top of page

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 4


'Tholagina Nili Nidalu episode 4' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు. ఆమె వివరాలు స్నేహితుడు సుధాకర్ ని అడిగి తెలుసుకుంటాడు. ఆ వూరు వదిలి వెళ్లాలనిపించదు అతడికి.

వెన్నెలను కలిసి తన భావాలు వ్యక్తపరుస్తాడతడు.

మౌనంతో తన అంగీకారం తెలుపుతుందామె.

తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుందామె.

ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 4 చదవండి.


సమస్తం కోల్పోయాక స్పృహలోకి వస్తే.. ?..


సబ్‌ కుచ్‌ లుటాకే గయా ఆయే, భీతో క్యా కియా.. దిన్‌ మే అగర్‌

చరాగ్‌ జలాయే తో క్యా కియా //సబ్‌ కుచ్‌//

( సమస్తమూ కోల్పోయాక స్పృహలోకి వచ్చి మాత్రము ఇప్పుడు చేయగలిగింది

ఏముంది? తెల్లారిపోయాక దీపాలు వెలిగించి మాత్రం ఇప్పుడు చేయగలిగింది ఏముంది?)


హమ్‌ బద్‍నసీబ్‌ ప్యార్‌ కీ రుస్‌వాయి బన్‌ గయే,

.. ఖుద్‍ హీ లగాకే ఆగ్‌ తమాషాయీ బన్‌ గయే

.. తమాషాయి బన్‌గయే.. చమన్‌ సే అబ్‌ యే

షోలే బుఝాయే తో క్యాకియా.. దిన్‌ మే అగర్‌

చరాగ్ జలాయే తో క్యా కియా //సబ్‌ కుచ్‌//


( ప్రేమలో అప్రతిష్టపాలైన దురదృష్టవంతుణ్ణి నేను, నాకు నేనే నిప్పంటించుకుని ఒక తమాషాగా మారిపోయాను.. తమాషాగా మారిపోయాను. ఉద్యానంలోని ఈ

జ్వాలలని చల్లార్చి మాత్రం ఇప్పుడు చేయగలిగింది ఏముంది? తెల్లారిపోయాక దీపాలు వెలిగించ్ మాత్రం ఇప్పుడు చేయగలిగంది ఏముంది?)


లే- లే కే హార్‌ పూలోంకే ఆయీ థీ బహార్‌, ..

.. నజర్‌ ఉఠాకే హమ్‌నే హీ దేఖా న ఏక్‌ బార్‌,

దేఖానా ఏక్‌ బార్‌.. ఆంఖే సే అబ్‌ యే

పర్‌దే హటాయే తో క్యా కియా.. దిన్‌ మే అగర్‌

చరాగ్‌ జలాయేతో క్యా కియా//సబ్‌ కుచ్‌//


( వసంతం పలుమార్లు పూలమాలలని వెంటేసుకుని రానైతే వచ్చింది. నేనే..


ఒక్కసారైనా చూడనేలేదు. కళ్ళ ముందరి పరదాలను తొలగించి మాత్రం ఇప్పుడు

చేయగలిగింది ఏముంది? తెల్లారిపోయాక దీపాలు వెలిగించి మాత్రం ఇప్పుడు చేయగలిగింది ఏముంది?)


( తన ప్రేమను తల్లిదండ్రులకు చెప్పుకోలేదు. ప్రేమించిన ప్రియుడి దగ్గరా వ్యక్తపరచలేదు. )

--------------------------

"కన్యమే వృష్టతో భూయా స్తద్వానాన్మోక్ష మాప్నయాం.. "

ప్రతిజ్ఞ మంత్రోక్తంగా వధువు గళసీమన వరుడు తాళిగట్టే పవిత్రమైన కార్యం.


స్త్రీ పురుషులు.. ఏకమై.. ఐక్యమై.. ఆలుమగలు.. " అనే ఏకపదంగా రూపాంతరం చెందే శుభలక్షణం!


వైవాహిక బంధమంటే.. నూలుపోగు దారాన తాళిబొట్టు, పసుపు కొమ్ము కట్టి మూడు ముడులు వేయుట కాదు.


వివాహబంధమంటే.. స్త్రీ జీవితమనే నూలుపోగు దారాన ' భర్త' నే పసుపుకొమ్ము గా కట్టుకుని ఎల్లప్పుడూ గుండెల్లో భద్రంగా దాచుకోవడం!


చేయి కలిపి కాలు తొక్కించటంలోని పరమార్థం.. పాణి పట్టి పాణిగ్రహణం ఒనర్చిన ప్రాణనాధుని ప్రథమస్పర్శ పదిమందికి ఆమోదయోగ్యమైనదే అని చాటి చెప్పడం..


ఆ లోగిలిలో పసుపు కొట్టడంతో ప్రారంభమయ్యాయి. పెళ్ళిపనులు. ఊళ్ళో ఆడపిల్ల పెళ్ళంటే ఊరు ఊరంతా పేరంటాండ్రు. పెళ్ళి పెద్దలే అయ్యారు.

ఒక కుందన కుండలకు రంగులు అద్దింది. ఒక ఇందువదన ఇంటిని ఇంద్రసభలా అలంకరించింది. ఒక ముదిత ముంగిట్లో ముత్యాల ముగ్గులు వేసింది. ఒక తరుణి మామిడాకులు తృంచి తోరణాలు కట్టింది.


ఆ తరువాత వడ్లు దంచడం..

ముత్యాలసరాలు రోకలి పట్టి, ముదిత ఒక్క దంపు..

రతనాల రోకలి పట్టి రాగిణి ఒక్క దంపు..

పగడంపు రోకలి పట్టి, పడతి ఒక్క దంపు..


" సువ్వి సువ్వి సువ్వి లాలి - సువ్వి పరమ పురుష లాలి..

సువ్వి శ్రీముఖ లింగ చంద్రరా గదే - కొండమీద పండినాలి

గోవర్ధన ధ్వానాలు

పాడుకొని దంచరమ్మ పడతి కొట్నాము.. "


అంటూ జవరాండ్రు పాట అందుకొని - నవ్వులతో, గాజుల గలగలలతో రోకండ్రు నవ్వడంతో దంచడం మొదలయ్యింది.


' కొట్నాము ( వడ్లు దంచడం) తరువాత పెళ్ళికుమారునికి నలుగు పూసే కార్యక్రమం, చంద్రుని కూర్చోబెట్టి ముత్తయిదువులు నలుగుపళ్ళెం చేతబట్టారు.


ఒక ముత్తయిదువ పాట నందుకుంది.


"..నలుగిడరే నలుగిడరే నళినాక్షులారా!

నళిని నాధునకు నవమోహనాంగునకు నలుగిడరే.. "!

అంటూ నలుగు పూయడం ప్రారంభించారు .


మరో ప్రక్క వెన్నెలకు నలుగు పూసే కార్యక్రమం మరో నలుగురాడవాళ్ళు పూర్తి చేస్తున్నారు.


"వనజాక్షి వేగిరావే వనితా నలుగుకిపుడు

రావాలి చీరకట్టి రంగాన రైక తొడిగి

లావణ్యముగ నీవు రమణిరో నలుగురిపుడు.. "

అంటూ అక్కడకు ఆ పాట ప్రారంభమయింది.


కొంతమంది మహిళలు కొబ్బరాకులతో పెళ్ళిమంటపము అల్లుతుంటే ఓ ప్రక్క ఆకాశమంత పందిరి వేయడానికి మరి కొంతమంది యువకులు తంటాలు పడుతున్నారు.

నలుగు కార్యక్రమము పూర్తవ్వగానే వెన్నెలకు తలంటడం మొదలయ్యింది. సంపంగి నూనెతో తలరుద్రి ముద్దుమోమున కుంకుమ బొట్టు పెట్టి తలమీద అక్షిం

తలు వేసి, మంగళహారతి పట్టి స్నానం చేయించారు.


బయట మంగళ వాయిద్యాలు మ్రోగుతుంటే లోగిలి లోగిలంతా తెలుగుదనంతో పచ్చగా కళకళలాడుతోంది.

కాని వెన్నెల మొహంలో ఏ మాత్రం జీవకళ లేదు.

ఒక సాంప్రదాయాన్ని వింతగా పరికిస్తోంది. ఆ సాంప్రదాయం తన జీవితాన్ని చిన్నాభిన్నం చేయబోతోందన్న విషయం ఆమె కిప్పుడు తెలియకపోయినా తెలసిందల్లా

ఒక్కటే- ఒకరి స్థానంలో మరొకరు రావడం.

యాంత్రికంగా గౌరీపూజ ముందు కూర్చుంది. మనసిక్కడ లేదు. చేయడంలో చిత్తశుద్ది లేదు. అసలేమి లేదు. ఏమి లేకపోవడమే పరిపూర్ణ మయిన విషాదానికి పరాకాష్ట అనుకుంటే ఆమె అదే స్థితిలో వుంది.

చుట్టూ సన్నాయి ఘోష.. ఒక ప్రక్క ఆడంగుల నవ్వుల కిలకిలలా ధ్వనం..


మరో ప్రక్క బామ్మల పలకరింపులు.. ఇంకో ప్రక్క బావల సరసాలు.. భామల ముసిముసి నవ్వులు.. చుట్టూరా అంతా సందడే.


ఆమె లోపల మాత్రం పూర్తి నిశ్శబ్ధం!

---------------------------------------------------------------

తలవంచుకుని పీటలమీద కూర్చుందామె.. అనేకంటే తలదించుకుని పీటలమీద కూర్చుంది అనటం ఉత్తమమేమో.


చేతిలో ఎవరో జీలకఱ్ఱ +బెల్లం పెట్టారు. అది అతడి తలమీద పెట్టమని చెప్పారు. నెమ్మదిగా తల ఎత్తిందామె. అతడికి ఆమెకు మధ్యలో పట్టుతెర. యాంత్రికంగా చేతిని ఆ తెర అవతల నుండి కొద్దిగా కనిపిస్తున్న అతని తలమీద

పెట్టింది.


తలమధ్యన జీలకఱ్ఱ+బెల్లం పెట్టడం వలన అక్కడ నిక్షిప్తమైవున్న జీవిత సహచరుల కర్మబంధాన్ని తాను స్వీకరిస్తున్నానని అన్యాపదేశంగా గా చెప్పడమే దాని ఉద్దేశ్యం. ఆమె కా విషయం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంది. అతడి కర్మబంధాన్ని తనెలాగు స్వీకరింపక తప్పదు.


పురోహితుడు నూలుపోగు మధ్యన కట్టిన మంగళసూత్రాన్ని పసుపు కొమ్మునూ తీసుకువెళ్ళి పెద్దలందరి అనుజ్ఞచేత, ఆశీర్వచనము తీసుకోవటం గమనించింది.


రేపు ఈ బంధం బీటలుబారినప్పుడు, తాను ఒక వేళ అతడినుండి విడిపోతే(?)


అందులో ఏ ఒక్కరూ ముందుకు రారు. అలాంటప్పుడు ఇంత తంతు దేనికి?


ఒక్కసారిగా మంగళవాయిద్యాలు ఘోష తారాస్థాయిలో వినపడేసరికి ఆలోచనల్లోంచి తేరుకుని తలెత్తపోయింది. వెనకాలున్న ముత్తయిదువ ఆమె గడ్డం పట్టుకుని

తల క్రిందకు వంచింది. మరొకరెవరో జడని పైకెత్తి పట్టుకొన్నారు.


చంద్రం గుప్తనిధిని స్వంతం చేసుకోబోతున్న వాడిలా విజయగర్వంతో నూలుపోగు రెండు కొసలూ పట్టుకుని లేచాడు. పురోహితుడు మంత్రోచ్ఛారణ తారాస్థాయి నందుకుంది.


"మాంగల్యం తంతు నానే నాం

మమ జీవనం హేతూనాం

తంతే భద్రామి శుభకేత్‌

త్వం జీవ శర దాస్యదం.. మాంగళ్యధారణ ముహూర్తస్తు..

సుముహుర్తోస్తు..


ఒక్కో ముడి పడుతుంటే మనసు చుట్టూ ఒక్కో పొర ఏర్పడ సాగింది. మూడు ముళ్ళు వేయటం పూర్తి కాగానే చటుక్కున ఆమె మెడ మీద గట్టిగా గిల్లి ఏమీ ఎరుగనట్టు కూర్చున్నాడతను. అదిరి పడిందామె. ఉక్రోశంతో ఆమె ముక్కుపుటలదిరాయి.


కాని అంత లోనే తనను తాను సంభాళించుకుని సమాధానపరుచుకుంది. ఈ క్షణం నుంచే తనమీద సర్వహక్కులూ " నావే" నని గుర్తు చేయుచున్నాడని

కాబోలు అనిపించింది.


ఆ తరువాత తలంబ్రాలు కార్యక్రమము మొదలయ్యింది.

రెండు ఇత్తడి పళ్ళాలలో ముత్యాలు కలిపిన బియ్యము వున్నాయి.


అనుజ్ఞ ఇవ్వగానే ఆమె దోసిలిలో అతడి తలమీద వేయడానికి చేయి ఎత్తింది. కానీ అప్పటికే జరిగిపోయింది. అతను పళ్ళెం పళ్ళెమే ఎత్తి తలంబ్రాలన్నీ ఒక్కసారి

ఆమె తలమీద గుమ్మరించేశాడు.


వెన్నెల తలమీంచి జుమ్మని శబ్దం చేస్తూ వాలిపోతున్న ముత్యాలబియ్యాలు వడగళ్ళ వానలా అనిపించిందామెకు.

ఒక్కోసారి చిన్నవిషయాలే అవతలి వారి వ్యక్తిత్వాన్ని పట్టించేస్తాయి.

' అతడి సంస్కారమేమిటో ఆమె పెళ్ళిపీటలమీంచి లేవక ముందే గ్రహించివేసింది.


అతడికి అన్నింటిలో తన ఆధిక్యత నే వుండాలి.


జీవితం లోని అతి ముఖ్యమైన రెండో అధ్యాయం చాలా నిర్లిప్తంగా ప్రారంభ మవటమంత విషాదం మరొకటి లేదు.

వెన్నలని ఎవరో లేపి నించోబెట్టారు. అతడప్పటికే లేచి నుంచున్నాడు. పొంగి వచ్చే ఉప్పెన లాంటి దుఃఖం. ఆ వాతావరణం నుంచి పారిపోయి వంటరిగా తన గదిలోనో, అమ్మ ఒడిలోనో తలదాచుోవాలన్నంత గుండె భారం.


ఆమె కదలబోయింది. ఇద్దరి మధ్య వున్న " కొంగుముడి" ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంది. అప్పుడర్థమైందామెకు. 'స్వేచ్ఛ' అనేది ఈ క్షణం నుండే వుండదు. తన జీవితాన్ని నియంత్రించే నియంత అతను.


ఒకరి కాళ్ళు ఒకరు తొక్కే కార్యక్రమము పూర్తయ్యాక మళ్ళీ కూర్చోబెట్టారు. కట్నకానుకలు జరుగుతున్నాయి.

వరుడి పక్ష వారూ, వధువు పక్ష వారూ ఇంటి పేర్లతో సహా చిన్న కానుకలు సమర్పిస్తున్నారు.


అప్పుడు.. సమయంలో దాదాపు పదిమంది చేతులు మారి ఒక ఎర్రటి కాగితంలో చుట్టిన కానుక ఆమె చేతికి అందజేయబడింది. ఎవరిచ్చారనేది పేరడిగితే అక్కడెవరూ చెప్పలేకపోయారు.

యధాలాపంగా దాని ప్రక్కన కూర్చున్న మేనత్త కి అందించింది. అదావిడ అందుకుంటూనే విచిత్రంగా త్రిప్పి ఉత్సుకతను ఆపుకోలేక దారాలు తెంచి, కాగితం మడతలు విప్పింది.


ఘల్లుమన్న శబ్ధం! ఆవిడతో పాటు వెన్నెల తల త్రిప్పి అటువేపు చూసింది. మువ్వల పట్టీలు!

ఒక్కసారిగా వెన్నెల హృదయం లో వేల.. లక్షల.. మువ్వలు మ్రోగిన శబ్ధం! మార్మోగిన శబ్ధం !

----------------------------------------

శోభనం రాత్రి..

శోభాయమానమైన రాత్రి !

షోడశ కళానిధి.. షోడశ కర్మల్లో ప్రధానమైన. గర్భాదాన నిమిత్తం షోడశ కళాస్థానములపై శృంగార సంస్కారములు ఒనరించే మహత్తర మైన రాత్రి.


ఆ షోడశ కళానిధికి షోడోశోపచారములు చేయుట ఆ రాత్రి తోనే ప్రారంభం... పరాచికపు పకపక నవ్వులు.. గాదుల గలగలలు.. పట్టు సారెల నేపథ్యంలో ' ఆమె' ఆ గది లోకి నెట్టబడింది.


మధు ద్రవాన్ని ఆపాదించుకున్న మరువపు మొగ్గలా ఆమె ముకుళితమైన దేహం తో అక్కడే నిలబడింది. వెనుక ద్వారబంధం మూసిన చప్పుడుకి మేనుసన్నగా కంపించింది.


జడలోని పూలగుత్తుల బరువో.. లేక మోమున అరుణిమ ప్రతిష్టించిన లజ్జాభారమో ఆమె తల క్రిందకు వంచింది.

వెండిగ్లాసులోని పాలు ఆమె చేతి ప్రకంపనలో క్షీరసాగరపు అలల్లా కదులుతుండగా.. క్రొత్తగా గుండెలమీదికి వచ్చిన మంగళసూత్రం వంక చూస్తూ ఆమె నిలబడి పోయింది.


అతను లేచి వస్తాడని ఆమె.. ఆమె కదిలి వస్తుందని అతడు.. నిర్నిద్రమైన ఆ నిశారాతిరి నిశ్శబ్ధంలో.. గుండె సవ్వడి చేసే ప్రణయ.. ప్రణవనాదాన్ని మౌనంగా వింటూ మనసులోనే నిర్నిద్రగానాన్ని ఆలపిస్తున్నారు.


అగరొత్తుల పరిమళం విరహాన్నోప లేక సుళ్ళు తిరుగుతూ ఆమె వైపు పయనిస్తోంటే..


పట్టెమంచాన్ని అలంకరించిన పూలదండల గుభాళింపు అతనిని తొందరచేస్తోంది.


చివరకు అతడే లేచి ముందుకు కదిలాడు. ఆమె చేయి పట్టుకున్నాడు. ద్వితీయ పాణిగ్రహణం.. సురవేణి ప్రథమ పాణిగ్రహణం.


చందన మందిన ముంజేయి చెలికాని చేతిస్పర్శకు చలించిన పూతీవే అయింది.


ఆమె చేతిలోని పాలగ్లాస్‌ అతని చేతిలోకి మారింది..

స్త్రీ జీవితాన్ని, సంపూర్ణత్వాన్ని ఆపాదించే సప్తపది.. వివాహసమయం లో జరి

గితే.. శరీరానికి సంపూర్ణత్వాని అందే సప్తపది శోభనము గదిలో జరుగుతోంది.


అతడు కూర్చుని పాలగ్లాసు ప్రక్కన పెట్టాక.. ఆమె అతని చేతులను సుతిమెత్తగా విడిపించుకుని పాదాలకు నమస్కరించింది.


రాముడి కాలు సోకి రాయి అహల్యగా మారితే..

భర్త పాదస్పర్శ సోకిన ఆడది ఆ చిరాయువే అవుతుందన్న హిందూ సంప్రదాయం అక్కడ పునరుద్భవించింది.


అతడామె భుజాలు పొదివి పట్టుకుని ప్రక్కకు కూర్చోబెట్టాడు.


'పాలుతీసుకుని ' 'పాలు' పంచుకున్నారు.

అక్కడ.. ఆ తరువాత మాటలు లేవు.

మనసుని.. మనిషిని సమైక్యం చేసే హేమంత సమీరకు తప్ప..


హేమంత సమీరం కూడా లేదు.


తనువునీ, తనువునీ మమైకం చేసే గ్రీష్మం తాప' పవనమే' తప్ప ఆమె అనంతాకాశమై.. ఎగిసిపడే అనంతానంతాంబుధ కెరటమై మేఘాల కుంతలాలపై నలిగే నక్షత్ర సుమాలని పలకరించే చంద్రబింబపు మోమును అన్నీ చుంబిస్తూ, ఆమె

సృష్టియే.. రససృష్టి కురిపించు.. సృష్టికావ్య నిమిత్తమై అతడిని తనలోకి యిముడ్చుకుంది.

వసంతం వచ్చిందన్న ఆనందంతో తుమ్మెదల గుంపు వరసగా చేరి మంకెన పువ్వు మీద వ్రాలినట్టు.. అతని మీసకట్టు ఆమె అధరాలపై సుతిమెత్తగా ఆని

గిలిగింతలు పెడుతోంది.


అప్పుడే చివురించిన ఎలమావి చిగురాకులమీద మత్తకోకిల ఒకటి ముదమంది వ్రాలి వాడి ముక్కుతో, చివురుపై గాచి పెట్టినట్టు అతడి దంక్షతాలు ఆమె బుగ్గలమీద పడుతున్నాయి.


గులాబి మదం చూసి ఓర్వలేని వాడి కంటకమొకటి గాలికి అది తనను స్పర్శించగానే.. అదను దొరికింది కదాని గాటు పెట్టినట్టు.. గులాబి చేతులమీద ఆమె భుజాలమీద అతని నఖక్షతాలు పడుతున్నాయి.


నుదురూ, నుదురూ రాసుకున్నప్పుడు, ఆమె నుదుటి కస్తూరితిలకము.. అతడి కన్నుల్లో ఎరుపెక్కే కాంక్ష శ్రీగంధన్ని చూసి సిగ్గుపడి చెదిరిపోయింది.


మూలస్తంభంలాంటి తననల్లుకున్న ఆ లతాంగి తనూలితిక కుచద్వయంలపై వీచే పుష్పరాగ పరిమళాస్వాధనలో పడి అతడు' భ్రమరం' లా భ్రమ చెందుతూ మెలికలు తిరిగిపోతున్నాడు.


ఆ ఆది నృత్యానికి.. ఆ సరసల్లాపానికి.. మైమరచి ఆమె చేతి గాజులు అప్రయత్నంగా లయబద్ధ తాళవిన్యాసం ప్రారంభించాయి. జతగా ఇరు గుండెల మరుసవ్వడి మార్మోగి మృదంగవిన్యాసమైంది. వేడి నిట్టూర్పుల వాయుతనాన్ని

మలయపవనం మంద్రంగా పలికిస్తోంది.


కదలికల.. కలయికల.. ఘుమఘుమల.. జవజవల.. జలజలల.. తళతళల.. తహతహల.. మేళవింపులో


పూవుకీ, తుమ్మెదకీ..

వసంతానికి, కోయిలకీ..

చంద్రుడికీ, చకోరానికీ..

పద్మానికీ, దినకరడికీ..


స్త్రీకి, పురుషుడికి.. మధ్యనున్న అవినాభావమైన సంబంధమంతా వారిలోనే ఐక్యమైనట్లు, జన్మజన్మల వియోగతాపాన్ని ఒక రాతిరే చల్లార్చే హోమగుండంలో

పడిన ఆజ్యంలా.. ఎగబ్రాకి.. పెనవేసి.. కలగలసి.. ఆ దగ్గరతనం సరిపోక ఇంకేదో కావాలని, ఆ కావాలన్న దేదో ఏమిటో తెలియక.. వెదికి.. వెదికి, అలసిసొలసి.. వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు.


మేఘమూ, గాలి ఢీకొని - చినుకులు రాలినట్టు.. ఘనీభవించిన హిమశిఖరం కలిసి కాలువయినట్టు.. క్షీరసాగరాన మందరగిరితో చిలికి చిలికి అమృతాన్ని

ఉద్భవింపజేసినట్టు.. అతను కదిలి కరిగి ఆమెలో ఐక్యమైపోయాడు.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






89 views0 comments

Comments


bottom of page