేదు. బయట అంత ఎండగా ఉంది కదా!” అని వంటగది వైపు వెళ్ళి చిటికెడు ఉప్పు, ఎడం చేతి నిండా మిరప

కాయలు పట్టుకుని వచ్చింది.


"ఇలా కూర్చో తల్లీ" గోడవారగా వున్న సోఫా చూపించి వెన్నెలను కూర్చోబెట్టి, దిష్టి తీసి, బయట పారవేయటానికి వెళ్ళిపోయింది.


వెంకటరామయ్య ఆమెకు దగ్గరగా వచ్చి ఆప్యాయంగా తల నిమిరాడు. "మీ అమ్మ చెప్పేవరకూ నా కాలేచనే రాలేదు. ఈ రోజే పదిమంది కూలీలలని పిలిపించి చల్లని నీడలనిచ్చే పందిళ్ళు వేయిస్తాను".


అప్పుడే దానిని అమలులో పెట్టడానికి హడావుడిగా బయటకు వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఉండలేక వెన్నెల లోపలికి పరిగెత్తి.. దిండులో ముఖం దాచుకుంది. కళ్ళలో జానకమ్మ, వెంకటరామయ్య ల ప్రేమ కదులుతోంటే.. ఏదో తప్పు చేసాననే భావంతో ఆమె మనస్సు గిలగిలలాడిపోయింది.


పది నిమిషాలవరకూ అలాగే కదలకుండా పడుకుంది. ఆ తరువాత ఏదో నిర్ణయానికి వచ్చినట్టు లేచి అంతకుముందు తను రాసిన ఉత్తరం బయటకు తీసింది.


ముక్కలు ముక్కలుగా చించింది. మొత్తం చించిన కాగితపు ముక్కలను బయటకు విసిరేసింది. ఆ కాగితపు ముక్కల్లాగానే రవిప్రకాశ్‌ జ్ఞాపకాలు కూడా ఆమె నుంచి దూరమయ్యాయి.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.









77 views0 comments

Commentaires


bottom of page